భాగవత మహా పురాణము
3 - శ్రీకృష్ణ భగవానుని లీలలను వర్ణించుట
ఉద్ధవ ఉవాచ !
తతస్స ఆగత్య పురం స్వపిత్రో-
శ్చికీర్షయా శం బలదేవసంయుతః ।
నిపాత్య తుంగాద్రిపుయూథనాథం
హతం వ్యకర్షద్వ్యసుమోజసోర్యామ్ ॥
ఉద్ధవుడు ఇట్లు పలికెను --- తరువాత శ్రీకృష్ణుడు తన తల్లిదం డ్రులకు సుఖమును కలిగించగోరి, బలరామునితో గూడినవాడై నందవ్రజమునుండి మథురా నగరమునకు వచ్చెను. ఆయన అచట తమ శత్రుసముదాయమునకు నాయకుడగు కంసుని కొట్టి చంపి ఎత్తైన సింహాస నమునుండి నేల పై పడవేసి ఈడ్చెను.
సాందీపనేస్సకృత్ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరమ్ ।
తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్ ॥
ఆ విధముగా ఆయన ఆరు అంగములతో కూడిన వేదమును అధ్యయనము చేసెను. ఆ గురువుగారి పుత్రుడు ఎప్పుడో మరణించెను. శ్రీకృష్ణుడు పంచజనుడను రాక్షసుని ఉదరమునుండి ఆ పుత్రుని తీసుకువచ్చి గురువుగారికి వరము (దక్షిణ) గానిచ్చెను.
సమాహుతా భీష్మకకన్యయా యే
శ్రీయస్సవర్ణేన బుభూషయైషామ్ ।
గాంధర్వవృత్త్యా మిషతాం స్వభాగం
జహ్రే పదం మూర్ధ్ని దధతుపర్ణః ॥
భీష్మకుని పుత్రియగు రుక్మిణి స్వయంవరమునకు ఆమె అన్న రుక్మి శిశుపాలుడు మొదలగు వారిని ఆహ్వానించెను. ఆ రుక్మిణి లక్ష్మీదేవి వలె నుండెను. ఆమె సౌందర్యమే ఆహ్వానము కాగా ఆమెను పొందగోరి వారందరు విచ్చేసిరి. శ్రీకృష్ణుడు, రుక్మిణి పరస్పరము ప్రేమించుకొని సంకేతములను చేసుకొని యుండిరి. ఆమె ఆయనకు నిత్యసహచారిణి. ఆయన గాంధర్వవిధానముచే ఆమెను వివాహమాడగోరి అందమగు రథ ముపై వచ్చెను. ఆ శిశుపాలాదులు చూచుచున్ననూ లెక్క చేయకుండగా, ఆయన వారి శిరస్సులపై తన కాలిని మోపి (వారిని చిత్తుగా ఓడించి), గరుత్మంతుడు అమృతమును వలె, ఆమెను తీసుకొని పోయెను.
కకుద్మతోవిద్దనసో దమిత్వా
స్వయంవరే నాగ్నజితీమువాహ ।
తద్భగ్నమానానపి గృధ్యతోకజ్ఞా-
ఞ్జ ఘ్నేక్షతశ్శస్త్రభృతస్స్వశ స్త్రైః ॥
ప్రియం ప్రభుర్గామ్య ఇవ ప్రియా
విధిత్సురార్చద్ద్యుతరుం యదర్దే ।
వజ్య్రాద్రవత్తం సగణో రుషారధ్య
క్రీడామృగో నూనమయం వధూనామ్ ॥
శ్రీకృష్ణప్రభుడు భోగలాలసుని తరహాలో ప్రియురాలగు సత్యభామకు ప్రియమును చేయగోరి స్వర్గమునుండి పారిజాత వృక్షమును తెచ్చేను. దీనిపై ఇంద్రుడు మండిపడి, కోపముతో గ్రుడ్డివాడై, వజ్రమును చేతబట్టి, సైన్యముతో శ్రీకృష్ణునిపై దండెత్తాను. తన ప్రియురాలి ప్రేరణచే అట్లు చేసిన ఇంద్రుడు నిశ్చయముగా ఆడువారి చేతిలో కీలుబొమ్మయే.
సుతం మృధే ఖం వపుషా గ్రసంతం
దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్య్రా ।
ఆమంత్రితస్తత్తనయాయ శేషం
దత్త్వా తదంతఃపురమానివేశ ॥
యుద్దములో తన విశాలమగు దేహముతో అంతరిక్షమును మ్రింగుచున్నాడా యన్నట్లు ఉన్న నరకాసురుని శ్రీకృష్ణుడు తన చక్రముతో సంహరించెను. అపుడు వాని తల్లియగు భూదేవి కోరగా, ఆయన మిగిలిన రాజ్యమును వాని పుత్రుడగు భగదత్తునకు ఇచ్చి, వాని అంతఃపురములో ప్రవేశించేను.
తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబంధుమ్ ।
ఉత్థాయ సద్యో జగృహుః ప్రహర్షవీడానురాగప్రహితావలోకైః ॥
భూపుత్రుడగు నరకుడు తీసుకు వచ్చిన రాజకన్యలు ఆ అంతఃపు రములో గలరు. కష్టములోనున్నవారిని రక్షించే శ్రీకృష్ణుని చూడగానే వారు లేచి నిలబడిరి. వారు గొప్ప ఆనందమును పొంది, సిగ్గుతో మరియు ప్రేమతో ఆయనను చూస్తూ, వెంటనే ఆయనను భర్తగా వరించిరి.
ఆసాం ముహూర్త ఏకస్మిన్నానాగారేషు యోషితామ్ ।
సవిధం జగృహే పాణీననురూపస్స్వమాయయా ॥
ఆయన ఆ యువతులనందరినీ వారి వారికి తగిన రూపములను తన మాయచే దాల్చినవాడై ఒకే ముహూర్తమునందు వేర్వేరు గృహము లలో యథావిధిగా వివాహమాడెను.
తాస్వపత్యాన్యజనయదాత్మతుల్యాని సర్వతః ।
ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా ॥
ఆయన ఆ భార్యలలో ప్రతి ఒక్కరియందు పది మంది పిల్లలను, తనకు అన్ని విధములుగా తగినవారిని కనెను. తద్ద్వారా సృష్టి విస్తరించెను.
కాలమాగధశాల్వాదీననీకై రుంధతః పురమ్ ।
అజీఘనత్స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్ ॥
కాలయవనుడు, మగధదేశాధిపతియగు జరాసంధుడు, శాల్వుడు. మొదలగు వారు సేనలతో మథురను, ద్వారకను ముట్టడించినప్పుడు, శ్రీకృష్ణుడు ఇతరులను కేవలము నిమిత్తముగా చేసుకొని, తానే వారిని మట్టుబెట్టెను. పైగా, అర్జునుడు మొదలగు తన భక్తులకు దివ్యమగు పరాక్ర మమును ఇచ్చెను.
శంబరం ద్వివిదం బాణం మురం బల్వలమేవ చ ।
అన్యాంశ్చ దంతవక్తాదీనవద్గీత్కాంశ్చ ఘాతయత్ ॥
శంబరుడు, ద్వివిదుడు, బాణుడు, మురుడు, బల్వలుడు, దంతవ కూడు మొదలగు వారిలో కొందరిని శ్రీకృష్ణుడు స్వయముగా సంహరించెను; మరికొందరిని ఇతరులచే వధింపజేసెను.
అథ తే భ్రాతృపుత్రాణాం పక్షయోః పతితాన్ నృపాన్ ।
చచాల భూః కురుక్షేత్రం యేషామాపతతాం బలైః ॥
తరువాత ఆయన నీ సోదరులగు పాండు ధృతరాష్ట్రుల సంతాన మగు పాండవుల మరియు కౌరవుల పక్షములలో జేరి వచ్చిన రాజులను సంహరింప జేసెను. ఆ రాజులు తమ తమ సైన్యములతో గూడి కురుక్షేత్ర మునకు వచ్చుచుండగా, భూమి కంపించెను.
స కర్ణదుశ్శాసనసౌబలానాం
కుమంత్రపాకేన హతియాయుషమ్ ।
సుయోధనం సానుచరం శయానం
భగ్నీరుముర్వ్యాం న ననంద పశ్యన్ ॥
కర్ణుడు దుశ్శాసనుడు మరియు శకుని ఇచ్చిన చెడు సలహాల ఫలి తముగా దుర్యోధనుని సంపద నశించి, ఆయువు మూడెను. ఆతడు తొడలు విరుగగొట్టబడగా, అనుచరులతో గూడి యుద్ధరంగములో నేలపై పడియుండెను. కాని, అట్టి దుర్యోధనుని చూచిన శ్రీకృష్ణునకు సంతోషము కలుగలేదు.
కియాన్ భువోయం క్షపిత్రుభారో
యద్ద్రోణభీష్మార్జునుభీమమూలైః ।
అష్టాదశాక్షౌహిణికో మదం శై-
రాస్తే బలం దుర్విషహం యదూనామ్ ॥
పెనుభారమును తగ్గించినారు. కాని ఇది యెంతటిది? ఏలయనగా, ఇంకనూ సహింప శక్యము కాని యాదవబలము మిగిలియే యున్నది.
మిథో యదైషాం భవితా వివాదో
మధ్వామదాతామ్రవిలోచనానామ్ ।
నైషాం వధోపాయ ఇయానతోన్యో
మయ్యుద్యతేంతర్దధతే స్వయం స్మ ॥
ఈ యాదవులు మద్యమును త్రాగి గట్టి నిషాతో ఎర్రనైన కన్నులు గలవారై ఒకరితో మరియొకరు పోట్లాడుకొనెదరు. వీరి వధకు ఇంతకంటే మరియొక ఉపాయము లేదు. నేను అవతారమును చాలించుటకు సిద్దపడు చుండగా వారు తమంత తాముగా నశించగలరు.
ఏవం సంచింత్య భగవాన్ స్వరాజ్యే స్థాప్య ధర్మజమ్ ।
నందయామాస సుహృదస్సాధూనాం వర్త్మ దర్శయన్ ॥
శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా ఆలోచించి ధర్మరాజును ఆయన రాజ్యమునందు స్థాపించి, తన ప్రవృత్తిచే సత్పురుషుల నడవడిని లోకమునకు చూపిస్తూ బంధుమిత్రులకు సంతోషమును కలిగించెను.
ఉత్తరాయాం ధృతః పూరోర్వంశస్సాధ్వభిమన్యునా ।
స వై ద్రౌణ్యస్త్రసంఛన్నః పునర్బగవతా ధృతః ॥
పూరువంశమును నిలబెట్టువాడు, అభిమన్యుని పుత్రుడు అగు శిశువు ఉత్తరయొక్క గర్బములో చక్కగా పెరుగుచుండగా, ద్రోణపుత్రు డగు అశ్వత్థామ అస్త్రమును ప్రయోగించి, ఆ శిశువును సంహరించేను. అపుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ శిశువునకు మరల ప్రాణమును పోసెను.
అయాజయద్దర్మసుతమశ్వమేదైస్త్రిభిర్విభుః ।
సోపి క్ష్మామనుజై రక్షన్ రేమే కృష్ణమనువ్రతః ॥
శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుచే మూడు అశ్వమేధయాగము లను చేయించెను. ధర్మరాజు కూడ తమ్ములతో కలిసి రాజ్యమునేలుచూ, శ్రీకృష్ణుని నిష్ఠతో అనుసరించువాడై, సుఖించెను.
భగవానపి విశ్వాత్మా లోకవేదపథానుగః ।
కామాన్ సిషేవే ద్వార్వత్యామసక్తస్సాంఖ్యమస్థితః ॥
జగత్తునకు ఆత్మ, అధిష్ఠానము అగు శ్రీకృష్ణ భగవానుడు తాను కూడ లోకమర్యాదను పాలిస్తూ, వైదిక ధర్మమును అనుష్ఠిస్తూ, సచ్చిదానం దమగు ఆత్మయందు నిష్ఠ గలవాడగుటచే సంసారమునందు ఆసక్తి లేనివాడై, ద్వారకా నగరములో భోగములననుభవించెను. ఆయన ఆ విధముగా లోకములో సాంఖ్యయోగము (జ్ఞానమార్గము) ను నిలబెట్టెను.
స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా ।
చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా ॥
ఇమం లోకమముం చైవ రమయన్ సుతరాం యదూన్ ।
రేమే క్షణదయా దత్తక్షణస్త్రీక్షణసౌహృదః ॥
శ్రీకృష్ణుని ప్రేమతో నిండిన చిరునవ్వు తోడైన చూపులకు, అమృ తమువంటి పలుకులకు, దోషరహితమగు చరితములకు, లక్ష్మీదేవికి (సౌం దర్యమునకు) నివాసస్థానమగు రూపమునకు ఈ లోకములోని జనులు, విశేషించి యాదవులు మాత్రమే గాక, స్వర్గాదిలోకములలోని వారు కూడ ముగ్ధులైరి. ఆయన రాత్రియందు కొద్ది సమయము లభించిన సందర్భము లలో, ఉత్సాహముతో కూడియున్న గోపికల అనురాగపూర్ణములగు చూపు లను స్వీకరిస్తూ, రాసక్రీడయందు రమించెను.
తస్యైవం రమమాణస్య సంవత్సరగణాన్ బహూన్ ।
గృహమేధేషు యోగేషు విరాగస్సమజాయత ॥
ఆయన ఈ విధముగా అనాసక్తుడై అనేక సంవత్సరములు రమిం చెను. అపుడాయనకు గృహస్థాశ్రమమునకు సంబంధించిన కామోపభోగ ములయందు, వాటి సాధనములయందు వైరాగ్యము కలిగెను.
దైవాధీనేషు కామేషు దైవాధీనస్స్వయం పుమాన్ ।
కో విస్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రతః ॥
కర్మయోగ మార్గములో గాని, లేదా జ్ఞానమార్గములో గాని యోగే శ్వరుడగు శ్రీకృష్ణ భగవానుని నిష్టతో సేవించే ఏ పురుషుడు భోగముల యందు నమ్మకమును కలిగియుండును? ఏలయనగా, మానవుడు తాను స్వయముగా ఈశ్వరునకు అధీనుడై యున్నాడు. భోగములు కూడ ఈశ్వ రాధీనములుగనే యున్నవి. ఇట్టి స్థితిలో భగవానుడు భోగాసక్తుడు కాడనీ వేరుగా చెప్పవలయునా? (భగవానుడే విరక్తుడు కాగా, ఆయనను అనుస రించే భక్తుడు కూడ అటులనే చేయును గదా!)
పుర్యాం కదాచితీడద్భిర్యదుభోజకుమారకైః ।
కోపితా మునయశ్శేపుర్బగవన్మతకోవిదాః ॥
ఒకనాడు ద్వారకా నగరములో యదుభోజవంశములకు చెందిన కుమారులు ఆటలాడుతూ మహర్షులకు కోపమును కలిగించిరి. శ్రీకృష్ణ భగవానుని అభిమతము ఆ మహర్షులకు తెలిసి యుండుటచే, వారు శపించిరి.
తతః కతిపయైర్మా సైర్వృష్టిభోజాంధకాదయః ।
యయుః ప్రభాసం సంహృష్టా రథైర్దేవవిమోహితాః ॥
కొన్ని మాసముల తరువాత దైవముచే మోహింపజేయబడి యున్న వృష్టి-భోజ-అంధక మొదలగు వంశములకు చెందిన యాదవులు గొప్ప ఉల్లాసముతో రథములనెక్కి ప్రభాస క్షేత్రమునకు వెళ్లిరి.
తత్ర స్నాత్వా పితౄన్ దేవానృషీంశ్చైవ తదంభసా ।
తర్పయిత్వాథ విప్రేభ్యో గావో బహుగుణా దదుః ॥
వారు ఆ ప్రభాసతీర్థమునందు స్నానము చేసి, దేవ-పితృ-ఋషి తర్పణములను ముగించుకొని, బ్రాహ్మణులకు మంచి లక్షణములతో కూడిన ఆవులను దానము చేసిరి.
హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యజినకంబలాన్ ।
యానం రథానిభాన్ కన్యా ధరాం వృత్తికరీమపి ॥
అన్నం చోరురసం తేభ్యో దత్త్వా భగవదర్పణమ్ ।
గోవిప్రార్థాసవశ్శూరాః ప్రణేముర్భువి మూర్ధభిః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే తృతీయోధ్యాయః ॥
ఆ యాదవులు తమ జీవితమును శక్తిని అంతనూ గోవులను మరియు బ్రాహ్మణులను రక్షించుట కొరకై వినియోగించెడివారు. అట్టి శూరులగు ఆ యాదవులు బంగారము, వెండి, శయ్యలు, విలువైన వస్త్ర ములు, మృగచర్మములు, కంబళ్లు, పల్లకీలు, రథములు, ఏనుగులు, కన్య లు, పంటలు పండే భూములు, నానావిధముల రుచ్యములగు ఆహార పదార్థములు అనువాటిని బ్రాహ్మణులకు దానము చేసిరి. అట్లు చేయుచూ వారు మనస్సును భగవంతునిపై నిలిపి, ఆ దానములను ఈశ్వరార్పణలుద్దితో చేసిరి. తరువాత వారా బ్రాహ్మణులకు సాష్టాంగప్రణామముల నాచరించిరి,
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 3 of the Bhāgavata Mahā Purana is as follows:
Uddhava continues his affectionate recollection of Lord Kṛshṇa's heroic and divine deeds after leaving the pastoral glades of Vṛndāvana. He recounts the vanquishing of Kamsa, the liberation of His parents, the establishment of the magnificent city of Dvārakā, the abduction of Rukmiṇī, and the alleviation of the earth's heavy burden through the Kurukshetra war, highlighting how the Lord acted out His supreme will while remaining entirely unattached.