భాగవత మహా పురాణము
30 - దేహాభిమానులగు జీవుల అధోగతిని వర్ణించుట
కపిల ఉవాచ ।
తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమమ్ ।
కాల్యమానోఽపి బలినో వాయోరివ ఘనావలిః ॥
బలమగు వాయువు మేఘపంక్తిని ఎగరగొట్టును. ఆ మేఘపంక్తికి వాయువుయొక్క ప్రభావము తెలియదు. అదే విధముగా ఈ కాలము జీ వుని సంసారములో గిరగిర త్రిప్పి పీడించును. కాని, జీవుడు దాని గొప్ప ప్రభావమును తెలియజాలడు. ఇది నిశ్చయము.
యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖ హేతవే ।
తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే ॥
మానవుడు సుఖమును పొందాలనే ఆశతో కష్టపడి ఏయే వస్తువు లను సంపాదించునో, వాటినన్నింటినీ కాలరూపములోని దైవము తుడిచిపె ట్టును. దాని వలన, ఆ మానవునకు దుఃఖమే మిగులును.
యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః ।
ధ్రువాణి మన్యతే మోహాద్గృహక్షేత్రవసూని చ ॥
మందమతియగు జీవుడు ఇట్లు దుఃఖించుటకు కారణమేమనగా, అనిత్యమగు దేహమును, దానికి సంబంధించిన ఇల్లు పొలము ధనము మొదలగు వాటిని అజ్ఞానముచే నిత్యములని భావించుచున్నాడు.
జంతుర్వై భవ ఏతస్మిన్ యాం యాం యోనిమనువ్రజేత్ ।
తస్యాం తస్యాం స లభతే నిర్వృతిం న విరజ్యతే ॥
ఈ సంసారములో జీవుడు మనుష్యపశుదేవాది యోనులలో దేని యందు జన్మించిననూ, దానిని సుఖప్రాయముగా భావించి విరక్తిని పొందుట లేదు.
నరకస్ధోఽపి దేహం వై న పుమాంస్త్యక్తుమిచ్ఛతి ।
నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయావిమోహితః ॥
జీవుడు శ్రీహరియొక్క మాయచే విశేషముగా మోహమును పొందియున్నాడు. అట్టి జీవుడు, నరకమునందున్ననూ, అక్కడ లభించే అల్పసుఖమును మరిగి, ఆ దేహమును కూడ విడుచుటకు ఇష్టపడడు.
ఆత్మజాయాసుతాగారపశుద్రవిణబంధుషు ।
నిరూఢమూలహృదయ ఆత్మానం బహు మన్యతే ॥
మానవుడు దేహము, భార్య, సంతానము, ఇల్లు, డబ్బు, బంధు వులు మొదలగువాటిపై గట్టిగా లగ్నమైన హృదయమునందు అనేకము లగు మనోరథములను కలిగి, తాను గొప్పవాడినని తలపోయుచుండును.
సందహ్యమానసర్వాంగ ఏషాముద్వహనాధినా ।
కరోత్యవిరతం మూడో దురితాని దురాశయః ॥
మోహితుడగు మానవుడు దుష్టమైన హృదయము గలవాడై, వీటిని పోషించాలనే మనోవ్యథలో పడును. వాని అవయవములన్నియు ఆ వ్యథచే అధికమగు తాపమునకు గురిచేయబడును. అట్టివాడు నిరంతర ముగా పాపములను చేయును.
ఆక్షిప్తాత్మేంద్రియః స్త్రీణామసతీనాం చ మాయయా ।
రహోరచితయాఽఽలా పైశ్శిశూనాం కలభాషిణామ్ ॥
గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంద్రితః ।
కుర్వన్ దుఃఖప్రతీకారం సుఖవన్మన్యతే గృహీ ॥
గృహస్థుని దుష్టలగు స్త్రీలు ఏకాంతమునందు మాయచేసి ఆక ర్షించెదరు. పైగా చిన్న పిల్లల ముద్దు ముద్దు కబుర్లచే గృహస్థుని ఇంద్రియ ములు, అంతఃకరణము ఆకర్షితమగును. దుఃఖప్రధానమగు గృహకార్యము లయందు కపటమునకు ప్రముఖస్థానము ఉండును. వాటిని ఏమరుపాటు లేకుండగా నిర్వహించే గృహస్థుడు దుఃఖమును పోగొట్టే ఉపాయమును చేసుకొని, ఆ దుఃఖనివృత్తినే సుఖమని తలపోయును.
అర్ధైరాపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్ ।
పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యధస్స్వయమ్ ॥
అన్ని సందర్భములలో హింసను చేసి సంపాదించిన ధనము మొదలగువాటితో తన వారిని పోషించు మానవుడు, వారు తినగా మిగిలిన దానిని తిని, ఆ విధముగా హింసతో వారిని పోషించుటచే, తాను నరకము నకు వెళ్లును.
వార్తాయాం లుప్యమానాయామారబ్దాయాం పునః పునః ।
లోభాభిభూతో నిస్సత్త్వ: పరార్ధే కురుతే స్పృహామ్ ॥
మానవుడు జీవిక కొరకు ఎంత ప్రయత్నించిననూ ఒకప్పుడు అది లుప్తమగుచునే యుండును. కాని, లోభముచే పరాభూతమైన మనస్సు గలవానికి ఆ లోభమునకు తగ్గ ధనమును సంపాదించే శక్తి ఉండదు. అపు డాతడు ఇతరుల ధనముపై కన్ను వేయును.
కుటుంబభరణాకల్పో మందభాగ్యో వృథోద్యమః ।
శ్రియా విహీనః కృపణే ధ్యాయన్ శ్వసితి మూఢధీః ॥
వ్యామోహమును పొందియున్న వ్యక్తి దురదృష్టవంతుడగుటచే సంపద లేక, చేసిన ప్రయత్నములు వ్యర్థము కాగా, కుటుంబమును పోషిం చలేక దీనుడై చింతిస్తూ నిట్టూర్పులను విడుచుచుండును.
ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా ।
నాద్రీయంతే యథా పూర్వం కీనాశా ఇవ గోజరమ్ ॥
ఈ విధముగా వ్యక్తి తనను తాను పోషించుకోలేని స్థితిలోనున్న ప్పుడు వాని భార్య మొదలగువారు పూర్వము ఆదరించిన విధముగా ఆద రించరు. ముసలి ఎద్దును దుష్టులగు వ్యవసాయదారులు నిరాదరించిన తీరున, వారాతనిని అనాదరము చేయుదురు.
తత్రాప్యజాతనిర్వేదో బ్రియమాణస్స్వయంభృతైః ।
జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృ హే ॥
ఆ స్థితిలో కూడ వైరాగ్యమును పొందని వ్యక్తి పూర్వము తాను పోషించినవారిచే ఇప్పుడు పోషించబడుచుండును. ముసలితనము వానికి వికృతాకారమును తెచ్చి పెట్టును. ఆ విధముగా ఆతడు మరణమునకు ఎదురు చూస్తూ ఇంటిలో పడియుండును.
ఆస్తేఽవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ ।
ఆమయావ్యప్రదీప్తాగ్నిరల్పాహారోఽల్పచేష్టితః ॥
తన ఇంటిలోని వారు కుక్కకు వలె తనముందు విసిరిన అన్న మును ఆతడు భుజించును. ఆతనికి అజీర్ణముచే జఠరాగ్ని మందగించి తక్కువ ఆహారమును మాత్రమే తినును. కావుననే, ఆతడు పని చేసే శక్తి కూడ తగ్గి, ఒకచోట పడియుండును.
వాయునోత్క్రమతోత్తారః కఫసంరుద్దడికః ।
కాసశ్వాసకృతాయాసః కంఠే ఘురఘురాయతే ॥
ఆతనికి ఊపిరి పైకి దన్ని కనుగ్రుడ్లు పైకి ఎక్కును. శ్లేష్మము నాడులను మూసివేయును. దగ్గు ఆయాసము ఆతనికి శ్రమను కలిగించు చుండును. ఆతడు కంఠములో ఘురఘుర శబ్దమును చేయుచుండును.
శయానః పరిశోచద్భిః పరివీతస్స్వబంధుభిః ।
వాచ్యమానోఽపి న బ్రూతే కాలపాశవశం గతః ॥
ఆతడు పరుండియుండగా బంధువులు చుట్టూ చేరి అధికముగా దుఃఖించుచుందురు. ఈతడు మృత్యువుయొక్క పాశమునకు చిక్కి యుండుటచే, వారు పలుకరించిననూ బదులు చెప్పలేడు.
ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మాఽజితేంద్రియః ।
ప్రియతే రుదతాం స్వానామురువేదనయాస్తధీః ॥
ఈ విధముగా ఆతడు బలముగానున్నప్పుడు కుటుంబపోషణవ్యా పారములో తలమున్కలవుతూ ఇంద్రియములపై విజయమును సాధించ లేదు. ఇప్పుడు తన బంధువులు ఏడ్చుచుండగా అధికమగు నొప్పితే నశించిన బుద్ధిశక్తి గలవాడై మరణించును.
యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభ సేక్షణౌ ।
స దృష్ట్వా త్రస్తహృదయశ్శకృన్మూత్రం విముంచతి ॥
అపుడు యమదూతలు ఆతనికి కనబడెదరు. వారు కోపముతో నిండిన కన్నులతో భీతిని గొల్పుదురు. వారిని చూచి ఆతడు తన హృదయ ములో చాల భయపడి మలమూత్రములను విడిచి పెట్టును.
యాతనాదేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ ।
నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటా యథా ॥
వారాతనిని యాతనలకు తగిన దేహమునందు పారవేసి, మెడకు గట్టిగా త్రాళ్లను కట్టి, రాజభటులు శిక్షార్హుడగు అపరాధిని వలె, చాల పొడ వైన యమలోకమార్గమునందు నడిపించేదరు.
తయోర్నిర్భిన్నహృదయస్తర్జ నైర్జాతవేపథుః ।
పథి శ్వభిర్భక్ష్యమాణ ఆర్తోఘం స్వమనుస్మరన్ ॥
వారిద్దరు ఈతనిని బెదిరిస్తూ ఉంటే ఈతని గుండె పగిలి వణుకు పుట్టును. దారిలో ఈతనిని కుక్కలు కరచును. అతడు తాను చేసిన పాప మును గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ వెళ్లును.
క్షుత్తృటరీతోఽర్కదవానలానిలై:
సంతప్యమానః పథి తప్తవాలుకే ।
కృచ్చ్రేణ ప్రుష్ఠే కశయా చ తాడితః
చలత్యశక్తోఽపి నిరాశ్రమోదకే ॥
ఆ జీవుని తీవ్రమగు ఆకలి దప్పికలు బాధించుచుండును; సూర్యుడు, దావాగ్ని, సుడిగాలులు ఆతనిని పీడించుచుండును. నడిచే దారిలో కాలే ఇసుక ఉండును. దారిలో విశ్రామస్థానము గాని, త్రాగే నీరు గాని ఉండదు. యమదూతలు కొరడాతో వీపుపై కొట్టుచుందురు. ఆ జీవుడు శక్తి లేకున్ననూ అతికష్టము మీద ఆ దారిలో ముందుకు సాగును.
తత్ర తత్ర పతన్ శ్రాంతో మూర్చితః పునరుత్తితః ।
పథా పాపీయసా నీతస్తమసా యమసాదనమ్ ॥
ఆ జీవుడు అలసి అక్కడక్కడ దారిలో మూర్చిల్లి మరల లేచి పాపులకు తగిన చీకటితో నిండిన ఆ దారిలో యమదూతలచే యమపురికి తీసుకు వెళ్లబడును.
యోజనానాం సహస్రాణి నవతిం నవ చాధ్వనః ।
త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనాః ॥
యమలోకమార్గము నిడివి తొంభై తొమ్మిది వేల యోజనములు, ఈ దూరమును వారాతనిని రెండు లేక మూడు ముహూర్తముల కాల ములో తీసుకువెళ్లెదరు. అచట ఆతడు యాతనలను పొందును.
ఆదీపనం స్వగాత్రాణాం వేష్టయిత్వోల్ముకాదిభిః ।
ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోఽపి వా ॥
జీవుని అవయవముల చుట్టూ కాలే కట్టెలను వేసి మండించెదరు ఒకప్పుడు ఈతడు తన శరీరమునుండి మాంసమును కోసి భక్షించునట్లు చేసెదరు; లేదా, ఇతరులు వీని మాంసమును కోసి వీనిచే తినిపించెదరు.
జీవతశ్చాంత్రాభ్యుద్ధారః శ్వగృధైర్యమసాదనే ।
సర్పవృశ్చికదంశాద్యైర్ధశద్భిశ్చాత్మ వైశనమ్ ॥
ఆ యమపురియందు జీవుల ప్రేవులను వారు బ్రతికియుండగనే కుక్కలు గ్రద్దలు పీకివేయును. సర్పములు తేళ్లు అడవి ఈగలు కరచుచుం డగా వారి దేహములకు చాల పీడ కలుగును.
కృంతనం చావయవశో గజాదిభ్యో భిదాపనమ్ ।
పాతనం గిరిశృంగేభ్యో రోధనం చాంబుగర్తయోః ॥
అచట జీవులను ప్రతి అవయవమును ముక్కలు ముక్కలుగా కోసెదరు. ఏనుగులు మొదలగు వాటిచే తొక్కించెదరు. కొండకో మ్ములనుండి పారద్రో సెదరు. నీటిలో, గోతిలో ముంచి నొక్కి యుంచెదరు.
యాస్తామిస్రాంధతామిస్రా రౌరవాద్యాశ్చ యాతనాః ।
భుంక్తే నరో వా నారీ వా మిథస్సంగేన నిర్మితాః ॥
స్త్రీపురుషులు పరస్పరము ఆసక్తిచే అధర్మమును చేసినచో, దాని వలన కలిగించబడే యాతనలను వారు అనుభవించెదరు. తామిస్రము, అంధతామిస్రము, రౌరవము మొదలగు యాతనలు గలవు.
అత్రైవ నరకస్స్వర్గ ఇతి మాతః ప్రచక్షతే ।
యా యాతనా వై నారక్యస్తా ఇహాప్యుపలక్షితాః ॥
అమ్మా! స్వర్గము, నరకము ఇక్కడనే గలవని కొందరు చెప్పుచు న్నారు. నరకమునకు సంబంధించిన యాతనలు మనకు ఇక్కడనే ప్రత్యక్ష మగుచున్నవి.
ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరంభర ఏవ వా ।
విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశమ్ ॥
మానవుడు కుటుంబమును పోషించుటకు గాని, లేక తన పొట్ట పోసుకొనుటకు గాని పాపములను చేసినచో, మరణించునప్పుడు ఈ దేహ ము కుటుంబము అనే రెండింటినీ విడిచి పెట్టి ఆ పాపముల ఫలమును ఈ విధముగా అనుభవించును.
ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరమ్ ।
కుశలేతరపాథేయో భూతద్రోహేణ యద్భృతమ్ ॥
మానవుడు ఇతరప్రాణులకు ద్రోహమునాచరించి ఈ దేహమును - పోషించినచో, ఆ విధముగా పోషించబడిన ఈ తన దేహమును ఇక్కడనేవిడిచి పెట్టి ఒంటరిగా నరకమునకు వెళ్లును. ఆతడు చేసిన పాపమునే ఆతడు ఆ యమలోకమార్గములో భోగించును.
దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్ ।
భుంక్తే కుటుంబపోషస్య హృతవిత్త ఇవాతురః ॥
సర్వస్వమును కోల్పోయినవాడు చాల పీడను పొందును. అదే విధమగు దుఃఖమును అధర్మముగా జీవించువాడు అనుభవించును. అన్యాయముగా కుటుంబమును పోషించు మానవునిచే దైవము ఆ పాప ముయొక్క ఫలమును నరకములో అనుభవింప జేయును.
కేవలేన హ్యధర్మేణ కుటుంబభరణోత్సుకః ।
యాతి జీవోఽoధతామిస్రం చరమం'తమసః పదమ్ ॥
కేవలము అధర్మమార్గములో కుటుంబమును పోషించే ఉత్సా హము గల జీవుడు నరకముయొక్క అంతిమస్థానమగు అంధతామిస్ర మును పొందును.
అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః ।
క్రమశస్సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః ॥
ఇతి శ్రీమద్భాగవత మహాపురాణే తృతీయస్కంధే
త్రింశోऽధ్యాయః ॥
పాపములను చేయు వ్యక్తి మనుష్యలోకమునకు నికృష్టస్థానము లోనుండే నరకములోని యాతనలను, మనుష్యజన్మకంటే నికృష్టమగు పశువు మొదలగు జన్మలను క్రమముగా అనుభవించి, ఆ విధముగా పని త్రుడై మరల తిరిగి మనుష్యజన్మను పొందును.
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో
ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30).
Summary of chapter 30 of the Bhāgavata Mahā Purana is as follows:
Lord Kapila paints a sobering picture of the soul's entanglement in attachment to family, wealth, and material sense gratification, explaining how fruitive actions yield temporary pleasures followed by inevitable suffering. He describes the agonizing processes of aging, disease, death, and the journey of the sinful soul to the realm of Yamarāja, urging seekers to wake up from the dream of material security.