భాగవత మహా పురాణము
21 - కర్దమునకు భగవానుడు వరమునిచ్చుట
విదుర ఉవాచ ।
స్వాయంభువస్య చ మనోర్వంశః పరమసమ్మతః ।
కథ్యతాం భగవన్ యత్ర మైథునేనైధిరే ప్రజాః ॥
విదురుడిట్లు పలికెను ఓ పూజ్యా! స్వాయంభువ వంశమును మహాత్ములు కూడ ఆదరించేదరు. స్త్రీపురుష సంయోగరూపముగా ఆ వంశము పెరిగి పెద్దది ఆయెను. ఆ వంశమును గురించి చెప్పుము.
ప్రియవ్రతోత్తానపాదౌ సుతౌ స్వాయంభువస్య వై ।
యథాధర్మం జుగుపతుస్సప్తద్వీపవతీం మహీమ్ ॥
స్వాయంభువ మనువుయొక్క కుమారులను ప్రియవ్రత-ఉత్తాన పాదులు ఏడు ఖండములతో కూడియున్న ఈ భూమండలమును ధర్మము నతిక్రమించకుండగా పాలించిరి గదా!
తస్య వై దుహితా బ్రహ్మన్ దేవహూతీతి విశ్రుతా ।
పత్నీ ప్రజాపతేరుక్తా కర్దమస్య త్వయానఘ ॥
ఓ మహర్షీ! నీవు గొప్ప పుణ్యాత్ముడవు. స్వాయంభువ మనువు యొక్క కుమార్తె దేవహూతియని ప్రసిద్ధి గాంచినది. ఆమె కర్దమ ప్రజాప తియొక్క భార్యయని నీవు చెప్పితివి.
తస్యాం స వై మహాయోగీ యుక్తాయాం యోగలక్షణైః ।
ససర్జ కతిధా వీర్యం తన్మే శుశ్రూషవే వద ॥
ఆ కర్దమ ప్రజాపతి గొప్ప యోగి. ఆయన భార్యయగు దేవహూతి యందు యమము మొదలగు యోగలక్షణములు గలవు. వారిద్దరికి సంతానము ఎందరు? నేనీ విషయమును వినగోరుచున్నాను. చెప్పడు.
రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రహ్మణస్సుతః ।
యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాం చ మానవీమ్ ॥
ఓ మహర్షీ! పూజ్యుడగు రుచి ప్రజాపతి, బ్రహ్మపుత్రుడగు దక్షుడు కూడ మనువుయొక్క కుమార్తెలను భార్యలుగా పొంది, ప్రాణులను సృష్టించిన విధానమును గురించి చెప్పుము.
మైత్రేయ ఉవాచ ।
ప్రజాస్సృజేతి భగవాన్ కర్దమో బ్రహ్మణోదితః ।
సరస్వత్యాం తపస్తే పే సహస్రాణాం సమా దశ ॥
ప్రజలను సృష్టించుమని బ్రహ్మగారు పూజ్యుడగు కర్దమునకు చెప్పగా, ఆయన పదివేల సంవత్సరములు సరస్వతీ నదీతీరమునందు తపస్సును చేసెను.
తతస్సమాధియుక్తేన క్రియాయోగేన కర్ధమః ।
సమా పేదే హరిం భక్త్యా ప్రపన్నవరదాశుషమ్ ॥
ఆ తపస్సులో కర్దముడు చిత్తేకాగ్రముతో గూడిన పూజావిధానము ద్వారా శరణాగతులకు వరములనొసగే శ్రీహరిని భక్తితో ఆరాధించెను.
తావత్ప్రసన్నో భగవాన్ పుష్కరాక్షః కృతే యుగే ।
దర్శయామాస తం క్షత్తశ్శాబ్దం బ్రహ్మ దధద్వపుః ॥
ఓ విదురా! పుండరీకాక్షుడగు శ్రీహరి భగవానుడు అప్పటికి ప్రస న్నుడై కృతయుగారంభమునందు వేదప్రతిపాద్యమగు సచ్చిదానందరూప మును దాల్చి ఆ కర్దమునకు దర్శనమిచ్చెను.
స తం విరజమర్కాభం సీతపద్మోత్పలస్రజమ్ ।
స్నిగ్ధనీలాలకవ్రాతవక్త్రాబ్జo విరజోఽoబరమ్ ॥
కిరీటినం కుండలినం శంఖచక్రగదాధరమ్ ।
శ్వేతోత్పలక్రీడనకం మనస్స్పర్శస్మితేక్షణమ్ ॥
విన్యస్తచరణాంభోజమంసదేశే గరుత్మతః ।
దృష్ట్వా ఖేఽవస్థితం వక్షఃశ్రియం కౌస్తుభకంధరమ్ ॥
సూర్యుని వలె నిర్మలముగా ప్రకాశించుచున్న శ్రీహరిని ఆ కర్దముడు చూచెను. ఆయన తెల్లని పద్మములు మరియు కలువల మాలను ధరించియుండెను. ఆయన ముఖపద్మము దట్టని నల్లని కేశసముదాయ ముతో, కిరీటముతో, కుండలములతో ప్రకాశించెను. స్వచ్చమగు వస్త్ర మును, దాల్చిన శ్రీహరి శంఖమును, చక్రమును, గదను, విలాస కొరకై . తెల్లని కలువను పట్టుకొనియుండెను. ఆయన చూపులు, చిరునవ్వు మన స్సునకు ఆనందమును కలిగించుచుండెను. ఆయన ఆకాశములో గరు త్మంతుని భుజములపై పద్మములవంటి పాదములను ఆన్చి యుండెను. ఆయన మెడలో కౌస్తుభమాణిక్యము, వక్షస్థలముపై లక్ష్మీదేవి ప్రకాశించిరి.
జాతహర్షోఽపతన్మూర్ధ్నా క్షితౌ లబ్దమనోరథః ।
గీరిస్త్వభ్యగృణాత్ప్రీతిస్వభావాత్మా కృతాంజలిః ॥
కర్దముని మనోరథము సఫలమగుటచే ఆతనికి హర్షము కలిగేను. ఆయనది ప్రేమయే స్వభావముగా గల హృదయము. ఆయన నేలపై శ్రీహరికి సాష్టాంగ నమస్కారమును చేసి, చేతులను జోడించి స్తుతించెను.
ఋషిరువాచ ।
జుష్టం బతాద్యాఖిలసత్త్వరా శేః
సాంసిధ్యమక్ ష్ణోస్తవ దర్శనాన్న: ।
యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః
ఆశాసతే యోగినో రూఢయోగాః ॥
కొనియాడదగిన ఓ శ్రీహరీ! ఆహా ! సంపూర్ణ సత్త్వగుణ నిధానమవగు నీ దర్శనము వలన నా కన్నులు సఫలమైనవి. భక్తులు అనేకజన్మలలో గొప్ప పుణ్యమును చేసుకొని, దాని ప్రభావముచే దృఢమగు జ్ఞానమును పొంది నిన్ను దర్శించుటకు ప్రార్థనలను చేయుచున్నారు.
యే మాయయా తే హతమేధసస్త్వత్-
పాదారవిందం భవసింధుపోతమ్ ।
ఉపాసతే కామలవాయ తేషాం
రాసేశ కామాన్నిరయేఽపి యే స్యుః ॥
ఓ ఈశ్వరా! నీ మాయచే నశింప జేయబడిన బుద్ధి గల జనులు సంసారసముద్రమును దాటించే నావవంటి నీ పాదపద్మములను అల్పము లగు కామనల కొరకై ఆరాధించెదరు. నీవు వారికి ఆ కామనలను నెరవేర్చేదవు. ఇంద్రియసుఖము నరకములో కూడ లభించును.
తథా స చాహం పరివోడుకామ: ।
సమానశీలాం గృహమేధధేనుమ్ ।
ఉపేయివాన్మూలమశేషమూలం
దురాశయః కామదుఘాంఘ్రిపస్య ॥
నేను కూడ అట్టి కలుషితమైన చిత్తము గలవాడనే. గృహాశ్రమము నకు గృహిణి కామధేనువు. నేను నా స్వభావమునకు అనురూపమగు యువతిని వివాహమాడ గోరుచున్నాను. నీవు భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షమవు. పురుషార్థములన్నింటికీ మూలమగు నీ పాదమూలమును నేను శరణు వేడుచున్నాను.
ప్రజాపతేస్తే వచసాధీశ తంత్యా
లోకః కిలాయం కామహతోఽనుబద్దః ।
అహం చ లోకానుగతో వహామి
బలిం చ శుక్లానిమిషాయ తుభ్యమ్ ॥
ఓ సర్వేశ్వరా! నీవు పరిశుద్దుడవు. ప్రజలను పాలించే నీవు వేదము అనే ఉపదేశమును మానవులకు అందించినావు. కామనలచే హతు లైన మానవలోకము కర్మశాస్త్రము అనే త్రాటిచే కట్టివేయబడి యున్నది. నేను కూడ అదే లోకముననుసరిస్తూ, కాలస్వరూపుడవగు నిన్ను పూజాది కముతో ఆరాధించుచున్నాను.
లోకాంశ్చ లోకానుగతాన్ పశూంశ్చ।
హిత్వా శ్రితాస్తే చరణాతపత్రమ్ ।
పరస్పరం త్వద్గుణవాదసీధు-
పీయూషనిర్యాపితదేహధర్మాః ॥
నీ భక్తులు భోగపరాయణులగు జనులను, వారి అనుయాయు లను దూరముగా పెట్టి, తమలో తాము నీ గుణములను గానము చేయు చుందురు. ఆ గానముయొక్క మత్తెక్కించే మధురిమలో వారు దేహధర్మ ములగు ఆకలిదప్పికలను విస్మరించెదరు. వారు నీ పాదములు అనే ఛత్ర ఛాయను ఆశ్రయించేదరు.
న తేఽజరాక్ష భ్రమరాయురేషాం
త్రయోదశారం త్రిశతం షష్టిపర్వ ।
షణ్నేమ్యనంతచ్చది యత్త్రిణాభి
కరాలస్రోతో జగదాచ్చిద్య ధావత్ ॥
సంవత్సరము అనే నీ కాలచక్రము పరబ్రహ్మ అనే ఇరుసునందు తిరుగుచుండును. దానికి అధికమాసముతో కలుపుకొని పదమూడు ఆకులు గలవు. ఋతువులు అనే ఆరు కమ్మీలు గల ఆ చక్రముపై లెక్కలేనన్ని పత్రములు (సెకనులు, నిముషములు) చెక్కబడియున్నవి. నాలుగు మాస ముల కాలఖండములే మూడు నడిమి తూములుగా గల ఈ చక్రము తీవ్ర మగు వేగముతో పరుగెత్తుతూ జగత్తును తనతో వినాశము వైపునకు లాగు కొని పోవుచున్నది. కాని, అది నీ భక్తుల ఆయుర్దాయమును మాత్రము వ్యర్థము చేయలేకున్నది.
ఏకస్వయం సఞ్జతస్సిసృక్షయాఽ
ద్వితీయయాఽఽత్మన్నధియోగమాయయా ।
సృజస్యదః పాసి పునర్గ్రసిష్యసే
యథోర్ణనాభిర్భగవన్ స్వశక్తిభిః ॥
ఓ భగవానుడా! సృష్టికి పూర్వము నీవు ఒక్కడివే గలవు. నీకు సృష్టిని చేయవలెననే కోరిక కలిగెను. నీవే అధిష్టానముగా గల యోగ మాయ నీకంటే వేరుగా లేదు. సత్త్వరజస్తమోగుణములనే శక్తులను కలిగి యున్న ఆ యోగమాయ ద్వారా నీవు, సాలెపురుగు తననుండియే గూడును ప్రకటించే విధముగా, ఈ జగత్తును నీనుండియే సృష్టించి, పాలిం చుచున్నావు. మరల దానిని ప్రళయములో నీ లోనికే ఉపసంహరించెదవు.
నైతద్బతాధీశ పదం తవేప్సితం
యన్మాయయా నస్తనుషే భూతసూక్ష్మమ్ ।
అనుగ్రహాయాస్త్వపి యర్హి మాయయా
లసత్తులస్యా తనువా విలక్షితః ॥
ఓ సర్వేశ్వరా! ఆహా! నీవు మాయచే, శబ్దరూపరసస్పర్శగంధాత్మ కమగు భోగ్యజాతమును విస్తరింప జేసినావు. దానిని మాకు వరముగా నిచ్చుట నీకు సమ్మతము కాదు. అయినప్పటికీ, అది అంతతో గత్వా నాకు మోక్షరూపమగు నీ అనుగ్రహమునకే దారి తీయుగాక! ఏలయనగా, మాయచే పరిచ్చిన్నునిగా కన్పట్టే నీ తులసీమాలావిభూషితమైన రూపమును నేను కంటిని.
తం త్వానుభూత్యోపరతక్రియార్థం
స్వమాయయా వర్తితలోకతంత్రమ్ ।
నమామ్యభీక్ష్ణం నమనీయపాద-
సరోజమల్పీయసి కామవర్షమ్ ॥
నీవు నిషియ పరబ్రహ్మస్వరూపుడవు. నీకు కర్మలయందు గానీ, వాటి ఫలములయందు గాని అపేక్ష లేదు. అయిననూ, నీవు నీ మాయాశక్తిచే లోకవ్యవహారమును నడిపించుచున్నావు. నీ పాదపద్మ ములు నమస్కరించ దగినవి. నీవు అల్పుడగు నావంటి భక్తుడు చేసే చిన్న ఆరాధనకైననూ కోరికలను వర్షించేదవు. అట్టి నీకు పలుమార్లు నమస్కరిం చుచున్నాను.
ఋషిరువాచ ।
ఇత్యవ్యలీకం ప్రణుతోఽబ్జనాభస్తమాబభాషే వచసామృతేన ।
సుపర్ణపక్షోపరి రోచమానః ప్రేమస్మితోద్వీక్షణవిభ్రమద్బ్రూః ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను - ఈ విధముగా కర్దముడు నిష్కప టముగా గరుత్మంతుని రెక్కలపై ప్రకాశించుచున్న పద్మనాభుని స్తుతించే ను. ఆయన ప్రేమతో చిరునవ్వు నవ్వి తలను పైకెత్తి కనుబొమలను కదు పుతూ కర్దముని చూచి, అమృతమువంటి వాక్కుతో ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
విదిత్వా తవ చైత్యం మే పురైన సమయోజి తత్ ।
యదర్థమాత్మనియమైస్త్వయైవాహం సమర్చితః ॥
శ్రీ భగవానుడు ఇట్లు పలికెను --- నీ మనస్సులోని అభిప్రాయము నాకు తెలియును. దేని కొరకైతే నీవు శమదమాది మనోనియమములతో నన్ను నిశ్చయముగా ఆరాధించితివో, దాని ఏర్పాటును నేను. పూర్వమే చక్కగా చేసియున్నాను.
న వై జాతు మృషైవ స్యాత్ప్రజాధ్యక్ష మదర్హణమ్ ।
భవద్విధేష్వతితరాం మయి సంగృభితాత్మనామ్ ॥
ఓ ప్రజాపతీ! మనస్సును నాపై ఏకాగ్రము చేసి నన్ను పూజించే భక్తుల ఆ పూజ ఎన్నటికీ వ్యర్థము కానే కాదు. నీవంటి వారి విషయములో అసలే వ్యర్థము కాదు.
ప్రజాపతిసుతస్సమ్రాట్ మనుర్విఖ్యాతమంగలః ।
బ్రహ్మావర్తం యోఽధివసన్ శాస్తి సప్తార్ణవాం మహీమ్ ॥
బ్రహ్మగారి పుత్రుడగు స్వాయంభువ మనువు చక్రవర్తియై బ్రహ్మా వర్తమును రాజధానిగా చేసుకొని ఏడు సముద్రములతో గూడిన భూమిని శాసించుచున్నాడు. ఆయన సదాచారము లోకములో ప్రసిద్ధము.
స చేహ విప్ర రాజర్షిర్మహిష్యా శతరూపయా ।
ఆయాస్యతి దిదృక్షుస్త్వాం పరశ్వో ధర్మకోవిదః ॥
ఓ మహర్షీ! ధర్మజ్ఞుడు, రాజర్షియగు ఆ మనువు భార్యయగు శత రూపతో గూడి నిన్న చూడగోరి ఇచటకు ఎల్లుండి రాగలడు.
ఆత్మజామసితాపాంగీం వయశ్శీలగుణాన్వితామ్ ।
మృగయంతీం పతిం దాస్యత్యనురూపాయ తే ప్రభో ॥
ఆయన కుమార్తె నల్లని కన్నులు గల చిన్నది. ఆమె శీలము, గుణములు గొప్పవి. ఆమె యుక్తవయస్కురాలు. మను చక్రవర్తి అట్టి తన కుమార్తెను నీకు ఇచ్చి వివాహము చేయగలడు.
సమాహితం తే హృదయం యత్రేమాన్ పరివత్సరాన్ ।
సా త్వాం బ్రహ్మన్నృపవధూః కామమాశు భజిష్యతి ॥
ఓ మహర్షీ! గడచిన చాల సంవత్సరములనుండి భార్యను పొంద వలెననే ఆకాంక్ష నీ హృదయములో స్థిరముగా నుండెను. అట్టి రాజకన్య తొందరలోనే నీకు భార్యయై నిన్ను యథేచ్ఛగా సేవించగలదు.
యా త ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి ।
వీర్యే త్వదీయే ఋషయ ఆధాస్యంత్యంజసాఽఽత్మనః ॥
ఆ రాజకన్యయందు నీవు తొమ్మిదిమంది కుమార్తెలను కనగలవు. వారు సాక్షాత్తుగా మహర్డులకు భార్యలై వారి వలన సంతానమును బడయ గలరు.
త్వం చ సమ్యగనుష్ఠాయ నీదేశం మ ఉశత్తమః ।
మయి తీర్థకృతా శేషక్రియార్థో మాం ప్రపత్స్యసే ॥
శుద్దమగు అంతఃకరణము గల నీవు కూడా నా ఆదేశమును చక్కగా అనుష్ఠించి, సకలకర్మలను వాటి ఫలములతో సహా నాకు సమర్పించి, నన్ను పొందగలవు.
కృత్వా దయాం చ జీవేషు దత్త్వా చాభయమాత్మవాన్ ।
మయ్యాత్మానం సహ జగద్ధ్రక్ష్యస్యాత్మని చాపి మామ్ ॥
నీవు ఇంద్రియములను జయించి, ప్రాణులయందు దయను చూపుతూ, సకలప్రాణులకు అభయమునిచ్చే సన్న్యాసాశ్రమమును స్వీక రించెదవు. తనతో సహా ఈ జగత్తు అంతా పరమేశ్వరునియందే నిలిచియు న్నదనే జ్ఞానము నీకు కలుగగలదు. ఇంతేగాక, నన్ను సర్వమును ఆత్మ యందు, అనగా ఆత్మరూపముగా దర్శించగలవు.
సహాహం స్వాంశకలయా త్వద్వీర్యేణ మహామునే ।
తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యే తత్త్వసంహితామ్ ॥
ఓ మహర్షీ! నేను నీ భార్యయగు దేవహూతియందు ఇతరసంతాన ముతో బాటు నా అంశకళతో అవతరించి, తత్త్వముల స్వరూపమును వివరించే సాంఖ్యశాస్త్రమును బోధించగలను.
మైత్రేయ ఉవాచ ।
ఏవం తమనుభాష్యాథ భగవాన్ ప్రత్యగక్షజః ।
జగామ బిందుసరసస్సరస్వత్యా పరిశ్రితాత్ ॥
ఇంద్రియములు అంతర్ముఖములైనప్పుడు మాత్రమే శ్రీహరి దర్శనమిచ్చును, ఆ భగవానుడీ విధముగా కర్దమునితో సంభాషించి, తరు వాత సరస్వతీ నదిచే చుట్టువారబడియున్న ఆ బిందుసరస్సు వద్దనుండి తన లోకమునకు వెళ్లాను.
నిరీక్షతస్తస్య యయావ శేషసిద్ధేశ్వరాభిష్టుతసిద్ధమార్గః ।
ఆకర్ణయన్ పత్రరథేంద్రపక్షైరుచ్చారితం స్తోమముధీర్ణసామ ॥
శ్రీహరిని పొందే మార్గము (వైకుంఠ మార్గము, జ్ఞానమార్గము) ను సిద్ధపురుషులు అన్వేషించుచుందురు. గొప్ప సిద్దులందరు ఆ మార్గమును కొనియాడుచుందురు. అట్టి శ్రీహరి, కర్దముడు చూచుచుండగనే, గరుత్మం తుని రెక్కలనుండి వెలువడే సామగానమును, ఆయనచే ఉచ్చరించబడిన ఋగ్వేదమంత్రములను వింటూ, తన లోకమునకు వెళ్లాను.
అథ సంప్రస్థితే శుక్లే కర్దమో భగవానృషిః ।
ఆస్తే స్మ బిందుసరసి తం కాలం ప్రతిపాలయన్ ॥
శ్రీహరి తన లోకమునకు వెళ్లిన తరువాత పూజ్యుడగు - కర్దమ మహర్షి మనుచక్రవర్తి రాకను ప్రతీక్షిస్తూ బిందుసరస్సుయొక్క తీరమునం దలి తన ఆశ్రమమునందు ఉండెను.
మనుస్స్యందనమాస్థాయ శాతకౌంభపరిచ్చదమ్ ।
ఆరోప్య స్వాం దుహితరం సభార్యః పర్యటన్మహీమ్ ॥
మను చక్రవర్తి తన భార్య, కుమార్తె వెంట రాగా, బంగరు అలంకా రములతో కూడియున్న రథమునెక్కి భూమిని పర్యటించుచుండెను.
తస్మిన్ సుధన్వన్నహని భగవాన్ యత్సమాదిశత్ ।
ఉపాయాదాశ్రమపదం మునేశ్శాంతవ్రతస్య తత్ ॥
ఓ విదురా! కర్దమ మహర్షి తపోవ్రతమును పూర్తి చేసుకొని విశ్రాం తిగా నుండెను. శ్రీహరి భగవానుడు నిర్దేశించిన నాటికే మను చక్రవర్తి ఆ ఆశ్రమస్థానమునకు చేరుకొనెను.
యస్మిన్ భగవతో నేత్రాన్న్యపతన్నశ్రుబిందవః ।
కృపయా సంపరీతస్య ప్రపన్నేఽర్పితయా భృశమ్ ॥
తనను శరణు పొందిన కర్దముని చూడగానే శ్రీహరి భగవానుని హృదయము అతిశయించిన దయతో నిండిపోయెను. ఆయన కన్నుల నుండి నీటి బిందువులు జారి ఆ ఆశ్రమస్థానమునందు పడినవి.
తద్వై బిందుసరో నామ సరస్వత్యా పరిప్లుతమ్ ।
పుణ్యం శివామృతజలం మహర్షిగణసేవితమ్ ॥
కావుననే, ఆ స్థానమునకు బిందుసరస్సు అనే పేరు ప్రసిద్ధిని గాంచినది. పవిత్రమగు ఆ సరస్సు సరస్వతీనదిచే చుట్టువారబడి యున్న ది. దానిలోని శుభకరమగు జలము అమృతము వలె నుండును. మహర్షుల గణములు ఆ సరస్సును సేవించుచుండును.
పుణ్యద్రుమలతాజాఖైః కూజత్పుణ్యమృగద్విజైః ।
సర్వర్తుఫలపుష్పాఢ్యం వనరాజిశ్రియాన్వితమ్ ॥
పవిత్రములగు చెట్లు, తీగల గుంపులతో నిండియున్న ఆ ఆశ్రమ ములో పవిత్రములగు మృగములు, పక్షులు ధ్వనులను చేయుచున్నవి. అది తమంత తాముగా పుట్టి పెరిగిన చెట్ల వరుసలతో శోభిల్లుచుండెను. అన్ని ఋతువులకు చెందిన పువ్వులు, పండ్లు అచట సమృద్ధిగా నుండెను.
మత్తద్విజగణేరుష్టం మత్తభ్రమరవిభ్రవమ్ ।
మత్తబరినటాటోపమాహ్వయన్మత్తకోకిలమ్ ॥
మదించిన తుమ్మెదల విలాసలు గల ఆ ఆశ్రమము మత్తెక్కిన పక్షుల గుంపులతో కిలకిలలాడుచుండెను. అచట నెమళ్లు హడావుడిగా నాట్యములను చేయుచుండగా, కోకిలలు తమ కూతలతో జనులను ఆహ్వా నించుచుండెను.
కదంబచంపకాశోకకరంజబకులాసనైః ।
కుందమందారకుటజైశ్చూతపోతైరలంకృతమ్ ॥
కడిమి, సం పెగ, అశోకము, పొగడ, వేగి, కోడి సె, లేత మామిడి అనే చెట్లతో, మల్లె మందారము అనే మొక్కలతో ఆ ఆశ్రమము శోభిల్లెను.
కారండవైః ప్లవైర్హం సైః కురరైర్జలకుక్కుటైః ।
సార సైశ్చక్రవాకైశ్చ చకోరైర్వల్గు కూజితమ్ ॥
కన్నెలేళ్లు, బాతులు, హంసలు, పెన్నడ పులుగులు, నీటి కోళ్లు, బెగ్గురు పక్షులు, జక్కవ పిట్టలు, వెన్నెల పులుగులు అచట మనోహరముగా కూయుచుండెను.
తథైవ హరిణైః క్రోడైశ్శ్వావిద్గవయకుంజరైః ।
గోపుచ్ఛైర్హరిభిర్మర్కైర్నకులైర్నాభిభిర్వృతమ్ ॥
అదే విధముగా అచట ఇర్రిలు, అడవి పందులు, ఏదు పందులు, గురుపోతులు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, కోతులు, 'ముంగిసలు, కస్తూరి మృగములు గలవు.
ప్రవిశ్య తత్తీర్థవరమాదిరాజస్సహాత్మజః ।
దదర్శ మునిమాసీనం తస్మిన్ హుతహుతాశనమ్ ॥
ఆదిరాజగు మనువు కుమార్తెతో కలిసి ఆ గొప్ప పుణ్యక్షేత్రమును చేరి ఆశ్రమమునకు వెళ్లెను. అచట అగ్నులను వ్రేల్చి విశ్రాంతిగా కూర్చుని యున్న కర్దమ మహర్షిని ఆయన చూచెను.
విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజా చిరమ్ ।
నాతిక్షామం భగవతస్స్నిగ్ధాపాంగావలోకనాత్ ।
తద్వ్యాహృతామృతకలాపీయూషశ్రవణేన చ ॥
చిరకాలము తపస్సును చేయుటచే కర్దముని శరీరము ప్రకాశించు చుండెను. శ్రీహరి భగవానుడు ఆయనను ప్రేమతో నిండిన కటాక్షముతో చూచెను. పైగా, ఆయన శ్రీహరియొక్క అమృతమువలె మధురమైన పలుకులను వినియుండెను. కావుననే, ఆయన మరీ చిక్కినట్లుగా లేడు.
ప్రాంశుం పద్మపలాశాక్షం జటిలం చీరవాససమ్ ।
ఉపసంసృత్య మలినం యథార్హణమసంస్కృతమ్ ॥
కర్దముడు పొడవైనవాడు. ఆయన కన్నులు పద్మపత్రములను బోలియుండెను. జటాధారియగు ఆయన నారబట్టలను ధరించెను. ఆయన సాన పెట్టబడని కారణముగా ప్రకాశించని గొప్ప రత్నము వలె నుండెను. మనువు దగ్గరకు వెళ్లి ఆయనను దర్శించెను.
అథోటజముపాయాతం నృదేవం ప్రణతం పురః ।
సపర్యయా పర్యగృహ్ణాత్పృతినంద్యానురూపయా ॥
అపుడు కర్దముడు తన పర్ణశాలకు వచ్చి నమస్కరించి ఎదుట నిల బడిన మహారాజును అభినందించి తగిన విధముగా సపర్యను అందించి సత్కరించెను.
గృహీతార్హణమాసీనం సంయతం ప్రీణయన్మునిః ।
స్మరన్ భగవదాదేశమిత్యాహ శ్లక్ ష్ణయా గిరా ॥
మను చక్రవర్తి సత్కారమును స్వీకరించి కూర్చుండి శ్రద్దగా ఆల కించుచుండెను. కర్దమ మహర్షి భగవానుని ఆదేశమును గుర్తు చేసుకొని మధురమగు వచనములతో నిట్లు పలికెను. ఆయన మాటలను విని మను మహారాజు సంతోషించెను.
నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణాయ తే ।
వధాయ చాసతాం యస్త్వం హరేశ్శ క్తిర్హి పాలినీ ॥
ఓ ప్రభూ! శ్రీహరియొక్క పాలనశక్తి నీ రూపములో నున్నది. నీ ఈ సంచారము వలన దుష్టులు శిక్షింపబడి, సత్పురుషులకు రక్షణ లభిం చును. ఇది నిశ్చయము.
యోర్కేంద్వ గ్నీంద్రవాయూనాం యమధర్మప్రచేతసామ్ ।
రూపాణి స్థాన ఆధత్సే తస్మై శుక్లాయ తే నమః ॥
సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు, ధర్ముడు మరియు వరుణుడు అనే దేవతల రూపములను నీవు ధరించుచు న్నావు. నీవు విశుద్ధ విష్ణు స్వరూపుడవు. నీకు నమస్కారము.
న యదా రథమాస్థాయ జైత్రం మణిగణార్పితమ్ ।
విస్ఫూర్జచ్చండకోదండో రథెన త్రాసయన్నఘాన్ ॥
స్వసైన్యచరణక్షుణ్ణం వేపయన్మండలం భువః ।
వికర్షన్ బృహతీం సేనాం పర్యటస్యంశుమానివ ॥
తదైవ సేతవస్సర్వే వర్ణాశ్రమనిబంధనాః ।
భగవద్రచితా రాజన్ భిద్యేరన్ బత దస్యుభిః ॥
ఓ రాజా! నీవు మణుల గణములు పొదిగిన జయప్రదమగు రథ మునెక్కి, ధ్వనించే భయంకరమగు ధనస్సును ధరించి కదిలినప్పుడు, నీ రథమును చూచినంత మాత్రాన పాపులు భయపడెదరు. నీవు సూర్యుని వలె పెద్ద సేనను నడిపిస్తూ సాగినప్పుడు, నీ సైనికుల పాదముల తొక్కి డికి భూమండలము కంపించును. నీవీ విధముగా పర్యటించనినాడు, వెంటనే వర్ణాశ్రమనిర్వహణకు ఆలంబనమైన భగవన్నిర్మితములగు ధర్మ మర్యాదలు అన్నియు దుష్టులచే చెల్లాచెదరు చేయబడును సుమా!
అధర్మశ్చ సమేధేత లోలుపైర్వ్యంకు శైర్నృభిః ।
శయానే త్వయి లోకోయం దస్యుగ్రస్తో వినంక్ష్యతి ॥
నీవు ప్రమత్తుడవైనచో, భోగలాలసులగు జనులకు అడ్డు ఆపు ఉండదు. వారి కారణముగా అధర్మము వర్ధిల్లును. దుష్టులగు జనులచే కబ ళించి వేయబడి ఈ లోకము నశించును.
అథాపి పృచ్చే త్వాం వీర యదర్థం త్వమిహాగతః ।
తద్వయం నిర్వ్యలీకేన ప్రతిపద్యామ హే హృదా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే ఏకవింశోధ్యాయః ॥
ఓ వీరా! అయినప్పటికీ, నేను నిన్ను అడుగుచున్నాను. నీవు ఇచ టకు వచ్చిన ప్రయోజనమును నేను నిష్కపటమగు హృదయముతో స్వీక రించెదను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 21 of the Bhāgavata Mahā Purana is as follows:
Maitreya describes the severe austerities performed by the great progenitor Kardama Muni on the banks of the Bindu-sarovara Lake to obtain a suitable wife and fulfill his duty toward cosmic creation. Pleased by Kardama's single-minded devotion, Lord Vishṇu appeared before him on Garuda and blessed him that Emperor Svāyambhuva Manu would arrive to offer his pious daughter Devahūti in marriage, promising that the Lord Himself would incarnate as their son.