భాగవత మహా పురాణము
17 - హిరణ్యాక్షుని దిగ్విజయము
మైత్రేయ ఉవాచ ।
నిశమ్యాత్మభువా గీతం కారణం శంకయోజ్ఘితాః ।
తతస్సర్వే న్యవర్తంత త్రిదివాయ దివౌకసః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- స్వయంభువుడగు బ్రహ్మగారు దేవతల తేజస్సు క్షీణించుటకు గల కారణమును ఈ విధముగా వర్ణించి చెప్పెను. దానిని విని దేవతలందరి సందేహములు తొలగిపోయేను. అపుడు వారు స్వర్గమునకు మరలి వెళ్లిరి.
దితిస్తు భర్తురాదేశాదపత్యపరిశంకినీ ।
పూర్ణే వర్షశతే సాధ్వీ పుత్రౌ ప్రసుషువే యమౌ ॥
సాధ్వియగు దితి భర్తయగు కశ్యపుడు చెప్పిన దానిని బట్టి తనకు కలుగబోయే సంతానము లోకమునకు ముప్పు తెచ్చునని శంకించుచునే యుండెను. ఆమె వంద సంవత్సరముల పిదప కవల మగపిల్లలను కనెను.
ఉత్పాతా బహవస్తత్ర ని పేతుర్జాయమానయోః ।
దివి భువ్యంతరిక్షే చ లోకస్యోరుభయావహాః ॥
వారిద్దరు జన్మించుచుండగా ఆ సమయములో, స్వర్గమునందు అంతరిక్షములో మరియు భూమిపై జనులకు గొప్ప భయమును కలిగించే అనేకములగు ఉత్పాతములు ఆవిర్భవించినవి.
సహాచలా భువశ్చేలుర్దిశస్సర్వాః ప్రజజ్వలుః ।
సోల్కాశ్చాశనయః పేతుః కేతవశ్చార్తి హేతవః ॥
పర్వతములతో సహా భూఖండములు కంపించినవి. దిక్కులలో అగ్నిజ్వాలలు బయలు దేరినవి. ఉల్కలు, పిడుగులు పడినవి. లోకపీడను కలిగించే తోకచుక్కలు పొడిచినవి.
వనౌ వాయుస్సుదుస్స్పర్శః పూత్కారానీరయన్ముహుః ।
ఉన్మూలయన్నగపతీన్వాత్యానీకో రజోధ్వజః ॥
మిక్కిలి కఠినమగు స్పర్శగల వాయువు నిరంతరముగా ఊలలను పెట్టుచూ వీచెను. ఆ వాయువునకు సుడులే సేన కాగా, ఎత్తుగా లేచిన దుమ్మే ధ్వజమాయెను. దాని ధాటికి పెద్ద పెద్ద వృక్షములు పెకిలించి వేయబడుచుండెను.
ఉద్ధసత్తడిదంభోదఘటయా నష్టభాగణే ।
వ్యోమ్ని ప్రవిష్టతమసా న స్మ వ్యాదృశ్యతే పదమ్ ॥
ఆకాశములో ఎత్తున మెరుపు తీగలు నవ్వుచున్నట్లు మెరయుచుం డెను. మేఘముల గుంపు ఆకాశమును కప్పివేయగా చీకట్లు క్రమ్ముకొనెను. సూర్యుడు, చంద్రుడు మొదలగు జ్యోతిర్మండలములు గాని, నక్షత్రముల గుంపులు గాని కనబడలేదు. ఎక్కడైననూ ఏ వస్తువైననూ కానరాలేదు.
చుక్రోశ విమనా వార్ధిరుదూర్మిః క్షుభితోదరః ।
సోదపానాశ్చ సరితశ్చుక్షుభుశ్శుష్కపంకజాః ॥
సముద్రము లోపల కలిచివేయబడి తరంగములు ఉప్పొంగెను. సముద్రము వికలమైన మనస్సు గలవాని వలె ఆక్రోశించేను. మంచినీటి సరస్సులు, నదులు కల్లోలితములయ్యెను. వాటిలోని పద్మములు వాడిపోయెను.
ముహుః పరిధయోఽభూవన్ సరాహ్వోశ్శశిసూర్యయోః ।
నిర్ఘాతా రథనిర్ర్హాదా వివరేభ్యః ప్రజజ్ఞిరే ॥
చంద్రగ్రహణములు, సూర్యగ్రహణములు కలిగినవి. సూర్యచం ద్రుల చుట్టూ నిరంతరముగా పరివేషములు (కాంతి గూడు కట్టుట) కలిగిన వి. మేఘములు లేకుండగనే గర్జనలు వినబడినవి. పర్వతగుహలనుండి ! రథము పరుగెత్తే ధ్వని వంటి ధ్వని బయలు దేరినది.
అంతర్గ్రామేషు ముఖతో వమంత్యో వహ్నిముల్బణమ్ ।
సృగాలోలూకటంకాః ప్రణేదురశివం శివాః ॥
గ్రామముల మధ్యలో ఆడు నక్కలు నిప్పును గ్రక్కుచూ అమంగ ళకరముగా బిగ్గరగా కూసినవి. మగనక్కలు, గుడ్లగూబలు వాటికి తోడైనవి.
సంగీతవద్రోదనవదున్నమయ్య శిరోధరామ్ ।
వ్యముంచన్ వివిధ వాచో గ్రామసింహాస్తతస్తతః ॥
అక్కడక్కడ కుక్కలు మెడలను పైకెత్తి అనేకవిధముల శబ్దము లను చేసినవి. వాటిలో కొన్ని ధ్వనులు సంగీతమును, మరికొన్ని ఏడ్పును పోలియుండెను.
ఖరాశ్చ కర్కశైః క్షత్తః ఖురైర్ఘ్నంతో ధరాతలమ్ ।
ఖారారరభసా మత్తాః పర్యధావన్ వరూథశః ॥
ఓ విదురా! మత్తెక్కిన గాడిదలు గుంపులుగా చేరి డెక్కలతో నేలను త్రవ్వుచూ ఖరఖర శబ్దమును చేయుచూ హడావుడిగా ఇటునటు పరుగులు తీసినవి.
రుదంతో రాసభత్రస్తా నీడాదుదపతన్ ఖగాః ।
ఘోషేఽరణ్యే చ పశవశ్శకృన్మూత్రమకుర్వత ॥
గాడిదల ఓండ్ర ధ్వనులకు భయపడి పక్షులు ఏడుస్తూ గూళ్ల నుండి ఎగిరి నేలగూలినవి. గొల్లపల్లేలయందు, అరణ్యములయందు పశువులు భయముచే మలమూత్రములను విడిచి పెట్టుచుండెను.
గావోత్రసన్నసృగ్ధోహాస్తోయదాః పూయవర్షిణః ।
వ్యరుదన్ దేవలింగాని ద్రుమాః పేతుర్వినానిలమ్ ॥
ఆవులు బెదిరిపోతూ పొదుగులనుండి రక్తమును స్రవించినవి. మేఘములు చీమును వర్షించినవి. దేవతల ప్రతిమలు విశేషముగా కన్నీటిని కార్చినవి. చెట్లు గాలి లేకుండగనే నేల గూలినవి.
గ్రహాన్ పుణ్యతమానన్యే భగణాంశ్చాపి దీపితాః ।
అతిచేరుర్వక్రగత్యా యుయుధుశ్చ పరస్పరమ్ ॥
ప్రకాశించే క్రూరగ్రహములు శుభకరమగు గ్రహములను, మరియు నక్షత్రగణములను కూడ వక్రమార్గము గుండా దాటి సంచరించ వొచ్చినవి. అవి ఒకదానితో మరియొకటి పోటీ పడినవి.
దృష్ట్వాన్యాంశ్చ మహోత్పాతానతత్తత్త్వవిదః ప్రజాః ।
బ్రహ్మపుత్రానృతే భీతా మేనిరే విశ్వసంప్లవమ్ ॥
ఇంతే గాక, ఇతరములగు పెద్ద ఉత్పాతములు కూడ బయలు దేరినవి. వాటి రహస్యమునెరుంగని జనులు వాటిని చూచి భయపడి జగ త్తునకు ప్రళయము దాపురించినదని తలపోసిరి. బ్రహ్మపుత్రులగు సనకాది మహర్షులు మాత్రము సర్వము తెలిసినవారగుటచే భయపడలేదు.
తావాదిదైత్యౌ సహసా వ్యజ్యమానాత్మపౌరుషౌ ।
వవృధాతేఽశ్మసారేణ కాయేనాద్రిపతీ ఇవ ॥
దితియొక్క ప్రథమసంతానమగు ఆ రాక్షసులిద్దరు వెంటనే తమ పరాక్రమమును ప్రకటించువారై, ఇనుము వలె దృఢమైన దేహములు గల వారై, పెద్ద పర్వతముల వలే పెరిగి పెద్దవారైరి.
దివిస్పృశౌ హేమకిరీటకోటిభిః
నిరుద్ధకాష్ఠౌ స్ఫురదంగదాభుజౌ ।
గాం కంపయంతౌ చరణైః పదే పదే
కట్యా సుకాంచ్యార్కమతీత్య తగ్ధతుః ॥
దిక్కులను వ్యాపించియున్న వారిద్దరి బంగరు కిరీటముల కొనలు ద్యులోకమును తాకుచుండెను. వారి భుజములయందు బాహుపురులు, నడుమునందు అందమైన మొలనూలు ప్రకాశించుచుండెను. వారు వేసే ప్రతి అడుగునకు భూమి కంపించుచుండెను. వారు సూర్యుని కoటే అధికముగా ప్రకాశించుచుండిరి.
ప్రజాపతిర్నామ తయోరకార్షీద్
యః ప్రాక్ స్వదేహాద్యమయోరజాయుత ।
తం వై హిరణ్యకశిపుం విదుః ప్రజా
యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః ॥
ఆ కవల పిల్లలిద్దరికీ కశ్యప ప్రజాపతి నామకరణము చేసెను. వారిలో ముందుగా ప్రజాపతిగారి దేహమునుండి పుట్టిన (జన్మక్రమములో రెండవ వాడు) వానిని హిరణ్యకశిపుడనియు, ఎవనిని దితి ముందుగా కనెనో వానిని హిరణ్యాక్షుడనియు జనులు వ్యవహరించుచున్నారు.
చక్రే హిరణ్యకశిపుర్దోర్భ్యాం బ్రహ్మవరేణ చ ।
వశే సపాలాన్ లోకాంస్త్రీనకుతోమృత్యురుద్దతః ॥
హిరణ్యకశిపుడు తన భుజబలముచే చాల గర్వించి, బ్రహ్మ గారినుండి దేనివలనైననూ మరణము లేని విధముగా వరమును పొంది, లోకపాలకులతో సహా ముల్లోకములను తన వశములో నుంచుకొనెను.
హిరణ్యాక్షోఽఽనుజస్తస్య ప్రియః ప్రీతికృదన్వహమ్ ।
గదాపాణిర్దివం యాతో యుయుత్సుర్మృగయన్ రణమ్ ॥
వాని అనుంగు తమ్ముడగు హిరణ్యాక్షుడు నిత్యము అన్నగారికి ప్రీతిని కలిగించెడివాడు. ఆతనికి యుద్ధమునందు ప్రీతి మెండు. ఆతడు గదను చేతబట్టి, యుద్ధమును చేసే అవకాశము కొరకు వెదుకుకుంటూ, స్వర్గమునకు వెళ్లాను.
తం వీక్ష్య దుస్సహజవం రణత్కాంచననూపురమ్ ।
వైజయంత్యా స్రజా జుష్టమంసన్యస్తమహాగదమ్ ॥ మనోవీర్యవరోత్సిక్తమసృణ్యమకుతోభయమ్ ।
భీతా నిలిల్యిరే దేవాస్తార్క్ష్య త్రస్తా ఇవాహయః ॥
హిరణ్యాక్షుని వేగమును సహించుట చాల కష్టము. ఆతడు భుజముపై పెద్ద గదను పెట్టుకొని నడుచుచుండగా కాలి బంగరు పెండెరములు గణగణలాడుచుండెను. ఆతడు మెడలో విజయసూచకముగా పుష్పమాలను ధరించి యుండెను. ఆతడు మనోబలముచే, శరీరబలముచే మరియు బ్రహ్మగారి వరముచే గర్వించియుండెను. నిరంకుశుడగు ఆ హీర ణ్యాక్షునకు ఏదన్నా భయము లేదు. వానిని చూచి దేవతలు భయపడి, గరుత్మంతునకు భయపడిన పాముల వలె, దాగియుండిరి.
స వై తిరోహితాన్ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్ ।
సేంద్రాన్ దేవగణాన్ క్షీబానపశ్యన్ వ్యనదద్ భృశమ్ ॥
ఆ రాక్షసరాజునకు గర్వితులై యుండే ఇంద్రాది దేవతలు కానరా లేదు. వారు తన తేజస్సునకు జడిసి దాగియున్నారని ఆతనికి తెలిసిపోయే ను. అపుడాతడు బిగ్గరగా గర్జించెను.
తతో నివృత్తః క్రీడిష్యన్ గంభీరం భీమనిస్వనమ్ ।
విజగా హే మహాసత్త్వో వార్ధిం మత్త ఇవ ద్విపః ॥
తరువాత మహాబలశాలియగు ఆ హిరణ్యాక్షుడు స్వర్గమునుండి వెనుదిరిగెను. వానికి క్రీడించవలెనని బుద్ది పుట్టెను. అపుడాతడు భయంకర మగు ధ్వనిని చేయుచున్న అగాధమైన సముద్రము లోనికి మదించిన ఏను గువలె ప్రవేశించేను.
తస్మిన్ ప్రవిష్టే వరుణస్య సైనికా
యాదోగణాస్సన్నధియస్ససాధ్వసాః ।
అహన్యమానా అపి తస్య వర్చసా
ప్రధర్షితా దూరతరం ప్రదుద్రువుః ॥
ఆ హిరణ్యాక్షుడు సముద్రములో ప్రవేశించగానే, వరుణుని సైనికులగు జలజంతువులు ఏమి చేయాలో తోచక చాల భయమును పొందినవి. ఆతడు వాటి జోలికి పోకున్ననూ, అవి ఆతని తేజస్సును తాళలేక పోయినవి. అవి అపుడు గుంపులు గుంపులుగా చాల దూరము పారిపోయినవి.
స వర్షపూగానుదదౌ మహాబలః
చరన్మహోర్మీన్ శ్వసనేరితాన్ముహుః ।
మౌర్వ్యా భిజఘ్నే గదయా విభావరీ-
మా సేదివాంస్తాత పురీం ప్రచేతసః ॥
ఓ వత్సా! మహాబలుడగు ఆ హిరణ్యాక్షుడు సముద్రమునందు తన ఊపిరిచే లేవగొట్టబడిన పెద్ద పెద్ద తరంగములను లోహమయమగు గదతో కొట్టుతూ అనేకసంవత్సరములు విహరించెను. తరువాత ఆతడు వరుణుని రాజధానియగు విభావరిని చేరుకొనెను.
తత్రోపలభ్యాసురలోకపాలకం
యాదోగణానామృషభం ప్రచేతసమ్ ।
స్మయన్ ప్రలబ్ధుం ప్రణిపత్య నీచవత్
జగాద మే దేహ్యధిరాజ సంయుగమ్ ॥
హిరణ్యాక్షుడు అచట రాక్షసలోకము (పాతాళము) నకు అధీశ్వరు డు, జలజంతుసముదాయములకు ప్రభువు అగు వరుణుని కనుగొనెను అపుడాతడు ఆయనను మోసగించుట కొరకై, చిరునవ్వుతో అల్పుని వ నటిస్తూ, ఆయనకు నమస్కరించి, ఇట్లు పలికెను: ఓ మహారాజా! నాకు యుద్దమును చేసే అవకాశమును కల్పించుము.
త్వం లోకపాలోఽధిపతిర్బృహచ్చృవా
వీర్యాపహో దుర్మదవీరమానినామ్ ।
విజిత్య లోకేఽఖిలదైత్యదానవాన్
యద్రాజసూయేన పురాయజత్పృభో ॥
ఓ ప్రభూ! లోకపాలకుడవగు నీవు గొప్ప కీర్తి గల ప్రభుడవు. ఎవ రైతే పొగరుతో తామే గొప్ప వీరులమని తలపోయుదురో, నీవు వారి పరా క్రమమును అపహరించెదవు. పూర్వము నీవు లోకములోని దైత్యులను దానవులను జయించి, రాజసూయయాగమును చేసియుంటివి.
స ఏవముత్సిక్తమదేన విద్విషా
దృఢం ప్రలబ్ధో భగవానపాం పతిః ।
రోషం సముత్థం శమయన్ స్వయా ధియా
వ్యవోచదంగోపశమం గతా వయమ్ ॥
ఈ విధముగా పొగరు పెరిగిన హిరణ్యాక్షుడు శత్రుబుద్ధితో జలాధి పతియగు వరుణ భగవానుని గట్టిగా వేళాకోళము చేసెను. కాని, ఆయన పైకి ఉబుకుతున్న కోపమును తన బుద్దిచే చల్లార్చుకొని, ఇట్లు పలికెను: ఓ రాక్షసరాజా! మేము యుద్ధములనుండి విరమించుకున్నాము.
పశ్యామి నాన్యం పురుషాత్పురాతనాత్
యస్సంయుగే త్వాం రణమార్గకోవిదమ్ ।
ఆరాధయిష్యత్యసురర్షభేహి తం
మనస్వినో యం గృణతే భవాదృశాః ॥
ఓ రాక్షసశ్రేష్టా! యుద్ధవిధానములో నిపుణుడవగు నిన్ను సంతోష పెట్ట గలవాడు సనాతన పురుషుడగు శ్రీహరి కంటే మరియొకడు లేడని నేను భావిస్తున్నాను. కావున, నీవు ఆయన వద్దకు వెళ్లుము. నీవంటి శూరులు ఆయనను కొనియాడుచుందురు. -
తం వీరమరాదభిపద్య విస్మయః
శయిష్యసే వీరశయే శ్వభిర్వృతః ।
యస్త్వద్విధానామసతాం ప్రశాంతయే
రూపాణి ధత్తే సదనుగ్ర హేచ్ఛయా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే సప్తదశోఽధ్యాయః ॥
ఆ వీరుని నీవు తొందరలోనే చూడగలవు. అపుడు నీ గర్వము తొలగిపోవును. నీవు యుద్ధభూమియందు నిద్రించుచుండగా, నీ చుట్టూ కుక్కలు తిరుగుచుండును. నీవంటి దుష్టులను నశింపజేసి, సత్పురుషుల ననుగ్రహించుట కొరకై ఆయన అవతారములను ధరించుచుండును.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు పదునేడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 17 of the Bhāgavata Mahā Purana is as follows:
Diti gives birth to the twin demons Hiraṇyakashipu and Hiraṇyāksha, whose births are accompanied by terrifying cosmic omens and disasters across all realms. Hiraṇyāksha grows into a giant of immense strength, conquering all the planetary systems, challenging the demigods, and wandering the cosmos with a heavy iron mace in search of a worthy opponent until Varuna directs him to Lord Vishṇu.