వరాహ మహా పురాణము
అధ్యాయము - 125
సూతుడు:
సూతుడు:
కొనియాడ దగిన వ్రతములు గల ధరణి మాయా బలమును గూర్చి విని వరాహ దేవునితో ఇట్లు పలికెను.
ధరణి:
దేవా! నీవు కుబ్జామ్రకము అనంత మహిమలు కలదని చెప్పు చున్నావు. మరియు నేను మున్నడిగిన విషయములును కలవు. వీనిని గూర్చి నేను తెలియ కున్నాను.
కుబ్జామ్రకము నందలి పుణ్యమును గూర్చియు, మిక్కిలి సనాతన మయిన మహిమను గూర్చియు ఆ పరమ రహస్యమును నాకు నీవు దయతో చెప్ప వలయును.
శ్రీవరాహ దేవుడు:
శ్రీవరాహ దేవుడు:
దేవీ! కుబ్జామ్రకము నందలి మహిమ యెట్టిదో, ఏ దోషమును లేని తీర్థ మెట్టిదియో దానిని, సర్వ లోకమునకు సుఖము కూర్చు దానిని తేట పడునట్లు తెలియ జేసెదను. వినుము.
కుబ్జామ్రకము ఎట్లు పుట్టినదో, అచట తీర్థము ఎట్లేర్పడినదో, అందు స్నానము చేసియు, మరణించియు నరుడు పొందు గతి యెట్టిదియో అవి యన్నియు వరుస తప్పక చెప్పెదను.
భూమి! పదు నేడవ యుగమున భూమి నంతటిని ఒక్కటి చేసి, బ్రహ్మమాట మీద మధు కైటభులను సంహరించి నేను గంగా ద్వారమును చేరు కొంటిని.
అచట గొప్ప ప్రతిష్ఠ కలవాడును, ధర్మ కర్మము లందు గొప్ప నిష్ఠ కలవాడును, నా ఆరాధన యందు తగులము కలవాడును అగు రైభ్యుడను మునిని కాంచితిని.
చక్కని నేర్పు గలవాడు, గుణము లెరిగిన వాడు, శుచి, సమర్ధుడు, జితేంద్రియుడు నగు అతడు పదివేల ఏండ్లు చేతులు పైకెత్తికొని అచట నిలిచి యుండెను.
వేయి ఏండ్లు నీరు ఆహారముగా, అయిదు వందల యేండ్లు నాచు భోజనముగా ఆ మహర్షి అచట నిలిచి యుండెను.
మహాత్ముడగు రైభ్యుని పరమ భక్తికిని, అతని ఆరాధనకును నేను పరమ ప్రీతి నందితిని.
అట్లు గంగా ద్వారమున కరిగి తపించు చున్న ఆ మునివరుని నేనొక మామిడి చెట్టు నాశ్రయించి చూచితిని.
ఒకానొక కారణము చేత నేనా మామిడి చెట్టు రూపమున అతనికి దర్శన మొసగితిని. నేనా చెట్టు నాశ్రయించి నంతనే ఆ చెట్టు కుంచించు కొని పోయినది.
అట్లా స్థలము కుబ్జామ్రకమని (కుంచించుకొని పోయిన మామిడిచెట్టు కలది) ప్రసిద్ధి కెక్కినది. అచట మరణించిన వారును నేరుగా నా లోకమున కేగుదురు.
వసుంధరా! మరియొక విషయమును కూడ చెప్పెదను వినుము. ఆ ఋషి నన్ను చూచి ఏమనెనో తెలిపెదను.
గుజ్జు రూపమున నున్న నన్ను అతడచట గాంచి మోకాళ్లను నేలపై ఆన్చి కొంచెమేదో భాషించెను.
కొనియాడ దగిన వ్రతములు గల ఆ ముని మోకాళ్లపై నిలిచి యుండగా నేను ఆతనిని వరము కోరు కొమ్మంటిని. అది ఆతనికి రుచింప లేదు.
తపస్సుతో కూడి యున్న ఆ ఋషి, ఆ మహా యశస్వి నా అనుగ్రహమును కాంక్షించుచు నా మాట విని మధురముగా ఇట్లనెను.
భగవన్! నీవు లోక నాథుడవు, జనార్దనుడవు. నీకు నా యందు దయ కలిగినచో నీవు ఎల్లప్పుడు ఇచట నివసింప వలయునని కోరు చున్నాను.
లోకము లుండునంత వరకు ఇది నీకు నెలవు కావలయును. నీ దయ. ఇదియే నా కోరిక.
జనార్దన! నిన్ను విడచి నాకు మరియొకని యందు భక్తి కలుగ కుండుగాక! ఇతరుల యందు భక్తి నా కెన్నటికిని రుచింపదు.
నా హృదయమున ఉన్న పరమ వాంఛ ఇదియే. నీవు తుష్టి నందితివేని ఈ వరము నాకీయ దగును.
అంత ఆ రైభ్యుని మాట విని, ముని పుంగవా! బ్రాహ్మణోత్తమా! సరియే, అదియట్లే యగునని పలికితిని.
నా మాట విని ఆ బ్రాహ్మణోత్తముడు ముహూర్త కాలము ధ్యానమున నిలిచి యుండెను. నేనాతని కావర మొసగితిని.
దేవీ! నీవు నన్నడిగిన దానికి సంబంధించి కుబ్జామ్రకమను పుణ్య తీర్థము నందలి లోక సుఖము కలిగించు విశేషములను తెలిపెదను. వినుము.
ఆ కుబ్జామ్రక క్షేత్రము నందలి తీర్థము (కొలను) కలువ వంటి ఆకారమున నున్నది. అందు స్నానము చేసిన మాత్రమున మానవుడు స్వర్గమున కరుగును.
కార్తీకము, మార్గ శిరము, వైశాఖము అను నెలలలో ఇచట దుష్కరమగు పూజా కర్మ మాచరించి ప్రాణములు పరిత్యజించు వారు స్త్రీలు గాని, పురుషులు గాని, నపుంపకులు గానీ, ఏ లోపము లేని సిద్ధిని పొందుదురు. నా స్థానమున కరుగుదురు.
మరియొక విషయమును వసుంధరా! తెలిపెదను. దీనిని మానస తీర్థ మనియ నందురు. దీనిని చేరుకొని పుణ్య కార్యము లొనరించి అందు స్నానము చేసిన వాడు నందన వనమున కరుగును. అందు వేయి దివ్య వత్సరములు అప్సరసలతో కూడి విహరించును.
వేయి ఏండ్లు నిండిన తరువాత ఆతడు గొప్ప కులమున మహా ధనవంతుడు, గుణవంతుడు నై పుట్టును.
కార్తీక ద్వాదశి నాడు అందు ప్రాణములు వదలిన వాడు పూర్ణ సిద్ధిని పొంది నా లోకమున కరుగును.
వసుంధరా! మరియొక విషయమును కూడ చెప్పెదను. వినుము. దీనికి మాయా తీర్థమనియు ప్రసిద్ధి. దీనిచేత నరుడు మాయను తెలిసికొన గలుగును.
ఈ మాయా తీర్థము నందు స్నానము చూసిన దొడ్డ మానిసి పదివేల యేండ్లు నా భక్తుడై యుండును.
గొప్ప సంపదను పొందును. వేయి యేండ్లు అతనికి కుబేరుని భవనము ఇష్టము వచ్చినట్లు తిరుగు నివాస మగును.
ఒక వేళ ఆతడా మాయా తీర్థమున మరణించినచో అతడు మాయా యోగియై నా లోకమున కరుగును. (మాయా యోగీ = మాయతో యోగము కలవాడు = మాధవుడు)
భూదేవీ! మరియొక విషయము చెప్పెదను. వినుము. అందు సర్వాత్మక మగు తీర్థము కలదు. అది అన్ని ధర్మ గుణములతో కూడి నట్టిది.
అందు వైశాఖ శుద్ద ద్వాదశి నాడు స్నాన మాచరించు వాడు, ఏ లోపము లేని స్వర్గమును పదునైదు వేల ఏండ్లు పొందును.
అట్లే అచటి శీర్షకప మనెడు తీర్థమున ప్రాణములు వదలిన వాడు తగులము లన్నింటిని వదలి నా లోకమున కరుగును.
శుభలోచనా! మరియొక విషయమును వక్కాణింతును. వినుము. అచట పూర్ణ ముఖమను తీర్థము కలదు. దాని నెవ్వడు నెరుగ జాలడు.
గంగ నీరంతయు తక్కిన అన్ని తావులందును చల్లగా నుండును. కాని వేడిగా నుండు తావు పూర్ణముఖ తీర్థమని తెలియ నగును.
అందు స్నాన మొనరించి నరుడు సోమ లోకమున కరిగి ప్రతిష్ఠ పొందును. పదునైదు వేల యేండ్లు సోముని ఎల్లపుడు దర్శించు చుండును.
పిదప స్వర్గము నుండి తిరిగి వచ్చి బ్రాహ్మణుడై పుట్టును. నా భక్తుడు, శుచి మంతుడు, సమర్థుడు, అన్ని సత్కర్మములు, గుణములు కలవాడును అగును.
ఒక వేళ మార్గశిర శుద్ద ద్వాదశి నాడు అచట మరణించినచో ఆతడు నా లోకమున కరుగును.
గొప్ప దీప్తి నాలుగు భుజములు గల నన్ను ఎల్లవేళల చూచు చుండును. వానికి ఇంక చావు పుట్టుకలు ఎన్నటికిని ఉండవు.
వసుంధరా! మరియొక విషయమును చెప్పెదను. వినము. అశోకమను తీర్థము కలదు. అందు నరుడు శోకము లేనివాడై యుండును. దాని వ్యాప్తిని గూర్చి చెప్పెదను. వినుము.
నా భక్తుడగు భాగవతుడు అనన్యమగు మనస్సుతో అందు ఒక్క మారైన స్నానము చేసిన పది వేల యేండ్లు స్వర్గమున ఆనంద మందును.
పిదప స్వర్గము నుండి కదలి వచ్చి ఆ తీర్థము ఫలముగా ధనవంతుడు, గుణ వంతుడునగు నా భక్తుడై పుట్టును.
వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి నాడు అందు ఎవరికిని సాధ్యము కాని మరణించుట అను పని చేసి అతడు చావు పుట్టుకలు పొందడు. అలసట, భయము ఆతనికి కలుగవు. అన్ని తగులములను విడనాడి నా లోకమున కరుగును.
వసుంధరా! కరవీరకమను తీర్థము మిక్కిలి సుఖము కలిగించునది కలదు. దానిని గూర్చి తెలిపెదను వినుము.
దాని గుర్తు చెప్పెదను. దానితో అది తెలియ వచ్చును. దాని వలన పురుషుడు నా భక్తితో కూడిన వాడై జ్ఞానవంతు డగును.
మాఘ మాస శుక్లపక్ష ద్వాదశి నాడు మధ్యాహ్నమున కరవీరము పూచును. సంశయము లేదు.
ఆ తీర్థమున స్నాన మాడిన వాడు వేయి యేండ్లు ఇచ్చ వచ్చిన గృహముల కరుగుచు విమాన మెక్కి తిరుగాడు చుండును.
మరియు మాఘమాస శుక్లపక్ష ద్వాదశి నాడు అందు మరణించిన వాడు బ్రహ్మను, నన్ను, పరమేశ్వరుని దర్శించును.
వసుంధరా! మఱియు నొక విషయమును చెప్పెదను. దానిని వినుము. దీనిని మునువు నేనా బ్రాహ్మణ శ్రేష్టునకు (రైభ్యునకు) చెప్పితిని.
ఆ కుబ్జామ్రకమున నాకు మిక్కిలి ఇష్టమైన పుండరీకమను స్థానము కలదు. అదియు గొప్ప ప్రసిద్ధి గల తీర్థము.
దాని గుర్తును, ఆ తీర్థము సేవించిన కలుగు గొప్ప గుణము గల ఫలమును చెప్పెదను. వినుము.
పుండరీక యజ్ఞము చేయు యజమానుడే ఫలము పొందునో దానిని మానవుడు అందు స్వయముగా అందు కొనును. సందియుము లేదు.
మహా తపస్సు కలవాడై జ్ఞానము పొందిన మానవుడందు మరణించు నేని పది పుండరీక యాగముల ఫలమును పొందును.
ఆ మహా తాపసుడు జాతి చేత శుద్ధుడై యజ్ఞ ఫలమును అనుభవించి నిత్యమగు సిద్ధిని పొంది నా లోకమున కరుగును.
ప్రియా! అగ్ని తీర్థమని కుబ్జామ్రకమున గుట్టుగా నుండు మరియొక తీర్థమును గూర్చి చెప్పెదను. వినుము.
కార్తీకము, మార్గశిరము, ఆషాఢము, వైశాఖము అను నెలలో శుక్లపక్ష ద్వాదశి నాడు, లేదా మనసునకు నచ్చిన సమయ మందు, పంచ మహా పాతకములను రూపుమాపు కొనిన మానవుడు ఈ తీర్థమును సేవించునేని యిది తన నిజ స్వరూపమును వానికి కన్పట్ట జేయును.
దేవీ! దాని గుర్తు చెప్పెదను. నాదయిన ఆ తీర్థమును గూర్చి ఆ గుర్తుతో చక్కగా తెలియ వలయును. చెదరని చిత్తమును కుదురు పరచుకొని వినుము.
నా సంహితను పఠించు వారు, శుద్ధులు, అగు భాగవతులన వదలిన వాడు, శాస్త్రము నెరుగని వాడును దానిని తెలిసికొన జాలడు.
అందు మృతి చెందిన వాడు, స్నానము చేసిన వాడు పొందు ఫలమును చెప్పెదను. మనసును చెదర నీయక కుదురు పరచుకొని వినుము.
కుబ్జామ్రకము నందలి అగ్ని తీర్థము నందు స్నానము చేయుట వలన కలుగు ఫల మెట్టిదియో చెప్పెదను. వినుము.
అచట స్నాన మాడినంత మాత్రమున నరుడు, ఏడు అగ్ని మేధములు చేసిన ఫలమును పొందును. సంశయము లేదు.
అట్లు కాక ఇరువది రాత్రులు అందు నివసించి ఏ ఒక్క ద్వాదశి నాడు గాని అందు మరణించునేని అతడు నా లోకమున కరుగును.
సుందరీ! ఆ తీర్థపు గుర్తులను చెప్పెదను. వినుము. దాని వలన నరుడు నా భక్తితో పరమ సుఖమునకు తావలమగు జ్ఞాన సంపద చేత ప్రసిద్ధు డగును.
అచట నేల హేమంతమున (చలి కాలమున) వేడిగా నుండును. అచటి గంగ వేడిగా నుండును. గ్రీష్మ కాలమున చల్లగా నుండును.
మహాభాగా! ఉత్తరముగా నున్న అగ్ని తీర్థపు గుర్తు ఇది. దీని వలన మానవులు ఘోరమగు సంసార సాగరమును దాటుదురు.
మరియు కుబ్జామ్రకము నందు వాయవ్యమని ప్రసిద్ధి కెక్కినదియు ధర్మము అను కొండ నుండి వెలువడి నదియునగు తీర్థ మొకటి కలదు. దానిని గూర్చి చెప్పెదను.
ఆ తీర్థమున స్నానమాడి ఉదక కార్యములు, అగ్ని కార్యములు చేయువాడు వాజపేయ యాగ ఫలమును సమగ్రముగా పొందును.
వాయు తీర్థము అను ఆ గొప్ప సరస్సు నందు పదునైదు దినములు నా పూజా కర్మముల నాచరించుచు మరణించు వానికి మరల చావు పుట్టుకలు కలుగవు. ఆతడు నాలుగు చేతులు కలవాడై నా లోకమున స్థిరముగా నిలచి యుండును.
సుందరీ! ఉత్తములగు భాగవతులు ఏ గుర్తుతో ఆ వాయు తీర్థమును తెలిసి కొందురో దానిని చెప్పెదను.
అవనీ! అచట ఇరువది నాలుగు ద్వాదశుల యందును రావి యాకులు నిరంతరము కదలాడు చుండును. దానితో ఆ తీర్థమును తెలిసికొన దగును.
కుబ్జామ్రక క్షేత్రమున శక్ర తీర్థమను మరియొక తీర్థము కలదు. దానిని గూర్చి చెప్పెదను. అది సర్వ సంసారము నుండియు ముక్తి పొందించును.
ఆ శక్ర తీర్థమున స్నానము చేయు గొప్ప కీర్తి గల మానవుడు ఇంద్రుని లోకమున వజ్రము చేతి యందు కలవాడై నివసించును. సంశయము లేదు. (వజ్రహస్తుడు = ఇంద్రుడు)
మరియు పది రాత్రులు అందు ఉపవాస మొనరించి మరణించు వాడు నా లోకమున కరుగును.
సుందరీ! మనసు కుదుట పరచు కొని వినుము. ఆ తీర్థమును గుర్తించెడు చిహ్నమును తెలిపెదను.
భూమీ! అచట దక్షిణమున అయిదు చెట్లు కలవు. దానితో ఆ శక్ర తీర్థమును తెలియ నగును.
వసుంధరా! మరియొక తీర్థమును గూర్చి చెప్పెదను. అందు వరుణ దేవుడు పండ్రెండు వేల యేండ్లు తపస్సు చేసెను.
నన్న డిగితివేని అందు స్నానము చేసిన ఫలమును చెప్పెదను. మరియు విశుద్ధమగు వ్రతములు గల పురుషుడు అందు మరణించినచో పొందు ఫలమును తెలియ జేయుదును. అతడు ఎనిమిది వేల యేండ్లు వరుణ లోకమున ఇష్టము వచ్చినట్లు తిరుగాడును. సంశయము లేదు.
అచట ఇరువది రాత్రులు ఉప వాసముండి మరణించిన నరుడు అన్ని తగులములను విడనాడి నా లోకమున కేతెంచును.
వసుంధరా! దాని గుర్తును చెప్పెదను. వినుము. అచట ఒక ధార పడు చుండును. అది ఎల్లప్పుడు ఒకే రూపమున నుండును. వర్షా కాలమున పెరుగదు. వేసవి యందు తరుగదు.
భూమీ! ఆ కుబ్జామ్రక క్షేత్రమున సప్త సాముద్రమను తీర్థ మొకటి కలదు. అందు స్నానము చేసిన ధర్మ పరాయణుడగు నరుడు మూడు అశ్వమేధ యాగముల ఫలమును పొందును.
అతడు వడివడిగా స్వర్గమున కరుగును. ఎనిమిది వేల యేండ్లు అందు నివసించును. పిదప స్వర్గము నుండి తిరిగి వచ్చి ఉత్తమ కులమున, వేదము లందు, వేదాంగము లందు నేర్పు కలవాడును. సోమ పానము చేయు వాడును నగు బ్రాహ్మణుడై పుట్టును.
మరియు, అచట ఏడు రాత్రులు ఉపవాస ముండి అన్ని తగులములను వదలుకొని ప్రాణములు విడుచు వాడు నా లోకమున కరుదెంచును.
దాని గుర్తు చెప్పెదను. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు అందు విభూతి పుట్టును. స్వర్గ జలములతో అలంకృతమైన గంగ అచట ప్రవహించును.
ఆ తీర్థమున గంగ గొప్ప కాంతి కలదియై పాలవంటి వన్నె కలది యగును. మరల పచ్చని రంగుతో ప్రకాశించును. అటుపై ఎర్రని వన్నె కలది యగును.
కొంత వడి మరకతముల రంగుతో తేజరిల్లును. మరల ముత్యముల కాంతి వంటి కాంతితో అలరారును, దొడ్డ హృదయమును గలవారు ఈ గుర్తులతో దానిని తెలిసి కొందురు.
కుబ్జామ్రకమున మరియొక తీర్థమున గూర్చి చెప్పెదను. దానిని మానసర మందురు. విష్ణు భక్తు లందరు దానిని సేవింతురు. శుభ మైనది.
అందు స్నాన మాడిన వాడు మనాస సరోవరమున కరుగును. అందు రుద్రులు, ఇంద్రుడు, మరుద్గణములు, అను వారితో కూడిన దేవతల నందరిని దర్శించు కొనును.
అందు ముప్పది రాత్రులు ఉపవాస ముండి మరణించిన నరుడు, అన్ని తగులములను తెగ త్రెంపులు చేసికొని నా లోకమున కరుగును.
నరులు దానిని చక్కగా తెలిసి కొనుటకు వీలగు గుర్తును చెప్పెదను. అది ఎదురు బదురుగా వ్యాపించి యుండి మనుష్యులకు ప్రవేశింప నలవి కానిది.
అది మానస సరోవరము వంటిది. ఉత్తములు, నా కర్మము లందు నిష్ఠకల వారునగు పరమ భాగవతులకు మాత్రమే తెలియ దగినది.
మహాభాగా! కుబ్జామ్రకమున నున్న ఈ తీర్థమును గూర్చి సిద్ధికాముడగు రైభ్యుడను విప్రునకు వివరించి చెప్పితిని.
భూదేవీ! ఆ కుబ్జామ్రక క్షేత్రమున మునుపు జరిగిన ఒక ఆశ్చర్యమును, గొప్ప శక్తి కల దానిని చెప్పెదను. వినుము.
నా నిర్మాల్యమునకు ప్రక్క ఒక త్రాచు పాము భయము లేనిదై గంధ మాల్యములను, నివేదన వస్తువులను తినుచు ఉండెడిది.
కొంత కాలమున కచటి కొక ముంగిస వచ్చెను. భయము లేక ఆడు కొనుచున్న ఆ త్రాచును చూచెను. అంత ఆ రెంటికి పోరు ఆరంభ మాయెను.
మాఘ మాసపు ద్వాదశి నాడు మధ్యాహ్నము ముగియు నపుడు ఆ ముంగిస ఆ పాము కాటునకు నా మందిరమున మరణించెను.
ఆ ముంగిస విషము పైకొన్న పాము కూడ చని పోయెను. ఇట్లా రెండును పోరొనర్చి మరణించెను.
పాము ప్రాగ్జ్యోతిషమున రాజ పుత్రియై పుట్టి ప్రసిద్ధి కెక్కెను. ముంగిస కోసల దేశమున రూప వంతుడు, గుణ వంతుడు, అన్ని శాస్త్రములలో కళలలో నేర్పు కలవాడును అగు రాజై పుట్టెను.
వారు పెద్ద కాలము సుఖముతో శుక్ల పక్షమున చంద్రునివలె పెరుగ జొచ్చిరి.
ఆ రాజ కన్య ముంగిసను చూచి నంతనే చంప గోరును. రాజ కుమారుడు పామును చూచి నంతనే చంప గోరును.
అంత కొంత కాలమునకు కోసల రాజునకును, ప్రాగ్జ్యోతిష రాజ కన్య కకును నా ప్రసాదము వలన సంబంధము ఏర్పడెను. వారిరువురు పెండ్లి చేసి కొనిరి.
వారిద్దరికి అనురాగము పెరిగెను. వారిరువురు లక్కవలె కలిసి పోయిరి. ఆడుచు పాడుచు వారు, నందనమున శచీ పురందరుల వలె, ఇచ్చ వచ్చిన తావు లందు విహరింప జొచ్చిరి.
పెద్ద కాలము గడచినను వారి అనురాగము తరుగు పోలేదు. మహా సముద్రము ఒడ్డుపైకి ఉప్పొంగి నట్లు వృద్ధి పొందు చుండెను.
ఉద్యానములలో, దేవాయములలో వారు విహరించు చుండిరి. అట్లు వారికి డెబ్బది యేడేండ్లు గడచెను. కాని నా మాయ పైకొనగా వారు తమ నిజ స్థితిని తెలియరైరి.
ఇట్లు వారొక నాడు ఉద్యాన వనమున విహరించు చుండగా రాజపుత్రు డొక పామును చూచి చంప నుంకించెను.
ఆమె వలదని వారించు చున్ను రాజ పుత్రుడు, పాములను చంపుటకు పరువెత్తు గరుత్మంతుని వలె, దానిని చంపుటకు సిద్ధపడెను.
ఆమె వలదని అడ్డు పడుచున్నను ఆ రాజపుత్రుడు ఆ పామును వడివడిగా చావ గొట్టెను. అంత నా రాజపుత్రి కోపించి ఆతనితో మాటాడ కుండెను.
అదే సమయమున రాజపుత్రి ఎదుట ఒక ముంగిస తిండి కొరకు కలుగు నుండి వెలువడి కాన వచ్చెను.
చూడ ముచ్చటగా ఆడు కొనుచున్న ఆ ముంగిసను చూచిన రాజపుత్రికి క్రోధము కలిగెను. దానిని చంప బోయెను. రాజపుత్రుడు ప్రాగ్జ్యోతిష రాజ కుమారిని వారించెను.
చక్కగా తిరుగాడుచు, అందరకు చూడ ముచ్చట అయిన నకులమును ఆమె చంపి వేయగా చూచి రాజపుత్రుడు కుపితుడై ఆమెతో నిట్లనెను.
ఆడువారికి మగడు ఎల్లవేళల మన్నింప దగిన వాడని శాస్త్రములు ఘోషించు చున్నవి. నీవేమో నేను వలదను చున్నను ముంగిసను చంపితివి.
అభిమాన వతియగు ఆ రాజపుత్రి ఆతని మాట విని క్రోధముతో వణకి పోవుచున్న సర్వా వయవములు కలదియై రాజ పుత్రునితో ఇట్లు పలికెను.
ఏ పాప మెరుగక నేలపై ప్రాకుచున్న పామును, నేను వలదను చున్నను చంపి వైచితివి. ఇందు నీ తప్పేమియు లేదేమి?
రాజ పుత్రి మాట విని రాజ పుత్రుడు ఇట్లు పలికెను. నన్ను పోటు మాట లంటివి. మున్నెన్నడు నీవిట్లు పలుకవు.
అది పాము. ఒక్క పెట్టున విషమును క్రుమ్మరించు నట్టిది. వాడి కోరలతో మహా భయము పుట్టించునది. కనబడి నంతనే మానవులను కరచు నట్టిది. అందు వలన నేను దానిని చంపితిని.
రాజు ప్రజలను పాలింప వలయును. చెడ్డ దారులను త్రొక్కు వారిని నాశనము చేయ వలయును. ఇది వేదము ననుసరించి శాస్త్రము చెప్పిన విషయము.
కావలయునని నరులను, పంటలను పాడు బెట్టునవి యగు క్రూర మృగములు వధింప దగినవి. సంశయము లేదు.
రాజ కర్మము నందున్న నేను రాజ ధర్మమును తప్పక ఆచరింప వలయును. ముంగిస చేసిన తప్పేమో చెప్పుము.
చక్కని రూపముతో చూడ ముచ్చట అయినది, రాజుల యిండ్లలో ఉండ దగినది, శుభమైనది, పవిత్రమైనది యగు మంగిసను చంపితివి.
ఇండ్లలో ముద్దుగా తిరుగాడు ముంగిసను వల దన్నను చంపిన రాజ పుత్రివి భార్యవు అయిన నిన్ను నేను మెచ్చుకొన జాలను.
నేను అడ్డుకొను చున్నను నీవు ముంగిసను చంపి వైచితివి. ఇంక నీవు నాకు భార్యవు కావు. నేను నీకు మగడను కాను.
నిన్నీనాడు చంప కున్నాను. ఆడువారు వధకు అర్హలు కారు కదా! అని యిట్లు పలికి ఆతడు నగరమున కరిగెను.
వారిరువురు ఇట్లు కోపము పొంది చెడిన ప్రీతి కలవారైరి. దంపతుల నడుమ కాలమెట్లో గడచు చుండెను. ఒకరి నొకరు ఆనంద పరచుకొన కుండిరి. తదను గుణముగా తిట్టు కొనుటయు జరుగు చుండెను.
రాజ పుత్రుడును ముంగిసను చంపిన కోపము చేత శరీర సుఖమును ఏ మాత్రము పొంద కుండెను.
అంత పెద్ద కాలమునకు కోసల దేశాధిపతి ఆ కథ నంతటిని, పాము ముంగిసల వధమును వినెను.
ఇది యంతయు ఉన్న దున్నట్లు విని వారు కోపముతో నున్న విషయము తెలిసికొని మంత్రులను, కంచుకులను కోడలిని కొడుకును రావించి రాజిట్లు పలికెను.
నాయనా! కోడలి యందలి నీ ప్రేమ ఎక్కడికి పోయినది? లక్క వలె అంటుకొని పోయెడు ప్రీతి ఏల నశించినది?
అద్దములలో ప్రతిబింబము వలె మీ ప్రేమను నేను చూచితిని. బిడ్డా! ఎన్నడును విరుద్ధముగా కానరాదు.
ఈమె సమర్థురాలు, చక్కని శీలము కలది, ధర్మ ప్రవర్తనలో అందరి కంటె మిన్న. నీ పరిజనము నందు కాని ఇతర జనుల విషయమున కాని ఆమె ప్రియము కాని మాట పలికి యుండ లేదు. నీకు మధుర భోజనములు కూర్చు ఈ కోడలిని పరిత్యజించుట పాడి గాదు.
నీకు ధర్మమే సర్వమైన ధనము. కుల స్త్రీయే ధర్మము. సంశయము లేదు. స్త్రీలలో సత్య శీలము గలవారి వలననే కులము చక్కగా సాగును.
అంత తండ్రి మాట విని రాజపుత్రుడు తండ్రి రెండు పాదములు పట్టుకొని ఇట్లు బదులు చెప్పెను.
తండ్రీ! నీ కోడలి యందలి తప్పు ఆవంతయు లేదు! కాని నేను వలదను చుండగా నా యెదుట ముంగిసను చంపినది.
చంపబడిన నకులమును గాంచిన నాకు పెను కోపము కలిగెను. ఆ కోపముతో ఉడికి పోయిన నేను ఆమెను నిందించితిని.
అంత మగని మాట విని ప్రాగ్జ్యోతిష రాజపుత్రి తలతో ప్రణమిల్లి యిట్లు పలికెను.
ఏ తప్పు నెరుగనిది, బెదరిపోవు చున్నట్టిది, తలవంచు కొని తన దారిని తాను పోవు చున్నట్టిది. అట్టి పామును, నేను వంద విధములుగా వారించు చున్నను వడి వడిగా చంపి వైచెను.
అట్టి సర్పమును వధించుట చూచి క్రోధము కాల్చి వేయగా ఈయనతో కొంచెముగా వాదులాడితిని.
కోడలి మాటను, కొడుకు పలుకును విని కోసలరాజు ఇద్దరికి మేలై నదియు, శుభ మైనదియు నగు పలుకిట్లు పలికెను.
సర్పమును చంపగా నకులమును చంపితి ననుచున్నది. ఇంక నిచట కోపమేల చేయ వలయునో నాకు చెప్పుము.
కొడుకా! ముంగి చచ్చినది. ఇంక నీకు కోపమేల? రాజపుత్రీ! పాము చచ్చినది. నీ కిచట కోప మేల?
అంత తండ్రి మాట విని కోసలేశ్వరుని నందనుడు, గొప్ప కీర్తిశాలి, రాజపుత్రుడు తీయని పలు కిట్లు పలికెను.
అట్లయినచో నీవు నన్నడుగనేల? మహాత్మా! ఆమెనే అడుగుము. దానితో ప్రాణు లందరు ఆ విషయ మెరుగుదురు.
కొడుకు మాట విని కోసల రాజు వారిరువురి ధర్మపు కలయికను సాధించు తీయని పలుకిట్లు పలికెను.
నాయనా! న్యాయముగా నీ హృదయమున నేమున్నదో చెప్పుము. మీ యిద్దరకు ప్రీతిని త్రెంచి వేసిన కారణ మెయ్యది?
కొడుకా! నిన్ను కంటిని, పెంచి పెద్ద చేసితిని, సర్వ కర్మముల యందును నేర్పు నల వరచితిని. తండ్రి అడుగగా రహస్యములను దాచి యుంచు వారు నరాధములు.
సత్యమో అసత్యమో ఉన్న దున్నట్లు తండ్రికి చెప్పని వారు మండు చున్న యిసుక గల ఘోరమైన రౌరవ నరకమున పడుదురు.
అది మేలైనను కీడైనను తండ్రి అడిగి నపుడు సత్యమునే చెప్పువారు సత్యమును పలుకు వారేగు సుగతికి పోవుదురు.
కుమారా! నీవు నా యెదుట, మంచి గుణములకు గనియైన కోడలి యందు ప్రీతి యేల తప్పితివో దానిని తప్పక చెప్ప వలయును.
తండ్రి మాట విని కోసల రాజ నందనుడు, ఆ సభ యందే మెత్తని పలుకు నిట్లు పలికెను.
నాయనా! ఈ జన మంతయు వారి వారి యిండ్లకు అరుగుదురు గాక! మీ కిష్టమైనచో రేపు ఉదయమున మీకు ఉన్న విషయమును చెప్పుదును.
తెల్లవారు చుండగా కోసలరాజు శంఖములు, దుందుభులు మ్రోగు చుండగా సూతులు, మాగధులు, వందులు స్తోత్ర పాఠములు చేయు చుండగా మేల్కొనెను.
అంత కమలముల రేకుల వంటి కన్నులు కలవాడు, గొప్ప యశస్సు కలవాడునగు రాజ కుమారుడు స్నానము చేసి మంగళ కార్యములు ముగించు కొని రాజున్న తావునకు వచ్చెను.
అంత కంచుకి వడివడిగా రాజు కడ కరిగి రాజా! నీ కుమారుడు నిన్ను చూచు కోరికతో ద్వారమున నిలిచి యున్నాడని నివేదించెను.
కంచుకి మాట విని కోసల రాజు నా కుమారుడు, నా కులమున పుట్టిన వాడు నగు అతనిని వెంటనే ప్రవేశ పెట్టుమని పలికెను.
రాజపుత్రుడు ప్రవేశింపగా అందున్న జనులందరు ఆనంద మొందిరి. తండ్రి కొడుకులు నాలుగు వర్ణముల వారి స్థితి గతులను గూర్చి కొంత వడి ముచ్చ టించిరి.
నాయనా! జనులు నిండుగా ఉన్న తావున నా రహస్యము నడిగితిని. అందు వలన ఆ రహస్యమును చెప్ప జాలక పోవు చున్నాను.
మహారాజా! మా ప్రీతిని త్రుంచి వేసిన కారణమగు రహస్యమును మొత్తముగా నేను నీకు తప్పక చెప్ప వలయును.
మహారాజా! ఈ గొప్ప గుట్టును నీవు విన గోరుదునేని నాతో పాటు కుబ్జామ్రక క్షేత్రమునకు శీఘ్రముగా రమ్ము.
కోసల రాజా! నీవడిగిన ఆ పరమ రహస్యమును, ఏ దోషము లేని దానిని, నీ కచట చెప్పెదను.
అంత ఆ రాజ కుమారుని పలుకు విని రాజు నాలుగు వర్ణముల వారున్న ఆ తావున ‘సరే’ యని పలికెను.
రాజ పుత్రుడు అచట మంత్రుల కడ నిలిచి యుండగా రాజు అచట నున్న జనులతో తీయగా ఇట్లు పలికెను.
మేము ఆ కుబ్జామ్రక క్షేత్రమునకు పోయెదము. వెళ్లుటకు నిశ్చయము చేసి కొంటిమి. ఎవ్వరును మమ్ము వారింప రాదు.
అంత ఏడు దినములు గడచిన తరువాత మంత్రులు రాజుతో సర్వ ద్రవ్యములను సిద్ధము చేసితిమి. తమ యాజ్ఞ యేమి? అని పలికిరి.
మంత్రుల మాట విని కోసల రాజు మంత్రుల సముదాయము నందు ‘బాగు బాగు’ అని పలికెను. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వాహనములు, చక్కగా సిద్ధ పరుప బడిన ధనాగారము, శిల్పులు, వంటవారు, వేశ్యలు మొదలగు వారందరు బయలు దేరిరి.
అంత ఆ రాజోత్తముడు పెద్ద కొడుకుతో, కుమారా! నేను చేయ వలసిన దేమి? ఈ రాజ్య మిప్పుడు శూన్య మైనది. (రాజు లేని దైనది) అని పలికెను.
అంత తండ్రి మాట విని కీర్తిశాలి యగు రాజ పుత్రుడు తండ్రి పాదములపై పడి తీయగా ఇట్లు పలికెను.
ఈతడు నా తమ్ముడు. మేమి రువురము ఒక్క గర్భము నుండి వెలువడిన వారము. న్యాయము ననుసరించి ఈ రాజ్యము నీతని కొసగుము.
కొడుకు మాట విని ధర్మమున నిష్ఠ గల ఆ రాజు, నీవు జీవించి యుండగా చిన్నవాడు రాజ్యము కెట్లు అర్హుడగును? అని పలికెను.
అంత తండ్రి మాట విని కోసల రాజు కులమును ఉద్ధరించు ఆ కుమారుడు ధర్మము ననుసరించి తండ్రితో ఇట్లు పలికెను.
తండ్రీ! నీవు తమ్ముని కిచ్చెడు భూమిని నేను అంగీకరింతును. ఆతడు ఈ మేదిని ననుభవించుట ధర్మము చేత ఉచిత మైనది అగు గాక!
నేను కుబ్జామ్రకమున కరిగి ఎన్నిటికిని తిరిగి రాను. ఇది సత్యము, ధర్మము. నేను నొక్కి చెప్పు చున్నాను.
రాజోత్తము డగు ఆ కోసల జనాధిపుడు కొడుకు అనుమతి మేరకు అందరి ముందు తన రెండవ కుమారుని మహా రాజ్యమున అభిషిక్తుని గావించెను.
అంత పెద్ద కాలమునకు రాజు అంతః పురముతో, సకల వస్తువులతో కూడిన వాడై కుబ్జామ్రకమునకు చేరు కొనెను.
వారందరు అచటి కరిగి ఆ కుబ్జామ్రక క్షేత్రమున ఉండిరి. పెక్కు ధనములను, రత్నములను దాన మొసగిరి. పెద్ద కాలము గడచెను.
ఇట్లు వారచట నివసించు చుండగా ఒకనాడు రాజునకు కొడుకు కోడళ్ల ప్రీతి చెడుటకు గల కారణము నడుగ వలయునను బుద్ధి పుట్టెను.
అంత సూర్యుడస్త మింపగా, రాత్రి రాగా కోసల రాజు తన పుత్రు నిట్లడిగెను.
బిడ్డా! విష్ణు పాదములకు నెలవైన కుబ్జామ్రకమును చేరు కొంటిమి. పెక్కు దానములు చేసితిమి. దానిని గూర్చి విచారింపను.
నిజము చెప్పుము. కోడలు అందమైనది. పాడు పను లెన్నటికిని చేయనిది. యోగ్యురాలు. కులము, శీలము, గుణము నిండుగా కలిగినది. ఆమె యెడ నీవు విముఖుడ వైన కారణమును దాపక చెప్పుము.
అంత నతడు తండ్రితో మధురముగా ఇట్లు పలికెను, నాయనా ఈ రాత్రి నీవొక్కడవు ఇచట నిద్రింపుము. తెల్లవారి నంతనే మునుపు జరిగిన ఆ ఘోరమైన వృత్తాంతమును తెలిపెదను.
ఆ రాత్రి గడచిన పిమ్మట సూర్యుడు దయించిన తరువాత రాజ పుత్రుడు గంగలో స్నానమాడి, పట్టు వస్త్రములు కట్టుకొని, యోగ్యమగు విధానముతో పూజలు గావించి తండ్రికి ప్రదక్షిణము చేసి యిట్లు పలికెను.
రాజా! పోదము, రమ్ము. రమ్ము నీవు నన్నడిగిన రహస్యమును గూర్చి ఉన్న దున్నట్లు చెప్పెదను. వినుము.
ఆ రాజ పుత్రుడు, ఆ రాజు, ఆ పద్మ లోచనము వారందరు మునుపు పాతకథ జరిగి నిర్మాల్యపు ప్రోవు దగ్గర కరిగిరి. (నిర్మాల్మము = గత దినము నాటి తొలగించిన పూజా ద్రవ్యములు).
గొప్ప తప స్సంపద గల ఆ రాజ పుత్రుడు నిర్మాల్యము దరి జేరి తండ్రి రెండు పాదములను పట్టుకొని ఇట్లు పలికెను.
మహారాజా! నేను మునుపొక ముంగిసను. ఈ అరిటి తోటలో ఉంటిని. కాలము త్రోసికొని రాగా ఈ నిర్మాల్యపు ప్రోవు కడకు వచ్చితిని.
అప్పుడ చటికి ఒక విష సర్పము వచ్చి మంచి సువాసనలు గల మేలైన పూవులను తిను చుండెను.
ఆ పెను బామును చూచి కోపముతో నెరు పెక్కిన కన్నులతో ఒక్క పెట్టున దానిపైకి దుమికితిని.
దానికిని నాకును, మాఘ మాసము ద్వాదశి నాడు ఘోరమైన పోరు సాగెను. దాని నెవరు చూడరైరి.
అట్లు పోరు చుండగా ఆ పాము నా ఒడలెల్ల పెన వైచుకొని ముక్కుపై కాటు వేసెను.
విషము పైకొన్న నేనును ఆ నాగు బామును చంపి వైచితిని. ఇట్లు ఇరువురము ప్రాణములను వదలితిమి.
ఇట్లి రువురము క్రోధము చేసిన తప్పు పైకొనగా ఆ సమయమున మరణించితిమి. నేను కోసలాధి పతివైన నీకు పుత్రుడనై పుట్టితిని.
అప్పటి కోపము మనసున ఉండుట వలన నేనా ఆడు పామును చంపితిని. రాజా! నీవు మునుపు అడిగిన దాని రహస్య మియ్యది.
రాజ పుత్రుని మాట విని కోడలు ఆ నిర్మాల్యపు ప్రోవు కడ కరిగి మామతో ఇట్లు పలికెను.
మహారాజా! ఆ ముంగిస చంపిన త్రాచు పాము నేనే. నేను ప్రాగ్జ్యోతిష పురమున పుట్టి నీకు కోడల నైతిని.
అట్లు నేను మరణించితిని. ఆ కోపముతో ఒడ లెరుగని దాననై యింటిలోని ముంగిసను చంపి వైచితిని. ఈ రహస్యమును ఇపుడు నీకు చెప్పు చున్నాను.
కోడలు, కొడుకు చెప్పిన మాటలు విని నిష్ఠగా చేసిన వ్రతములు గల ఆ రాజు మాయా తీర్థమును చేరుకొని అందు ప్రాణములు విడచెను.
ఆ రాజ పుత్రుడును, కీర్తిశాలిని యగు రాజ పుత్రియు పౌండరీక క్షేత్రమును ప్రాణములు వదలిరి.
ఆ రాజును, రాజ కుమారుడును, యశస్విని యగు ఆ రాజ పుత్రికయు జనార్దన దేవుని పరమ స్థానమును చేరుకొనిరి.
నా అనుగ్రహము వలనను, వారి తపస్సు బలము చేతను చేయ నలవి కాని కర్మ మాచరించి వారు శ్వేత ద్వీపమునకు చేరు కొనిరి.
వారి పరిజనము కూడ చక్కని తపస్సు చేసి పరమ సిద్ధిని పొంది శ్వేత ద్వీపమున కరిగిరి.
దేవీ! నేనా బ్రాహ్మణ ముఖ్యుడగు రైభ్యునకు చెప్పిన కుబ్జామ్రక మహత్వమును నీకు తెలియ జేసితిని.
ఈ కథ జపింప దగినది. పుణ్య మైనది. నాలుగు వర్ణముల వారి యందును నిలుప దగినది. కార్యములలో మహా కార్యము. శ్రద్దతో చేసెడు క్రియలలో ఉత్తమ మైనది. వెలుగులలో గొప్ప వెలుగు. తపములలో గొప్ప తపస్సు.
మూర్ఖుల మధ్య దీనిని ఎన్నిటికిని చదువ రాదు. కసాయి వారి నడుమను, వేదములను, వేదాంగ ములను నిందించు వారున్న తావునను దీనిని పఠింప రాదు.
గురువులను, శాస్త్రములను నిందించు వారి కడ దీనిని చదువ రాదు. సత్కార్య దీక్షల యందు నిష్ఠ కల భాగవతుల కడ చదువ వలయును.
ఉదయముననే లేచి మానవుడు దీనిని పఠించు నేని వెనుక పది తరముల వారిని, ముందు పది తరముల వారిని తరింప జేయును.
ఇది చదువు చుండగా ప్రాణములు విడిచిన వాడు నాలుగు భుజములు కలవాడై నా లోకముల యందు స్థిర నివాసము చేయును.
భూదేవీ! కుబ్జామ్రక స్థానమును గూర్చి నా భక్తుల సుఖమునకై దీనిని నీకు చెప్పితిని. మరియేమి విన గోరుదువు?