3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము

Table of Contents

3 - పుణ్యక వ్రత మహిమ

శ్రీమహాదేవ ఉవాచ -మహాదేవుడిట్లు పార్వతితోననెను-

ఓపార్వతి నీకు శుభము కలుగును. నేను చెప్పు ఉపాయము వలన నీకు తప్పక కార్యసిద్ధి జరుగును. సమస్తమైన కోరికలు సిద్ధించుటకు హేతువైనది, మంగళమైనది, నీకు సంతోషమును కలిగించు ఉపాయము చెప్పెదను.

నీవు తొలుత శ్రీమన్నారాయణుని ఆరాధించి పుణ్యకవ్రతమును ఒకసంవత్సరకాలము ఆచరింపుము. ఇవీ అన్ని కోరికలను తీర్చును. సర్వసౌఖ్యములను, పుత్రులను, పుణ్యమును కలిగించును.

నదులన్నిటిలో గంగానదివలె, దేవతలలో శ్రీహరివలె, వైష్ణవులలో నా(మహాదేవుడు)వలె, దేవతాస్త్రీలలో నీ(పార్వతీదేవి)వలె, కులములన్నిటిలో బ్రాహ్మణులవలె. పుణ్యక్షేత్రములలో పుష్కరక్షేత్రమువలె, పుష్పములలో పారిజాతపుష్పమువలె, పత్రములలో తులసీపత్రమువలె, పుణ్యప్రదమైన తిథులలో ఏకాదశీ తిథి వలె, వారములన్నిటిలో ఆదివారమువలె, నెలలన్నిటిలో మార్గశిరమాసమువలె, ఋతువులలో గ్రీష్మఋతువువలె, యుగములలో కృతయుగమువలె, పూజ్యులైనవారిలో విద్యనొసగు గురువువలె, పూజ్యులలో తల్లివలె, ఆప్తులైనవారిలో సాధ్వియగు భార్యవలె, విలువైన వస్తువులలో రత్నమువలె. ప్రియులందరిలో భర్తవలె, బంధువులందరిలో పుత్రునివలె, వృక్షములన్నీటిలో కల్పవృక్షమువలె, పండ్లలో మామిడిపండువలె, తోటలన్నిటిలో బృందావనమువలె, స్త్రీలందరిలో శతరూపాదేవివలె, పట్టణములన్నిటిలో కాశీ పట్టణమువలె, తేజస్సుకలవారిలో సూర్యునివలె, సుందరులైనవారిలో మన్మథునివలె, శాస్త్రములన్నిటిలో వేదములవలె, సిద్దులలో కపిలమహర్షివలె, వానరులలో హనుమంతునివలె, కీర్తినొసగువాటిలో అందమైన కవితవలె, అవయవములన్నిటిలో నేత్రమువలె, స్పర్శలలో పుత్రస్పర్శవలి, హింసించువారిలో దుష్టునివలె, పాపులలో పుంశ్చలివలె, తపస్పులన్నిటిలో హరిసేవవలె వ్రతములన్నిటిలో పుణ్యకవ్రతము చాలా శ్రేష్ఠమైనది.

ఆవుపాలమండి ఏర్పడు వస్తువులలో నెయ్యి తపస్సుచేయువారీలో బ్రహ్మదేవుడు పరిశుద్ధమైన వస్తువులలో ఆగ్ని తైజసమైన వస్తువులలో బంగారము దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, కవులలో శుక్రుడు, కావ్యములందు పురాణము క్షమకలవారిలో భూమీ, లాభములందు ముక్తి సంపదలలో శ్రీహరిభక్తి, పవిత్రమైనవారిలో ప్రస్తులు, అక్షరములలో ఓంకారము, మంత్రములలో విష్ణుమంత్రము, బీజములందు ప్రకృతి, విద్వాంసులలో సరస్వతి, ఛందస్సులలో గాయత్రి, యక్షులలో కుబేరుడు, సర్పములందు నాగరాజగు వాసుకి, పర్వతములందు నీతండ్రియగు హిమాలయపర్వతము, ఆవులలో సురభి, వేదములయందు సామవేదము, గరకలో దర్భ, సుఖముకలిగించువారిలో లక్ష్మీదేవి, శీఘ్రగమనముకలవారీలో మనసు, అక్షరములందు ఆకారము, మేలుకోరువారిలో తండ్రి, భగవంతుని మూర్తులలో సాలగ్రామము, పశువులలో విష్ణుపంజరము, చతుష్పాద జంతువులలో సింహము, ప్రాణులలో మానవుడు, ఇంద్రియములందు మనస్సు, రోగములయందు ఆకలిలేకపోవుట, బలవంతులలో శక్తి, శక్తికలవారీలో నేను (మహాదేవుడు), స్థూలపదార్థములలో మహావిరాట్ స్వరూపము, సూక్ష్మపదార్థములలో పరమాణువు, ఆదిత్యులలో ఇంద్రుడు, దైత్యులందు బలిచక్రవర్తి, దానముచేయువారిలో దధీచిమహర్ష, సాధుపురుషులలో ప్రహ్లాదుడు, అస్త్రములందు బ్రహ్మాస్త్రము, చక్రములలో సుదర్శనచక్రము, మానవులలో శ్రీరామచంద్రుడు, ఎట్లు గొప్పవారో అట్లే వ్రతములందు పుణ్యకవ్రతము చాలా గొప్పది.

ఈ పుణ్యకవ్రతమందు ఆరాధింపబడువాడు సమస్తజనులకోరికలను తీర్చు శ్రీకృష్ణుడు, ఆదేవదేవుని సేవించినవారు తమ కోటితరముల పితృగణములో ముక్తుని పొందుదురు.

శ్రీహరిమంత్రమున జపించుచు శ్రీవారి సేవచేయు భక్తునియొక్క జన్మ ఈభారతదేశమున సఫలమగుచున్నది. అట్లే అతడు తనకు ముందున్న కోటితరములవారిని ఉద్ధరించుచు వైకుంఠమునకుపోవును. తరువాత ఆ భక్తుడు శ్రీకృష్ణుని భృత్యుడై వైకుంఠమున సుఖముగానుండును. ఆ భక్తుడు తన శ్రీహరిభజనవలన తనసోదరులను, భృత్యువులను, తనబంధువులను, తనసహచరులను, స్త్రీలను ఉద్ధరించి శ్రీహరియుండు వైకుంఠమును చేరుకొనును.

అందువలన ఓపుణ్యశీలా! పార్వతీ! మిక్కిలి దుర్లభమైన శ్రీహరి మంత్రమును గైకొని, పితృదేవతల ముక్తికి కారణమైన ఆ శ్రీహరిమంత్రమును నీవు స్వీకరింపుము. ఈ వ్రతమున శ్రీహరిమంత్రమును జపించినచో ఆతని పూర్వపురుషులందరు ముక్తిని పొందుదురు అని పల్కెను.

శంకరుడిట్లు పార్వతీదేవికి చెప్పి ఆమెను వెంటబెట్టుకొని గంగాతీరమున ఆ దేవికి శ్రీహరి మంత్రమును, కవచమును, స్తోత్రమును పూజావిధానమునంతయు చెప్పెను.

 శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదగు గణపతి ఖండమున మూడవ అధ్యాయము సమాప్తము.