అధ్యాయము - 97

ధరిణి:

ధరిణి:

ప్రభూ! సత్య తపుడను వాడు మొదట బోయ అయి, తరువాత బ్రహ్మణుడై ప్రకాశించెను, అతడు తన శక్తి మేరకు ఆరుణి అను వానిని పెద్దపులి భయము వలన కాపాడెను. దుర్వాసుడు ఉపదేశింపగా హిమ వత్పర్వతపు ఉత్తర దిశ కరిగెను. అందొక గొప్ప వింత జరిగెనని నీవు చెప్పితివి. అది ఎట్టిది? చాల వేడుకగా నున్నది. నాకు దానిని చెప్పుము.

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

ఆ సత్యతపుడు పూర్వము భృగు వంశమున పుట్టిన బ్రాహ్మణుడు, క్రూరుల సంసర్గము వలన బోయ వాడుగా పుట్టెను.

అంత పెద్ద కాలమునకు ఋషుల చెలిమి వలన మరల బ్రాహ్మణు డాయెను. దుర్వాసుని బోధ వలన మరింత ప్రకాశించెను.

హిమగిరి ఉత్తర పాదమున పుష్పభద్ర అను మంచి నది కలదు. దాని యొడ్డున ఒక దివ్య శిల కలదు. దాని పేరు చిత్రశిల.

అక్కడ ఒక గొప్ప మఱిచెట్టు భద్ర మహావట మనునది కలదు. అందా సత్య తపుడు తపస్సు చేయుచు మహాతాపసు డాయెను.

అతడొక నాడు గొడ్డలితో సమిధలు కోయుచు ఎడమ చేతి చూపుడు వ్రేలిని నరకు కొనెను.

తెగిన వ్రేలి నుండి భస్మపు పొడి ఏర్పడిన దట. రక్తము, మాంసము, క్రొవ్వు ఏదియు కాన రాలేదు.

అతడు లెక్క పెట్టక మరట సమిధలు కొట్టు చుండెను. మరల అట్లే భస్మము కారుచు కన్పట్టెను. వ్రేలు అతుకు కొని మునుపటి వలె ఆయెను.

ఆ భద్ర వటమున ఒక కిన్నర మిథునము కలదు. రాత్రి నిద్రించి యుండెను. ఆ ఋషికి సంబంధించిన అద్భుతమును చూచి తెల్లవారిన పిదప ఇంద్ర లోకమున కరిగెను.

అంత ఇంద్రునితో పాటు దేవత లందరు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఏదేని మును పెన్నడు మహాశ్చర్యము కలిగెనా చెప్పుడని అడిగిరి.

అంత రుద్ర సరస్సు ఒడ్డున ఉండు ఈ కిన్నరుల జంట ఇట్లు పలికెను.

హిమ వత్పర్వతమున పుష్ప భద్రానది యొడ్డున మేమొక మహాశ్చర్యమును చూచితి మని వారు పలికిరి.

సత్య తపసుని వృత్తాంతము, చేతి నుండి భస్మము వెలికి వచ్చుట అను దానిని వివరించి చెప్పిరి.

అది విని ఇంద్రుడు అచ్చెరు వంది విష్ణువుతో ఇట్లనెను. విష్ణూ! రమ్ము, హిమ వత్పర్వతము వైవు వెళ్లుదము. అక్కడ ఒక మహాశ్చర్యము సంభవించి నదట. కిన్నరుడు చెప్పెను.

ఇట్లు పలుకగా విష్ణువు వరాహ మాయెను. ఇంద్రుడు వేటకాడై వారిరువురు ఆ ఋషికడ కరిగిరి.

విష్ణువు పంది రూపముతో ఋషి కంటబడి నిలిచెను. కనపడియు కనబడక మరల కనబడుచు ఉండెను.

ఇంతలో ఇంద్రుడు విల్లు చేపట్టి వాడి బాణములు తాల్చి వచ్చి సత్య తపర్షితో ఇట్లనెను.

మహామునీ! దొడ్డదొరా! ఇచట ఒక బలిసిన పెద్ద పందిని చూచితివా? దానిని నావారి పోషణకై చంపెదను.

ఇట్లు పలుకగా, ధరణీ! ఆ ముని యిట్లు తలపోసెను. ఈతనికి ఆ పందిని చూపితినా దానిని వీడు చంపును. చూప కుందునా, ఆకలితో వీని కుంటుంబము నిస్సంశయముగా నశించును. పెండ్లము బిడ్డలతో వీడు మిక్కలి ఆకలితో నున్నాడు.

బాణము తగిలిన పంది నా ఆశ్రమమును చేరుకొనినది. ఇట్టి స్థితిలో నేనేమి చేయుదును? అని ఆ ముని చింతించుచు నిశ్చయము పొంద కుండెను. క్షణములో ఆతని కొక ఊహ తోచెను.

ప్రాణము కలవారికి చూచుటకు కంటిని, పలుకుటకు నాలుకను భగవంతుడు ఏర్పరచెను. వేటకాడు వదలిన దానిని చూచిన కంటికి పలుక గల నాలుక లేదు. పలికెడు నాలుకకు చూచు కన్ను లేదు.

ఇది విని ఆ ఇంద్రుడు, విష్ణువును, సంతోషించి తమ నిజ రూపమును చూపిరి. మేము సంతసించితిమి. నీవొక కోరిక కోరు కొనుము. అనియు పలికిరి.

అది విని సత్యతపుడు ఇట్లనెను. దేవులారా! ఈ వరమే నాకు చాలును. నేను ధన్యుడను. దేవదేవు లిరువురు నాముందు కాన వచ్చితిరి. భూమిపై ఇంతకు మించిన వర మేముండును?

అయినను పండుగ దినములలో ఒక నెల ఈ కథను విప్రులకు భక్తితో వినిపించినచో విప్రుల ప్రోగువడిన పాప మంతయు నశించు గాక. ఇది నేను కోరు ఒక వరము.

నేను ముక్తి పొంద వలయును. ఇది రెండవ వరము. అని పలుకగా ఆ దేవు లిరువురు అట్లే అని ఆతనికా శుభమైన వరము నొసగి అదృశ్యులైరి. అతడును వరములు పొంది ఆ ఆశ్రమమున నుండి హృదయమున బ్రహ్మ భూతుడాయెను.

అట్లు నెరవేరిన ప్రయోజనము గల ఆ మహాముని ఆ దేశమున ఉండగా ఆతని గురువు ఆరుణి అతనికి కానవచ్చెను.

ఆ ఆరుణి భూమి నంతయు తీర్థ యాత్రలకై చుట్టి వచ్చెను. ఆ ముని పుంగవుని ఈతడు పాద్యము, ఆచమనము, గోదానము మున్నగు వానితో మహాభక్తితో పూజించెను. ఆ ఆతడును ఆసనమును స్వీకరించి యుండెను.

ఆతడును ఆ శిష్యుడు తపస్సు చేత కాలిన పాపములు గల సిద్ధుడని ఎరిగి, ఎదురుగా చేతులు మోడ్చి వినయముతో నిలిచి యున్న ఆతనితో నిట్లనెను.

ఆరుణి :

ఆరుణి :

బిడ్డా! తపస్సు చేత సిద్ధుడ వయితివి. బ్రహ్మ భూతుడ వయితివి. ఇప్పుడు నీకు ముక్తి కాలము చేకూరినది.

లే, రా! నాతో కలసి పరమ పదమునకు రమ్ము. అచటకు పోయినచో నీకు మరల జన్మము కలుగ దనుటకు సంశయము లేదు.

ఇట్లు పలికిన పిమ్మట ఆ సిద్ధు లిరువురు సత్య తపుడును, ఆరుణియు నారాయణ దేవుని ధ్యానించి తమ దేహములతో స్వర్గమున కరిగిరి.

ఈ విస్తరమైన పర్వా ధ్యయమున ఒక్క నాలుగవ భాగము నైనను చదువు వాడు, వినిపించు వాడు గయ కరిగి పితృ దేవతలను పూజించిన ఫలమును పొందును.