5 - పుణ్యక వ్రత ప్రాశస్త్యము

నారాయణ ఉవాచ - నారాయణుడు నారదునితోనిట్లనెను-

 శ్రుత్వా వ్రతవిధానే చ దుర్గా పంహృష్ణమానసా ।

పునః పప్రచ్ఛ కాంతం సా దివ్యాం వ్రతకథాం శుభాం ॥

నారదా! శంకరుడు చెప్పిన పుణ్యకవ్రతవిధానమును, దాని ఫలితమును విన్న పార్వతి సంతోషించిన మనస్సుతో శుభములనిచ్చు ఆ వ్రతకథను వినిపించుమని మరల పరమేశ్వరుని ఆడిగెను.

శ్రీపార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

కిమద్బుత ఫలం నాథ విధానం ఫలమస్య చ ।

అధికాం తత్కదాం బ్రూహి వ్రతం కేన ప్రకాశితం॥

పరమేశ్వరా! ఈపుణ్యకవ్రతముయొక్క ఫలము చాల ఆద్భుతముగా నున్నది. అట్లే ఈ వ్రత విధానము ఆపూర్వముగానున్నది. ఆందువలన ఆ పుణ్యకవ్రతకథను చక్కగా తెలుపుము. ఆదేవిధముగా ఆవ్రతమును ఎవరు వాడుకలోనికి తెచ్చిరో తెలుపుము అని అడిగెను.

అథపుణ్యకవ్రతకథా - పుణ్యకవ్రతకథా ప్రారంభము

 శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడిట్లు పార్వతితోననెను-

శతరూపొమనోః పత్నీ పుత్రదుఃఖేన దుఃఖితా।

బ్రహ్మణః స్థానమాగత్య సా బ్రహ్మాణమువాచ హా॥

మనువుయొక్క భార్యయగు శతరూపాదేవికి పుత్రదుఃఖమేర్పడినప్పుడు ఆమె బాధతో బ్రహ్మలోకమునకుపోయి బ్రహ్మతో ఇట్లు పలికెను.

శతరూపోవాచ - శతరూపాదేవి ఇట్లనెను-

 బ్రహ్మాన్ కేన ప్రకారేణ వంధ్యాయాశ్చ సుతో భవేత్ ।

తన్మే బ్రూహి జగద్ధాతః సృష్టి కారణ కారణ ॥

తజ్జన్మ నిష్ఫలం బ్రహ్మవైశ్వర్యం ధనమేవ చ ।

కించిన్న శోభతే గేహే వినా పుత్రేణ పుత్రిణాం॥

 తపోదావోద్భవం పుణ్యం జన్మాంతరసుఖావహం।

సుఖదో మోక్షడోప్రీతిదాతా పుత్రశ్చ పుత్రీణాం ॥

పుత్రీ పుర్రముఖం దృష్ట్యా చాశ్వమేధశతోద్భవం ।

 ఫలం పున్నోమనరకప్రాణహేతుం లభేత్ ధ్రువం ॥

ఓబ్రహ్మదేవుడా! గొడ్రాలైన స్త్రీకి సంతానమెట్లు కలుగునో సృష్టికారణకారణుడవైన నీవు తెలుపుము. తలిదండ్రులకు సంతానము లేనిచో వారి జన్మ నిష్పలమగును. వారీ ఐశ్వర్యము, ధనమంతయు వ్యర్థమగును. సంతానము లేనిచో వారి ఇల్లు బోసిపోయినట్లుండును. తపస్సు దానములవలన కలుగు పుణ్యము రాబోవు జన్మలలో సుఖము కలిగించును. కాని పుత్రుడు సుఖమును సంతోషమును ఈజన్మలోనే ఇచ్చును. తలిదండ్రులు పుత్రుని ముఖము చూచినంతమాత్రమున నూరు త్వమేధయాగములు చేసిన ఫలమును పొందుదురు. ఆది పున్నామనరకమునుండి వారిని రక్షించును.

పుత్రోత్సత్తేరుపాయం ఫై వద మాం తాపసంయుతాం ।

తదా భద్రం న చేత్ భర్త్రా సమాయాస్యామీ కాననం॥

గృహాణ రాజ్యమైశ్వర్యం ధనం పృథ్వీం ప్రజావహాం।

కినేతేనావయోస్తాత వినా పుతైరపుత్రిణో॥

అపుత్రిణో ముఖం ద్రష్టుం విద్వనోత్సహతే శివం ।

ముఖం దర్శయితుం లజ్జం సమవాప్నోత్యపుత్రకః ॥

అథవా గరళం భుక్త్యా ప్రవక్ష్యామి హుతాశనం।

అపుత్రపౌత్రమశివం గృహం స్యాత్ శ్రీవిహీనకం॥

ఓబ్రహ్మదేవుడా! సంతానములేదని బాధపడుతున్న నాకు పుత్రోత్పత్తి కలుగు ఉపాయమును తెలుపుము. లేనిచో నేను నా భర్త ఇద్దరము కలసి అడవికి పోయెదము. సంతానములేని మాకు ఈరాజ్యమెందులకు? ఈ ఐశ్వర్యము, ధనము, భూమీ ఇవన్ని ఉన్నప్పటికి వ్యర్థముగానున్నవి.

విద్వాంసుడు పుత్రులు లేనివాని ముఖము చూచుటకు ఇష్టపడడు. ఆ తలిదండ్రులు సహితము తమ ముఖమును నలుగురికి చూపుటకు సిగ్గుపడుదురు. నీవు మాకు పుత్రోత్పత్తి కలుగుమార్గము చూపించనీచో వీషముడిని, లేక నిప్పులోబడి మా ప్రాణములమ వదలి పెట్టుదుము. సంతానము లేనివారి ఇల్లు శోభలేకయుండును.

ఇత్యేవముక్త్యా సా సాక్షాత్ బ్రహ్మణోగ్రే రురోద హ।

కృపానిధిశ్చ తాం దృష్ట్యా ప్రవక్తుతుముపచక్రమే ॥

ఈవిధముగాశతరూపాదేవి బ్రహ్మదేవునకు తనబాధ చెప్పుకొనుచు ఏడ్చెను. అప్పుడు దయానిధీ యగు బ్రహ్మదేవుడు ఈవిధముగా ఆమెను ఓదార్చెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లు శతరూపతో పలికెను-

 శ్రుణు వత్సే ప్రవక్ష్యామి పుత్రోపాయం సుఖాపహం।

సర్యైశ్వర్యాది బీజం చ సర్వవాంఛాప్రదం శివం ॥

మాఘ శుక్ల త్రయోదశ్యాం క్రితమేతత్సుపుణ్యకం ।

కర్తవ్యం శుక్లకాలే చ కృష్ణమారాధ్య సర్వదం॥

సంవత్సరం చ కర్తవ్యం సర్వవిఘ్న వినాశనం ।

ద్రవ్యాణి వేదైరుకావీ ప్రతే దేయావీ సుప్రతే॥

వ్రతం చ కాణ్వశాభోక్తం సర్వవాంఛితసిద్ధిదం ।

కృత్వా పుత్రం లభ శుభే విష్ణుతుల్య పరాక్రమం॥

 బ్రహ్మణ శ్చవచః శ్రుత్వా సా కృత్వా వ్రతముత్తమం।

ప్రియవ్రతోత్తానపాదౌ లేభే పుత్రౌ మనోహరే ॥

ఓ శతరూపా! సమస్తైశ్వర్యములను కలిగించునదీ, అన్ని కోరికలు తీర్చునది, సుఖమునిచ్చునది యగు పుత్రులు కలుగు ఉపాయము నీకు చెప్పెదను వినుము.

ఈ సుపుణ్యక వ్రతమును మాఘశుద్ధ త్రయోదశినాడు సమస్తవాంఛలు తీర్చు శ్రీకృష్ణుని ఆరాధించి చేయవలెను. సమస్త విఘ్నములను తొలగించు ఈ వ్రతమును సంవత్సరకాలము చేయవలెను. ఈవ్రతమునకు అవసరమగు ద్రవ్యములన్నియు వేదమున చెప్పబడినవి. శుక్లయజుర్ వేదమందలి కాణ్వశాఖలో చెప్పబడిన ఈవ్రతమునాచరించి విష్ణుమూర్తితో సమాను డగు పుత్రుని పొందుమని బ్రహ్మదేవుడు చెప్పగా విని శతరూపాదేవి ఆవ్రతము గోచరించి ప్రియవ్రత, ఉత్తాపాదులను పుత్రులను పడసినది.

వ్రతం కృత్వా దేవహూతిర్లేభే సిద్దేశ్వరం సుతం।

నారాయణాంశం కపిలం పుణ్యకం పుణ్యదం శుభం ॥

ఆరుంధతీదం కృత్వా తు లేభే శక్తిసుతం శుభా ।

శక్తికాంతా వ్రతం కృత్వా సుతం లేభే పరాశరం ॥

అదితిశ్చ వ్రతం కృత్వా లేభే వామనకం సుతం ।

శచీ జయంతం పుత్రం చ లేభే కృత్వేదమీశ్వరీ॥

 ఉత్తానపాద పత్నిదం కృత్వా లేభే ధ్రువం సుతం ।

కుబేర బియా కృత్వదం లేభే చ నలకూబరం॥

సూర్యపత్ని మనం లేభే కృట్వేదం వ్రతముత్తమం ।

ఆత్రీపత్నీ సుతం చంద్రం లేభే కృత్వేదముత్తమం ॥

లేభే చాంగిరసః పత్నీ కృత్వేదం వ్రతముత్తమం ।

బృహస్పతిం సురగురుం పుత్రమస్య ప్రభావతః॥

భృగోర్భార్యా వ్రతం కృత్వా లేఖే దైత్యగురుం సుతం ।

శుక్రం నారాయణాంశం చ సర్వతేజస్వినాం వరం ॥

ఈవ్రతము నాచరించి దేవహూతి నారయణాంశుడగు కపిలమహర్షిని, వసిష్ఠమహర్షి భార్యయగు ఆరుంధతి శక్తిమహర్షిని, అతని భార్య పరాశరుని, అదితి వామనుని, ఇంద్రుని భార్యయగు శచీదేవి జయంతుని, పొందెను. ఉత్తానపాదుని భార్య సునీతీ ఈవ్రతమునాచరించి, తత్ర్పభావమువలన ధ్రువుడను పుత్రుని, కుబేరుని భార్య నలకూబరుడను పుత్రుని, సూర్యుని పత్ని వైవస్వత మనువును, అత్రిభార్యయగు ఆనసూయ చంద్రుని, అంగీరసమహర్షి భార్య సురగురువగు బృహస్పతినీ, భృగుపత్ని  నారాయణాంశసంభూతుడైన శుక్రుని పుత్రునిగా పడసెను.

ఇత్యేవం కథితం దేవి ప్రతాహం వ్రతముత్తమం ।

త్వమేవం కురు కల్యాణి హిమాలయసుతే శుభే ॥

పాద్యం రాజేంద్రప్నవాం దేవీనాం చ సుఖావహం ।

 వ్రత మేతన్మహాసాద్వి సాధ్వీనాం ప్రాణతః ప్రియం॥

వ్రతస్యాస్య ప్రభావేణ స్వయంగోపాంగనేశ్వరః ।

ఈశ్వరః సర్వభూతానాం తవపుత్రో భవిష్యతి ॥

ఓపార్వతి! వ్రతములలో శ్రేష్ఠమైన పుణ్యకవ్రతమును గూర్చీ నీకింతవరకు తెలిపితిని. ఈ వ్రతమును చక్రవర్తుల భార్యలే చేయ గలరు. సామాన్యులు దీనిని చేయజాలరు.  పతివ్రతలైన స్త్రీలకీ వ్రతము ప్రాణములకంటే మిన్నయైనది. అందువలన నీవి వ్రతమునుచేసి దీని ప్రభావముచే గోపాంగవలకు ఈశ్వరుడు, సర్వప్రాణులకు ఆరాధ్యుడగు శ్రీకృష్ణుడు నీకు పుత్రుడు కాగలడు అని పరమేశ్వరుడనెను.

ఇత్యుక్త్యాశంకరస్తత్ర విరరామ చ నారద ।

వ్రతం చకోర పా దేవీ ప్రహృష్టా శంకరాజ్ఞయా ॥

ఈవిధముగా శంకరుడు పార్వతితో పలికినందువలన అతని ఆజ్ఞననుసరించి పార్వతీదేవి పుణ్యక వ్రతమును ఆచరించెను.

ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్చపి ।

సుఖదం మోక్షదం సారం గణేశజనికారణం॥

నారదమహర్షీ! నీకింతవరకు గణపతి జన్మకు కారణమైన వృత్తాంతమునంతయు తెల్పితిని. ఇది వినువారికి సుఖమును మోక్షమును కలిగించును.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే పుణ్యకవ్రతకథనం నామ పంచమోఽధ్యాయః ॥

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండములో నారద నారాయణుల ప్రసంగసమయమున పేర్కొనబడిన పుణ్యకవ్రతకథనమను ఐదవ అధ్యాయము సమాప్తము.