25 - జమదగ్ని, కార్తవీర్యుల యుద్దము

నారాయణ ఉపోచ - నారాయణముని ఇట్లనెను –

హరిం స్మరన్కార్తవీర్యో హృదయేన విదూయతా ।

దూతం ప్రస్థాపయామాస కుపితో మునిసన్నిధిం ॥

యుద్ధం దేహి మునీశ్రేష్ఠ కిం వా ధేనుం చ వాంఛితం ।

మహ్యం భృత్యాయాతిథయే సువిచార్య యథోచితం ॥

దూతస్య వచనం శ్రుత్వా జహాస మునిపుంగవః ।

హితం సత్యం నీతిసారం సర్వం దూతమువాచ హ ॥

కార్తవీర్యుడు తన మనస్సు బాధపడుచుండగా శ్రీహరిని స్మరించుకొనుచు కోపముతో మునిదగ్గరకు ఒక దూతను పంపెను.

ఆ దూత కార్తవీర్యుడు పలికినట్లు ఇట్లనెను. ఓ మునీ నేను నీకు సేవకుడను, అతిథినికూడ. ఈ రెండిటిని చక్కగా ఆలోచించుకొని నేను కోరుకొనిన కామధేనువునైనను నాకిమ్ము; లేనిచో యుద్ధమునకైనను సిద్ధము కమ్మని పలికెను.

జమదగ్నిముని ఆదూత మాటలను విని నవ్వుచు హితవైనది, సత్యమైనది, నీతియుక్తమైన మాటలనిట్లు పలికెను.

మునిరువాచ - జమదగ్ని ముని ఇట్లు పలికెను –

దృష్టో నృపో నిరాహారః సమానీతో మయా గృహం ।

వివిధo చ యథాశక్త్యా భోజితశ్చ యథోచితం ।

కపిలాం యాచతే రాజా మమప్రాణాధికాo ప్రియాం ।

తాం దాతుమక్షమో దూత యుద్ధం దాస్యామి నిశ్చితం ॥

మునేస్తద్వచనం శ్రుత్వా దూతః సర్వమువాచ హ ।

నృపేంద్రం చ సభామధ్యే సన్నాహైస్సంయుతం భియా ॥

తిండితిప్పలు లేని రాజును చూచి ఇంటికి తీసికొనివచ్చి నా శక్తికొలది అతనికి తగిన భోజనమును వివిధపదార్థములతో పెట్టితిని. అట్టి రాజు నా ప్రాణముల కంటె ప్రియమైన కామధేనువు కావలెనని ఆడుగుచున్నాడు కాని నేనా అవును ఇవ్వలేను కావున తప్పక యుద్ధము చేయుదుననెను.

జమదగ్ని మహర్షి మాటలు విన్న దూత కార్తవీర్యునకు సభలో ఈ విషయమునంతయు చెప్పగా ఆతడు భయముతో యుద్ధసన్నాహము చేయమొదలిడెను.

మునిశ్చ కపిలామాహ సాంప్రతం కిం కరోమ్యహం ।

కర్ణధారం వినా నౌకా తథా సైన్యం వినా మయా ॥

కపిలా చ దదౌ తస్మై శస్త్రాణి వివిధాని చ ।

యుద్దశాస్త్రోపదేశం చ సంధానం చౌపయోగికం ॥

జయం భవతు తే విప్ర యుద్దే జేష్యసి నిశ్చితం ।

తవ మృత్యుర్న భవితా సత్యమస్త్రం వినా మునే ॥

నృపేణ సార్థం తే యుద్ధమయుక్తం బ్రాహ్మణస్య చ ।

దత్తాత్రేయస్య శిష్యేణ వ్యర్థం పై శక్తిధారిణా ।

ఇత్యుక్త్యా కపిలా బ్రహ్మన్ వీరరామ మనస్వినీ ॥

మునిర్మనస్వౌ సైన్యం చ సజ్జీకృత్య తతో మునే ।

గృహీత్వా సర్వసైన్యం చ స జగామ రణాంగణం ॥

జమదగ్నిముని కామధేనువు దగ్గరకు పోయి నేనిప్పుడు ఏమి చేయవలెను? నావికుడు లేని నౌకవలె నేను లేనిచో నాసైన్యముండునని పలుకగా ఆ కామధేనువతనికి అనేక విధములైన శస్త్రములను ఇచ్చి యుద్ధ శాస్త్రోపదేశమును, శస్త్ర సంధాన పద్దతినీ, శస్త్రముల యొక్క ఉపయోగము మొదలగు వాటినన్నిటినీ తెలిపి ఓ మునీ! నీకు యుద్ధమున తప్పక విజయము లభించును. నీకు ఏ శస్త్రము వలనను మరణము సంభవింపదని చెప్పుచు దత్తాత్రేయ మహర్షి శిష్యుడు, వ్యర్థముగా శక్తిని ధరించి తిరుగుచున్న కార్తవీర్యునితో బ్రాహ్మణుడవగు నీవు యుద్ధము చేయుట తగదని కామధేనువు పలికెను.

విజ్ఞుడైన జమదగ్ని ముని కూడ తన సైన్యమునంతయు సమీకరించుకొని రణ రంగమునకు బయలుదేరెను.

రాజా జగామ యుద్దాయ ననామ మునిపుంగవం ।

ఉభయోః సైన్యయోర్యుద్దం బభూవ బహుదుష్కరం ॥

రాజాసైన్యం జితం సర్వం కపిలాసేనయా బలాత్ ।

విచిత్రం చ రథం రాజ్ఞో బభంజే లీలయా రణే ॥

ధమశ్చిచ్ఛేద సజ్యం తత్సా సేనా కాపిలీ ముదా ।

నృపేంద్రః కాపిలేయాని జేతుం సైన్యాని చాక్షమః ॥

సైన్యాని తం శస్త్రవృష్ట్యా న్యస్తశస్త్రం చకార హ ।

శరవృష్ట్యా శస్త్రవృష్ట్యా రాజామూర్ఛామవాప హ ॥

కార్తవీర్యుడు కూడ యుద్ధరంగమును ప్రవేశించి తొలుత జమదగ్నికి నమస్కరించి యుద్ధమును ప్రారంభించెను. రెండు సైన్యములమధ్య గొప్పయుద్ధము జరిగినది. కపిల సృష్టించిన సైన్యమువలన రాజుసైన్యము జయింపబడెను. అట్లే రాజు యొక్క రథము విచిత్రముగా విరిగిపోయెను. కపిల సృష్టించిన సేన వలన ఆ మహారాజయొక్క ధనుస్సుకూడ విరిగిపోయెను. అందువలన కార్తవీర్యుడు కపిల సైన్యములను జయింపలేకపోయెను. ఆ సమయమున కపిలసైన్యము శస్త్రవర్షముచే రాజును ఉక్కిరిబిక్కిరి చేసెను. ఆ సైన్యముయొక్క శరవర్షమునకు, శస్త్రవర్షమునకు తట్టుకొనలేక కార్తవీర్యుడు రణరంగమున మూర్ఛపొందెను.

కించిచ్ఛిష్టం బలం రాజ్ఞః కించిదేవ పలాయితం ।

మునీంద్రో మూర్చితం దృష్ట్యా నృపేంద్రమతిథిం మునే ॥

కృపానిధీశ్చ కృపయా తత్సైన్యం సంబిహార చ ।

గత్వా సైన్యం విలీనం చ కపిలాయాం చ కృత్రిమం ॥

నృపాయ మునినా శీఘ్రం దత్తాశ్చరణరేణవః ।

ఆశీర్వాదం ప్రదత్తం చ జయోఽస్త్వితి కృపాళునా ।

కమండలు జలం ప్రోక్ష్య జీవయామాస తం నృపం ॥

స రాజా చేతనాం ప్రాప్య సముత్థాయ రణాంగణాత్ ।

మూర్ద్నా ననామ భక్త్యా చ మునిశ్రేష్ఠం కృతాంజలిః ॥

మునిః శుభాశీషం దత్వా రాబోనం త్వాలిలింగ సః ।

పునస్తం స్నాపయిత్వా చ భోజయామాస యత్నతః ॥

యుద్ధమున రాజగు కార్తవీర్యుని సైన్యము కొంతమాత్రమే మిగిలియుండెను. మరికొంత పలాయనమును చిత్తగించెను. మునీంద్రుడగు జమదగ్ని తన అతిధియగు కార్తవీర్యుడు మూర్ఛనొందియుండుటను గమనించి దయతో ఆ మహారాజుయొక్క మిగిలిన సైన్యమును చంపక వదలిపెట్టాను. కపిల సృష్టించిన సైన్యము కపిలయందు విలీనమయ్యెను. అప్పుడు ముని దయతో అతనికి జయము కలుగునట్లు ఆశీర్వదించి తన కమండలువులోనున్న నీటితో ఆ మహారాజు మూర్చనుండి తేరుకొనునట్లు చేసెను. రాజగు కార్తవీర్యుడు రణరంగమున మూర్చనుండి తేరుకొని భక్తితో మునికి నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడెను. ముని యాతనికి శుభాశీసుల నొసగి ఆలింగనము చేసికొని అతనికి స్నానము చేయించి భోజనమును సైత మొసగెను.

నవనీతం హి హృదయం బ్రాహ్మణానాం తు సంతతం ।

అన్యేషాం క్షురధారాభమసాధ్యం దారుణం సదా ।

ఉవాచ తం మునిశ్రేష్ఠో గృహం గచ్ఛ ధరాధిప ॥

బ్రాహ్మణులయొక్క హృదయమెల్లప్పుడు నవ్య నవనీతము వలె మృదువుగా నుండును. ఇతరుల యొక్క మనస్సు కత్తియొక్క అంచువలె దారుణమైయుండును.

అందువలన జమదగ్నిముని రాజాతో నీవు ఇంటికి వెళ్ళిపొమ్మని పలికెను.

రాజోవాచ - రాజగు కార్తవీర్యు డిట్లు పలికెను –

రణం దేహి మహాబాహో ధేనుం కిం వా మయేప్పితాం ॥

పరాక్రమశాలివగు జమదగ్ని మహర్షీ! నాకు ఇష్టమైన కామధేనువునైననిమ్ము లేనిచో నాతో యుద్ధమునైన సేయుమనికోరెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే జమదగ్ని కార్తవీర్యార్జున యుద్ధవర్ణనం నామ పంచవింశోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన జమదగ్ని కార్తవీర్యార్జునుల యుద్ధవర్ణనము కల ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.