3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

10 - గణేశోద్భవ మంగళం

నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను-

పార్వతీపరమేశ్వరులు తమ పుత్రుని ముఖము చూచి ఆ గది నుండి బయటకు వచ్చి బ్రాహ్మణులకు అనేక రత్నములను దానము చేసి అట్లే స్తోత్రములు చేయు భటులకు, భిక్షకులకు కూడ అనేక దానములు చేసి మంగళవాద్యములను మ్రోగించిరి.

శిశువుయొక్క తాతగారగు హిమవంతుడు బ్రాహ్మణులకు లక్షలకొలది రత్నములను, వేలకొలది గజేంద్రములను, మూడు లక్షల గుఱ్ఱములను, పదిలక్షల గోవులను, ఐదు లక్షల సువర్ణముద్రలను. ఇంకను ముత్యాలు, మాణిక్యములు, వస్త్రములు, ఆభరణములు మొదలగు వాటినన్నిటినీ దానమొసగెను.

శ్రీమహావిష్ణువు బ్రాహ్మణులకు కౌస్తుభ మణులను దానము చేయగా బ్రహ్మదేవుడు ఆయా విప్రులు కోరుకొన్న వస్తువులను దానము చేసెను. అట్లే ధర్మదేవత, సూర్యుడు, ఇంద్రుడు, దేవతలు, దేవతా స్త్రీలు, మునులు, గంధర్వులు, పర్వతములు

మొదలగువారందరు అనేక వేల మాణిక్యములను, అనేకవందల రత్నములను, వజ్రములను, పచ్చలను, లక్షలకొలది ఆవులను, వేలకొలది ఏనుగులను దానము చేసిరి, బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు కోట్లకొద్ది బంగారునాణెములను, వస్త్రములను దానము చేసెను.

సరస్వతీదేవి గణపతి పుట్టిన సందర్భమున అనేక మణులు, వజ్రములుకల హారములను బ్రాహ్మణులకు దానము చేసెను. సావిత్రీదేవి మంచి రత్నములున్న హారములూ, , తన సమస్తాభరణములను బ్రాహ్మణులకు దానము చేసెను. ధనపతియగు.  కుబేరుడు ఆ సమయమున లక్షలకొలది బంగారు నాణెములను, వందలకొలది విలువైన రత్నములను ఇంకను అనేక విధములైన వస్తువులను బ్రాహ్మణులకు సంతోషముతో దానము చేసెను.

దేవతలందరు పరమ సంతోషముతో బ్రాహ్మణులకు దానములు చేసి శిశువును చూచిరి. దేవతలు మొదలగువారు సమర్పించిన దానములను బ్రాహ్మణులు మోయలేక మెల్లమెల్లగా పోవుచు అచ్చటచ్చట విశ్రాంతిగొనుచూ తమకిచ్చిన దానముల గురించి యువకులకు, భిక్షకులకు కథలు కథలుగా చెప్పుచుండిరి. వారు ఆ బ్రాహ్మణులు చెప్పిన కథలను వినుచు సంతోషపడుచుండిరి.

శివపుత్రుడైన గణపతి జన్మోత్సవ సమయమున విష్ణుమూర్తి సంతోషముతో వాద్యములను మ్రోగింపజేయుచు నాట్యమును చేయించుచు, సంగీతమును వినిపించుచుండెను. ఆట్లే అచ్చట వేద, పురాణ పారాయణమును చేయించేను. అదేవిధముగా మునీంద్రులను ఆహ్వానించి వారిని పూజలందుకొనునట్లు చేసెను. వారందరు మరియు దేవతలందరు ఆ శిశువునకు ఆశీస్సుల నొసగిరి.

విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను.

ఓ బాలకా నీకు శంకరునితో సమానమగు జ్ఞానము ఆయుష్షు కలుగుగాక! అట్లే నాతో సమానమైన పరాక్రమము కలుగునుగాక! నీవు సమస్తసిద్ధులకు అధిపతిగా వెలుగొందుదువని ఆశీర్వదించెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను.

ఓ బాలకా! నీ కీర్తి ప్రపంచమంతయు వెలుగుగాక! నీవు త్వరలో అందరిచే మన్ననలనందుకొందువు. అందరు దేవతలకంటే ముందు నీపూజయే జరుగునని ఆశీర్వదించెను.

ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను.

ఓ శిశు! నీవు నావలె చక్కని ధర్మమార్గమున చరింపుము. నీవు సర్వజ్ఞుడవు, దయకలవాడవు, శ్రీహరిభక్తుడవు కూడ కాగలవు, నీవు శ్రీహరితో సమానుడవుగా ప్రకాశింతువని ఆశీర్వదించెను.

మహాదేవ ఉవాచ - శంకరుడిట్లు పలికెను.

ఓ నాప్రాణప్రియమైన బాలకా! నీవు నాతో సమానముగా దానశీలుడవు, హరిభక్తుడవు, బుద్ధిమంతుడవు, విద్యావంతుడు, పుణ్యవంతుడవు, శాంతుడవు, నిగ్రహవంతుడవు కమ్మని శంకరుడాశీర్వదించెను.

లక్ష్మీ ఉవాచ - లక్ష్మీదేవి ఇట్లు పలికినది.

“ఓ బాలకా నేనే నీశరీరమందు, నీవున్నచోట శాశ్వతముగా నివసింతును” అని ఆశీర్వదించెను.

సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికెను.

ఓ పుత్రా! నీకు నాతో సమానముగా కవిత్వము చెప్పు శక్తి, ధారణచేయు శక్తి, స్మరించుశక్తి, ఆలోచించు శక్తి అనునవి చక్కగా కలుగునని ఆశీర్వదించెను.

సావిత్ర్యువాచ - సావిత్రీదేవి ఇట్లనెను.

హే వత్స! నేను వేదములకు మాతృరూపిణిని. నీవు నా అనుగ్రహముచే త్వరగా వేదవేదాంగ జ్ఞాన వంతుడవగుదువు. నాయొక్క మంత్రమును జపించుచు వేదార్థమును గురించి చర్చించువారిలో అగ్రగణ్యుడవు కాగలవని ఆశీర్వాదమునిచ్చను.

హిమాలయ ఉవాచ - హిమవంతు డిట్లనెను.

ఓ బాలకా! నీకు శ్రీకృష్ణునిపై శాశ్వతభక్తియుండుగాక! నీవు శ్రీకృష్ణభక్తుడవై శ్రీకృష్ణునితో సమానమగు సుగుణములతో ప్రకాశింతువని ఆశీస్సులనిచ్చెను.

మేనకోవాచ - మేనకాదేవి ఇట్లు పలికెను.

ఓ శిశూ! నీవు గాంభీర్యమున సముద్రముతో సమానడవుకమ్ము, అట్లే ఆందమున మన్మథునితో సమానుడుగా, ధర్మవర్తనమున ధర్మదేవతతో సమానముగా లక్ష్మీయుక్తుడవై శ్రీహరితో సమానముగా వెలుగొందెదవని ఆశీర్వదించెను.

వసుంధరోవాచ - భూదేవత ఇట్లు పలికెను.

ఓ బాలకా! నీవు నావలె ఓర్పు కలిగియుందువు. అందరు నిన్నే శరణు వేడెదరు. విఘ్నములకు దూరుడవై విఘ్నములనన్నిటినీ తొలగింతువు, నిన్ను సమస్త శుభలక్షణములు ఆశ్రయించి ఎల్లప్పుడుండునని ఆశీర్వదించెను.

పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను.

నాయనా! నీవు నీతండ్రివలె మహాయోగిగా, సమస్త సిద్దులకు నిలయుడవుగా, సమస్తసిద్దులనిచ్చే దేవతగా ఉండుము. అత్యంత శుభంకరుడవైన నీవు మృత్యుంజయుడవై సమస్త కార్య విశారదుడవై వర్ధిల్లుమని ఆశీర్వదించెను.

వత్సా నారదా! నీకు సర్వమంగళములకు మంగళప్రదమైనదీ, సమస్త విఘ్నములను తొలగించునది యగు గణేశుని జన్మవృత్తాంతమును తెల్పితిని. సమస్తమంగళములకు శ్రేష్టమైన ఈ గణేశ జన్మ వృత్తాంతము నంతయు విన్నవారికి సమస్త మంగళములు  కలుగును. అతని గృహమెప్పుడు సమస్త మంగళములకు నిలయము కాగలదు.

ఈ గణేశజన్మవృత్తాంతమును చక్కగా విన్నచో పుత్రులు లేనివారికి పుత్రసంపద కలుగును. ధనహీనునకు అంతులేని సంపద లభించును, లోభికి దాన గుణమబ్బును, భార్యలేనివానికి త్వరలో భార్య లభించును. సదారోగి చక్కని ఆరోగ్యవంతుడగును. పుత్రులు, భర్త, ధనములను పోగొట్టుకొన్నవానికి తిరిగి వారు లభింతురు. దుఃఖములో నున్నవారికి సంతోషము కలుగును.

గణేశుని వృత్తాంతమంతయు విన్నవారికి లభించు ఫలితము శ్రీగణేశుని జన్మవృత్తాంతముగల ఈ అధ్యాయమునొకదానిని మాత్రమే వినినప్పటికీ కలుగును. మంగళాధ్యాయమనదగు ఈ అధ్యాయము ఉన్న ఇంటిలో సదా మంగళములు జరుగుచునేయుండుమ. యాత్రలు చేయుచున్నప్పుడు, పుణ్యదినములయందు ఈ ఆధ్యాయమును నిశ్చలభక్తితో విన్నవారికి శ్రీ గణేశుని అనుగ్రహము వలన సమస్తమైన కోరికలు సిద్ధించునని నారాయణమహర్షి తెలిపెమ.

 శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో మూడవదైన గణేశఖండమున నారద నారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన గణేశోద్భవమంగళమను పదియవ అధ్యాయము సమాప్తము.