3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

22 - లక్ష్మీస్తవ పూజాకవచ కథనం

నారద ఉవాచ - నారదమహర్షి ఇట్లు పలికిను-

ఇంద్రునకు శ్రీహరి ప్రత్యక్షమై అతనికి ఉపదేశించిన శ్రీమహాలక్ష్మీ స్తోత్రము, కవచము ఎటువంటిదో నాకు వివరించి చెప్పుమని నారాయణ మునినడిగెను.

నారాయణ ఉవాచ - నారాయణ ముని ఇట్లు సమాధానమిచ్చెను.

దేవేంద్రుడు పుష్కరక్షేత్రమున శ్రీహరిగురించి తపమాచరించినపుడు అతని తపస్సు చాలా గొప్పదని తలచి శ్రీహరి ఆతనికి ప్రత్యక్షమాయెను. అప్పుడు శ్రీహరి దేవేంద్రునితో నీకిష్టమైన వరము కోరుకొమ్మని అడుగగా ఆతడు తనకు సంపద కావలెనని వేడుకొనెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతనికి వరముననుగ్రహించి సత్యము, శ్రేష్ఠమైన హితవాక్యమును ఇట్లు పలికెను.


 

శ్రీమధుసూదన ఉవాచ - మధునూదన డిట్లు పలికెను-

ఇంద్రా! సమస్త దుఃఖములను పోగొట్టునది, పరమైశ్వర్యమును కలిగించునది, సమస్త శత్రువులను నాశనమొందించునదియగు ఈ కవచమును స్వీకరింపుము.

లోకములన్నియు నీట మునిగి యున్న సమయమున దీనిని బ్రహ్మదేవున కొసగితిని. ఈ కవచముయొక్క ప్రభావమువలన బ్రహ్మదేవుడు జగచ్ఛ్రేష్టుడుగా, సమస్తైశ్వర్యయుక్తుడుగా నయ్యెను. అట్లే ఈ కవచముయొక్క ప్రభావమువలన మానవులు కూడ సమస్త సంపదలను పొందినారు.

సమస్తైశ్వర్యములనొసగు ఈ మహాలక్ష్మీ కవచమునకు ఋషి బ్రహ్మదేవుడు, ఛందస్సు పంక్తీచందము. లక్ష్మీదేవియే దేవత. ఐశ్వర్య సుఖములకై దీనిని వినియోగించుచున్నారు. ఈ కవచమును ధరించినచో మానవుడు సమస్త విజయములను పొందగలడు.

పద్మ నా శిరస్సును, హరి ప్రియ యగు లక్ష్మి నా కంఠమును, లక్ష్మీదేవి నా నాసికను, కమలయగు లక్ష్మి నా కండ్లను, కేశవకాంతయగు లక్ష్మీదేవి నా కేశములను, కమలాలయయగు లక్ష్మి నా కపాలమును, జగన్మాతయగు లక్ష్మి నా చెక్కిళ్ళను, సంపదలనొసగు లక్ష్మి నా స్కంధమును, “ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహా” అను మంత్రము నా పృష్టభాగమును, “ఓo హ్రీం శ్రీం పద్మాలయాయై స్వాహా” అను మంత్రము వా వక్షస్థలమును, శ్రీ దేవి నా కంకాళమును, “తేనమః” అను మంత్రము నా బాహువులను, “ఓం హ్రీం శ్రీం లక్ష్మ్యై నమః” అను మంత్రము నా పాదములను, “ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా” అను మంత్రము నా నితంబములను, “ఓం శ్రీం మహాలక్ష్మ్యై స్వాహా” అను మంత్రము సమస్తావయవములను, “ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై స్వాహా” అను మంత్రము నన్నెల్లప్పుడు రక్షించుచుండునుగాక.

దేవేంద్ర! ఈవిధముగా సమస్త సంపదలను ఐశ్వర్యములనొసగు లక్ష్మీ కవచమును నీకు తెలిపితిని. దీనిని, గురువును శాస్త్ర ప్రకారముగా పూజించి కంఠమునగాని, కుడి దండయందుగాని కట్టుకొన్నచో అతనికి అంతట విజయము లభించును. మహాలక్ష్మీదేవి అతని ఇంటిని ఎన్నడు వదలిపోదు. ఇంకను ప్రతి జన్మ యందు ఆ మహాలక్ష్మి నీడవలె అతనిని వెన్నంటియుండుమ,

ఈ కవచమును వదలి లక్ష్మీమంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము, సిద్ధినందజాలదు అని శ్రీహరి పలికెను.

నారాయణ ఊచ – నారాయణముని ఇట్లు పలికెను-

జగన్నాథుడగు శ్రీహరి దేవేంద్రునకు కవచమునొసగి అటుపిమ్మట షోడశాక్షరమైన లక్ష్మీ మంత్రమునతనికి ఉపదేశించెను.

“ఓం హ్రీం శ్రీం క్లీం నమో మహాలక్ష్మ్యై స్వాహా” అను మంత్రమునతడు ఇంద్రునకు దయతో నొసగెను.

మహాలక్ష్మియొక్క ధ్యానశ్లోకములు సామవేదమున కనిపించును. ఇవి చాలా రహస్యముగా నుంచతగినవి. సిద్దులు మునీంద్రులు మొదలగువారికి సహితము లభించనివి. ఈ ధ్యానము శుభకరమైనది. సిద్ధిని కలిగించునది.

తెల్లని చంపక పుష్పమువంటి రంగు కలది, నూరు పూర్ణచంద్రులతో సమానమైన కాంతి కలది, పరిశుద్ధమైన వస్త్రమును ధరించునది. రత్నాలంకారములు కలది, చిరునవ్వుతో నున్న ముఖము కలది, భక్తుల ఎల్లప్పుడూ అనుగ్రహించునది, వేయి దళములు కల పద్మముననుండునది, అందమైనది, శాంత స్వభావముకలది, శ్రీహరికి ప్రియురాలు, జగములకు తల్లియగు లక్ష్మీదేవిని ప్రేమింపవలెను.

దేవేంద్రా! ఈ ధ్యాన శ్లోకములతో లక్ష్మీదేవిని భక్తితో ధ్యానించి, షోడశోపచారములతో ఆమెను పూజించి, చెప్పబోవు స్తోత్రముచే ఆమెను స్తుతించి నమస్కరించినచో ఆ దేవియొక్క అనుగ్రహమున తప్పక నీవు పొందెదవు.

దేవేంద్ర! సుఖమును కలిగించు మహాలక్ష్మీ స్తోత్రమును నీకు చెప్పెదము వినుము. ఇది మిక్కిలి రహస్యమైనది. ముల్లోకములయందు తేలికగా లభించనిది. కావున సావధావముగా విమము. అని శ్రీహరి దేవేంద్రునితో పలికెను.

నారాయణ ఉవాచ -నారాయణ ముని ఇట్లు పలికెను-

ఓ లక్ష్మీదేవీ ! నేను నిన్ను స్తుతి చేయవలెనని అనుకొనుచున్నాను. కాని శ్రేష్టులు సహితము నిన్ను స్తుతింపలేరు. నీవు బుద్ధికి గోచరముకానిదానవు, సూక్ష్మరూపవు. తేజోరూపిణివి. సనాతనివి. నీ గుణ సంపదను ఎంత గొప్పవాడైనను వివరింపజాలడు. నీవు స్వేచ్చామయివి, ఆకారము లేని దానవు. భక్తుల ననుగ్రహించుటకై శరీరమును ధరించినదానవు, వాక్కులకు మనస్సునకు అతీతమైన నిన్ను నేను ఏమని స్తుతింపగలను. నీవు నాలుగు వేదములకు అతీతమైనదానివి. అనగా నాలుగు వేదములు సహితము నిన్ను స్తుతింపలేవు, అట్టి నిన్ను స్తుతి చేయుటకు నేనెట్టివాడను. ఈ సంసారసముద్రమును నీవు తరింపజేయగలదానవు, సమస్త సస్యములకు అధిదేవత, సమస్త సంపదలకు దేవతయగు నిన్ను వర్ణింపజాలను. నీవు యోగులనుష్టించు యోగములకు, జ్ఞానులయొక్క జ్ఞానములకు, వేదములకు తల్లివి. నీవు లేనిచో ఈ ప్రపంచమంతయు ఉత్పన్నము కాజాలదు. లేక ఉత్పత్తి జరిగినను దానివలన ఫలితమేమియు ఉండదు. నీవు చంటిపిల్లలకు తల్లివలె ఈ ప్రపంచమును సుఖముగా నంచుచున్నావు.

ఓ జగన్మాతా! నీవు మాపై అనుగ్రహముంచుము. అతి భీతి చెందిన మమ్ములను రక్షింపుము మేమందరము నిన్ను శరణు పొందిన వారము.

శక్తి స్వరూపయగు నీకు నమస్కారము, జగన్మాతవగు నీకు నమస్కారము, జ్ఞానమునిచ్చు నీకు నమస్కారము. సమస్త కోరికలను ఈడేర్చు నీకు నమస్కారము. శ్రీహరి పై భక్తిని, ముక్తిని కలిగించే నీకు నమస్కారము. అట్లే సమస్తము తెలిసిన దానివి.  సమస్త సౌఖ్యములనిచ్చు నీకు నమస్కారము.

పుత్రులు చెడ్డవారు కావచ్చును. కాని ఎచ్చటను తల్లి చెడ్డది కాజాలదు. తన పుత్రుల నెల్లప్పుడు ప్రేమతోనే చూచుకొనును. ఏ తల్లికూడ తన పుత్రుడు చెడ్డవాడని అతనిని వదిలిపోదు. ఓతల్లీ! చంటిపిల్లలపై తల్లి ప్రేమను చూపినట్లు మాపై నీ ప్రేమను చూపుము. అందువలన దయాసముద్రురాలవు, భక్తులపై ప్రేమగల ఓతల్లి మాపై దయ కలిగియుండుమని లక్ష్మీస్తోత్రమును తెలిపెను.

నారదా! ఈవిధముగా శుభమును కలిగించునది, సుఖమును, మోక్షమును, సంపదలను ఇచ్చు మహాలక్ష్మీస్తోత్రమును నీకు తెలిపితిని. ఈ స్తోత్రమును పూజా సమయమున ప్రతిదినము చదువుచున్నచో మహాలక్ష్మి ఆతని ఇంటిలో ఎప్పుడు ఉండును.

ఈవిధముగా శ్రీహరి దేవేంద్రునితో పలికి ఆంతర్ధానము చెందెను. ఇంద్రుడు దేవతలందరు శ్రీహరి ఆజ్ఞననుసరించి క్షీరసముద్రమునకు పోయిరి.

శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన లక్ష్మీదేవి స్తోత్రము, పూజ, కవచములను ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.