3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
8 - గణపతి జననము
నారాయణ ఉవాచ - నారాయణమహర్షి ఇట్లనెను-
పార్వతీదేవి చేసిన స్తోత్రమును విని దయామయుడగు శ్రీకృష్ణుడు అందరకు కనిపించనిది, దుర్లభమైనది అయిన తన రూపమును ఆమెకు చూపించెను.
పుణ్యకవ్రతము నాచరించు ఆపార్వతి శ్రీకృష్ణుని పై మనసుంచి ధ్యానింపగా, తేజః పుంజ మధ్యమున సర్వ సమ్మోహానమైన ఆతని రూపు కనిపించినది. ఆ శ్రీకృష్ణుని మెడలో వనమాల శోభించుచుండెను. అతడు శ్యామసుందరుడు, రత్నాలంకార సుశోభితుడు, బాలుడు, చిత్రవేషధరుడు, చందన చర్చితగాత్రుడు. శరత్కాల చంద్రునికంటె మిన్నయగు ఆతని ముఖమున చిరునవ్వు ప్రకాశించుచుండెను. అతని శిరస్సున నెమిలిపింఛము శోభించుచుండెను. గోపస్త్రీలచే పరివృతుడు, కోటిమన్మథుల లావణ్యము కలవాడు భక్తులననుగ్రహించువాడు ఆ శ్రీకృష్ణుని రూపమును పార్వతీదేవి చూచి ఆతనివంటి పుత్రుడు కావలయుననీ మనస్సులో కోరుకొనెను.
శ్రీకృష్ణపరమాత్మ పార్వతీదేవి తన మనసులో కోరుకున్న కోరికను అనుగ్రహించి దేవతలకు సహితము అభీష్టవరముల నొసగి తన తేజో రూపమును అంతర్ధానము చేసెను.
దయగలిగిన దేవతలు సనత్కుమారునకు నచ్చజెప్పి దేవదేవియగు పార్వతికి సాటి లేని వాడును, దిగంబరుడునప, ఆగు పరమేశ్వరుని అప్పగించిరి.
పార్వతీదేవి పుణ్యక వ్రతావసానమున బ్రాహ్మణులకు అనేక విధములైన రత్నములను దానము చేసెను. అట్లే భిక్షుకులకు స్తోత్ర పాఠకులకు అనేకములైన బంగారు నాణెములను దానమిచ్చెను.
అటుపిమ్మట బ్రాహ్మణులకు, దేవతలకు, పర్వతములకు మృష్టాన్న భోజనమును పెట్టి భర్తయగు శంకరుని. గొప్పవైన ఉపహారములతో సంభావించినది. తర్వాత దుందుభివాద్యమును మోగించుచు మంగళవాద్యమును చేసినది. అట్లే శ్రీహరికి సంబంధించిన పాటలను పాడించినది.
ఇట్లు పుణ్యకవ్రతమును పూర్తిచేసి అందరకు దానములనొసగి అందరకు భోజనము నొసగి తాను తన భర్తతో కలసి, భుజించెను. తరువాత కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములు కల ఇంపైన తాంబూలమును క్రమముగా అందరకునొసగి తాను సంతోషముతో భుజించినది.
కైలాసపర్వతముననున్న చందన వనమున చక్కనివాసనగల కుసుమములున్నవి. ఆ పుష్పములకు తగులుటవలన అచ్చటి వాయువు పరిమళములను వెదజల్లుచున్నది. తుమ్మెదల ఝుంకారములు గండుకోయిలల కూతలచే ఆప్రదేశము మీక్కిలి రమ్యముగామన్నది. అచ్చట రహస్యమైన ప్రాంతమున రత్నములచే నిర్మితమైన మంచముపై పాల నురుగు వంటి వస్త్రముకల శయ్యపై పార్వతీదేవి తన భర్తతో కలసిపడుకొనెను.
పరమేశ్వరుని రేతస్సు పడు సమయమున అచ్చటకు విష్ణుమూర్తి తన మాయవల్ల వృద్ధ బ్రాహ్మణ వేషములో ఆకలివల్ల ఆహారమును యాచించు మిషతో అచ్చటకు వచ్చామ. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తైల సంస్కారములేని జడలతో, చిరిగిపోయిన, మురికిపట్టిన గుడ్డలతో మిక్కిలి కృశించిన శరీరముతో ఉజ్వలమైన తిలకమును ధరించి అతి దుర్బలుని వలె చేతిలో కట్టె పట్టుకొని మహాదేవుని అన్నము పెట్టుమని యాచించెను.
బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణు డిట్లు శివునితో పలికెను-
కరుణానిధియగు మహాదేవా! నీవేమి చేయుచున్నను నేను అతి వృద్దుడను ఆకలిదప్పులచే బాధపడుచున్నాను, ఓతల్లీ! పార్వతీ! నేను నీ శరణు పొందితిని. నీవే లేచి నాకు అన్నమును మంచినీళ్ళను ఇమ్ము, ఓ జగన్మాతా! నేను బయట నిలువ లేక పోవుచున్నాను. నా తల్లి దగ్గర నుండగా నేను దప్పితో అలమటింపవలసిన పనిలేకున్నను బాధపడుచున్నాము. ఓమహాదేవా! నేను నిన్ను శరణు పొందితిని. సప్త రాత్రీ వ్రతమును చేసినాను. ఇక నేను పారణ చేయవలసియున్నది అందువలన మిక్కిలి బాధపడుచున్నాను అని అరచెను.
ఇట్లు ఆవృద్ధ బ్రాహ్మణుడు ఉచ్చ స్వరమున పలుకుచుండగా విని మహాదేవుడు రతినుండి లేచెను. ఆసమయమున అతనికి రేత స్ఖలన మగుచుండెను. రతికార్యమును విరమించుకొన్నందువలన మహాదేవుని వీర్యము శయ్యపై పడిపోయినది. పార్వతీదేవి భయముతో సన్నని వస్త్రమును ధరించి లేచి నిలబడి తన భర్తతో కలసి బయటకు వచ్చినది.
అచ్చట దీనుడు, వృద్ధుడు, ముడుతలు పడిన శరీరము కలవాడు, వంగిపోయినవాడు, చేతిలో కఱ్ఱను ఊతగా ధరించినవాడు, పెదవులు, నాలుక, గొంతు ఎండు కొని పోయినవాడు,తపస్వియైన బ్రాహ్మణుడు కనిపించెను. ఆతడు వారిని భక్తితో నమస్కరించి కొనియాడగా మహాదేవుడు ప్రసన్నుడై అమృతమువంటి మాటలనిట్లు పలికెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను.
వేదవేదాంగములు తెలిపినవారిలో, శ్రేష్టుడవగు ఓ విప్రుడా నీపేరేమి? మొదలగు విషయములను నాకు వెంటనే తెలుపుమనెను.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెనుఓబ్రాహ్మణుడా! నీవెచ్చటినుండి వచ్చితివి. నీవు నా అదృష్టమువలన ఇచ్చటికి వచ్చితివి. నా ఇంటికి బ్రాహ్మణు డతిథిగా వచ్చినందువలన నా జన్మ సఫలమైనది. అతిథిని గౌరవించినచో ముల్లోకములను గౌరవించినట్లే, అతిథి గౌరవముండుచోట దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, సమస్త పుణ్య తీర్థములెల్లప్పుడు ఉండును. అతిథి యొక్క పాదములను కడిగినచో సమస్త పుణ్యములు లభించును. అతిథిని తన శక్తి కొలది పూజించువాడు సమస్త తీర్థములందు గ్రుంకులిడిన పుణ్యమును సమస్త యజ్ఞములాచరించిన పుణ్యమును పొందును. అట్లే ఆతడు సమస్త దానములు చేసిన పుణ్యమున పొందగలడు.
వేదములందు పేర్కొనబడిన, పుణ్యములన్నియు ఇతర పుణ్యములు సైతము అతిథి సేవయొక్క పదునారవ అంశమైన కాజాలవు. అతిథికి మర్యాద జరుగని ఇంటిలో పితృదేవతలు, అగ్నులు, గురువులు పూజలు పొందనట్లు వెళ్ళిపోవుదురు. అతిథి సేవచేయనివానికి బ్రహ్మహత్యాది సమస్తపాపములన్నియు లభించునని పార్వతీ పలికెను.
బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు పలికెను-
వేదవేదాంగములన్ని తెలిసిన ఓపార్వతీ! వేదమునందు చెప్పబడినట్లు అతిథిపూజసేయుము. ఆకలిదప్పులతో బాధపడు మానవుడు తాను రోగముచే బాధపడుచున్నను నిరాహారుడైనను, నిరాహారమే వ్రతముగా స్వీకరించినను, గృహస్థు ఇచ్చిన ఉపహారమును మనస్సులోనైనను స్వీకరించును.
పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లనెను.
ఓ బ్రాహ్మణుడా! నీవు ఆకలిగొన్నావా? నీకు ఎట్టి భోజనము పెట్టవలెను? ముల్లోకములందు దొరుకని భోజనము నీకు పెట్టెదను, అతిథి సేవ చేయుట ద్వారా నాజన్మము సఫలము చేయుమనెను.
బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు పలికెను-
ఓదేవి! నీవు చక్కగా పుణ్యకవ్రతము చేసి ఆవ్రతమున అనేకవిధములైన ఉపహారములను సమకూర్చినట్లు తెలిసికొని, నాకు ఇష్టమైన మృష్ట పదార్థములను సేవింపవలెనని ఇచ్చటకు వచ్చితిని.
ఓ సువ్రతా! నేను నీకు పుత్రునివంటివాడను ముల్లోకములలో దుర్లభమైన వస్తువులను నాకొసగి తొలుత నన్ను పూజింపుము.
వేదవేదాంగకోవిదులు తల్లి, తండ్రి, పుత్రులు అనేక విధములుగా ఉందురని చెప్పుదురు. వారిలో చదుపునేర్పువాడు, అన్నము పెట్టువాడు, భయమున పోగొట్టువాడు, జన్మనిచ్చినవాడు, పిల్లనిచ్చినవాడు అను ఐదుగురు తండ్రులవంటివారు, అట్లే గురువుయొక్క భార్య జన్మనిచ్చినస్త్రీ చనుపాలిచ్చిన స్త్రీ, మేనత్త, తల్లికి సోదరి మరియు సవతి, కోడలు, అన్నము పెట్టిన స్త్రీ వీరందరు మాతృ తుల్యలు. ఆట్లే సేవకుడు, శిష్యుడు, తన పోషణలో ఉండు వాడు, తన పుత్రుడు, శరణువేడినవాడు, వీరందరు పుత్రతుల్యులు, వీరిలో వీర్యజడైన పుత్రుడు తండ్రి ఆస్తిని పొందును, మిగిలిన నలుగురు ధర్మపుత్రులని పెద్దలు చెప్పుదురు.
ఓతల్లీ! ఆకలిదప్పులచే బాధపడుచున్న నేను నిన్ను శరణువేడితిని. అందువలన నేను నీకు పుత్రునివంటివాడనని బ్రాహ్మణుడు పలికెను.
ఆనంతరత్నుడగు హిమాలయము యొక్క పుత్రికయగు పార్వతీ! నీవు నాకు పిష్టకమను పిండివంటను, పరమాన్నమును, దోరమాగిన పండ్లను, ఆయాదేశములయందు, ఆయాకాలములందు చేయు పిండివంటలను, పక్వాన్నమున, స్వస్తికమను వంటకమును, పాలమ, చెరుకుపాలను, చెరుకుపాలతో చేయబడిన వంటను, నేతిని, పెరుగును, మంచిబియ్యపన్నమును, నేతిలో వేయించిన వంటకమును, బెల్లము, నూవులచే చేయబడిన లడ్డూలను. ఇంకను నాకు తెలియని అమృతోపమానములగు వంటకములను నాకు భోజనమున పెట్టుము. తరువాత కర్సూరాది సుగంధ ద్రవ్య భరితమైన తాంబూలమును, నిర్మలమైన మంచినీళ్ళను నాకిమ్ము, వీటిని భుజించినచో నాకు కడుపుబ్బినట్లగును. అందువలన ఓ పార్వతి ! నాకు వీటినన్నిటిని ఇమ్మని బ్రాహ్మణుడడిగెను.
ఓపార్వతీ! నీభర్త ముల్లోకములకు కారణభూతుడు, అట్లే సమస్త సంపదల నొసగువాడు. నీవు సమస్తైశ్వర్యముల నొసగు మహాలక్ష్మీ రూపిణివి.
అందువలన నీవు నాకు అందమైన రత్నసింహాసనమును, అమూల్యములైన రత్నభూషణములను, పరిశుద్ధమైన వస్త్రములను ఇమ్ము. ఆట్లే ఎవరికీ లభ్యముకాని శ్రీహరిమంత్రమును, దృడమైన శ్రీహరిభక్తిని, మృత్యుంజయమను జ్ఞానమును, సుఖమున కలిగించు దాతృశక్తిని, సమస్తసిద్దులనొసగుము, నీవు శ్రీహరికి ఇష్టమైనదావు, శ్రీహరియొక్క శక్తివి నీవే. అట్టి నీవు నీపుత్రునకు ఇవ్వలేనిది ఏదీలేదు.
మనస్సును నిర్మలముగానుంచుకొని ధర్మమును, తపస్సును అనుష్టింతును. నాకు జన్మకారణమైన కోరిక లేవియూ లేవు.
ఇంద్రియములు ద్రవ్యములతో కలిసినందువలన కలుగు సుఖము దుఃఖమును కలిగించును. అది అశాశ్వతమైనది. శ్రీహరి ఆలాపన చేయుచున్నందు వలన కలుగు సుఖము. శాశ్వతమైనది.
శ్రీహరిని సంతతము స్మరించువారికి మృత్యువులేదు. వారిని కాలుడైనను, మృత్యుంజయుడైనను సంహరింపజాలడు. శ్రీహరిభక్తులు చిరంజీవులై మనియెదరు. వారికి సమస్తసిద్ధులు లభించును. వారు. స్వచ్ఛందముగా స్వర్గలోకమునకు పోయెదరు. శ్రీహరి భక్తులకు తమ గతజన్మలన్నియు తెలియుటచే తమయొక్క గతజన్మలన్నిటిని కథలుగా చెప్పుదురు. అట్లే వారు కోరుకొన్న జన్మము పొందగలరు. జన్మతః పవిత్రులైన శ్రీహరిభక్తులు తాము అడుగిడిన మాత్రమున పుణ్యక్షేత్రములను పవిత్రము చేయుదురు. వారు, ఇతరుల కొరకు ప్రతిక్షేత్రమును సందర్శింతురు. శ్రీ వైష్ణవుల పాదస్పర్శవల్ల ఈభూమియంతయు పవిత్రమగును. వారు ప్రతీ పుణ్య క్షేత్రమున గోదాహ కాల మాత్రముందురు.
ఆచార్యుని ముఖతః విష్ణు మంత్రము నుపదేశము గాపొందిన వానిని వైష్ణవుడని ప్రాచీనులు పేర్కొందురు. అట్టి వైష్ణవుడు తనకు పూర్వమున్న నూరు తరముల వారిని తన తరువాత, రాబోవు నూరు తరముల వారిని తన సోదరులను, తల్లిని నరకమునుండి ఉద్ధరించును. అట్లే ఆతడు గత పది తరములు. రాబోవు పది తరములవారగు తల్లి వంక వారిని నరకము నుండి ఉద్ధరించును.
ఎట్టి మానవులు శ్రీహరిభక్తుల దర్శనమును, వారి ఆశ్లేషమును పొందుదురో వారు సమస్త పుణ్య తీర్థములు దర్శించినవారగుదురు. అట్లే సమస్తయజ్ఞములు చేసిన పుణ్యమును కూడ పొందుదురు. శ్రీహరిని ఎల్లప్పుడు స్మరించు భక్తులు పాపములనెన్నడు పొందజాలరు.
ప్రాణి మూడుకోట్ల జన్మనెత్తిన తరువాత మానవజన్మనెత్తును. అట్టి మానవజన్మలు కోటి పర్యాయములెత్తిన తరువాత శ్రీహరి భక్తుల సమాగమమును పొందును. శ్రీహరి భక్తులతో కలసి తిరుగుచున్నందువలన శ్రీహరిభక్తి కలుగును. శ్రీహరి భక్తిహీనులతోట సమాగమమువలన ఆ భక్తి శుష్కించిపోవును. శ్రీహరి భక్తులతో కలిసి యున్నందువలన ఆభక్తి మరల చిగురించును. ఇట్టి శ్రీహరిభక్తి ప్రతి జన్మయందు వృద్ధియగుచుండును. దానికి చివరిఫలము శ్రీహరి దాస్యమే. అది సంపూర్ణముగా ఫలించినపుడు శ్రీహరి దాసుడగును. అట్టి భక్తి ఎంతటి ప్రళయము వచ్చినా, బ్రహ్మదేవుని సమస్త సృష్టి నశించిననూ నశించిపోదు అని వృద్ధ బ్రాహ్మణుడనెను.
అందువలన ఓతల్లీ నీవు నాకు శ్రీమన్నారాయణునిపై భక్తి కలుగునట్లు చేయుము. విష్ణుమాయమగు నీయొక్క అనుగ్రహములేనిచో ఎవరికి విష్ణుభక్తి కలుగజాలదు. నీవు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయుచున్నచో పూజచేసినచో ఇవి అన్నియు ప్రపంచమునకు వీటిని నేర్పించుటకొరకేకాని వేరు కాదు.
వృద్ధబ్రాహ్మణ రూపములో ఉన్న విష్ణుమూర్తి శిశువుగా మారి పార్వతీపరమేశ్వరులున్న మందిరములోని శయ్యపై ఉండెను. పార్వతీదేవి పవళించిన శయ్య పైనున్న శిశువు ఆ శయ్యపైనున్న శివ వీర్యముతో కలిసిపోయెను.
ఆ శిశువు చంపక పుష్పవర్ణముతో, కోటిచంద్రులవంటి కాంతిగలిగి, మిక్కిలి సుందరుడై, మన్మథునే మోహింపచేయుచుండెను. అతని ముఖము శరత్కాలచంద్రుని మించిపోవు కాంతితోమండెను. అతని కళ్ళు పద్మములకంటె ఆందముగానుండెను. పెదవులు దొండపండుకంటే గొప్పగానుండెను. తల, చెక్కిళ్ళు చాలా ఆందముగానుండినవి. ముక్కు గరుత్మంతుని ముక్కుకంటే అందముగానుండెను. ఈవిధముగా ఆ శిశువు పార్వతీదేవియొక్క శయ్యపై చేతులు కాళ్ళు ఆడించుచు ముల్లోకములందులేని అందమైన రూపుతోనుండెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణములో మూడవదైన గణేశఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన శ్రీగణేశోత్పత్తియను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
