భాగవత మహా పురాణము
24 - శ్రీ కపిల భగవానుడు జన్మించుట
మైత్రేయ ఉవాచ :
నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం మునిః ।
దయాలుశ్శాలినీమాహ శుక్లాధివ్యాహృతం స్మరన్ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఉత్తమగుణ ములతో ప్రకాశించే మనుపుత్రియగు దేవహూతి వైరాగ్యము నిండిన పలు కులను పలికెను. అప్పుడు దయాస్వభావము గల కర్దముడు శ్రీహరి చెప్పిన విషయములను స్మరించి ఆమెతో నిట్లనెను.
ఋషిరువాచ ।
మా ఖిదో రాజపుత్రోత్థమాత్మానం ప్రత్యనిందితే ।
భగవాంస్తేక్షరో గర్భమదూరాత్సంప్రపత్స్యతే ॥
కర్దమ మహర్షి ఇట్లు పలికెను --- దోషమునేరుంగని ఓ రాజకు మారీ! ఈ విధముగా నీ గురించి నీవు ఖేదపడకుము. అక్షర పరబ్రహ్మస్వ రూపుడగు శ్రీహరి తొందరలోనే నీ గర్భమునందు ప్రవేశించగలడు.
ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ ।
తపోద్రవిణదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ ॥
నీవు వ్రతములననుష్ఠించిన దానవు. నీకు మంగళమగు గాక! నీవు ఇంద్రియములను నిగ్రహించి నియమమును పాటిస్తూ ధనాదికమును దానము చేసి శ్రద్ధతో ఈశ్వరుని గురించి తపస్సును చేయుము.
స త్వయారాధితశ్శుక్లో వితన్వన్మామకం యశః ।
ఛేత్తా తే హృదయగ్రంథిమౌదర్యో బ్రహ్మభావనః ॥
నీచే ఆరాధించబడిన ఆ శ్రీహరి నీకు పుత్రుడై పుట్టి, నా కీర్తిని విస్త రింపజేసి, నీకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి, నీ అజ్ఞానమనే హృదయగ్రంథిని నిర్మూలించగలడు.
మైత్రేయ ఉవాచ ।
దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేః ।
సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థమభజద్గురుమ్ ॥
దేవహూతి కూడ కర్దమ ప్రజాపతియొక్క సందేశమును చక్కగా మర్యాదగా శ్రద్ధతో స్వీకరించెను. నిర్వికారుడు, జగత్తునకు తండ్రి, గురువు, తనకు గురువు కాబోవువాడు అగు పురుషోత్తముని ఆమె సేవించెను.
తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదనః ।
కార్ధమం వీర్యమాపన్నో జజ్ఞేగ్నిరివ దారుణి ॥
చాల రోజులు గడిచిన తరువాత మధువు అనే రాక్షసుని సంహరిం చిన శ్రీహరి భగవానుడు కర్దముని వీర్యము ద్వారా ఆమెయందు, కట్టె యందు అగ్నివలె, జన్మించెను.
అహిదయంస్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః ।
గాయంతి తం స్మ గంధర్వా నృత్యంత్యప్సరసో ముదా ॥
అప్పుడు ఆకాశములో మేఘములు వాద్య ఘోషలవంటి గర్జన లను చేయుచూ వర్షించినవి. గంధర్వులు శ్రీహరి గాథలను గానము చేయగా, అప్సరసలు నాట్యమును చేసిరి.
పేతుస్సుమనసో దివ్యాః ఖేచరైరపవర్జితాః ।
ప్రసేదుశ్చ దిశస్సర్వా అంభాంసి చ మనాంసి చ ॥
దేవతలు దేవలోకమునందలి పుష్పములను వర్షించిరి. దిక్కుల న్నియు నిర్మలములైనవి. జలాశయములు, సకలప్రాణుల మనస్సులు కూడ నిర్మలములైనవి.
తత్కర్ధమాశ్రమపదం సరస్వత్యా పరిశ్రితమ్ । స్వయంభూస్సాకమృషిభిర్మరీచ్యాదిభిరభ్యయాత్ ॥
సరస్వతీనదిచే చుట్టువారబడియున్న కర్దముని ఆశ్రమమునకు - బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులతో గూడి విచ్చే సెను.
భగవంతం పరం బ్రహ్మ సత్త్వేనాం శేన శత్రుహన్ ।
తత్త్వసంఖ్యానవిజ్ఞప్త్యై జాతం విద్వానజస్స్వరాట్ ॥
సభాజయన్ విశుద్దేన చేతసా తచ్చికీర్షితమ్ ।
ప్రహృష్యమాణైరసుభిః కర్దమం చేదమభ్యధాత్ ॥
అంతశ్శత్రువులను జయించిన ఓ విదురా! పరబ్రహ్మ స్వరూపు డగు శ్రీహరి భగవానుడు సత్త్వగుణప్రధానమగు అంశతో జన్మించినాడని పుట్టుక లేని బ్రహ్మగారికి తెలియును. ఆయన ప్రకృతి మొదలగు తత్త్వము లను నిరూపించే శాస్త్రమును లోకములో బోధించ గోరుచున్నాడని కూడ స్వయంసిద్ధజ్ఞానసంపన్నుడగు బ్రహ్మగారికి తెలియును. ఆయన ఇంద్రియ ములన్నియు అతిశయించిన ఆనందమును ప్రకటించుచుండెను. ఆయన పరిశుద్ధమగు మనస్సుతో భగవానుని సంకల్పమునభినందించి, కర్దము నితో నిట్లనెను
బ్రహ్మోవాచ ।
త్వయా మేపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః ।
యన్మే సంజగృహే వాక్యం భవాన్మానద మానయన్ ॥
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ వత్సా! పెద్దలకు మర్యాదనిచ్చే స్వభావము నీది. నీవు నాకు నిష్కపటముగా పూజను చేసితివి. ఏలయన గా, నీవు నా ఆజ్ఞను మర్యాదతో పాలించితివి.
ఏతావత్యేవ శుశ్రూషా కార్యా పితరి పుత్ర కైః ।
బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః ॥
పుత్రులు తండ్రికి ఇంతమాత్రము సేవను చేయవలెను. అది యేది న, వారు తండ్రి మాటను గౌరవముతో సరే అని అంగీకరించవలెను.
ఇమా దుహితరస్సభ్య తవ వత్స సుమధ్యమాః ।
సర్గమేతం ప్రభావైస్వైర్బృహయిష్యంత్యనేకధా ॥
ఓ కుమారా! నీవు యోగ్యుడవు. నీ ఈ కుమార్తెలు సుందరులు వీరు తమ వంశముల ద్వారా ఈ సృష్టిని పలువిధముల వర్ధిల్లజేయగలరు.
అతస్త్వమృషిముఖ్యేభ్యో యథాశీలం యథారుచి ।
ఆత్మజాః పరిదేహ్యద్య విస్తృణీహి యశో భువి ॥
కావున నీవీ కాలములో మహర్షులకు వారి వారి స్వభావమునకు రుచులకు తగ్గట్లుగా నీ కుమార్తెలనిచ్చి వివాహము చేసి, భూలోకములో నీ కీర్తిని విస్తరింపజేయుము.
వేదాహమాద్యం పురుషమవతీర్ణం స్వమాయయా ।
భూతానాం శేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే ॥
ఓ మహర్షీ! నాకు తెలుసు. సకలప్రాణులకు నిధి (మనోరథములనీ డేర్చువాడు), ఆదిపురుషుడు అగు శ్రీహరి తన మాయచే దేహమును దాల్చి కపిలునిగా అవతరించినాడు.
జ్ఞానవిజ్ఞానయోగేన కర్మణాముద్దరన్ జటాః ।
హిరణ్య కేశః పద్మాక్షః పద్మముద్రాపదాంబుజః ॥
ఏష మానవి తే గర్బం ప్రవిష్టః కైటభార్దనః ।
అవిద్యాసంశయగ్రంథిం ఛిత్త్వా గాం విచరిష్యతి ॥
ఓ మనుపుత్రీ! తేజోమయమగు కేశములు గలవాడు, పద్మముల వంటి కన్నులు పాదములు గలవాడు, పాదములయందు పద్మాకారపు రేఖలు గలవాడు, కైటభాసురుని సంహరించినవాడు అగు శ్రీహరి నీ గర్భ మును ప్రవేశించి ఈ కపిలుడై జన్మించినాడు. ఆత్మస్వరూపమును తెలి యుట, దానియందు నిష్ఠను కలిగియుండుట అనే యోగవ ) ద్వారా ఈయన జిజ్ఞాసువుల వాసనలను నశింపజేయగలడు. ఈ వాసనలే కర్మలకు మూలములోనుండి బంధించుచున్నవి. ఈయన స్వరూపముయొక్క అజ్ఞానము, ఇతరసంశయములు అనే జనుల హృదయగ్రంథిని ఛేదిస్తూ, భూలోకములో పర్యటించగలడు.
అయం సిద్ధగణాధీశస్సాంఖ్యాచార్యైస్సుసమ్మతః ।
లోకే కపిల ఇత్యాఖ్యాం గంతా తే కీర్తివర్ధనః ॥
ఈ బాలకుడు సిద్ధుల గణములకు అధీశ్వరుడై, తత్త్వనిరూపణ మును చేసే సాంఖ్యశాస్త్రములో విద్వాంసులగు మహాత్ములచే ఆదరించ బడగలడు. ఈయన లోకములో కపిలుడను పేరిట ప్రసిద్ధిని గాంచి, నీ కీర్తిని ఇనుమడింప జేయగలడు.
మైత్రేయ ఉవాచ ।
తావాశ్వాస్య జగత్స్రష్టా కుమారైస్సహనారదః ।
హంసో హం సేన యానేన త్రిధామ పరమం యమౌ ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- సృష్టికర్తయగు బ్రహ్మగారు ఈ విధముగా దేవహూతికి కర్దమునకు నచ్చజెప్పి, సనకాదులు నారదుడు వెంట రాగా, తన హంసవాహనముపై బ్రహ్మాండములో సర్వోత్కృష్టమగు బ్రహ్మలోకమునకు వెళ్లాను.
గతే శతధృతౌ క్షత్తః కర్దమ స్తేన చోదితః ।
యథోదితం స్వదుహిత్యః ప్రాదాద్విశ్వసృజాం తతః ॥
ఓ విధురా! బ్రహ్మగారు వెళ్లిన తరువాత ఆయన ఆజ్ఞ ప్రకార ముగా కర్దముడు తన కుమార్తెలను ప్రజాపతులకు ఇచ్చి యథావిధిగా వివా హములను చేసెను.
మరీచయే కలాం ప్రాదాదనసూయామథాత్రయే ।
శ్రద్ధామంగిర సేయచ్ఛత్పులస్త్యాయ హవిర్భువమ్ ॥
పులహాయ గతిం యుక్తాం క్రతవే చ క్రియాం సతీమ్ ।
ఖ్యాతిం చ భృగవేయచ్చద్వసిష్టాయాప్యరుంధతీమ్ ॥
కర్దముడు పులహునకు యోగ్యురాలగు గతిని, క్రతువునకు సాధ్వి యగు క్రియను, భృగువునకు ఖ్యాతిని, వసిష్ఠునకు అరుంధతిని ఇచ్చి వివాహము చేసెను.
అథర్వణీదదాచ్చాంతిం యయా యజ్ఞో వితన్యతే ।
విప్రర్షభాన్ కృతోద్వాహాన్ సదారాన్ సమలాలయత్ ॥
ఆయన శాంతిని అథర్వణునకు ఇచ్చి వివాహము చేసెను. శాంతి వలననే యజ్ఞములు సమృద్ధములగును. వివాహమాడి భార్యలతో గూడి యున్న ఆ మహర్షులను కర్దముడు బహుమానములతో సంతోష పెట్టెను.
తతస్త ఋషయః క్షత్తః కృతధారా నియంత్య్రతమ్ ।
ప్రాతిష్ఠన్ నందిమాపన్నాస్స్వం స్వమాశ్రమమండలమ్ ॥
ఓ విదురా! తరువాత భార్యలతో గూడియున్న ఆ మహర్షులు అనందించి కర్దముని సెలవు తీసుకొని, తమ తమ ఆశ్రమములకు వెళ్లిరి.
స చావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విబుధర్షభమ్ ।
వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత ॥
కర్దముడు కూడ దేవశ్రేష్ఠుడు, కృతవ్రేతాద్వాపరములు అనే మూడు యుగములలో మాత్రమే దర్శనమిచ్చువాడు (ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే మూడు రెళ్లు ఆరు గుణములతో సంపన్నుడు) అగు శ్రీహరి అవతరించినాడని తెలుసుకొని, ఏకాంతములో ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి సంభాషించేను.
అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమంగలైః ।
కాలేన భూసా నూనం ప్రసీదంతీహ దేవతాః ॥
ఆశ్చర్యము! తమ పాపములచే నరకమువంటి ఈ సంసారము నందు, పీడలను పొందుతున్న జనులపై చాల కాలము తరువాత దేవత లకు అనుగ్రహము కలిగినది. ఇది నిశ్చయము.
బహుజన్మవిపక్వేన సమ్యగ్యోగసమాధినా ।
ద్రష్టుం యతంతే యతయశ్శూన్యాగారేషు యత్పదమ్॥
సాధకులు అనేకజన్మలలో యోగమును అభ్యసించుట వలన అది సుదృఢమై చిత్తమునకు ఏకాగ్రత లభించును. వారు నిర్జనప్రదేశమునందు అట్టి చిత్తములో ఆ శ్రీహరియొక్క స్వరూపమును దర్శించుటకు ప్రయత్నించుచుందురు.
స ఏవ భగవానద్య హేలనం నగణయ్య నః ।
గృహేషు జాతో గ్రామ్యాణాం యస్స్వానాం పక్షపోషణః॥
శ్రీహరి భగవానుడు తన భక్తుల పక్షమును సమర్థించును. కావున నే, అట్టి ఆ భగవానుడు తాను చులకన అగుదునేమో యని సరకు చేయ కుండా, ఈనాడు అవివేకులమగు మా ఇంటిలో జన్మించినాడు.
స్వీయం వాక్యమృతం కర్తుమవతీర్ణోసి మే గృహే ।
చికీర్షుర్భగవాన్ జ్ఞానం భక్తానాం మానవర్ధనః ॥
భగవానుడవగు నీవు భక్తుల హోదాను వర్ధిల్లజే సెదవు. నీవు సాంఖ్యశాస్త్రమును లోకములో ప్రవర్తిల్ల జేయగోరి, నాకిచ్చిన మాటను యథార్థము చేయుటకై నా గృహములో అవతరించితివి.
తాన్యేవ తేభిరూపాణి రూపాణి భగవంస్తవ ।
యాని యాని చ రోచంతే స్వజనానామరూపిణః ॥
ఓ భగవానుడా! నీవు రూపము లేనివాడవు. నీ భక్తులకు నీ ఏయే రూపములు ఇష్టమగునో, అవియే నీకు కూడ అభీష్టములగుచున్నవి,
త్వాం సూరిభిస్తత్త్వబుభుత్సయాద్దా
సదాభివాదార్హణపాదపీఠమ్ ।
ఐశ్వర్యవైరాగ్యయశోకవబోధ-
వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే ॥
విద్వాంసులు తత్త్వముల స్వరూపమును తెలియగోరి సర్వదా సాక్షాత్తుగా నీ పాదపీఠమునకు నమస్కరించెదరు. ఈశ్వరభావము, వైరా గ్యము, యశస్సు, జ్ఞానము, వీర్యము (శక్తి), శ్రీ (సంపద, శోభ) అనే ఆరు గుణములు నీలో పూర్ణముగా నున్నవి. నిన్ను నేను శరణు వేడుచున్నాను.
పరం ప్రధానం పురుషం మహాంతం
కాలం కవిం త్రివృతం లోకపాలమ్ ।
ఆత్మానుభూత్యానుగతప్రపంచం
స్వచ్ఛందశక్తిం కపిలం ప్రపద్యే ॥
నీవు ప్రకృతికి అతీతుడవు. జగత్తునకు ఉపాదానమగు ప్రధానము, దానికి అధ్యక్షుడగు పురుషుడు, దాని ప్రథమకార్యమగు మహత్తత్త్వము (సమష్టి బుద్దిశక్తీ), ప్రధానములో సంక్షోభమును కలిగించే కాలము, సాత్త్విక రాజస తామసములనే అహంకారములు, ఇంద్రాది లోకపాలకులు నీ రూప ములే. సర్వజ్ఞుడవగు నీవు ప్రకృతిలోని పరిణామమును దర్శించే సాక్షివి. నీవు నీ చిచ్చక్తిచే బ్రహ్మాండమును వ్యాపించి నీలో విలీనము చేసెదవు. శక్తులన్నియు నీ వశములోనుండును. కపిలభగవానుడవగు నిన్ను నేను శరణు వేడుచున్నాను.
ఆ స్మాభిపృచ్ఛేద్య పతిం ప్రజానాం
త్వయావతీర్ణార్ణ ఉతాప్తకామః ।
పరివ్రజత్పదవీమాస్థితోహం
చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః ॥
నీవు ప్రాణులకు ప్రభుడవు. నేనీనాడు నీ అనుమతిని కోరుచునా ను. నీవు నాకు పుత్రుడవై జన్మించుటచే నా ఋణములన్నియు తీరిపోయి నవి. నీ అనుగ్రహముచే నా కోరికలు సిద్ధించినవి. నేను సన్న్యా సాశ్రమ మును స్వీకరించి నిన్ను మనస్సులో ధ్యానిస్తూ నిశ్చింతగా చరించెదను.
శ్రీభగవానువాచ ।
మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే ।
అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే ॥
శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- వైదిక లౌకిక కర్మలలో మానవ నకు నేను చెప్పినదే ప్రమాణము. నీ పుత్రుడనై జన్మించెదనని నేను నీ చెప్పియుంటిని. ఆ మాటను సత్యము చేయుటకై జన్మించితిని.
ఏతన్మే జన్మ లో కేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ।
ప్రసంఖ్యానాయ తత్త్వానాం సమ్మతాయాత్మదర్శనే ॥
కలుషితమగు అంతఃకరణము జీవుని లింగశరీరరూపములో బంధించును. దానినుండి విముక్తిని పొంది ఆత్మసాక్షాత్కారమును కోరువారలకు తత్త్వముల వివేకపూర్వకమగు అవగాహన ఆవశ్యకము. దానిని బోధించుటకు నేనీ లోకములో ఈ విధముగా అవతరించితిని.
ఏష ఆత్మపథోవ్యక్తి నష్టః కాలేన భూయసా ।
తం ప్రవర్తయితుం దేహమిమం విద్ధి మయా భృతమ్ ॥
ఈ ఆత్మజ్ఞానము అనే మోక్షమార్గము చాల సూక్ష్మమైనది. కాల ముయొక్క దీర్ఘమగు ప్రవాహములో ఇది కనుమరుగైనది. దీనిని మరల లోకములో ప్రవర్తిల్ల జేయుటకై నేనీ దేహమును దాల్చినానని తెలియుము.
గచ్ఛ కామం మయాపృష్ఠా మయి సన్న్యస్తకర్మణా ।
త్వా సుదుర్జయం మృత్యుమమృతత్వాయ మాం భజ॥
నేను నీకు అనుజ్ఞనిచ్చుచున్నాను. యథేచ్చగా వెళ్లుము. మృత్యు వును జయించి మోక్షమును పొందుట చాల కష్టము. కాని, కర్మలను నాకు సమర్పించుట ద్వారా మృత్యువును జయించవచ్చును. అట్లు చేసి నన్ను భజించుము.
మామాత్మానం స్వయంజ్యోతిస్సర్వభూతగుహాశయమ్ ।
ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకోకభయమృచ్ఛసి ॥
. నేను స్వయంప్రకాశస్వరూపుడను; సకలప్రాణుల బుద్దిగుహలో నివసించెదను. నన్ను నీవు నీయందే బుద్ధిచే . ఆత్మరూపునిగా దర్శించుము. నీ శోకము పోయి, అభయస్థానమగు మోక్షము లభించును.
మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణామ్ ।
వితరిష్యే యయా చాసౌ భయం చాతితరిష్యతి ॥
ఆత్మతత్త్వమును ప్రకాశింపజేసే విద్యను నేను అమ్మకు కూడ బోధించెదను. దానిచే ఆమె సర్వకర్మల బంధమునతిక్రమించి సంసారభ యమునుండి బయట పడగలదు.
మైత్రేయ ఉవాచ ।
ఏవం సముచిత స్తేన కపిలేన ప్రజాపతిః ।
దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామ హ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- కపిల భగవానుడు ఈ విధముగా చక్కగా అనుమతినీయగా, కర్దమ ప్రజాపతి సంతోషించి, ఆయనకు ప్రదక్షి ణము చేసి అడవికి వెళ్లేను.
వ్రతం స ఆస్థితో మౌనమాత్మైకశరణో మునిః ।
నిస్సంగో వ్యచరత్ క్షోణీమనగ్నిరనికేతనః ॥
మననశీలుడగు కర్దముడు ఆత్మను మాత్రమే ఆశ్రయించి సంసార మునందలి ఆసక్తిని పరిత్యజించేను. సన్న్యసించుటచే ఆయనకు అగ్నిహో త్రాది కర్మలతో సంబంధము తప్పినది. పరివ్రాజకుడగుటచే ఆయనకు స్థిర నివాసము లేదు. ఆయన మౌనవ్రతమును స్వీకరించి భూలోకములో సంచ రించెను.
మనో బ్రహ్మణి యుంజానో యత్తత్సదసతః పరమ్ ।
గుణావభాసో విగుణ ఏకభక్త్యానుభావితే ॥
కార్యకారణములకు అతీతమైన పరబ్రహ్మ స్వయముగా నిర్గుణ మై, సత్త్వరజస్తమోగుణములను తన చైతన్యప్రకాశములో ప్రకాశింప జేయును. ఏకాంతమగు భక్తిచే దానిని ఆత్మరూపముగా దర్శించదగును. ఆయన అట్టి పరబ్రహ్మయందు మనస్సును ఏకాగ్రము చేసి సంచరించెను.
నిరహంకృతీర్నిర్మమశ్చ నిర్ద్వంద్వస్సమదృక్ స్వదృక్ ।
ప్రత్యక్-ప్రశాంతధీర్ధరః ప్రశాంతేర్మిరివోదధిః ॥
ఆయనయందు అహంకార మమకారములు లేకుండెను. ఆయన సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడై సంచరించెను. ఆయన సర్వత్రా పరమాత్మను మాత్రమే దర్శించెడివాడు. ఆత్మనిష్ఠ గల ఆయన బుద్ధి స్వరూపనిష్టమై ప్రసన్నముగా నుండెడిది. ఆత్మానాత్మవివేకము గల కర్ద ముడు తరంగములు సద్దుమణిగిన సముద్రమువలె ప్రశాంతగంభీరుడై యుండెను.
వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని ।
పరేణ భక్తిభావేన లబ్ధాత్మా ముక్తబంధనః ॥
సర్వజ్ఞుడు, ప్రత్యగాత్మ స్వరూపుడు అగు వాసుదేవ భగవానుని యందు సర్వాతిశాయియగు భక్తిభావముతో స్థిరముగా నిలిచిన బుద్దిగల కర్దముడు సంసారబంధము తొలగి జీవన్ముక్తుడయ్యెను.
ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితమ్ ।
అపశ్యత్సర్వభూతాని భగవత్యపి చాత్మని ॥
సకలప్రాణులలో భగవానుడే ఆత్మరూపముగా నిలిచియున్నాడని ఆయన దర్శించగలెను. ఇంతేగాక, సకలప్రాణులు ఆత్మరూపుడగు భగవా నునియందే ఉనికిని కలిగియున్నవని ఆయన దర్శించగల్గినాడు.
ఇచ్చాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా ।
భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతీ గతిః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే చతుర్వింశోధ్యాయః ॥
కర్దమునియందు రాగద్వేషములు లేవు. ఆయన అంతటా వ్యాపిం చియున్న భగవానుని మాత్రమే చూచుటచే, ఆయనయందు భేదదృష్టి లేదు. ఆయన మనస్సు భగవానునియందు భక్తితో నిండియుండెను. ఆయన భగవానుని పరమపదము (మోక్షము) ను పొందెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 24 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the birth of nine daughters who are married to exalted sages, the Supreme Lord fulfills His promise and takes birth from the womb of Devahūti as the divine incarnation Kapila. Knowing that the Lord has descended as his son to teach the path of self-realization, Kardama Muni offers profound prayers of gratitude, circumambulates his divine child, and retires to the forest to achieve complete spiritual liberation.