వరాహ మహా పురాణము
అధ్యాయము - 102
హోత:
హోత:
అట్లే చక్కెర ధేనువును గూర్చి ఉన్న దున్నట్లు చెప్పెదను. రాజా! వినుము. అలికిన నేలపై లేడి చర్మము, దర్భాసనము నుంచి నాలుగు బారువుల చక్కెరతో ఆవును చేయ వలయును. అది ఉత్తమ పద్ధతి. అందు నాలుగవ వంతు చక్కెరతో దూడను నిర్మింప వలయును. అందులో సగము మధ్యమము, ఒక బారువుతో నైనచో చివరి పద్ధతి. దాని ప్రకారమే నాల్గవ వంతు భాగముతో దూడను చేయ వలయును.
ఆవు ఎత్తు ఎనిమిది వందల అంగుళ ములుండ వలయును. లేదా శక్తిని బట్టి చేయింప వలయును. తన్ను తాను బాధ పెట్టుకొన రాదు.
నాలుగు దిక్కు లందును అన్ని విధములైన విత్తనములను ఉంచ వలయును. ఆ ఆవునకు బంగారు ముఖము కొమ్ములు, ముత్యాల కన్నులు ఏర్పరుప వలయును.
బెల్లముతో ముఖమును, పిండితో నాలుకను, గంగడోలును పట్ట సూత్రము, కంఠా భరణమును కూర్ప వలయును.
చెరకు గడల పాదములు, వెండి గిట్టలు, వెన్నతో పొదుగు, చక్కని ఆకులతో చెవులు, తెల్లని చామరములు అలంకరాములు, అయిదు రత్నములు మొదలగు వానితో ఆ ఆవును నిర్మించి పైన వస్త్రములను కప్ప వలయును.
దానిని గంధములతో పూవులతో అలంకరించి, కుటుంబము కలవాడు, వేదము చక్కగా చదివిన వాడు, దరిద్రుడు, మంచి నడవడి కలవాడు, బుద్ధిశాలి, వేద వేదాంగము లను చక్కగా తెలిసిన వాడు, నిత్యాగ్ని హోత్ర అర్చన కలవాడు, దుష్టత లేనివాడు, అగు బ్రాహ్మణునకు ఒసగ వలయును. ఇతరులను చూచి కుళ్లుకొను వానికి ఈరాదు.
అయనము లందు, విషువము నందు, పుణ్య తిథి యందు, వ్యతీపాత యోగమున్న దినమునను (పూర్ణిమ సోమ వారముల కలయిక రోజు) అమావాస్య యందును ఈ పుణ్య దినము లందు కాని ఎప్పుడైనను కాని ఈ దానము చేయ వలయును.
మంచి యోగ్యత గల శ్రోత్రియ బ్రాహ్మణుడు ఇంటికి రాగా అట్టి వాని కీయ వలయును. దాత తూర్పునకు గాని, ఉత్తరమునకు గాని మొగము పెట్టి ఆవుతోక దగ్గర కూర్చుండ వలయును. ఆవును తూర్పు ముఖముగా, దూడను ఉత్తర ముఖముగా నిలుప వలయును.
దాన కాలము నందు చదువ వలసిన మంత్రములను చదివి సమర్పింప వలయును. విధి ప్రకారము విప్రుని ఉంగరముతో, కర్ణ భూషణములతో పూజింప వలయును. తన శక్తి ననుసరించి దక్షిణ నొసగ వలయును. విత్తశాఠ్యమును విడువ వలయును (ధనము విషయములో వంచన పనికి రాదు. సమర్థుడై తక్కువ ఇచ్చుట, శక్తిలేని యెడల ఎక్కువ ఇచ్చుటకు ప్రయత్నించుట విత్త శాఠ్యము) చేతి యందు దక్షిణ నుంచి గంధమును, పూవులను ధేనువును సమర్పింప వలయును. ఇచ్చు నపుడు పుచ్చు కొనువాని ముఖమును చూడ రాదు.
ఒక దినము చక్కెర భోజనముతో ఉండ వలయును. పుచ్చుకొన్న బ్రాహ్మణుడు మూడు దినములు చక్కెర భోజనముతో గడుప వలయును. ఆ ధేనువు సర్వ పాపములను హరించుచు. అన్ని కోరికలను ప్రాసాదించును. ఆ దాత అన్ని కోరికలు తీరిన వాడగును. ఇందు సంశయము లేదు.
నరుడు ప్రళయ కాల పర్యంతము విష్ణు లోకమున నుండును. తన పితరులను, తల్లివైపు వారితో పాటు తరింప జేయును. తన్ను విష్ణువులో లీనము చేసికొనును. సంశయము లేదు.
ఆవు నిచ్చు చుండగా చూచు వారును పరమ గతి కరుగుదురు. దీనిని భక్తితో విన్న వాడును, చదువు వాడును సర్వ పాపముల వలన ముక్తుడై విష్ణు లోకమున కరుగును.