3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

20 -  గణపతికి గజముఖమే ఎందుకు?  

నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను –

ఓ నారాయణమునీ! నీవు శ్రీహరియొక్క అంశవలన జన్మించినవాడవు. అందువలన నీవు బుద్దియందు, తేజస్సున, పరాక్రమమున శ్రీహరితో సమానుడవు. విఘ్నాధిపతియైన గణాధిపతికి కలిగిన విఘ్నమును గొప్పగా వివరించితివి. ఆట్లే ఆ విఘ్నమునకు కారణమైన దానిని, సృష్టికర్తయైన బ్రహ్మదేవునిద్వారా వినిపించితివి.

ఇప్పుడు నాకొక సందేహము కలదు. అది ముల్లోకములకు అధిపతియగు శంకరుని పుత్రునకు ఏనుగు ముఖమునే ఎందుకు పెట్టిరనునది. ఈ ప్రపంచమున చాలా జంతువులున్నవి. అందమైన రూపముకల అనేక ప్రాణులుండగా ఏనుగ ముఖమునే ఎందులకు అతికించిరనునది నా సందేహము అని పలికెను.

శ్రీ నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లు నారదునితో అనెను –

గణాధిపతికి ఏనుగ తలను పెట్టు విషయము సమస్త పురాణములలో, వేదములలోనూ రహస్యముగానున్నది. దానికి సంబంధించిన మహాలక్ష్మియొక్క చరిత్రను నీకిప్పుడు వివరింతును.

అది సమస్త దుఃఖములను పోగొట్టును. సమస్త సంపదలను కలిగించును. ఆపదలను తొలగించును. పాపములను పోగొట్టును. సుఖమును, మోక్షమును, ధర్మార్థకామమోక్షములను కలిగించును.

నారదా! పాద్మకల్పమున రహస్యముగానున్న ప్రాచీనేతిహాసమును నీకు తెలిపెదను వినుము.

ఒకప్పుడు దేవేంద్రుడు అత్యధిక సంపదవలన కలిగిన మదమువలన ఉన్మత్తుడై, రాజశోభతో ప్రకాశించుచు, మహాకాముకుడై పుష్పభద్రానదీతీరమునకు పోయెను. ఆ పుష్పభద్రానదీ తీరమున మిక్కిలి రహస్యముగానున్న పుష్పవనమును చేరుకొనెను. ఆ పుష్పోద్యానము మిక్కిలి సుందరమై, ఎటువంటి జంతువులు లేక తుమ్మెదలు, గండుకోయిలల ద్వనితో, సువాసన గలిగిన పిల్లవాయువులతో ఆహ్లాదజనకముగానుండెను.

ఆ సమయమున చంద్రలోకమునుండి మన్మథుని కోరి అతని ఆశ్రమమునకు ఒంటరిగా మన్మథుని మనస్సులో భావించుకొనుచున్న రంభ ఆ ప్రాంతమునకు వచ్చెను. ఆమె చక్కని పిరుదులలో, చక్కని పల్వరుసతో, మదించిన ఏనుగువలె మెల్లగా పోవుచుండెను. చక్కని అందము, శరత్కాలపు చంద్రునివంటిముఖము, చిరునవ్వు, మాలతీపుష్పమాల కలిగిన కొప్పు, మంచిగానున్న వస్త్రము, రత్నభూషణములు, పాపెటలో కస్తూరిచేర్చుక్కనున్న సిందూరము, నల్లకలువలవంటి కన్నులు, మణికుండలములు, మకరీకాపత్రములతో సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాల చక్కగానుండెను.

చక్కగా అలంకరించుకొని, మన్మథునితో కలయుటకు ఆమె పోవుచుండెను. దేవతలందరకు ప్రాణములకంటే మిన్నయైన రంభ స్వేచ్చగా తిరుగు స్వభావము కలది, సుస్థిరమైన యౌవనము కలది, ఇంకను ఆమె తన రూప విభ్రమములచే మునులయొక్క చిత్తమును అపహరించు స్వభావము కలది, అతిగా అలంకరించుకొనిపోవుచున్న ఆ రంభను ఏకాంతమున ఇంద్రుడు చూచి ఇంద్రియచాపల్యమువలన ఆమెతో ఇట్లు మాటాడసాగెను.

ఇంద్ర ఉవాచ - ఇంద్రుడిట్లు పలికెను –

ఓ అందమైనదానా! నీవెచ్చటికి పోవుచున్నావు. ఎక్కడినుండి వచ్చుచున్నావు. చాలాకాలమునకు నీపు కనిపించితివి. నేను నీన్నే వెదకుచున్నాను. నీపైగల కోరికచే సువాసితమైన తీయ్యని నీరు తాగువాడు బురదనీరును త్రాగనట్లు, గంధము కావలయునను కొనువాడు బురదను ముట్టనట్లు, అమృతమును కోరువాడు సురను ఇష్టపడనట్లు, పాలు త్రాగువాడు అపరిశుద్ధజలమును ఇష్టపడనట్లు, నువాసనగల పుష్పములయందు నిదురించువాడు ఆస్త్రశయ్యను కోరుకొననట్లు, స్వర్గమున నుండువాడు నరకమును ఇష్టపడనట్లు, అందమైనవాడు దుష్టభోజనము చేయనొల్లనిట్లు, రత్నాభరణములు ధరించువాడు ఇనుముతో చేసిన ఆభరణములను ఇష్టపడని యట్లు, చక్కని తెలివి అందము గల నిన్ను వదలిపెట్టి ఇతరస్త్రీల పొందును కోరుకొనలేను. నీ ఇంద్రియములచే ఇంద్రియ సుఖమును పెంపొందించు నిన్ను వదలి ఇంకొక స్త్రీని మనసులోనైన స్మరింపలేకున్నాను. ప్రతి ప్రాణియు సుఖా భిలాషియైనను శ్రేష్ఠమైన దానినే ఎక్కువగా కోరుకొనును.

కామముతోనున్న దేవేంద్రుడు ఈవిధముగా రంభతో మాటలాడుచు తన గజమగు ఐరావతమునుండి క్రిందకు దిగి రంభ ముందు నిలబడెను.

మహాశృంగారమును కోరుకొను రంభ ఇంద్రుని సరస సంభాషణములను విని పులకించిపోయి, తలను వంచుకొని నవ్వెను. ఆ రంభ తన చిరునవ్వు, కటాక్షము, స్తనములను ఊరువులను చూపించుట, నర్మోక్తులుగల మాటలు మొదలగు వాటిచే ఇంద్రుని మనస్సును చూరగొనెను. అటుపిమ్మట సుమధురము, కోమలము, ప్రియమైనది, పురుషుని స్వాధీనము చేసికొను మాటలను మితముగా ఇట్లు పలకసాగెను.

రంభోవాచ - రంభ ఈవిధముగా పలికెను –

ఓ ఇంద్రుడా! నేను ఎచ్చటికి పోవుచున్నానను ప్రశ్నవలన నీకేమి ఫలితము కలదు. ఐనను నేను దుష్టులకు సంతోషమును కలిగించుదాననుకాదు. దుష్టులతో నేను సావాసమును చేయను.

తుమ్మెద అన్ని పుష్పములనుండి మకరందమును గ్రహించినను రుచిగల కొన్ని పుప్పుములపైననే ఎల్లప్పుడుండును. అట్లే కాముకుడు కూడ అంతట తిరిగిననూ, కొందరినే అనుభవించును. కాకియెట్లు చెట్లపై వాలి పండ్లను తిని పోవునో కాముకుడట్లే ఫలముననుభవించిపోవును. చెరువులలో నీరున్నంతవరకు జలచరములున్నట్లు కాముకుడు తన అవసరమున నుసరించియుండును.

ఐనను నీవు దేవతలకు అధిపతివి. కామినులందరు నిన్నెల్లప్పుడు కోరుకొందురు. రసికలగు స్త్రీలు రసికునే ఎల్లప్పుడు కోరుకొందురు. కామినియగు స్త్రీ యువకుడు, రసికుడు, అందగాడు, చక్కగా అలంకరించుకొనువాడు, గుణవంతుడు, ధనవంతుడగు పురుషుని మాత్రమే కామీంచును. అట్లే చెడునడక కలవాడు, రోగి, ముసలివాడు, రతి శక్తిలేనివాడు, ధనము నీయనివాడు, తెలివి తక్కువవాడగు పురుషుని ఎల్లప్పుడు కోరుకొనదు. అందువలన నీవంటి గుణసముద్రుని ఏ స్త్రీ కోరుకొనదు?. కావున నీ అజ్ఞను శిరసావహించు ఈ దాసిని నీ సుఖమునకై స్వీకరింపుమని రంభ పలికెను.

ఈవిధముగా రంభ దేవేంద్రునితో మాటాడుచు చిరునవ్వుతో చూచెను. ఆమె మన్మథాగ్నిచే దహించుకొని పోవుచుండెను. అందువలన సిగ్గు వదిలి ప్రవర్తించుచుండెను. మన్మథ శాస్త్ర విశారదుడగు దేవేంద్రుడు మన్మథునిచే బాధపడుచున్న రంభ యొక్క మనసును గ్రహించి ఆమెను తీసికొని పుష్పశయ్యపై విహరించెను. ప్రౌడ, ఆందముగలది, శ్రేష్ఠురాలు దొండపండువలే ఎఱ్ఱని అధరముగల రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా రంభకూడ అతనిని ముద్దిడెను. వీపరీత శృంగారము మొదలగు నానా ప్రకారములగు శృంగారములవలన దేవేంద్రుడు రంభతో పరమ సౌఖ్యమును పొందెను. కామముతో కూడుకున్న ఆ రంభాదేవేంద్రులు అన్యోన్యముగానుండి జ్ఞానమును వదిలి రాత్రింబగళ్ళు తెలియకనుండిరి. దేవేంద్రుడు రంభతో భూమిపై క్రీడలు సల్పి పుష్పభద్రానదిలో జలవిహారమున కేగెను. జలక్రీడ తరువాత స్థలక్రీడ, తిరిగి జలక్రీడ అనునట్లు వారు చాలాకాలము విహరించిరి.

ఆ సమయమున దుర్వాసమహర్షి తన శిష్యులతో వైకుంఠమునుండి కైలాసమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. దుర్వాసమహర్షిని చూచి దేవేంద్రుడతనికి నమస్కరించెను. అప్పుడా మహర్షి దేవేంద్రునికి ఆశీస్సులనొసగి శ్రీమన్నారాయణుడు తనకు కానుకగానిచ్చిన పారిజాత పుష్పము నతనికిచ్చి ఆ పుష్పముయొక్క మహాత్మ్యమునిట్లు చెప్పసాగెమ.

దుర్వాస ఉవాచ - దుర్వాసమహర్షి ఇట్లు పలికెను –

ఈ పారిజాతపుష్పము శ్రీమన్నారాయణుని అర్చనకై సమర్పింపబడినది. దేవేంద్ర! దీనినెవరు శిరసున ధరింతురో వారికి అంతట జయము లభించును. సమస్త దేవతలకంటే ముందుగా అతడే గౌరవింపబడును. అతనిని మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడు అంటి పెట్టుకొనియే యుండును. జ్ఞానమున, తేజస్సునందు, బుద్ధియందు, విక్రమమున, బలమున అతడు శ్రీమన్నారాయణునితో సమానుడగును. సమస్త దేవతల యందు అతడు శ్రేష్ఠుడై యుండును.

అట్లే అహంకారము వలన ఎవరు ఈ పుష్పమును భక్తితో స్వీకరింపరో, వారు శ్రీహరి నైవేద్యమును స్వీకరింపనివారివలె తమ కులమునుండి భ్రష్టులైపోవుదురని చెప్పి శంకరుని అంశస్వరూపుడగు దుర్వాసమహర్షి కైలాసపర్వతమునకు పోయెను.

దేవేంద్రుడు రంభసమీపమున కామమోహితుడైయుండి ఆ దివ్యపుష్పమును తన గజముయొక్క శిరస్సుపై పారవేసెను. ఆ దివ్యపుష్పమును గౌరవించనందున దేవేంద్రుడు సంపదను కోల్పోగా రంభ స్వర్గమునకు పోయెను. చంచలస్వభావము కలది, అధమురాలు, వారవనితయగు రంభ దేవేంద్రుని కంటె యోగ్యుడైన ఇంకొక పురుషునికై వెళ్ళిపోయేను.

దేవతలకు అధిపతియగు ఇంద్రుని గజము పారిజాత పుష్పమును శిరస్సుపై ధరించుటవలన ఆ పుష్పమును తిరస్కరించిన దేవేంద్రుని వదలి మహారణ్యమును ప్రవేశించెను. అచ్చటనున్న ఆడఏనుగుతో కలసి తిరిగినందువలన దానికి చాలా సంతానము కలిగినది.

శ్రీహరి ఆ గజముయొక్క తలను తెప్పించి శని యొక్క దృష్టి దోషము వలన శిరస్సు తెగిపోయిన పార్వతీదేవి పుత్రుని శరీరమున కతికించెను.

నారదా! ఈవిధముగా పార్వతీదేవి పుత్రునకు గజశిరస్సు కలుగుటకు కల కారణమున తెలిపితిని. ఈకథ పాపమును పోగొట్టును. ఇంకనూ నీవు వినదలచినదేదైన ఉన్నచో అడుగుమని నారాయణముని నారదునితో అనెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణమునుల సంవాద సమయమున తెల్పబడిన గణపతికి ఏనుగ శిరస్సు ఏర్పడుటకుగల కారణమును తెలుపు ఇరువదవ అధ్యాయము సమాప్తము.