భాగవత మహా పురాణము
29 – భక్తిలోని మర్మములు - కాల మహిమ
దేవహూతిరువాచ ।
లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ ।
స్వరూపం లక్ష్యతేకమీషాం యేన తత్ప్రమార్థికమ్ ॥
యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తతచక్షతే ।
భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో ॥
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! మహత్తు మొదలగు తత్త్వములు, ప్రకృతి, పురుషుడు అనువాటి లక్షణమును సాంఖ్యశాస్త్రపద్ధ తిలో నీవు నాకు చెప్పితివి. ఈ లక్షణములను బట్టి వారి పరమార్థ స్వరూ పమును తెలియవచ్చును. ఈ జ్ఞానము భక్తియోగమునకు సాధనమని పెద్దలు చెప్పుచున్నారు గదా! నాకు నీవు ఆ భక్తియోగముయొక్క మార్గ మును విస్తారముగా చెప్పుము.
విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్ ।
ఆచక్ష్వ జీవలోకస్య వివిధా మమ సంసృతీః ॥
ఓ భగవన్! అట్టి వర్ణనము వలన సాధకుడు సర్వమునందు తొల గిన ఆసక్తి గలవాడగును. జననమరణప్రవాహరూపమగు ఈ సంసార ములో జీవులు పొందే వివిధగతులను కూడ నాకు చెప్పుము.
కాలస్యేశ్వరరూపస్య పరేషాం చ పరస్య తే ।
స్వరూపం బత కుర్వంతి యద్ధెతోః కుశలం జనాః ॥
లోకేశ్వరులగు బ్రహ్మాదులను కూడ నియమించే కాలము సర్వే శ్వరుడవగు నీకంటే భిన్నముగా లేదు. దాని ప్రభావము చేతనే, జనులు పుణ్యములను చేయుచున్నారు. దాని స్వరూపమును నాకు చెప్పుము.
లోకస్య మిథ్యాభిమతేరచక్షుషః
చిరం ప్రసుప్తస్య తమస్యనాశ్రయే ।
శ్రాంతస్య కర్మస్వనువిద్ధయా ధియా
త్వమావిరాసీః కిల యోగభాస్కరః ॥
మానవుడు మిథ్యారూపములగు దేహాదులయందు ఆత్మబుద్ధి గలవాడై జ్ఞానవిహీనుడై అజ్ఞానకార్యమగు సంసారమనే చీకటిలో చిరకాల మునుండి నిద్రించుచున్నాడు. ఆతడు కర్మలయందు ఆసక్తమైన బుద్దిచే అలసి సొలసి యుండగా, జ్ఞానసూర్యుడవగు నీవు ఆవిర్భవించితివి..
మైత్రేయ ఉవాచ ।
ఇతి మాతుర్వచః శ్రోక్ష్ణం ప్రతినంద్య మహామునిః ।
ఆబభాషే కురుశ్రేష్ఠ ప్రీతస్తాం కరుణార్దితః ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- కురువంశ శ్రేష్ఠుడవగు ఓ విదురా! తల్లి పలికిన ఈ మధుగమగు వచనములను విని కపిల మహా ముని సంతోషించెను. ఆయన హృదయము కరుణతో ద్రవించెను. ఆయన ఆమెను అభినందించి ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
భక్తియోగో బహువిధో మార్గైర్బామిని భావ్యతే ।
స్వభావగుణమార్గేణ పుంసాం భావో విభిద్యతే ॥
అమ్మా! భక్తియోగములో మహాత్ములు అనేకభేదములను అంగీక రించుచున్నారు. స్వభావము, గుణములు అను అంశములను బట్టి మాన వుల అభిప్రాయములు వేర్వేరుగా నున్నవి.
అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా ।
సంరంభీ భిన్నదృగ్భావం మయి కుర్యాత్స తాపసః ॥
తాను, పరాయి అనే భేదమే సత్యమని భావించే ఏ మానవుడు ఇతరులకు హింసను గాని, లేక తాను గొప్ప ధర్మాత్ముడననే బడాయిని గాని, ఇతరుల మేలును చూడలేని తనమును గాని సంకల్పించి నాయందు భక్తిని చేసినచో, అట్టి కోపిష్ఠి తామసభక్తుడనబడును.
విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా ।
అర్చాదావర్చయేద్యో మాం పృథగ్భావస్స రాజసః ॥
ఎవడైతే తనకు నాకు భేదమును స్వీకరించి, ఇంద్రియభోగములు కీర్తి సంపద మొదలగు వాటిని పొందాలనే ఆకాంక్షతో ప్రతిమ మొదలగువా టియందు నన్ను ఆరాధించునో, అట్టివాడు రాజసభక్తుడనబడును.
కర్మనిర్హరముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణమ్ ।
యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావస్స సాత్త్వికః ॥
పాపక్షయము కొరకు గాని, లేదా కర్మను పరమేశ్వరునకు అర్పిం చుట కొరకు గాని, లేదా కర్మ విధించబడినది గనుక చేయవలసినదే అని గాని ఎవడైతే పూజాదికమును భేదభావనతో చేయునో, అట్టి భక్తుడు సాత్త్వి కభక్తుడనబడును.
మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే ।
మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోఽoబుదౌ ॥
లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యుదాహృతమ్ ।
అహైతుక్యవ్యవహితా యా భక్తిః పురుషోత్తమే ॥
నా గుణములను విన్నంత మాత్రాన భక్తుని మనస్సు, గంగాప్రవా హము సముద్రములో కలిసే తీరున, సకలప్రాణుల బుద్దిగుహయందు సాక్షిరూపముగానుండే నాయందు నిరంతరముగా సంచరించును. భక్తునకు నాయందు గల ఆ ప్రేమకు ఫలాభిలాష కారణము కాదు. భక్తుడు నన్ను తన ఆత్మకంటే అభిన్నముగా దర్శించును. అట్టి భక్తి నిర్గుణభక్తియోగ ముయొక్క లక్షణము.
సాలోక్యసార్ష్టిసామీప్యసారూప్యైకత్వమప్యుత ।
దీయమానం న గృష్టాంతి వినా మత్సేవనం జనాః ॥
నిర్గుణభక్తులు కేవలము నా సేవయందు మాత్రమే ప్రీతిని కలిగి యుందురు. సాలోక్యము (శ్రీహరితో ఒకే లోకమునందు ఉండుట), సార్షి (శ్రీహరితో సమానమగు ఐశ్వర్యమును కలిగియుండుట), సామీప్యము (శ్రీహరికి సమీపములోనుండుట), సారూప్యము (శ్రీహరితో సమానమగు రూపమును కలిగియుండుట), సాయుజ్యము (శ్రీహరిలో ఐక్యమగుట) అనే ఫలములను ఇచ్చిననూ వారు తీసుకోరు.
స ఏవ భక్తియోగాఖ్య ఆత్యంతిక ఉదాహృతః ।
యేనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే ॥
అట్టి భక్తియోగమే పరమపురుషార్థమని చెప్పబడినది. దాని వలన సాధకుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు సంసారమునుండి విముక్తుడై నాలో ఐక్యమగును.
నిషేవితేనానిమిత్తేన స్వధర్మేణ మహీయసా।
క్రియాయోగేన శస్తేన నాతిహింసేణ నిత్యశః ॥
మద్ధిష్ణ్యదర్శనస్పర్శపూజాస్తుత్యభివందనైః ।
భూతేషు మద్భావనయా సత్త్వేనాసంగమేన చ ॥
మహతాం బహుమానేన దీనానామనుకంపయా ।
మైత్రార్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ ॥ ఆధ్యాత్మికానుశ్రవణాన్నామసంకీర్తనాచ్చ మే ।
ఆర్జవేనార్యసం గేన నిరహంక్రియయా తథా ॥
మద్ధర్మజో గుణెరేతైః పరిసంశుద్ధ ఆశయః ।
పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్రగుణం హి మామ్ ॥
సాధకుడు శ్రేష్ఠమగు స్వధర్మమును ఫలతృష్ణ లేకుండగా అను ష్ఠించవలెను. నిత్యము పువ్వులను కోయుట మొదలగువాటికంటే అధిక మగు హింసకు తావులేని ప్రశస్తమైన కర్మయోగముననుష్ఠించవలెను. నా మూర్తిని దర్శించి స్పృశించి పూజించి స్తుతించి నమస్కరించవలెను. సకల ప్రాణులయందు ఆత్మరూపముగానున్న నన్ను దర్శించవలెను. ధైర్య ముతో వైరాగ్యమును కలిగియుండవలెను. పెద్దలను ఆదరించవలెను. దీనులపై దయను చూపవలెను. తన సాటివారితో మైత్రిని నెరపవలెను. అహింస, సత్యము, అస్తేయము (పరధనమును కోరకుండుట), బ్రహ్మచ ర్యము, అపరిగ్రహము (భోగముల వెనుక పడకుండుట) అను యమముల ను, శౌచము (ఆంతర బాహ్యములయందు శుద్ది), సంతుష్టి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరశరణాగతి అనే నియమములను పాటించవలెను. అధ్యాత్మశాస్త్రమును శ్రవణము చేయవలెను. నా నామములను కీర్తించవ లెను. ఋజుస్వభావము కలిగి సత్పురుషులతో సంగమును చేయవలెను. అహంకారమును విడనాడవలెను. నా ధర్మములను (భాగవతధర్మము లను) అనుష్టించే సాధకునకు ఈ గుణములచే మనస్సు చాల పరిశుద్దమై, నా గుణములను వింటూనే తేలికగా నాయందు లగ్నమగును.
యథా వాతరథో ఘ్రాణమావ్రుంక్తె గంధ ఆశయాత్ ।
ఏవం యోగరతం చేత ఆత్మానమవికారి యత్ ॥
పరిమళము తన స్థానమునుండి గాలి ద్వారా ముక్కునకు తాకు ను. అదే విధముగా భక్తియోగముచే విశుద్ధమైన మనస్సు తన మూలమగు ఆత్మను చేరును (ఆత్మయందు విలీనమగును).
అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితస్సదా ।
తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతే ఽర్చావిడంబనమ్ ॥
నేను సకలప్రాణులలో నిత్యము ఆత్మరూపుడనై నిలిచియున్నాను. అట్టి నన్ను కాదని త్రోసిపుచ్చి ఎవడైతే ప్రతిమయందు నన్ను పూజించునో, ఆ పూజ అపహాస్యము, మోసము తక్క మరియొకటి కాదు."
యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరమ్ ।
హిత్వార్చాం భజతే మౌఢ్యాద్భస్మన్యేవ జుహోతి సః ॥
నేను సకలప్రాణులలో ఆత్మరూపునిగానుండి దేహేంద్రియాదు లను నియమించుచున్నాను. అట్టి నన్ను ఉపేక్ష చేసి ప్రతిమను మాత్రమే సేవించువాడు చేసే పూజ బూడిదలో చేసిన హోమము వంటిది మాత్రమే.
ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః ।
భూతేషు బద్ధవైరస్య న మనశ్శాంతిమృచ్ఛతి ॥
భేదమే యథార్థమని భావించి గర్వియై ఇతరప్రాణులయందు వైర మును బూని ద్వేషించు వ్యక్తి ఆ ప్రాణుల దేహములయందు ఆత్మరూపు డనై యున్న నన్నే ద్వేషించుచున్నాడు. వానికి మనశ్శాంతి లభించదు.
అహముచ్చావచైర్దవ్యైః క్రియయోత్పన్నయాన ఘే ।
నైవ తుష్యేవార్చితోఽర్చాయాం భూతగ్రామావమానినః ॥
ఒకడు అనేకవిధముల సామగ్రితో విధివిధానముగా నన్ను మూర్తి యందు ఆరాధించవచ్చును. కాని ఆతడు ప్రాణిసమూహమును అవమా నించువాడైనచో, ఆ పూజ ఎంత గొప్పదైనా, నన్ను సంతోష పెట్టదు.
అర్చాదావర్చయేత్తావదీశ్వరం మాం స్వకర్మకృత్ ।
యావన్న వేద స్వహృది సర్వభూతేష్వవస్థితమ్ ॥
మానవుడు తన కర్తవ్యమును చేస్తూ, తన హృదయములో సకల ప్రాణులలో ఈశ్వరుడనగు నేనే నిలిచియున్నాననే సత్యమును గుఎచనం తవరకు మూర్తి మొదలగు వాటియందు నన్ను పూజించవలెను.
ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరమ్ ।
తస్య భిన్నదృశో మృత్యుర్విదధే భయముల్బణవ్ ॥
భేదమును దర్శించే స్వభావము గల వ్యక్తి తనకు ఇతరులకు మధ్యలో, తనకు పరమాత్మకు మధ్యలో భేదమును చూచును. ఆ విధ ముగా అల్పమైననూ భేదమును భావన చేయువానికి మృత్యురూపుడనగు నేను తీవ్రమగు భయమును కలిగించెదను..
అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయమ్ ।
అర్హయేద్దానమానాభ్యాం మై త్య్రా భిన్నేన చక్షుషా ॥
నేను సకలప్రాణులలో ఆత్మరూపముగా నివసించియున్నాను. కావున భక్తుడు సకలప్రాణులయందు సమదృష్టిని కలిగియుండవలెను. తన కంటే గొప్పవారిని సత్కరించవలెను. తనకంటే తక్కువ 'వారికి దానమును చేయవలెను. తనతో సమానమైన వారితో మైత్రిని నేరపవలెను. ఇట్లు చేసిన చో, అది నన్ను పూజించినట్లే యగును.
జీవాః శ్రేష్టా హ్యజీవానాం తతః ప్రాణభృతశ్శుభే ।
తతస్సచిత్తాః ప్రవరాస్తత శ్చేoద్రియవృత్తయః ॥
ఓ శుభస్వరూపురాలా! ప్రాణము లేనివాటికంటే ప్రాణము గల చెట్లు మొదలగునవి గొప్పవి. వాటికంటే ఉచ్చ్వాసనిశ్శ్వాస గల జంతు వులు గొప్పవి. వాటికంటే మనస్సు గలవి గొప్పవి. వాటికంటే ఇంద్రియవ్యా పారములు గలవి గొప్పవి.
తత్రాపి స్పర్శవేదిభ్యః ప్రవరా రసవేదినః ।
తేభ్యో గంధవిదః శ్రేష్ఠస్తతశ్శబ్దవిదో వరాః ॥
ఇంద్రియవ్యాపారములు గల ప్రాణులలో కేవలము స్పర్శజ్ఞా నము మాత్రమే గల చెట్ల కంటే రసమును కూడ గ్రహించే చేపలు మొదల గునవి గొప్పవి. వాటికంటే గంధమును కూడ గ్రహించే తుమ్మెద మొదలగునవి గొప్పవి. వాటికంటే శబ్దమును కూడ గ్రహించే పాములు మొదలగు నవి గొప్పవి.
రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతోదతః ।
తేషాం బహుపదాః శ్రేష్టాశ్చతుష్పాదస్తతో ద్విపాత్ ॥
వాటికంటే రూపభేదమును కూడ గుర్తించే కాకులు మొదలగునవి గొప్పవి. వాటికంటే క్రింద పైన కూడ దంతములు గల కోతులు మొదలగు నవి గొప్పవి. పాదములు లేని సర్పము మొదలగు ప్రాణులకంటె అనేకపా దములు గల తుమ్మెద మొదలగునవి గొప్పవి. వాటికంటే నాలుగు పాద ములు గల పశువులు, వాటికంటే రెండు పాదములు గల మానవుడు గొప్పవారు.
తతో వర్ణాశ్చ చత్వార స్తేషాం బ్రాహ్మణ ఉత్తమః ।
బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్థజ్ఞోఽభ్యధికస్తతః ॥
మానవులలో నాలుగు వర్ణములు గొప్పవి. వారిలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. బ్రాహ్మణులలో కూడ వేదమునెరింగినవాడు గొప్ప. వేదార్థము తెలిసినవాడు వానికంటే గొప్ప.
అర్థజ్ఞాత్సంశయచ్ఛేత్తా తతః శ్రేయాన్ స్వకర్మకృత్ ।
ముక్తసంగస్తతో భూయానదోగ్ధ ధర్మమాత్మనః ॥
కేవలము వేదార్థము తెలిసినవానికంటే దానిలోని సంశయము లను తీర్చువాడు గొప్ప. వానికంటే వేదము చెప్పిన విధముగా స్వధర్మ మునాచరించువాడు గొప్ప. వానికంటె తన ధర్మమును నిష్కామముగా ఆచరిస్తూ సంసారమునందు ఆసక్తిని విడిచినవాడు గొప్పవాడు.
తస్మాన్మయ్యర్పితాశేషక్రియార్థాత్మా నిరంతరః ।
మయ్యరితాత్మనః పుంసో మయి సన్న్యస్తకర్మణః ।
న పశ్యామి పరం భూతమకర్తుస్సమదర్శనాత్ ॥
అట్టి ముక్తసంగునికంటె నాయందే అన్ని కర్మలను వాటి ఫలము లను మాత్రమే గాక దేహాది సంఘాతమును కూడ సమర్పించి నాతో అభే దమును దర్శించే జ్ఞాని గొప్పవాడు. జ్ఞాని నాయందు తన బుద్ధిని, కర్మ లను సమర్పించి, తాను అకర్తృ-ఆత్మస్వరూపుడై సర్వత్ర ఈశ్వరుని దర్శిస్తూ ఉండును. ఈ సృష్టిలో జ్ఞానికంటే గొప్ప ప్రాణి నాకు కానరాదు.
మనసైతాని భూతాని ప్రణమేద్భహు మానయన్ ।
ఈశ్వరో జీవకలయా ప్రవిష్ణో భగవానితి ॥
సర్వేశ్వరుడగు శ్రీహరి భగవానుడే ఈ ప్రాణులలో జీవరూప ముగా ప్రవేశించి యున్నాడు. కావున, భక్తుడు సకలప్రాణులను అధికముగా ఆదరిస్తూ మనస్సులో వాటికి నమస్కరించవలెను.
భక్తియోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరితః ।
యయోరేకత రేణైవ పురుషః పురుషం వ్రజేత్ ॥
ఓ మనుపుత్రీ! నేను నీకు భక్తియోగమును, అష్టాంగయోగమును కూడ చెప్పితిని. సాధకుడు ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని సాధన చేసినా, ఆ పరమపురుషుని పొందును.
ఏతద్భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః ।
పరం ప్రధానం పురుషం దైవం కర్మవిచేష్టితమ్ ॥
ప్రకృతి, దానికి అతీతుడగు పురుషుడు, జీవుని కర్మల ఫలమునకు ఆశ్రయమగు అదృష్టరూపమగు దైవము అనునవి పరబ్రహ్మ పరమాత్మ భగవానుని రూపములే.
రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే ।
భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయమ్ ॥
భగవానుని మాయాశక్తి విభిన్నరూపములు గల ఈ విశ్వముగా , ఉదయించుటకు కారణమైన భగవానుని అద్బుతప్రభావమునకే కాలమని . పేరు. మహత్తు మొదలగు తత్త్వముల అభిమాని దేవతలతో సహా భేదదృ ష్టిగల ప్రాణులు ఈ కాలమునకు భయపడుచుందురు.
యోఽoతః ప్రవిశ్య భూతాని భూతైరత్యభిలాశ్రయః ।
స విష్ణ్వాఖ్యోఽజ్ఞోఽసౌ కాలః కలయతాం ప్రభుః ॥
సర్వమునకు ఆశ్రయమగు కాలమే ప్రాణుల లోపల ప్రవేశించి పంచభూతముల ద్వారానే వాటిని నశింపజేయును. జగత్తును శాసించే బ్రహ్మాదులను కూడ కాలము శాసించును. ఆ కాలము యజ్ఞఫలదాత యగు విష్ణువే అని చెప్పబడినది.
న చాస్య కశ్చిద్దయితో న ద్వేష్యో న చ బాంధవః ।
ఆవిశత్యప్రమత్తోఽ సౌ ప్రమత్తం జనమంతకృత్ ॥
ఈ కాలమునకు ఒకడు ప్రియుడని గాని, మరియొకడు శత్రువని గాని లేరు. దానికి బంధువులు కూడ లేరు. అది అందరినీ సంహరించును. సర్వమును నశింపజేసే ఈ కాలము నిత్యము జాగరూకమై యుండును. ఈ కాలము భోగములలో మునిగి ఒళ్లు మరిచియున్న జనుని ప్రవేశించి నశింపజేయును.
యద్బయాద్వాతి వాతో యం సూర్యస్తపతి యద్భయాత్ ।
యదయాద్వర్షతే దేవో భగణో భాతి యద్భయాత్ ॥
కాలరూపుడగు భగవానుని భయము వలననే గాలి వీచుచున్నది; సూర్యుడు ఎండలు కాయుచున్నాడు; ఇంద్రుడు వర్షించుచున్నాడు; నక్షత్ర ములు ప్రకాశించుచున్నవి.
యద్వనస్పతయో భీతా లతాశ్చాషధిభిస్సహ ।
స్వే స్వే కాలేఽభిగృహ్ణoతి పుష్పాణి చ ఫలాని చ ॥
చెట్లు, మొక్కలు, తీగలు కాలమునకు భయపడి తమ తమ సమ యము వచ్చినప్పుడు పువ్వులను, పండ్లను ఆవిర్భవింప జేయుచున్నవి.
స్రవంతి సరితో భీతా నోత్సర్పత్యుదధిర్యతః ।
అగ్నిరింధే సగిరిభిర్భూర్న మజ్జతి యద్భయాత్ ॥
కాలమునకు భయపడి నదులు ప్రవహించుచున్నవి; సముద్రము చెలియలికట్టను దాటకున్నది; అగ్ని మండుచున్నది; పర్వతములతో కూడిన భూమి నీటిలో మునిగిపోకుండ నున్నది.
నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః ।
లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతమ్ ॥
కాలముయొక్క ఆజ్ఞకు లోబడి ఈ ఆకాశము ప్రాణులకు స్థానము నొసగుచున్నది. అటులనే, మహత్తత్త్వము కాలమునకు వశవర్తియై అహంకారరూపమైన తన శరీరమును ఏడు ఆవరణలతో కూడిన బ్రహ్మాండము రూపములో విస్తరించుచున్నది.
గుణాభిమానినో దేవాస్వర్గాదిష్వస్య యద్భయాత్।
వర్తంతేఽనుయుగం యేషాం వశ ఏతచ్చరాచరమ్ ॥
కాలమునకు భయపడియే రజస్సత్త్వతమోగుణముల అభిమాను లగు బ్రహ్మవిష్ణురుద్రులు ప్రతి కల్పమునందు క్రమముగా ఈ జగత్తు యొక్క సృష్టిస్థితిలయములనే కార్యములయందు ప్రవర్తిల్లుచున్నారు. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు ఆ దేవతల వశములోనున్నది.
సోఽనంతోఽoతకరః కాలో ఽనాదిరాదికృదవ్యయః ।
జనం జనేన జనయన్మారయన్మృత్యునాంతకమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే
ఏకోనత్రింశోఽధ్యాయః ॥
సర్వమునకు అంతమును కలిగించు ఈ కాలము స్వయముగా అంతము లేనిది. సర్వమునకు జన్మనిచ్చే ఈ కాలము స్వయముగా ఆది లేనిది. కాలమునకు వృద్ధి, హోసము మొదలగు వికారములు లేవు. అది తండ్రి మొదలగు జనునిచే పుత్రుడు మొదలగు జనునకు జన్మనిప్పించు ను. మృత్యువు ద్వారా అది ఇతరులను చంపే పెద్దపులి మొదలగు వాటికి, యమధర్మరాజునకు కూడ మరణమునిప్పించును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).
Summary of chapter 29 of the Bhāgavata Mahā Purana is as follows:
Lord Kapila explains the different grades of devotional service according to the three modes of material nature—ignorance, passion, and goodness—and glorifies pure unmotivated devotion that transcends all modes. He emphasizes that true devotion must be accompanied by respect and compassion toward all living entities, warning that worshiping a deity while disrespecting other souls is like offering oblations into ashes.