వరాహ మహా పురాణము
అధ్యాయము - 27
మహాతపుడు:
మహాతపుడు:
మునుపు గొప్ప బలము గల పెను రక్కసి అంధకుడను వాడు కలడు. అతడు బ్రహ్మ యిచ్చిన వరము గర్వమున దేవతల నందరిని వశ పరచు కొనెను.
అట్లు చేజిక్కించుకొని ఆతడు దేవత లందరిని మేరు పర్వతమును వదలి పోవునట్లు చేసెను. దానితో వారు అంధకుని భయముతో బ్రహ్మ దేవుని శరణు జొచ్చిరి.
అట్లు తన కడకు వచ్చిన ప్రధాన దేవతలను గాంచి బ్రహ్మ ‘దేవులారా! మీ రాకకు కారణమేమి? చెప్పుడు. ఊరకున్నారేమి’? అని పలికెను.
దేవతలు:
దేవతలు:
జగన్నాథా! మమ్ముల నందరను అంధకుడు పీడించు చున్నాడు. పితామహా! చతుర్వదనా! నీకు మ్రొక్కెదము, మమ్ము కాపాడుము.
బ్రహ్మ:
బ్రహ్మ:
దేవతలారా! నేను మిమ్ములను అంధకుని నుండి కాపాడ జాలను. భవుడు, శర్వుడు నగు మహాదేవుని శరణు వేడుదము. పదండు.
సురోత్తములారా! నేను ఆతనికి మున్ను ‘నీవు చంపరాని వాడ వగుదువు. నీ శరీరము నేలను తాక రాదు’ అని వర మిచ్చితిని.
అట్టి బలవంతుని ఒక్క రుద్రుడే చంప గలడు. కావున కైలాసమున నివసించు ప్రభువు కడ కరుగుదము.
బ్రహ్మ యట్లు పలికి దేవతలతో పాటు శివుని సన్నిధి కరిగెను. ఆతని గాంచి నంతనే రుద్రుడు ఎదురేగుట మొదలగు మర్యాదలు నెరపి జగదీశ్వరుడగు బ్రహ్మతో నిట్లు పలికెను.
శంభుడు:
శంభుడు:
పనియేమి? దేవత లందరును నాకడకు వచ్చిరి. నేను వారికేమి చేయ వలయునో శీఘ్రముగా సెలవిండు.
దేవతలు:
దేవతలు:
దేవా! బలవంతుడు, దుష్టబుద్ధి అయిన అంధకుని నుండి మమ్ము రక్షింపుము.
సురలిట్లు పరమేశ్వరునకు చెప్పుకొను చుండగనే గొప్ప సేనతో అంధకు డటకు వచ్చెను.
నాలుగు విభాగములు గల సేనతో యుద్ధమున శివుని చంప గోరియు, ఆతని భార్యయగు పార్వతిని హరింప గోరియు సాధనములతో వచ్చెను.
అట్లు ఒక్క పెట్టున వచ్చి దేవతలను, దేవేంద్రుని పీడించు చున్న ఆతనిని గాంచి దేవతలందరు ఒక్కుమ్మడిని రుద్రుని వెనుక కొరిగిరి.
రుద్రుడును వాసుకిని, తక్షకుడు, ధనంజయుడు అను సర్పములను స్మరించెను. వారికి నడుమునకు మొలత్రాడుగా కట్టు కొనెను.
నీలుడను రాక్షస రాజు ఐరావతము వంటి భయంకర రూపముతో శివుని కడకు వడివడిగా వచ్చెను.
నంది దానిని గుర్తించి ఆ దైత్యుని వీరభద్రునకు చూపెను. వీరభద్రుడును సింహ రూపము దాల్చి ఒక్క పెట్టున వానిని చంపి కాటుక వంటి కాంతి గల ఆ ఏనుగు చర్మమును చీల్చి రుద్రున కర్పించెను. ఆతడును దానిని వస్త్రముగా చేసికొనెను. అది మొదలు రుద్రుడు గజ చర్మాంబరధారి యాయెను.
అట్లు శివుడు గజ చర్మమును ధరించి పాముల నెడు భూషణములతో వెలుగులు చిమ్ము చున్నవాడై వెరపు గొలుపు త్రిశూలమును చేతదాల్చి ప్రమథ గణములతో పాటు అంధకునిపై కురికెను.
అంత దేవదానవులకు ఘోర యుద్ధ మారంభము కాగా ఇంద్రుడు మొదలగు లోక పాలకులు, కుమార స్వామియు, తక్కిన దేవతలును పోర జొచ్చిరి.
నారదు డదిగాంచి నారాయణుని కడ కరిగి కైలాసమున దేవతలకు రాక్షసులతో మహా యుద్ధము జరుగు చున్నదని చెప్పెను.
అది విని చక్రము పట్టుకొని గరుడు నెక్కి జనార్దనుడు ఆచోటికి వచ్చి దానవులతో తలపడెను.
విష్ణువు ఆదుకొన్నను దేవతలు మొగమును వ్రేలవైచి పారి పోజొచ్చిరి.
అట్లు దేవతలు దెబ్బతినగా స్వయముగా రుద్రుడు అంధకునిపై కరిగెను. గగుర్పాటు పుట్టించు పెనుపోరు సంభవించెను.
అచట ఆ దేవుడు రక్కసుని త్రిశూలముతో గ్రుచ్చెను. అట్లు పొడువగా నేలపై పడిన రక్తము నుండి లెక్క పెట్టరాని అంధకులు పుట్టిరి.
ఆ మహాశ్చర్యమును గాంచి రుద్రుడు యుద్ధమున అంధకుని త్రిశూలమున గ్రుచ్చి పట్టుకొని నాట్యమాడెను.
తక్కిన అంధకులును, పైకి లేచిన యితరులును నారాయణుని చక్రము చేత మడిసిరి.
శూలముతో గ్రుచ్చిన ఆ అంధకుని నెత్తురు తుంపురులతో పెక్కు మారులు అంతులేని అంధకులు పుట్టుకొని వచ్చిరి. అంత రుద్రుడు తీవ్ర క్రోధము తాల్చిన వాడాయెను.
ఆతని ఆ పెను కోపము చేత ముఖము నుండి జ్వాలలు వెలువడెను. ఆ జ్వాలల రూపము తాల్చి ఒక దేవి యావిర్భవించెను. ఆమెనే యోగేశ్వరి అందురు. ఒక దేవి రూపము తనంత తాను ఉద్భవించెను. అట్లే మరియొక దేవిని విష్ణువు నిర్మించెను. మరియు బ్రహ్మ, కుమారుడు, ఇంద్రుడు, యముడును శక్తి రూపములను సృజించిరి. పరమ ప్రభువగు వరాహ దేవుడు ఆ దేవికి పాతాళమును పెకలించిరి రూపమును కల్పించెను. ఆదేవి పేరు మహేశ్వరి. వారినే అష్ట మాతలు అందురు.
ఈ దేవత లిట్లు శరీర స్థితిని పొందిన విషయము నంతటిని నీకు వివరించితిని. శరీర జ్ఞాన బుద్ధితో వీరి స్వరూపములను వివరింతును.
కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము, చెడు తనము, ఇతరుల గుణముల కోర్వని తనము అనునీ యెనిమిదియు దేహమున నున్న ఆ యెనిమిది శక్తులు.
కామమును యోగీశ్వరి యనియు, క్రోధమును మాహేశ్వరి యనియు, లోభమును వైష్ణవి యనియును, మదమును బ్రహ్మాణి యనియు, మోహమును తానై పుట్టిన కౌమారి యనియు, మాత్సర్యమును ఇంద్రజ యనియు, క్రూరత్వమును యమదండ ధర అనియు, అసూయను వారాహి యనియు చెప్పుదురు.
ఈ శరీరమున నున్న కామాదుల సముదాయము మూర్తిని గొన్న విధానమును నీ కెరిగించితివి.
ఈ దేవతలు ఆ అంధకుని రక్తమును పూర్తిగా పీల్చి వేయగా అసురుని మాయ నాశన మాయెను. ఆ అంధకుడు సిద్ధు డాయెను. ఇదిగో నీకు ఆత్మ విద్యామృతమును మొత్తము చెప్పితిని.
ఈ మాతృ దేవతల మంగళకర మగు కథను నిత్యము విను వారికి వారు ఎల్లవేళల రక్షణను గూర్తురు.
ఈ మాతృ దేవతల జన్మ వృత్తాంతము విన్న మానవుడు ధన్యుడై శివ లోకమున కరుగును.
బ్రహ్మ వారికి ఉత్తమ యగు అష్టమీ తిథిని అనుగ్రహించెను. ఆ దినమున మారేడు ఫలములు మాత్రము భుజించి వారిని పూజించు వారికి ఆ దేవతలు సంతసించి క్షేమమును, ఆరోగ్యమును ప్రసాదింతురు.