3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

46 - పరశురామగమనైతత్ఖండ శ్రవణ ఫలవర్ణన

నారాయణ ఉవాచ- నారాయణ ముని నారదునితో నిట్లనెను –

పరశురాముడు సంతోషముతో దుర్గాదేవిని స్తుతించి అట్లే శ్రీహరి ఉపదేశించిన గణపతి స్తోత్రముచే అతనిని స్తుతించెను. ఇంకను భక్తిపూర్వకముగా ధూప, దీప, గంధ, పుష్ప, నైవేద్యములచే అతనిని పూజ చేసెను. కాని తులసిని మాత్రము గణాధిపతికి సమర్పించలేదు.

ఈవిధముగా పరశురాముడు తన గురువగు శంకరుని యొక్క ఆజ్ఞననుసరించి సోదరతుల్యుడగు గణపతిని పూజించి గురుపత్నియగు దుర్గాదేవికి, గురువైన శంకరునకు నమస్కారములు చేసి తన ఇంటికి వెళ్లబోయెను అని చెప్పెను.

నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను –

పరశురాముడు గణాధిపతికి తులసి తప్ప మిగిలిన పుష్పములతో నైవేద్యములతో పూజచేసెనంటిరి కదా ! సమస్త పుష్పములలో తులసి మిక్కిలి గొప్పనైనది కదా. అట్టి తులసి లేక చేసిన పూజను గణపతి ఎట్లు స్వీకరించునో తెలుపుడని కోరెను.

నారాయణ ఉవాచ- నారాయణ మహాముని ఇట్లు పలికెను –

ఓ నారద! బ్రహ్మ కల్పమునకు చెందిన ఒక అందమైన ప్రాచీనేతిహాసమును నీకు చెప్పెదను వినుము.

ఒకప్పుడు నవ యౌవనము నందున్న తులసీదేవి నారాయణుని మనస్సులో తలపోయుచు పుణ్యక్షేత్రములను తిరుగుచుండెను. అచ్చట నొకనాడు గంగా నదీ తీరమున నవయౌవనమున నున్న గణపతి కనిపించెను. అతడు తన శరీరమున అంతయు చందనమునద్దుకొని యుండెను. రత్నాలంకార శోభితుడు, చిరునవ్వుతోనున్న గణపతి చాల అందముగా కనిపించెను. కాని ఆ గణపతి జన్మను, మృత్యువును, ముసలితనమును పోగొట్టు శ్రీకృష్ణుని పాదపంకజములను ధ్యానించుచుండెను. అతడు ఇంద్రియముల జయించిన వారిలో శ్రేష్ఠుడు. యోగీంద్ర శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు. కామములు లేనివాడు అట్టి గణపతిని తులసి కామముతో చూచుచు ఇట్లు పలికెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లు పలికెను –

శాంత రూపుడవగు గణపతీ! నీవు దేనిని గురించి మనస్సులో ధ్యానించుచున్నావు. నీ ఆకారము వికారముగానున్నది. గజము యొక్క ముఖము, లంబోదరము, ఏకదంతము నీకెట్లు కలిగినవో వివరింపుము. నీవు నీ ధ్యానమును వదలిపెట్టి ప్రపంచములోనికి రమ్ము. అప్పుడే సాయంకాలమైనది అని నర్మ గర్భితముగా మాటి మాటికి నవ్వుచు మన్మథ బాణములచే, బాధపడుచు అతని శిరస్సుపై కొద్దిగా నీటిని చల్లినది. అట్లే శ్రీకృష్ణుని తన మనస్సులో ధ్యానించు గణపతిని చూపుడు వేలుతో కొట్టినది.

ఓ నారదా! అందువలన గణపతికి ధ్యానము భగ్నమైనది. ధ్యానము భగ్నమైనచో దుఃఖము కలుగును కదా! అప్పుడు గణపతి శ్రీహరిని మనసులో నొక్కమారు స్మరించుకొని ధ్యానమును వదలిపెట్టి ఎదురుగా అందముగా నున్న తులసీ దేవిని చూచెను. ఆ దేవి నవ యౌవనమున నున్నది. చిరునవ్వు నవ్వుచు కామపీడితయై యుండెను.

లంబోదరుడగు గణపతి ఆత్మ నిగ్రహముతో వినయపూర్వకముగా కామాతురయై యున్న తులసీదేవితో ఇట్లు పలికెను.

గణేశ్వర ఉవాచ- గణేశ్వరుడిట్లు పలికెను –

ఓ తల్లీ నీవెవరవు? నీతండ్రి ఎవరు? అను విషయముల వివరించుము. నీవు నాధ్యానమునెందులకు భంగము చేసితివి. తపస్వులు చేయు తపస్సును భంగము చేయుటవలన పాపములు కలుగును. అమంగళము కూడ కలుగును.

అందువలన దయానిధియగు శ్రీకృష్ణుడు నీకు మేలు చేయుగాక! అట్లే విఘ్నములనన్నిటిని తొలగించును గాక! ఆ శ్రీ కృష్ణద్యానమును భంగము చేసెనను పాపము నీకు కలుగవద్దు. అను గణపతి మాటలు విని మన్మథ బాణ పీడితయైన తులసీదేవీ నవ్వుచు మధురముగా ఇట్లు పలికెను.

తులస్యువాచ- తులసీ దేవి ఇట్లు పలికెను –

ధర్ముని పుత్రుడగు ధర్మధ్వజుడు నా తండ్రి. నేను కన్యకను. నేను భర్తకై తపస్సు చేయుచున్నందువలన నీవు నాకు భర్తవు కమ్ము అని పలికిన తులసి యొక్క పలుకులు విన్న మహాప్రాజ్ఞుడు గణపతి తులసితో మధురముగా నిట్లు పలికెను.

గణేశ ఉవాచ- గణపతి ఇట్లు పలికెను –

ఓతల్లీ! నాకు పెండ్లి చేసికొనవలెనను కోరిక లేదు. పెండ్లియనునది ఎల్లప్పుడు దుఃఖమును కలిగించునే కాని ఎన్నడును సుఖమును కలిగించదు. అది శ్రీహరి భక్తిని దూరము చేయును. తపస్సును నాశనము చేయును. మోక్షద్వారమునకు కవాటము వంటిది. సంసార బంధమును కలిగించును. గర్భవాస దుఃఖమును కలిగించును. తత్త్వజ్ఞానమును ఛేదించును. సంశయములకన్నిటికి కారణభూతమైనది. దీనిని శూద్రులు కూడ దరిజేరనీయరు. సమస్త మాయలకు నిలయమైనది. సాహస కార్యములకు కారణమైనది. ముఖ్యముగా తప్పుడు పనులకు నిలయమైనది.

కావున ఓ పూజ్యురాలా! ఇట్టి సంసారము చేయవలెనను బుద్ధిని దూరము చేసికొనుము. లేకపోయినచో కాముకుడగు పురుషుని భర్తగా వరించుము. ఇద్దరు కాముకులు కలిసిననే చక్కగా నుండునని గణపతి పలికెను.

గణపతి పలికిన పలుకులకు తులసి మిక్కిలి కోపించి ఓ గణేశ్వరా నీ భార్య తప్పక అందరి దగ్గరనుండునని శపించెను. గణపతియు తులసి యొక్క శాప వచనములను విని తులసికి ప్రతి శాపమిచ్చెను.

ఓదేవి! నీవు రాక్షసునకు వశమౌదువు. అట్లే ఆ శరీరమును పరిత్యజించిన పిదప పెద్దల శాపము వలన వృక్షమై తపస్సు చేసికొనుచు ఉండెదవని ప్రతి శాపమిచ్చి ఊరకుండెను.

గణపతి పెట్టిన శాపమును వినగానే తులసీదేవి దుఃఖముచే ఏడ్వసాగెను. ఆప్పుడా దేవి గణపతిని స్తుతింపగా ప్రసన్నుడైన గణపతి ఆమెతో ఇట్లు పలికెను.

గణేశ్వర ఉవాచ- గణపతి తులసీ దేవితో ఇట్లు పలికెను –

ఓ తులసీ నీవు పుష్పముల కన్నిటికి ప్రధానమైన దానవుగా కీర్తినందెదవు. నీయొక్క అంశాంశవలన శ్రీ మన్నారాయణుని ప్రేమ పాత్రురాలవు కాగలవు. సమస్త దేవతలకు ఇంకను ప్రధానముగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రేమ పాత్రురాలు కాగలవు. నీ చేత చేయబడిన పూజ మానవులకు మోక్షమును కలిగించును. కాని నీచే నన్ను ప్రతిదినము ఆరాధింపకూడదు.

ఈ విధముగా గణపతి తులసితో పలికి తపస్సు చేసికొనుటకై శ్రీహరిని స్మరించుకొనుచు బదరీ క్షేత్రమునకు పోయెను.

గణపతిచే శపింపబడిన తులసీదేవి బాధా తప్త హృదయముతో అక్కడి నుండి పుష్కర క్షేత్రమునకు పోయి లక్ష సంవత్సరములు ఆహారము లేకుండ తపస్సు చేసెను.

తులసీదేవి గణపతి శాపముచే మరియు మహర్షి శాపముచే రాక్షసశ్రేష్ఠుడగు శంఖచూడునకు భార్యయైనది. ఆ శంఖచూడుడు శంకరుడు ప్రయోగించిన శూలము వలన చనిపోగా తులసీదేవి తనయొక్క అంశాంశచే వృక్షముగా శ్రీమన్నారాయణుని ప్రియురాలుగా అయ్యెను.

నారదా! ధర్ముని వలన విన్న ఈ కథను నీకు తెలిసితివి. ఇది మోక్షమును కలిగించునని, సారభూతమైనదని పురాణమున చెప్పబడినది.

తరువాత పరశురాముడు శంకరునకు, దుర్గాదేవికి నమస్కరించి, గణపతిని ఆదరించి తపస్సు చేసికొనుటకై అడవికి పోయెను. అట్లే సమస్త దేవతలు, మహర్షులు పూజించుచుండ గణపతి తన తలిదండ్రుల దగ్గరనే ఉండెను.

ఈ గణపతి ఖండమును శ్రద్ధతో వినువాడు రాజసూయ యాగ ఫలమును తప్పక పొందును. శ్రీ గణేశుని అనుగ్రహమువలన ధీరుడు, వీరుడు, ధనవంతుడు, మంచి గుణములు కలవాడు, చిరంజీవి, యశస్వి, విద్వాంసుడు, కవీశ్వరుడు, జితేంద్రియుడు, గొప్ప దాన గుణము కలవాడు, సుశీలుడు, సదాచార సంపన్నుడు, మంచికీర్తి కలవాడు, విష్ణుభక్తుడు అహింసకుడు, దయగలవాడు, తత్త్వజ్ఞానవేత్త అగు పుత్రుని పొందును.

గణపతిని వస్త్రము, అలంకారము, చందనము మొదలగు వానితో భక్తిగా పూజించి ఈ గణపతి ఖండమును వినవలెను. దానివలన సంతానము నశించుచున్న స్త్రీ, గొడ్రాలైన స్త్రీ సహితము సంతానమును పొందును. దూషించతగని వారిని దూషించు స్త్రీ కూడ చక్కని సంతానమును పొందును.

బ్రహ్మ వైవర్త మహా పురాణము నంతయు విన్నచో కలుగు ఫలము ఈ గణపతి ఖండమును వినినంతనే కలుగును. మనస్సులో ఒక కోరికను పెట్టుకొని శ్రద్ధగా ఈ ఖండమును విన్నచో గణపతి అతని కోరికనంతయు తీర్చును.

విఘ్నములు తొలగిపోవలెనను కోరికతో ఈ ఖండమును చదివించుకొని విన్నచో ఆ పాఠకునకు బంగారు యజ్ఞోపవీతమును, తెల్లని ఛత్రమును, పుష్పమాలను, స్వస్తికము అను వంటకమును నూవుల లడ్డూలను ఆయా దేశకాలములందు దొరకు ఫలములను దానము చేయవలెను అని నారాయణ మహాముని నారద మునీంద్రునితో చెప్పెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండములో నారద నారాయణ మునుల సంవాద సమయమున తెల్పబడిన పరశురామగమనమున ఈ గణపతి ఖండమును విన్నచో కలుగు ఫలితములు గల నలుబది యారవ అధ్యాయము సమాప్తము.