భాగవత మహా పురాణము
23 - దేవహూతి కర్దముల విహారము
మైత్రేయ ఉవాచ :
పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిమింగితకోవిదా ।
నిత్యం ఫర్యచరత్ప్రీత్యా భవానీప భవం ప్రభుమ్ ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- తల్లిదండ్రులు వెళ్లిన తరువాత పతివ్రతయగు దేవహూతి భర్తయొక్క ఇంగితమును నేర్పుగా తెలుసు కుంటూ, పార్వతి శివప్రభుని వలె, ఆయనకు ప్రేమతో నిత్యము పరిచర్యను చేసెను.
విశ్రంభేణాత్మశోచేన గౌరవేణ దమేన చ ।
శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోః ॥
విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమఘం మదమ్ ।
అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాంసమతోషయత్ ॥
ఆమె చనువు అంతఃకరణశుద్ది ఆదరము ఇంద్రియజయము సేవా భావము ప్రేమ మధురమగు వాక్కు అనే గుణములను కలిగియుండెను. ఆమె కామము, దంభము, ద్వేషము, లోభము, పాపము, గర్వము అనువా టిని పరిత్యజించెను. ఆమే తేజశ్శాలియగు కర్దముని సావధాను గాలై ప్రయ త్నపూర్వకముగా నిత్యము సేవించి సంతోష పెట్టెను.
స వై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతామ్ ।
దైవాద్గరీయసః పత్యురాశాసానాం మహాశిషః ॥
కాలేన భూయసా క్షామాం కర్శితాం ప్రతచర్యయా ।
ప్రేమగద్గదయా వాచా పీడితః కృపయాబ్రవీత్ ॥
మనుపుత్రియగు ఆ దేవహూతీ దైవముకంటే గొప్పవాడగు భర్తను అనుసరించుచుండెను. ఆమె ఆ భర్తనుండి గొప్ప మనోరథములనాకాంక్షిం చెను. ఆమె చిరకాలము వ్రతానుష్ఠానముచే క్లేశమును పొంది చిక్కియుండెను. దేవర్షులలో శ్రేష్ఠుడగు ఆ కర్దముడు ఆమెను చూచి దుఃఖితుడై, దయ కలిగి బొంగురు వోయిన కంఠముతో ప్రేమపూర్వకముగా ఆమెతో నిట్లనెను.
కర్దమ ఉవాచ :
తుష్టాహమద్య తవ మానవి మానదాయాః ।
శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా !
యో దేహినామయమతీవ సుహృత్స్వదేహో
నావేక్షితస్సముచితః క్షపితుం మదర్థే ॥
కర్దముడిట్లు పలికెను --- ఓ మనుపుత్రీ! నీవు ఇతరులకు ఇచ్చే మర్యాద గొప్పది. నీ ఉత్తమమగు సేవ, అన్నిటినీ మించిన భక్తి నాకు ఈనాడు సంతోషమును కలిగించినది. నీ ఈ కొనియాడదగిన దేహమును నీవు నా సేవ కొరకై ఉపేక్ష జేసి క్షీణింప జేసినావు. సకల ప్రాణులకు దేహము చాల ప్రియమైనది గదా!
యే మే స్వధర్మనిరతస్య తపస్సమాధి-
విద్యాత్మయోగవిజితా భగవత్ప్రసాదాః ।
తానేవ తే మదను సేవనయావరుద్ధాన్ దృష్టిం
ప్రపశ్య వితరామ్యభయానశోకాన్ ॥
నేను స్వధర్మమునందు నిష్ఠ గలవాడనై చిత్తమును ఏకాగ్రము చేసి తపస్సును, ధ్యానమును, ఉపాసనను చేసి, భగవంతుని అనుగ్రహ రూపములగు విభూతులను (మహిమలను) సంపాదించితిని. వాటి వలన లభించే దీవ్యభోగములయందు భయము గానీ, శోకము గాని లేదు. నన్ను నిరంతరముగా సేవించిన నీకు కూడ అవి వశమైనవి. నేను నీకు దివ్యదృ ష్టిని ఇచ్చెదను. నీవు వాటిని చూడుము.
అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ-
విభ్రంశితార్థరచనాః కిమురుక్రమస్య ।
సిద్ధాసి భుంక్ష్వ విభవాన్నిజధర్మదోహాన్
దివ్యాన్న రైర్దురధిగాన్నృపవిక్రియాభిః ॥
స్వర్గము మొదలగు ఇతరభోగములెన్ని ఉన్నా, అవి సర్వశక్తిమం తుడగు శ్రీహరియొక్క కనుబొమల ముడివడుటచే వాటి యోజనలు అన్నియు వినష్టమగును. కాలముయొక్క ప్రభావము ముందు అవి యెంత టీవి? నీవు నీ పాతివ్రత్యధర్మమునందు సిద్ధురాలవైనావు. ఆ ధర్మము నీకు దివ్యములగు భోగములను సంపాదించి పెట్టును. మేము ధనము అధికా రము గలవారము అని విర్రవీగే మానవులు ఈ భోగములను పొందలేరు. అట్టి భోగములను నీవు అనుభవించుము.
ఏవం బ్రువాణమబలాభిలయోగమాయా-
విద్యావిచక్షణమవేక్ష్య గతాధిరాసీత్ ।
సంప్రశ్రయప్రణయవిహ్వలయా గిరేషద్-
వ్రీడావలోకవిలసద్ధసీతాననాకహ ॥
కర్దముడు అన్ని యోగశక్తులయందు విద్యలయందు నిపుణుడు. ఆయన ఈ విధముగా మాటలాడుటను గని అమాయకురాలగు ఆ దేవ హూతికి మనస్సులోని వ్యథ తొలగిపోయెను.ఆమె ముఖము కొంచెము సిగ్గుతో కూడిన చూపులతో మరియు చిరునవ్వుతో ప్రకాశించుచుండెను. వినయముతో, ప్రేమతో బొంగురు వోయిన కంఠముతో ఆమె ఇట్లనెను.
దేవహూతిరువాచ :
రాద్దం బత ద్విజవృషైతదమోఘయోగ-
మాయాధిపే త్వయి విభో తదవైమి భర్తః ।
యస్తేభ్యధాయి సమయస్సకృదంగసంగో
భూయాద్గరీయసి గుణః ప్రసవస్సతీనామ్ ॥
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీకు అమోఘ ములగు యోగశక్తులపై ఆధిపత్యము గలదు. నీవు సిద్ధపురుషుడవని నేను ఎరుగుదును. ఓ ప్రభూ! నీవు నా భర్తవు. వివాహసమయములో సంతాన మును గురించి నీవు మాటను ఇచ్చియుంటివి. కావున, మనమిద్దరము కలిసి సుఖించాలని నా కోరిక. పతివ్రతలకు శ్రేష్టుడగు భర్తతో సంతాన మును పొందుటయే గొప్ప లాభము.
తత్రేతికృత్యముపశిక్ష యథోపదేశం
యేనైష మే కర్శితో తిరిరంసహత్మా ।
సిద్ద్యేత తే కృతమనోభవధర్షితాయా
దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ ॥
ఓ ప్రభూ! నీవు శాస్తోపదేశమునతిక్రమించకుండగా మన విహార మునకు కావలసిన సాధనసామగ్రిని సంపాదించుము. నిన్ను చూచుచున్న నా హృదయమును మన్మథుడు పీడించుచున్నాడు. నీతో రమించవలెననే కోరిక అధికముగా నున్ననూ, నా ఈ దేహము కృశించి దీనముగా నున్నది. ఈ దేహము విహారయోగ్యమగునట్లు అనుగ్రహించుము. మన విహారము నకు యోగ్యమైన భవనమును గురించి కూడ విచారించుము.
మైత్రేయ ఉవాచ :
ప్రియాయాః ప్రియమన్విచ్చన్ కర్దమో యోగమాస్థితః ।
విమానం కామగం క్షత్తస్తర్హ్యేవావిరచీకరత్ ॥
ఓ విదురా! కర్దముడు ప్రియురాలికి ప్రియమును చేయగోరి, వెంటనే అదే సమయములో యోగశక్తిని చేపట్టి, యథేచ్చగా, సంచరించే విమానమును ఆవిర్భవింప జేసెను.
సర్వకామదుఘం దివ్యం సర్వరత్నసమన్వితమ్ ।
సర్వర్ధ్యుపచయోదరం మణిస్తం భైరుపస్కృతమ్ ॥
ఆ దివ్యమగు విమానము కోరికలనన్నింటినీ తీర్చును. అన్ని శ్రేష్ఠ వస్తువులతో కూడియున్న ఆ విమానమునందు అన్ని సంపదలు ఒకదానిని మించి మరియొకటి ఉన్నవి. అది మణిమయమగు స్తంభములచే అలంక రింపబడి యున్నది.
దివ్యోపకరణోపేతం సర్వకాలసుఖావహమ్ ।
పట్టికాభిః పతాకాభిర్విచిత్రాభిరలంకృతమ్ ॥
దివ్యమగు సాధనములతో కూడియున్న ఆ విమానము అన్ని కాల ములలో సుఖమును కలిగించును. దానికి రంగు రంగుల జెండాలు, పతా కలు అలంకరించబడినవి.
స్రగ్భిర్విచిత్రమాల్యాభిర్మంజుశింజత్ షడంఘ్రిభిః । దుకూలక్షౌమకౌశేయైర్నానావస్త్రైర్విరాజితమ్ ॥
మాలలు కట్టదగిన రంగు రంగుల పుష్పముల మాలలతో ఆ విమానము అలంకరించబడెను. ఆ మాలల చుట్టూ తుమ్మెదలు ఎగురుతూ మధురముగా ధ్వని చేయుచుండెను. ఆ విమానములో రకరకముల నూలు నార మరియు పట్టు వస్త్రములు సమృద్ధిగా నుండెను.
ఉపర్యుపరి విన్యస్తనిలయేషు పృథక్ పృథక్ ।
క్షిప్తైః కశిపుభిః కాంతం పర్యంకవ్యజనాసనైః ॥
ఆ విమానములో అంతస్తులు ఒకదానిపై నొకటి నిర్మించబడి యున్నవి. వాటిలో మెత్తలు, శయ్యలు, గాలిని వీచే సాధనములు, ఆసనములు వేర్వేరుగా అమర్చబడి చాల సుందరముగా నుండెను.
తత్ర తత్ర వినిక్షిప్తనానాశిలోపశోభితమ్ ।
మహామరకతస్థల్యా జుష్టం విద్రుమవేదిభిః ॥
దానిలో అక్కడక్కడ అనేకవిధముల అందమైన శిల్పములు చెక్క బడియున్నది. అది ఇంద్రనీలమాణిక్యములు పొదిగిన చదరపు నేలతో మరియు పగడములు పొదిగిన అరుగులతో శోభిల్లుచుండెను.
ద్వాస్సు విద్రుమదేహల్యా భాతం వజ్రకటవత్ ।
శిఖ రేష్వింద్రనీలేషు హేమకుంభైరధిశ్రీతమ్ ॥
ద్వారముల కడపలకు పగడములు, తలుపులకు వజ్రములు పొదు గబడినవి. భవనముల అగ్రములయందు ఇంద్రనీలమణులు పొదగబడి, బంగరు కలశములు స్థాపించబడినవి.
చక్షుష్మత్పద్మరాగాగ్యైర్వజభిత్తిషు నిర్మితైః ।
జుష్టం విచిత్రవైతానైర్మహార్హైర్హేమతోరణేః ॥
ఆ భవనములలో వజ్రముల గోడలయందు పొదిగిన కెంపులు కన్నులవలె భాసించుచున్నవి. ఆ విమానము మేలుకట్టుల సమూహము లతో మరియు బంగరు తోరణములతో కూడియున్నది.
హంసపారావతవ్రాతైస్తత్ర తత్ర నికూజితమ్ ।
కృత్రిమాన్ మన్యమానైస్స్వానధిరుహ్యాధిరుహ్య చ ॥
ఆ భవనములలో వివిధపక్షుల శిల్పములు గలవు. హంసలు పావు రములు వాటిని చూచి తమ జాతి పక్షులేనని భావించి వాటితో ఆటలాడు టకు నిరంతరముగా ప్రయత్నిస్తూ గట్టిగా కూయుచున్నవి.
విహారస్థానవిశ్రామసంవేశప్రాంగణాజిరైః ।
యథోపజోషం రచితైర్విస్మాపనమివాత్మనః ॥
దానిలో అవసరమునకు సరిపోవునట్లుగా విహరించే స్థలములు, విశ్రాంతిగా కూర్చుండే స్థలములు, పరుండే గదులు, వాకిళ్లు, ముంగిళ్లు ఏర్పాటు చేయబడినవి. ఆ విమానమును చూచి, కర్దముడు కూడ ఆశ్చర్య పడునా యన్నట్లు ఉన్నది.
ఈదృగ్గృహం తత్పశ్యంతీం నాతిప్రీతేన చేతసా ।
సర్వభూతాశయాభిజ్ఞః ప్రావోచత్కర్ధమస్స్వయమ్ ॥
ఇట్టి ఈ గృహమును చూచి దేవహూతి పెద్ద ప్రీతిని పొందలేదు. కర్దముడు సకలప్రాణుల మనస్సులలోని విషయములను గ్రహించగల యోగి. ఆయన తానే ఆమెను మాటలలోనికి దింపి ఇట్లనెను.
నిమజ్జ్యాస్మిన్ హ్రదే భీరు విమానమిదమారుహ ।
ఇదం శుక్లకృతం తీర్థమాశిషాం యాపకం నృణామ్ ॥
ఓ భయస్వభావము గల దేవహూతీ! ఈ సరస్సులో మునిగి ఈ విమానమునెక్కుము. ఈ సరస్సును స్వయముగా శ్రీహరియే తన ఆనంద బాష్పములతో నిర్మించెను. దీనియందు స్నానమును చేసిన మానవులకు మనోరథములీడేరును.
సా తద్భర్తుస్సమాదాయ వచః కువలయేక్షణా ।
సరజం బిభ్రతీ వాసో వేణీభూతాంశ్చ మూర్ధజాన్ ॥
అంగం చ మలపంన సంఛన్నం శబలస్తనమ్ ।
ఆవివేశ సరస్వత్యాస్సరశ్శివజలాశయమ్ ॥
కలువ కన్నుల దేవహూతి పాతబడిన చీరను దాల్చియుండెను. ఆమె జుట్టు జడలు కట్టెను. పాలిపోయిన ఆమె శరీరము మట్టి కొట్టుకొని యుండెను. ఆమె భర్త మాటను అంగీకరించి, పవిత్రమగు జలములతో నిండియున్న ఆ సరస్వతీనదికి చెందిన బిందుసరస్సును ప్రవేశించెను.
సాంతస్సరసి వేశ్మస్థాశ్శతాని దశ కన్యకాః ।
సర్వాః కిశోరవయసో దదర్శోత్పలగంధయః ॥
తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచు; ప్రాంజలయః స్త్రియః ।
వయం కర్మకరీస్తుభ్యం శాధి నః కరవామ కిమ్ ॥
ఆ యువతులు ఆమెను చూచి వెంటనే లేచి చేతులను జోడించి నమస్కరించి ఇట్లు పలికిరి --- మేము నీ సేవకురాండ్రము. మమ్ములనాదే శించుము. ఇప్పుడు మేము నీకు ఏమి చేయవలెను?
స్నానేన తాం మహార్హేణ స్నాపయిత్వా మనస్వినీమ్ ।
దుకూలే నిర్మలే నూత్నే దదురస్యై చ మానవాః ॥
మర్యాదనెరిగిన ఆ యువతులు అభిమానవతియగు ఆ దేవహూ తిని శ్రేష్ఠమగు సుగంధద్రవ్యములతో కూడిన స్నానమును చేయించి, ఆమెకు నాజూకైన కొత్త నూలు వస్త్రములను ఇచ్చిరి.
భూషణాని పరార్ధ్యాని వరీయాంసి ద్యుమంతి చ ।
అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవమ్ ॥
వారామెకు అమూల్యములైన కాంతిమంతములగు శ్రేష్టమగు ఆభ రణములను, అన్ని రసములతో కూడియున్న ఆహారమును, అమృతము వంటి మత్తెక్కించే పానీయమును కూడ ఇచ్చిరి.
అథాదర్శే స్వమాత్మానం స్రగ్విణం విరజాంబరమ్ ।
విరజం కృతస్వస్త్యయనం కన్యాభిర్బహుమానితమ్ ॥
అప్పుడు ఆ దేవహూతి తనను తాను అద్దములో చూచుకొనెను. ఆమెకు మాలను స్వచ్చమగు వస్త్రములను ధరించిన స్వచ్చమగు దేహము దర్శనమిచ్చేను. ఆ కన్యలు ఆమెకు మంగళాలంకారములను ధరింప జేసి గొప్ప సేవలను చేసిరి.
స్నాతం కృతశిరస్స్నానం సర్వాభరణభూషితమ్ ।
నిష్కగ్రీవం వలయినం కూజత్కాంచననూపురమ్ ॥
ఆమె మామూలు స్నానము మాత్రమే గాక, తల స్నానమును చేసెను. తరువాత ఆమె ఆభరణములనన్నింటినీ అలంకరించుకొనెను. ఆమె మెడలో పదకము, చేతులకు గాజులు శోభను చేకూర్చేను. ఆమె పాదములయందలి బంగరు అందెలు గణగణలాడుచుండెను.
శ్రోణ్యోరధ్యస్తమా కాంచ్యా కాంచన్య బహురత్నయా ।
హారేణ చ మహార్హేణ రుచకేన చ భూషితమ్ ॥
ఆమె నడుమునందు అనేకరత్నములు పొదిగిన బంగరు మొల నూలును దాల్చెను. ఆమె గొప్ప విలువైన హారముతో మరియు కుంకుమ మొదలగు మంగళద్రవ్యములతో అలంకరించుకొనెను.
సుదతా సుభ్రువా శ్లక్ష్ణస్నిగ్దాపొంగేన చక్షుషా ।
పద్మకోశస్పృధా నీలైరలకైశ్చ లసన్ముఖమ్ ॥
ఆమే ముఖము అందమగు పలు వరుసలతో, అందమగు కనుబొ మలతో, మధురమైన ప్రేమతో నిండిన కడగంటి చూపుతో, పద్మపు మొగ్గ లతో పోటీపడే కన్నులతో మరియు నల్లని కురులతో ప్రకాశించేను.
యదా సస్మార ఋషభమృషీణాం దయితం పతిమ్ ।
తత్ర చాస్తే సహ స్త్రీభిర్యత్రా స్తే స ప్రజాపతిః ॥
ఆమెకు అప్పుడు మహర్షివర్యుడు, తనకు ప్రియుడు అగు భర్త గుర్తుకు వచ్చెను. ఆమె ఆ కన్యలతోబాటు ఆ కర్దమ ప్రజాపతి ఉన్నచోటనే నిలిచియుండెను.
భర్తుః పురస్తాదాత్మానం స్త్రీసహస్రవృతం తదా ।
నిశామ్య తద్యోగగతిం సంశయం ప్రత్యపద్యత ॥
అప్పుడామె వేయిమంది స్త్రీలతో సేవింపబడే తనను చూచు కొని, భర్తయొక్క యోగశక్తికి విస్మయమును పొందెను.
స తాం కృతమలస్నానాం విభ్రాజంతీమపూర్వవత్ ।
ఆత్మనో బిభ్రతీం రూపం సంవీతరుచిరస్తనీమ్ ।
విద్యాధరీసహస్రణ సేవ్యమానాం సువాససమ్ ।
జాతభావో విమానం తద్రోహయదమిత్రహన్ ॥
కామక్రోధాది శత్రువులను జయించిన ఓ విదురా! దేవహూతి స్నానమును చేసి, తన సహజరూపములోనున్నదే అయిననూ, ఇదివరకే న్నడూ లేదాయన్నట్లు స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. ఆమె చక్కని చీరను దాల్చి భుజములచుట్టూ చక్కగా కప్పుకొనెను. ఆమెను వేయి మంది విద్యాధరకన్యలు చుట్టువారి సేవించుచుండిరి. ఆమెను చూడగానే కర్దముని హృదయములో ప్రేమ ఉదయించెను. ఆయన ఆమెను ఆ విమా నమునెక్కించెను.
తస్మిన్నలుప్తమహిమా ప్రియయానురక్తో
విద్యాధరీభిరుపచీర్ణవపుర్వమానే ।
బభ్రాజ ఉత్కచుముద్గణవానపీచ్యః
తారాభిరావృత ఇవోడుపతిర్నభఃస్థః ॥
కర్దముడు ప్రియురాలియందు అనురాగము గలవాడే ఆయిననూ, ఆయన యోగమహిమకు లోటు లేదు. ఆ విమానములో ఆయనను విద్యా ధరస్త్రీలు సేవించుచుండిరి. కలువల సమూహములను వికసింపజేసి ఆకా శములో తారలచే చుట్టువారబడియున్న అతిసుందరుడగు చంద్రుని వలె ఆయన ప్రకాశించెను.
తేనాష్ట్రలోకపవిహారకులాచలేంద్ర-
ద్రోణీష్వనంగసఖమారుతసౌభగాసు ।
సిద్దైర్నుతో ద్యుధునిపాతశివస్వనాసు
రేమే చిరం ధనదవల్లలనావరూధీ ॥
సిద్ధులచే స్తుతించబడే కర్దముడు ఆ విమానముపై నెక్కి, విద్యాధ రస్త్రీలు సేవించుచుండగా, మేరుపర్వతబిలములయందు చిరకాలము కుబేరుని వలె రమించెను. పైనుండి పడే గంగానదియొక్క మంగళకర మగు ధ్వనిగల ఆ స్థానములో మన్మథమిత్రుడగు వాయువు మెల్లగా సుఖక రముగా వీచుచుండును. కావుననే, అచట ఎనమండుగురు లోకపాలకులు విహరించుచుందురు.
వైశ్రంభకే సురసనే నందనే పుష్పభద్రకే ।
మానసే చైత్రరథ్యే చ స రేమే రామయా రతః ॥
ప్రీతుడైయున్న ఆ కర్దముడు ప్రియురాలితో గూడి, వైఢంభకము సురసనము నందనము పుష్పభద్రకము చైత్రరథము అనే దేవోద్యానముల యందు, మరియు మానససరోవరమునందు రమించెను.
భ్రాజిష్ణునా విమానేన కామధేన మహీయసా ।
వైమానికానత్యశేత చరన్ లోకాన్ యథానిలః ॥
ధగధగలాడుతూ యథేచ్చగా సంచరించే ఆ గొప్ప విమానములో కర్దముడు లోకములను వాయువువలె సంచరిస్తూ, విమానములలో సంచ రించే దేవతలను దాటిపోయెను.
కిం దురాపాదనం తేషాం పుంసాముద్దామచేతసామ్ ।
యైరాశ్రితస్తీర్థపదశ్చరణీ వ్యసనాత్యయః ॥
కష్టములను గట్టెక్కించే పవిత్రములగు భగవానుని పాదములను శరణు పొంది ధైర్యముతో జీవించు వారలకు సంపాదించ శక్యము కానిది ఏముండును?
ప్రేక్షయిత్వా భువో గోలం పత్న్యై యావాన్ స్వసంస్థయా ।
బహ్వాశ్చర్యం మహాయోగీ స్వాశ్రమాయ న్యవర్తత ॥
అనేకద్వీపములు మొదలగు రచనతో అనేకములగు అద్భుత ములు గల భూగోళమునంతనూ మహాయోగియగు కర్దముడు తన భార్యకు చూపించి, తన ఆశ్రమమునకు మరలి వచ్చెను.
విభజ్య నవధాత్మానం మానవీం సురతోత్సుకమ్ ।
రామాం నిరమయన్ రేమే వర్షపూగాన్ముహూర్తవత్ ॥
కర్దముడు తొమ్మిది రూపములను దాల్చినవాడై, విహారమునందు ఉత్సాహము గల మనుపుత్రియగు ప్రియురాలిని అధికముగా రమింపజేసే ను. ఈ విధముగా వారు రమించుచుండగా అనేకసంవత్సరముల కాలము ముహూర్తము వలె గడిచిపోయెను.
తస్మిన్ విమాన ఉత్కృష్టాం శయ్యాం రతికరీం శ్రితా ।
న చాబుధ్యత తం కాలం పత్యాపీడ్యేన సంగతా ॥
దేవహూతి కూడ ఆ విమానములో ప్రీతికరమగు గొప్ప శయ్యను అధిష్ఠించి అతిసుందరుడగు తన భర్తతో కూడియున్నదై గడచి పోయిన కాలమును గుర్తించనే లేదు.
ఏవం యోగానుభావేన దంపత్యో రమమాణయోః ।
శతం వ్యతీయుశ్శరదః కామలాలసయోర్మనాక్ ॥
ఈ విధముగా కామలాలసులగు ఆ దంపతులు యోగశక్తిచే రమిం చుచుండగా, వంద శరత్కాలములు (సంవత్సరములు) కొద్ది కాలమువలె గడిచిపోయినవి.
తస్యామాధత్త రేతస్తాం భావయన్నాత్మనాత్మవిత్ ।
నోధా విధాయ రూపం స్వం సర్వసంకల్పవిద్విభుః ॥
సర్వసమర్థుడగు కర్దముడు ఆత్మజ్ఞాని, దేవహూతి సంకల్పము లన్నీ తెలిసినవాడు. ఆయన ఆమెను తన అర్ధాంగిగా భావన చేసి, తన రూపమును తొమ్మిది రూపములుగా విభాగము చేసి, ఆమెయందు సంతానమును పొందెను.
అతన్నే సుషువే సద్యో దేవహూతిః స్త్రియః ప్రజాః ।
సర్వాస్తాశ్చారుసర్వాంగ్యో లోహితోత్పలగంధయః ॥
కావుననే, ఆ దేవహూతి వెనువెంటనే తొమ్మండుగురు అమ్మాయిలను కనెను. అన్ని అవయవములలో సుందరముగానున్న వారందరు ఎర్ర కలువల సుగంధమును కలిగియుండిరి.
పతిం సా ప్రవ్రజిష్యంతం తద్వాలక్ష్యాశతీ సతీ ।
స్మయమానా విక్లబేన హృదయేన విదూయతా ॥
లిఖంత్యధోముఖీ భూమిం పదా నఖమణిశ్రియా ।
ఉవాచ లలితాం వాచం నిరుధ్యాశ్రుకలాం శనైః ॥
అప్పుడు సన్న్యసించుటకు సంసిద్ధుడైన భర్తయగు కర్దముని చూచి, సుందరి పతివ్రతయగు ఆ దేవయాని హృదయము కల్లోలితమై దుఃఖముతో నిండిపోయెను. కాని, ఆమె ముఖముపై చిరునవ్వును చేరుగ నీయలేదు. ఆమె క్రిందకు చూస్తూ మణులవలె ప్రకాశించే గోళ్లు గల పాద ముతో భూమిపై వ్రాస్తూ, కన్నీటి బిందువులను ఆపుకొని, మెల్లగా మృదువుగా ఇట్లు పలికెను.
దేవహూతిరువాచ ।
సర్వం తద్భగవాన్మహ్యముపోవాహ ప్రతిశ్రుతమ్ ।
అథాపి మే ప్రపన్నాయా అభయం దాతుమర్హసి ॥
దేవహూతి ఇట్లు పలికెను - పూజ్యుడవగు నీవు నాకు వివాహకాల ములో ఇచ్చిన మాట ప్రకారముగా సర్వమును సమకూర్చినావు. కాని, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నాకు నీవు అభయమునీయ దగుదువు.
బ్రహ్మన్ దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయస్సమాః ।
కశ్చిత్ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనమ్ ॥
ఓ మహర్షీ! నీవు నీ కుమార్తెలకు తగిన భర్తలను వెదుకవలెను. పైగా, నీవు సన్న్యసించి వనమునకు వెళ్లగా నన్ను ఓదార్చే ఒక పిల్లవాడు మనకు కలుగవలెను.
ఏతావతాలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో ।
ఇంద్రియార్థప్రసంగేన పరిత్యక్తపరాత్మనః ॥
ఓ ప్రభూ! ఇంద్రియములకు శబ్దాదివిషయములయందు దృఢమగు ఆసక్తి ఉండుటచే, నేను పరమాత్మను ఉపాసించలేదు. ఆ విధముగా . ఇంతకాలము నాకు వ్యర్థమైనది.
ఇంద్రియార్థేషు సజ్జంత్యా ప్రసంగస్త్వయి మే కృతః ।
అజానంత్యా పరం భావం తథాప్యస్త్వభయాయ మే ॥
నేను ఇంద్రియభోగములయందాసక్తి గలదాననే పరమార్థమును తెలియలేకపోతిని. ఆ విధముగా నాకు నీయందు దృఢమగు సంగము ఏర్పడినది. అయిననూ, నాకు సంసారభయమునుండి విముక్తి కలుగుగాక!
సంగో యస్సంసృతేరేతురసత్సు విహితోధియా ।
స ఏవ సాధుషు కృతో నిస్సంగత్వాయ కల్పతే ॥
అవివేకి దుష్టులతో సంగము చేసి సంసారములో పడును. అదే సంగమును సత్పురుషులతో చేసినచో, సంగ (సంసార) విముక్తి కలుగును.
నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే ।
న తీర్థపదసేవాయై జీవన్నపి మృతో హి సః ॥
ఈ సంసారములో ఎవని కర్మ ధర్మము కొరకు గాని, వైరాగ్యము కొరకు గాని, భగవానుని సేవ కొరకు గాని సమర్థము కాదో, వాడు జీవించి యున్ననూ మరణించినవానితో సమానమే.
సాహం భగవతో నూనం వంచితా మాయయా దృఢమ్ ।
యత్త్వాం విముక్తిదం ప్రాప్య న ముముక్షేయ బంధనాత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే త్రయోవింశోధ్యాయః ॥
భగవానుని మాయ నన్ను నిశ్చయముగా వంచించినది. ఏలయన గా, నీ అనుగ్రహముచే నేను జ్ఞానమును తద్ద్వారా మోక్షమును పొందే అవ కాశము ఉన్ననూ, ఈ సంసారబంధమునుండి విముక్తిని పొందలేకపోతిని.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 23 of the Bhāgavata Mahā Purana is as follows:
Devahūti serves her husband Kardama Muni for many years with unreserved devotion, humility, and selflessness, completely neglecting her own physical health and comfort. Recognizing her immense sacrifice and purity of heart, Kardama uses his yogic power to manifest a celestial flying mansion equipped with every luxury and restores Devahūti to supreme beauty, enjoying marital life with her and fathering nine saintly daughters.