3 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - గణేశ ఖండము
33 - భార్గవరాముని స్వప్నము
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను-
భార్గవ రాముడు శివునకు నమస్కరించి, అట్లే దుర్గకు కాళికి కూడ నమస్కరించి శివుని అనుమతితో పుష్కర క్షేత్రమునకు వెళ్ళి అచ్చట మంత్ర సిద్దికొరకు శ్రీకృష్ణుని మనస్సులో ధ్యానించుకొనుచు ఒక మాస పర్యంతం నిరాహారుడై ప్రాణాయామము చేయుచు తపమా చరించుచుండెను. ఆ పరశురాముడు తపస్సు ముగించి కండ్లు తెరుచునప్పుడు ఆకాశమునంతయు తన దివ్య తేజస్సుతో ఆవరించి, సూర్యునకన్న గొప్ప కొంతితో దశ దిశలు వెలుగుచున్న ఒక దివ్యరథమును చూచెను. ఆ రథమున ఒక సుందర పురుషుడు చిరునవ్వుతో భక్తుల ననుగ్రహించుటకై వచ్చినట్లు కనిపించెను. ఆ దివ్య పురుషుని చూచి, తాను ఈ భూమిపై నున్న రాజాలను ఇరువది యొక్క మార్లు జయించి ఇచ్చట రాజులు లేకుండ చేయునట్లు, శ్రీ కృష్ణుని పాదారవిందములపై దృడమైనది, అపాయరహితమైన దగు భక్తి కలిగియుండునట్లు, శ్రీకృష్ణ దాసుడై యుండునట్లు వరమును వేడగా ఆ పరమాత్మ అట్లే యని భార్గవరాముని అనుగ్రహించి అంతర్ధానమయ్యెను.
భార్గవ రాముడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి తన ఇంటికి బయలుదేరెను. అప్పుడతనికి శుభ శకునముగా కుడియయములు అదరెను. తన కోరిక కనుగుణముగా మంచి కల (సుస్వప్నము) పడెను. అతని మనస్సు ఉద్విగ్నము కాక ప్రసన్నముగా నుండెను. రాత్రింబగళ్ళు వృద్ది చెందినవి.
ఆ సమయమున భార్గవరాముడు తనవారినీ, తన శిష్యులను, తనతండ్రి శిష్యులను, సోదరులను, బంధువులను అందరిని పిలిపించుకొని తన ఇంటిలో సమావిష్టుడై ముందు చేయు కార్యక్రమమునకై వారి ఆలోచనలను అడిగి తెలిసికొనను. వాటి పూర్వాపరములను తన వృత్తాంతమునంతయు వారికి తెలియపరచి వారి యొక్క ఆమోదమువలన తాను బలవంతుడై కార్తవీర్యునితో యుద్ధమునకై బయలుదేరెను.
భార్గవ రాముడు యుద్ధమునకు పోవు సమయమున ఆతనికి శుభశకునము లెదురైనవి. వాటి వలన ఆతడు తన శత్రువులు మరణింతురని, తనకు విజయము లభించునని తలచెను.
అతడు యుద్ధయాత్రకి బయలు దేరుచున్నప్పుడు మయూరము, సింహము, గంట దుందుభిధ్వాసము వినిపించెను, ఆకాశవాణి కూడ అతనికి జయము కలుగున్నట్లు పలికినది. అట్లే మంగళమును సూచించు నవేంగీతము జయమున సూచించు మేఘ శబ్దము వినబడినది.
అదే విధముగా అతనికి ఎదురుగా బ్రాహ్మణులు వందిమాగధులు, జ్యోతిష్కులు. భిక్షుకులు కనిపించిరి. వెలిగించిన దీపమమ పట్టుకొని, అనేక భూషణములు ధరించి చిరునవ్వుతోనున్న ముత్తైదువ ఎదురు వచ్చినది. ఆతని యొక్క మార్గమున నక్క పూర్ణకుంభము, నెమలీ, ముంగీస మొదలైన మంగళసూచకములైన జంతువులు పక్షులు కనిపించినవి. అట్లే కృష్ణ సారము, ఏనుగు, సింహము, గుఱ్ఱము, గండకము, చమరీమృగము, రాజహాంస, చక్రవాకము, చిలుక, కోకిల, నెమలి, కాటుకపిట్ట, చకోర పక్షి, పాపురము, కొంగ, చాతకము, చటము, మెరుపు, ఇంద్రధనుస్సు, సూర్యుడు, సూర్యకాంతి, అప్పుడే తీసిన మాంసము, ప్రాణము చేపలు, శంఖము, బంగారము, పెరుగు, పేలాలు, తెల్లని దాస్యము, తెల్లని పుష్పములు, కుంకుమ, పతాకము, ఛత్రము, ఆప్తము, తెల్లని చామరము, దూడతోనున్న ఆవు, రథముపై మవ్న రాజు, పాలు, నెయ్యి, అమృతమను తిను పదార్థము, పాయసము, సాలగ్రామము, దోరమాగిన పండ్లు, స్వస్తికమను ఆహార పదార్థము, చక్కర, తేనె, పిల్లి, ఎద్దు, మేక, ఆడవి ఎలుక, మబ్బుల నుండి విడిపోయిన చంద్రుడు, సూర్యుడు, కస్తూరి, నీరు, పసుపు, పుణ్యతీర్థముల మన్ను, తెల్లనూవులు, గరకి, బ్రాహ్మణ బాలకుడు, బాలిక, జింక, వేశ్య, తుమ్మెద, కర్పూరము, పట్టుబట్ట, గోమూత్రము, గోమయము, గోధూళి, కొట్టము, పశువులు నడచు త్రోవ, గోశాల, గోమార్గము, భూషణములు, దేవతామూర్తి, మండుచున్న నిప్పు మహోత్సవము, రాగి, స్ఫటికము, సింధూరము, గంధము, రత్నము మొదలగువాటిని తన కుడి ప్రక్క చూచెను.
అదేవిధముగా సువాసనగల వాయువు నాఘ్రాణించుచు బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులను పొందెను.
ఈవిధముగా మంగళ శకునములను చూచుచు భార్గవరాముడు సంతోషములో యుద్ధ ప్రయాణము చేయసాగెమ. సూర్యాస్తమన సమయమున అతడు నర్మదానదీతీరమున అక్షయ వట వృక్షమును చూచెను. దాని తరువాత మిక్కిలి విశాలమైన పౌలస్త్యముని ఆశ్రమ స్థానమునకు చేరుకొనెను. ఆ స్థలము కార్తవీర్యార్జునుని పట్టణమునకు సమీపమునున్నది, అచ్చట తనవారితో కలపి పూలశయ్యపై పరుండెను. ఆతడు తెల్లవారు సమయమున ఒక సందర స్వప్నమున చూచెను.
భార్గవ రాముని స్వప్నము వాయు పిత్త కఫాది దూషితమైన మనస్సు చింతించినది కాదు.
అతని స్వప్నములో ఆతడు ఏనుగను, గుఱ్ఱమును, గుట్టను, సౌధమును ఎక్కుచున్నట్లు కనపడినది. క్రిములు తన శరీరమును భక్షించుచుండగా చూచి ఏడ్చుచున్నట్లు కనిపించినది. అట్లే చందనమును పూసికొని నౌకను ఎక్కినట్లు, పట్టువస్త్రమును, పుష్పమాలలను ధరించి యున్నట్లు కనిపించినది. మలమూత్రములచే వసచే తన శరీరము పూయబడి ఉన్నట్లు, వీణను మోగించుచున్నట్లు స్వప్నము వచ్చినది. నదీతీరమున వెడల్పైన పద్మముల రేకులపై మన్నట్లు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసము తీనుచున్నట్లు ఆటుపిమ్మట తాంబూలమును వేసికొని బ్రాహ్మణుల ఆశీస్సులు తీసికొనుచున్నట్లు స్వప్నము కలిగినది. ఫలములను, పుష్పములను, దీపమును తాను చూచుచున్నట్లు, పండిన ఫలములను, పొలను, చక్కర కలిపిన వేడి వేడి యన్నమును, స్వస్తికము అనువంటను, తినుచున్నట్లు కల వచ్చినది. మరల అతనిని జలజంతువులు, తేళ్ళు, చేపలు, పాములు తినుటకు లేక కాటు వేయుటకు రాగా భయముచే ఆతడు పరుగెత్తుచున్నట్లు కల వచ్చినది. తరువాత అతడు సూర్యచంద్ర మండలముల చూచుచున్నట్లు, పుత్రులు కల ముత్తైదువ కనిపించినట్లు స్వప్నము వచ్చెను. చక్కని వేషముతో నున్న కన్యక అతనిని కౌగిలించుకొనివట్లు, బ్రాహ్మణుడు. సంతోషముతో ఆలింగనమొనర్చుకొన్నట్లు, ఫలములు, పుష్పములు గల వృక్షమును, దేవతా విగ్రహమును చూచినట్లు, తాను రథము పైనను, ఏనుగుపైనను ఉన్నట్లు, పట్టువస్త్రము, రత్నాలంకారములు ధరించిన బ్రాహ్మణ స్త్రీ తన ఇంటిలోనికి ప్రశేశించుచున్నట్లు, శంఖమును, స్పటికమును, తెల్లని మాలను, ముత్యములను, చందనమును, బంగారును, వెండిని, రత్నమును, ఏనుగను, వృషభమును, తెల్లని సర్పమును శ్వేత చామరములను నీలోత్పలమును, అద్దమును కలలో చూచేను, తాను నవరత్నములుగల రథమును మాలతీ మాల ధరించి ఎక్కినట్లు, ఇంకను రత్న సింహాసనమున ఉన్నట్లు కల గనెను.
భార్గవ రాముడు తన స్వప్నములో పద్మముల వరుసను, పూర్ణకుంభమును, పెరుగును, పేలాలను, నేతిని, తేనెను, తాటియాకులచే చేయబడిన ఛత్రి గల వానిని, కొంగల వరుసను, హంసల వరుసను, పూర్ణఘటమును పూజించు కన్యలను, వ్రతమున నున్న కన్యలను; మండపములోనున్న శంకరుని లేక విష్ణువును పూజించుచున్న బ్రాహ్మణులను, తనకు జయము కలుగునట్లు వారు ఆశీర్వదించుచున్నట్లు చూచెను.
అదే విధముగా అమృతవర్షమును, ఆకులు రాలుటను, ఫలములు వర్షముగా పడుటను, పుష్పములు చందనముల వృష్టిని, అప్పుడే కోసిన మాంసమును, జీవించియున్న చేపలను, నెమలిని, తెల్లని కాటుక పిట్టను, సరోవరమును, పుణ్యతీర్థమును, పాపురమును, చీలుకను, పాలపిట్టను, శంఖమును, ఆడ చిన్న గ్రద్ధను, చాతక పక్షిని, పులిని, సింహమును, ఆవును, తన కలలో చూచేను. ఆట్లే గోరోచనమును, పసుపును, తెల్లని ధాన్యములను, మండచున్న అగ్నిని, గరికను, దేవాలయ సమూహమును, పూజలందుకొన్న శివలింగమును, అట్లే పూజింపబడిన మృణ్మయ లింగమును, తన స్వప్నములో భార్గవ రాముడు చూచెను. యవలు, గోధుమల పిండిని, రకరకములైన భక్ష్య పదార్థములను తీసుచున్నట్లు దీవ్యవస్త్రములు, దివ్యాలంకారములు ధరించిన దీవ్యస్త్రీతో సంగమము చేయుచున్నట్లు, నర్తకి, వేశ్య, రక్తము, కల్లును, తనస్వప్నములో చూచెను. అట్లే తన శరీరము నందంతట రక్తమును పూసికొన్నట్లు, పచ్చని రంగుగల పక్షుల మాంసములను తినుచున్నట్లు, ఆకస్మాత్తుగా తనను సంకెళ్ళతో కట్టివేసినట్లు ఆయుధములచే దెబ్బలు తిన్నట్లు ఉదయకాలమందలి తన స్వప్నములో భార్గవరాముడు చూచెను.
ఉదయ కాలమున వచ్చిన ఈశుభస్వప్నముల వలన భార్గవ రాముడు మిక్కిలి సంతోషించి తన శత్రువును తప్పక చంపగలనని తలచి తన ప్రాతః కృత్యములను సంతోషముతో చేసికొనెను.
శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన భార్గవ రాముని స్వప్న వృత్తాంతమను ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.
