భాగవత మహా పురాణము
18 - హిరణ్యాక్షునితో వరాహ భగవానుని యుద్ధము
మైత్రేయ ఉవాచ ।
తదేవమాకర్ణ్య జలేశభాషితం
మహామనాస్తద్విగణయ్య దుర్మదః ।
హరేర్విదిత్వా గతిమంగ నారదాత్
రసాతలం నిర్వివిశే త్వరాన్వితః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! జలాధిపతియగు వరుణుని ఈ వచనములను విని, గర్వించియున్న హిరణ్యాక్షునకు యుద్దమును చేసే పురుషుడు లభించినందులకు హృదయము హర్షముతో నిండి పోయెను. నీవా పురుషుని చేతిలో మరణించెదవని వరుణుడు చెప్పిన మాటను ఆతడు త్రోసిపుచ్చి, నారదుని వలన శ్రీహరి ఉన్న స్థానమును తెలుసుకొని, తొందరగా రసాతలమును ప్రవేశించెను.
దదర్శ తత్రాభిజితం ధరాధరం
ప్రోన్నీయమానావనిమగ్రదంష్ట్రయా ।
ముష్ణంతమక్ష్ణా స్వరుచోఽరుణశ్రియా
జహాస చాహో వనగోచరో మృగః ॥
అచట హిరణ్యాక్షుడు పర్వతాకారములోనున్న విశ్వవిజేతయగు వరాహ భగవానుని చూచెను. ఆయన తన కోరల కొనపై భూమిని ఎత్తి తీసుకువచ్చు చుండెను. ఎర్రని కన్నుల శోభతో ప్రకాశించే ఆ భగవానుని ముందు హిరణ్యాక్షుని తేజస్సు వెలవెల పోయెను. ఆతడు ఆయనను చూచి, అరే! ఇది అడవిలో కనబడే (నీటిలో సంచరించే) పశువు!, అని పలికి నవ్వెను.
ఆహైనమేహ్యజ్ఞ మహీం విముంచ నో
రసౌకసాం విశ్వసృజేయమర్పితా ।
న స్వస్తి యాస్యస్యనయా మమేక్షతః .
సురాధమాసాదితసూకరాకృతే ॥
ఆ హిరణ్యాక్షుడు వరాహ భగవానునితో నిట్లు పలికెను: ఓరీ మూర్ఖ! ఇటు రమ్ము. ఆ భూమిని విడిచి పెట్టుము. జగత్తును సృష్టించిన బ్రహ్మగారు రసాతలవాసులగు మాకు ఆ భూమిని ఇచ్చినాడు. నేను చూచుచుండగా నీవా భూమిని తీసుకొని సుఖమును పొందలేవు. వరాహ రూపమును దాల్చిన నీవు దేవతలలో అధముడవు.
త్వం నస్సపత్నైరభవాయ కిం భృతో
యో మాయయా హంత్యసురాన్ పరోక్షజిత్ ।
త్వాం యోగమాయాబలమల్పపౌరుషం
సంస్థాప్య మూఢ ప్రమృజే సుహృచ్ఛుచః ॥
ఓరీ మూర్ఖ! మా శత్రువులు మమ్ములను నశింప జేయుట కొరకై నిన్ను పెంచి పోషించినారా యేమి? నీవు ఎదురు పడకుండగా మాయతో రాక్షసులను సంహరించి విజయమును పొందుచున్నావు. యోగమాయయే నీ బలము. నీ పౌరుషము అల్పము. నిన్ను సంహరించి, నేను మిత్రుల (బంధువుల) కన్నీటిని తుడిచెదను.
త్వయి సంస్థితే గదయా శీర్ణశీర్ష-
ణ్యస్మద్భుజచ్యుతయా యే చ తుభ్యమ్ ।
బలిం హరంత్యృషయో యే చ దేవాః
స్వయం సర్వే న భవిష్యంత్యమూలాః ॥
నేను నా భుజములతో విడిచి పెట్టబోయే ఈ గదచే నీ తల పగిలి, నీవు మరణించెదవు. అప్పుడు నీకు పూజలను చేసే మహర్షులు మరియు దేవతలు, తల్లి వేరు నశించిన చెట్టు వలె, తమంత తామే నశించెదరు.
స తుద్యమానోఽరదురుక్తతోమరైః
దంష్ట్రాగ్రగాం గాముపలక్ష్య భీతామ్ ।
తోదం వృషన్నిరగాదంబుమధ్యాత్
గ్రాహాహతస్సక రేణుర్యఢభః ॥
శత్రువు పలికిన పరుష వచనములు చిల్లకోల పోట్లవలె వరాహ భగవానునకు పీడను కలిగించినవి. ఆయన కోరల కొనలయందున్న భూదేవి భయపడుచుండెను. ఆమెను చూచి ఆయన ఆ నొప్పిని సహిస్తూ, నీటిలో ఆడ ఏనుగుతో కలిసియుండి మొసలి కాటు తిన్న మగ ఏనుగు వలె, నీటి మధ్యనుండి బయటకు వచ్చేను.
తం నిస్సరంతం సలిలాదనుద్రుతో
హిరణ్యకేశో ద్విరదం యథా ఝషః ।
కరాలదంష్ట్రాఽశనివిస్స్వనోఽబ్రవీత్
గతప్రియాం కిం త్వసతాం విగర్హితమ్ ॥
హిరణ్యాక్షుడు బంగరు రంగు జుట్టును, భయంకరమగు దంష్ట్రలను కలిగియుండెను. వరాహ భగవానుడు నీటినుండి బయటకు వచ్చు చుండగా, ఆతడు పిడుగు వలె ధ్వనిని చేయుచూ, మొసలి ఏనుగును వలె, ఆయన వైపు వేగముగా పరుగెత్తి ఇట్లనెను: పారిపోవుట అనే నిందిం చదగిన పనిని సిగ్గు లేని దుష్టులు చేయకుందురా?
స గాముదస్తాత్సలిలస్య గోచరే
విన్యస్య తస్యామదధాత్స్వసత్త్వమ్ ।
అభిష్టుతో విశ్వసృజా ప్రసూనైః
ఆపూర్యమాణో విబుధైః పశ్యతోఽరేః ॥
జగత్కర్తయగు బ్రహ్మగారు వరాహ భగవానుని స్తుతించుచుండెను. దేవతలాయనను పుష్పవృష్టితో ముంచెత్తుచుండిరి. తనకేసి చూచు చున్న శత్రువగు హిరణ్యాక్షుని ఆయన లెక్కచేయలేదు. అప్పుడాయన ఆ భూమిని నీటికి పైన అనుకూలమగు స్థానమునందుంచి, దానియందు తన. ఆధారశక్తిని నిక్షేపించెను.
పరానుషక్తం తపనీయోపకల్పం
మహాగదం కాంచనచిత్రదంశమ్ ।
మర్మాణ్యభీక్ష్ణం ప్రతుదంతం దురుక్తైః
ప్రచండమన్యుః ప్రహసంస్తం బభాషే ॥
హిరణ్యాక్షుడు బంగరు ఆభరణములను, రంగు రంగుల బంగరు కవచమును ధరించియుండెను. ఆతడు పెద్ద గదను చేతబట్టి, పలుమార్లు పరుష వచనములతో వరాహ భగవానుని హృదయమునకు పీడను కలిగిం చుచుండెను. ఆయన మహాకోపము గలవాడై, బిగ్గరగా నవ్వుతూ, వానిని ఉద్దేశించి ఇట్లు పలికెను.
సత్యం వయం భో వనగోచరా మృగా
యుష్మద్విధాన్మృగయే గ్రామసింహాన్ ।
న మృత్యుపాశైః ప్రతిముక్తస్య వీరా
వికత్థనం తవ గృహ్ణాంత్యభద్ర ॥
శ్రీ వరాహ భగవానుడు ఇట్లు పలికెను --- ఓరీ దుష్ణా! నిజమే నేను అడవిలో తిరుగాడే (నీటిలో నివసించే) పశువునే. కాని, నీవంటి కుక్క లను వెదికి పట్టుకొనుటయే నా పని. మృత్యుపాశములచే కట్టివేత బడియున్న నీ బడాయి కబుర్లను వీరులు సరుకు చేయరు.
ఏతే వయం న్యాసహరా రసౌకసాం
గతహ్రియో గదయా ద్రావితాస్తే ।
తిష్ఠామహేఽథాపీ కథంచిదాజౌ
స్థేయం క్వ యామో బలినోత్పాద్య వైరమ్ ॥
మేము రసాతల వాసులగు మీకు ప్రజాపతి ఇచ్చిన భూమి అనే సొత్తును అపహరించే చోరులము. నీవు గదతో తరుముకొచ్చినా, మాకు సిగ్గు లేదు. కాని, ఏలాగో యుద్దరంగములో నిలిచియున్నాము. నిలబడక తప్పదు. బలశాలివగు నీతో వైరము పెట్టుకొని, ఎక్కడకు పోగలము?
త్వం పద్రథానాం కిల యూథపాధిపో
ఘటస్వ నోఽస్వస్తయ ఆశ్వనూహః ।
సంస్థాప్య చాస్మాన్ ప్రమృజాశ్రు స్వకానాం
యస్స్వాం ప్రతిజ్ఞాం నాతిపిపర్త్యసభ్యః ॥
పాదచారులగు వీరుల నాయకులకు నీవు అధినాయకుడవు గదా! వెంటనే శంకను విడనాడి మాకు అనిష్టమును కలిగించే ప్రయత్నమును చేయుము. మమ్ములను సంహరించి, నీ వారల కన్నీటిని తుడువుము. ప్రతిజ్ఞను చేసి దానిని పూర్తి చేయని వానికి పెద్ద మనుష్యుల మధ్య కూర్చునే అధికారము ఉండదు.
మైత్రేయ ఉవాచ ।
సోఽధిక్షిప్తో భగవతా ప్రలబ్దశ్చ రుషా భృశమ్ ।
ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానోఽహిరాణివ ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- వరాహ భగవానుడు హిరణ్యాక్షుని ఉద్దేశించి మహాకోపముతో ఈ విధముగా ఎత్తి పొడుపు మాటలను పలికి, వేళాకోళము కూడా చేసెను. అపుడాతడు అల్లరి చేయబడిన నాగ రాజు వలె తనలో భయంకరమగు కోపమును నింపుకొనెను.
సృజన్నమర్షితశ్శ్వాసాన్మన్యుప్రచలితేంద్రియః ।
ఆసాద్య తరసా దైత్యో గదయాభ్యహనద్ధరిమ్ ॥
ఆ రాక్షసుడు కోపముతో నిట్టూర్పులను విడుచుచుండెను. ఆతని ఇంద్రియములు కోపముచే క్షోభింప జేయబడెను. ఆతడు వేగముగా వరాహ భగవానుని సమీపించి, ఆయనను గదతో గట్టిగా కొట్టెను.
భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణోరసి ।
అవంచయత్తిరశ్చీనో యోగారూఢ ఇవాంతకమ్ ॥
శత్రువగు హిరణ్యాక్షుడు వరాహ భగవానుని వక్షఃస్థలమునందు వేగముగా గదతో కొట్టబోయెను. కాని, ఆయన ప్రక్కకు తిరిగి, యోగసిద్ధుడగు పురుషుడు మృత్యువును తప్పించుకునే విధముగా, ఆ దెబ్బను తప్పించుకొనెను.
పునర్గదాం స్వామాదాయ భామయంతమభీక్ష్ణశః ।
అభ్యధావద్ధరిః క్రుద్ధస్సంరంభాద్దష్టదచ్ఛదమ్ ॥
హిరణ్యాక్షుడు కోపముతో పెదవిని కొరుకుతూ, గదను మరల తీసుకొని గిర గిర త్రిప్పుచుండెను. అపుడు వరాహ భగవానుడు కోపించి వాని మీదకు ఉరికెను.
తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభుః ।
ఆజ ఘ్నే స తు తాం సౌమ్య గదయా కోవిదోఽహనత్ ॥
వరాహ భగవానుడు శత్రువును కుడి కనుబొమపై గదతో సాగదీసి కొట్టబోగా, నేర్పరియగు ఆ హిరణ్యాక్షుడు తన గదతో దానిని అడ్డుకొనెను.
ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవ చ ।
జిగీషయా సుసంరబ్ధావన్యోన్యమభిజఘ్నతుః ॥
ఈ విధముగా హిరణ్యాక్షుడు, వరాహ భగవానుడు గొప్ప క్రోధము గలవారై ఒకరినొకరు జయించవలెననే కోరికతో బరువైన గదలతో ఒకరినొకరు కొట్టుకొనిరి.
తయోస్స్పృధోస్తిగ్మగదాహతాంగయోః.
క్షతాస్రవఘ్రాణవివృద్ధమన్వోః ।
విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయా
వ్యభాదిలాయామివ శుష్మిణోర్మృధః ॥
వారిద్దరు ఒకరినొకరు మించాలనే పట్టుదలతో యుద్దమును చేయుచుండిరి. గదల పదునైన ధారలు తగిలి వారి శరీరములనుండి రక్తము ప్రసరించుచుండెను. ఆ రక్తగంధమునాఘ్రాణించగా, వారి కోపము ఇబ్బడి ముబ్బడిగా పెరిగెను. వారు భూమి కొరకై ఒకరినొకరు జయించవ లెననే కోరికతో రకరకముల పద్ధతులలో గదలను ప్రయోగించుచుండిరి. ఆవు కొరకై పోట్లాడే రెండు ఆబోతుల వలె వారు ప్రకాశించిరి.
దైత్యస్య యజ్ఞావయవస్య మాయా-
గృహీతవారాహతనోర్మహాత్మనః ।
కౌరవ్య మహ్యాం ద్విషతోర్విమర్దనం
దిదృక్షురాగాదృషిభిర్వృతస్స్వరాట్ ॥
ఓ విదురా! యజ్ఞములే అవయవములుగా గలవాడు, మాయాశ క్తిచే వరాహ రూపమును దాల్చినవాడు, పరబ్రహ్మ స్వరూపుడు అగు శ్రీహరి భూమి నిమిత్తమై హిరణ్యాక్షునితో యుద్ధము చేయుచుండెను. దానిని చూచుటకై బ్రహ్మగారు మహర్షులతో కూడి విచ్చే సెను.
ఆసన్నశౌండీరమపేతసాధ్వసం
కృతప్రతీకారమహార్యవిక్రమమ్ ।
విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీః
జగాద నారాయణమాదిసూకరమ్ ॥
ఆ హిరణ్యాక్షుడు గొప్ప ఉత్సాహముతో నిర్భయముగా దెబ్బకు దెబ్బ తీయుచూ పోరుచుండెను. వాని పరాక్రమములో తగ్గుదల కానవచ్చుట లేదు. వేలాది మహర్షులను వెంట బెట్టుకొని వచ్చియున్న పూజ్యుడగు బ్రహ్మగారు ఆ విషయమును గమనించి, ఆదివరాహరూపములో నున్న నారాయణునితో నిట్లనెను.
బ్రహ్మోవాచ ।
ఏష తే దేవ దేవానామంఘ్రిమూలము పేయుషామ్ ।
విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసామ్ ॥
ఆగస్కృద్భయకృద్దుష్కృదస్మద్రాద్ధవరోఽసురః ।
అన్వేషన్నప్రతిరథో లోకానటతి కంటకః ॥
ఓ దేవా! నేను ఈ రాక్షసునకు వరములనిచ్చి యుంటిని. వీడు నీ పాదమూలమును శరణు జొచ్చిన దేవతలకు, బ్రాహ్మణులకు; గోవులకు మరియు నిరపరాధులగు ప్రాణులకు హానిని, భయమును, దుఃఖమును కలి గించుచున్నాడు. లోకకంటకుడగు వీనికి సాటి లేరు. వీడు యుద్దమును చేయుటకై వీరులను వెదుకుతూ లోకములను సంచరించుచున్నాడు.
మైనం మాయావినం దృప్తం నిరంకుశమసత్తమమ్ ।
ఆక్రీడ బాలవద్దేవ యథాఽఽశీవిషముత్థితమ్ ॥
ఓ దేవా! వీడు మాయావి, గర్విష్టి, పరమదుష్టుడు. వీనిని నియం త్రించువారు లేరు. చిన్న పిల్లవాడు పడగ విప్పిన పాముతో ఆడినట్లుగా, నీవు వీనితో ఆటలాడవద్దు.
న యావదేవ వర్ధేత స్వాం వేలాం ప్రాప్య దారుణః ।
స్వాం దేవ మాయామాస్థాయ తావజ్జహ్యఘమచ్యుత ॥
ఓ అచ్యుత దేవా! భయంకరుడగు ఈ రాక్షసునకు బలమును వర్ధిల్లజేసే కాలము వచ్చే లోపులోనే, నీవు నీ మాయాశక్తిని ఆవిష్కరింపజేసి, ఈ పాపిని సంహరించుము.
ఏషా ఘోరతమా సంధ్యా లోకచ్చంబట్కరీ ప్రభో ।
ఉపసర్పతి సర్వాత్మన్ సురాణాం జయమావహ ॥
Summary of chapter 18 of the Bhāgavata Mahā Purana is as follows:
Hiraṇyāksha locates Lord Varāha as the Lord is gently placing the rescued earth upon the surface of the waters, and the demon hurls arrogant taunts and insults at the Supreme Lord. Placing the earth safely, Lord Varāha engages the powerful demon in a fierce duel in the cosmic ocean, matching mace against mace as Lord Brahmā and the demigods watch with intense anxiety.