అధ్యాయము - 66

భద్రాశ్వుడు:

భద్రాశ్వుడు:

ఓ ధర్మజ్ఞా! నీ వెరిగినది గాని చూచినది గాని ఆశ్చర్య మేమైన ఉన్నచో నాకు చెప్పుము. నాకు మిక్కిలి వేడుకగా నున్నది.

అగస్త్యుడు:

అగస్త్యుడు:

ఈ సనాతనుడగు భగవంతుడే ఆశ్చర్య రూపుడు. ఆతని ఆశ్చర్యము పెక్కు పెక్కు విధములైనవి కానవచ్చు చున్నవి.

పూర్వమున నారదుడు శ్వేత ద్వీపమునకు వెళ్లెనట. అచట శంఖ చక్ర పద్మములు గలవారు, తీవ్రమగు తేజస్సు కలవారునగు పురుషులను చూచెను.

ఇదిగో విష్ణువు, ఇతడే విష్ణువు, ఇతగు సనాతనుడగు విష్ణువు. ఇట్లని ఇందులో ప్రభువైన విష్ణువెవ్వరు? అని వారిని కాంచిన అతనికి చింత కలిగెను.

ఇట్లు చింతించు చుండగా ఆతనికి కృష్ణుని గూర్చిన విచారము బయలు దేరెను. శంఖ చక్ర గదా ధరుడైన కృష్ణుని ఎటులు ఆరాధింతును. పరమ దైవము, ప్రభువునగు కృష్ణుని ఎట్లు తెలిసి కొందును అని చింతించి ఆ పరమేశ్వరుడగు దేవుని గూర్చి ధ్యానించెను.

బ్రహ్మకు కుమారుడగు నారదుడు వేయి దివ్య వత్సరములు ఏకాగ్రముగా ధ్యానము చేయగా ఆ దేవ దేవుడు పరితోషము పొందెను.

ప్రసన్నమగు చిత్తము గల ఆ ప్రభువు ప్రత్యక్షమై నారదా! నీకేమి వరమిత్తును? మహామునీ! అడుగుము అని పలికెను.

నారదుడు:

నారదుడు:

భువనేశ్వరా నిన్ను నేను వేయినొక్క వత్సరములు ధ్యానించితిని. నిన్ను పొందుట యెట్లో, నా యెడ తుష్టి నందితివేని, తెలుపుము.

దేవదేవుడు:

దేవదేవుడు:

పురుష సూక్తమును ఆధారము చేసికొని నన్నెవ రర్చింతురో వారును, నిరంతరము వేద సంహితల నధ్యయనము చేయు వారును నన్ను పొందెదరు.

వేదములు శాస్త్రములు పట్టు బడనిచో పంచ రాత్రము చెప్పిన మార్గము తోడను నన్నర్చించు వారు నన్ను పొందెదరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పంచ రాత్ర విధానము చెప్ప బడినది.

శూద్రులు మొదలగు వారికి పుణ్య క్షేత్రముల కరుగుట. నా నామమును జపించుటయు విధి. ఇతరములగు పూజలు వారు చేయ నక్కర లేదు.

ఓయి విప్రవరా! పూర్వ కల్పమున పురాతన మగు ఈ పంచ రాత్రమును, వేలలో ఒక్కడైనను ఇది గ్రహించు నేమో యని, నేను దీనిని చెప్పి యుంటిని.

కర్మము నశింపగా ఎవ్వడైన నా భక్తుడుండు నేమో అని అట్టివాని కొరకు ఈ పంచ రాత్రమును చెప్పితిని. ఇది నిత్యము అతని హృదయమున నిలుచును.

ఇతరులు రాజస తామస భావములు తమ్ము చుట్టుకొనగా నా కడ కూర్చుండుట యందు పెడ మొగము కలవార గుదురు.

నారదా! కృతము, త్రేత, ద్వాపరము, అని మూడు యుగములు అందు సత్వమున నిలు ద్రొక్కు కొన్నవారు నన్ను కలియుదురు. కలి యందు రజ స్తమో గుణములు పెల్లుగా గలవారు అధికులు.

నారదా! విను, నీకు మరియొక వరము కూడ ఇత్తును మిక్కిలి దుర్లభమైన ఈ పంచ రాత్రమను శాస్త్రమేది కలదో అది నా దయ వలన సంపూర్ణముగా తెలియుదువు. సంశయము లేదు.

వేదము, పంచ రాత్రము, భక్తి, యజ్ఞము అనువాని చేతనే నరునకు నేను అందు వాడను. నాయనా! ఇతర విధముగా కోట్ల కోట్ల ఏండ్లకును లభింపను.

పరమేశ్వరుడగు భగవానుడు నారదునితో ఇట్లు పలికి అదృశ్యు డాయెను. నారదుడును స్వర్గమున కరిగెను.