3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

24 - జమదగ్ని, కార్తవీర్యుల చరిత్ర

నారద ఉవాచ - నారదమహర్షి నారాయణమునితో ఇట్లు పలికెను –

శ్రీహరి అంశవలన ఉద్భవించిన నారాయణ మునీ! నీయొక్క అనుగ్రహమువలన శుభంకరమైన గణపతి చరిత్ర నంతయు వింటిని. కాని విష్ణుమూర్తి బాలకుడగు గణపతికి రెండు దంతములున్న ఏనుగు ముఖమును సమకూర్చగా అతడు ఏకదంతుడెట్లయ్యెను. అతని రెండవ దంతము ఎచ్చటికి పోయినది? ఈ విషయము నంతయు సర్వేశ్వరుడవు, సర్వజ్ఞడవు దయామతివైన మీరు నాకెరిగించగలరని కోరెను.

సూత ఉవాచ – సూత మహర్షిఇట్లు పలికెను –

ఓ శౌనక మునీ! నారదుని ప్రశ్న విన్న నారాయణ ముని చిరునవ్వుతో ఏకదంతుని చరిత్ర చెప్పుటకిట్లు మొదలిడెను.

నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను –

ఓ నారదా! సమస్త మంగళములకు మంగళప్రదమైన ఏకదంతుని చరిత్రను నీకు వినిపించెదను. అది చాలా పురాతనమైన ఇతిహాసము.

ఒకప్పుడు కార్తవీర్యుడను రాజు వేటాడుటకు బయలుదేరి వేటలో అనేక మృగములను సంహరించి మిక్కిలి ఆయాసమునొందెను. ఆ అడవిలో వున్నప్పుడు సాయంకాలము కాగా ఆ రాత్రి అచ్చటనే తన సైన్యముతో తిండి లేక యుండెను. ఆ మహారాజు ఉన్నచోటికి సమీపముననే జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమము ఉండెను. తెల్లవారిన పిదప ఆ రాజు సమీపమున నున్న సరస్సులో స్నానముచేసి అలంకరించుకొని ఆత్రేయమహర్షి తనకు ఉపదేశించిన మంత్రమును నిష్ఠతో జపించుచుండెను. ఆ సమయమున ఎండిన గొంతుతోనున్న రాజును జమదగ్నిముని చూచి ఆదరముతో మృదువైన మాటలతో అతని యోగక్షేమములను అడిగెను.

కార్తవీర్యార్జునుడు తనకెదురుగా సూర్యునివంటి కాంతితో ప్రకాశించుచున్న జమదగ్నిమునిని చూచి సంభ్రమముతో లేచి నమస్కరింపగా జమదగ్ని ఆ మహారాజును ఆశీర్వదించెను. అప్పుడారాజు ముందురోజు తాను తనసైన్యము ఆహారమును తినని విషయమును మునీశ్వరునకు తెలిపెను. జమదగ్ని మహర్షి రాజుయొక్క అనుజ్ఞగైకొని ఇంటికిపోయి కామధేనువుతో రాజు, అతని పరివారము భోజనము లేకుండ ఉన్న విషయమును భయపడుచు చెప్పెను.

అప్పుడా కామధేనువు జమదగ్ని మహర్షితో నేను నీదగ్గర ఉండగా భయము చెందవలసిన పరిస్థితిలేదు. నా సహాయమున నీవిప్పుడు ప్రపంచమున నున్న వారికంతయు భోజనము పెట్టగలవనినచో ఒక్కరాజు సంగతియేల? రాజు భుజించుటకు యోగ్యమైన వస్తువులనన్నిటిని నీకోరికపై నీకిత్తును అని అనెను. బంగారుపాత్రలు, వెండిపాత్రలు, ఇంకను భోజనమునకు అవసరమైన అసంఖ్యాకమైన పాత్రలు, అట్లే రుచిగల వస్తువులతో నిండిన అనేక పాత్రలను కామధేనువు మహర్షికిచ్చినది.  ఇంకను అనేకవిధములైన పనస, మామిడి మొదలగు పండ్లరాశులను, రుచికరమైన లడ్డూలయొక్క రాశులను, యవలు, గోధుమపిండితో చేయబడిన వివిధభక్ష్యములును, పక్వాన్నములను, రాశులుగా నిచ్చినది. పరమాన్నముయొక్క కుప్పలను, పాలు, పెరుగు, నేయి వీటి ప్రవాహములుగా, శర్కరయొక్క రాశిని, లడ్డూల యొక్క పర్వతములను, అటుకులు, మంచి బియ్యపన్నము యొక్క రాశులను కామధేనువు మహర్షికొసగినది. అట్లే కర్పూరాది సుగంధద్రవ్యములతో నున్న తాంబూలము నిచ్చినది. ఇంకను రాజులు ధరించు మిక్కిలి వెలగల వస్త్రములను ఇచ్చినది.

జమదగ్ని ముని కామధేనువొసగిన పదార్థములను సమకూర్చుకొని రాజునకు అతని సైన్యమునకు అవలీలగా భోజనము పెట్టెను. ఆ భోజనమున మిక్కిలి దుర్లభమైన వస్తువులు సహితము పరిపూర్ణముగా సమకూరినవి. వాటినన్నిటిని చూచి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యము చెందెను.

రాజోవాచ - కార్తవీర్యుడిట్లు పలికెను –

ఓ మంత్రీ! జమదగ్ని మనకు భోజనమున సమకూర్చిన ద్రవ్యముల పూర్వమైనవి. వీటి పేర్లనైన నేను వినలేదు. వీటిని మహారాజునగు నేను కూడా సమకూర్చలేను. అందువలన ఇవి ఇతనికి ఎక్కడినుండి వచ్చివను విషయమును నీవు తెలిసికొని చెప్పుమనెను.

కార్తవీర్యార్జునుని మంత్రి రాజుయొక్క ఆజ్ఞననుసరించి వెళ్ళి మహర్షి ఇంటిలోనున్న ఈ పదార్థములనన్నిటినీ చూచి మహాద్భుతమైన విషయమునిట్లు రాజుతో చెప్పెను.

సచివ ఉవాచ - సచివు డిట్లు పలికెను –

ఓ రాజా మీ ఆజ్ఞననుసరించి మునియొక్క ఆశ్రమమునంతయు పరిశీలించితిని. అచ్చట యజ్ఞకుండము, యజ్ఞమున కుపయోగించు సమిధలు, దర్భలు, పూవులు, పండ్లు ఉన్నవి. అదేవిధముగా కూర్చొనుటకు పయోగపడు జింకచర్మము, సృక్, సృవములు, శిష్యులు మాత్రము కనిపించిరి కాని బంగారము మొదలగు వస్తువులు, సమస్త సస్యములు మొదలగునవి మాత్రమెచ్చట కనిపించలేదు. అచ్చటనున్న మునులందరు వృక్షవల్కములను మాత్రము ధరించియున్నారు. కాని ఆ మహర్షియొక్క ఆశ్రమమున ఒకప్రక్క చంద్రునివలె తెల్లనైన కాంతిగలది, ఎఱుపెక్కిన కండ్లుకలది, గొప్పనైన తేజస్సుకలది, పూర్ణమిచంద్రునివలె తెల్లనైనది, సమస్త శుభగుణములు కలది లక్ష్మీదేవివంటి కామధేనువు మాత్రము కనిపించినదనెను.

మంత్రి చెప్పిన మాటలు విన్న కార్తవీర్యునకు ఒక చెడ్డ ఆలోచన ఏర్పడినది.

రాజైన కార్తవీర్యుడు కాలపాశబద్దుడై మునితో తనకు కామధేనువువిమ్మని యాచించెను. పుణ్యము కంటెను, బుద్ది కంటెను కాలము మిక్కిలి బలమైనది. పుణ్యము, సద్బుద్ది కల కార్తవీర్యుడు అతని దురదృష్టమువలన మునిని యాచించెను. భారతభూమిపై పుణ్యమువలన శుభమైన పుణ్యకర్మ చేయుటకు ఆలోచన కలుగును. అట్లే పాపము వలన భయంకరమైన పాప కర్మలాచరించు ఆలోచన కలుగును. ఈ పుణ్యభూమిపై మానవులు పుణ్యముచేసి స్వర్గాధి భోగముల ననుభవింతురు, అట్లే పాపమువలన నరకము ననుభవింతురు. కర్మశేషమున్న మానవులకు నిష్కృతి యనునది ఉండదు. అందువలన సత్పురుషులు కర్మక్షయమునకై ఎల్లప్పుడు ప్రయత్నింతురు. కర్మక్షయమును చేయగలుగునదే విద్య, తపస్సు, జ్ఞానము. కర్మ క్షయము చేయుటకు సహకరించువారే గురువు, బంధువులు, తలిదండ్రులు, పుత్రులు మొదలగువారు, శుభా శుభ కర్మభోగ మనునది జీవులకు గల గొప్పరోగము, దానిని శ్రీహరిభక్తుడను వైద్యుడు కృష్ణభక్తియను ఔషధముచే పోగొట్టును.

ప్రతిజన్మయందు మాయను సేవించినచో ఆ మాయ సంతోషించి వారికి కృష్ణభక్తిని కలిగించును. లేనిచో ఆ మాయయే అతనిని మోహపరవశుని చేసి వివేకభ్రష్టుని కావించును. అందువలన మాయామోహితుడైన కార్తవీర్యుడు మునిని పిలిపించి, వినయముతో చేతులు గట్టుకొని ఇట్లు పలికెను.

రాజోవాచ - రాభ ఇట్లు పలికెను –

కల్పవృక్షమువంటి జమదగ్నిమునీ! కోరికలను తీర్చు ఈ కామధేనువును నాకిమ్ము. మీవంటి దాతలకు ఇవ్వలేని వస్తువనునది లేదు. దధీచిముని దేవతలకొరకు తన ఎముకనే దానము చేసెనని పూర్వము చెప్పబడినది. తపోధనుడవగు నీవు నీ భ్రూ భంగములోనే అనేక కామధేనువులను సృష్టింపగలవని పలికెను.

మునిరువాచ - జమదగ్నిముని ఇట్లు పలికెను –

వంచకుడవైన ఓరాజా! నీవు తలక్రిందులుగా మాటాడుచున్నావు. క్షత్రియులకు బ్రాహ్మణులు దానమిచ్చుట ఎచ్చటను కనిపింపదు. మరి క్షత్రియుడవైన నీవు బ్రాహ్మణుడనగు నన్ను దానమునిమ్మని అడుగుచున్నావు. ఇది వింతకదా !

గోలోకమున యజ్ఞము జరుగు సమయమున పరమాత్మయగు శ్రీకృష్ణుడు తన ప్రాణములకన్న ప్రియమైన ఈ కామధేనువును బ్రహ్మదేవునకిచ్చెను. ఆ బ్రహ్మదేవుడు తనకు ప్రియపుత్రుడగు భృగుమహర్షికి దీనినిచ్చెను. నాతండ్రియగు భృగుమహర్షి దీనిని నాకిచ్చెను. ఈవిధముగా ఈ కామధేనువు మావంశమునకు సంబంధించినది. గోలోకమునందు పుట్టిన ఈ గోవు ముల్లోకములందును అపూర్వమైనది. ఇట్టి కామధేనువును నేనేవిధముగా సృష్టింతును.

నీమాటలు విని ఉబ్బిపోవుటకు నేనేమీ అమాయకుడను కాదు. నేను అతిథిని తప్ప ఈ లోకమునంతయు క్షణములో భస్మము చేయ సమర్థుడను. అందువలన నీవు నీఇంటికి వెంటనే తిరిగిపొమ్ము. నా కోపమును వృద్ధి చేయకుము. ఓ దురదృష్టవంతుడా! నీవు ఇంటికిపోయి నీ భార్యా పిల్లల యోగక్షేమముల చూచుకొనుమని పలికెను.

జమదగ్ని ముని మాటలు విన్న కార్తవీర్యుడు మనసులో కోపగించినను, పైకి మునికి నమస్కారమును చేసి తనసైన్యమున్న స్థలమునకు పోయెను. అదృష్టములేని ఆ మహారాజు కోపముచే వణకిపోవుచు బలాత్కారముగానైనను కామధేనువును తీసికొనిరమ్మని తన అనుచరులను పంపించెను. అప్పుడాముని కామధేనువు దగ్గరకుపోయి శోకముతో జరిగిన వృత్తాంతమును కామధేనువునకు నివేదించెను. ఏడ్చుచున్న జమదగ్నితో లక్ష్మీస్వ రూపురాలు, భక్తుల ననుగ్రహించునదియగు కామధేనువు ఇట్లు పలికెను.

సురభీరువాచ - కామధేనువిట్లు పలికెను –

ఓ మునీ! ఇంద్రుడైనను, పామరుడైనను తన వస్తువులు తాను దానము చేసికొనవచ్చును. తన వస్తువులను రక్షించుకొనుటకు, దానమిచ్చుటకు అతనికెల్లప్పుడు అధికారము కలదు. అందువలన నీవు నీ ఇష్టముతో మహారాజునకు నన్ను దానము చేసినచో అతనివెంట తప్పక పోయెదను. కానిచో నేను నీఇంటిని దాటిపోను. నీవు నేనిచ్చిన సైన్యముతో నిన్ను ద్వేషించుచున్న మహారాజును జయింపుము. సర్వజ్ఞడవగు ఓ మహామునీ! మాయచే మోహితుడవై ఎందులకేడ్చుచున్నావు. బంధము, బంధ రాహిత్యమనునవి కాలమువల్ల జరుగుచున్నవేకాని వీటికి ఆత్మ సంబంధము లేదు. నీవెవరో నేనెవరో మన ఇద్దరి మధ్య సంబంధము కాలము వలననే ఏర్పడినది. ఆ సంబంధముండు వరకే మమత్వమనునది యుండును. ఇది నాది అను భావము మనస్సుకు సంబంధించినది. ఆత్మీయతాభావము తొలగిపోయినచో మనస్సునకు దుఃఖము కలుగును కాని సత్వభావము అప్పుడే ఏర్పడునని అనెను.

కామధేనువు జమదగ్ని మహర్షితో నిట్లని సూర్యుని వంటి కాంతి గల అనేక విధములైన శస్త్రములను, అస్త్రములను, సైన్యములను సృష్టించెను.

కామధేనువుయొక్క ముఖము నుండి మూడుకోట్ల ఖడ్గము ధరించువారు పుట్టిరి. ముక్కునుండి శూలపాణులు ఐదుకోట్లమంది పుట్టిరి. కండ్లనుండి నూరుకోట్ల ధనుర్ధరులు పుట్టిరి. కపాలము నుండి దండధారులైన సైనికులు మూడుకోట్ల మంది పుట్టిరి. అట్లే వక్షస్థలమునుండి శక్తియను ఆయుధమును ధరించిన సైనికులు మూడు కోట్ల మంది పుట్టిరి. వెనకభాగమునుండి గదాధరులైన సైనికులు నూరు కోట్ల మంది పుట్టిరి. పాద భాగము నుండి వాద్యములు ధరించు సైనికులు వేలమంది ఉద్భవించిరి. పిక్కలనుండి మూడు కోట్ల రాజ పుత్రులుద్భవించిరి. మర్మదేశము నుండి మూడుకోట్ల మ్లేచ్చ జాతి పురుషులు పుట్టిరి. ఇట్టి సైన్యమును కామధేనువు మహర్షికొసగి అభయమునిచ్చెను. ఈసైన్యము శత్రుమూకతో యుద్ధము చేయును. నీవచ్చటకు వెళ్ళవలసిన పనిలేదని పలికెను.

జమదగ్నిముని కామధేనువొసగిన సైన్యముతో శత్రు సైన్యమును జయించి సంతోషపడెను.

యుద్ధ వృత్తాంతమును తెలిసి కొనుటకు మహారాజు పంపిన సేవకుడు రాజుతో కామధేనువు సైన్యసృష్టి చేసిన విషయమును, యుద్ధమున అతని సైన్యము పరాజయమునకు గురియైన విధమునంతయు నివేదించెను. తన సేవకుని మాటలు విని కార్తవీర్యార్జునుడు భయపడి తన రాజ్యమునుండి సైన్యమును పంపుమని సేవకులనచ్చటికి పంపించెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాదమున గణపతికి ఏకదంతత్త్వ ప్రశ్న సందర్భమున తెల్పబడిన జమదగ్ని కార్తవీర్యార్జునుల యుద్ధారంభ వర్ణనమను ఇరువది నాల్గవ అధ్యాయము సమాప్తము.