అధ్యాయము - 24

భూదేవి:

భూదేవి:

దేవదేవా! భూధారీ! గొప్ప బలము, పెద్ద ఆకారము గల సర్పములు ఆ పరమేశ్వరుని శరీరమును అంటి యుండుటకు కారణ మెయ్యది?

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

గణపతి పుట్టుకను గూర్చి విన్న ప్రజాపాల మహారాజు మధురమగు వాక్కుతో పవిత్రమగు వ్రతములు గల ఆ మునిని గూర్చి యిట్లు పలికెను.

ప్రజాపాలుడు:

ప్రజాపాలుడు:

భగవానుడా! వంకర తనము గల నాగులు ఎట్లు రూపొందిరి. ఇది నాకు చెప్పుము. మరియు వారికి ఆకారమెట్లు కలిగినది?

మహాతపుడు:

మహాతపుడు:

బ్రహ్మ దేవుడు సృష్టి చేయుచు సంతానము కొఱకై మొదట మనసున ధ్యానింపగా మరీచి పుట్టెను. అతని కొడుకు కశ్యపుడు.

ఆ కశ్యపునకు దక్షుని పుత్రిక యను సుందర వదన భార్య యాయెను. కశ్యపుని యందామెకు గొప్ప బలము గల పుత్రులు పుట్టిరి.

అనంతుడు, వాసుకి, మహా బలుడగు కంబలుడు, కర్కోటకుడు, పద్ముడు, మహా పద్ముడు, శంఖుడు ఎవ్వరికిని ఓడని కులికుడు అను వీరు కశ్యపుని సంతానము నందు ప్రధానులు.

వీరి సంతానముతో జగ మంతయు నిండి పోయెను. వంకర దేహములు, క్రూరపు పనులు, వాడి మోములు, పొంగి వచ్చు విష తీవ్రతయు గల వీరు మనుజులను చూచి నంతనే కాటు వేసీ క్షణములో బూడిద గావించు చుండెడి వారు.

ధ్వనిని బట్టి ఆ నాగులు మనుష్యుల కడచేరి వారిని తాకుదురు. ఈ విధముగా ప్రతి దినము పరమ ఘోరమగు వినాశము సంభవించు చుండెను.

ఇట్లు తమ వినాశము కల్గు చుండగా చూచి ప్రజా లందఱు అన్ని వైపులా నుండి బయలు దేరి రక్షకుడు, పర దైవము అగు పరమేశ్వరుని శరణు జొచ్చిరి.

ఈ పని కొఱకే ప్రజ లందఱు పద్మమున బుట్టిన పురాణ దైవము బ్రహ్మను గాంచి యిట్లు పలికిరి.

దేవతలు:

దేవతలు:

దేవదేవా! ప్రభూ! పరమేశ్వరా! నీ సంతాన మగుమమ్ము వాడి కోరలు, పెద్ద దేహములు గల పాముల బారి నుండి రక్షింపుము.

దేవా! ప్రతి దినము మనుష్య రూపము గాని పశు రూపము గాని ఆ పాముల కంట బడి నంత బూడిదయై పోవు చున్నది.

నీవు పుట్టించు చున్నావు. ఆ నాగులు నాశనము చేయు చున్నారు. ఈ పాడు పనిని గమనించి తగిన కార్యమా చరింపుము.

బ్రహ్మ:

బ్రహ్మ:

నేను మీకు రక్షణ కల్పింతును. సంశయము వలదు. మీమీ యిండ్లకు పొండు. ప్రజలకు కంగారు కలుగ రాదు.

ఇట్టిదని చెప్పరాని ఆకృతి గల బ్రహ్మ యిట్లు పలుకగా ప్రజ లందఱు పరమ ప్రీతితో స్వయంభువునకు నమస్కరించి తిరిగి వచ్చిరి.

అట్లు ప్రజలందరు తిరిగి పోగా బ్రహ్మ వాసుకి మొదలగు పాములను పిలిచి పట్టరాని కోపముతో వారి నిట్లు శపించెను.

బ్రహ్మ:

బ్రహ్మ:

నా ప్రజ లందరిని మీరు ప్రతి దినము నాశ మొందించు చున్నారు. కావున మీ మరియొక పుట్టుక యందు తల్లి యిచ్చేడు భయంకర శాపము వలన ఘోరమైన వినాశము పొందుదురు. ఇది స్వాయంభువ మన్వంతరమున జరుగును.

బ్రహ్మ యిట్లు పలుకగా ఆ నాగ ముఖ్యు లందఱు వణకి పోవుచు బ్రహ్మ పాదములపై బడి యిట్లు పలికిరి.

నాగులు:

నాగులు:

భగవంతుడా! మా జాతిని నీవే కుటిలముగా చేసితివి. పెల్లుబికెడు విషము, క్రూరత్వము, చూపే శస్త్రమగు లక్షనమును నీవే యేర్పరచితివి. ఇప్పుడు, అచ్యుతా! నీవు శాతింప వలయును.

బ్రాహ్మ:

బ్రహ్మ:

తప్పుడు భావములు గల నాగులారా! నేను మిమ్ములను సృజించినచో మీరు చీకును చింతయు లేక మనుజుల నేల నిత్యమూ తిను చున్నారు?

నాగులు:

నాగులు:

దేవదేవా! మాకును మనుష్యులకు హద్దు లేర్పరపుము. వేరు వేరుగా ఉండు చోటులను ఏర్పరపుము. కట్టుబాటు చేయుము.

అంత బ్రహ్మ ఆ నాగుల మాట విని యిట్లు పలికెను.

నాగులారా! మీకు మానవులతో ఒక కట్టడి చేసెదను. నా శాసనమును చెదరని మనస్సుతో వినుడు.

పాతాళము, వితలము, హర్మ్యము అను మూడు లోకములు ఎల్ల వేళల చూడ ముచ్చట గొలుపునవి మీకు నివాసముగా నిచ్చితిని. అచ్చటకు పొండు.

అచట నా ఆజ్ఞ వలన పెక్కు తీరులగు సుఖముల ననుభవించుచు ఏడు రాత్రుల వరకు ఉండుడు.

అంత వైవస్వత మన్వంతరము ప్రారంభమున మరల మీరు కశ్యప ప్రజాపతికి పుత్రులగుదురు. దేవత లందరకును, బుద్ధి మంతుడగు గరుత్మంతునకును జ్ఞాతులుగా పుట్టుదురు.

అప్పుడు నీ సంతానము అంతయు అగ్ని దేవునకు భోజన మగును. నీకీ శాపము తగులదు. సంశయము లేదు.

క్రూరులు, చెడ్డ బుద్ధి గలవారు మీలో నుందురేని వారికి వినాశము తప్పదు. తిండి వేలకు దొరికిన మనుజులను, అపకారము చేసిన వారిని మాత్రము తిను చుండుడు.

మంత్రములతో ఒషదులతో, గరుడ సంబంధమైన మండలములతో తిరుగు మానవులకు మీలో దుష్టులు చిక్కి పోవుదురు. వారి వలన మాత్రము మీరు భయముతో తిరుగుడు. ఇతర విధముల మీరు చింతింపబని లేదు. అట్లు గానిచో మీకు వినాశము తప్పదు.

బ్రహ్మ ఇట్లు పలుకగా ఆ నాగు లందఱు క్ష్మాతల మను చోటి కరిగిరి. అందు విలాసముగా నివసించుచు నిండైన భోగము లనుభవించుచు నిలిచిరి.

ఇట్లు బ్రహ్మ వలన వారు శాప మంది పిదప అనుగ్రహమును సంపాదించి మోదము గల భావములతో పాతాళ లోకమున నివసించిరి.

ఆ మహాత్ముల ఈ కథ యంతయు పంచమి నాడు జరిగెను. అందు అలన ఈ తిథి పుణ్య వంతమైనది. సర్వ పాపములను హరించునది, శుభ ప్రదమైనది.

ఈ తిథి యందు నియమము గలవాడు పులుపు పరిహరింప వలయును. నాగులను పాలతో అభిషేకింప వలయును. అట్లయినచో వారికి మిత్రము లగుదురు.