5 - మైత్రేయుడు సృష్టి క్రమమును వర్ణించుట

శ్రీశుక ఉవాచ !

 ద్వారి ద్యునద్యా ఋషభః కురూణాం

మైత్రేయమాసీనమగాధబోధమ్

 క్షతోపసృత్యాచ్యుతభావశుద్ధః

పప్రచ్ఛ సౌశీల్యగుణాభితృప్తః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహాజ్ఞానియగు మైత్రేయుడు గంగా (హరి) ద్వారమునందు సర్వకర్మసన్న్యాసియై కూర్చుని యుండె ను. కురువంశ శ్రేష్ఠుడు, శ్రీకృష్ణునియందలి భక్తిచే పవిత్రమైన అంతఃకర ణము గలవాడు అగు విదురుడు ఆయన వద్దకు వచ్చెను. ఆయన యొక్క సాధుభావముచే మిక్కిలి ఆనందమును పొందిన విదురుడు ఈ విధముగా ప్రశ్నించెను.

విదుర ఉవాచ

 సుఖాయ కర్మాణి కరోతి లోకో

 న తైస్సుఖం వాన్యదుపారమం వా

 విందేత భూయస్తత ఏవ దుఃఖం

యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః

విదురుడు ఇట్లు పలికెను --- మానవుడు సుఖములను గోరి కర్మ లను చేయును. కాని, వాటి వలన మానవునకు సుఖము లభించుట లేదు; దుఃఖము దూరమగుట లేదు. పైగా, వాటి వలన మరల మరల దుఃఖమే కలుగుచున్నది. ఈ స్థితిలో మానవునకు కర్తవ్యమేమియో పూజ్యుడవగు నీవు చెప్పుము.

జనస్య కృష్ణాద్విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య

అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య

మానవుడు శ్రీకృష్ణ భక్తిలేని కారణముగా దైవయోగముచే అధర్మ మునాచరించే స్వభావము గలవాడై, ఆ కారణముగా దుఃఖభాజనుడగుచున్నాడు. అట్టి మానవులననుగ్రహించుట కొరకై మంగళకరులగు శ్రీకృష్ణభక్తులు ఈ లోకములో సంచరించుచుందురు. ఇది నిశ్చయము.

తత్సాధువర్యాదిశ వర్త్మ శం నః

సంరాధితో భగవాన్ యేన పుంసామ్

హృది స్థితో యచ్చతి భక్తిపూతే

జ్ఞానం సతత్త్వాధిగమం పురాణమ్

సాధుపురుషులలో శ్రేష్ఠుడవగు ఓ మైత్రేయా! నీవు మాకు మంగ ళకరమగు మార్గమునుపదేశించుము. మానవులు ఆ మార్గములో భగవా నుని చక్కగా ఆరాధించి తమ హృదయములను భక్తితో పావనము చేసుకో నెదరు. అట్టి పవిత్రమగు హృదయములో నిలిచియుండే భగవానుడు వారికే ఆత్మస్వరూపముయొక్క అపరోక్షానుభూతిని కలిగించే సనాతన జ్ఞానమును అనుగ్రహించును.

కరోతి కర్మాణి కృతావతారో యాన్యాత్మతంతో భగవాంస్త్య్రధీశః

యథా ససర్జాగ్ర ఇదం నిరీహస్సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే

స్వతంత్రుడు, ముల్లోకములకు ప్రభువు అగు భగవానుడు అవతా రములనెత్తి ఏ కర్మలను చేయును? భగవానుడు కర్తృత్వము మరియు కామనలు లేనివాడే అయిననూ కల్పమునకు ఆరంభములో ఈ జగత్తును సృష్టించిన విధమెట్టిది? ఆయన ఈ జగత్తునకు స్థితిని (రక్షణను) కల్పించి, ప్రాణులకు జీవికను ఏర్పాటు చేసే విధానమెట్టిది?

యథా పున స్స్వే ఖ ఇదం నివేశ్య

శేతే గుహాయాం స నివృత్తవృత్తిః

యోగేశ్వరాధీశ్వర ఏక ఏత-

దనుప్రవిష్టో బహుధా యథాసీత్

మరల ఆ పరమేశ్వరుడు సంకల్పరూపమైన సృష్టివ్యాపారము నుండి విరమించి, తన స్వరూపమగు చిదాకాశమునందు ఈ జగత్తును ఉప సంహరించి, యోగమాయయందు నిద్రించు విధమెట్టిది? యోగేశ్వరులకు అధీశ్వరుడగు ఆ పరమాత్మ అద్వితీయుడే అయిననూ, ఈ జగత్తును సృష్టించి, దానియందు అంతర్యామి (సత్తా-స్పూర్తులు) రూపముగా ప్రవే శించి, తానే అనేకరూపములుగా ప్రకటమైన విధమెట్టిది?

క్రీడన్ విధత్తే ద్విజగోపురాణాం

క్షేమాయ కర్మాణ్యవతారభేదైః

మనో న తృప్యత్యపి శృణ్వతాం నః

సుశ్లోకమౌలేశ్చరితామృతాని

భగవానుడు వివిధములగు అవతారములనెత్తి విహరిస్తూ, గోబ్రా హ్మణులు మరియు దేవతల క్షేమము కొరకై అనేకలీలలను చేయుచుండు ను. పవిత్రమగు కీర్తి గలవారిలో ఆయన శిఖామణి. ఆయనయొక్క లీల లను వినుట అమృతపానము వంటిది. ఎంత విన్ననూ, మా మనస్సులకు తృప్తి కలుగుట లేదు.

యైస్తత్వభేదైరధిలోకనాధో లోకానలోకాన్ సహలోకపాలాన్

 అచీక్లుపద్యత్ర హి సర్వసత్త్వనికాయభేదోధికృతః ప్రతీతః

లోకములు, లోకపాలకులు, లోకాలోకపర్వతములకు బాహ్యము నందుండే భాగములతో కూడిన ఈ బ్రహ్మాండమునందు అధికారభేద మును బట్టి సకలప్రాణుల సమూహములు వేర్వేరుగా ప్రతీయమానమగుచున్నవి. లోకపాలకులందరికీ ప్రభువగు ఆ భగవానుడు ఏ తత్త్వములతో ఈ బ్రహ్మాండమును రచించెను?

యేన ప్రజానాముత ఆత్మకర్మరూపాభిధానాం చ భిదాం వ్యధత్త

 నారాయణో విశ్వసృడాత్మయోనిరేతచ్చ నో వర్ణయ విప్రవర్య

జీవులలో స్వభావము, దానిని బట్టి కర్మ, దానిని బట్టి రూపము, దానిని బట్టి నామము అను అంశములలో భేదము గలదు. స్వయముగా సద్రూపుడు, జగత్తును సృష్టించినవాడు అగు నారాయణుడు ఈ భేదము లను ఎట్లు సృష్టించేను? ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! దీనిని కూడ మాకు వర్ణించి చెప్పుము.

పరావరేషాం భగవన్ వ్రతాని

శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణమ్

అతృప్నుమ క్షుల్లసుఖావహానాం

తేషామృతే కృష్ణకథామృతౌఘాత్

ఓ పూజ్యా! సమాజములో వివిధస్థాయిలలోని వ్యక్తులు అనుసరించదగిన ధర్మములను గురించి వ్యాసుని నోటినుండి పలుమార్లు వినియుంటిని. అల్పమగు సుఖమును మాత్రమే ఇచ్చే అట్టి ధర్మములయందు నాకు తృప్తి కలిగినది. కాని, శ్రీకృష్ణుని కథామృతప్రవాహమునందు మాత్రము నాకు తృప్తి కలుగుట లేదు.

కస్తృప్నుయాత్తీర్థపదోభిధానాత్

సత్రేషు వస్సూరిభిరీడ్యమానాత్

యః కర్ణనాడీం పురుషస్య యాతో

భవప్రదాం గేహరతిం ఛినత్తి

మీ సాధుసమాజములో విద్వాంసులు భగవానుని చరితములను కీర్తించుచుందురు. వాటిని విన్నవానికి, ఇక చాలును అనే తృప్తి ఎవనికి కల్గును? ఎవ్వనికైననూ కలుగదు. ఆ శ్రీకృష్ణుడు మానవుని చెవిలోని శబ్ద నాడిని పొందినప్పుడు, అనగా మానవుడు శ్రీకృష్ణుని చరితమును విన్నచో, సంసారదాయకమగు గృహాదులయందలి ఆసక్తి పటాపంచలగును.

మునీర్వివక్షుద్భగవద్గుణానాం

సఖాపి తే భారతమాహ కృష్ణః

యస్మిన్నృణాం గ్రామ్యసుఖానువాదైః

మతిర్గృహీతా ను హరేః కథాయామ్

నీ మిత్రుడగు వ్యాసమహర్షి కూడ భగవంతుని గుణములను వర్ణిం చగోరి భారతమును రచించినాడు. దానిలో ఆయన విషయసుఖములను వర్ణిస్తూ, వాటి ద్వారా వెనువెంటనే మానవుల బుద్దిని శ్రీహరియొక్క గాథల వైపునకు తీసుకుపోయే ప్రయత్నమును చేసినాడు.

సా శ్రద్దధానస్య వివర్ధమానా

విరక్తిమన్యత్ర కరోతి పుంసః

హరేః పదానుస్మృతినిర్వృతస్య

సమస్తదుఃఖాత్యయమాశు ధత్తే

శ్రద్ధాళువు అగు మానవునకు శ్రీహరి గాథలయందు అభిరుచి వర్దిల్లి, ఇతరములగు భోగములయందు వైరాగ్యమును కలిగించును. ఆ విధ ముగా శ్రీహరియొక్క పాదములను నిరంతరముగా స్మరించి ఆనందించే భక్తునకు ఆ గాథ వెంటనే సకలదుఃఖములను నశింపజేయును.

తాన్ శోచ్యశోచ్యానవిదోనుశోచే

హరేః కథాయాం విముఖానఘేన

 క్షిణోతి దేవోకనిమిషస్తు యేషా-

మాయుర్వృథాషోదగతిస్మృతీనామ్

ఈ లోకములో శోకింపదగినవారు పలువురు గలరు. కాని ఎవరైతే పూర్వపాపముయొక్క ప్రభావముచే శ్రీహరియొక్క గాథలయం ఏ నిము ఖులై యుందురో, అట్టి అజ్ఞానులు అందరికంటే అధికముగా శోకింప దగిన వారు. నేను వారిని గురించి ఖేదమును పొందుచున్నాను. ఏలయనగా, వారి కాయిక, వాచిక, మానసిక వ్యాపారములన్నియు వ్యర్థములే సూర్యుని రూపములోనున్న కాలపురుషుడు వారి ఆయుర్దాయమును వ్యర్థ ముగా క్షీణింపజేయుచున్నాడు.

తదస్య కౌషారవ శర్మదాతుర్హరేః కథామేవ కథాసు సారమ్

ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ నః కీర్తయ తీర్థకీర్తేః

ఓ మైత్రేయా! నీవు కష్టములలో నున్నవారికి బంధువువంటి వాడ వు. పవిత్రమగు కీర్తిగల ఆ శ్రీహరి భక్తులకు సుఖములనిచ్చును. కావున నీవు, పుష్పముల సారమగు తేనెను తుమ్మెద పైకి తీసిన విధముగా, లౌకికగాథలలోనుండి సారభూతమగు శ్రీహరినాథను వెలికి తీసి కీర్తించి, మాకు కల్యాణమును కలిగించుము.

స విశ్వజన్మస్థితిసంయమార్థే

కృతావతారః ప్రగృహీతశక్తిః

 చకార కర్మణ్యతపూరుషాణి

యానీశ్వరః కీర్తయ తాని మహ్యమ్

ఆ పరమేశ్వరుడు మాయాశక్తిని ఆసరాగా చేసుకొని జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుచున్నాడు. ఆయన ఈ లోకమునందవత రించి చేసిన దివ్యకర్మలను నాకు వినిపించుము.

శ్రీశుక ఉవాచ

 స ఏవం భగవాన్ పృష్ఠః క్షతా కౌషారవిర్మునిః

 పుంసాం నిశ్శ్రేయసార్ధేన తమాహ బహు మానయన్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా విదురుడు మాన వులకు మోక్షోపాయమును అందించవలెననే భావనతో ప్రశ్నించగా, మైత్రేయ మహర్షి ఆయనను చాల సమ్మానించి, ఇట్లు పలికెను.

మైత్రేయ ఉవాచ

సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వనుగృహ్ణతా

కీర్తిం వితన్వతా లోకే ఆత్మనో వధోక్షజాత్మనః

ఓ సాధుపురుషుడవగు విదురా! నీ మనస్సు సర్వదా శ్రీహరి పైనే లగ్నమై యున్నది. నీవు మానవులను అనుగ్రహించ గోరి చక్కని ప్రశ్నను వేసితివి. ఈ ప్రసంగము ద్వారా నీ కీర్తి కూడ లోకములో విస్తరించగలదు.

నైతచిత్రం త్వయి క్షత్తరాదరాయణవీర్యజే

గృహీతోనన్యభావేన యత్త్వయా హరిరీశ్వరః

ఓ విదురా! వ్యాసుని ఔరసపుత్రుడవగు నీవు ఈ విధముగా ప్రశ్నిం చుటలో ఆశ్చర్యము లేదు. ఏలయనగా, నీవు సర్వేశ్వరుడగు శ్రీహరిని ఏకాంతభక్తితో ఆశ్రయించినవాడవై, ఆయనను ఆత్మరూపునిగా తెలుసుకున్నావు.

మాండవ్యశాపాద్భగవాన్ ప్రజాసంయమనో యమః

భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతస్సత్యవతీసుతాత్

యముడు మాండవ్యమహర్షియొక్క శాపముచే సత్యవతీపుత్రు డగు వ్యాసుని వలన ఆయన తమ్ముడగు. విచిత్రవీర్యునిచే భార్యగా స్వీకరించబడిన దాసియందు జన్మించినాడు. ఆ యమభగవానుడవు నీవే.

భవాన్ భగవతో నిత్యం సమ్మతస్సానుగస్య చ

యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్భగవాన్ ప్రజన్

నీవు భగవానునకు, ఆయన భక్తులకు మిక్కిలి ప్రియుడవు. అందు వలననే, శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరిస్తూ, నీకు జ్ఞానము నుపదేశించుమని నన్ను ఆదేశించినాడు.

అథ తే భగవల్లిలా యోగమాయోపబృంహితాః

 విశ్వస్థిత్యుద్భవాంతార్థా వర్ణయామ్యనుపూర్వశః

భగవానుడు జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేయుటకై యోగమాయచే విస్తారముగా లీలలను ప్రకటించినాడు. నేను ఇప్పుడు ఆ లీలలను నీకు క్రమముగా వర్ణించి చెప్పెదను.

భగవానేక ఆసేదమగ్ర ఆత్మాత్మనాం విభుః

ఆత్మేచ్ఛానుగతావాత్మా నానామత్యులక్షణః

ఈ జగత్తు సృష్టికి పూర్వమునందు అద్వితీయుడగు భగవానుని రూపములో నుండెడిది. ఆయననుండి వ్యక్తమైన ఈ జీవుల స్వరూపము (ఆత్మ) ఆయనయే. స్థితికాలమునందు ఆయనయే సర్వవ్యాపియై నామ రూపముల భేదముచే అనేకముగా భాసించుచున్నాడు. ఈ సృష్టికి మూల మునందున్న ఆయన మాయాశక్తి ఆయనలో విలీనము కాగానే, కేవల శుద్ధచేతనుడగు పరమాత్మ మాత్రమే మిగిలియుండును.

స వా ఏష తదా ద్రష్టా నాపశ్యదృశ్యమేకరాట్

మేనేసంతమివాత్మానం సుప్తశక్తిరసుప్తదృక్

అద్వితీయుడై ప్రకాశించే అట్టి ఆ భగవానుడు అపుడు తాను ద్రష్టయై చూడగా, దృశ్యమేమియూ కానరాలేదు. అందువలన, ఆయనకు అప్పుడు తనకు తాను అసత్ (ఉనికి లేనివాడు) గా భాసించెను. వాస్తవ ములో జ్ఞానస్వరూపుడగు ఆ పరమేశ్వరుని జ్ఞానము ఎప్పుడైననూ నిద్రిం చేది (ఉపరతమయ్యేది) కాదు. కేవలము ఆయన మాయాశక్తి మాత్రమే నిద్రించుచుండెను; అనగా, ఆయనయందు విలీనమై యుండెను.

సా వా ఏతస్య సంద్రష్టుశ్శక్తిస్సదసదాత్మికా

 మాయా నామ మహాభాగ యయేదం నిర్మమే విభుః

ఓ మహాత్మా! విదురా! మాయ అనగా నిత్యదృక్-స్వరూపుడగు ఈ పరమేశ్వరుని శక్తియే. అదియే కారణము, అదియే కార్యము. అది భావ (ఉన్నది)-అభావ (స్వతంత్రమగు ఉనికి లేనిది)-రూపమగుటచే అనిర్వచనీ యము. ఆ పరమేశ్వరుడు ఆ శక్తిని ఉపాదానముగా చేసుకొని, ఈ విశ్వ మును నిర్మించి, సర్వవ్యాపకుడై యున్నాడు.

కాలవృత్త్యా తు మాయాయాం గుణమయ్యామధోక్షజః

 పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్

చైతన్యాధిష్ఠితమైన సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తి యందు కాలప్రభావముచే కదలిక యేర్పడెను. ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతుడైన చిచ్చక్తిసమేతుడగు పరమేశ్వరుడు ఆ మాయాశక్తియందు తన అంశ (స్వరూపమే) యే అయి ఉన్న పురుషుని (ప్రకృతికి అధిష్ఠాత) రూప ములో చిదాభాస (జీవ) రూపమగు బీజమును స్థాపించెను.

తతోఽభవన్మహత్తత్త్వమవ్యక్తాత్కాలచోదితాత్

విజ్ఞానాత్మాఽఽత్మదేహస్థం విశ్వం వ్యంజంస్తమోనుదః

నామరూపాత్మకమగు వ్యాకరణము లేని ఆ మాయాశక్తినుండి కాలప్రేరణచే మహత్తత్వము ఉదయించి, చీకటి అనదగిన అవ్యక్తస్థితికి స్వస్తి పలికి, తనయందు బీజరూపముగా దాగియున్న జగత్తును ప్రకటింప జేయుటకు సిద్దముగా నుండెను. ఈ జగత్తులోని సకల క్రియాశక్తుల మరియు జ్ఞానశక్తుల సమష్టియే ఈ మహత్తత్త్వము. అది జీవులకు పదార్థ జ్ఞానమును కలిగించి అజ్ఞానమును పోగొట్టును.

సోఽప్యంశగుణకాలాత్మా భగవద్దృష్టిగోచరః

ఆత్మానం వ్యకరోదాత్మా విశ్వస్యాస్య సీసృక్షయా

ఆ మహత్తు చిదాభాసకు, ఉపాదానమగు సత్త్వరజస్తమోగుణములకు మరియు వాటి సామ్యావస్థయందు క్షోభను కలిగించే కాలమునకు వశమై యుండును. అది ఉపాధిచే మహత్తు అయినది కాని, స్వరూపముచే పరబ్రహ్మయే. భగవానుడు అధ్యక్షుడు కాగా, అనగా సచ్చిదహ్మయొక్క సన్నిధియందు మాత్రమే, అది తననుండి నామరూపాత్మకమగు జగత్తును ప్రకటింప జేయును. అట్లు ప్రకటమగుటకు సగుణబ్రహ్మ (మహత్తత్త్వముచే అవచ్ఛిన్నమైన చైతన్యము) యొక్క సంకల్పమే కారణము.

మహత్తత్త్వాద్వికుర్వాణాదహంతత్త్వం వ్యజాయత

కార్యకారణకర్తృత్మా భూతేంద్రియమనోమయః

ఆ మహత్తత్త్వము వికారమును చెంది అహంకారము పుట్టేను. అది కార్యరూపమగు పంచమహాభూతములు, వాటికి కారణమగు తన్మాత్ర లు, మరియు కర్తృత్వము అను వికారములకు ఆశ్రయమగుచున్నది.

వైకారిక స్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా

అహంతత్త్వాద్వికుర్వాణాన్మనో వైకారికాదభూత్

వైకారికాశ్చ యే దేవా అర్థాభివ్యంజనం యతః

అహంకారము సాత్త్వీకము, రాజసము, తామసము అని మూడు విధములుగా నున్నది. వాటిలో సాత్త్వికాహంకారము వికారములను పొంది, మనస్సు మరియు ఇంద్రియములకు అధిష్టానమగు దేవతలు ప్రక టమైరి. వాటి వలన మాత్రమే శబ్దము మొదలగు విషయములు ప్రకాశించుచున్నవి.

తైజసానీంద్రియాణ్యేవ జ్ఞానకర్మమయాని చ

తామసో భూతసూక్ష్మాదిర్యతః ఖం లింగమాత్మనః

కర్మేంద్రియములతో బాటు జ్ఞానేంద్రియములు కూడ రాజసాహం కారమునుండి మాత్రమే పుట్టినవి. ఇంతేగాక, తామసాహంకారమునుండి శబ్దతన్మాత్ర పుట్టినది. ఈ శబ్దము ఆకాశమునకు గుణము. శబ్దము గుణ ముగా గల ఆకాశము పరమాత్మకు శరీరము.

కాలమాయాంశయోగేన భగవద్వీ క్షితం నభః

నభసోఽనుసృతం స్పర్శం,వికుర్వన్నిర్మమేఽనిలమ్

కాలము, తామసాహంకారము రూపములోనున్న మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగముచే భగవానుని ఆధ్యక్ష్యమునందు ఆకా శము పుట్టెను, ఆకాశమునుండి స్పర్శ తన్మాత్ర పుట్టెను. అది వికారమును చెంది, వాయువు పుట్టెను.

అనిలోఽపి వికుర్వాణో నభసోరుబలాన్వితః

ససర్జ రూపతన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనమ్

గొప్ప బలముతో గూడిన వాయువు ఆకాశముతో కలిసి వికార మును చెందుట వలన రూపతన్మాత్ర, దానినుండి లోకమునకు ప్రకాశ మును ఇచ్చే తేజస్సు (అగ్ని) పుట్టినవి.

అనిలేనాన్వితం జ్యోతిర్వికుర్వత్పరవీక్షితమ్

ఆధత్తాంభో రసమయం కాలమాయాంశయోగతః

పరబ్రహ్మయొక్క ఆధ్యక్ష్యములో కాలము, మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగము వలన వాయువుతో కూడిన అగ్నినుండి రసతన్మాత్ర, దానినుండి నీరు పుట్టినవి.

జ్యోతిషాంఽభోనుసంసృష్టం ఏకుర్వద్బృహ్మవీక్షితమ్

మహీం గంధగుణామాధాత్కాలమాయాంశయోగతః

కాలము, మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగము వలన పరమేశ్వరుని ఆధ్యక్ష్యములో అగ్నితో అనుగతమై యున్న జలము వికార మును పొంది, గంధము గుణముగా గల పృథివిని ఉత్పన్నము చేసెను.

భూతానాం నభఆదీనాం యద్యద్బవ్యావరావరమ్

తేషాం పరానుసంసర్గాద్యథాసంఖ్యం గుణాన్ విదుః

ఓ మహాత్ముడవగు విదురా! ఆకాశము మొదలగు ఈ పంచభూత ములలో వెనుకదానియందు ముందు ఉన్న భూతములు అనుగతమగు చుండుటచే, వాటి గుణముల సంఖ్య అదే క్రమములో నుండునని తెలియ వలెను.

ఏతే దేవాః కలా విష్ణోః కాలమాయాంశలింగినః

నానాత్వాత్స్వక్రియానీశాః ప్రోచుః ప్రాంజలయో విభుమ్

మహత్తత్త్వము మొదలగువాటి ఈ అభిమాని దేవతలు శ్రీమహావిష్ణువుయొక్క అంశలే. కాలమునకు లింగమగు వికారము, మాయయొక్క లింగమగు విక్షేపము (అనేకము అగుట) మరియు చిదా భాసయొక్క లింగమగు చేతన అనువాటీ సమాహారమే ఈ దేవతలు. కాని, వారు అనేకముగా నుండుటచే, పరస్పర సంబంధము కలుగ లేదు. ఆ కార ణముగా, ఆ దేవతలు బ్రహ్మాండరచనను చేయలేకపోయినవి. అపుడా దేవ తలు చేతులను జోడించి, పరమేశ్వరునితో ఇట్లు పలికినవి.

దేవా ఊచుః

నమామ తే దేవ పదారవిందం

ప్రపన్నతాపోపశమాతపత్రమ్

 యన్మూలకేతా యతయోఽoజసోరు

సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి

అభిమాని దేవతలు ఇట్లు పలికినవి --- ఓ పరమేశ్వరా! నీ పాదప ద్మములు శరణు పొందినవారి తాపమును పోగొట్టే గొడుగు వంటివి. యత నశీలురగు మహాత్ములు నీ పాదమూలమునాశ్రయించిన వారై, సంసారము లోని మహాదు:ఖమును తేలికగా దూరముగా పారద్రోలుచున్నారు.

ధాతర్యదస్మిన్ భవ ఈశ జీవాః

తాపత్రయేణోపహతా న శర్మ

ఆత్మన్ లభంతే భగవంస్తవాంఘ్రి-

 చ్చాయాం సవిద్యామత ఆశ్రయేమ

జగత్తును సృష్టించి పాలించే ఓ పరమేశ్వరా! జీవులు ఈ సంసారమునందు మూడు విధముల దుఃఖముచే పరాభూతులై అంతఃకరణము నందు శాంతిని పొందలేకున్నారు. కావున, మేము సర్వదా జ్ఞానప్రకాశము గల నీ పాదముల నీడను ఆశ్రయించుచున్నాము.

మార్గంతి యత్తే ముఖపద్మనీడైః

ఛందస్సుపర్ణైర్ ఋషయో వివిక్తే

యచ్చాఘమర్షోదసరిద్వరాయాః

పదం పదం తీర్థపదః ప్రపన్నాః

మహర్షులు నీ పద్మమువంటి ముఖమే గూడుగా గల (నీ ముఖప ద్మముయొక్క సొగసును వర్ణించే) వేదములు అనే పక్షుల ద్వారా (వేద మంత్రముల ద్వారా) ఏకాంతమునందు నీ పొదమును అన్వేషించుచుం దురు (ధ్యానించుచుందురు). తమ ఉదకములచే పాపములను పోగొట్టే నదులలో ముందు యెన్నదగిన గంగ నీ పాదమునుండి పుట్టినది. అట్టి పర మపావనమగు నీ పాదమును మేము శరణు జొచ్చుచున్నాము.

యచ్చృద్దయా శ్రుతవత్యా చ భక్త్యా

సంసృజ్యమానే హృదయ్యేఽవధాయ

జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా

ప్రజేమ తత్తేంఽఘిసరోజపీఠమ్

సాధకులు శ్రద్దతో నీ లీలలను శ్రవణము చేసి నీయందు భక్తిని పరి పుష్టము చేసుకొనెదరు. దానిచే, వారి అంతఃకరణము శుద్దమగును. అట్టి శుద్ధమగు హృదయమునందు వారు నీ పాదమును ధ్యానించి, తద్ద్వారా జ్ఞానమును, వైరాగ్యబలమును సంపాదించి జీవన్ముక్తులగుదురు. అట్టి నీ పద్మములవంటి పాదముల పీఠమును మేము ఆశ్రయించుచున్నాము.

విశ్వస్య జన్మస్థితిసంయమార్దే

కృతావతారస్య పదాంబుజం తే

ప్రజేమ సర్వే శరణం యదీశ

స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్

ఓ ఈశ్వరా! నీవు జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను నిర్వహిం చుట కొరకై అవతరించుచుందువు. అట్టి నీ పాదపద్మమును మే ఎందరము శరణు వేడుచున్నాము. నీ పాదము స్మరించిన భక్తులకు లాభ నుమునొసం గును గదా!

యతానుబంధఽసతి దేహగేహే

మమాహమిత్యూఢదురాగ్రహాణామ్

పుంసాం సుదూరం వసతోఽపి పుర్యాం

భజేమ తత్తే భగవన్ పదాబ్జమ్

ఓ ఈశ్వరా! జీవులు దేహము అనే ఇంట్లో నివసిస్తూ, ఆ దేహ మునందు, దానితో ముడివడియున్న బంధువర్గమునందు, ఇల్లు మొదలగు పరికరములయందు, నేను నాది అనే తప్పుడు భావనను దృఢముగా నిలు పుకొని యుందురు. ఈ సర్వము మిథ్య అని వారు యెరుగరు. నీవు కూడ అదే దేహములో ఆత్మచైతన్యరూపముగా నిలిచియున్ననూ, అజ్ఞానులగుటచే వారికి నీ పాదము బహుదూరమే. అట్టి నీ పాదపద్మమును మేము సేవించెదము.

తాన్ వై హ్యసద్వృత్తిభిరక్షిభిర్యే

పరాహృతాంతర్మనసః పరేశ

అథో న పశ్యంత్యురుగాయ నూనం

యే తే పదన్యాసవిలాసలక్ష్మ్యాః

ప్రకృతిని నియంత్రించే ఓ దేవా! మానవులు ఇంద్రియముల ద్వారా మిథ్యాభూతమగు జగత్తునందు సంచరిస్తూ బహిర్ముఖులై యుందురు. ఆ ఇంద్రియములు వారి అంతఃకరణములను నీనుండి దూర ముగా లాగివేయును. భక్తులచే అధికముగా గానము చేయబడే కీర్తి గల ఓ దేవా! కావుననే, వారు నీ నడకయొక్క విలాసమును ఉపాసించి ప్రకాశించే (నీ పాదములను శరణు జొచ్చి నిశ్చింతతో శోభిల్లే) భక్తులను నిశ్చయ ముగా కనజాలరు.

పానేన తే దేవ కథాసుధాయాః

ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే

వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం

యథాంజసాన్వీయుగకుంఠధిష్ణ్యమ్

ఓ దేవా! నీ గాథలు అనే అమృతమును పానము చేయుట వలన సాధకులలో భక్తి విశేషముగా వర్ధిల్లి అంతఃకరణము స్వచ్చమగు' . అట్టి అంతఃకరణములో వైరాగ్యమే సారముగా గల ఆత్మజ్ఞానము ఉదయించును. వెనువెంటనే వారు అనాయాసముగా వైకుంఠలోకమును పొందెదరు; అనగా, అప్రతిహతమగు స్వరూపమునందు నిష్ఠను కలిగి, జీవన్ముక్తులైయుందురు.

తథాపరే చాత్మసమాధియోగ-

బలేన జీత్వా ప్రకృతిం బలిష్ఠామ్

త్వామేవ ధీరాః పురుషం విశంతి

తేషాం శ్రమస్స్యా న్ని తు సేవయా తే

అదే విధముగా వివేకవంతులగు మరికొందరు సాధకులు చిత్తవృ త్తులను నిరోధించుట అనే ఉపాయముచే బలీయమగు మాయను జయించి పూర్ణుడవగు నిన్ను పొందుతున్నారు. కాని, వారికి శ్రమ అధికము. నీ సేవ చేయు భక్తులకైతే మోక్షము సులభము.

తత్తే వయం లోకసిసృక్షయాఽఽద్య

త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిస్స్మ

సర్వే వియుక్తాస్స్వవిహారతంత్రం

న శక్నుమస్తత్పృతిహర్తవే తే

ఓ ఆదిదేవా! నీవు లోకములను సృజించగోరి మమ్ములను సృష్టించినావు. కాని, సత్త్వరజస్తమోగుణములు అనే మూడు విభిన్నస్వభావ ములు గలవారమై విడిపోయి ఉన్నాము. ఆ, కారణముగా నీవు విహరించు టకు యోగ్యమగు బ్రహ్మాండమును నిర్మించి నీకు సమర్పించే సామ ర్థ్యము మాలో కొరవడినది.

యావద్బలిం తేఽజ హరామ కాలే

యథా వయం చాన్నమదామ యత్ర

యథోభయేషాం త ఇమే హి లోకా

బలిం హరంతోఽన్నమదంత్యనూహాః

పుట్టుక లేని ఓ దేవా! మేము సరియగు కాలములో నీకు పూర్ణభో గమును సమర్పించవలెను. మరియు, మేము కూడ మా స్థానమునందున్న వారమై ఆహారమును భక్షించవలెను. ఇంతేగాక, ఈ జీవులు కూడ విఘ్న ములకు, సంశయములకు దూరముగా నున్నవారై, నీకు మాకు ఇద్దరికీ భాగములనర్పిస్తూ, తమ తమ అన్నమును భక్షించవలెను. ఇవి అన్నీ జరిగే ఉపాయమును నీవు చేయుము.

త్వం నస్సురాణామసి సాన్వయానాం

కూటస్థ ఆద్యః పురుషః పురాణః

త్వం దేవ శక్త్యాం గుణకర్మయోనౌ

రేతస్త్వజాయాం కవిమాదధేఽజః

నిర్వికారుడవు, పూర్ణుడవు, సకలప్రాణులకు అంతర్యామివి, సనా తనుడవు అగు నీవే సకలకార్యవర్గముతో కూడియున్న మా దేవతలకు ఆదికారణుడవు. ఓ దేవా! నీకు పుట్టుక లేదు. సత్త్వరజస్తమోగుణములకు మరియు జన్మ మొదలగు క్రియలకు కారణమగు మాయాశక్తికి కూడ పుట్టుక లేదు.. నీవు అట్టి మాయాశక్తియందు మహత్తత్వము (సమష్టి చిదా భాస రూపము) అనే జగద్బీజమును కల్పించినావు. నీవు మాయాశక్తియందు చిదాభాస అనే జగద్బీజమును ఉంచినావు.

తతో వయం సత్పృముఖా యదర్థే

బభూవిమాత్మన్ కరవామ కిం తే

త్వం నస్స్వచక్షుః పరిదేహి శక్త్యా

దేవ క్రియార్థే యదనుగ్రహాణామ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధేపంచమోఽధ్యాయః

ఆత్మస్వరూపుడవగు ఓ దేవా! మహత్తత్త్వము మొదలగు మేము ఏ కార్యము కొరకు పుట్టితిమో, దాని విషయములో నీకు మేము ఏమి చేయదగును? మమ్ములను అనుగ్రహించువాడవు నీవే. బ్రహ్మాండ రచన కొరకై నీవు మాకు నీ క్రియాశక్తితో కూడియున్న నీ జ్ఞానశక్తిని కూడ ఇమ్ము.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో అయిదవ అధ్యాయము ముగిసినది (5).