3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
31 - పరశురామాయ శ్రీకృష్ణ కవచ ప్రదానం
నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితో నిట్లనెను-
ఓ నారాయణమునీ! పరమశివుడు పరశురామునకు ఉపదేశించిన స్తోత్రము, మంత్రము, కవచము ఎట్టివి? ఆమంత్రము ఎవరికి సంబంధించినది? స్తోత్రము కవచముల యొక్క ఫలమేమి? విషయములనన్నిటినీ నాకు వివరించి చెప్పుమని ఆడిగాను.
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-
పరమ శివుడు పరశురామునకు ఉపదేశించిన మంత్రమునకు ఆరాధ్యదైవము పరిపూర్ణుడు గోపగోపికానాథుడగు శ్రీకృష్ణుడే. శంకరుడు ఉపదేశించిన త్రైలోక్య విజయమను కవచము చాల అద్బుతమైనది. అట్లే ఆతడు ఉదేశించిన స్తోత్రము వలన గొప్ప సంపద మరియు యోగము కలుగును. ఆతడుపదేశించిన కల్పతరువను మంత్రము సమస్తమైన కోరికలను తీర్చును. వీటిని పరమశివుడు రత్నపర్వత సమీపమున, స్వయంప్రభానదీ తీరముననున్న పారిజాత వనములోని పరమేశ్వరుని ఆశ్రమమున మాధవుని యొక్క సమీపమున ఉపదేశించెను.
మహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లనెను-
భృగువంశమున పుట్టిన భార్గవరామా! నిమ్న నా పుత్రుని కంటే మిన్నగా ప్రేమించుచున్నాను. అందువలన త్రైలోక్య విజయమను ఈకవచమును స్వీకరింపుము. శ్రీకృష్ణునకు చెందిన ఈ త్రైలోక్యవిజయమమ కవచము అత్యద్భుతమైనది. సమస్త జయములను కలిగించును.
ఈ కవచమును శ్రీకృష్ణుడు గోలోకమున బృందావనములోని రాసమండలమున నున్న రాధికాశ్రమమున నాకు ఉపదేశించెను. ఇది మిక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములకు సారరూపమైనది. మిక్కిలి పుణ్యమైన దీనిని నీపై నున్న ప్రేమతో నీకు ఉపదేశించుచున్నాను.
ఈకవచమును శరీరమున ధరించి, పఠించి మూల ప్రకృతి యగు దుర్గాదేవి శుంభ నిశుంభులను మహిషాసురుని, రక్తభీజుని చంపగలిగినది. అట్లే నేను సర్వతత్త్వములను తెలిసికొని జగత్సంహార కారకుడనైతిని. అట్లే జయింపరాని త్రిపురములను అవలీలగా జయించితిని. దీనిని ధరించినందువలననే బ్రహ్మదేవుడు సృష్టిని చేయగలిగాను. శేషుడు అనంత విశ్వమును, ఆశేషుని ఆది కూర్మము ఆవలీలగా మోయుచున్నారు. ఈ కవచము వలననే వాయుదేవుడు సర్వప్రాణులకు ఊపిరిగానున్నాడు, వరుణుడు సిద్దినందినాడు. కుబేరుడు ధనాధిపతియైనాడు. ఇంద్రుడు దేవతలకు అధిపతి కాగలిగాను. సూర్యుడు తేజోరాశియైనాడు, చంద్రుడు మహా బలప రాక్రమ వంతుడయ్యెను. అగస్త్య మహాముని సప్త సాగరములను త్రాగగలిగెను, అట్లే వాతాపియను రాక్షసుని జీర్ణము చేసికోగలిగెను. ఈ కవచమును ధరించి పఠించినందు వలననే భూమీ అన్నిటికి ఆధారము కాగలిగినది. గంగ జగములన్నిటిని పవిత్రము చేయగలిగినది. ధర్మదేవత ధర్మవిదులలో శ్రేష్టుడు కాగలిగెను. సరస్వతీదేవి సమస్త విద్యలకు అధిదేవియైనది. జగన్మాతయగు అన్నపూర్ణాదేవి పరాత్పర కాగలిగినది. అగ్ని దేవుడు పరమశుద్ధుడు, తేజోవంతుడు కాగలిగెను. సనత్కుమారుడు జ్ఞానవంతులలో శ్రేష్టుడు కాగలిగెను.
ఇట్టి త్రైలోక్య విజయమను ఈ కవచమును మహాత్ముడు, సాధువు అగు శ్రీకృష్ణభక్తునకే ఉపదేశింపవలెమ గానీ మూర్ఖుడు ఇతర దేవతా భక్తుడగువానికి ఉపదేశింపగూడదు. అట్లు ఉపదేశించనిచో ఉపదేశము చేసినవాడు వెంటనే మృత్యువుపాలగును అని అనెను.
తైలోక్య విజయమను ఈ కవచమునకు ఋషి బ్రహ్మదేవుడు. ఛందస్సు గాయత్రీ ఛందస్సు. దేవత రాసేశ్వరుడగు శ్రీకృష్ణపరమాత్మయే. మూడు లోకములందు జయము లభించుటకై దీనిని వినియోగింపవలెను. పరాత్పరమగు ఈ కవచము మూడు లోకములందును లభించదు.
ఓం శ్రీకృష్ణాయ నమః అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక. కృష్ణాయస్వాహా అను పంచాక్షరీ మంత్రము నా కపాలము రక్షించు గాక. కృష్ణా అనునది నా కండ్లను, కృష్ణస్వాహా అనునది నా తారకలను రక్షించుగాక, హరయే నమః అను మంత్రము నా కను బొమలను రక్షించుగాక. ఓం గోవిందాయ స్వాహా అనునది నా నాసికను రక్షించుగాక. గోపాలాయనమః అను మంత్రము నా చెక్కిళ్ళను రక్షించుగాక. ఓం నమో గోపాంగనేశాయ నమః అనునది నా చెవులను రక్షించుగాక. ఓం కృష్ణాయ నమః అను మంత్రము నా పెదవులను రక్షించుగాక. ఓం గోవిందాయ స్వాహా అనునది నా దంతములను రక్షించుగాక. కృష్ణాయ అనునది క్రింది చిగుళ్ళను, క్లీం అనునది పై చిగుళ్ళను, ఓం శ్రీ కృష్ణాయ స్వాహా అను మంత్రము నా నాలుకను, రాసేశ్వరాయ స్వాహా అనునది నా తాలువలను, రాధికేశాయ స్వాహా అను మంత్రము నా కంఠమును, నమో. గోపాంగనేశాయ అనునది నా వక్ష స్థలమును, ఓం గోపేశాయ స్వాహా అనునది నా భుజములను, నమః కిశోర వేషాయ స్వాహా అనునది నా పృష్ఠ భాగమును, ముకుందాయ నమః అనునది నా ఉదరమును, ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహా అనునది నా కరములను, ఓం విష్ణవే నమః అనునది నా బాహువులను, ఓం హ్రీం భగవతే స్వాహా అను మంత్రము నా నఖములను, ఓం నమో నారాయణాయ అనునది గోళ్ళ వెనక భాగమును, ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ అనునది నాభిని, ఓం సర్వేశాయ స్వాహా అనునది నా ఎముకల గూడును, ఓం గోపీరమణాయ స్వాహా అనునది నా నితంబములను, ఓం హ్రీం క్లీం రసికేశాయ స్వాహా అనునది వా సర్వాంగములను రక్షించుగాక! అట్లే ఓం కేశవాయస్వాహా అనునది నాయొక్క వెంట్రుకలను, ఓం కృష్ణాయ స్వాహా అనునది నా బ్రహ్మ రంధ్రమును, ఓం మాధవాయ స్వాహా అను మంత్రము రోమములను, ఓం హ్రీం శ్రీం రాసికేశాయస్వాహా అనునది నా సమస్తావయవములను రక్షించుగాక.
పరిపూర్ణతముడగు కృష్ణుడు నా తూర్పుదిశన, గోలోకనాథుడు నా ఆగ్నేయభాగమును, పూర్ణబ్రహ్మస్వరూపుడు నా దక్షిణ భాగమును, కృష్ణుడు నా నైఋతి భాగమును, శ్రీహరి నా పశ్చిమ భాగమును, గోవిందుడు నా వాయవ్య భాగమును, రసిక శిరోమణి నా ఉత్తర భాగమును, బృందావన విహారి నా ఈశాన్య భాగమును, బృందావనీ ప్రాణనాథుడు నా ఊర్ధ్వభాగమును, మహాబలుడగు బలిహారి, మాధవుడు, నృసింహుడు భూభాగమున, జలభాగమున ఆకాశభాగమున నన్నెల్లప్పుడు రక్షింతురుగాక. మాధవుడు స్వప్నావస్థయందును, జాగ్రదావస్థయందును నన్నేల్లప్పుడు రక్షించుగాక. సర్వాంతరాత్మ స్వరూపి, నిర్లిప్తుడగు శ్రీకృష్ణుడు నన్నెల్లప్పుడు అన్ని దిక్కులనుండి రక్షించుగాక.
భార్గవరామా! సమస్త మంత్ర సారమైన త్రైలోక్య విజయమను కవచమును నీకు చెప్పితిని. దీనిని శ్రీకృష్ణుని వలన ఉపదేశము పొందితిని. దీనిని అర్హత లేనివారికి ఉపదేశింపకూడదు, గురువును శాస్త్రపద్ధతిలో పూజించి ఈ కవచమును తన కంఠ మందుగానీ దక్షిణ బాహువున గాని దీనిని కట్టుకొనవలెను. ఆ విధముగా చేసినచో అతడు విష్ణుతుల్యుడగును. అతడు శ్రీహరి భక్తుడగును. అందువలన అతని దగ్గర విద్య, ధనము, రెండును ఉండును.
కవచము సిద్ధించినచో ఆతడు జీవన్ముక్తుడగును. ఆతడు కోటి సంవత్సరములు శ్రీహరిని పూజించిన ఫలితమును పొందును. వేయి రాజసూయ యాగములు, నూరు వాజపేయయాగములు, పదివేల అశ్వమేధములు, నరమేధములు, గొప్పదానములు, భూమి ప్రదక్షిణము ఇవన్నియు త్రైలోక్య విజయము యొక్క పదునారవ ఆంశయైన కాజాలవు. అట్లే వ్రతములు ఉపవాస నియమములు, వేదాధ్యయనము, తపస్సు, సమస్త పుణ్య తీర్థస్నానము ఇవన్నియు ఈ కవచమునకు పదునారవవంతైనను కాజాలవు, సిద్ధకవచుడు సిద్ధత్వమును, దేవతాత్వమును, శ్రీహరి దాస్యమును అన్నిటినీ తప్పక పొందును.
ఈకవచమును పదిలక్షల మార్లు జపించినచో అతడు సిద్ధకవచుడగును. సిద్ధకవచుడు సర్వజ్ఞుడు కూడ కాగలడు. ఈ కవచమును వదలి పెట్టి అనేక కోట్లు శ్రీహరి మంత్రమును పఠించినను ఆ మంత్రము సిద్దికాదు. అందువలన ఈ కవచము యొక్క సహాయమువలన ఈ భూమిపై రాజులు లేకుండ ఇరువది యొక్క మార్లు తిరిగి, సంహారము చేయగలవు.
రాజ్యము నివ్వవచ్చును చివరకు తన తలనైన ఈయవచ్చును. ప్రాణము లివ్వవచ్చును కానీ ప్రాణాపాయ పరిస్థితిలోనైనను ఈకవచమును అనర్హునకు ఉపదేశింపరాదు. అని పరమశివుడు భార్గవ రామునితో అనెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన పరశురామునకు శ్రీ కృష్ణ కవచ ప్రదానమను ముప్పది యొక్కటవ అధ్యాయము సమాప్తము.
