భాగవత మహా పురాణము
22 - దేవహూతి కర్దముల వివాహము
మైత్రేయ ఉవాచ :
ఏవమావిష్కృతాశేషగుణకర్మోదయో మునిమ్ ।
సవ్రీడ ఇవ తం సమ్రాడుపారతమువాచ హ ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కర్దమ మహర్షి ఈ విధముగా మను చక్రవర్తియొక్క సకల గుణముల మరియు కర్మల ఉత్కర్షను వర్ణించి విరమించెను. అపుడా మనువు సిగ్గు పడుతున్నట్లుగా ఆయనతో నిట్లనెను.
మనురువాచ :
బ్రహ్మాసృజత్స్వముఖతో యుష్మానాత్మపరీప్సయా । ఛందోమయస్తపోవిద్యాయోగయుక్తానలంపటాన్ ॥
వేదమూర్తియగు బ్రహ్మగారు తన వేదవిగ్రహమును లోకములో ప్రవర్తిల్లజేయాలనే కోరికతో, తపస్సు విద్య మరియు యోగములతో కూడిన మిమ్ములను తన ముఖమునుండి సృష్టించెను. మీకు భోగములయందు ఆసక్తి లేదు.
తత్త్రాణాయాసృజచ్ఛాస్మాన్జోస్సహస్రాత్సహస్రపాత్ ।
హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే ॥
అనంతములగు పాదములు గల విరాట్ పురుషుడు బ్రాహ్మణు లను రక్షించుట కొరకై తన అనంతములగు భుజములనుండి క్షత్రియులను సృష్టించెను. ఆ విరాట్ పురుషునకు బ్రాహ్మణుడు హృదయమనియు, క్షత్రియుడు భుజమనియు మహర్షులు చెప్పుచున్నారు గదా!
అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మ క్షత్రం చ రక్షతః ।
రక్షతి స్మావ్యయో దేవస్స యస్సదసదాత్మకః ॥
కావుననే, బ్రాహ్మణుడు క్షత్రియుడు తనను తాను రక్షించుకొను టయే గాక, ఒకరిని మరియొకరు కూడ రక్షించెదరు. వాస్తవములో అవినా శి, కార్యకారణరూపుడు అగు ఆ శ్రీహరియే అందరినీ రక్షించుచున్నాడు.
తవ సందర్శనాదేవ ఛిన్నా మే సర్వసంశయాః ।
యత్స్వయం భగవాన్ ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోః ॥
నిన్ను చూచినంతనే నా సందేహములన్నియు తొలగిపోయినవి. ఏలయనగా, ప్రజలను రక్షించగోరే నాకు పూజ్యుడవగు నీవు స్వయముగా రాజధర్మములను వర్ణించి చెప్పితివి.
దిష్ట్యా మే భగవాన్ దృష్ణో దుర్ధర్శో యోకృతాత్మనామ్ ।
దిష్ట్యా పాదరజస్స్పృష్టం శీర్ష్ణా మే భవతశ్శివమ్ ॥
మనోజయము లేనివారికి నీవు కానరావు. దైవవశముచే నీవు నాకు కనబడితివి. నేను దైవవశముచే పూజ్యుడవగు నీ మంగళకరమగు పాదధూ ళిని తలపై దాల్చితిని.
దిష్ట్యా త్వయానుశిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్ ।
అపావృతైః కర్ణరంధ్రైర్జుష్టా దిష్ట్యాశతీర్గరః ॥
దైవవశముచే నీవు గొప్ప అనుగ్రహమును చూపి నాకు ధర్మ మును ఉపదేశించితివి. నేను దైవవశముచే చెవులను అప్పజెప్పి నీ మనో హరములగు మాటలను వింటిని.
స భవాన్ దుహితృస్నేహపరిక్లిష్టాత్మనో మమ ।
శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే ॥
ఓ మహర్షీ! అట్టి నీవు దీనుడనగు నా విన్నపమును దయతో వినద గుదువు. కుమార్తెయందలి ప్రేమచే నా మనస్సు వ్యాకులమై యున్నది.
ప్రియవ్రతోత్తానపదోస్స్వ సేయం దుహితా మమ ।
అన్విచ్చతి పతిం యుక్తం వయశ్శీలగుణాదిభిః ॥
ఈమె నా కుమార్తె; ప్రియవ్రత ఉత్తానపాదులకు సోదరి. ఈమె వయస్సు శీలము గుణములు మొదలగు వాటిలో తనకు తగిన భర్తను పొందగోరుచున్నది.
యదా తు భవతశ్శీలశ్రుతరూపవయాగుణాన్ ।
అశృణోన్నారదాదేషా త్వయ్యాసీత్కృతనిశ్చయా ॥
నీ శీలము విద్య రూపము వయస్సు గుణములను గురించి ఈమె నారదుని వద్ద విన్నప్పటినుండియు, నిన్నే భర్తగా పొందాలనే నిశ్చయ మును చేసుకున్నది. .
తత్ప్రతీచ్ఛ ద్విజాగ్య్రేమాం శ్రద్ధయోపహృతాం మయా ।
సర్వాత్మనానురూపాం తే గృహమేధిషు కర్మసు ॥
ఓ బ్రాహ్మణ శ్రేష్టా! నీకు గృహస్థాశ్రమ కర్మలయందు ఈమె అన్ని విధములుగా యోగ్యురాలు. నేనీమేను నీకు శ్రద్ధతో సమర్పించుచున్నాను. కావున, ఈమెను నీవు స్వీకరించుము.
ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే ।
అపి నిర్ముక్తసంగస్య కామరక్తస్య కిం పునః ॥
తనంత తానుగా సంప్రాప్తమైన భోగమును నిరాకరించుట విరక్తున - కైననూ శోభనీయదు. భోగములయందు ప్రీతి గలవానికి అట్లు చేయుట మంచిది కాదని వేరుగా చెప్పవలయునా?
య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే ।
క్షీయతే తద్యశః స్పీతం మానశ్చావజ్ఞయా హతః ॥
ఎవడైతే తనంత తానుగా సంప్రాప్తమై, భోగమును కాదని తరు వాత లుబ్దుని యాచించునో, వాని ఉజ్జ్వలమగు కీర్తి నశించును; అవమాన ముచే వాని అభిమానము వినష్టమగును.
అహం త్వాశృణవం విద్వన్ వివాహార్థం సముద్యతమ్ ।
అతస్త్వముపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణ మే ॥
ఓ విద్వాంసుడా! నీవు వివాహమునకు ప్రయత్నము చేయుచు న్నావని నేను వినియుంటిని. అనగా, నీవు బ్రహ్మచర్యమును విడిచి పెట్టి గృహాశ్రమములోనికి అడుగు పెట్టబోవుచున్నావు. కావుననే, నా కుమార్తెను నీకిచ్చి వివాహమును చేసెదను; స్వీకరించుము.
ఋషిరువాచ ।
బాఢముద్వోడుకామోహమప్రత్తా చ తవాత్మజా ।
ఆవయోరనురూపోసావాద్యో వైవాహికో విధిః ॥
కర్దమ మహర్షి ఇట్లు పలికెను --- నిజమే; నేను వివాహమును చేసుకోవాలనే అనుకుంటున్నాను. మీ అమ్మాయికి మరియొకనితో వివా హము నిశ్చయము కాలేదు గనుక, మా యిద్దరి ఈ వివాహము యోగ్య ముగా నుండును. వివాహములలో బ్రాహ్మ వివాహము (పెద్దలు నిశ్చయించిన పెళ్లి) మొదటిది, శ్రేష్టమైనది.
కామస్స భూయాన్నరదేవ తేస్యాః
పుత్య్రాస్సమామ్నాయవిధౌ ప్రతీతః ।
క ఏవ తే తనయాం నాద్రీయేత
స్వయైవ కాంత్యా క్షిపతీమివ శ్రియమ్ ॥
ఓ మహారాజా! ఈ నీ కుమార్తె వేదములో ప్రసిద్ధమైన విధానములో వివాహమాడవలెనని కోరుచున్నది. నీవు కూడ అటులనే కోరుచున్నావు. ఆ కోరిక తీరుగాక! నీ కుమార్తె తన శోభతో లక్ష్మీదేవిని మించి యున్నది. ఆమెను వివాహమాడుటకు ఎవడు కాదనును?
యాం హర్మ్యపృష్ఠే క్వణదంఘ్రిశోభాం
విక్రీడతీం కందుకవిహ్వలాక్షీమ్ ।
విశ్వావసుర్య్నపతత్వాద్విమానాత్
విలోక్య సమ్మోహవిమూఢచేతాః ॥
ఈమె ప్రాసాదమునకు పైభాగమునందు బంతిని ఆడుచుండెను. ఆమె పాదములు నూపురముల ధ్వనితో గూడి శోభిల్లెను. ఆమె చూపులు బంతి వెనుక పరుగెడుతూ చాల వ్యాకులముగా నుండెను. ఆకాశములో విమానమునుండి గంధర్వుడు అట్టి ఈమె సౌందర్యమును చూచి సమ్మోహితుడై, స్పృహ తప్పి క్రింద బడెను.
తాం ప్రార్థయంతీం లలనాలలామ-
మ సేవితశ్రీచరణైరదృష్టామ్ ।
వత్సాం మనోరుచ్చపదస్స్వసారం
కో నానుమన్యేత బుధోభియాతామ్ ॥
స్త్రీలకే అలంకారమనదగిన ఈమెను లక్ష్మీదేవి పాదములనారా ధించనివారు కనలేరు. మనువుయొక్క ముద్దుల పట్టీ, ఉత్తానపాదుని సోద రియగు ఈమే ఏరి కోరి స్వయముగా వచ్చినది. అట్టి ఈమెను తెలివైన వాడు ఎవడు అంగీకరించకుండును?
అతో భజి ష్యే సమయేన సాధ్వీం
యావత్తేజో బిభృయాదాత్మనో మే ।
అతో ధర్మాన్ పారమహంస్యముఖ్యాన్
శుక్లప్రోక్తాన్ బహు మన్యేవిహింస్రాన్ ॥
కావున, ఈ సాధ్విని నేను స్వీకరించెదను. కాని, ఒక నీయమము గలదు. నేను ఈమెతో సంతానము కలుగువరకు గృహాశ్రమమును నెరపెదను. తరువాత, సన్న్యాసమును స్వీకరించి ఆ ఆశ్రమధర్మములను పాటించే దను. హింసతో సంబంధము లేని ఆ శమదమాది ధర్మములను భగవా నుడే స్వయముగా ఉపదేశించెను.
యతోభవద్విశ్వమిదం విచిత్రం
సంస్థాస్యతే యత్ర చ వావతిష్ఠతే ।
ప్రజాపతీనాం పతిరేష మహ్యం
పరం ప్రమాణం భగవాననంతః ॥
అనేకభేదములతో కూడిన ఈ జగత్తు ఆ అనంత భగవానునినుండి ప్రకటమై, ఆయనయందే స్థితిని కలిగి, ఆయనయందే విలీనము కాగలదు. ప్రజాపతులకు కూడ ప్రభువగు ఈ భగవానుడే నాకీ విషయములో ప్రమా ణము. నేను ఆయన ఆదేశమును మాత్రమే పాటించుచున్నాను.
మైత్రేయ ఉవాచ :
స ఉగ్రధన్వన్నియదేవాబభాషే
ఆసీచ్చ తూష్ణీమరవిందనాభమ్ ।
ధియోపగృహ్ణన్ స్మితశోభితేన
ముఖేన చేతో లులుభే దేవహూత్యాః ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! ఆ కర్దముడు ఇంతమాత్రమే పలికి మిన్నకుండి, పద్మనాభుని మనస్సులో ధ్యానించు చుండెను. చిరునవ్వుతో శోభిల్లే ఆయన ముఖము దేవహూతి హృదయ మును దోచివేసెను.
సోనుజ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితుః స్పుటమ్ ।
తస్మై గుణగణాధ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః ॥
ఆ మనువు తన భార్యను, కుమార్తెను సంప్రదించి వారి స్పష్టం - మగు అంగీకారమును పొంది గొప్పగా ఆనందించేను. కర్దముడు సకలస ధుణములకు నిలయము. దేవహూతి కూడ అంతే, మనువు ఆమెను ఆయ నకిచ్చి వివాహమును జరిపించెను.
శతరూపా మహారాజ్ఞి పారిబర్హాన్మహాధనాన్ ।
దంపత్యోః పర్యదాత్ప్రీత్యా భూషావాసఃపరిచ్ఛదాన్ ॥
మహారాణియగు శతరూప ఆ కొత్త దంపతులకు మిక్కిలి విలువైన భూషణములను, వస్త్రములను, ఇంటి సామగ్రిని పెళ్లికానుకలుగాప్రేమతో ఇచ్చెను.
ప్రత్తాం దుహితరం సమ్రాట్ సదృక్షాయ గతవ్యథః ।
ఉపగుహ్య చ బాహుభ్యామౌత్కంఠ్యోన్మథితాశయః ॥
మను చక్రవర్తి కుమార్తెను యోగ్యుడగు వరునకిచ్చి వివాహమును చేసి నిశ్చింతగా నుండెను. కాని, విరహోత్కంఠచే వ్యాకులమైన మన స్సుతో ఆయన కుమార్తెను రెండు చేతులతో కౌగిలించుకొనెను.
అశక్నువంస్తద్విరహం ముంచన్ బాష్పకలాం ముహుః ।
ఆసించదంబ వత్సేతి నేత్రోదైర్దుహితుశ్శిఖాః ॥
మను చక్రవర్తి కుమార్తెయొక్క విరహమును సహించలేకపోయే ను. ఆయన అదే పనిగా కన్నీటిని విడుచుచుండెను. తల్లీ! అమ్మాయీ! అంటూ ఆయన ఆమె కేశములను తన కన్నీళ్లతో తడిపి వేసెను.
ఆమంత్య్ర తం మునివరమనుజ్ఞాతస్సహానుగః ।
ప్రతస్థే రథమారుహ్య సభార్యస్స్వపురం నృపః ॥
మను చక్రవర్తి ఆ మహర్షిని అడిగి సెలవు తీసుకొని తన భార్య, అనుచరులు వెంటరాగా రథముపై తన నగరమునకు బయలు దేరెను.
ఉభయోరృషికుల్యాయాస్సరస్వత్యోస్సురోధసోః ।
ఋషీణాముపశాంతానం పశ్యన్నాశ్రమసంపదః ॥
సరస్వతీనదిని మహర్షులు సేవించుచుందురు. దాని సుందరమగు రెండు తీరముల వెంబడి ప్రకృతిసంపదతో శోభిల్లే నివృత్తిపరాయణులగు మహర్షుల ఆశ్రమములు గలవు. మను చక్రవర్తి వాటి శోభను తిలకిస్తూ పయనించేను.
తమాయాంతమభిప్రేత్య బ్రహ్మావర్తాత్ప్రజాః పతిమ్ ।
గీతసంస్తుతివాదితైః ప్రత్యుదీయుః ప్రహర్షితాః ॥
ఆ మహారాజు వచ్చుచున్నాడనే విషయము తెలిసి జనులు గొప్ప హర్షమును పొందినవారై, బ్రహ్మావర్తమునుండి గీతములు స్తోత్రములు వాద్యములతో ఆయనకు ఎదురేగిరి.
బర్హిష్మతీ నామ పురీ సర్వసంపత్సమన్వితా ।
న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధుత్వతః ॥
యస్య = యజ్ఞ వరాహమూర్తియొక్క, రోమాణీ = రోమములు, న్యపతన్ =పడినవో.
అన్ని సంపదలతో నిండిన బర్హిష్మతీ నగరము మనువుయొక్క ప్రసిద్ధమైన రాజధాని. యజ్ఞ వరాహమూర్తి తన శరీరమును విదల్చిన ప్పుడు ఆయన రోమములు అక్కడ పడినవి.
కుశాః కాశాన్త ఏవాసన్ శశ్వద్దరితవర్చసః ।
ఋషయో యైః పరాభావ్య యజ్ఞఘ్నాన్ యజ్ఞమీజిరే ॥
ఆ రోమములే అన్ని కాలములలో పచ్చగా ఉండే దర్బలు, రెల్లు ఆయెను. మహర్షులు వాటితో యజ్ఞమునకు విఘ్నమును కలిగించే రాక్షసు లను తరిమికొట్టి యజ్ఞమును చేసి, శ్రీహరిని ఆరాధించిరి.
కుశకాశమయం బర్హిరాస్తీర్య భగవాన్మనుః ॥
అయజద్యజ్ఞపురుషం లబ్ద్వా స్థానం యతో భువమ్ ॥
పూజ్యుడగు మనుచక్రవర్తి వరాహ భగవానునినుండి భూమి అనే నివాసస్థానమును పొంది, ఈ స్థానములో దర్భలు రెల్లుతో కూడిన ఆసన మును పరిచి, యజ్ఞపురుషుడగు శ్రీహరిని ఆరాధించెను.
బర్హిష్మతీం నామ విభుర్యాం నివిశ్య సమావసత్ ।
తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయవినాశనమ్ ॥
ఆ స్థానమే బర్హిష్మతీ నగరము. దానియందే మనుప్రభువు అప్పటి నుండియు నివసించుచుండెను. ఇప్పుడు ఆయన ఆ నగరమును చేరుకో నీ, మూడు విధముల తాపమును పోగొట్టే తన భవనమును ప్రవేశించెను.
సభార్యస్సప్రజః కామాన్ బుభుజేన్యావిరోధతః ।
సంగీయమానసత్కీర్తిస్సస్త్రీభిస్సురగాయకైః ।
ప్రత్యూషేష్వనుబద్ధేన హృదా శృణ్వన్ హరేః కథాః ॥
ఆ మనుచక్రవర్తి అచట తన భార్యతో పిల్లలతో గూడి ధర్మార్థమో క్షములకు విరోధము లేని విధముగా భోగములననుభవించెను. ఆయన సత్కీర్తిని అప్సరసలు, గంధర్వులు చక్కగా గానము చేసెడివారు. కాని, ఆయన ప్రాతఃకాలములయందు భక్తితో నిండిన హృదయముతో శ్రీహరి యొక్క గాథలను వినెడివాడు.
నిష్ణాతం యోగమాయాసు ముని స్వాయంభువం మనుమ్ ।
యదా భ్రంశయితుం భోగా న శేకుర్భగవత్పరమ్ ॥
కావుననే, తన ఇచ్ఛచే భోగములను సృష్టించుటయందు నిపుణు డైననూ మననశీలుడగు స్వాయంభువ మనువు భగవత్పరాయణుడుగనే యుండెను. ఆయనను భోగములు కొంచెమైననూ చలింప జేయుటకు సమర్థములు కాలేదు.
అయాతయామాస్తస్యాసన్ యామాస్వాంతరయాపనాః ।
శృణ్వతో ధ్యాయతో విష్ణోః కుర్వతో బ్రువతః కథాః ॥
ఆయన శ్రీహరియొక్క గాథలను వింటూ, చెప్తూ, శ్రీహరినే ధ్యాని సూ, శ్రీహరిని సేవిస్తూ ఉండెడివాడు. ఈ విధముగా ఆయన మన్వంతరములోని జాములు అన్నీ ఆయనకు సఫలములే అయినవి.
స ఏవం స్వాంతరం నిన్యే యుగానామేకసప్తతిమ్ ।
వాసుదేవప్రసంగేన పరిభూతగతిత్రయః ॥
ఆ మనువు ఈ విధముగా వాసుదేవుని ప్రసంగముచే జాగ్రత్తు స్వప్నము సుషుప్తి అనే మూడు అవస్థలను, ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదై వికములనే మూడు తాపములను జయించి, సత్త్వరజస్తమోగుణములకు అతీతమైన స్థితిని పొందెను. ఆయన ఈ విధముగా తన మన్వంతర కాల మగు డెబ్బది ఒక్క మహాయుగములను గడిపివేసెను.
శారీరా మానసా దివ్యా వైయాసే యే చ మానుషాః ।
భౌతికాశ్చ కథం క్లేశా బాధంతే హరిసంశ్రయమ్ ॥
వ్యాసపుత్రుడవగు ఓ విదురా! జ్వరము మొదలగునవి శరీరము నకు చెందిన క్లేశములు. శోకము మొదలగు క్లేశములు మానసికములు. అనావృష్టి మొదలగునవి ఆధిదైవిక క్లేశములు. ఒకప్పుడు శత్రువులు క్లేశ ములను కలిగించెదరు. పాము కాటు మొదలగునవి ఆధిభౌతిక క్లేశములు. ఇవి అన్నీ శ్రీహరిని శరణు జొచ్చినవానిని ఎట్లు బాధించును?
యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్నానావిధాన్ శుభాన్ ।
నృణాం వర్ణాశ్రమాణాం చ సర్వభూతహితస్సదా ॥
మనువు అన్ని వేళలా సకలప్రాణుల హితమును కోరేడివాడు. మునులు ప్రశ్నించగా, ఆయన సకలమానవులకు మరియు వర్ణములకు ఆశ్రమములకు సంబంధించిన అనేకవిధములైన ధర్మములను బోధించెను. ఈ ధర్మములు మానవులకు శుభమును కలిగించును.
ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్బుతమ్ ।
వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే ద్వావింశోధ్యాయః ॥
మనువు మొట్టమొదటి చక్రవర్తి. అద్బుతమగు ఆయన చరిత్ర వర్ణించదగినది. దానిని నేను వర్ణించి చెప్పితిని. ఇప్పుడు ఆయన కుమార్తె యగు దేవహూతియొక్క మహత్త్వమును గురించి వినుము.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
Svāyambhuva Manu arrives at Kardama Muni's hermitage along with Queen Shatarūpā and Princess Devahūti, offering his daughter's hand in marriage in accordance with divine providence. Kardama accepts Devahūti with the agreement that he will remain in household life until they have offspring, after which he will renounce the world for spiritual perfection, and the royal parents return home filled with joy after performing the sacred wedding rituals.