3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

39 - పరశురామునకు దుర్గతినాశినీ కవచం

నారద ఉవాచ- నారదుడు ఈ విధముగా పలికెను-

ఓ నారాయణమునీ! మహాలక్ష్మీ కవచమును ఇంతవరకు చెప్పిరి. ఇక దుర్గతినాశని యగు దుర్గాదేవి కవచమును నాకు చెప్పగలరు. ఇది పద్మాక్షునకు ప్రాణము వంటిది. బలమునకు కారణమైనది, కావున నాకు వివరింపుడని కోరెను.

నారాయణ ఉవాచ- నారాయణముని  ఇట్లు పలికెను-

నారద! నీకిపుడు దుర్గాకవచమును చెప్పెదను, ఈ కవచమును. పూర్వకాలమున శ్రీకృష్ణుడు గోలోకమున బ్రహ్మదేవునకుపదేశించెను. త్రిపురాసుర సంహార సమయమున బ్రహ్మదేవుడు ఈ కవచమును శంకరునకీయగా శంకరుడీ కవచమును ధరించి త్రిపురాసురులను జయించెను. అటు పిమ్మట శంకరుడు దీనిని గౌతమ మహర్షికి ఉపదేశింపగా, గౌతమ మహర్షి పద్మాక్షుడను రాజునకుపదేశించెను. ఈ కవచము వలననే పద్మాక్షుడు సప్తద్వీపాధిపతి కాగలిగెను. అట్లే ఈ కవచము వలననే బ్రహ్మదేవుడు జ్ఞానమును, శక్తిని సంపాదించుకొనెను. ఆదేవిధముగా శంకరుడు సర్వజ్ఞుడై సమస్తయోగులకు గురువు కాగలిగెను. అట్లే ఈ కవచము వలన గౌతమ మహర్షి శంకరునితో సమానుడయ్యెను అని పలికెను.

బ్రహ్మాండ విజయమను పేరుగల ఈ దుర్గాదేవి కవచమునకు ప్రజాపతి ఋషి గాయత్రి ఛందము ఛందస్సు దుఃఖములను పోగొట్టు దుర్గాదేవియే దేవత. లోకములందు విజయము సిద్ధించుటకై దీనిని ఉపయోగింపవలెను. అత్యద్భుతమైన మహాత్మ్యముగల ఈ కవచము మహిమలకు నిలయమైనది.

ఓం హ్రీం దుర్గతి నాశిన్యై స్వాహా అను మంత్రము నా శిరస్సును కాపాడుగాక. ఓం హ్రీం అను మంత్రము నా చెక్కిళ్లను, ఓం హ్రీం శ్రీం అనునది నా కండ్లను రక్షించుగాక!

ఓం దుర్గాయైనమః అను మంత్రము నా కర్ణములనెల్లప్పుడు రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం అను మంత్రము నా నాసికనెల్లప్పుడు రక్షించుగాక!

హ్రీం శ్రీం హ్రూం అను మంత్రము నా దంతములను, క్లీం అనునది నా పెదవులను రక్షించుగాక! క్లీం శ్రీం క్లీం అను మంత్రము నా కంఠమును దుర్గాదేవి సాగండభాగమును రక్షించుగాక!

మహాకాళీ దుర్గే స్వాహా అను మంత్రము నా స్కంధమును రక్షించుగాక! విపద్వినాశిన్యై స్వాహా అను మంత్రము నా వక్ష స్థలమును కాపాడుగాక!

దుర్గే దుర్గో రక్ష అను మంత్రము - పార్శ్వ భాగములను, దుర్గే దుర్గే స్వాహా అను మంత్రము నా నాభిని ఎల్లప్పుడు రక్షించుగాక!

దుర్గే దుర్గే రక్షాం దేహి అను మంత్రము నా పృష్టభాగమును రక్షించుగాక! ఓం హ్రీం దుర్గాయై స్వాహా అను మంత్రము నా చేతులను పాదముల రక్షించుగాక! ఓం హ్రీం దుర్గాయై స్వాహా అను మంత్రము నా సమస్తా వయవములను రక్షించుగాక!

మహామాయ నా తూర్పు దిగ్భాగమును, కాళిక ఆగ్నేయ దిగ్భాగమును, దక్షకన్య దక్షిణ దిగ్భాగమును, శివ సుందరి నా యొక్క నైఋతి దిగ్భాగమును, పార్వతి పశ్చిమ దిగ్భాగమును, వారాహి వాయవ్య దిగ్భాగమును, కుబేర మాత నా ఉత్తర దిగ్భాగమును, ఈశ్వరీ నా ఈశాన్య దిగ్భాగమును, నారాయణి నా ఊర్ధ్వ భాగమును, అంబిక నాయొక్క ఆధో భాగమును, ఎల్లప్పుడు కాపాడుగాక అట్లే జ్ఞాన ప్రదయగునాదేవి నాయొక్క జ్ఞానమును, నిద్రా స్వరూపిణి యగు నా జగన్మాత నా స్వప్నమును ఎల్లప్పుడు  రక్షించుచుండుగాక.నారదా! సమస్త మంత్ర స్వరూపమగు బ్రహ్మాండ విజయమను ఈ దుర్గా కవచమును నీకు చెప్పితిని. ఇది చాల మహిమ గలది.

గురువును శాస్త్ర పద్ధతి ననుసరించి వస్త్రము, అలంకారము, చందనము మొదలగు వానితో పూజించి ఈ కవచమును కంఠమున లేక దక్షిణ బాహువునందైన ధరించినచో సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన ఫలితము, సమస్త యజ్జములు చేసినందువలన కలుగు ఫలితము, సమస్త వ్రతములందు ఉపవాసము చేసినచో లభించు ఫలితము లభించును. ఈ కవచమును ధరించువాడు సమస్త శత్రువులను జయించి ముల్లోకముల జయించినవాడగును.

దుఃఖములను నాశనము చేయు ఈ దుర్గా కవచమును వదలి పెట్టి దుర్గా మంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిద్ధింపదు.

కాణ్వ శాఖయందు చెప్పబడిన ఈ కవచమును సమస్త సిద్దులనిచ్చును. అత్యంత రహస్యమైన ఈ కవచమును ఆర్హతలేనివాని కెట్టి పరిస్థితిలో చెప్పరాదు, అని నారాయణుడు నారదునకు చెప్పెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదైన గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన దుర్గతి నాశినీ కవచమను ముప్పయి తొమ్మిదవ యధ్యాయము సమాప్తము.