3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

2 - సంతాన ప్రాప్తికై పార్వతి పరమేశ్వరుని ప్రాధేయపడుట

నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదునితో ఇట్లనేమ-

శంకరుడు రతికార్యమును వదలి ఎదురుగానున్న దేవతలనుచూచి పార్వతీదేవి భయమువలన దేవతల పైగల దయతో వారిని పరుగెత్తిపొండని పలికెను. దేవతలుకూడ పార్వతీదేవి శాపము పెట్టునన భయమువలన పరుగెత్తుకొనిపోయిరి. సమస్తలోకములనన్నిటిని సంహరించు రుద్రుడు సహితము పార్వతీదేవి శాపము పెట్టునను భయమువలన కంపించిపోయెను.

పార్వతీదేవి శయ్య పైనుండి కోపముతో లేచినది. కాని దేవతలామెకు ఎదురుగా కన్పించినందువలన తనకోపమును తనలోనే కొంత సేపు అణచుకొనెను, ఐనను కోపమును పట్టలేక దేవతలకందరకు సంతానము కలుగవద్దనీ శపించినది.

పార్వతీదేవి తాను సంతానమునకు దూరమైతినను దుఃఖముతో తలవంచుకొని భూమిని తన పాదనఖాంగుష్ఠముతో వ్రాయుచుండెను. ఆమెకన్నులు కోపముతో ఎరుపెక్కినవి. బాధపడుచున్న తనభార్యను చూచి శంకరుడు ఆమెను ఓదార్చుచు ఇట్లు మధురముగా అనెను.

శంకర ఉవాచ - శంకరుడిట్లు పార్వతితోననెను-

పర్వత శ్రేష్ఠుడగు హిమాలయునిపుత్రీకా! నీవు చాలా అందమైనదానవు. నీవు నాప్రాణములకు ఆధిష్టానదేవతవు. నా యోక్క సౌభాగ్యరూపిణివి. జగన్మాతవగు నీకోరిక ఎట్టిదైనను దానిని నాకు చెప్పినచో తీర్తును.

ఈలోకములన్నిటియందు మన ఇద్దరకు ఆసాధ్యమైనదేదియులేదు. నేను ఏతప్పుచేయలేదు. నన్ను కోపించుట నీకు తగదు. ఆందువలన నీవు నావిషయమున ప్రసన్నురాలవు కమ్ము. నేను చేసిన తప్పు ఏమో నాకు తెలియదు. నీ వలననే నేను మంగళస్వరూపుడనైతిని. ఇతరులకు శుభములు కలిగించువాడనైతిని. నీవులేనిచో నేను శవమువలె ఆమంగళస్వరూపుడనైయుండువాడను.

నీవు ప్రకృతిస్వరూపిణివి, బుద్దీరూపిణినీ, శక్తి, క్షమ, దయ, తుష్టి పుష్టి శాంతి, క్షాంతీ, ఆకలి, ఛాయ, నీడ, నిద్ర, అలసత, శ్రద్ద మొదలగునవన్నీయు నీరూపములే. సమస్తసృష్టికి ఆధారరూపవు. సమస్తమునకు కారణరూపవు నీవే. ఇట్టినీవు నవ్వుచు సరసముగా నాతో సంభాషింపుము అని పరమేశ్వరుడు పార్వతీదేవితో పలికెను.

మృదుమధురమైన శంకరుని మాటలను క్షమాగుణముకల పార్వతీదేవి విని హృదయము బాధతోనున్ననూ మధురముగా పరమేశ్వరునితో ఇట్లు పలికినది.

పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను-

ఓమహేశ! నీవు సర్వము తెలిసినవాడవు, సమస్తరూపములు నీవే. నీవు ఆత్మారాముడవై యోగిగానున్నావు. నీవు సంపూర్ణకాముకుడవు.

కాముకురాలగు స్త్రీ తన మనస్సులోనున్న కోరికను తెలివితక్కువ భర్తతో నైనను చెప్పుకొనును. కానీ నీవు అందరి కోరికలు గుర్తించువాడవు. ఆట్టి నీకు నామనస్సులోని కోరికను ఏమని చెప్పుకొందును. నాకోరిక చాలా రహస్యమైనది. ఇది స్త్రీలందరకు సిగ్గును కలిగించునది. ఇతరులకు చెప్పరానిది. ఐనను నీకు చెప్పెదను.

ఓపరమేశ్వర! స్త్రీలకు సమస్తసుఖములలో గొప్పదైన సుఖము ప్రియుడగు తనభర్తతో రమించుట. ఆది నిర్జనప్రదేశమున మరింత సుఖమును కలిగించును. అట్టి సంభోగభంగముకంటే గొప్పనైన దుఃఖము స్త్రీలకు లేనే లేదు. అట్లే భర్త వియోగము స్త్రీలకు పరమదారుణమైనది.

చంద్రుడు కృష్ణపక్షమున ప్రతిదినము ఎట్లు క్షీణించునో భర్తలేని స్త్రీ ప్రతీక్షణము క్షీణించును. ఆందరకు చింత బాధాకరమైనది. బట్టలకు వేడిమి బాధాకరమైనది. అట్లే భర్త వియోగము స్త్రీలకు పరమ దారుణమైనది.

మంచిపుత్రుడు తనభర్తయొక్క అంశరూపుడు. అతడు భర్తవలే సుఖమును కలిగించును. చెడ్డకొడుకు తన కులమునకు తనభార్యయొక్క గర్భమున తన ఆంశరూపమున పుత్రుడై పుట్టును. అట్లే పతివ్రతయగు స్త్రీ తల్లివలె ఎల్లప్పుడు తనభర్తయొక్క మేలునే కోరుచుండును. పతివ్రతకాని స్త్రీ శత్రువువలె ఎల్లప్పుడు తనభర్తకు దుఃఖమునే కలిగించుచుండును. ముఖదుష్ట (ఎల్లప్పుడు తనభర్తతో కలహము పెట్టుకొనునది) యోనిదుష్ట (జారస్త్రీ) అసాధ్వి అని దుష్టస్త్రీలు మూడువిధములుగానున్నారు.

అందువలన ఉపాయసముద్రుడవు. సమస్తతపః ఫలితములనిచ్చు ఓయోగీశ్వరేశ్వర నా బాధకు నివృత్తిమార్గమును నీవే ఉపదేశింపుమని పార్వతీ పరమేశ్వరుని కోరిను.

పార్వతీదేవి ఇట్లు తనభర్తతో పలికి తలవంచుకుని కూర్చుండెను. అప్పుడు శంకరుడు నవ్వి పార్వతిని ఇట్లు మధురమైన భాషణములతో లాలించెను.

శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణమున మూడవదగు గణపతిఖండమున నారద నారాయణసంపాదములో రెండవ అధ్యాయము సమాప్తము.