భాగవత మహా పురాణము
14 - దితి గర్భమును ధరించుట
శ్రీశుక ఉవాచ ।
నిశమ్య కౌషారవిణోపవర్ణితాం
హరేః కథాం కారణసూకరాత్మనః ।
పునస్స పప్రచ్ఛ తముద్యతాంజలిః
న చాతితృప్తో విదురో ధృతవ్రతః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి భూమిని ఉద్ధరించుట కొరకై వరాహావతారమును దాల్చిన గాథను ఈ విధముగా మైత్రేయ మహర్షి వర్ణించి చెప్పగా విదురుడు వినెను. అయిననూ, దృఢమగు ప్ వ్రతనిష్ఠ గల విదురునకు పూర్ణమగు తృప్తి కలుగలేదు. అపుడాయన చేతులను జోడించి, మరల మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను.
విదుర ఉవాచ ।
తేనైవ తు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా ।
ఆదిదైత్యో హిరణ్యాక్షొ హత ఇత్యనుశుశ్రుమ ॥
ఓ మహర్షీ! యజ్ఞవరాహ రూపుడగు శ్రీహరియే మొట్టమొదటి దైత్యుడగు హిరణ్యాక్షుని చంపెనని నీవు చెప్పగా నేను వినియుంటిని,
తస్య చోద్ధరతః క్షోణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా ।
దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్థేతొరభూన్మృధః ॥
ఓ మహర్షీ! తన కోరయొక్క కొనపై అవలీలగా భూమిని పైకి యెత్తుచున్న వరాహ భగవానునకు రాక్షసరాజగు హిరణ్యాక్షునితో యుద్ధము జరుగుటకు కారణమేమి?
మైత్రేయ ఉవాచ ।
సాధు వీర త్వయా పృష్టమవతారకథాం హరేః ।
యత్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశవిశాతనీమ్ ॥
ఓ విదురా! ధర్మవీరుడవగు నీవు చక్కగా ప్రశ్నించితివి. ఏలయనగా, మానవుల మరణపాశమును తెగగొట్టే శ్రీహరియొక్క అవతారగాథను గురించి నీవు ప్రశ్నించుచున్నావు.
యయోత్తానపదః పుత్రో మునినా గీతయార్భకః ।
మృత్యోః కృత్వైవ మూర్థ్న్యంఘ్రీమారురోహ హరేః పదమ్ ॥
ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు చిన్న పిల్లవాడు. కాని, ఆతడు నారదుని వలన శ్రీహరి మహిమను విని, ఉపదేశమును పొంది, దాని ప్రభావముచే మృత్యువును జయించి, శ్రీహరియొక్క స్థానమగు ధ్రువపదమును పొందెను.
అథాత్రాపీతిహాస్యొయం శ్రుతో మే వర్ణితః పురా ।
బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతామ్॥
ఓ విదురా! నీ ప్రశ్నకు సమాధానమును చెప్పుచున్నాను. పూర్వము ఇదే విషయమును గురించి దేవతలు ప్రశ్నించగా, దేవదేవుడగు బ్రహ్మగారు ఒక వృత్తాంతమును వర్ణించి చెప్పినారు. అపుడు నేను దానిని వినియుంటిని.
దితిర్దాక్షాయణీ క్షత్తర్మారీచ్యం కశ్యపం పతిమ్ ।
అపత్యకామా చకమే సంధ్యాయాం హృచ్ఛయార్దితా ॥
ఓ విదురా! దక్షుని కుమార్తెయగు దితి మరీచి మహర్షియొక్క పుత్రుడగు కశ్యపుని భార్య. ఆమెకు సంతానమునందు ప్రీతి ఉండెను. ఆమె ఒకనాడు సంధ్యాకాలములో కామపీడితురాలై తన భర్తను ప్రార్థించెను.
ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిమ్ ।
నిమ్లోచత్యర్క ఆసీనమగ్న్యాగారే సమాహితమ్ ॥
కశ్యప ప్రజాపతి అగ్ని అనే జిహ్వ ద్వారా హవిస్సులను స్వీకరించే యజ్ఞపతియగు పరమేశ్వరుని పయోహోమముచే ఆరాధించి, సూర్యుడు అస్తమించుచుండగా, అగ్నిహోత్రశాలయందు ధ్యానమగ్నుడైయుండెను. అప్పుడు దితి ఆయనను ప్రార్థించెను.
దితిరువాచ ।
ఏష మాం త్వత్కృతే విద్వన్ కామ ఆత్తశరాసనః ।
దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజః ॥
ఓ విద్వాంసుడా! ఈ మన్మథుడు తన ధనస్సును ఎక్కు పెట్టి నీతో పొందు కొరకై దీనురాలనై యున్న నాపై పరాక్రమించి, ఏనుగు అరటి చెట్టును వలె, పీడించుచున్నాడు.
తద్భవాందహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభిః ।
ప్రజావతీనాం భద్రం తే మయ్యాయుంక్తామనుగ్రహమ్ ॥
నా సవతులు సంతానవతులు. వారి విభవమును చూచిన నా హృదయము దహించుకు పోవుచున్నది. కావున, నీవు సాయందు అన్ని విధములుగా అనుగ్రహమును చూపదగును. నీకు మంగళమగు గాక!
భర్తర్యాప్తోరుమానానాం లోకానావిశతే యశః ।
పతిర్భవద్విధో యాసాం ప్రజయా నను జాయతే ॥
ఏ స్త్రీల కడుపున నీ వంటి భర్తలు పుత్రరూపములో జన్మించెదరో, వారు తమ భర్త విషయములో గొప్ప ఆదరమును పొందెదరు. వారి కీర్తి నిశ్చయముగా లోకములో అంతటా వ్యాపించును.
పురా పీతా నో భగవాన్ దక్షో దుహితృవత్సలః ।
కం వృణీత వరం వత్సా ఇత్యపృచ్ఛత నః పృథక్ ॥
మా నాయనగారు పూజ్యుడగు దక్షుడు పుత్రికలపై గొప్ప ప్రేమ గలవాడు. ఆయన పూర్వము, అమ్మాయిలూ! మీరు ఎవనిని భర్తగా వరించెదరు? అని మమ్ములను వేర్వేరుగా ప్రశ్నించెను.
స విదిత్వాఽఽత్మజానాం నో భావం సంతానభావనః ।
త్రయోదశాదదత్తాసాం యాస్తే శీలమనువ్రతాః ॥
సంతానముయొక్క హితమును కోరే ఆయన కుమార్తెలమగు మా అభిప్రాయమును తెలుసుకొని, దానికి తగ్గ విధముగా నీ గుణమును స్వభావమును ఇష్టపడిన తన పదముగ్గురు కుమార్తెలను నీకు ఇచ్చి వివాహమును చేసేను.
అథ మే కురు కల్యాణ కామం కంజవిలోచన ।
ఆర్తోపసర్పణం భూమన్నమోఘం హీ మహీయసి ॥
ఓ మంగళమూర్తీ! కలువ కన్నులవాడా! మహాత్మా! కావున, నీవు నా కోరికను సఫలము చేయుము. కష్టములోనున్న వ్యక్తి మహాత్ముని సమీపించి కోరినచో, ఆ కోరిక వ్యర్థము కాదు.
ఇతి తాం వీర మారీచః కృపణాం బహుభాషిణీమ్ ।
ప్రత్యాహానునయన్ వాచా ప్రవృద్ధానంగకశ్మలామ్ ॥
ఆ దితి ఈ విధముగా కామోద్రేకముచే మోహితురాలై దైన్యముతో అధికముగా ప్రసంగించుచుండగా, మరీచిపుత్రుడగు కశ్యపుడు ఆమెను మంచి మాటలతో ఓదారుస్తూ ఇట్లు బదులు చెప్పెను.
ఏష తేఽహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛసి ।
తస్యాః కామం న కః కుర్యాత్సిద్ధిస్త్రైవర్గికీ యతః ॥
ఓ భయస్వభావము గలదానా! నీకు ప్రియమైన కోరికను నీచే ప్రార్థించబడిన నేను నెరవేర్చెదను. మానవుడు భార్య మూలకముగా ధర్మార్థకామములనే పురుషార్థములలో కృతార్థుడగును. అట్టి భార్యయొక్క కోరికను ఎవడు నెరవేర్చకుండును?
సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్ ।
వ్యసనార్ణవమత్యేతి జలయానైర్యథార్ణవమ్ ॥
నావికుడు నౌక సాయముతో తాను సముద్రమును దాటుటయే గాక, ఇతరులను కూడ దాటించును. అదే విధముగా గృహస్థుడు భార్య యొక్క సాయముతో ఆకలి దప్పికలు అనే దుఃఖసముద్రమును తాను దాటుటయే గాక, మిగిలిన మూడు ఆశ్రమముల వారిని కూడ దాటించును (వారికి కూడ ఆహారాదులను సమకూర్చును).
యామాహురాత్మనో హ్యర్ధం శ్రేయస్కామస్య మానిని ।
యస్యాం స్వధురమధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః ॥
ఓ అభిమానవతీ! శ్రేయస్సును కోరే మానవునకు భార్య తన దేహములో సగభాగమని మహర్షులు చెప్పుచున్నారు. మానవుడు తన బరువును భార్యకు అప్పజెప్పి నిశ్చింతగా తిరుగును.
యామాశ్రిత్యేంద్రియారాతీన్దుర్జయానితరాశ్రమైః ।
వయం జయేమ హేలాభిర్దస్యూన్దుర్గపతిర్యథా ॥
దుర్గముయొక్క రక్షణను కలిగియున్న దుర్గాధిపతి బందిపోటు దొంగలను అవలీలగా జయించ గల్గును. అదే విధముగా, గృహస్థులమగు మేము ఇంద్రియములనే శత్రువులను శాస్త్రీయమైన భార్యతోడి విలాససం భోగముల ద్వారా జయించేదము. కాని, ఇంద్రియజయము ఇతరములగు ఆశ్రమముల వారికి తేలిక కాదు.
న వయం ప్రభవస్తాం త్వామనుకర్తుం గృహేశ్వరి ।
అప్యాయుషా వా కార్ త్న్యే న యే వాన్యే గుణగృధ్నవః ॥
ఓ దితీ! గృహమునకు ప్రభ్వివి నీవు. అట్టి నీవు చేసిన సేవకు తగిన ప్రతి సేవను చేయుటకు మాకు గాని, గుణగ్రాహులగు ఇతర పురుషులెవ్వరికైననూ గాని, పూర్తి ఆయుర్దాయము కూడ చాలదు.
అథాపి కామమేతం తే ప్రజాత్యై కరవాణ్యలమ్ ।
యథా మా నాతివోచంతి ముహూర్తం ప్రతిపాలయ ॥
నీకు ప్రత్యుపకారమును చేయగల్గుట అసంభవమే అయినప్పటికీ, నేను సంతానము కావాలనే ఈ నీ కోరికను నెరవేర్చెదను. నీవు ఒక గంట సేపు వేచియుండుము. దాని వలన, జనులు నన్ను నిందించకుందురు.
ఏషా ఘోరతమా వేలా ఘోరాణాం ఘోరదర్శనా ।
చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణి హ ॥
ఈ ఘోరమగు సంధ్యాసమయము చూచుటకైననూ భయమును గొల్పును. ఇది భయంకరాకారులగు రాక్షసులు మొదలగు వారికి చెందిన కాలము. ఈ కాలమునందు భూతములకు ప్రభువగు రుద్రుని అనుచరలగు భూతప్రేతపిశాచాదులు సంచరించుచుండును.
ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూతభావనః ।
పరీతో భూతపర్షద్బిర్వృషేణాటతి భూతరాట్ ॥
ఓ సాధ్వీ! ఈ సంధ్యాకాలమునందు సకలప్రాణులకు రక్షకుడు, భూతప్రేతాదులకు ప్రభువు అగు రుద్ర భగవానుడు వృషభమునధిష్టించి సంచరించును. భూతసమూహములు ఆయనను చుట్టువారి యుండును.
శ్మశానచక్రానిలధూలిధూమ్రవికీర్ణవిద్యోతజటాకలాపః ।
భస్మావగుంఠామలరుక్మదేహో దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే ॥
రుద్రుని ప్రకాశించే జటాజూటము శ్మశానమునందలి సుడిగాలిచే చెల్లాచెదరై బూడిద నిండి యుండును. ఆయన తన బంగరు కాంతి గల స్వచ్చమగు దేహమునంతా భస్మను పూసుకొనియుండును. ఆయన నీ సోదరి సతీదేవి భర్త. ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే తన మూడు కన్నులతో అందరినీ చూచుచుండును.
న యస్య లోకే స్వజనః పరో వా
నాత్యాదృతో నోత కశ్చిద్విగర్ఘ్యః ।
వయం వ్రతైర్యచ్చరణాపవిద్ధా-
మాశాస్మ హేఽజాం బత భుక్తభోగామ్ ॥
ఆ మహాదేవునకు లోకములో తన వాడు గాని, పరాయి వాడు గాని లేడు. ఒకడు మిక్కిలి ఆదరించ దగినవాడు, మరియొకడు నిందనీయుడు అనే భేదము ఆయన దృష్టిలో సుతరాము లేదు. మేము అనేకవ్రతములను చేసి ఆయన మాయాశక్తిని ప్రార్థించుచుందుము. కాని, దానిని ఆయన అనుభవించి, పాదముల వద్ద దూరముగా నుంచినాడు.
యస్యానవద్యాచరితం మనీషిణో
గృణంత్యవిద్యాపటలం బిభిత్సవః ।
నిరస్తసామ్యాతిశయోఽపి యత్స్వయం
పిశాచచర్యామచరద్గతిస్సతామ్ ॥
అజ్ఞానము మానవునకు ఆత్మస్వరూపము తెలియకుండగా కప్పి వేయును. అట్టి ఆవరణము విషయములో భయమును కలిగియుండుటయే అభిలషణీయము. కనుకనే, విద్వాంసులు అట్టి అజ్ఞానభయమును కోరేదరు. అట్టి వివేకులు అజ్ఞాననివృత్తి కొరకై ఆ మహాదేవుని చరితమును గానము చేయుదురు. ఆయన సత్పురుషులకు ఆశ్రయము. ఆయనతో సమానుడు గాని, అధికుడు గాని లేడు. అయిననూ, ఆయన పిశాచముల చేష్టలవలె భాసించే చేష్టలను కలిగియున్నాడు.
హసంతి యస్యాచరితం హి దుర్బగాః
స్వాత్మన్ రతస్యావిదుషస్సమీహితమ్ ।
యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః
శ్వభోజనం స్వాత్మతయోపలాలితమ్ ॥
రుద్రుడు తన స్వరూపమునందు రమిస్తూ మానవులకు నేర్పుట కొరకై కొన్ని చేష్టలను చేయును. కాని, ఆయన అభిప్రాయమునేరుంగని మందభాగ్యులు ఆయన చేష్టలను పరిహసించెదరు. అదే సమయములో వారు, మరణించిన తరువాత కుక్కలకు నక్కలకు భోజనము కాదగిన దేహమునందు ఆత్మబుద్ధి గలవారై, దానిని వస్త్రములతో పుష్పమాలలతో మరియు ఆభరణములతో అలంకరించి, దానికి సుగంధద్రవ్యములను అలిమి లాలించుచుందురు.
బ్రహ్మాదయో యత్కృత సేతుపాలా
యత్కారణం విశ్వమిదం చ మాయా ।
ఆజ్ఞాకరీ తస్య పిశాచచర్యా
అహో విభూమ్నశ్చరితం విడంబనమ్ ॥
బ్రహ్మాదులు కూడ ఆ రుద్రుడు ఏర్పాటు చేసిన మర్యాదలను పాలించుచుందురు. ఈ జగత్తునకు అధిష్ఠానము ఆయనయే. మాయాశక్తి ఆయన చెప్పుచేతలలో మెలగును. ఆశ్చర్యము! సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అగు అట్టి రుద్రుడు పిశాచము వలె ప్రవర్తించుట కేవలము అనుకరణము మాత్రమే. ఆ అద్భుతలీల మనకు తెలియవచ్చుట లేదు.
మైత్రేయ ఉవాచ ।
సైవం సంవిదితే భర్త్రా మన్మథోన్మథితేంద్రియా ।
జగ్రాహ వాసో బ్రహ్మర్షేర్వృషలీవ గతత్రపా ॥
మైత్రేయుడిట్లు పలికెను --- భర్తయగు కశ్యప మహర్షి ఈ విధముగా నచ్చజెప్పెను. అయిననూ, ఆమె మనస్సు మన్మథునిచే కల్లోలితము చేయబడి యుండెను. ఆమె వేశ్య వలె సిగ్గును విడిచి ఆ బ్రహ్మర్షి యొక్క వస్త్రమును పట్టుకొనెను.
స విదిత్వాథ భార్యాయాస్తం నిర్బంధం వికర్మణి ।
నత్వా దిష్టాయ రహసి తయాథోపవివేశ హ ॥
తరువాత ఆ కశ్యప మహర్షి తన భార్యకు నిషిద్ధమగు కర్మయందు గల ఆ పట్టుదలను గమనించి, పరమేశ్వరునకు నమస్కరించి, ఏకాంతమునందు ఆమెతో గడి పెను.
అథోపస్పృశ్య సలిలం ప్రాణాయమ్య వాగ్యతః ।
ధ్యాయన్ జజాప విరజం బ్రహ్మ జ్యోతిస్సనాతనమ్ ॥
తరువాత ఆయన స్నానమును చేసి, ప్రాణాయామమును చేసి, మౌనమును దాల్చెను. వికారములు లేనివాడు, స్వయంప్రకాశస్వరూపుడు, సనాతనుడు అగు పరమాత్మను ధ్యానిస్తూ ఆయన జపమును చేసెను.
దితిస్తు వ్రీడితా తేన కర్మావద్యేన భారత ।
ఉపసంగమ్య విప్రర్షిమధోముఖ్యభ్యభాషత ॥
భరతవంశీయుడవగు ఓ విదురా! దితి ఆ కర్మదోషముచే సిగ్గుపడి ఆ మహర్షి వద్దకు వచ్చి తలను వంచుకొని ఇట్లు పలికెను.
దితిరువాచ ।
మా మే గర్భమిమం బ్రహ్మన్ భూతానామృషభో వధీత్ ।
రుద్రః పతిర్హి భూతానాం యస్యాకరవమంహసమ్ ॥
దితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రమథగణాధిపతి, భూతములను పాలించువాడు అగు రుద్రుడు నా ఈ గర్భమును సంహరించకుండు గాక! నేను ఆయన విషయములో అపరాధమును చేసితిని.
నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీఢుషే।
శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే ॥
మహాదేవుడు, దుష్టులకు భయంకరుడై కోపమూర్తియై శిక్షను విధించువాడు, సత్పురుషుల విషయములో దండించవలెననే భావనను సైతము దూరముగా పెట్టి వారికి కోరికలను వర్షించువాడు, మంగళస్వరూపుడు అగు రుద్రునకు నమస్కారము.
స నః ప్రసీదతాం భామో భగవానుర్వనుగ్రహః ।
వ్యాధస్యాప్యనుకంప్యానాం స్త్రీణాం దేవస్సతీపతిః ॥
. ఎంతటి క్రూరులైననూ స్త్రీలపై దయను చూపెదరు. సతీదేవికి భర్త, నాకు బావగారు, గొప్ప దయ గలవాడు, మహాదేవుడు అగు ఆ రుద్ర భగవానుడు నాపై ప్రసన్నుడగుగాక!
మైత్రేయ ఉవాచ ।
స్వసర్గస్యాశిషం లోక్యామాశాసానాం ప్రవేపతీమ్ ।
నివృత్తసంధ్యానియమో భార్యామాహ ప్రజాపతిః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దితి తన సంతానమునకు ఇహపరలోకములలో శుభమును కోరి భగవానుని ప్రార్థించుచుండెను. ఆమె తాను అపరాధమును చేసితిననే భయముతో వణికిపోవుచుండెను. ఇంతలో కశ్యప ప్రజాపతి సంధ్యాకాల నియమమును పూర్తి చేసుకొని, ఆమెతో నిట్లనెను.
కశ్యప ఉవాచ ।
అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్మౌహూర్తికాదుత ।
మన్నిదేశాతిచారేణ దేవానాం చైవ హేలనాత్ ॥
భవిష్యతస్తవాభద్రాదభద్రే జాఠరాధమౌ ।
లోకాన్ సపాలాంస్త్రీంశ్చండి ముహురాక్రందయిష్యతః ॥
కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను --- ఓ అమంగళ స్వరూపురాలా! కోపస్వభావము గలదానా! నీ మనస్సు స్వచ్చమైనది కాదు. నీకు సంధ్యా సమయమునందు అట్టి భావన కలుగుట దోషము. నీవు నా ఆదేశమును కూడ ఉల్లంఘించితివి. పైగా, రుద్రుని అనుచరులగు దేవతలను నిశ్చయ ముగా అవమానించితివి. ఇన్ని కారణములచే, నీకు నిశ్చయముగా అమం గళ స్వరూపులగు ఇద్దరు అధములు పుత్రులై జన్మించెదరు. వారు లోకపా లకులతో సహా ముల్లోకములను పలుమార్లు ఏడిపించేదరు.
ప్రాణినాం హన్యమానానాం దీనానామకృతాగసామ్ ।
స్త్రీణాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు ॥
తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవాన్ లోకభావనః ।
హనిష్యత్యవతీర్యాసౌ యథాద్రీన్ శతపర్వధృక్ ॥
వారు నిరపరాధులు, దీనులు అగు ప్రాణులను హింసించెదరు. స్త్రీలను చెరపట్టెదరు. అప్పుడు మహాత్ములు కోపించెదరు. అప్పుడు జగ స్నాథుడు, జగత్పాలకుడు అగు ఈ శ్రీహరి భగవానుడు అవతరించి, ఇంద్రుడు వజ్రమును చేతబట్టి పర్వతముల రెక్కలను నరికిన విధముగా, వారినిద్దరినీ సంహరించగలడు.
దితిరువాచ ।
వధం భగవతో సాక్షాత్సునాభోదారబాహునో।
ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్బ్రాహ్మణాద్విభో ॥
దితి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నా పుత్రులిద్దరు వధించబడే పక్షములో, సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడు తన సుందరమగు చేతిలో సుదర్శన చక్రమును పట్టి వారిని సంహరించుగాక! అంతేగాని, వారు కోపించిన బ్రాహ్మణుల శాపముచే మరణించరాదని నా ప్రార్థన.
న బ్రహ్మదండదగ్ధస్య న భూతభయదస్య చ ।
నారకాశ్చానుగృణ్ణాంతి యాం యాం యోనిమసౌ గతః ॥
బ్రాహ్మణుని శాపముచే మరణించిన వానికి, ప్రాణులకు భయమును కలిగించు వానికి నరకమునందలి వారు కూడ అనుగ్రహమును చూపరు. అట్టివాడు ఏయే జన్మను పొందిననూ, అక్కడ కూడ ఆయా ప్రాణులు వాని విషయములో అనుగ్రహమును చూపవు.
కశ్యప ఉవాచ ।
కృతశోకానుతా పేన సద్యః ప్రత్యవమర్శనాత్ ।
భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్ ॥
పుత్రస్యైవ తు పుత్రాణాం భవితైకస్సతాం మతః ।
గాస్యంని యద్యశశ్శుద్ధం భగవద్యశసా సమమ్ ॥
నీవు చేసిన పనికి దుఃఖించి పశ్చాత్తాపమును పొందినావు. పనిని చేసిన వెంటనే అది ఉచితమా, కాదా అని వివర్శించుకున్నావు. పైగా, శ్రీహరి భగవానునియందు, శివునియందు మరియు నాయందు గొప్ప ఆదరమును చూపినావు. కావున, నీ పుత్రులలో ఒకనికి సత్పురుషులచే కొనియాడబడే కొడుకు ఒకడు జన్మించగలడు. పవిత్రమైన పోనీ కీర్తిని జనులు భగవంతుని కీర్తితో సమానముగా గానము చేయగలరు.
యోగై ర్హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవః ।
నిర్వైరాదిభిరాత్మానం యచ్చీలమనువర్తితుమ్ ॥
మెరుగును కోల్పోయిన బంగారమును పుటము పెట్టుట మొద లగు ఉపాయములచే శుద్ధి చేయుదురు. అదే విధముగా సాధుజనులు వైరము లేకుండుట మొదలగు లక్షణములతో కూడిన వాని స్వభావమున నుకరించి, తమ అంతఃకరణమును శుద్ధి చేసుకొనెదరు.
యత్పృసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకమ్ ।
స స్వదృగ్భగవాన్ యస్య తోష్యతేఽనన్యయా దృశా॥
ఈ జగత్తునకు అధిష్ఠానము భగవానుడే. భగవానుని అనుగ్రహ మున్నచో, జగత్తుయొక్క అనుగ్రహము కూడ లభించును. అట్టి స్వయంప్ర కాశస్వరూపుడగు శ్రీహరి భగవానుడు ఆ నీ పౌత్రుని అభేదజ్ఞానము (ఏ కాంతభక్తి) చే సంతోషించగలడు.
స వై మహాభాగవతో మహాత్మా
మహానుభావో మహతాం మహిష్ఠః ।
ప్రవృద్ధభక్త్యా హ్యనుభావితాశయే
నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి ॥
ఆ బాలకుడు గొప్ప భగవద్భక్తుడు కాగలడు. ఆతడు విశాలమగు హృదయము గలవాడై, గొప్ప ప్రభావశీలియై, గొప్పవారిలో కెల్లా గొప్పవాడుగా వెలుగొందగలడు. ఆతడు అతిశయించిన భక్తిచే పవిత్రమైన తన హృదయములో శ్రీహరిని నిలిపి దేహాభిమానమును అధిగమించగలడు.
అలంపటశ్శీలధరో గుణాకరో హృష్టః పరర్ధ్యా వ్యథితో దుఃఖితేషు। అభూతశత్రుర్జగతశ్శోకహర్తా నైదాఘికం తాపమివోడురాజః ॥
జితేంద్రియుడగు ఆతనియందు చక్కని శీలము, సకలసద్గుణ ములు నివాసము చేయును. ఇతరులు అభివృద్ధిని చేందినపుడు ఆతడు చూచి ఆనందించును. కాని, ఇతరులు దుఃఖముననుభవించుచుండగా చూచి ఆతడు కూడ భేదమును పొందును. ఆతడు అజాతశత్రువు కాగల డు. వేసవికాలపు తాపమును చంద్రుడు తొలగించినట్లుగా, ఆతడు జనుల శోకమును బాపగలడు.
అంతర్బహిశ్చామలమబ్జనేత్రం
స్వపూరుషేచ్ఛానుగృహీతరూపమ్ ।
పౌత్రస్తవ శ్రీలలనాలలామం
ద్రష్టా స్ఫురత్కుండలమండితాననమ్ ॥
స్వచ్చమైనవాడు, పద్మమువంటి కన్నులు గలవాడు అగు శ్రీహరి తన భక్తుల కోరికననుసరించి అవతారములనెత్తుచుండును. ఆయన లక్ష్మీ దేవియొక్క శోభను కూడ తన దివ్యరూపముచే ఇనుమడింపజేయుచుండును. మెరిసే కుండలములు ఆయన ముఖమునకు అలంకారములై ఒప్పారును. అట్టి శ్రీహరిని నీ మనుమడు తన హృదయములో మాత్రమే గాక సర్వజగత్తునందు (అధిష్ఠానరూపముగా) దర్శించగలడు.
మైత్రేయ ఉవాచ ।
శ్రుత్వా భాగవతం పౌత్రమమోదత దితిర్బృశమ్ ।
పుత్రయోశ్చ వధం కృష్ణాద్విదిత్వాఽఽసీన్మహామనాః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధేచతుర్దశోऽధ్యాయః ॥
తన మనుమడు గొప్ప భగవద్భక్తుడు కాగలడని విని దితి చాల సంతోషించెను. అంతేగాక, తన ఇద్దరు పుత్రులు శ్రీహరి భగవానునిచే వధించబడెదరని తెలుసుకొని, ఆమె చాల ఉత్సాహమును పొందెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో
పదునాలుగవ అధ్యాయము ముగిసినది (14).
Summary of chapter 14 of the Bhāgavata Mahā Purana is as follows:
Maitreya narrates the origin of the demonic race, describing how Diti, overwhelmed by intense passion, approached her husband Sage Kaśyapa at an inauspicious evening twilight hour reserved for the worship of Lord Shiva. Although Kaśyapa warned her of the ill-omened timing, she insisted on union, leading Kaśyapa to prophesy that she would bear two formidable demonic sons who would terrorize the cosmos until slain by the Supreme Lord.