వరాహ మహా పురాణము
అధ్యాయము - 70
భద్రాశ్వుడు:
భద్రాశ్వుడు:
మునీ! నీవు ఆ అద్భుత లోకమును గాంచుటకు ఏ వ్రతమును, ఎట్టి తపమును, ఏ ధర్మమును చేసితివి?
అగస్త్యుడు:
అగస్త్యుడు:
హరి నారాధింపక లోకములను కోరెడు బుధుడెవ్వ డుండును? హరి నారాధించి నచో సర్వ లోకములు అరచేతి యందుండును.
ఇట్లని చక్కగా ఆలోచించి నేను నూరేండ్లు గొప్ప దక్షిణలు గల యజ్ఞములతో సనాతనుడగు విష్ణుని ఆరాధించితిని.
అంత నొకప్పుడు పెక్కు కాలము నేను యజ్ఞమూర్తి, దేవ దేవుడు నగు జనార్దనుని ఆరాధించు చుండగా నా పిలుపు మేరకు దేవేంద్రునితో పాటుగ దేవతలు విచ్చేసిరి.
దేవేంద్రునితో పాటు దేవత లందరు తమతమ స్థానము లందుండగా అంతలో అచటికి భగవంతుడు వృషభ ధ్వజుడు (శివుడు) ఏతెంచెను.
మహాదేవుడు, విరూపాక్షుడు, ముక్కంటి, నీల లోహితుడు అగు పరమేశ్వరుడు రౌద్ర స్థానమున నిలిచి యుండెను.
దేవతలు, ఋషి ముఖ్యులు మొదలగు వారందరు రాగా వారిని గాంచి మహా యోగియు, త్రికాలజ్ఞుడు, పద్మ సంభవుడునగు సనత్కుమారుడు సూర్యుని వంటి విమానమున చిన్న రేణువు వంటి ఆకారముతో నిలిచి కాన వచ్చెను.
వచ్చి ఆ మహాముని రుద్రునకు తలతో ప్రణమిల్లెను. నేను ప్రణామము చేయగా శూలపాణి సమీపమున నిలిచి యుండెను.
అట్లు వచ్చి యున్న దేవతలను, నారదుడు మున్నగు ఋషులను, సతన్కుమారుని, రుద్రుని చూచిన నా మనసున ఒక ప్రశ్న యుదయించెను.
వీరిలో ఎవరు పూజింప దగిన వారు? ఎవడు అందరి కంటె గొప్పవాడు? ఎవడు తుష్టి నందినచో ఈ రుద్రునితో కూడిన సర్వులును తుష్టి నందుదురు?
ఇట్టి భావము నా హృదయములో కలుగగా నేను, దేవతలారా! మీకు వీరిలో పూజనీయు డెవ్వడు? అని రుద్రుని వైపు తిరిగి అడిగితిని.
నేనిట్లు పలుకగా అంత రుద్రుడు దేవతల యెదుట నాతో నిట్లనెను.
రుద్రుడు:
రుద్రుడు:
దేవతలారా! నిర్మలులైన దేవర్షులారా! ప్రసిద్ధి కెక్కిన బ్రహ్మర్షులారా! మీరందరు నా మాట నాలకింపుడు. ఓ మహామతీ! అగస్త్యా ! నీవు కూడ నా మాట వినుము.
ఎవ్వడు సర్వ యజ్ఞములచే యజింప బడునో, ఎవని వలన ఈ జగమంతయు, దేవతలతో పాటుగా పుట్టు చున్నదో, ఎల్లప్పుడు ఎవని యందు నిలిచి యుండునో, ఎవని యందు లీనమగు చున్నదో ఆ పరదైవము సత్వ రూపుడు, జనార్దనుడును నగు నారాయణుడే. ఆ పరమేశ్వరుడే తన్నుదాను మూడు రూపములుగా సృష్టి చేసెను.
రజస్సు తమస్సులతో కూడిన వాడై ఆ విభుడు రజః సత్వము లధికముగా గల బ్రహ్మను, కమలము ఆసనముగా గల వానిని బొడ్డు తామర యందు సృజించెను.
రజస్సుతో, తమస్సుతో కూడిన వాడై ఆతడే నన్నును పుట్టించెను. సత్వ గుణమే ఆ హరి. హరియే పరమ పదము.
సత్వ రజస్సుల స్వరూపమై కమలము నందు పుట్టిన బ్రహ్మయే ఆ దైవము. ఆ దేవుడే బ్రహ్మ. రజ స్తమస్సులతో కూడిన స్వరూపమగు నేనును అతడే. ఇందు సందియము లేదు.
సత్వము, రజస్సు, తమస్సు, ఇది యంతయు ఈ మూడింటి సముదాయమే. సత్వ గుణము చేత జీవుడు ముక్తుడగును. సత్వము నారాయణాత్మకము.
సత్వముతో కూడిన రజో గుణము చేత రజస్సు అధికముగా గల సృష్టి ఏర్పడును. అది పితా మహుడగు బ్రహ్మకు సంబంధించినదై ఏర్పడినదని అన్ని శాస్త్రములును ఘోషించు చున్నవి.
వేదములకు వెలి అయిన కర్మము, శాస్త్రములను బట్టి చేయునది రౌద్రమని ప్రసిద్ధి కెక్కినది. అది నాకు సంబంధించినది. అని కనిష్ఠమని చెప్పుదురు. (కనిష్ఠము అన్నింటి కంటె తక్కువది - హీన మైనది.)
రజస్సు లేని కర్మము కేవలము తామసము. అది నరులకు ఇహము నందును, పరము నందును దుర్గతిని కలిగించును.
సత్వ గుణము చేత జీవికి ముక్తి కలుగును. సత్వము నారాయణాత్మకము. యజ్ఞ రూపుడగు నారాయణుడే భగవానుడు.
కృత యుగమున శుద్ధుడు, సూక్ష్మ రూపుడు నగు నారాయణుని ఉపాసింతురు. త్రేతా యుగమున యజ్ఞ రూపముతో అర్చింతురు. ద్వాపరమున పంచ రాత్రులు ఉపాసింతురు. కలి యందు నేను చూపిన మార్గముతో బహు రూపములతో తామసులు ద్వేష బుద్ధితో జనార్దనుడగు పరమాత్మను కొలుతురు.
ఆతని కంటె పరదైవము మరి యొకటి లేదు, ఉండ బోదు. ఆ విష్ణువే స్వయముగా బ్రహ్మ. ఆ బ్రహ్మయే స్వయముగా నేను.
మూడు వేదము లందును, యజ్ఞము నందును, పూజ్యత విషయమున ఇదియే నిశ్చయము. మామువ్వురిలో భేదమును భావించు వాడు పాపకారి, దుష్టాత్ముడు. వాడు దుర్గతి నందును.
అగస్త్యా! నేను చెప్పెడి దీనిని కూడ వినుము. మునుపు కలి యందు మానవులు ఎట్లు హరి భక్తి చేయ కుండిరో తెలిపెదను.
పూర్వము భూలోక వాసు లందరు జనార్దనుని పూజించి భువర్లోకమును పొందు చుండిరి. అందుండియు కేశవు నారాధించి స్వర్గమును, అచటి నుండి క్రమముగ ముక్తిని పొందు చుండిరి.
ఇట్లు సర్వ లోకముల వారును ముక్తి పదమున వ్యాపించగా అంతకు ముందు ముక్తిని పొందిన దేవత లందరు చిత్త శుద్ధితో ఆ హరిని ధ్యానించిరి.
సనాతనుడగు ఆతడును అంతట నుండు వాడు కనుక వారికి ప్రత్యక్షమై యోగి వరులారా! సురులారా! పనియేమి? చెప్పుడని పలికెను.
వారా దేవదేవునకు ప్రణమిల్లి పరమేశ్వరునితో నిట్లనిరి. దేవదేవా! జన మంతయు ముక్తి మార్గమున నిలిచి పోయినది. ఇక ఈ సృష్టి సాగుట యెట్లు? నరకము లందె వరుందురు?
వారట్లు పలుకగా వారి నుద్దేశించి జనార్దను డిట్లు పలికెను: మూడు యుగములలో పెక్కండ్రు మానవులు నన్ను పొందెదరు. చివరి యుగమున చాల తక్కువగా జనులు నన్నా శ్రయింతురు. ఇదిగో మోహమును సృజించు చున్నాను. అది జనులను మోహ పెట్టును.
మహాబాహూ! రుద్రా! నీవును మోహము గొలుపు శాస్త్రములను చేయింపుము. తక్కువ శ్రమ, ఎక్కువ ఫలమును ప్రదర్శింపుము. వంచనను, ఇంద్ర జాలములను, విరుద్ధా చారములను చూపి జనులను వెంటనే మోహ పెట్టుము.
ఇట్లు పలికి ఆ పరమేష్ఠి ఆ దేవుడు తన స్వరూపమును గుట్టు పరచెను. నన్నందరు తెలిసి కొనునట్లు చేసెను.
అది మొదలు కొని నేను రచించిన శాస్త్రము లందు లోకము ఎక్కువగా రుచి కలది ఆయెను.
వేదము ననుసరించు మార్గమును, నారాయణ దేవుని ఏక భావముతో చూచువారు ముక్తిని పొందు వారగు చున్నారు.
నన్ను, బ్రహ్మను విష్ణువు కంటె వేరుగా తలచు వారు పాప కర్ములై నరకమున కరుగుదురు.
వేద మార్గమును వదలి వైచిన వారి మోహ పెట్టుటకే నేను నయ సిద్ధాంతమను పేరు గల శాస్త్రమును చూపితిని.
ఈ పశు భావమే పాశము. అది ఎప్పుడు పతన మైనదో అప్పుడు పాశు పతమను శాస్త్రము వేదము పేరిట పుట్టును.
విప్రా! నేను వేద మూర్తిని. ఇతర శాస్త్రముల అర్థములను తర్కించు వారికి నా స్వరూపము తెలియ రాదు. అనాదియగు వేదమును వదలి నన్నెరుగ రాదు. ఓయి బ్రహ్మర్షీ! నేను విశేషముగా బ్రహ్మ జ్ఞాన సంపన్నులకు, వేదములకు మాత్రమే ఎరుగదగు వాడను.
యుగములు మూడు, విప్రా! నేను బ్రహ్మ, విష్ణువు మువ్వురము. సత్వము మొదలగు గుణములు మూడు. వేదములు మూడు, అగ్నులు మూడు, లోకములు మూడు. సంధ్యలు మూడు. వర్ణములు మూడు. సవనములును మూడు. ఈ జగత్తంతయు ఈ మూటితో బంధింప బడినది.
(యుగములు = కృత, త్రేతా, ద్వాపరములు. గుణములు = సత్త్వము, రజస్సు, తమస్సు. వేదములు = ఋక్కు, యజుస్సు, సామము. అగ్నులు = ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణ. లోకములు = భూలోకము, భువర్లోకము, స్వర్లోకము. సంధ్యలు = ప్రాతస్సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. వర్ణములు = బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములు. సవనములు = ప్రాతస్సవనము, మధ్యాహ్న సవనము, సాయం సవనము.)
బ్రహ్మర్షీ! పరుడైన నారాయణుడు, బ్రహ్మ, నేను గుణములను బట్టి మువ్వురము. కాని ప్రధానముగా ఒక్కడే. ఇట్లు కాక భిన్నముగా చూచుట మోహమే.