అధ్యాయము - 37

ధరిణి:

ధరిణి:

దేవా! విభో! సర్వ ప్రాణులకు భావింప దగిన స్వామీ! భక్తిగల నరులు, నారులు, నిన్నే తీరున ఆరాధింప గలరు. నాకిది యంతయు చెప్పుము.

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

దేవీ! నేను భక్తికి మాత్రమే సాధ్యుడను. ధనములు, జపములు నన్ను సాధింప జాలవు. అయినను నన్ను పొంద గల దేహ కష్టములను గూర్చి నీకు తెల్పెదను.

చేష్టతో, మనసుతో, మాటతో నన్ను భావించు నరుడు చేయు వివిధ ములైన వ్రతములను నేను హృదయ మున నిలుపు కొందును. ఇది నీవు తెలిసి కొనుము.

ఓ భూదేవీ! అహింస, సత్యము, దొంగ బుద్ధి లేకుండుట, బ్రహ్మ చర్యము, పాపపు పనులు చేయ కుండుట అనునవి మానసము లైన వ్రతములు.

ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఉపవాసము మొదలగు నదంతయు మానవుల కాయిక వ్రత మగును. మరియొక విధము కాదు.

మౌనము, వేదములను చదువుట, దేవుని స్తుతులను కొనియాడు చుండుట, క్రూర కర్మముల నుండి మరలుట అనునవి వాచికమైన వ్రతము.

ఈ విషయమున ఒక కథ వినవచ్చు చున్నది. మునుపు ఒక కల్పమున బ్రహ్మ కుమారుడు ఆరుణి అను పేరుగల గొప్ప తప స్సంపన్నుడు ఉండెడి వాడు.

ఆ ఉత్తమ బ్రాహ్మణుడు తపస్సు చేయ గోరిన వాడై ఒక అడవి కరిగెను. అందతడు ఉపవాసము నందు శ్రద్ధ కలవాడై తపస్సు చేయు చుండెను.

ఆ బ్రాహ్మణుడు రమ్యమైన దేవికా నది యోడ్డున నివసించు చుండెను. ఒకనాడు ఆతడు అభిషేకము కొరకు మహానది కరిగెను.

అచట స్నానము చేసి జపము చేసి కొనుచు ఆవిప్రుడు తన కెదురుగా వచ్చు చున్నవాడు, గొప్పవిల్లు చేత దాల్చిన వాడు, మిడిగ్రుడ్ల వాడు, భయము గొలుపు వాడు అగు ఒక బోయ వానిని గాంచెను.

ఆతడు ఆ బ్రాహ్మణుని కొట్టి నార చీరలను ఎత్తుకొని పోవుటకై వచ్చెను. ఆ బ్రాహ్మణ హంతవలని భయముతో ఆ విప్రుడు కలత చెంది నారాయణుని ధ్యానించుచు అందే నిలిచెను.

గుండెలో హరికి గూడు కట్టిన ఆ విప్రుని చూచి బోయ భయపడిన వాడై విల్లంబులను పారవైచి అతనితో ఇట్లు పలికెను.

వ్యాధుడు:

వ్యాధుడు:

ఓయి బాపనయ్యా! నేనిచటకు వచ్చుటకు ముందు నిన్ను చంప గోరితిని. ఇప్పుడు నిన్ను చూచి నంతనే ఆ నా బుద్ధి ఎటకో పోయినది.

వేల కొలది బ్రాహ్మణులను, వారి ఆడు వాండ్రను లక్షల కొలదిగా పాప కారినగు నేను ఎల్ల వేళల చంపితిని. వారి అటు వారిని, ఇటు వారిని కూడ చంపితిని.

నా వంటి క్రూరమైన చిత్తము నరకము నందు కూడ కానరాదు. ఇప్పుడు నాకు నీకడ తపస్సు చేయు కోరిక కలిగినది. ఉపదేశ మొసగి నాయందు అనుగ్రహము చూప దగును.

ఆ బోయ అట్లు పలికినను, వీడు బ్రహ్మఘ్నుడు, పాప కర్ముడు అని ఆ విప్ర శ్రేష్ఠుడు సమాధాన మీకుండెను.

అతని నుండి మాటరాక పోయినను ధర్మము నందు కోరిక గల వ్యాధుడు అటనే నిలిచి పోయెను. ఆ బ్రాహ్మణుడును నది యందు స్నానము చేసి చెట్టు మొదట కూర్చుండు చుండెను.

కొంత కాలమిట్లు గడువగా ఒకనాడు ఆకలి గొన్న పెద్దపులి శాంతముగా నున్న ఆ విప్రుని తిని వేయుటకై ఆ నది కడకు వచ్చెను.

నీటి యందున్న ఆ విప్రుని ఆ పులి తిన బోవు లోపల వ్యాధుడు దానిని బాణముతో కొట్టగా అది ప్రాణములను వదలెను.

ఆ పులి దేహము నుండి ఒక పురుషుడు పైకి లేచెను. ఆ కలకల నాదము విని విప్రుడు “ఓం నమో నారాయణాయ” అని పలుకుచు నీటిలో మునిగెను.

కంఠము నందున్న ప్రాణములతో ఆ పులియు ఆ మంత్రమును వినెను. విన్నంతనే ప్రాణములను వదలెను. అందు నుండి వెడలిన పురుషుడును మంగళ రూపుడయ్యెను.

‘అయ్యా! నేను సనాతనుడగు విష్ణువున్న తావునకు బోవుదును. నీ దయ వలన నేను పాపములను పోగొట్టు కొంటిని. ఏ రోగములు లేనివాడ నైతిని.’ అని ఆతడు పలికెను.

అప్పు డాత డిట్లనెను. “నేను పూర్వ జన్మమున గొప్ప ప్రతాపము గల రాజేంద్రుడను. నన్ను దీర్ఘబాహు డందురు. అన్ని ధర్మములలో ఆరితేరిన వాడను.”

“నేను వేదముల నెరుగుదును, నేను శుభ అశుభముల నెరుగుదును. నాకు బ్రాహ్మణునితో పనియేమి? బ్రామ్మణులు ఏమిటి వారు?”

నేనిట్లు బ్రాహ్మణులతో పలుకు చుండగా వారందరు క్రోధము గలవారై నీవు అణప శక్యము కాని క్రూరమగు పెద్ద పులి వగుదు వని శాపము నిచ్చిరి.

విప్రుల నవ మానించుట వలన నీ స్మృతి శక్తి తప్పక నశించును. ఓయీ మూఢుడా! మరణ కాలమున నీకు కేశవుని వలన ఆ స్మృతి నీకు కలుగును.

వేదములను తుది ముట్ట నేర్చిన బ్రాహ్మణులు అట్లు పలుకగా ఆ బ్రహ్మ శాపమును మొత్తముగా నేను పొందితిని.

మహామునీ! అంత నేను వారి కాళ్లపై బడి ప్రార్థింపగా ఆ బ్రాహ్మణు లందరు నా యందు అనుగ్రహముతో ఇట్లు పలికిరి.

ఓరీ నరాధమా! దినమున ఆరవ కాలమున అన్నము తిను వేళకు నీ ముందు ఎవ్వడు నిలుచునో వాడు నీకు అన్నమగును. ఇట్లు కొంత కాలము సాగును. 1. షష్ఠ + అన్నకాలికస్య = పగటిని ఆరు భాగములుగా భావింతురు. 1) ప్రాతః కాలము 2) సంగవ కాలము 3) పూర్వాహ్ణము 4) మధ్యాహ్నము 5) అపరాహ్ణము. 6) సాయాహ్నము. సాయం కాలము అన్నము తిన గోరెడు వాడు అని భావము.

ఎన్నడు నీవు బాణపు దెబ్బతిని ప్రాణములు కంఠమునకు చేరు కొనగా ఒక బ్రాహ్మణుని ముఖమున “నమో నారాయణాయ” అను మంత్రము విందువో అప్పుడు నీకు స్వర్గ గతి కలుగును. ఇందు సందియము లేదు.

విప్రుల యెడ ద్వేషము పొందిన నాకు ఇతరుని ముఖము నుండి యైనను విష్ణు నామము విన వచ్చినది. ఇది నీ యెదుటనే జరిగినది.

ఇంక బ్రాహ్మణులను పూజించి తన నోటితో నమో హరిమ్‌ (హరికి నమస్కారము) అనుచు ప్రాణములు వదలు వాడు పాపములు నశించిన వాడై ముక్తుడగునని చెప్పనేల?

సత్యము, సత్యము, ముమ్మాటికి సత్యము, చేయి పైకిత్తి యిది చెప్పు చున్నాను. బ్రాహ్మణులు తిరుగాడు దేవతలు పురుషోత్తముడు కూటస్థుడు.

ఇట్లు పలికి ఆరాజు పాపములు వదలిన వాడై స్వర్గమున కరిగెను. బ్రాహ్మణుడును భగవన్నామముతో ఎల్లప్పుడు కూడిన వాడై ఆ బోయవాని కిట్లనెను.

ఋషి:

ఋషి:

తిన వచ్చిన మృగ రాజము నుండి నన్ను రక్షించితివి. కుమారా! అందు వలన నాకు సంతోషము కలిగినది. నీకు వర మిత్తును కోరు కొనుము.

బోయ:

బోయ:

ఓయి విప్రుడా! నీవు నాతో మాటాడితివి. ఇదియే నాకు వరము. ఇంత కంటెను మించి వరముతో నేనేమి చేయుదును. నన్ను శాసింపుము.

ఋషి:

ఋషి:

పెక్కు పాపములు చుట్టు ముట్టిన వాడవు. ఘోర రూపుడవు. అట్టి నీవు తపస్సును కోరి నన్ను మున్ను ప్రార్థించితివి.

దేవికా నదిలో స్నానము చేతను, నా దర్శనము చేతను, విష్ణు నామమును వినుట చేతను ఇప్పుడు నీ పాపము లన్నియు నశించి పోయినవి. నీ దేహము శుద్ధ మైనది. ఇందు సంశయము లేదు.

ఓయీ మంచి వాడా! ఇప్పుడు నా నుండి నీవొక వరమును కైకొనుము. కోరుదునేని చిర కాలము తప మొనర్పుము.

వ్యాధుడు:

వ్యాధుడు:

స్వామీ! నీవు చెప్పితివే! ఆ విష్ణువు నారాయణ ప్రభువును మానవు లెట్లు పొంద గలరు? ఇది చెప్పుము. ఇదియే నాకు వరము.

ఋషి:

ఋషి:

మానవుడు ఆ అచ్యుతుని గూర్చి ఏదేని వ్రతమును చేయ వలయును. భక్తి నిండుగా గల అట్టి పురుషుడు ఆ పరమాత్మను పొందును.

బిడ్డా! ఇది యెరిగి వ్రతము నొకటి ఆచరింపుము. ‘చచ్చిన దాని మాంసమును తినను. ఎన్నటికి అబద్ధమాడను’ అను వ్రతము పాటింపుము.

ఈ వ్రతము నీకు ఉపదేశించితిని. ఓయీ వ్యాధవరా! నీ విట్లు తపముతో కూడి కోరినంత కాలము నిలుపుము.

శ్రీవరాహ దేవుడు:

శ్రీవరాహ దేవుడు:

ఇట్లు చింతతో కూడిన ఆ బోయ మోక్షమును కోరు చున్నాడని ఎరిగి బ్రాహ్మణుడు వరము నొసగి వాడై ఆతని కను గప్పి అటు నుండి వెడలి పోయెను.