అధ్యాయము - 49

దుర్వాసుడు:

దుర్వాసుడు:

ఈ విధముగనే ఆశ్వయుజ మాసమున శుక్ల పక్ష ద్వాదశి నాడు సంకల్పించి సనాతనుడగు పద్మనాభ దేవుని అభ్యర్చింప వలయును.

‘ఓం నమః పద్మనాభాయ’ అని పాదములను, ‘నమః పద్మయోనయే’ అని నడుమును, ‘నమః సర్వ దేవాయ’ అని ఉదరమును, ‘నమః పుష్కరాక్షాయ’ అని రొమ్మును, ‘అవ్యయాయ నమః’ అని చేతిని, అట్లే మునుపటి వలె అస్త్రములను పూజింప వలయును.

‘నమః ప్రభవాయ’ అని శిరస్సును పూజించి మునుపటి వలెనే కుంభమును నిలుప వలయును. దాని యందు బంగారముతో చేసిన పద్మనాభ దేవుని ప్రతిమను నిలుప వలయును.

గంధ పుష్పాదులతో క్రమముగా ఆ దేవుని పూజించి మరునాడు ఉదయమున బ్రాహ్మణునకు నివేదింప వలయును. ఇట్లు చేయగా కలుగు పుణ్య మెట్టిదియో చెప్పెదను వినుము.

కృత యుగమున భద్రాశ్వుడను గొప్ప శక్తి సంపద గల రాజుండెడి వాడు. అతని పేరుతో భద్రాశ్వమను వర్షము (దేశము పేరు) ఏర్పడెను.

ఒకప్పుడు ఆతని యింటికి అగస్త్యుడు వచ్చి, ‘నీయింట ఏడు రాత్రులు ఉందును’ అని పలికెను.

ఆరాజు తలవంచి అట్లే ‘ఉండుడు’ అని పలికెను.

అతనికి మిక్కిలి సౌందర్యవతి యగు కాంతిమతి అను భార్య కలదు. ఆమె ముఖ కాంతి పండ్రెండుగురు సూర్యులకు సమానమై యొప్పెడిది.

మరియు ఆమెకు అయిదు వందల మంది సవతులును కలరు.

వారందరు కాంతిమతి భయము చేత మనసు మనసులో లేని వారై బానిసల వలె ప్రతి దినము ఆమెకు సేవలు చేయు చుండిరి.

రూపము, తేజస్సు గల ఆ సుందరిని, భయముతో ఆమెకు సేవలు చేయుచున్న సవతులను అగస్త్యుడు చూచెను. రాజు మాత్రము ఆమె ముద్దు మొగమునే చూచు చుండెడి వాడు.

ఇట్టి మహా సుందరి యగు రాణిని చూచి, రాజా! మేలు మేలని అగస్త్యుడు ఆనందముతో పలికెను.

అగస్త్యడు గొప్ప ప్రభ గల ఆ రాణిని చూచి రెండవ దినము నందును ‘అహో! చరాచర జగ మంతయు కొల్లగొట్ట బడినది, కొల్లగొట్ట బడినది’ అని పలికెను.

మూడవ నాడు ఆతడు ఆమెను చూచి యిట్లనెను. ‘పరమేశ్వరుడగు గోవిందుని, అయ్యో! ఈ మూఢులు తెలియ కున్నారు. ఆ స్వామి ఒక్క దినమున ఈ రాజునెడ తుష్టి నంది ఫలము నంతటి నొసగి యున్నాడు.’

నాల్గవ దినమున ఆ మహర్షి రెండు చేతులు పైకెత్తి యిట్లు పలికెను: జగన్నాథ! మేలు మేలు, స్త్రీలు మేలు, శూద్రులు మేలు, బ్రాహ్మణులు, వైశ్యులు, మేలు మేలు

భద్రాశ్వా! నీవు గొప్ప వాడవు. అగస్త్య! నీకు మేలు మేలు. ప్రహ్లాదా! నీకు శుభము శుభము. ధ్రువా! మహావ్రతా! మేలు అని యిట్లు పలుకుచు రాజు కడ అగస్త్యుడు పెద్దగా నర్తించెను.

పత్నీ సహితుడైన ఆ రాజు ఇట్లున్న ఆ అగస్త్యుని గాంచి, బ్రాహ్మణోత్తమా! నీ ప్రమోదమునకు కారణ మేమి? ఏల ఇట్లు నృత్యము చేయు చున్నావు? అని అడిగెను.

అగస్త్యుడు:

అగస్త్యుడు:

అయ్యో! రాజా! నీవు పాడు రాజవు, మూర్ఖుడవు. ఈ నీ సేవకు లందరు మూర్ఖులు. నీ పురోహితులు, అయ్యో! ఎంత మూర్ఖులు! నా అభిప్రాయము నెరుగ కున్నారు.

ఇట్లు పలుకగా రాజు చేతులు జోడించి, మహర్షీ! నీవు పలికినది మేమెరుగ కున్నాము. మా యందు అనుగ్రహము కలవాడ వైనచో తెలుపుము, అని పలికెను.

ఈ నీ రాణి పూర్వము విదిశా దేశ నగరపు వైశ్యుడు హరిదత్తుని దాసి, నీ భార్య, నీవా హరిదత్తుని సేవకుడవగు శూద్రుడవు.

ఓ మహామతీ! ఆ కోమటి అశ్వయుజ మాస ద్వాదశి నాడు నియమము నందుండి స్వయముగా విష్ణుని ఆలయమున కరిగి పుష్పములతో, ధూపాదులతో హరిని అభ్యర్చించి రక్ష పాలకులరగు మీ యిరువురను దీపములను వెలిగించుటకై నియోగించి తన యింటి కరిగెను.

వైశ్యు డట్లరుగగా మీరిరువురు దీపములను వెలిగించి తెల్లవారు వరకు రాత్రి యంతయు మేల్కొని యట్లే యుండితిరి.

తరువాత కాలము గడువగా ఆ దంపతులగు మీరిరువురు మరణించితిరి. ఆ పుణ్యము చేత నీకు ప్రియవ్రతుని గృహమున పుట్టుక కలిగినది.

తనది కాక పోయినను హరి ఆలయమున దీపమును వెలిగించు పుణ్యము చేత ఆ వైశ్యుని దాసి యగు ఈమె నీకు పత్ని అయినది.

ఇక తన సొమ్ముతో విష్ణుని ముందు పెద్ద దీపము వెలిగించిన వాని పుణ్య మెట్టిదో లెక్కించుట సాధ్యము కాదు.

అందుచేత హరీ సాధు సాధు అని నేనంటిని.

వివేక వంతుడు కృత యుగమున ఒక్క ఏడును, త్రేతా యుగమున ఆరు మాసములును హరికి భక్తి చేయుటతో ఇది సమానము. సంశయము లేదు.

మూడు నెలలు ద్వాపరమున భక్తితో పూజించిన ఫలము, కలి యందు ‘‘నమో నారాయణాయ’’ అనుటతో లభించును. అందుచేత విష్ణుని యందలి భక్తితో జగత్తు కొల్లగొట్ట బడినది అని నేను పలికితిని.

దేవుని ముందు ఇతరుల దీపమును వెలిగించుట వలన, రాజా! ఇట్టి ఫలమును నీవు పొందితిని. కనుక హరికి దీపము పెట్టు ఫలమును మూఢు లెరుగ కున్నారని నేనంటిని.

ఈ విధముగా ఏ బ్రాహ్మణులు, రాజులు భక్తితో వివిధ ములగు యజ్ఞముల చేత కొలుతురో వారిని సాధువులుగా లోకము సంభావించును.

నేను ఆ హరిని విడచి యితరుని ఈ భూ మండలమున చూడను అందుచేత ‘అగస్త్యా ధన్యుడవు’ అని నన్ను నేను గొప్ప ఆనందపు పొంగుతో ఎగిరి గంతులు వైచుచు కొనియాడు కొంటిని.

ఆ యింతి ధన్యురాలు. ఆ శూద్రులు ఇంకను ధన్యుడు. ఏలయన ప్రభువు సేవ చేయుచు ఆతని పరోక్షమున హరి పూజ కావించెను.

ఆ స్త్రీ ధన్య. అట్లే ఆశూద్రుడును, ద్విజుల సేవ యందు మిక్కిలి ప్రీతి కలవాడు కనుక, మరింత ధన్యుడు. వారి అనుమతితో హరి యెడల భక్తిని చేసిరి. కావున ఆ స్త్రీని ఆ శూద్రుని గురించి మేలు మేలంటిని.

రాక్షస భావమును పొందియు ప్రహ్లాదడు పురుషోత్తముని కాక ఇతరుని ఎరుగ కుండెను. అందుకై ‘ప్రహ్లాదుడెంత సాధువు’ అంటిని.

ప్రజాపతి కులమున పుట్టి పిన్న వయసు నందే అడవి కరిగెను. విష్ణువు నారాధించి పరమ శోభనమైన పదమును అందెను. అందు వలన ఆ ధ్రువుని మహిమను నేను కొనియాడి తిని.

ఇట్లు మహాత్ముడగు అగస్త్యుని మాట విని రాజు ముని పుంగవుడగు నతనిని ఒక చిన్న ఉపదేశమును గూర్చి అడిగెను.

మహానుభావుడగు అగస్త్యుడును కార్తీక మాసమున పుష్కరమున కరుగుచు భద్రాశ్వుని యింటి కిరిగి నపుడు ఆతడు తనకే దైన చిన్న ఉపదేశము చేయుమని అడిగెను. ఆ ముని వరుడును రాజునకు ఆ ద్వాదశీ వ్రతమును గూర్చి చెప్పెను.

దుర్వాసుడు:

దుర్వాసుడు:

నేను నీకు చెప్పిన దీనినే ఆ ముని పుంగవుడును ఆ రాజున కెరిగించెను. చెప్పి మరల ఆ అగస్త్యుడు ఆ రాజ సత్తమునితో ఇట్లనెను.

నేను పుష్కరమున కరుగు చున్నాను. మరల నీయింటికి వత్తును. అని పలికి ఆ మహర్షి అక్కడి కక్కడ అదృశ్యు డాయెను.

రాజును, ఆ విధానముతో పద్మనాభ ద్వాదశి నాడు ఉపవాస ముండి ఈ జన్మమున కోరిన కోర్కె లన్నిటిని పొందెను.

భార్యలతో కూడిన ఆ రాజును ఆ విధముగా ద్వాదశి నాడు ఉపవాస ముండి ఈ జన్మమున పుత్రులను, పౌత్రులను పొందెను.