3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

14 - కార్తికేయ జన్మకథనం

నారాయణ ఉవాచ – నారాయణ మహా ముని ఇట్లు పలికెను-

గణపతి జన్మోత్సవమును తిలకించుచున్న దేవతలు, గంధర్వులు శైలములు (శైలాధిదేవతలు) మునులు, సంతోషమున ఓలలాడుచుండిరి. ఆ సమయమున పార్వతీదేవి చిరునవ్వుకల ముఖముతో శ్రీమహావిష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను-

ఓ జగన్నాథ! నీవు సమస్త జగములను రక్షింపుచున్నావు. నేనుకూడ ఈ జగములోని దానినే. అందువలన నాకు కూడ నీవే రక్షకుడవు. కావున నా సంశయమును నీవే తీర్పవలయును.

హేప్రభూ! వ్యర్థముకాని నా పతియొక్క వీర్యము ఏవిధముగా రక్షింపబడినది. బ్రహ్మదేవుడు, నీవు ప్రేరేపింపగా మా రతిభంగమును చేసిరి. ఆ సమయమున భూమిపై పడిన వీర్యమును ఏ దేవత రక్షించేను. ఈ విషయమును సమస్త దేవతలు అన్వేషించి తెల్పవలయును. ఈ జగములకన్నీటికి రాజువగు నీవుండగా అరాజకత్వమెట్లేర్పడును. అని అడిగాను.

పార్వతీదేవియొక్క మాటలను విని జగదీశ్వరుడైన శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ముని దేవతాగణములున్న ఆసభలో ఇట్లు పలికెను.

శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను-

ఓ దేవతలారా! నామాటను శ్రద్దగా వినుడు. మీరింతవరకు పార్వతీదేవి పలికిన మాటలు విన్నారు కదా, శివునియొక్క అమోఘమైన వీర్యమును ఎవరు తీసిరి? ఆ వ్యక్తిని వెంటనే సభలో ప్రవేశ పెట్టుడు. లేనిచో నేను దండించెదను. ప్రజలను బాధించుచు ప్రజలను రక్షింపనివాడెట్టి రాజు? అందువలన నా ప్రజలలో ఒకతియగు పార్వతిని దుఃఖ పెట్టినవానిని తెలిసికొనుట నా ధర్మము అని పలికెను.

విష్ణుమూర్తియొక్క ఈమాటలను విని దేవతలు ఒకరినొకరు సంప్రదించుకొని, పార్వతీదేవి మాటలకు భయపడి. విష్ణుమూర్తితో ఇట్లనిరి.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

పవిత్రమైన ఈ భారతక్షేత్రమున పరమేశ్వరుని వీర్యమును హరించినవానికి పుణ్యకర్మలలో గానీ, పుణ్యదివసములలోకాని మేలు జరుగకూడదని బ్రహ్మదేవుడనెను.

మహాదేవ ఉవాచ - శంకరుడు ఇట్లు సభలో పలికెను-

పుణ్యక్షేత్రమైన ఈభారతావనిలో నా వీర్యమును హరించిన దుష్టుడు నీపూజకు, నీసేవకు అర్హుడు కాకుండు గాక యనిపలికెను.

యమ ఉవాచ - యమధర్మరాజిట్లు పలికెను-

శివుని వీర్యమును హరించినవాడు శరణుకోరినవారిని రక్షించుటకు, ఏకాదశీవ్రతము నాచరించుటకు అర్హుడు కాజాలడని యమధర్మరాజు పలికెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు ఈవిధముగా పలికెను-

పరమేశ్వరుని వీర్యమును హరించినవాని కీర్తి, పుణ్యము మొదలగునవి తొలగిపోవునని ఇంద్రుడు పలికెను.

వరుణ ఉవాచ – వరుణుడిట్లనెను-

పరమశివుని వీర్యమును హరించినవాడు ఈ భారతవర్షమున శూద్రునిచే యాగము చేయించిన పాపాత్ముని ఇంట జన్మించునని వరుణుడనెను.

కుబేర ఉవాచ – కుబేరుడిట్లనెను-

పరమశివుని వీర్యమును హరించినవాడు తనవద్ద దాచినసొమ్మునపహరించిన పాపాత్మునితో, తన పైనుంచిన విశ్వాసమును నాశనము చేసిన పాపాత్మునితో, తన మిత్రుని చంపుకొన్న పాపాత్మునితో, సత్యమును తప్పిన పాపాత్మునితో, కృతఘ్నునితో సమావమైనవాడగునని పల్కెను.

ఈశాన ఉవాచ – ఈశానుడిట్లనెను-

శంకరుని వీర్యమును హరించినవాడు ఇతరుల ద్రవ్యమునపహరించినవానితో, మానవులను హతమార్చెడు వానితో గురుద్రోహము చేసినవానితో సమాను డగునని పల్కెను.

రుద్రా ఊచుః - రుద్రులిట్లనిరి.

పరమశిపుని వీర్యమును హరించినవారు అసత్యవాదులతో, పరస్త్రీగమనము చేయువారీతో, ఎల్లప్పుడు గురునిందను చేయువారితో సమానముగా పాపమును పొందుదురనిరి.

కామదేవ ఉవాచ - కామదేవుడిట్లు పలికెను-

శివుని వీర్యముమ హరించినవాడు మాటతప్పివవానితో సమానమైన పాపమును పొందునని అనెను.

స్వర్వైద్యా పూచతుః - దేవవైద్యులైన అశ్వివికుమారులిట్లనిరి-

శంకరుని వీర్యమును హరించినవారు తల్లిదండ్రులను, గురువును, భార్యాపుత్రులను పోషించనివారితో సమానమైన పాపముమ పొందుదురు,

సర్వే దేవా ఊచుః -దేవతలందరు ఇట్లు పలికిరి-

పరమేశ్వరుని వీర్యమును హరించినవారు కూటసాక్ష్యములు చెప్పువారీతో, సంతానము లేనివారితో, దరిద్రులతో సమానమైన పాపమును పొందుదురనిరి.

దేవపత్య ఊచుః - దేవతా స్త్రీలిట్లనిరి-

పరమశివుని వీర్యమును హరించిన స్త్రీలు తమతమ భర్తలను నిందించినవారగుదురు. పరపురుషులతో వెళ్ళిన వారగుదురు. బుద్దిలేనివారగుదురని పలికిరి.

పరమశివుని వీర్యహరణము గురించి దేవతలు దేవతాస్త్రీలు పలికిన మాటలను విని సృష్టిస్థితిసంహారకారకుడగు శ్రీహరి కర్మసాక్షియగు ధర్మదేవతను, సూర్యుని, చంద్రుని, అగ్నిదేవుని, వాయువును, భూమిని, నీటిని, సంధ్యలను, రాత్రింబగళ్ళనుద్దేశించి ఇట్లు పలికెను.

శ్రీవిష్ణురువాచ – శ్రీమహావిష్ణువిట్లనెను-

ఈశ్వరస్య వచః-

శివుని వీర్యమును దేవతలెవ్వరు హరించనిచో మరి ఎవరు దానిని హరించినట్లు? ధర్మాదిదేవతలారా! మీరందరు, ఈ ప్రపంచమున జరుగుచున్న సమస్తకర్మలకు సాక్షీభూతులు. మరి మీరేమైనా హరించినారా? లేనిచో ఆ మహేశుని వీర్యము ఏమైనదో నాకు వివరింపుడనెను.

శ్రీహరియొక్క మాటలు విని ధర్మాదిదేవతలు భయపడి తమలో తాము చర్చించుకొని శ్రీహరితోనిట్లనిరి.

శ్రీధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను-

శంకరుడు రతిమద్య లేచినప్పుడు అమోఘమైన అతని వీర్యము భూమిపై పడినదను విషయము మాత్రము నాకు తెలియుననెను.

క్షితిరువాచ - భూదేవి ఇట్లు పలికెను-

పరమశివుని వీర్యమును నేను భరించలేక దానిని అగ్నిలో వేసితిని. నేను అబలను. అందువలన ఆట్లు చేసితిని కావున మీరు నన్ను క్షమింపవలెనని వేడుకొనెను.

అగ్నిరువాచ - అగ్నిదేవుడిట్లు పలికెను-

ఓ జగన్నాథ ! శంకరుని వీర్యమును భరింపలేక నేను దానిని రెల్లుగడ్డియున్న ప్రాంతమున వదలివేసితిని. నేను దుర్భలుడను. నాకు కీర్తిపౌరుషములక్కరలేదు. అందువలన నన్ను క్షమింపుడని వేడెను.

వాయురువాచ - వాయుదేవుడిట్లు పలికెను-

హే భగవన్! రెల్లుగడ్డిలో పడిన పరమశివుని వీర్యము వెంటనే అందమైన బాలుడుగా మారి స్వర్ణరేఖానదీతీరముననుండినట్లు చెప్పెను.

శ్రీ సూర్య ఉవాచ - సూర్యభగవానుడిట్లు పలికెను-

ఓ జగన్నాథా! స్వర్ణరేఖానదీతీరమున బాలుడు ఏడ్చుచుండుట గమనించితిని. కాని కాలచక్రముననుసరించి భ్రమించువాడను కావున సాయంసమయమున అచ్చట ఉండలేక అస్తాచలమువైపు వెళ్ళినట్లు పలికెను.

చంద్ర ఉవాచ – చంద్రుడిట్లనెను-

ఓ శ్రీ మహావిష్ణు! స్వర్ణరేఖానదీతీరమున ఏడ్చుచుపడియున్న బాలకుని బదరికాశ్రమమునుండి తమ ఇంటికిపోవుచున్న కృత్తికలు చూచి ఆతనినెత్తుకొని తమ ఇంటికిపోయిరని పలికెను.

జలమువాచ - జలాధిదేవత ఇట్లనినది-

ఓ పరమేశ్వరా! సూర్యుని మించిన తేజస్సు కల ఆ బాలకుడు పాలకొరకు ఏడ్చుచుండగా వారతనిని తమ ఇంటికి తెచ్చి పాలనిచ్చి శంకరుని పుత్రుడగు ఆ బాలుని పెంచుచుండిరని పలికెను.

సంధ్య ఊచతుః - సంధ్యలు ఈవిధముగా పలికిరి-

ఇప్పుడాబాలుడు షట్కృత్తికలకు పెంపుడు కొడుకు. వారందరతనికి ప్రేమతో కార్తికేయుడని పేరు పెట్టుకొనిరని అనిరి.

రాత్రిరువాచ - రాత్రిదేవత ఇట్లు పలికెను-

దినమువాచ-దినాధిదేవత ఇట్లు పలికెను-

ఓపరమేశ్వరా! షట్కృత్తికలు ముల్లోకములలో చాలా ప్రయత్నము చేసినచో లభించు సుమధురమైన పదార్థములను తెచ్చి కార్తికేయునకు మురిపెముతో తినిపించుచుండిరనెను. ఆ సభాస్థలిలో ధర్మాదిదేవతలు శ్రీహరితోనిట్లు చెప్పగా విని ఆ మధుసూదనుడు సంతోషపడెను. అట్లే తన పుత్రుని విషయము తెలిసికొన్న పార్వతీదేవి సంతోషముతో బ్రాహ్మణులకు కోటిరత్నములను అమితమైన ధనమును దానముచేసినది. అదేవిధముగా లక్ష్మీదేవి, సరస్వతి, మేన, సావిత్రి, శ్రీమహావిష్ణువు మొదలగు దేవతలు, దేవతాస్త్రీలు బ్రాహ్మణులకంతులేని ధనమునిచ్చిరి.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన కార్తికేయ జన్మవృత్తాంతముగల పదునాలుగవ ఆధ్యాయము సమాప్తము.