భాగవత మహా పురాణము
4 - విదురుడు మైత్రేయుని వద్దకు వెళ్లుట
ఉద్దవ ఉవాచ !
అథ తే తదనుజ్ఞాతా భుక్త్వా పీత్వా చ వారుణీమ్ ।
తయా విభ్రంశితజ్ఞానా దురుక్తైర్మర్మ పస్పృశుః ॥
ఉద్దవుడు ఇట్లు పలికెను --- తరువాత ఆ యాదవులు ఆ బ్రాహ్మ ణుల అనుమతిని పొంది భుజించిరి. తరువాత వారు మద్యమును త్రాగి, దాని ప్రభావముచే నశించిన వివేకము గలవారై, ఒకరినొకరు సూటిపోటి మాటలతో నిందించుకొనిరి.
తేషాం మైరేయదో షేణ విషమీకృతచేతసామ్ ।
నిమ్లోచతి రవావాసీద్వేణూనామివ మర్దనమ్ ॥
ఈ లోపులో సూర్యుడు అస్తమించెను. మద్యప్రభావముచే వారి వివేకము నశించియుండెను. అడవిలో వెదుళ్లకు ఒకదానితో మరియొక దానికి రాపిడి కలిగే విధముగా, వారిలో వారికి సంఘర్షణ బయలుదేరెను.
భగవాన్ స్వాత్మమాయాయా గతిం తామవలోక్య సః ।
సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్ ॥
శ్రీకృష్ణ భగవానుడు తన మాయాశక్తియొక్క ప్రభావముచే యాద వకులమంతయు ఆ విధముగా వినష్టమగుటను చూచెను. అపుడాయన సరస్వతీనదిలో స్నానమును చేసి, చెట్టు మొదట్లో కూర్చుండెను.
అహం చోక్తో భగవతా ప్రపన్నార్తిహరేణ హ ।
బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సంజహీర్షుణా ॥
శరణు జొచ్చిన వారిని కష్టములనుండి గట్టెక్కించే శ్రీకృష్ణ భగవా నుడు తన వంశమును ఉపసంహరించ గోరినవాడై నాతో, బదరికీ వెళ్లిపో మ్మని చెప్పెను.
అథాపి తదభిప్రేతం జానన్నహమరిందమ ।
పృష్ఠతోన్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః ॥
అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ విదురా! ఆయన అభిప్రా యము నాకు తెలియును. అయినప్పటికీ, నేను ఆ ప్రభుని పాదములకు దూరమగుటను సహించలేను. కావుననే, నేను ఆయన వెనుకనే వెళ్లితిని.
అద్రాక్షమేకమాసీనం విచిన్వన్ దయితం పతిమ్ ।
శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనమ్ ॥
నేను ప్రియతముడగు ఆ శ్రీకృష్ణ ప్రభుని వెదుకుతూ ఆయననే స్మరించుచుంటిని. సర్వమునకు ఆశ్రయమైనవాడు, తనకు మరియొక ఆశ్రయము లేనివాడు, లక్ష్మీపతి, పరమసుందరుడు అగు ఆ శ్రీకృష్ణుడు సర స్వతీ నదీతీరమునందు ఒంటరిగా కూర్చుని యుండగా నేను చూచితిని.
శ్యామావదాతం విరజం ప్రశాంతారుణలోచనమ్ ।
దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశాంబరేణ చ ॥
శుద్ధసత్త్వమయుడగు ఆయన తెలుపుతో కూడిన స్వచ్ఛమగు నీల వర్ణమును కలిగియుండెను. ఆయన ఎర్రని కన్నులు ప్రసన్నముగా నుండె ను. నాలుగు చేతులను, పచ్చని పట్టు వస్త్రమును చూచి, నేను ఆయనను దూరమునుండియే గుర్తు పట్టితిని.
వామ ఊరావధిశ్రీత్య దక్షిణాంఘ్రిసరోరుహమ్ ।
అపాశ్రితార్భకాశ్వత్థామకృశం త్యక్తపిప్పలమ్ ॥
ఆయన పద్మమువంటి కుడికాలిని ఎడమకాలిపై పెట్టి, లేత రావి చెట్టునకు నడుమును ఆనించి కూర్చుండెను. ఆయన పళ్లు మొదలగు ఆహారమును ఇంద్రియసుఖములను విడిచి పెట్టియున్ననూ, పుష్టిగా ఆనం దముగా ఉండెను.
తస్మిన్ మహాభాగవతో ద్వైపాయనసుహృత్సఖః ।
లోకాననుచరన్ సిద్ధ ఆసనిద యదృచ్ఛయా ॥
గొప్ప భగవద్బక్తుడు, వ్యాసుని ప్రియమిత్రుడు, కృతకృత్యుడు అగు మైత్రేయుడు స్వచ్ఛందముగా లోకములను తిరుగుతూ ఆ భగవా నుని సన్నిధికి యాదృచ్ఛికముగా విచ్చేసేను.
తస్యానురక్తస్య మునేర్ముకుందః ప్రమోదభావానతకంధరస్య ।
ఆశృణ్వతో మామనురాగహాససమీక్షయా విశ్రమయన్నువాచ ॥
మైత్రేయ మహర్షికి శ్రీకృష్ణునియందు గొప్ప ప్రేమ గలదు. ఆయన ఆనందముతో భక్తితో తలను వంచి వినుచుండెను. అప్పుడు మోక్ష ప్రదాతయగు ఆ శ్రీకృష్ణుడు ప్రేమతో చిరునవ్వుతో నావైపు చూసి, ఆ విధ ముగా నాకు ఆనందమును కలిగించి, నా శ్రమను అంతనూ పోగొట్టి, ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
వేదాహమంతర్మనసీప్సితం తే
దదామి యత్తద్దురవాపమన్యైః ।
సత్రే పురా విశ్వసృజాం వసూనాం
మత్సిద్ధికామేన వసో త్వయేష్టః ॥
శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను --- ఓ ఉద్దవా! నీవు పూర్వజ న్మలో వసువు. నీ అంతఃకరణమునందలి కోరికను నేను ఎరుగుదును. ఇతరులకు పొంద శక్యము కాని ఆ కోరికను తీర్చెదను. పూర్వము జగత్తును సృష్టించే ప్రజాపతులు, వస్తువులు కలిసి చేసిన యజ్ఞములో నీవు నన్ను పొందగోరి ఆరాధించితివి.
స ఏష సాధో చరమో భవానా-
మాసాదితస్తే మదనుగ్రహో యత్ ।
యన్మాం నృలోకాద్రహ ఉత్సృజంతం
దిష్ట్యా దదృశ్వాన్ విశదానువృత్త్యా ॥
ఓ ఉద్దవా! నీవు సాధుపురుషుడవు. ఈ సంసారములో నీకు ఇది ఆఖరి జన్మ. ఏలయనగా, నీకు నా అనుగ్రహము లభించినది. పైగా, నేను మానవలోకమును విడిచి పెట్టి వెళ్లే ఈ సమయములో నీవు దైవయోగముచే నన్ను ఏకాంతములో స్వచ్ఛమగు భక్తితో దర్శించితివి.
పురా మయా ప్రోక్తమజాయ నాణ్యే
పద్మే నిషణ్ణాయ మమాదిసర్గే ।
జ్ఞానం పరం మన్మహిమావభాసం
యత్సూరయో భాగవతం వదంతి ॥
పూర్వము సృష్ట్యాదియందు నా నాభియందలి పద్మములో కూర్చునియున్న బ్రహ్మకు నేను నా మహిమను ప్రకాశింపజేసే సర్వోత్కృ ష్టమగు జ్ఞానమునుపదేశించితిని. ఆ ఉపదేశమును విద్వాంసులు భాగవత మని వ్యవహరించుచున్నారు (ఆ జ్ఞానమును నేను నీకు ఇప్పుడు ఇచ్చు చున్నాను).
ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః
ప్రతిక్షణానుగ్రహభాజనోకహమ్ ।
స్నేహోత్థరోమా స్థలితాక్షరస్తం
ముంచఞ్చచః ప్రాంజలిరాబభాషే ॥
ఈ విధముగా ఆయన నాతో ఆదరపూర్వకముగా పలికెను. నేను ఆ పరమపురుషుని అనుగ్రహమునకు ప్రతిక్షణము పాత్రుడనైతిని. నాకు ఆయనయందలి ప్రేమచే రోమాంచము కలిగి మాట తడబడుచుండెను. నేను కన్నీటిని విడుస్తూ చేతులను జోడించి ఇట్లు పలికితిని.
కో న్వీశ తే పాదసరోజభాజాం
సుదుర్లభ్వోర్థేషు చతుర్ష్వపీహ ।
తథాపి నాహం ప్రవృణోమి భూమన్
భవత్పదాంభోజనిషేవణోత్సుకః ॥
ఓ ప్రభూ! నీ పాదపద్మములను సేవించువారలకు ఈ సంసార ములో ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థములలో ఏది దుర్లభము? (ఏదియు దుర్లభము కాదు). ఓ పరబ్రహ్మ స్వరూపుడా! అయిన నూ, నేను వాటిని కోరుట లేదు. ఏలయనగా, నేను నీ పాదపద్మములను సేవించాలనే ఉత్కంఠ గలవాడను.
కర్మాణ్యనీహస్య భవోభవస్య తే
దుర్గాశ్రయోథారిభయాత్పలాయనమ్ ।
కాలాత్మనో యతమదాయుతాశ్రయః
స్వాత్మస్రతేః ఖిద్యతి ధీర్విదామిహ ॥
నీకు కామనలు లేవు. నీవు అకర్తవు. కాని, నీవు కర్మలను చేయు చునే ఉందువు. నీకు పుట్టుక లేదు. కాని, నీవు అవతరించుచునే యుందు వు. నీవు కాల (మృత్యు) స్వరూపుడవు. కాని, నీవు శత్రువులకు భయపడి పారిపోయి ద్వారక అనే దుర్గములో తల దాచుకొంటివి. ఆత్మస్వరూపము నందు రమించే నీవు పదివేల భార్యలు గల గృహస్థుడవు. ఈ విషయము లను గమనించినప్పుడు పండితులకు కూడ బుద్ధి సంశయములో పడును.
మంత్రేషు మాం వా ఉపహూయ
యత్త్వమకుంఠితాఖండసదాత్మబోధః ।
పృచ్ఛేః ప్రభో ముగ్ధ ఇవాప్రమత్తః
తన్నో మనో మోహయతీవ దేవ ॥
ఓ ప్రభూ! నీవు మొక్కవోని అఖండసచ్చిదాత్మజ్ఞానము గలవాడ వు. అయిననూ, నీవు నన్ను పిలిచి, ఏమీ తెలియనివాని వలె, చాల సావధానుడవై సలహాలను అడిగెడివాడవు. ఓ దేవా! ఈ సంగతి మా మనస్సును మోహ పెట్టుచున్నది.
జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం
ప్రోవాచ కస్మై భగవాన్ సమగ్రమ్ ।
అపి క్షమం నోగ్రహణాయ భర్త-
ర్వదాంజసా యద్వృజినం తరేమ ॥
ఓ ప్రభూ! భగవానుడవగు నీవు నీ స్వరూపమును ప్రకాశింపజేసే సర్వోత్కృష్టమగు రహస్యజ్ఞానమును బ్రహ్మకు సమగ్రముగా చెప్పియుంటివి. ఆ జ్ఞానమును గ్రహించే సామర్థ్యము మాకు ఉన్నచో, చెప్పుము. దాని వలన, మేము సంసారదుఃఖమును తేలికగా అధిగమించేదము.
ఇత్యావేదితహార్దాయ మహ్యం స భగవాన్ పరః ।
ఆదిదేశారవిందాక్ష ఆత్మనః పరమాం స్థితిమ్ ॥
నేనీ విధముగా నా హృదయములోని అభిప్రాయమును పరబ్రహ్మ స్వరూపుడగు ఆ భగవానునకు విన్నవించితిని. అపుడు పద్మములవంటి కన్నులు గల ఆ శ్రీకృష్ణుడు నాకు తన స్వరూపమగు ఆత్మయొక్క పరమ స్థితిని ఉపదేశించెను.
స ఏవమారాధితపాదతీర్థా-
దధీతతత్త్వాత్మవిబోధమార్గః ।
ప్రణమ్య పాదౌ పరివృత్య దేవ-
మిహాగతోహం విరహాతురాత్మా ॥
నేను ఈ విధముగా సర్వులచే ఆరాధింపబడే పవిత్రపాదములు గల భగవానుడే గురువు కాగా, ఆత్మతత్త్వమును తెలుసుకొనే సాధన మును అధ్యయనము చేసి, ఆయన పాదములకు నమస్కరించి, ఆయనకు ప్రదక్షిణము చేసి, ఇచటకు వచ్చియుంటిని. నా చిత్తము ఆయన విరహ ముచే వ్యాకులితమై యున్నది.
సోహం తద్దర్శనాహ్లాదవీయోగార్తియుతః ప్రభో ।
గమిష్యే దయితం తస్య బదర్యాశ్రమమండలమ్ ॥
ఓ విదురా! నేను శ్రీకృష్ణుని దర్శనముచే ముందుగా ఆనందము ననుభవించిననూ, ఇప్పుడు ఆయన వియోగదుఃఖముననుభవించుచున్నాను. బదరికాశ్రమము ఆయనకు ప్రియమైనది. కావున, నేను ఆ స్థానము నకు వెళ్లేదను.
యత్ర నారాయణో దేవో నరశ్చ భగవానృషిః ।
మృదు తీవ్రం తపో దీర్ఘం తేతే లోకభావనౌ ॥
ఆ బదరికాశ్రమమునందు నారాయణ దేవుడు, పూజ్యుడగు నరము హర్షి మానవుల ననుగ్రహించుట కొరకై చిరకాలము సౌమ్యమగు తప స్సును తీవ్రముగా చేసిరి.
శ్రీశుక ఉవాచ ।
ఇత్యుద్దవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహం వధవ్ ।
జ్ఞానేనాశమయత్ క్షత్తా శోకముత్పతితం బుధః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మిత్రుల వధను గురించి సహింప శక్యము గాని సమాచారమును ఉద్దవునినుండి విని, వివేకి యగు విదురుడు పైకి ఉబుకుచున్న దుఃఖమును వివేకజ్ఞానముచే తన లోపలనే శమింప జేసెను.
స తం మహాభాగవతం ప్రజంతం కౌరవర్షభః ।
విశ్రంభాదభ్యదత్తేదం ముఖ్యం కృష్ణపరిగ్రహే ॥
శ్రీకృష్ణుని సేవించి ఆయనచే స్వీకరించబడినవారిలో ఉద్ధవుడు ప్రముఖుడు. గొప్ప భగవద్భక్తుడగు ఆ ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ల బోవుచుండగా, కౌరవులలో ఉత్తముడగు విదురుడు ఆయనయందలి విశ్వాసముతో, ప్రేమతో ఇట్లు పలికెను.
విదుర ఉవాచ ।
జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం
యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే ।
వక్తుం భవాన్నోర్హతి యద్ది విష్ణోః
భృత్యాస్స్వభృత్యార్ధకృతశ్చరంతి ॥
విదురుడు ఇట్లు పలికెను --- యోగేశ్వరుడగు శ్రీకృష్ణ భగవా నుడు తన స్వరూపముయొక్క రహస్యమును తేటతెల్లము చేసే ఉత్కృష్ట మగు జ్ఞానమును నీకు బోధించినాడు. దానిని నీవు మాకు కూడ చెప్పుట యోగ్యముగా నుండును. ఏలయనగా, విష్ణుభక్తులు. తమ భక్తుల కార్య మును సిద్ధింపజేయుట కొరకై సంచారమును చేయుచుందురు గదా!
ఉద్దవ ఉవాచ ।
నను తే తత్త్వసంరాధ్య ఋషి కౌషారవోకంతిమే ।
సాక్షాద్బగవతాదిష్టో మర్త్యలోకం జిహాసతా ॥
ఉద్దవుడిట్లు పలికెను --- కాని, నీవు తత్త్వజ్ఞానము కొరకై మైత్రేయ మహర్షిని ఆరాధించ వలెను. ఏలయనగా, సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే మానవలోకమును విడువ గోరి, ఆఖరి సమయములో ఆయ నకు అట్టి ఆదేశమును ఇచ్చియున్నాడు.
శ్రీశుక ఉవాచ ।
ఇతి సహ విదురేణ విశ్వమూర్తేః
గుణకథయా సుధయా ప్లావితోరుతాపః ।
క్షణమివ పులినే యమస్వసుస్తాం
సముషిత ఔపగవిర్నిశాం తతోగాత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పేను --- ఈ విధముగా విదురునితో కలిసి జగద్రూపుడగు భగవానుని గుణములను వర్ణించగా, ఆ భగవద్గాథ అనే అమృతముచే ఉద్దవుని మనోవేదన అంతయు తొలగి పోయినది. ఆయన ఆ రాత్రిని యమునా నదియొక్క ఇసుకతిన్నెలపై క్షణకాలము వలె గడిపి, తరువాత వెళ్లాను.
రాజోవాచ ।
నిధనముపగతేషు వృష్టిభోజే-
ష్వధిరథయూథపయూథ పేషు ముఖ్యః ।
స తు కథమవశిష్ట ఉద్దవో యత్
హరిరపి తత్యజ ఆకృతిం త్య్రధీశః ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- అతిరథులు, మహారథులు, వారికి కూడ నాయకులు అగు వృష్టిభోజవంశీయులు అందరు మరణించిరి. ముల్లోకములకు ప్రభువగు శ్రీకృష్ణ భగవానుడు కూడ దేహమును విడిచిపెట్టెను. కాని, యాదవులలో ముఖ్యుడగు ఒక్క ఉద్ధవుడు మాత్రము మిగిలియుండెను. ఇది ఎట్లు సంభవమయ్యెను?
శ్రీశుక ఉవాచ ।
బ్రహ్మశాపాపదేశేన కాలేనామోఘవాంఛితః ।
సంహృత్య స్వకులం నూనం త్యక్ష్యన్డేహమచింతయత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్యసంకల్పుడగు శ్రీకృష్ణ భగవానుడు కాలము వచ్చినప్పుడు బ్రాహ్మణ శాపము అనే మిషచే తన వంశమును పూర్తిగా ఉపసంహరించి, తాను కూడ దేహత్యాగమును చేయ బోతూ, ఇట్లు తలపోసేను.
అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయమ్ ।
అర్హత్యుద్ధవ ఏవాద్ధా సంప్రత్యాత్మవతాం వరః ॥
నేను ఈ లోకమునుండి నిష్క్రమించుచున్నాను. ఇప్పుడు నా (నన్ను బోధించే) జ్ఞానమునకు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, జితేంద్రియుడు అగు ఉద్ధవుడు మాత్రమే నిశ్చయముగా తగియున్నాడు.
నోద్ధవోణ్వపి మన్న్యూనో యద్దుణైర్నార్దితః ప్రభుః ।
తతో యద్వయునం లోకం గ్రాహయన్నిహ తిష్ఠతు ॥
ఉద్దవుడు జితేంద్రియుడు. ఆయన అంతఃకరణములోని సత్వరజ స్తమోగుణములచే మరియు బాహ్యమునందలి గుణకార్యములగు శబ్దాది విషయములచే విచలితుడు కాడు. కావున, ఆయన నాకంటే ఏ మాత్రము తీసిపోడు. . కావుననే, నా జ్ఞానమును జనులకు ఉపదేశిస్తూ, ఆయన ఈ లోకములోనే కొంత కాలము నిలిచియుండుగాక!
ఏవం త్రిలోకగురుణా సందిష్టశ్శబ్దయోనినా ।
బదర్యాశ్రమమాసాద్య హరిమీజే సమాధినా ॥
ముల్లోకములకు గురువు, తండ్రి, వేదము అనే ప్రమాణముచే తెలియబడువాడు, వేదమునకు కారణమైనవాడు అగు శ్రీకృష్ణునిచే ఈ విధముగా ఆదేశించబడినవాడై, ఉద్ధవుడు బదరికాశ్రమమునకు చేరుకొని, ఏకాగ్రచిత్తముతో శ్రీహరిని ఆరాధించెను.
విదురోప్యుద్దవాచ్ఛ్రుత్వా కృష్ణస్య పరమాత్మనః ।
క్రీడయోపాత్తదేహస్య కర్మాణి శ్లాఘితాని చ ॥
దేహన్యాసం చ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనమ్ ।
అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లబాత్మనామ్ ॥
శ్రీకృష్ణుడు దేహమును విడిచిన ఈ విధానము ధీరచిత్తులకు ధైర్య మును వర్ధిల్లజేయును. కాని, గుండె దిటవు లేని అజ్ఞానులగు ఇతరులు ఇట్టి కార్యమును ఎన్నడైననూ చేయలేరు.
ఆత్మానంచ కురుశ్రేష్ట కృష్ణేన మనసేక్షితమ్ ।
ధ్యాయన్ గతే భాగవతే రురోద ప్రేమవిహ్వలః ॥
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! పరమభక్తుడగు ఉద్ద వుడు వెళ్లిన తరువాత, శ్రీకృష్ణుడు తనను స్మరించినాడని ఆయననుండి విన్న విదురుడు ఆ శ్రీకృష్ణునే స్మరిస్తూ, ప్రేమచే వ్యాకులమైన మనస్సు గలవాడై రోదించెను.
కాలింద్యాః కతిభిస్సిద్ధ అహోభిర్బరతర్షభః ।
ప్రాపద్యత స్వస్సరితం యత్ర మిత్రాసుతో మునిః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే చతుర్థోధ్యాయః ॥
కృతకృత్యుడు, భరతవంశ శ్రేష్ఠుడు అగు విదురుడు యమునాన దీతీరమునుండి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణము చేసి, గంగానదీతీ రమునందు మైత్రేయ మహర్షి ఉన్న స్థానమునకు చేరెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి మూడవ స్కంధములో నాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
Uddhava reveals to Vidura the final moments of Lord Kṛshṇa's presence on earth, describing how the Lord retired to the banks of the Sarasvatī River and granted His ultimate instructions to Uddhava before returning to His eternal spiritual abode. Because Lord Kṛshṇa specifically instructed that Vidura receive spiritual knowledge from the great sage Maitreya, Uddhava directs Vidura to pilgrimage toward Haridvāra to meet the revered saint.