అధ్యాయము - 127

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

ఓ వసుంధరా! ఇప్పుడు క్షత్రియునకు సంబంధించిన దీక్షను గూర్చి చెప్పెదను. వినుము ఆతడు ముందు నేర్చుకొన్న ఆయుధముల నన్నింటిని వదలి వేయ వలయును. పిమ్మట ఆతనికి ముందు చెప్పిన మంత్రముతో దీక్షనొసగ వలయును.

నేను మునుపు చెప్పిన వస్తువుల నన్నింటిని, చెప్పబోవు వానిని విడచి, కూర్చుకొన వలయును.

నల్ల జింక చర్మమును, మోదుగ కర్రను ఈ దీక్ష యందు ఎన్నటికిని ఉపయోగింప రాదు.

నల్లని గొఱ్ఱె చర్మమును, మఱ్ఱి చెట్టు దండమును ఈ దీక్ష కొరకు కూర్చుకొన వలయును.

పండ్రెండు మూరల చదరపు స్థలమును ఏర్పరచుకొని చక్కగా అలువ వలయును. పిదప నేను మునుపు చెప్పిన విధానముల నన్నింటిని చేయ వలయును.

ఇట్లు దీక్షను పొందెడు క్షత్రియుడు విధాన మంతయు కావించి నన్నే శరణు పొందుచు ఈ మంత్రమును పఠింప వలయును.

మంత్రము:

విష్ణూ! నేను ఆయుధముల నన్నింటిని వదలి వైచితిని. క్షత్రియ కర్మమును వదలితిని. అన్నియు వదలి విష్ణు దేవుడవైన నిన్ను చేరుకొంటిని. ఇటుపై నన్ను సంసారము కొరకు, మరియొక జన్మము కొరకును పుట్టింపకుము.

ఇట్లు పలికి క్షత్రియుడు నా ప్రక్కను ఉండి నా రెండు పాదములను పట్టుకొని యీ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

దేవదేవా! నేను ఆయుధమును ముట్టను. పరులను గూర్చి చెడు మాటలను పలుకను. సంసారము నుండి ముక్తి కలిగించు కర్మమును, నీవు వరాహ రూపుడవై ఉపదేశించిన ప్రకారము ఆచరింతును.

ఇట్లు అచట పలికి పెక్కు విధములగు గంధములను, ధూపములను మున్ను చెప్పిన విధముగా సమర్పింప వలయును.

భూమి! అటుపై ఆతడు అదే విధముగా పరిశుద్దులగు భాగవతులకు అన్నమిడ వలయును.

దేవీ! క్షత్రియుడు ఉత్తమ సిద్దిని కోరునేని నా అనుగ్రహముతో ఇట్టి దీక్షను సంసార ముక్తికై పొంద వలయును.

సుందరీ! వైశ్యునకు దీక్ష యెట్టిదో చెప్పెదను. వినుము.

మూడవ వర్ణమున నున్న వ్యక్తి, నా పూజ యందు శ్రద్ద కల వాడునగు వైశ్యుడు సిద్దిని పొందుటకై వైశ్య కర్మములను విడనాడ వలయును.

నేను మునుపు తెలిపిన వస్తువుల నన్నింటిని కూర్చుకొన వలయును. ఇరువది మూరల మేర అలికి మునుపటి వలెనే చేయ వలయును. పసుపు వన్నె గొఱ్ఱె చర్మము నందు పరప వలయును.

మేడిచెట్టు కర్రను కుడిచేత పట్టుకొని పవిత్రులగు భాగవతులకు మూడు మారులు ప్రదక్షిణ నమస్కారము గావింప వలయును. మోకాళ్ళపై నిలబడి ఈ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

నేను వైశ్యుడను తమ కడ కరు దెంచితిని. వైశ్య జాతి కర్మముల నన్నింటిని వదలి వైచితిని. భగవంతుని ప్రసాదము వలన దీక్ష నాకు లభించినది. ప్రసన్నులై నాకు సంసార మోక్షమును దయ సేయుడు.

ఈ విధముగా నన్ను గూర్చి పలికి నా అనుగ్రహమును పొంది గురువు పాదములను పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

నేను వ్యవసాయము, గోపాలనము, వాణిజ్యము కొనుగోలు, అమ్మకము అను వానిని వదలి వైచి నీ దయ వలన కోరిన విష్ణు దీక్షను పొందితిని.

ముందు భాగవతులకు, పిదప దేవునకు మ్రొక్కులు చెల్లించి ఏ దోషమును లేని విధముగా భోజనము పెట్ట వలయును.

నా మార్గము ననుసరించు వైశ్యులకు ఇది దీక్షా విధానము. దీనితో ఆతడు ఘోరమగు సంసారము నుండి ముక్తి పొందును.

నా భక్తుడగు శూద్రునకు దీక్ష యెట్టిదియో చెప్పెదను. ఇది పొందిన ఆతడు అన్ని పాపముల నుండియు విముక్తి పొందును.

నేను ముందు చెప్పిన విధముగా అన్ని వస్తువులను, అన్ని సంస్కారములను దీక్షను కోరెడు శూద్రుని కొరకు కూర్ప వలయును.

ఏడు మూరల నేలను ఆవు పేడతో ఆలికి స్థండిలమును ఏయ వలయును. నల్లని గొఱ్ఱె చర్మముతో ఆతని అంగముల నన్నింటిని కప్ప వలయును. ఖదిర వృక్షపు దండమును గురువు ఆతనికి కూర్ప వలయును.

ఇట్లు దీక్షకు సంబంధించిన వస్తువుల నన్నింటిని తగు విధముగా తెచ్చుకొని నన్నే శరణు పొందుచు ఈక్రింది మంత్రములను పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

నేను శూద్రుడను. శూద్ర కర్మముల నన్నింటిని వదలు చున్నాను. మునుపు శూద్ర కర్మములను చేయుచు తినరాని వస్తువులను తినెడి వాడను. ఆ తిండిని కూడ వదలి వేయు చున్నాను.

ఆ తిండి మొదలగు దాని నంతటిని వదలి వేయ గోరుచున్నాను. ఇటుపై విష్ణుని ఆరాధనమునే చేయుదును. దేవా! చూడు. నేను శూద్రుడను. గురువు దయ వలన నిన్ను సర్వభావముతో చేరు కొంటిని.

దీక్షను పొందెడు శూద్రుడిట్లు పలుక వలయును. అతడు పాపము లన్నింటి నుండి విముక్తు డగును. జ్ఞానము పొందును. ఆశ లుడిగిన వాడగును.

తరువాత గురువు పాదములను రెండింటిని పట్టుకొని అతని దయపొంద గోరుచు ఈ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

గురుదేవా! విష్ణువు ప్రసాదము వలన రహస్యమైన దీక్షను సంసార ముక్తి కొరకు నేను పొందితిని. దాని కనుగుణ మగు కర్మమునే ఆచరింతును. నా యందు ప్రసన్నడవు కమ్ము.

ఇట్లు మంత్రమును పలికి నాలుగు మారులు ప్రదక్షిణము చేసి మరల తగు విధములుగా అభివాదన మాచరింప వలయును.

పిదప గంధములతో, మాలలతో అర్చనము గావింప వలయును. మనసులో ఏ చెడు భావములు లేకుండ భోజనము సమర్పింప వలయును.

శూద్రులకు దీక్ష యిట్టిది. ఉపచారము (సేవ) ఈ విధ మైనది. నాలుగు వర్ణముల వారికి దుఃఖ రూపమైన సంసారము నుండి ముక్తి కలిగించు దీక్షను గూర్చి తెలిపితిని.

వసుంధరా! నీకు మరియొక విషయమును తెలిపెదను వినుము. నాలుగు వర్ణముల వారికి గొడుగుల నొసగు విధానమును గూర్చి చెప్పెసదను.

బ్రాహ్మణునకు తెల్లనిది, క్షత్రియునకు ఎర్రనిది, వైశ్యునకు పచ్చనిది, శూద్రునకు నల్లనిది యగు గొడుగు నొసగ వలయును.

సూతుడు:

సూతుడు:

నిర్మములగు వ్రతములు గల ఆ భూదేవి నాలుగు వర్ణముల వారి దీక్షలను గూర్చి విని వరాహ రూపుడగు దేవునితో ఇట్లు పలికెను.

ధరణి:

ధరణి:

కేశవా! నాలుగు వర్ణముల వారికి సంబంధించిన దీక్షలను గూర్చి వింటిని. నీ పూజల యందు శ్రద్ధ కల ఆ దీక్షితులకు కర్తవ్య మెట్టిది?

అంత భూమి పలుకులు విని మేఘ దుందుభి నాదము వంటి కంఠ ధ్వని గల వరాహ రూప దేవుడు భూమితో ఇట్లు పలికెను.

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

కల్యాణీ! నీవు నన్నడిగిన దానికి నిజమైన సమాధానము చెప్పెదను. వినుము. దీక్ష పొందిన వ్యక్తి నన్ను, గుహ్యమైన గణాంతికమును భావించు చుండ వలయును.

నారాయణుని పలుకు విని దోషము లేని వ్రతములు గల ధరణి మిక్కిలిగా సంతోషముతో ఉప్పొంగిన హృదయము కలది యాయెను. గొప్ప శక్తిగల ధర్మమును విన్న భాగవత శ్రేష్ఠ యగు ఆమె భక్తుల యందును, భక్తులు కాని వారి యందును వాత్సల్యము కలదియై చేతులు మోడ్చి నారాయణునితో మరల ఇట్లు పలికెను.

ధరణి:

దేవీ! నీవు నన్నడిగిన దానికి సరియైన సమాధానము చెప్పెదను. నా భక్తి కర్మమున శ్రద్ధ కలవాడు నన్నెట్లు భావింప వలయునో తెలియ జెప్పెదను.

ఇది భగవంతుని కుడి పద్మము నుండి వెలువడి నది. దీని పేరు ‘గణాంతిక’. మిక్కిలి గుట్టుగా ఉంచ దగిన దీనిని మానువుడు భావించు చుండ వలయును.

శాస్త్రము చూపిన విధానమును బట్టి పరిశుద్ధుడై దీక్ష గొన్న వ్యక్తి దీనిని మంత్ర విధితో గ్రహింప వలయును.

భగవంతుని యందు భక్తి కలిగి ఈ గణాంతిక దీక్షను కైకొన్న వ్యక్తి జనుల దర్శనమును, స్పర్శను, ముఖ్యముగా ఎడమ చేతి స్పర్శను పొందినచో అతనికి ధర్మము కలుగదు.

అట్టవాడు దీక్షితుడుగా చెప్ప బడును.

మంత్రము చేత పవిత్రమైన ఈ గణాంతిక దీక్షను సాధారణ బుద్ధితో గ్రహించిన వానికి అది అసుర (రాక్షస సంబంధమైన) దీక్ష అగును. అట్టివాడు నా ధర్మమున ప్రవర్తించు వాడు కాడు.

ఈ గణాంతిక దీక్షను గ్రహించి ఎవనికి తెలియ రాకుండ భావించు చుండు మేధావి వేయి జన్మములలో నన్ను భావించు వాడగును.

ఈ మంత్రమును గ్రహించు విధానమును, శిష్యున కొసగు విధానమును లోక సుఖము కొరకు వివరించి చెప్పెదను. భూదేవీ! దానిని వినుము.

కార్తీకము, మార్గశిరము, వైశాఖము నెలలో శుక్లపక్ష ద్వాదశి నాడు మూడు రోజులు మాంసము లేని భోజనము తీసికొని ధర్మము నిర్ణయించిన ఈ గణాంతిక దీక్షను మంత్ర పూర్వకముగా గ్రహింప వలయును.

నా ముందు అగ్ని హోత్రమును ప్రజ్వలింప జేసి దర్భలతో సంస్తరణము నేర్పరచి గణాంతికను దానిపై నిలుప వలయును. (సంస్తరణము = వెడల్పుగా పరచుట) అంత శిష్యుడును గురువును శుచిగా దీక్షితులై ‘‘ఓం నమో నారాయణాయ’’ అనుచు ఈ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

మొదట లోకపితా మహుడు, బ్రహ్మణ్య దేవుడు, భవోద్భవుడు అగు బ్రహ్మ నారాయణుని కుడి భాగము నుండి పుట్టిన దీనిని ధరించెను. అట్టి వశ్యము, అమృతము అయిన దీనిని మేము గ్రహించు చున్నాము.

పిదప ఈ మంత్రముతో గురువు మరల ‘గణాంతిక’ ను గ్రహించి శిష్యున కొసగుచు మరల ఈ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

శిష్యా! నారాయణుని కుడి వైపున జనించిన ఈ దేవిని ప్రతిజ్ఞ చేసి కైకొనుము. ఎల్లప్పుడు దీని భావన యందు శ్రద్ధ కలవాడ వగుము. దీనిని భావించిన వాడు మరల సంసారమున పుట్టడు.

ధరణి:

ధరణి:

మాధవా! స్నానము మొదలగు కార్యము లందు చేయ దగిన విధి ఏమి? అలంకరణమును ఏ మంత్రముతో చేయ వలయును? నీ పనుల యందు శ్రద్ధా సక్తులు కలవాడు ఇతర కార్యములు చేయ కున్నను ముక్తి పొందును కదా!

లోక నాథుడగు జనార్దనుడు భూదేవి పలుకు విని ధర్మముతో కూడిన పలుకుతో వసుంధర కిట్లు బదులు చెప్పెను.

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

దేవీ! నీవు నన్నడిగిన దానికి యథార్థమైన సమాధానము చెప్పెదను. ఈ కర్మము నందు స్నానము, ఉపచారములు ఎట్లు చేయుదురో వివరించెదను.

ఉపచారములు, స్నాన క్రియలు అను వానిని ముగించిన వ్యక్తి దువ్వెన, కాటుక, అద్దము మున్నగు వానిని ఆయా మంత్రములతో కూర్చుకొన వలయును.

నా అంగముల నన్నింటిని పట్టు వస్త్రముతో కప్పి కాటుకను, దువ్వెనను ఉపయోగింప వలయును.

పిదప మోకాళ్లపై కూర్చుండి శ్రద్ధ కలవాడై దువ్వెనను మోడ్చిన చేతులతో పట్టుకొని ఈ మంత్రమును పలుక వలయును.

మంత్రము:

మంత్రము:

నారాయణ! దేవా! దయ చూడు. ఇదిగో దోసిలి. ఇదిగో దువ్వెన. దీనితో నీ శిరస్సును చక్కదిద్దు కొనుము. మహానుభావము లైన మీ కన్నులను సర్వ లోకములును చూచును. ఓ లోకప్రభూ! లోకప్రధానా! ఈ కాటుకను కన్నులకు పెట్టు కొనుము. దయ జూడుము. గ్రహింపుము. గ్రహింపుము. నన్ను మంచి భావముతో చూడుము.

పిదప ‘నమో నారాయణాయ’ అని పలికి ఈ మంత్రమును పఠింప వలయును.

మంత్రము:

మంత్రము:

మాధవా! నీ దయ వలనను, గురువు దయ వలనను, నేనీ మంత్ర పూజ గల గణాంతిక దీక్షను పొందితిని. నాకు ఎన్నటికిని అధర్మము కలుగ కుండు గాక.

ఈ విధముగా దీక్షితుడై నా పూజా విధానములను గురువుతో కూడి గ్రహించు వాడు నా లోకమున కరుగును.

మంచి నడవడి లేని శిష్యునకు, క్రూరునకు, మొండి వానికి ఈ దీక్ష నొసగ రాదు. ఉత్తమ శిష్యుని చేతుల యందే ఈ గణాంతిక కర్మమును సమర్పింప వలయును.

ఇది శుభములతో కూడినది. శుభమైనది. సిద్ధి కలిగించునది. భక్తుని సంసారము నుండి విముక్తి చేయునది. దీని పరిమాణమును చెప్పెదను. ఓ మాధవీ! వినుము.

నూరు గింజల మాల ఉత్తమ మైనది. ఏబదింటితో అయినది మధ్యమము. ఇరువది అయిందిటితో అయినది తక్కువది. ఈ విధముగా కొలత నిర్ణయింప. బడినది.

రుద్రాక్షలతో చేసిన మాల ఉత్తమ మైనది. పుత్ర జీవకములతో చేసినది మధ్యమము. అష్టకములతో గ్రుచ్చినది అధమ. దేవీ! దీనిని నీకు చెప్పితిని.

సర్వ లోకములకు మేలు చేయు నదియు, శుద్ధ అయినదియు, మోక్ష మందు కోరిక పుట్టించు నదియునగు ఈ గణాంతిక దీక్షను నూరు జన్మముల కైనను ఎవ్వడును తెలియ జాలడు.

దీనిని ఎంగిలితో తాకరాదు. స్త్రీ చేతి యందు ఉంచ రాదు. పరమ గతిని కోరువాడు దీనిని మిక్కిలి ఎత్తున నిలుప వలయును.

ఇది రహస్యములలో మిక్కిలి రహస్య మైనది. సంధ్యా కాలముల యందు ఉపాసింప దగినది. ఈ మంత్రము మిక్కిలిగా పూజింప దగినది. జపింప దగినది.

ఈ గణాన్తికను విధి పూర్వకముగా పాలింప వలయును. అట్లు చేసిన నాభక్తుడు మిక్కిలి శుద్ధుడై నా లోకమున కరుగును.

రత్నముల అలంకారములు గల భూదేవి విష్ణువు వాక్కును విని లోకనాథుడు, మహా శక్తిశాలి అయిన పరమ పురుషునితో మరల ఇట్లు పలికెను.

ప్రభూ! మాధవా! నీకు అద్దము నెట్లు పట్ట వలయును. ఎట్లు పట్టినచో నీ నిజ రూపమును చూచుకొని తృప్తినంది భక్తుని భావనల కందుదువు?

భూదేవి పలుకు విని శ్రీ వరాహ దేవుడు ఇట్లు పలికెను. దేవీ! నాకు అద్దము చూపుట యెట్లో ఉన్న దున్నట్లు తెలిపెదను. వినుము.

‘‘నమో నారాయణాయ’’ నారాయణ దేవునకు నమస్సు అనుచు ఈ మంత్రమును పఠింప వలయును.

మంత్రము:

మంత్రము:

దేవా! నీ పూజల యందు శ్రద్ధగల భాగవతు లందరు శ్రేష్ఠులు. స్వామీ! ఇవిగో నీ అంగములు. అన్ని లోకములలో ముఖ్యమైన నీ ముఖము చంద్రుని సూర్యుని వెలుగులు గల కన్నులు. ఇదిగో లోక నాథుడవగు నీకు అద్దము. అన్ని వైపుల నుండియు నీ స్వరూపమే అయిన జగత్తును దర్శింపుము.

నా పూజా కర్మము నందు శ్రద్ధ కలవాడు ఈ విధానముతో నా కర్మములను ఆచరించినచో ఆతని ఏడు తరముల బంధువులు తరింతురు.

భూమీ! ఈ మంత్రముతో ఈ విధమగు ఉపచారముతో ఆనందము, తృప్తి కలవాడు, పరమ గతిని కోరినచో, చేయ వలయును.