20 -  గణపతికి గజముఖమే ఎందుకు?  

నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను –

హరేరంశ సముత్పన్నో హరీతుల్యో భవాన్ ధియా ।

తేజసా విక్రమేణైవ మత్ప్రశ్నం శ్రోతుమర్హసి ॥

విఘ్ననిఘ్నస్య యద్వీఘ్నo శ్రుతం తత్ పరమాద్భుతం ।

తద్వీఘ్నకారణం చైవ విశ్వకారణవక్తృతః ॥

ఆధునా శ్రోతుమిచ్ఛామి పరం సందేహభంజనమ్ ।

త్రైలోక్యనాథతనయే గజాస్యాయోజనార్థకమ్ ॥

స్థితేష్వన్యేషు బహుషు జంతుష్వబ్జభువః పతే ।

సుప్రాణినాం సురూపేషు నానారూపేవు రూపిణాం ॥

ఓ నారాయణమునీ! నీవు శ్రీహరియొక్క అంశవలన జన్మించినవాడవు. అందువలన నీవు బుద్దియందు, తేజస్సున, పరాక్రమమున శ్రీహరితో సమానుడవు. విఘ్నాధిపతియైన గణాధిపతికి కలిగిన విఘ్నమును గొప్పగా వివరించితివి. ఆట్లే ఆ విఘ్నమునకు కారణమైన దానిని, సృష్టికర్తయైన బ్రహ్మదేవునిద్వారా వినిపించితివి.

ఇప్పుడు నాకొక సందేహము కలదు. అది ముల్లోకములకు అధిపతియగు శంకరుని పుత్రునకు ఏనుగు ముఖమునే ఎందుకు పెట్టిరనునది. ఈ ప్రపంచమున చాలా జంతువులున్నవి. అందమైన రూపముకల అనేక ప్రాణులుండగా ఏనుగ ముఖమునే ఎందులకు అతికించిరనునది నా సందేహము అని పలికెను.

శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లు నారదునితో అనెను –

గజాస్యయోజనాయాశ్చ కారణం శృణు నారద ।

గోప్యం సర్వపురాణేషు వేదేషు చ సుదుర్లభం ॥

తారణం సర్వదుఃఖానాం కారణం సర్వసంపదాం ।

హారణం విపదాం చైవ రహస్యం పాపమోచనం ॥

మహాలక్ష్మ్యాశ్చ చరీతం సర్వమంగళ మంగళం ।

సుఖదం మోక్షదం చైవ చతుర్వర్గ ఫలప్రదం ॥

గణాధిపతికి ఏనుగ తలను పెట్టు విషయము సమస్త పురాణములలో, వేదములలోనూ రహస్యముగానున్నది. దానికి సంబంధించిన మహాలక్ష్మియొక్క చరిత్రను నీకిప్పుడు వివరింతును.

అది సమస్త దుఃఖములను పోగొట్టును. సమస్త సంపదలను కలిగించును. ఆపదలను తొలగించును. పాపములను పోగొట్టును. సుఖమును, మోక్షమును, ధర్మార్థకామమోక్షములను కలిగించును.

శృణు తాత ప్రవక్ష్యాహం ఇతిహాసం పురాతనం ।

రహస్యం పాద్మకల్పస్య పురా తాతముఖాత్ శ్రుతం ॥

ఏకదైవ మహేంద్రశ్చ పుష్పభద్రా నదీం యయౌ ।

మహాసంపన్మదోన్మత్తః కామీ రాజశ్రీయాన్వితః ॥

తత్తర్యేతిరహః స్థానే పుష్పోద్యానే మనోహరే ।

అతీవ దుర్గమేఽరణ్యే సర్వజంతువివర్జితే ॥

భ్రమర ధ్వనిసంయుక్తే పుంస్కోకిలరుతశ్రవే ।

సుగంధి పుష్ప సంశ్లిష్ట వాయునా సురభీకృతే ॥

దదర్శ రంభార తత్రైవ చంద్రలోకాత్ సమాగతాం ।

సురత శ్రమ విశ్రాంతికాముకీం కామకాముకీం ॥

ఇచ్చంతిమీప్సితాo క్రీడాం గచ్ఛంతీం మదనాశ్రమం ।

ఏకాకినీమున్మనస్కాం మన్మథోద్గత మానసాం ॥

సుశ్రోణీం సుదతీం శ్యామాం బింబాధర సరోరుహాం ।

బృహన్నితంబ భారార్తాం మత్తవారణగామినీం ॥

సుస్మితాస్య శరచ్చంద్రాం సుకటాక్షం చ బిభృతీం ।

బిభ్రతీం కబరీం రమ్యాం మాలతీమాల్య శోభితాం ॥

వహ్నిశుద్ధాంశుక ధరాం రత్నభూషణ భూషితాం ।

కస్తూరీ బిందునా సార్థం సిందూరం బిభృతీం ముదా ॥

నీలోత్పల దళశ్యామ కజ్జలోజ్వల లోచనాం ।

మణికుండల యుగ్మాఢ్య గండస్థల విరాజితార ॥

అత్యున్నతం సుకఠినం పత్రరాజి విరాజితం ।

సుఖదం రసికానాం చ స్తనయుగ్మంచ బిభృతీం ॥

నారదా! పాద్మకల్పమున రహస్యముగానున్న ప్రాచీనేతిహాసమును నీకు తెలిపెదను వినుము.

ఒకప్పుడు దేవేంద్రుడు అత్యధిక సంపదవలన కలిగిన మదమువలన ఉన్మత్తుడై, రాజశోభతో ప్రకాశించుచు, మహాకాముకుడై పుష్పభద్రానదీతీరమునకు పోయెను. ఆ పుష్పభద్రానదీ తీరమున మిక్కిలి రహస్యముగానున్న పుష్పవనమును చేరుకొనెను. ఆ పుష్పోద్యానము మిక్కిలి సుందరమై, ఎటువంటి జంతువులు లేక తుమ్మెదలు, గండుకోయిలల ద్వనితో, సువాసన గలిగిన పిల్లవాయువులతో ఆహ్లాదజనకముగానుండెను.

ఆ సమయమున చంద్రలోకమునుండి మన్మథుని కోరి అతని ఆశ్రమమునకు ఒంటరిగా మన్మథుని మనస్సులో భావించుకొనుచున్న రంభ ఆ ప్రాంతమునకు వచ్చెను. ఆమె చక్కని పిరుదులలో, చక్కని పల్వరుసతో, మదించిన ఏనుగువలె మెల్లగా పోవుచుండెను. చక్కని అందము, శరత్కాలపు చంద్రునివంటిముఖము, చిరునవ్వు, మాలతీపుష్పమాల కలిగిన కొప్పు, మంచిగానున్న వస్త్రము, రత్నభూషణములు, పాపెటలో కస్తూరిచేర్చుక్కనున్న సిందూరము, నల్లకలువలవంటి కన్నులు, మణికుండలములు, మకరీకాపత్రములతో సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాల చక్కగానుండెను.

సర్వశోభాం సువేషాడ్యాం సుభగాం సురతోత్సుకాం ।

ప్రాణాధీకాం చ దేవానాం స్వచ్ఛాం స్వచ్ఛందగామినీం ॥

వారమప్సరసం రమ్యామతీవ స్థిరమౌవనాం ।

గుణరూపవతీం శాంతాం మునిమానసమోహినీం ॥

దృష్ట్యా తామతివేషాడ్యాం తత్కటాక్షేన పీడితః ।

ఇంద్రోఽతీంద్రియ చాపల్యాత్ ప్రవక్తుముపచక్రమే ॥

చక్కగా అలంకరించుకొని, మన్మథునితో కలయుటకు ఆమె పోవుచుండెను. దేవతలందరకు ప్రాణములకంటే మిన్నయైన రంభ స్వేచ్చగా తిరుగు స్వభావము కలది, సుస్థిరమైన యౌవనము కలది, ఇంకను ఆమె తన రూప విభ్రమములచే మునులయొక్క చిత్తమును అపహరించు స్వభావము కలది, అతిగా అలంకరించుకొనిపోవుచున్న ఆ రంభను ఏకాంతమున ఇంద్రుడు చూచి ఇంద్రియచాపల్యమువలన ఆమెతో ఇట్లు మాటాడసాగెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడిట్లు పలికెను –

క్వగచ్చసి వరారోహే క్వ గతాఽసి మనోహరే ।

మయా దృష్టా హి సుచీరాత్కల్యాణి సుభగేఽధునా ॥

తవాన్వేషణ కర్తాఽహం శ్రుత్వా వాచీకమగ్రతః ।

త్వదాసక్తమనాశ్చాస్మి నాన్యాం వై గణయామి చ ॥

సువాసితజలార్థీ యః కిమిచ్ఛేత్సంకిలం జలం ।

పంకం నేచ్ఛేచ్చందసార్థీ పంకజార్థీ నచోత్పలం ॥

సుధార్థీ న సురామిచ్చేద్దుగ్ధార్థీ నావిలం బలం ।

సుగంధ పుష్పశాయీ యో హ్యస్త్రతల్పం న చేచ్ఛతి ॥

స్వర్గీ చ నరకం నేచ్ఛేత్సుభగీ దుష్టభోజనం ।

పండితైస్సహ సంవాసీ నేచ్ఛేత్ స్త్రీ సన్నిధిం నరః ।

విహాయ రత్నాభరణం కోఽపిచ్ఛేల్లోహభూషణం ॥

త్వాం నాశ్లిష్య మహావిజ్ఞాం కాం మూడోగంతుమిచ్ఛతి ।

విహాయ గంగార కో విజ్ఞో నదీమన్యాం చ వాంఛతి ॥

ఇంద్రియైశ్చంద్రీయరతిం వర్ధయంతీం పదే పదే ।

వరం ప్రార్థయితారశ్చ ప్రాణినశ్చ సుఖార్థినః ॥

ఓ అందమైనదానా! నీవెచ్చటికి పోవుచున్నావు. ఎక్కడినుండి వచ్చుచున్నావు. చాలాకాలమునకు నీపు కనిపించితివి. నేను నీన్నే వెదకుచున్నాను. నీపైగల కోరికచే సువాసితమైన తీయ్యని నీరు తాగువాడు బురదనీరును త్రాగనట్లు, గంధము కావలయునను కొనువాడు బురదను ముట్టనట్లు, అమృతమును కోరువాడు సురను ఇష్టపడనట్లు, పాలు త్రాగువాడు అపరిశుద్ధజలమును ఇష్టపడనట్లు, నువాసనగల పుష్పములయందు నిదురించువాడు ఆస్త్రశయ్యను కోరుకొననట్లు, స్వర్గమున నుండువాడు నరకమును ఇష్టపడనట్లు, అందమైనవాడు దుష్టభోజనము చేయనొల్లనిట్లు, రత్నాభరణములు ధరించువాడు ఇనుముతో చేసిన ఆభరణములను ఇష్టపడని యట్లు, చక్కని తెలివి అందము గల నిన్ను వదలిపెట్టి ఇతరస్త్రీల పొందును కోరుకొనలేను. నీ ఇంద్రియములచే ఇంద్రియ సుఖమును పెంపొందించు నిన్ను వదలి ఇంకొక స్త్రీని మనసులోనైన స్మరింపలేకున్నాను. ప్రతి ప్రాణియు సుఖా భిలాషియైనను శ్రేష్ఠమైన దానినే ఎక్కువగా కోరుకొనును.

ఇత్యేవముక్త్యా భగవానవరుహ్య గజేశ్వరాత్ ।

కామయుక్తశ్చ పురతః తస్థౌ తస్యాశ్చ నారద ॥

కామముతోనున్న దేవేంద్రుడు ఈవిధముగా రంభతో మాటలాడుచు తన గజమగు ఐరావతమునుండి క్రిందకు దిగి రంభ ముందు నిలబడెను.

శ్రుత్వా తద్వచనం రంభా మహాశృంగారలోలుపా ।

జహాసాఽనమ్రవదనా పులకాంచిత విగ్రహా ॥

స్మేరాననా కటాక్షేణ స్తనోర్వోర్దర్శనేన చ ।

నర్మోక్తిగర్భవాక్యేన చాహరత్తస్య చేతనం ॥

మితం సారం సుమధురం సుస్నిగ్ధం కోమలం ప్రియం ।

పురుషాయత్తబీజం చ ప్రవక్తుముపచక్రమే ॥

మహాశృంగారమును కోరుకొను రంభ ఇంద్రుని సరస సంభాషణములను విని పులకించిపోయి, తలను వంచుకొని నవ్వెను. ఆ రంభ తన చిరునవ్వు, కటాక్షము, స్తనములను ఊరువులను చూపించుట, నర్మోక్తులుగల మాటలు మొదలగు వాటిచే ఇంద్రుని మనస్సును చూరగొనెను. అటుపిమ్మట సుమధురము, కోమలము, ప్రియమైనది, పురుషుని స్వాధీనము చేసికొను మాటలను మితముగా ఇట్లు పలకసాగెను.

రంభోవాచ - రంభ ఈవిధముగా పలికెను –

యాస్యామీ వాంఛితం యత్ర ప్రశ్నేన తవ కిం ఫలం ।

నాహం సంతోషజననీ ధూర్తానాం దుష్టమిత్రతా ॥

యథా మధుకరో లోభాత్సర్వపుష్పాసవం లభేత్ ।

స్వాదు యత్రాతిరిక్తం స తత్ర తిష్ఠతి సంతతం ॥

తథైవ కాముకీ లోకే భ్రమే ద్భ్రమరవత్సదా ।

చాంచల్యత్స హి కాస్వేవ వాయువద్రసమాహరేత్ ॥

స పుమానంగవత్ స్త్రీణాం యథా శాఖాశ్చ శాలినాం ।

కాముకీ కాకవల్లోలః ఫలం భుంక్యా ప్రయాతి చ ॥

స్వకార్యముద్ధరేద్యావత్తావద్వా సప్రయోజనం ।

స్థితిః కార్యానురోధేన యథా కాష్ఠే హుతాశనః ॥

యావత్తడాగే తోయానీ తాపద్యాదాంసి తేషు చ ।

శోషారంభే చ తోయానాం యాంతి స్థానాంతరం పునః ॥

త్వం దేవానామీశ్వరోఽసి త్వం కామినీనాం చ వాంఛితః ।

పుమాంసం రసికం శశ్వద్వాంఛంతి రసికాః సుఖాత్ ॥

యువానం రసికం శాంతం సువేషం సుందరం ప్రియం ।

గుణినం ధనినం స్వచ్ఛం కాంతమిచ్ఛతీ కామినీ ॥

దుశ్శీలం రోగిణం వృద్ధం రతిశక్తివియోజితం ।

అదాతారమవిజ్ఞం చ నైవ వాంఛంతి యోషితః ॥

కా మూఢ న చ వాంఛంతి త్వామేవం గుణసాగరం ।

తవాజ్ఞాకారిణీం దాసీం గృహాణాత్ర యథాసుఖం ॥

ఓ ఇంద్రుడా! నేను ఎచ్చటికి పోవుచున్నానను ప్రశ్నవలన నీకేమి ఫలితము కలదు. ఐనను నేను దుష్టులకు సంతోషమును కలిగించుదాననుకాదు. దుష్టులతో నేను సావాసమును చేయను.

తుమ్మెద అన్ని పుష్పములనుండి మకరందమును గ్రహించినను రుచిగల కొన్ని పుప్పుములపైననే ఎల్లప్పుడుండును. అట్లే కాముకుడు కూడ అంతట తిరిగిననూ, కొందరినే అనుభవించును. కాకియెట్లు చెట్లపై వాలి పండ్లను తిని పోవునో కాముకుడట్లే ఫలముననుభవించిపోవును. చెరువులలో నీరున్నంతవరకు జలచరములున్నట్లు కాముకుడు తన అవసరమున నుసరించియుండును.

ఐనను నీవు దేవతలకు అధిపతివి. కామినులందరు నిన్నెల్లప్పుడు కోరుకొందురు. రసికలగు స్త్రీలు రసికునే ఎల్లప్పుడు కోరుకొందురు. కామినియగు స్త్రీ యువకుడు, రసికుడు, అందగాడు, చక్కగా అలంకరించుకొనువాడు, గుణవంతుడు, ధనవంతుడగు పురుషుని మాత్రమే కామీంచును. అట్లే చెడునడక కలవాడు, రోగి, ముసలివాడు, రతి శక్తిలేనివాడు, ధనము నీయనివాడు, తెలివి తక్కువవాడగు పురుషుని ఎల్లప్పుడు కోరుకొనదు. అందువలన నీవంటి గుణసముద్రుని ఏ స్త్రీ కోరుకొనదు?. కావున నీ అజ్ఞను శిరసావహించు ఈ దాసిని నీ సుఖమునకై స్వీకరింపుమని రంభ పలికెను.

ఇత్యుక్త్వా సస్మితా సా చ తం పపౌ వక్రచక్షుషా ।

కామాగ్నిదగ్ధ విగళల్లజ్జా తస్థౌ సమీపతః ।

జ్ఞాత్వా భావం స్మరార్తాయాః స్మరశాస్త్ర విశారదః ।

గృహీత్వా తాం పుష్పతల్పే విజహార తయా సహ ।

చుచుంబ రహసి ప్రౌడాం నగ్నాం చ సుభగాo వరాం ।

పక్వబింబాధరోష్ఠీం చ సుదత్యా చుంబితస్తయా ॥

నానాప్రకార శృంగారాద్వీపరీతాదికాన్మునే ।

సుఖి బభూవ తస్యాం వై శృంగారో మూర్తిమానివ ।

తౌ కామాహితచిత్తౌ నో బుబుధాతే దీవానీశం ।

అన్యోన్య గతచిత్తౌ చ కామార్తె జ్ఞానవర్జితౌ ।

స చ కృత్వా స్థలే క్రీడాం తయా సహ సురేశ్వరః ।

యయౌ జలవిహారార్థం పుష్పభద్రానదీజలం  ॥

స చకార జలక్రీడాం తయా సహ ముదా క్షణం ।

జలాత్స్థలే స్థలాత్తోయే విజహార పునః పునః ॥

ఈవిధముగా రంభ దేవేంద్రునితో మాటాడుచు చిరునవ్వుతో చూచెను. ఆమె మన్మథాగ్నిచే దహించుకొని పోవుచుండెను. అందువలన సిగ్గు వదిలి ప్రవర్తించుచుండెను. మన్మథ శాస్త్ర విశారదుడగు దేవేంద్రుడు మన్మథునిచే బాధపడుచున్న రంభ యొక్క మనసును గ్రహించి ఆమెను తీసికొని పుష్పశయ్యపై విహరించెను. ప్రౌడ, ఆందముగలది, శ్రేష్ఠురాలు దొండపండువలే ఎఱ్ఱని అధరముగల రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా రంభకూడ అతనిని ముద్దిడెను. వీపరీత శృంగారము మొదలగు నానా ప్రకారములగు శృంగారములవలన దేవేంద్రుడు రంభతో పరమ సౌఖ్యమును పొందెను. కామముతో కూడుకున్న ఆ రంభాదేవేంద్రులు అన్యోన్యముగానుండి జ్ఞానమును వదిలి రాత్రింబగళ్ళు తెలియకనుండిరి. దేవేంద్రుడు రంభతో భూమిపై క్రీడలు సల్పి పుష్పభద్రానదిలో జలవిహారమున కేగెను. జలక్రీడ తరువాత స్థలక్రీడ, తిరిగి జలక్రీడ అనునట్లు వారు చాలాకాలము విహరించిరి.

ఏతస్మిన్నంతరే తేన వర్త్మనా మునిపుంగవః ।

సశిష్యో యాతి దుర్వాసా వైకుంఠాచ్ఛంకరాలయం ॥

తం చ దృష్ట్యా మునీంద్రం చ దేవేంద్రః స్తబ్దమానసః ।

ననామాగత్య సహసా దదౌ తస్మై స చాశిషః ॥

పారిజాత ప్రసూనం యద్దత్తం నారాయణేన వై ।

తచ్చ దత్తం మహేంద్రాయ మునీంద్రేణ మహాత్మనా ॥

దత్వా పుష్పం మహాభాగస్తమువాచ కృపానిధిః ।

మాహాత్మ్యం తస్య యత్కించిదపూర్వం మునిసత్తమః ॥

ఆ సమయమున దుర్వాసమహర్షి తన శిష్యులతో వైకుంఠమునుండి కైలాసమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. దుర్వాసమహర్షిని చూచి దేవేంద్రుడతనికి నమస్కరించెను. అప్పుడా మహర్షి దేవేంద్రునికి ఆశీస్సులనొసగి శ్రీమన్నారాయణుడు తనకు కానుకగానిచ్చిన పారిజాత పుష్పము నతనికిచ్చి ఆ పుష్పముయొక్క మహాత్మ్యమునిట్లు చెప్పసాగెమ.

దుర్వాస ఉవాచ - దుర్వాసమహర్షి ఇట్లు పలికెను –

సర్వవిఘ్నహరం పుష్పం నారాయణ నివేదితం ।

మూర్థ్నీదం యస్య దేవేంద్ర జయస్తస్యైవ సర్వతః ॥

పురః పూజా చ సర్వేషాం దేవానామగ్రణీర్భవేత్ ।

తచ్ఛాయేన మహాలక్ష్మీర్న బిహాతి కదాఽపి తం ॥

జ్ఞానేన తేజసా బుద్ద్యా విక్రమేణ బలేన చ ।

సర్వదేవాధికః శ్రీమాన్ హరితుల్యపరాక్రమః ॥

భక్త్యా మూర్థ్నీ న గృహ్ణాతి యోఽహంకారేణ పామరః ।

నైవేద్యం చ హరేరేవ స భ్రష్టశ్రీః స్వజాతీభిః ।

ఇత్యుక్త్వా శంకరాంశశ్చ హ్యగమచ్ఛంకరాలయం ॥

ఈ పారిజాతపుష్పము శ్రీమన్నారాయణుని అర్చనకై సమర్పింపబడినది. దేవేంద్ర! దీనినెవరు శిరసున ధరింతురో వారికి అంతట జయము లభించును. సమస్త దేవతలకంటే ముందుగా అతడే గౌరవింపబడును. అతనిని మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడు అంటి పెట్టుకొనియే యుండును. జ్ఞానమున, తేజస్సునందు, బుద్ధియందు, విక్రమమున, బలమున అతడు శ్రీమన్నారాయణునితో సమానుడగును. సమస్త దేవతల యందు అతడు శ్రేష్ఠుడై యుండును.

అట్లే అహంకారము వలన ఎవరు ఈ పుష్పమును భక్తితో స్వీకరింపరో, వారు శ్రీహరి నైవేద్యమును స్వీకరింపనివారివలె తమ కులమునుండి భ్రష్టులైపోవుదురని చెప్పి శంకరుని అంశస్వరూపుడగు దుర్వాసమహర్షి కైలాసపర్వతమునకు పోయెను.

తత్స రంభాంతికే తిష్ఠన్ చిక్షేప గజమస్తకే ।

తేన భ్రష్టశ్రీయం దృష్ట్యా సా జగామ సురాలయం ॥

పుంశ్చలి యోగ్యమిచ్ఛంతి నాపరం చంచలాఽధమా ।

దేవేంద్రుడు రంభసమీపమున కామమోహితుడైయుండి ఆ దివ్యపుష్పమును తన గజముయొక్క శిరస్సుపై పారవేసెను. ఆ దివ్యపుష్పమును గౌరవించనందున దేవేంద్రుడు సంపదను కోల్పోగా రంభ స్వర్గమునకు పోయెను. చంచలస్వభావము కలది, అధమురాలు, వారవనితయగు రంభ దేవేంద్రుని కంటె యోగ్యుడైన ఇంకొక పురుషునికై వెళ్ళిపోయేను.

దేవరాజం పరిత్యజ్య గజరాజో మహాబలి ॥

ప్రవివేశ మహారణ్యం తం నిక్షిప్య స్వతేజసా ।

తత్రైవ కరిణీం ప్రాప్య మత్తః సంబుభుజే బలాత్ ॥

సాఽతో బభూవ వశగా యోషిజ్జాతిః సుఖర్థినీ ।

తయోర్బభూవాపత్యానాం నివహస్తత్ర కాననే ॥

దేవతలకు అధిపతియగు ఇంద్రుని గజము పారిజాత పుష్పమును శిరస్సుపై ధరించుటవలన ఆ పుష్పమును తిరస్కరించిన దేవేంద్రుని వదలి మహారణ్యమును ప్రవేశించెను. అచ్చటనున్న ఆడఏనుగుతో కలసి తిరిగినందువలన దానికి చాలా సంతానము కలిగినది.

హరీస్తన్మస్తకం ఛిత్వా యోజయామాస బాలకే ।

ఇత్యేవం కథితం వత్స కిం భూయః శ్రోతుమిచ్ఛసి ।

గజప్యాయోజనాయాశ్చ కారణం పాపనాశనం ॥

శ్రీహరి ఆ గజముయొక్క తలను తెప్పించి శని యొక్క దృష్టి దోషము వలన శిరస్సు తెగిపోయిన పార్వతీదేవి పుత్రుని శరీరమున కతికించెను.

నారదా! ఈవిధముగా పార్వతీదేవి పుత్రునకు గజశిరస్సు కలుగుటకు కల కారణమున తెలిపితిని. ఈకథ పాపమును పోగొట్టును. ఇంకనూ నీవు వినదలచినదేదైన ఉన్నచో అడుగుమని నారాయణముని నారదునితో అనెను.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణే తృతియే గణపతఖండే నారద నారాయణసంవాదే గణపతేర్గఙాప్య యోజనా హేతుకథనం నామ వింశతీతమోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున తెల్పబడిన గణపతికి ఏనుగ శిరస్సు ఏర్పడుటకుగల కారణమును తెలుపు ఇరువదవ అధ్యాయము సమాప్తము.