3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
9 - దేవతలు బాల గణపతిని సందర్శించుకొనుట
నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను-
వృద్ధబ్రాహ్మణవేషముననున్న శ్రీమహావిష్ణువు అంతర్ధానము చెందగా పార్వతీపరమేశ్వరులు ఆతురతతో ఆ బ్రాహ్మణునికై చుట్టూ వెదకసాగిరి.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-
ఓ వృద్ధ బ్రాహ్మణుడా! ఆకలిగొన్న నీవు ఎచ్చటికిపోతివి. ఓతండ్రీ! నీవొక్కసారి కనిపించి నా ప్రాణములను నిలుపుము.
ఓ శంకరా! త్వరగా లేచి ఆ బ్రాహ్మణుడెచ్చటనున్నాడో వెదుకుము. ఒక్కక్షణము మనము పరాకుననుండగా ఆతడు మాయమయ్యెను. మన ఇంటికి వచ్చిన అతిథి నేనిచ్చు అతిథిపూజను గైకొనకపోయెను. అతిథి ఆకలితో వెళ్ళిపోయినచో ఆ ఇంటి యజమాని చేసిన తర్పణమును, పిండ ప్రదానమును పితృదేవతలు స్వీకరింపరు. ఆట్లే ఆ యజమాని ఇచ్చు ఆహుతులను, పుష్పములను, జలమును దేవతలు పరిగ్రహింపరు. అవి సురతో సమానముగా దేవతలకు కన్పించును, ఆ యజమాని పితృదేవతలకు పెట్టు పిండము అమేధ్యముతో సమానమగును. ఆతనివి స్పృశించినచో పాపము కలుగును అని పలికేను.
ఈవిధముగా పార్వతీదేవి బాధపడుచున్న సమయమున పార్వతీదేవికి ఒక అశరీరవాణి ఇట్లు వినిపించినది.
ఓ జగన్మాతా! నీవు బాధపడవద్దు. నీ ఇంటిలోనున్న నీపుత్రుని చూడుము. ఆతడు సమస్తపరిపూర్ణుడు. గోలోకమునకు అధిపతియగు శ్రీకృష్ణుడు. ఆతడు నీవు చేసిన పుణ్యకవ్రతమను వృక్షముయొక్క ఫలితముగా నీకు లభించెను. అతడు సనాతనుడు. పరమయోగీంద్రులు తేజోరూపియగు ఆ పరమాత్మను ఎల్లప్పుడు ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు శివాది దేవతలు, వైష్ణవులు ఆ పరమాత్మను ఎల్లప్పుడు ధ్యానించుచుందురు. అట్టి పరమాత్మ నీకు పుత్రుడయ్యెను.
నీ పుత్రుడు ప్రతికల్పమునందు దేవతలందరికంటే ముందుగా పూజలనందుకొనును. ఆతనిని స్మరించినంత మాత్రమున సమస్త విఘ్నములు నశించును. ఆతడు పుణ్యములన్నిటికి రాశి. సనాతనుడు. జ్యోతిస్వరూపుడైన ఆతనిని ప్రతికల్పములోనూ నీవు ధ్యానము చేయుదువు. అతడు భక్తులనెల్లప్పుడు అనుగ్రహించును. ముక్తినిచ్చును. నీ తపస్సను కల్పవృక్షమునకు ఫలమువంటివాడు, ఆతడు కోటి మన్మథుల కంటె సుందరమైనవాడు. అటువంటి నీ పుత్రుని ఒకసారి చూడుము.
ఇంతకుముందు అదృశ్యమైన బ్రాహ్మణుడు ఆకలిగొన్న వాడుకాదు. ఆతడు బ్రాహ్మణవేషమున ఉన్న జనార్దనుడు. అందువలన పార్వతీదేవి! నీవు అనవసరముగా బాధపడుచున్నావు. అతడు వృద్ధుడుకాదు. అతిథి కూడ కాదు అని ఆకాశవాణి పలికెను.
పార్వతీదేవి ఆకాశవాణి పల్కులను వినీ ఆశ్చర్యముతో తన ఇంటిలోనికి వెళ్ళి తన శయ్యపై చిరునవ్వుతోనున్న బాలుని చూచెను. ఆ బాలుడు శతచంద్రులతో సమానమైన కాంతికలవాడు. తన శరీరకాంతి భూమికి స్ఫురింపచేయుచున్నవాడు, అతడు శయ్యపై సంతోషముతో ఇటువటు పొర్లుచుండెను. ఆ శిశువు పాలకై ఏడ్చుచు ఉమా అని శబ్దము చేయుచుండెను. ఆద్భుతమైన రూపముగల ఆ శిశువును చూచి పార్వతీదేవి వెఱగుపడి తన భర్తయగు శంకరుని సన్నిధికి పోయి ఆ దేవునితో ఈవిధముగా పలికెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లనెను-
ఓ మహాదేవా నీవు ఇంటిలోనికి రమ్ము. మన ఇంటిలో మన తపస్సుల ఫలితమగు పుత్రుని ముఖమును చూడుము. నీవు ప్రతికల్పమున ఎవరిని ధ్యానించుచుందువో ఆ కృష్ణుడు పుత్రరూపముననున్నాడు. పుత్రుడు పుణ్యమువలన కలుగును; పుత్ అను నరకమునుండి రక్షించును, సంసారమునుండి తరింపజేయును.
సమస్తపుణ్యతీర్థములందు చేసిన స్నానము, సమస్త యజ్ఞములు చేయుట అనునవి పుత్ర సందర్శనమునకు పదునారవవంతైన కాజాలవు. అట్లే సమస్తదానములు చేసినందువలన కలుగు పుణ్యము, భూమి ప్రదక్షిణము చేయుటవలన కలుగు ఫుణ్యము, సమస్త తపస్సులు, ఉపవాసములు, వ్రతములు, బ్రాహ్మణ భోజనములు, దేవతార్చనములు చేసినందువలన కలుగు పుణ్యము పుత్రుని ముఖము చూచిన దానికి పదునారవవంశైవ కాజాలవు అనెను.
పార్వతీదేవియొక్క మాటలను విన్న శంకరుడు సంతోషముతో తన ఇంటికి వెంటనే తనభార్యతో కలసివచ్చెను. అచ్చట తన శయ్యపై బంగారు వంటి కాంతి కలవాడు, తాను ప్రతిదినము ధ్యానించుకొను రూపమువలె చాలా అందమైన శిశువును చూచెను. అప్పుడు పార్వతీదేవి సంతోషముతో శిశువును. ఎదకు హత్తుకొని మాటిమాటికి ముద్దులు పెట్టుకొనుచూ ఇట్లు పలికెను.
ఓబాలకా! నీవు సర్వతః - పరిపూర్ణుడవు. సనాతనుడవు. అమూల్యరత్నమువంటి నిన్ను పొందినందువలన నా మనస్సు పూర్తిగా సంతోషముతో నిండిపోయింది. అంతులేని ధనము దొరికిన దరిద్రునివలె, సుదూరప్రాంతములకు పోయి చాలకాలముండి తిరిగివచ్చిన భర్తను చూచిన భార్యవలె, గొప్పవిలువ కల రత్నమును పోగొట్టుకొని పొదలో చాలాకాలము వెదకగా హఠాత్తుగా అది కనపడిన సమయము సంతోషించువాని వలె, అనావృష్టి తో బాధపడుచున్నవాడు మంచి వర్షము కురిసిన సమయమునన్నట్లు, ఆశ్రయములేక గుడ్డితనముతో అల్లాడిపోవుచున్నవాడు దైవయోగమున దృష్టి కలిగిన సమయమున సంతోషపడినట్లు నా మనస్సంతయు సంతోషముతో నిండిపోయినది. అదేవిధముగా అంతులేని సముద్రమున నౌకాయానము చేయుచుండగా ఆ నౌక మునిగిపోయినప్పుడు తల్లడిల్లిపోవుచున్నవానికి వేరొక నొక దొరికినప్పుడు కల్గు సంతోషమువలె నా మనస్సు సంతోషముతోనున్నది. అట్లే విపరీతమైన దప్పి బాధపడుచున్నవానికి చల్లని, సువాసనగలుగు జలము లభించివప్పుడు కలుగు సంతోషమువలె. దావాగ్నిమధ్యలో పడి కొట్టుమిట్టాడుచున్నవానికి ఆ అగ్నిలోనుండీ తప్పించుకొను ఆధారము దొరికినప్పుడు కలుగు సంతోషమువలె, వ్రతమును చేయుచు చాలాకాలము తిండిలేకుండ ఉన్నవారికి ఎదురుగా పంచభక్ష్య పరమాన్నములు లభించినప్పుడు కలుగు
సంతోషమువలె సంతానములేక బాధపడుచున్న నాకు ఈ శిశువును చూచుటచే సంతోషము కలిగినదని పలుకుచూ పార్వతీదేవి తన కుమారుని ఒడిలోనికి తీసికొని అతనికి స్తన్యమునిచ్చి సంతోషముతో అతనిని ముద్దుపెట్టుకొనుచూ ఆశీస్సులనొసగెను. పరమేశ్వరుడు కూడా సంతోషముతో ఆ శిశువును ఒడిలోనికి తీసుకొని ముద్దులు పెట్టుకొని ఆశీస్సుల నోసగెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదైన గణపతిఖండమున నారద నారాయణ మహర్షుల సంవాద సమయమున చెప్పబడిన బాలగణపతి దర్శనమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
