అధ్యాయము - 21

ప్రజాపాలుడు:

ప్రజాపాలుడు:

గొప్ప ప్రజ్ఞ గల ఓ మునీంద్రా! పరమాత్ముడైన పరమ పురుషుని వర దానము వలన గౌరీ దేవి యెట్లు రూపము పొంది స్తుతులందినదో నాకు తెలియ జెప్పుము.

మహాతపుడు:

మహాతపుడు:

బ్రహ్మ రుద్రునకు భార్యగా ఒక చక్కని కన్యను తన దేహము నుండి సృజించెను. ఆమెకు గౌరీ యను పేరు ఆయననే పెట్టెను. తానే ఆమెకు తండ్రియై మిక్కుటమగు దేహము గల రుద్రున కొసగెను.

‘రుద్రా! ప్రజలను సృష్టి చేయుము’. ఇట్లు బ్రహ్మ మాటి మాటికి నొక్కి చెప్పు చుండగా గొప్ప బలము గల రుద్రుడు. ఇది నాకు చేత కాదని నీట మునిగెను.

భగవానుడు బ్రహ్మ మరల ప్రజలను సృజించ గోరి దక్షునితో పాటు ఏడుగురు మానస పుత్రులను సృజించెను. వారి వలన ప్రజలు పెంపొందిరి.

అందు దక్షుని భార్య సంతానము దేవతలు, దేవేంద్రుడు, ఎనిమిది మంది వసువులు, పండ్రెండుగురు ఆదిత్యులు, ఏడుగురు మరుత్తులు అను వారు.

మునుపు రుద్రునకు తాను భార్యగా నొసగిన గౌరి యను సుందరాంగిని బ్రహ్మ దక్షునకు కూతురుగా నొసగెను.

ఇట్లా గౌరియు దాక్షాయణీ దేవిగా ఏర్పడెను.

అపుడు బ్రహ్మ కుమారులగు మరీచి మొదలగు వారు తమ తమ మార్గముల యందు చక్కగా కుదురు కొని ఋత్విక్కుల కార్యమును నిర్వహించిరి.

మరీచి స్వయముగా బ్రహ్మ యాయెను. ఇతరులు ఇతర కార్యములను నిర్వహించిరి. అత్రి యజ్ఞ కర్మమును నిర్వహించు చుండెను. అంగీరుడు అగ్నీధ్రు డయ్యెను.

పులస్త్యుడు హోత యాయెను. పులహుడు ఉద్గాత యయ్యెను. క్రతువను మహా తపశ్శాలి ఆ యజ్ఞమున ప్రస్తోత యయ్యెను.

యజ్ఞమున అర్చనల నందువాడు, యజ్ఞ ఫలముల నందువాడు విశ్వము నంతటిని సృజించిన బ్రహ్మ దేవుడే. సంమానము పొందువారు దక్షుని మనుమలు (దౌహిత్రులు) రుద్రులు, ఆదిత్యులు, అంగిరులు మొదలగు వారు.

విశ్వే దేవులు, పితృ దేవతలు, గంధర్వులు, మరుద్గణములు తమకు అనువైన యజ్ఞ భాగములను హవిస్సు రూపమున అగ్నిలో వ్రేల్చిన వానిని కైకొను చుండిరి.

ఇంతలో మునుపు బ్రహ్మ కోపము వలన పుట్టి పెను జలమున మునిగి యున్న రుద్రుడు ఒక్క పెట్టున పైకి లేచెను.

వేయి సూర్యలు ప్రోవువలె వెలు గొందుచు, సర్వ జ్ఞానము ముద్ద కట్టి వచ్చిన స్వరూపముతో, దేవులందరి తత్త్వములు తనలో నిండగా స్వచ్ఛ రూపముతో ఆతడు నీటి నుండి వెలు వడెను.

అట్లాతడు తపస్సుతో ప్రకాశించుచు సమస్త జగమునకు సాక్షాత్కరించెను.

రాజా! ఆ సమయముననే దేవలోక సంబంధముగా అయిదు విధములగు జాతులయు, భూమి యందుండు నవియు మృత్యు ధర్మము కలవి యునగు నాలుగు జాతులయు సృష్టి ఏర్పడెను.

ఆ విషముగా రుద్రుడు చేసిన సృష్టి ఒక పెట్టున ఏర్పడెను. రాజవరేణ్యా! ఆ రుద్ర సృష్టిని గూర్చి యిప్పుడు నీకు తెలిపెదను. వినుము.

అట్లు పది వేలేండ్లు పెన్నీట తప మొనరించి మేల్కొన్న వాడై రుద్రుడు చక్కని పైరులతో, అడవులతో, మనుష్యులతో, పశువులతో, చూడ ముచ్చటగా నున్న భూమిని గాంచెను. మఱియు దక్షుని యజ్ఞ వాటిక యందు యజ్ఞికులు చెదరని బుద్దితో పెద్ద స్వరముతో చేయుచున్న వేద నాదములను వినెను.

మహా తేజస్వియు, సర్వము నెఱిగిన వాడును అగు పరమేశ్వరుడా శబ్దమును విని పెల్లు కోపించి యిట్లు పలికెను.

మొదట పరమాత్మ నన్ను పుట్టించెను. ఆ ప్రభువు నిండు హృదయముతో ప్రజలను సృజింపు మని పలికెను.

ఇప్పుడు ఈ సృష్టి మొదలగు పని నంతటిని ఎవ్వడు చేసెను? అని యిట్లు పలికి పెను కోపముతో పరమేశ్వరుడు పెద్ద నాదము గావించెను.

అట్లు రంకెలు వేయుచున్న ఆతని చెవుల నుండి నిప్పులు గ్రక్కుచున్న వేతాళము లును భూతములు ప్రేతములగు పూతనలు, ఆయుధములు తాల్చి కోట్ల కొలదిగా వెలువడిరి.

పెక్కు విధములగు ఆయుధములు తాల్చిన ఆ భూతముల మొత్తములను గాంచి ఆ మహా దేవుడు వేదవిద్యలే అంగములుగా గల అందమైన రథము నొక దానిని సృజించెను.

ఆ రథమునకు ఋక్కు మొదలగు నవియే గుఱ్ఱములు, మూడు తత్త్వములే మూడు బొగులు, మూడు సవనములే మూడు పూజకములు, ధర్మమే యిరుసు, వాయువే ధ్వనిగా నమరి యుండెను.

పగలు రాత్రియను రెండు పతాకలు, ధర్మము, అధర్మము అను రెండు దండములు ఆ బండికి అమరెను. ఇట్లు సర్వ విధ్యా రూపమైన ఆ బండికి సాక్షాత్తు బ్రహ్మయే సారథిగా నయ్యెను.

ఆ దేవదేవునకు గాయిత్రియే విల్లు, ఓంకారమే అల్లెత్రాడు, ఏడు స్వరములు బాణములు ఆయెను.

ఇట్లు సాధన సంపత్తి నేర్పరుచుకొని మహా ప్రతాపము గల దేవదేవుడు రుద్రుడు కోపముతో దక్ష యజ్ఞము కడ కరిగెను.

ఆ దేవు డట్లు పోవు చుండగా సూర్యుడు ప్రకాశింప కుండెను. ఋత్విజులు మంత్ర పఠనము ఆగి పోయెను.

ఈ విపరీతమును గాంచి, అందున్న ఋత్విక్కు లందఱు ఇట్లు పలికిరి. దేవులారా! సిద్దముగా నుండుడు. మీకొక పెను భయము వచ్చి పడినది.

ఈ మాటలు విన్న అమరులు తాతయగు దక్షునితో నిట్లనిరి: తాతా! ఇప్పుడు మేమేమి చేయుదుము? నీ నిర్ణయమేమో తెలుపుము.

దక్షుడు:

దక్షుడు:

వడివడిగా ఆయుధములు చేత బట్టుడు. ఇచట మనము పోరాడ వలయును.

దక్షుడిట్లు పలుకగా దేవతలు పెక్కు తీరుల ఆయుధములను ధరించి రుద్రుని సేవకులతో పెద్ద కయ్యము గావించిరి.

పెక్కు విధములగు ఆయుధములు తాల్చిన బేతాళ భూతములు కూష్మాండులు, గ్రహ పూతనలు (వీరందరు రుద్రానుచరులు) లోక పాలురతో పోరు సలిపిరి.

వెరపు గొలుపు భూతములు కూడా రుద్రుని ముందు నిలువ ద్రొక్కుకొని రోషముతో కొఱవులను, ఎముకలను, బాణములను దేవతలపై క్రుమ్మరించు చుండిరి.

ఇట్లు మహాతీవ్రముగా భయము గొలుపు యుద్దము సాగుచుండగా రుద్రుడు ఒక్క వాడి బాణముతో భగుని రెండు కనులను పొడిచి వైచెను. (భగుడు - ద్వాదశ ఆదిత్యులలో ఒకడు)

రుద్రుని బాణము మంటకు కనులు పోయిన భగుని చూచి క్రోధముతో తేజస్వియగు పూషుడు పైకి దూకెను. (పూషుడు ద్వాదశ ఆదిత్యులలో ఒకడు)

అట్లు బాణములు గుప్పించు చున్న పూషుని గాంచి రుద్రుడు మహా యుద్దమున వాని దంతములను ఊడ లాగెను.

పూషుని దంతములు రుద్రుని వలన నేల కూలగా చూచి వసువులు చెల్లాచెదరైరి. పదునొకండు రుద్రులు వారిని వెంట నంటి తోలిరి.

అట్లు దెబ్బతిని దిక్కులకు పారుచున్న వారిని గాంచి ఆదిత్యుల తమ్ముడు, ప్రతాప వంతుడు నగు విష్ణువు తన బలముతో నిట్లు పలికెను.

మగతనుమును, గర్వమును, మహిమను వదలి వైచి యెందు పోయెదరు? మీరు వచ్చిన పనియేమో, మీ కుల గౌరవ మెట్టిదో, మీ సంపద యెట్టిదో ఏల స్మరింపురు?

సృష్టి కర్త గుణము లన్నియు కలిగియు, సాధారణ జనుని వలె ఈ బ్రహ్మయు మునుముందు భయమంది వ్యర్ధముగా చేతులు ముడుచు కొనుచున్నాడు.

ఇట్లు పలికి ఆ విష్ణువు అంత శంఖమును, చక్రమును, గదను చేతుల యందు తాల్చి, పట్టు వస్త్రము ధరించి జనార్ధనుడై గరుత్మంతు నదిరోహించెను.

పెను రోషము గల ఆ నారాయణ పాశుపతము లనెడు అస్త్రములు రెండును ఆకసమున ఒకటి నొకటి రూపుమాప వలయు నన్న భావముతో దివ్యములగు వేయి యేండ్లు పోరినవి. ఆ విధముగా హరి హరుల పోరు సాగెను.

ఆ అస్త్రములలో ఒకటి కిరీటముతో ఒదిగి యున్నది. మఱి యొకటి విప్పారిన జడలతో అలరి యున్నది. ఒకటి శంఖమును పూరించు చున్నది. మఱి యొకటి శుభమైన డమరుకమను మ్రోగించు చున్నది.

ఒకటి కత్తి చేత తాల్చి యున్నది. మఱి యొకటి దండము ధరించి యున్నది. ఒకటి కౌస్తుభము వెలుగులు ఒడలెల్ల ప్రాకి యున్నది. వేరొకటి భస్మముతో చెలువొంది యున్నది.

ఒకటి గదను త్రిప్పు చున్నది. ఇంకొకటి దండమును త్రిప్పు చున్నది. ఒకటి కంఠమున నున్న మణులతో నలరారు చున్నది. వేరొకటి అస్తిమాలతో ఒప్పారు చున్నది.(ఆస్థి = ఎముక)

ఒకటి పచ్చని వస్త్రము తాల్చి యున్నది. రెండువది రెండవది పాముల మొలనూలితో విరాజిల్లు చున్నది.

ఇట్లు పరస్పరము పగగొన్న పాశుపత నారాయనాస్త్రములు రెండును, ఒకటి కొకటి మించ వలయునన్న భావముతో నుండగా బ్రహ్మ అది గాంచి, మేలైన నడవడి గల అస్త్రములారా! మీ మీ స్వభావముతో శాంతింపుడు, అని యిట్లు బ్రహ్మ పలుకగా అవి రెండును శాంతించి నవి.

పాడైన యీ దక్షుని యజ్ఞము పరిపూర్ణతను గాంచును. దక్షుని సంతాన రూపమైన యీ యజ్ఞము లోకమున వాసి గాంచును.

ఇట్లు హరి హరులతో పలికి లోక పితా మహుడగు బ్రహ్మ లోకుల నుద్ధేశించి రుద్ర భాగము నీ రుద్రున కొసగుడని పలికెను.

అంత రుద్రుని భాగము జ్యేష్ఠ భాగమని వేదవాక్కు విన వచ్చెను. దేవతలారా! పరమేశ్వరుడగు రుద్రుని స్తుతింపుడు అనియు వేదవాక్కు వెలువడెను.

అని వేదమాత పలుకగా దేవతలు పరమ భక్తితో నమస్కరించి మహాత్ముడును. స్వయం భువునగు శంభుని స్తోత్రము నిట్లు చేసిరి.

దేవతలు:

దేవతలు:

విషమ నేత్రుడు, ముక్కంటి, వేయి కన్నులు కలవాడు శూలము చేత దాల్చిన వాడు నగు పరమేశ్వరా! నీకు నమస్సు.

మంచపు కోడు వంటి ఆయుధము గల ఓ స్వామీ! నీకు నమస్కారము, చేత దండము ధరించిన దేవా! నీకు మ్రొక్కులు. నీవు అగ్ని జ్వాలలు గల కోట్లకొలది సూర్యులకు దీటైన తేజస్సు కలవాడవు.

మా విజ్ఞానమునకు పొరలు క్రమ్మి నేడు నిన్ను గుర్తింపక చేసిన తప్పును ప్రభూ! క్షమింపుము.

ఓ ముక్కంటీ! నీవు పీడలను పరిమార్తువు. శంభూ! త్రిశూల ధారీ! వింతైన మొగము గల దేవా! సమస్త దేవేశ్వరా! శుద్ధ స్వభావా! రుద్రా! అచ్యుతా! సర్వ భావముల సమష్టి రూపమైన ఓ ప్రభూ! మాయందు ప్రసన్నుడ వగుము.

ఈ పూషుని దంతము లూడ గొట్టిన ఓ భీమరూపా! వ్రేలాడు నాగరాజు మెడకు చుట్టు కొన్న స్వామీ! విశాల దేహము గల దేవా! అచ్యుతా! నీలకంఠా! విశ్వేశ్వరా! విశ్వమూర్తీ! మా యెడ దయగొనుము.

తెల్లని భూతిపూత గల నీ స్వరూపము గుర్తింప రానిది. ఓ కపాలదారీ! త్రిపురాసురులను మట్టు పెట్టిన స్వామీ! ఉమాపతీ! తామర తూడు నుండి ఉద్భవించిన ఓ ప్రభూ! మమ్ము సర్వ భయముల నుండి కాపాడుము.

భవా! శర్వా! మహాదేవా! పినాకీ! రుద్రా! హరా! విశ్వేశా! మేమందరము నీకు అణగి యున్నాము. పరమేశ్వరా! మమ్ము రక్షింపుము.

అట్లు దేవత లందఱు తనను స్తుతింపగా దేవ దేవుడగు మహేశ్వరుడు సంతోష మందెను. ఆ దేవత లందరకు నిట్లు పలికెను.

రుద్రుడు:

రుద్రుడు:

అదితి సుతులారా! భగునకు నేత్రములు వచ్చుగాక! పూషుని దంతములు మరల ఏర్పడుగాక! దక్షునిదగు ఈ యజ్ఞము ఏ లోపము లేనిదగు గాక! దేవతలారా! మీ పశు భావమును గూడ పోగొట్టెదను.

నన్ను చూచుట వలన స్వర్గ వాసుల కేర్పడిన పశు భావమును నేను వెను వెంటనే తొలగించెదను. మీకు మరల అధిపతిత్వము కలుగు గాక!

నేను విద్య లన్నింటికి మొదటి ప్రభువను. సనాతసుడను. నేనే పశువుల నడుమ పతి లక్షణముతో నెలకొని యున్న వాడను. కావున నాకు ‘పశుపతి’ యనుపేరు లోకమున ఏర్పడును. నన్ను పూజించు వారికి పాశుపత దీక్ష కలుగును.

రుద్రు డిట్లు పలుకగా లోకపితా మహుడగు బ్రహ్మ చనవుతో, చిరునగవుతో రుద్రునితో నిట్లు పలికెను.

దేవా! నీవు ‘పశుపతి’ అని లోకమున ఖ్యాతి నందెదవు. ఇది ధ్రువము. నీ పేరుతో ఈతడును లోకమున కీర్తి కెక్కును. దేవత లందరకు ఆరాధ్యు డగును.

ఇట్లని బ్రహ్మ జ్ఞాన సంపద కలవాడై దక్షునితో రుద్రునకు, మున్నే నిశ్చయించిన విధముగా, గౌరీదేవి నొసగు మని పలికెను.

బ్రహ్మ యిట్లు పలుకగా దక్షుడు బ్రహ్మ సమక్షమున మహా దేవుడగు రుద్రునకు సర్వ మంగళ యగు గౌరిని సమర్పించెను.

అంత రుద్రుడు దక్షునకు మన్ననతో ప్రియ మొనర్చుచు సమస్త కళ్యాణ గుణములు గల గౌరిని యథావిధిగ స్వీకరించెను.

దక్షుని పుత్రికను శివుడు కైగొనగా బ్రహ్మ దేవతల యెదుట కైలాసమును శివునకు నెలవుగా నొసగెను.

రుద్రుడు భూత గణములతో పాటు కైలాస పర్వతమున కరిగెను. దేవత లందఱు సంతోషముతో తమ తమ తావుల కరిగిరి. బ్రహ్మయు దక్షునితో కూడి ప్రాజాపత్య పురమున కరిగెను.