13  - వరాహావతార వర్ణనము

శ్రీశుక ఉవాచ

 నిశమ్య వాచం వదతో మునేః పుణ్యతమాం నృప

 భూయః పప్రచ్ఛ కౌరవ్యో వాసుదేవకథాదృతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! మైత్రేయ మహర్షి ఈ విధముగా చెప్పుచుండగా వినిన విదురుడు మరల ఆయనను ఇట్లు ప్రశ్నించెను. కౌరవవంశీయులలో శ్రేష్ఠుడగు విదురునకు వాసుదేవుని గాథలయందు ఆదరము మెండు.

విదుర ఉవాచ

 స వై స్వాయంభువస్సమ్రాట్ ప్రియః పుత్రస్స్వయంభువః

ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతో మునే

 ఓ మహర్షీ! బ్రహ్మగారి ప్రియపుత్రుడు, ప్రసిద్దిని గాంచిన సార్వభౌముడు అగు ఆ స్వాయంభువ మనువు ప్రియురాలగు భార్యను పొందెను గదా! ఆ తరువాత ఆయన ఏమి చేసెను?

చరితం తస్య రాజర్షరాదిరాజస్య సత్తమ

 బ్రూహి మే శ్రద్దధానాయ విష్వక్సేనాశ్రయో హ్యసౌ

ఓ మహాత్మా! ఆదిరాజగు ఆ స్వాయంభువ మనువు రాజర్షి. ఆయన చరితమును నాకు చెప్పుము. ఆయన శ్రీహరిని శరణు జొచ్చిన భక్తుడు. కావుననే, నాకు ఆయన చరితమును వినవలెననే శ్రద్ధ మెండు.

శ్రుతస్య పుంసాం సుచిరశ్రమస్య

నన్వంజసా సూరిభిరీడితోఽర్థః

యత్తద్గుణానుశ్రవణం ముకుంద-

పాదారవిందం హృదయేషు యేషామ్

 మానవులు చిరకాలము శ్రమించి శాస్త్రమును అధ్యయనము చేయుదురు. కాని, ఎవరి హృదయములలో శ్రీహరియొక్క పాదపద్మములు నివాసముండునో, అట్టి భక్తజనుల గుణములను శ్రవణము చేయుటయే నిశ్చయముగా అట్టి శాస్త్రాధ్యయనమునకు యథార్థమగు ఫలమని విద్వాంసులు కొనియాడుచున్నారు.

శ్రీశుక ఉవాచ

 ఇతి బ్రువాణం విదురం వినీతం

సహస్రశీర్ ష్ణశ్చ రణోపధానమ్

 ప్రహృష్టరోమా భగవత్కఠాయాం

ప్రణీయమానో మునిరభ్యచష్ట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదురుడు అనంతములగు శిరస్సులు గల శ్రీహరి భగవానుని పాదములను శరణు జొచ్చిన భక్తుడు మరియు వినయము గలవాడు. ఆయన ఇట్లు పలికి మైత్రేయుని భగవంతుని గాథయందు ప్రేరేపించుచుండగా, ఆయనకు ఆనందముచే రోమాంచము కలుగుచుండెను. అపుడా మహర్షి విదురునితో ఇట్లు పలికెను.

మైత్రేయ ఉవాచ

 యదా స్వభార్యయా సాకం జాతస్స్వాయంభువో మనుః

 ప్రాంజలిః ప్రణతశ్చేదం వేదగర్భమభాషత

స్వాయంభువ మనువు తన భార్యయగు శతరూపతో గూడి జన్మించిన సమయములో ఆయన వేదనిధియగు బ్రహ్మగారికి చేతులను జోడించి నమస్కరించి ఇట్లు పలికెను.

త్వమేకస్సర్వభూతానాం జన్మకృద్వృత్తిదః పితా

అథాపి నః ప్రజానాం తే శుశ్రూషా కేన వా భవేత్

సకలప్రాణులకు జన్మనిచ్చి పోషించే ఒకే ఒక తండ్రివి నీవే. అయినప్పటికీ, నీ సంతానమగు మాకు నిన్ను సేవించే భాగ్యము ఏ విధముగా కలుగును?

తద్విధేహి నమస్తుభ్యం కర్మస్వీడ్యాత్మశక్తిషు

 యత్కృత్వేహ యశో విష్వగముత్ర చ భవేద్గతిః

ఓ స్తుతించదగిన బ్రహ్మా! మేము చేయగలిగే కర్మలలో ఒక దానిని మాకు నిర్దేశించుము. దానిని చేసి మేము ఈ లోకములో అంతటా కీర్తిని, మరణించిన తరువాత పుణ్యగతిని పొందగలగాలి. అట్టి కర్మను నిర్ణయించి చెప్పుము. నీకు నమస్కారమగుగాక!

బ్రహ్మోవాచ

 ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తి స్తోద్వాం క్షితీశ్వర

యన్నిర్వ్యలీకేన హృదా శాధి మేత్యాత్మనార్పితమ్

బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ వత్సా! నేను నీపై ప్రసన్నుడనైతిని. ఏలయనగా, నీవు నిష్కపటమగు హృదయముతో స్వయముగా నాతో, నన్ను శాసించుము అని విన్నవించి, నావద్ద ఆత్మసమర్పణమును చేసినావు. ఓ చక్రవర్తీ! మీకిద్దరికి మంగళము కలుగుగాక!

ఏతావత్యాత్మ జైర్వీర కార్యా హ్యపతిర్గురౌ

 శక్త్యాప్రమత్తెర్గృహ్యేత సాదరం గతమత్సరైః

ఓ వీరుడా! తండ్రి విషయములో కొడుకులు ఇంతమాత్రము సేవను చేయవలెను. అది యేదనగా, ఇతరులు చేయని సేవను మేమేల చేయవలెను అనే ఈర్ష్యాభావమును వారు దరికి చేరనీయరాదు. వారు సావధానచిత్తులై తమ శక్తి మేరకు తండ్రియొక్క ఆజ్ఞను ఆదరపూర్వకముగా స్వీకరించవలెను.

సత్వమస్యామపత్యాని సదృశాన్యాత్మనో గుణైః

ఉత్పాద్య శాస ధర్మేణ గాం యజ్ణైః పురుషం యజ

      నా ఆజ్ఞను కోరే నీవు ఈ నీ భార్యయగు శతరూపయందు, నీతో గుణములతో తులదూగే సంతానమును కనుము. ఈ భూమిని ధర్మబద్దముగా పాలించుము. యజ్ఞములను చేసి శ్రీహరిని ఆరాధించుము.

పరం శుశ్రూషణం మహ్యం స్యాత్ప్రజారక్షయా నృప

 భగవాంస్తే ప్రజాభక్ర్తుర్హృషీ కేశోఽనుతుష్యతి

ఓ మహారాజా! నీవు ప్రాణులను రక్షించుచున్నచో, అదియే నాకు గొప్ప సేవ యగును. ప్రాణులను పోషించే నీపై హృషీకేశుడగు శ్రీహరి భగవానుడు ప్రసన్నుడు కాగలడు.

యేషాం న తుష్టో భగవాన్ యజ్ఞలింగో జనార్దనః

తేషాం శ్రమో హ్యపార్థాయ యదాత్మా నాదృతస్స్వయమ్

      శ్రీహరి యజ్ఞస్వరూపుడు. దుష్టులను శిక్షించే ఆ భగవానుడు ఎవరి విషయములో ప్రసన్నుడు కాడో, వారు పడే శ్రమ అంతా వ్యర్థము. ఏలయనగా, శ్రీహరి ఆత్మస్వరూపుడై యుండుటచే, వారు తమను తామే తృణీకరించుకొనుచున్నారు.

మనురువాచ

ఆదేశేఽహం భగవతో వర్తేయామీవసూదన

స్థానం త్విహానుజానీహి ప్రజానాం మమ చ ప్రభో

మనువు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నీవు పాపములను నశింపజేసెదవు. పూజ్యుడవగు నీ ఆజ్ఞను నేను శిరసా వహించెదను. కాని, ఈ జగత్తులో నాకు మరియు ప్రాణులకు నివాసస్థానమును అనుగ్రహించుము.

యదోకస్సర్వసత్త్వానాం మహీ మగ్నా మహాంభసి

అస్యా ఉద్ధరణే యత్నో దేవ దేవ్యా విధీయతామ్

    ఓ దేవా! సకలప్రాణులకు నివాసస్థానమగు ఈ భూమి విశాలమగు ప్రళయజలరాశిలో మునిగియున్నది. ఈ భూదేవిని పైకి తీసుకు వచ్చే ప్రయత్నమును చేయదగును.

మైత్రేయ ఉవాచ

 పరమేష్ఠి త్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్య గామ్

కథమేనాం సమున్నేష్య ఇతి దధ్యౌ ధియా చిరమ్

ఆ తీరున నీటి మధ్యలో మునిగియున్న భూమిని చూచి, దీనిని పైకి తీసుకువచ్చే ఉపాయమేది? అని బ్రహ్మగారు తన మనస్సులో చాలసేపు ఆలోచించెను.

సృజతో మే క్షితిర్వార్భిః ప్లావ్యమానా రసాం గతా

 అథాత్ర కిమను ష్ఠేయమస్మాభిస్సర్గయోజితైః

 యస్యాహం హృదయాదాసం స ఈశో విదధాతు మే

 నేను సృష్టికార్యములో నిమగ్నమై యుండగా, ఈ భూమి నీటిచే ముంచివేయబడి రసాతలమునకు వెళ్లిపోయినది. ఇప్పుడు దీని విషయములో మేము ఏమి చేయదగును? నేను శ్రీహరి భగవానుని సంకల్పమాత్రముచే ఆయనకు పుత్రుడనై జన్మించితిని. ఆయనయే నాకు ఈ పనిని చేసి పెట్టు గాక!

ఇత్యభిధ్యాయతో నాసావివరాత్సహసానఘ

 వరాహతోకో నిరగాదంగుష్ఠపరిమాణకః

      పాపమునెరుంగని ఓ విదురా! ఈ విధముగా బ్రహ్మగారు ఆలోచిం చుచుండగనే, వెంటనే ఆయన ముక్కు రంధ్రమునుండి బొటనవేలంత వరాహశిశువు బయట పడెను.

తస్యాభిపశ్యతః ఖస్థః క్షణేన కిల భారత

 గజమాత్రః ప్రవవృధే తదద్భుతమభూన్మహత్

జ్ఞానమునందు ప్రీతిగల ఓ విదురా! బ్రహ్మగారు ఆకాశములోనున్న ఆ వరాహము కేసి తేరిపార చూచుచుండగనే, అది ఏనుగు పరిమాణములోనికి పెరిగెను. ఆ పేరుగుట గొప్ప ఆశ్చర్యమును కలిగించెను.

మరీచిప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ

 దృష్ట్వా తత్సౌకరం రూపం తర్కయామాస చిత్రధా

మరీచి మొదలగు మహర్షులతో, సనకుడు మొదలగు బ్రహ్మవేత్తలతో మరియు స్వాయంభువ మనువుతో గూడియున్న బ్రహ్మగారు ఆ వరాహమూర్తిని చూచి, పలు విధములుగా తలపోసెను.

కిమేతత్సౌకరవ్యాజం సత్త్వం దివ్యమవస్థితమ్

అహో బతాశ్చర్యమిదం నాసాయా మే వినిస్సృతమ్

వరాహరూపములోనున్న ఈ దివ్యప్రాణి ఏమై యుండును? ఇది నా యెదుట నిలిచియున్నది. ఆశ్చర్యము! ఇది నా ముక్కునుండి బయటకు వచ్చినది.

దృష్టొఽoగుష్ఠశిరోమాత్రః క్షణాద్గండశిలాసమః

 అపి స్విద్భగవానేష యజ్ఞో మే ఖేదయన్మనః

 బొటన వ్రేలు కొన అంత ఉన్న ఈ వరాహము చూచుచుండగనే క్షణకాలములో పెద్ద రాయితో సమముగా పెరిగినది. విష్ణుభగవానుడే ఈ రూపములో వచ్చి నా మనస్సును మోహ పెట్టుట లేదు గదా! (మోహ పెట్టుచున్నాడు సుమా!)

ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణస్సహ సూనుభిః

 భగవాన్ యజ్ఞపురుషో జగర్జాగేంద్రసన్నిభః

ఈ విధముగా బ్రహ్మగారు తన కొడుకులతో చర్చించుచుండగా, " పెద్ద పర్వతమును బోలియున్న యజ్ఞవరాహ భగవానుడు గర్జించెను.

బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్

స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః

     సర్వశక్తిమంతుడగు ఆ వరాహమూర్తి దిక్కులయందు ప్రతిధ్వనించే తన గర్జనతో బ్రహ్మగారికి, మరియు మరీచి మొదలగు ఆ మహర్షులకు ఆనందమును కలిగించెను.

నిశమ్య తే ఘర్ఘరితం స్వఖేదక్షయిష్ణు మాయామయసూకరస్య

 జనస్తపస్సత్యనివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయోఽగృణన్ స్మ

మాయామయసూకరస్య = మాయాశక్తిసమేతుడగు వరాహభగవానుని,

మాయాశక్తిసమేతుడగు ఆ వరాహభగవానుడు చేసిన ఘురఘుర ధ్వనిని వినగానే బ్రహ్మ మొదలగువారి ఖేదము దూరమయ్యెను. వారితో పాటు, జనతపస్సత్యలోకములలో నివసించే మునులు కూడ ఆయనను పవిత్రములగు ఋగ్యజుస్సామవేదముల మంత్రములతో స్తుతించిరి.

తేషాం సతాం వేదవితానమూర్తిః

బ్రహ్మావధార్యాత్మగుణానువాదమ్

వినద్య భూయో విబుధోదయాయ

గజేంద్రలీలో జలమానివేశ

      బ్రహ్మగారి ముక్కునుండి ప్రకటమైన ఆ వరాహభగవానుడు తన నిశ్శ్వాసరూపమగు వేదములే స్వరూపముగా గలవాడు; ఆ వేదములు ఆయన గుణములను విస్తారముగా వర్ణించుచున్నవి. ఆ మహాత్ములు పఠించిన వేదమంత్రములను ఆయన ఆలకించి, దేవతల శ్రేయస్సు కొరకై మరి యొకసారి గర్జించెను. అపుడాయన గొప్ప ఏనుగుయొక్క విలాస గలవాడై, నీటిలో ప్రవేశించెను.

ఉత్ క్షిప్తవాలః ఖచరః కఠోరః

సటా విధున్వన్ ఖరరోమశత్వక్

 ఖురాహతాబ్రస్సితదంష్ట్ర ఈక్షా

జ్యోతిర్బభాసే భగవాన్మహీధ్రః

కఠినములగు అవయవములు గల మహ భగవానుడు తోకను పైకెత్తి మేడమీది జూలును విదలుస్తూ ఆకాశములో సంచరించెను. ఆయన చర్మము మీది వెంట్రుకలు మిక్కిలి వాడిగా నుండెను. ఆయన డెక్కలతో మేఘములను చెల్లాచెదరు చేయుచుండెను. మట్టిని పెకిలించే వరాహము రూపములో అవతరించిన ఆ భగవానుడు తెల్లని రెండు కోరలతో వెలిగిపోయే కన్నులతో ప్రకాశించెను. ఆయన పర్వతాకారుడై యుండెను.

ఘ్రాణేన పృథ్వ్యాః పదవీం విజి ఘ్రన్

క్రోడాపదేశస్స్వయమధ్వరాంగః

కరాలదంష్ట్రోఽప్యకరాలదృగ్భ్యా

 ముద్వీక్ష్య విప్రాన్ గృణతోఽవిశత్కమ్

       మాయామయమగు వరాహరూపమును దాల్చిన యజ్ఞమూర్తియగు శ్రీహరి తన ముక్కుతో భూమియొక్క స్థానమును ఆఘ్రాణించి అన్వేషించుచుండెను. ఆయన కోరలు భయమును గొల్పుచున్ననూ, చూపులు దయతో నిండియుండెను. ఆయన ఆ విధముగా తనను స్తుతించుచున్న మహర్షులను తలను పైకెత్తి చూచి, నీటిలో ప్రవేశించెను.

స వజ్రకూటాంగనిపాతవేగవిశీర్ణకుక్షిః స్తనయన్నుదన్వాన్ ఉత్సృష్టదీర్ఘర్మిభుజైరివార్తశ్చుక్రోశ యజ్ఞేశ్వర పాహి మేతి

వరాహ భగవానుని వజ్రపర్వతము వంటి దేహము పడిన వేగమునకు సముద్రుని ఉదరము శిథిలమై పోయెను. ఆయన తరంగములవే పొడవాటి భుజములనే సారించి, శబ్దమును చేయుచూ, ఆపదలో నున్నవాడు వలె, ఓ యజ్ఞేశ్వరా! నన్ను రక్షించుము అని ఆక్రోశించెను.

ఖురైః క్షురప్రైర్దరయంస్తదాఽఽప

 ఉత్పారపారం త్రిపరూ రసాయామ్

దదర్శ గాం తత్ర సుషుప్పురగ్రే

యాం జీవధానీం స్వయమభ్యదత్త

అప్పుడు ప్రాతస్సవన మాధ్యందినసవన సాయంసవనములనే మూడు పర్వలు గల యజ్ఞమే స్వరూపముగా గల ఆ వరాహభగవానుడు పొడవాటి కత్తులవంటి తన డెక్కలతో అపారమగు ఆ జలరాశిని ఒకవైపునకు నెట్టివేసి, దానిలో పాతాళమునందు భూమిని కనుగొనెను. ప్రళయకాలమునందు నిద్రించగోరిన భగవానుడు ఆ భూమిని తానే స్వయముగా తనయందు ధరించియుండెను.

స్వదంష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నాం

స ఉత్థితసంరురుచే రసాయాః

 తత్రాపి దైత్యం గదయాఽఽపతంతం

సునాభసందీపీతతీవ్రమన్యుః

  జఘాన రుంధానమసహ్యవిక్రమం

స లీలయేభం మృగరాడివాంభసి

 తద్రక్తపంకాంకితగండతుండో

యథా గజేంద్రో జగతీం విభిందన్

ఆ వరాహ భగవానుడు తన కోరతో నీటిలో మునిగియున్న భూమిని పైకి ఎత్తి పాతాళమునుండి పైకి వస్తూ గొప్పగా ప్రకాశించేను. ఇంతే గాక, ఆ నీటిలో సహింప శక్యము కాని పరాక్రమము గల హిరణ్యాక్షుడనే రాక్షసుడు గదను చేతబట్టి ఆయన మీదకు దుముకుతూ దారికి అడ్డు వచ్చెను. వానిని చూచుట తోడనే ఆయన తీవ్రమగు కోపముతో సుదర్శన చక్రము వలె మండిపడెను. సింహము ఏనుగును దెబ్బ తీసే విధముగా, ఆయన వానిని అవలీలగా సంహరించెను. చెక్కిళ్లు మరియు పొడవైన మూతి ముద్ద గట్టిన వాని రక్తపు చారలతో చిహ్నితమై యుండగా, ఆయన గైరీకాది ధాతువులతో గూడిన కొండ చరియను తన గండస్థలముతో రాపిడి చేసిన పెద్ద ఏనుగు వలె ప్రకాశించెను.

తమాలనీలం సీతదంతకోట్యా

క్ష్మాముత్ క్షిపంతం గజలీలయాంగ

 ప్రజ్ఞాయ బద్దాంజలయోఽనువాకైః

విరించిముఖ్యా ఉపతస్థురీశమ్

 ఓ విదురా! తమాలవృక్షము వలె నల్లనైన వరాహ భగవానుడు తెల్లని తన దంతపు కొనతో భూమిని ఎత్తుతూ, కలువను తన కోరతో పైకి ఎత్తే ఏనుగు వలె భాసించెను. ఆయనను చూచి బ్రహ్మ మొదలగు వారు చేతులను జోడించి, వైదికసూక్తములచే స్తుతించిరి.

ఋషయ ఊచుః

జితం జీతం తేఽజిత యజ్ఞభావన

త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః

 యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః

తస్మై నమః కారణసూకరాయ తే

పరాజయమునేరుంగని వాడా! నీవు యజ్ఞములను పాలించెదవు. నీకు జయము, జయము. నీవు ఋగ్వేద యజుర్వేద సామవేదమయమగు నీ దేహమును విదల్చుచున్నావు. నీకు నమస్కారము. నీ రోమకూపముల యందు యజ్ఞములు విలీనమై యున్నవి. నీవు భూమిని ఉద్ధరించుట కొరకై ఈ వరాహ రూపమును దాల్చినావు. అట్టి నీకు నమస్కారము.

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం

దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకమ్

ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ-

      స్వాజ్యం దృశి త్వంఘిషు చాతుర్ఘ త్రమ్

       ఓ దేవా! నీ ఈ యజ్ఞమయమగు రూపమును దుష్టబుద్ధి గలవారు దర్శించుట నిశ్చయముగా సంభవము కాదు. నీ చర్మమునందు వైదిక ఛందస్సులు, రోమములయందు దర్బలు, కంటియందు ఆజ్యము, పాదములయందు హోత ఉద్గాత అధ్వర్యుడు మరియు బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కుల కర్మసముదాయము గలవు.

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయోః

ఇడోదరే చమసాః కర్ణరంధే

ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే

యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రమ్

 ఓ ఈశ్వరా! వరాహ భగవాన్!నీ ముట్టెయందు స్రుక్కు, ముక్కు రంధ్రములయందు స్రువము, పొట్టయందు ఇడాపాత్ర, చెవి చిల్లులయందు చమసపాత్రలు, నోటియందు బ్రహ్మభాగపాత్ర, కంఠవివరమునందు గ్రహములు గలవు. నీ భక్షణమే అగ్నిహోత్రము.

దీక్షానుజన్మోపసదశ్శిరోధరం

త్వం ప్రాయణీయోదయనీయదంష్ట్రః

 జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః

సభ్యావసథ్యం చితయోఽస్సనో హి తే

యజ్ఞస్వరూపుడవగు నీవు మరల మరల అవతరించుటయే యజ్ఞములోని దీక్షణీయేష్టి. ఉపసత్తులు అనే మూడు ఇష్టులు నీ మెడ. ప్రాయణీయేష్టి (దీక్ష తరువాతిది), ఉదయనీయేష్టి (యజ్ఞమునకు ఆఖరులో చేసేది) నీ కోరలు. ప్రవర్గ్య (ఉపసత్తునకు ముందు చేయబడే కర్మ) నీ నాలుక. సభ్యాగ్ని (హోమము లేని అగ్ని), ఔపాసనాన్ని నీ తల. ఇష్టకా (యజ్ఞములో వాడే ఇటుక) చయనములే నీ ప్రాణములు.

సోమస్తు రేతస్సవనాన్యవస్థితిస్సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః

సత్రాణి సర్వాణి శరీరసంధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః

ఓ దేవా! సోమరసము నీ రేతస్సు. ప్రాతస్సవనము, మాధ్యందిన సవనము, సాయం సవనము అనునవి నీకు బాల్యము మొదలగు (లేదా, జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి అనే) అవస్థలు. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అను ఏడు సోమయాగ విశేషములు నీకు చర్మము మాంసము మజ్జ మొదలగు ఏడు ధాతువులు. సత్రయాగములన్నీ నీ శరీరములోని కీళ్లు. సకలయజ్ఞములు (సోమరసము లేని యాగములు) మరియు క్రతువులు (సోమరసము గలవి) నీ స్వరూపమే. ఇష్టులు నీ శరీరములోని అవయవములను కలిపి ఉంచే కండరములు.

నమో నమఽస్తేఖిలమంత్రదేవతా-

ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే

వైరాగ్యభక్త్యాత్మజయానుభావిత-

జ్ఞానాయ విద్యాగురవే నమో నమః

     సకల మంత్రములు, దేవతలు, ఆజ్యము మొదలగు యజ్ఞద్రవ్యములు, సకల క్రతువులు, సకలవైదికకర్మలు నీ స్వరూపమే. వైరాగ్యము భక్తి మనోజయము అనువాటి వలన సాక్షాత్కరించే ఆత్మజ్ఞానము నీ స్వరూపమే. ఆ జ్ఞానమునిచ్చే గురువు నీవే. నీకు అనేక నమస్కారములు.

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా

విరాజతే భూధర భూస్సభూధరా

 యథా వనాన్నిస్సరతో దతా ధృతా

మతంగజేంద్రస్య సపత్రపద్మినీ

     భూమిని ధరించిన వరాహ మూర్తీ! ఓ భగవాన్! నీవు నీ వాడి కోరల కొనపై పర్వతములతో కూడియున్న భూమిని ధరించియున్నావు. నీటిలోనుండి బయటకు వస్తూ ఉన్న గోప్ప ఏనుగుయొక్క దంతముచే ఆకులతో సహా పట్టుకొనబడిన పద్మపు మొక్క వలె ఆ భూమి ప్రకాశించుచున్నది.

త్రయీమయం రూపమిదం చ సౌకరం

భూమండలేనాథ దతా ధృతేన తే

చకాస్తి శృంగోడఘనేన భూయసా

 కులాచలేంద్రస్య యథైవ విభ్రమః

వేదాత్మకమగు నీ ఈ వరాహరూపము కోరలపై భూమండలమును దాల్చియుండగా, తన శిఖరముపై పెద్ద మేఘమును ధరించిన గొప్ప కులపర్వతముయొక్క విలాసను పోలి ప్రకాశించుచున్నది.

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం

లోకాయ పత్నీమసి మాతరం పితా

విధేమ చాస్యై నమసా సహ త్వయా

యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః  

  ఈ భూమి స్థావర జంగమాత్మకమగు ప్రాణులకు నివాసస్థానము. ఈమే నీకు భార్య, మాకు తల్లి. నీవు మా తండ్రివి. నీవీ భూమిని చక్కగా నిలబెట్టుము. అప్పుడు మేము ఆమెకు, నీకు నమస్కరించి సేవను చేసెదము. యజ్ఞములో అరణి (నిప్పును మథించే కట్టె) యందు యాజ్ఞికులు అగ్నిని ధరించిన విధముగా, నీవీ భూమియందు నీ తేజస్సును (ప్రాణులను ధరించే శక్తి)  ధరించుచున్నావు.

కః శ్రద్దధీతాన్యతమస్తవ ప్రభో

రసాం గతాయా భువ ఉద్విబర్హణమ్

న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే

యో మాయయేదం ససృజేఽతివిస్మయమ్

ఓ ప్రభూ! పాతాళములోనున్న భూమిని నీవు పైకి తీసుకు వచ్చితివి. ఈ పనిని నీవు తక్క మరియొకడు ఎవడైననూ చేయుటకు సంకల్పించుట కూడ సంభవము కాదు. కాని, ఈ పని నీ విషయములో ఆశ్చర్యము కాదు. ఏలయన, నీయందు ఉన్న సర్వము ఆశ్చర్యజనకమే. నీవు మిక్కిలి అచ్చెరువును గొలిపే ఈ జగత్తును నీ మాయాశక్తిచే సృష్టించినావు.

విధువ్వతా వేదమయం నిజం వపుః జనస్తపస్సత్యనివాసినో వయమ్ సూశిఖోద్భూతశివాంబుబిందుభిఃవిమృజ్యమానా భృశమీశ పావితాః

ఓ ఈశ్వరా! నీవు నీ వేదమయమగు దేహమును విదల్చినప్పుడు నీ మెడమీది జూలుయొక్క కొనలనుండి జారిన నీరు మాపై చల్లబడినది.మంగళకరమగు ఆ నీరు, జనలోక తపోలోక సత్యలోకములయందు నివసించే మమ్ములను ఎంతయూ పవిత్రులను చేసినది.

స వైబత భ్రష్టమతిస్త వైషతే

యః కర్మణాం పారమపారకర్మణః

యద్యోగమాయాగుణయోగమోహితం

విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్

నీవు వెలయించిన కర్మలకు అంతము లేదు. కాని, అయ్యో!, ఎవడైతే అట్టి నీ కర్మల అంతమును తెలియగోరునో, వాడు నిశ్చయముగా భ్రష్టు పట్టిన బుద్ధి గలవాడే. ఏలయనగా, నీ యోగమాయయొక్క గుణములతోడి సంబంధముచే ఈ సకలజగత్తు వ్యామోహమును పొందియున్నది. ఓ వరాహ భగవానుడా! వానికి నీవు మంగళమును కలిగించుము.

మైత్రేయ ఉవాచ

ఇత్యుపస్థీయమానసైర్మునిభిర్బృహ్మవాదిభిః

సలిలే స్వఖురాక్రాంత ఉపాధత్తావితావనిమ్

ఈ విధముగా బ్రహ్మవాదులగు ఆ మునులు స్తుతించగా, రక్షకుడగు వరాహ భగవానుడు భూమిని తన కాలి డెక్కలచే ఆక్రమించబడియున్న నీటియందు స్థాపించేను.

స ఇత్థం భగవానుర్వీం విష్వక్సేనః ప్రజాపతిః

రసాయా లీలయాన్నీతామప్సు న్యస్య యయౌ హరిః

       ఆదిత్యరూపములోనున్న నారాయణుని సేనలు (కిరణములు) జగత్తునంతనూ వ్యాపించియున్నవి. అట్టి విష్వక్సేనుడు, సకలప్రాణులకు ప్రభువు అగు శ్రీహరి భగవానుడు పాతాళమునుండి భూమిని అవలీలగా పైకి తీసుకువచ్చి, నీటియందు ఉంచి అంతర్ధానమాయెను.

య ఏవమేతాం హరిమేధసో హరేః

కథాం సుభద్రాం కథనీయమాయినః

 శృణ్వీత భక్త్యా శ్రవయేత వోశతీం

జనార్దనోఽస్యాశు హృది ప్రసీదతి

శ్రీహరిని బుద్ధియందు నిలిపినచో, పాపములు తాపములు దూరమగును. ఆయన లీలలు కీర్తించదగినవి. ఆయన ప్రాణుల హృదయములో నిలిచియున్నాడు. అట్టి శ్రీహరియొక్క ఈ విధమగు ఈ గాథ మిక్కిలి మంగళకరము, కమనీయము. దీనిని ఎవడైతే వినునో, లేదా వినిపించునో, వాని హృదయములో శ్రీహరి వెంటనే ప్రసన్నుడగును.

తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభౌ

కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః

అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః

స్వయం విధత్తే స్వగతిం పరః పరామ్

       శ్రీహరి కామనలన్నింటికీ ప్రభువు. ఆయన ప్రసన్నుడైనచో, దుర్లభమేమి గలదు? కాని, అల్పములగు ఈ కామనలు చాలును. బుద్దిగుహయందు ఆత్మరూపముగా నివసించే ఆ పరమేశ్వరుడు తనను అభేదభావముతో సేవించే భక్తులకు సర్వోత్కృష్టమగు తన పరమపదమును స్వయముగానే అనుగ్రహించుచున్నాడు.

కో నామ లోకే పురుషార్థసారవిత్

పురాకథానాం భగవత్కథాసుధామ్

ఆపీయ కర్ణాంజలిభిర్బవాపహా-

మహో విరజ్యేత వినా నరేతరమ్

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే

త్రయోదశోఽధ్యాయః

భగవానుడు పూర్వమునందు చేసిన లీలలలో  ఏ ఒక్క గాథనైననూ చెవులు అనే దోసిళ్లతో నిండుగా త్రాగినచో, ఆ అమృతము వలన, సంసారము దూరమగును. ఆహా! ఈ లోకములో పురుషార్థముల సారమునెరింగిన ఎవ్వాడు అట్టి కథామృతపానమునందు విరక్తిని చెందును? కేవలము పశుప్రాయులగు జనులు మాత్రమే ఈ గాథలకు దూరముగా నుండెదరు.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు మూడవ స్కంధములో

పదమూడవ అధ్యాయము ముగిసినది.