భాగవత మహా పురాణము
12 - సృష్టి విస్తారమును వర్ణించుట
మైత్రేయ ఉవాచ ।
ఇతి తే వర్జితః క్షత్తః కాలాఖ్యః పరమాత్మనః ।
మహిమా వేదగర్బోఽథ యథాస్రాక్షీన్నిబోధ మే ॥
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ వీదురా! పరమేశ్వరుని కాలము అనే విభూతిని నేను నీకు ఇంతవరకు వర్ణించి చెప్పితిని. వేదము లకు నిధియగు బ్రహ్మగారు సృష్టిని చేసిన విధమును గురించి ఇప్పుడు చేప్పెదను. వినుము.
ససర్జాగ్రేఽoధతామిస్రమథ తామిస్రమాదికృత్ ।
మహామోహం చ మోహం చ తమశ్చాజ్ఞానవృత్తయః ॥
సృష్టికర్తయగు బ్రహ్మగారు మొట్టమొదట అంధతామిస్రము (మర ణము వలని భయము అనే అభినివేశము), తామిస్రము (ద్వేషము), మహా మోహము (రాగము), మోహము (అహంకారము, లేక అస్మిత) మరియు తమస్సు (తన స్వరూపము తెలియకుండుట అనే అవిద్య) అనే అయిదు అజ్ఞానవికారములను సృష్టించెను.
దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత ।
భగవద్ధ్యానపూతేన మనసాన్యాం తతోఽసృజత్ ॥
బ్రహ్మగారు పాప (అజ్ఞాన) భూయిష్ఠమగు ఈ సృష్టిని చూచి తనను తాను మెచ్చుకొనలేదు. అపుడాయన భగవంతుని ధ్యానించుట ద్వారా తన మనస్సును పవిత్రము చేసుకొని, మరియొక సృష్టిని చేసెను.
సనకం చ సనందం చ సనాతనమథాత్మభూః ।
సనత్కుమారం చ మునీన్నిష్కృఇయానూర్ధ్వరేతసః ॥
అపుడు స్వయంభువుడగు బ్రహ్మగారు సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే మహర్షులను సృష్టించెను. వారందరు సర్వకర్మసన్న్యా సపూర్వకమగు ఆత్మజ్ఞానమునందు నిష్ఠగల బ్రహ్మచారులు.
తాన్ బభాషే స్వభూః పుత్రాన్ ప్రజా స్సృజత పుత్రకాః ।
తనైచ్ఛన్మోక్షధర్మాణో వాసుదేవపరాయణాః ॥
మీరు సంతానమును గనుడని స్వయంభువుడగు బ్రహ్మగారు ఆ తన పుత్రులతో చెప్పెను. కాని, మోక్షధర్మమగు ఆత్మజ్ఞానమునందు నిష్ఠ గలవారు, వాసుదేవునియందు అనన్యమగు భక్తి గలవారు అగు ఆ మునులకు అట్టి ప్రవృత్తి మార్గము నచ్చలేదు.
సోఽవధ్యాతస్సు తైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనైః ।
క్రోధం దుర్విషహం జాతం నియంతుముపచక్రమే ॥
ఈ విధముగా కొడుకులు తన మాటను కాదని తనను తిరస్కరిం చగా, ఆ బ్రహ్మగారికి పట్టరానంత కోపము కలిగెను. ఆయన ఆ కోపమును ఆపుకొనుటకు ప్రయత్నించేను.
ధియా నిగృహ్యమాణోఽపి భ్రువోర్మధ్యాత్పృజాపతేః ।
సద్యోఽజాయత తన్మన్యుః కుమారో నీలలోహితః ॥
బ్రహ్మగారు ఆపుకొనే ప్రయత్నమును చేయుచున్ననూ, ఆ కోపము ఆయన కనుబొమల మధ్యనుండి నలుపు ఎరుపు రంగులు గల కుమారుని రూపములో ఆవిర్భవించెను.
స వై రురోద దేవానాం పూర్వజో భగవాన్ భవః ।
నామాని కురు మే ధాతః స్థానాని చ జగద్గురో ॥
దేవతలందరికంటే ముందు పుట్టిన ఆ రుద్రభగవానుడు రోదిస్తూ ఇట్లు పలికెను --- జగత్తునకు తండ్రియగు ఓ బ్రహ్మా! నాకు పేర్లను పెట్టి స్థానములను నిర్దేశించుము.
ఇతి తస్య వచః పాద్మో భగవాన్ పరిపాలయన్ ।
అభ్యధాద్బద్రయా వాచా మా రోదీస్తత్కరోమి తే ॥
పద్మమునుండి పుట్టిన బ్రహ్మభగవానుడు ఆ రుద్రుని ఆ వచన మును మన్నించి మధురమగు వాక్కుతో ఇట్లు పలికెను --- రోదించకు. ము. అటులనే చేయగలను.
యదరోదీస్సురశ్రేష్ఠ సోద్వేగ ఇవ బాలకః ।
తతస్త్వామభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః ॥
దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ భవుడా! నీవు బాలకుని వలె భయ ముతో రోదించిన కారణముచే జనులు నిన్ను రుద్రుడను పేరుతో వ్యవహ రీంచెదరు.
హృదింద్రియాణ్యసుర్వ్యోమ వాయురగ్నిర్జలం మహీ ।
సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని మే ॥
హృదయము, ఇంద్రియములు, ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు తపస్సు అను స్థానములను నేను నీ కొరకై ముందే ఏర్పాటు చేసితిని.
మన్యుర్మనుర్మహీనసో మహాఞ్చవ ఋతుధ్వజః ।
ఉగ్రరేతా భవః కాలో వామదేవో ధృతవ్రతః ॥
మన్యువు (ప్రళయమునందు కోపము ఉన్నట్లు కానవచ్చువాడు), మనువు (మనువుల రూపములో ప్రకటమగువాడు, లేక జ్ఞానస్వరూపుడు), మనసుడు (గొప్ప శక్తి గలవాడు), మహాన్ (నిరతిశయమగు విస్తారము గలవాడు), శివుడు (మంగళ స్వరూపుడు), ఋతుధ్వజుడు (ప్రకాశించే రూపము గలవాడు), ఉగ్రరేతసుడు (భయంకరమగు శక్తి గలవాడు), భవుడు (జగత్కారణుడు), కాలుడు (కాల స్వరూపుడు, లేక మృత్యుస్వరూ పుడు), వామదేవుడు (సుందరుడు మరియు స్వయంప్రకాశ స్వర "పుడు), ధృతవ్రతః (గొప్ప ప్రతనిష్ఠ గలవాడు) అనునవి రుద్రుని పేర్లు.
ధీర్వృత్తిరుశనోమా చ నియుత్సర్పిరిలాంబికా ।
ఇరావతీ సుధా దీక్షా రుద్రాణ్యో రుద్ర తే స్త్రియః ॥
ఓ రుద్రా! ధీ (బుద్ది), వృత్తి (క్రియాశీలము), ఉశన (హర్షము), నియుత్ (వాయువుయొక్క అశ్వము, గమనశక్తి), సర్పి (ఆహుతినిచ్చే ద్రవ్యము), ఇల (వాక్కు), అంబిక (జగన్మాత), ఇరావతి (అమృతధారిణి), సుధ (అమృతస్వరూపిణి), దీక్ష అను స్త్రీలు నీకు భార్యలు (శక్తులు) కాగలరు.
గృహాణైతాని నామాని స్థానాని చ సయోషణః ।
ఏభిస్సృజ ప్రజా బహ్వీః ప్రజానామసీ యత్పతిః ॥
నీవు భార్యలతో గూడి ఈ పేర్లను మరియు స్థానములను స్వీకరిం చి, అధికముగా ప్రజాసృష్టిని చేయుము. ఏలయన, నీవు ప్రజాపతివి.
ఇత్యాదిష్టస్స గురుణా భగవాన్నీలలోహితః ।
సత్త్వాకృతిస్వభావేన ససర్జాత్మసమాః ప్రజాః ॥
తన తండ్రియగు బ్రహ్మగారు ఈ విధముగా ఆదేశించగా ఆ నీల లోహిత భగవానుడు, బలము ఆకారము మరియు స్వభావము అనువా టిలో తనతో సమానులగు సంతానమును సృష్టించెను.
రుద్రాణాం రుద్రసృష్టానాం సమంతాద్గృసతాం జగత్ ।
నిశామ్యాసంఖ్యశో యూథాన్ ప్రజాపతిరశంకత ॥
రుద్రునిచే సృష్టించబడిన రుద్రులు లెక్క లేనన్ని గణములుగా నున్నవారై జగత్తునంతనూ భక్షించ మొదలిడిరి. వారిని చూచిన బ్రహ్మ గారికి శంక కలిగెను.
అలం ప్రజాభిస్సృష్టాభిరీదృశీభిస్సురోత్తమ ।
మయా సహ దహంతీభిర్దిశశ్చక్షుర్బిరుల్బజైః ॥
దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ రుద్రా! నీచే సృష్టించబడిన ఈ రుద్రులు నాతో సహా దిక్కులను తమ క్రూరములగు చూపులతో కాల్చివే యుచున్నారు. ఈ సృష్టి చాలును. ఇట్టి వారిని ఇంక సృష్టించవలదు.
తప ఆతిష్ఠ భద్రం తే సర్వభూతసుఖావహమ్ ।
తపసైవ యథా పూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్ ॥
నీవు సకలప్రాణులకు సుఖమును కలిగించే తపస్సును చేయుము. నీకు మంగళమగుగాక! ఆ తపస్సుయొక్క ప్రభావముచే నీవు పూర్వము నందు వలెనే సృష్టిని చేయగలవు.
తపసైవ పరం జ్యోతిర్బగవంతమధోక్షజమ్ ।
సర్వభూతగుహావాసమంజసా విందతే పుమాన్ ॥
సర్వమును ప్రకాశింపజేసే చైతన్యస్వరూపుడు, సకలప్రాణుల బుద్ధిగుహయందు చైతన్యరూపముగా ఉపలభ్యమగువాడు, ప్రత్యక్షాది ప్రమాణములకు దొరకనివాడు అగు శ్రీహరి భగవానుని మానవుడు తప స్సుచే మాత్రమే సాక్షాత్తుగా (ఆత్మరూపముగా) దర్శించగల్గును.
మైత్రేయ ఉవాచ ।
ఏవమాత్మభువాదిష్టః పరిక్రమ్య గిరాం పతిమ్ ।
బాఢమిత్యముహమంత్యృ వివేశ తపసే వనమ్ ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- స్వయంభువుడు, వేదరూపము లగు వాక్కులకు ప్రభువు అగు బ్రహ్మ ఈ విధముగా ఆదేశించగా, ఆ రుద్రుడు సరే అని అంగీకరించి, ఆయనవద్ద సెలవు తీసుకొని, తపస్సును చేయుట కొరకై అడవికి వెళ్లాను.
అథాభిధ్యాయతస్సర్గం దశ పుత్రాః ప్రజజ్ఞిరే ।
భగవచ్ఛక్తియుక్తస్య లోకసంతాన హేతవః ॥
బ్రహ్మగారు లోకములను సృష్టించే శక్తిని శ్రీహరి భగవానుని నుండి పొందియుండెను. ఆయన సృష్టిని గురించి ఆలోచించుచుండగా, ఆయనకు పదిమంది పుత్రులు కలిగిరి. వారు వివిధప్రాణుల (లోకముల) సృష్టికి కారణభూతులైరీ.
మరీచిరత్ర్యంగిరసౌ పులస్త్యః, పులహః క్రతుః ।
భృగుర్వసిష్ఠో దక్షశ్చ దశమస్తత్ర నారదః ॥
మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వసిష్ఠుడు, దక్షుడు మరియు నారదుడు అనునవి ఆ పదిమంది పుత్రుల పేర్లు.
ఉత్సంగాన్నారదో జజ్ఞే దక్షోఽoగుష్టాత్స్వయంభువః ।
ప్రాణాద్వసిష్ఠస్సంజాతో భృగుస్త్వచి కరాత్కృతుః ॥
స్వయంభువుడగు బ్రహ్మగారి ఒడినుండి నారదుడు, బొటనవ్రేలి నుండి దక్షుడు, ప్రాణమునుండి వసిష్ఠుడు, చర్మమునుండి భృగువు, చేతి నుండి క్రతువు పుట్టిరి.
పులహో నాభితో జజ్ఞే పులస్త్యః కర్ణయోరృషిః ।
అంగిరా ముఖతోఽక్ష్ణోఽత్రిర్మరీచిర్మనసోఽభవత్ ॥
బొడ్డునుండి పులహుడు, చెవులనుండి పులస్త్యుడు, నోటినుండి అంగిరసుడు, కంటినుండి అత్రి, మనస్సునుండి మరీచి పుట్టిరి.
ధర్మః స్తనాద్దక్షిణతో యత్ర నారాయణస్స్వయమ్ ।
అధర్మః పృష్ఠతో యస్మాన్మృత్యుర్లోకభయంకరః ॥
బ్రహ్మగారి కుడి స్తనమునుండి ధర్మ ప్రజాపతి పుట్టెను. నారాయ ణుడు స్వయముగా ఆయనకు కుమారుడై అవతరించెను. బ్రహ్మగారి వీపు నుండి అధర్మము పుట్టెను. ఆ అధర్మమునుండి లోకములకు భయమును గొల్పే మృత్యుదేవత పుట్టెను.
హృది కామో భ్రువః క్రోధో లోభశ్చాధరదచ్చదాత్ ।
ఆస్యాద్వాక్సింధవో మేడ్రాన్నిరృతిః పాయోరఘాశ్రయః ॥
హృదయమునుండి కామము, కనుబొమనుండి క్రోధము, క్రింది పెదవినుండి లోభము, ముఖమునుండి వాక్కు, మేడ్రమునుండి సముద్రములు, విసర్జనేంద్రియమునుండి పాపనిలయుడగు నిరృతి జన్మించిరి.
ఛాయాయాః కర్దమో జజ్ఞే దేవహూత్యాః పతిః ప్రభుః ।
మనసో దేహతశ్చేదం జజ్ఞే విశ్వకృతో జగత్ ॥
దేవహూతియొక్క భర్తయగు కర్దమ ప్రజాపతి సృష్టికర్తయొక్క నీడ (దేహకాంతి) నుండి పుట్టెను. ఈ జగత్తు ఆయన దేహమునుండి మరియు మనస్సునుండి పుట్టినది.
వాచం దుహీతరం తన్వీం స్వయంభూర్హరతీం మనః ।
అకామాం చకమే క్షత్తస్సకామ ఇతి నః శ్రుతమ్ ॥
ఓ విదురా! వాగ్గేవి తన సౌకుమార్యముచే మనస్సును దోచివేయు చుండెను. కాని, ఆమెయందు కామన లేదు. కాముకుడైన బ్రహ్మ ఆమెను కామించెనని మేము వినియుంటిమి.
తమధర్మే కృతమతిం విలోక్య పితరం సుతాః ।
మరీచిముఖ్యా మునయో విశ్రంభాత్పృత్యబోధయన్ ॥
బ్రహ్మగారి పుత్రులగు మరీచి మొదలైన మహర్షులు తమ తండ్రి మనస్సు అధర్మమునందు లగ్నమైయుండుటను చూచిరి. ఆయన తమ మాటను కాదనడనే నమ్మకముతో వారు ఆయనకు నచ్చజెప్పిరి.
నైతత్పూర్వైః కృతం త్వద్యే న కరిష్యంతి చాపరే ।
యస్త్వం దుహితరం గచ్ఛేరనిగృహ్యాంగజం ప్రభుః ॥
అయ్యా! మీ కంటే పూర్వమునందున్న వారు (బ్రహ్మలు) ఇట్టి పనిని చేయలేదు. మీ తరువాత రాబోయే బ్రహ్మలు కూడ ఇట్టి పనిని చేయబోరు. మీరు సర్వసమర్థులై ఉండియు, కామమును నిగ్రహించకుండ గా, కుమార్తెను కామించుచున్నారు.
తేజీయసామపి హ్యేతన్న సుశ్లోక్యం జగద్గురో ।
యద్వృత్తమనుతిష్ఠన్ వై లోకః క్షేమాయ కల్పతే ॥
తండ్రీ! నీవు లోకములకు తండ్రివి, జ్ఞానప్రదాతవు. నీవంటి మహా తేజశ్శాలురకైననూ ఈ పని మంచి కీర్తిని తెచ్చి పెట్టదు. ఏలయనగా, నీవంటి వారి ప్రవర్తనను లోకులు అనుసరించి, తమకు క్షేమమును కలిగిం మకొనెదరు.
తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచిషా ।
ఆత్మస్థం వ్యంజయామాస స ధర్మం పాతుమర్హతి ॥
భగవానుడు తనయందు అవ్యక్తముగానున్న జగత్తును సంకల్ప మాత్రముచే తన శక్తినుండి వెలయించినాడు. ఆయనకు మేము నమస్కరిం చుచున్నాము. ఆయనయే ధర్మమును రక్షించుటకు సమర్థుడు.
స ఇత్థం గృణతః పుత్రాన్ పురో దృష్ట్వా ప్రజాపతీన్ ।
ప్రజాపతిపతీస్తత్వం తత్యాజ ప్రీడితస్తదా ।
తాం దిశో జగృహుర్ఘోరాం నీహారం యద్విదుస్తమః ॥
తన యెదుట తన పుత్రులగు ప్రజాపతులు ఇట్లు పలుకగా, ఆ ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు సిగ్గుపడి ఆ దేహమును విడిచి పె టైను. అధర్మసంసర్గముచే భయమును గొల్పే ఆ దేహమును దిక్కులు స్వీకరించినవి. అదియే పొగమంచు అనియు, చీకటి అనియు వ్యవహరింప బడుచున్నది.
కదాచిద్ద్యాయతస్సృష్టుర్వేదా ఆసంశ్చతుర్ముఖాత్ ।
కథం స్రక్ష్యామ్యహం లోకాన్ సమవేతాన్ యథా పురా ॥
నేను పూర్వమునందు వలెనే చక్కని రచనాసౌష్టవము గల లోక ములను ఏ విధముగా సృష్టించ గల్గుదును? అని ఆలోచించుచున్న సృష్టి కర్తయగు బ్రహ్మగారి నాలుగు ముఖములనుండి నాలుగు వేదములు ఆవి ర్భవించినవి.
చాతుర్హోత్రం కర్మతంత్రముపవేదనయైస్సహ ।
ధర్మస్య పాదాశ్చత్వారస్తథైవాశ్రమవృత్తయః ॥
హోత, ఉద్దాత, అధ్వర్యుడు మరియు బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కుల కర్మలు, యజ్ఞము మొదలగు వైదికకర్మల విస్తారము, నాలుగు ఉపవేదములు, నీతిశాస్త్రము, ధర్మముయొక్క నాలుగు పాదము లు, బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్న్యాసము అనే నాలుగు ఆశ్రమములు మరియు వాటి ధర్మములు అనునవి కూడ ఆవిర్భవించెను.
విదుర ఉవాచ ।
స వై విశ్వసృజామీశో వేదాదీన్ ముఖతోఽసృజత్ ।
యద్యద్యేనాసృజద్దేవస్తన్మే బ్రూహి తపోధన ॥
విదురుడు ఇట్లు పలికెను --- తపస్సే ధనముగా గల ఓ మైత్రేయా! జగత్కర్తలగు ప్రజాపతులకు తండ్రియగు ఆ బ్రహ్మగారు తన ముఖములనుండి వేదములు మొదలగు వాటిని సృష్టించెను గదా! ఆయన దేనిని దేనిని ఏ ముఖమునుండి సృష్టించెను? ఆ వివరములను నాకు చెప్పుము.
మైత్రేయ ఉవాచ ।
ఋగ్యజుస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః ।
శస్త్రమిజ్యాం స్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్కృమాత్ ॥
బ్రహ్మగారు తూర్పు ముఖమునుండి ఋగ్వేదమును, దక్షిణముఖమునుండి యజుర్వేదమును, పశ్చిమముఖమునుండి సామవేదమును, ఉత్తరముఖమునుండి అథర్వవేదమును ఆవిర్భవింప జేసెను. అదే వరుసలో శస్త్రము (హోత పఠించే ఋగ్వేదములోని దేవతాస్తుతి) ను, ఇజ్య (అధ్వర్యుని కర్మ) ను, స్తుతిస్తోమము (దేవతలను స్తుతిస్తూ ఉద్ధాత చేసే సామగానము) ను మరియు ప్రాయశ్చిత్తము (బ్రహ్మ చేసే కర్మ) ను ప్రకా శింప జేసెను.
ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మనః ।
స్థాపత్యం చాసృజర్వేదం క్రమాత్పూర్వాదిభిర్ముఖైః ॥
బ్రహ్మగారు తన తూర్పు ముఖమునుండి ఆయుర్వేదము (వైద్యశాస్త్రము) ను, దక్షిణముఖమునుండి ధనుర్వేదము (యుద్దశాస్త్రము) ను, పశ్చిమముఖమునుండి గాంధర్వవేదము (సంగీతశాస్త్రము) ను, ఉత్తరముఖమునుండి స్థాపత్యవేదము (శిల్పశాస్త్రము) ను సృష్టించెను.
ఇతిహాసపురాణాని పంచమం వేదమీశ్వరః ।
సర్వేభ్య ఏవ వక్తృఏభ్యస్ససృజే సర్వదర్శనః ॥
జగన్నియంత మరియు సర్వజ్ఞుడు అగు బ్రహ్మగారు ఇతిహాసములు మరియు పురాణములు అనే అయిదవ వేదమును తన అన్ని ముఖములనుండియు సృష్టించెను.
షోడశ్యుక్థౌ పూర్వవక్త్రాత్పురీష్యగ్నిష్టుతావథ ।
ఆప్తోర్యామాతిరాత్రౌ చ వాజపేయం సగోసవమ్ ॥
బ్రహ్మగారు తూర్పు ముఖమునుండి షోడశి మరియు ఉక్తము అనే యాగములను, దక్షిణముఖమునుండీ అగ్నిచయనము మరియు అగ్నిష్టోమము అనే యాగములను, పశ్చిమముఖమునుండి ఆప్తోర్యామ-అతిరాత్రములను, ఉత్తరముఖమునుండి గోసవ-వాజపేయములను సృష్టించెను.
విద్యా దానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ ।
ఆశ్రమాంశ్చ యథాసంఖ్యమసృజత్సహ వృత్తిభిః ॥
విద్య దానము తపస్సు మరియు సత్యము అనే నాలుగు పాదములతో కూడిన ధర్మమును, ఆశ్రమములను, వాటి వాటి జీవిక (వృత్తి) లను బ్రహ్మగారు అదే వరుసలో సృష్టించెను.
సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాథ బృహత్తథా ।
వార్తాసంచయశాలీనశిలోంఛ ఇతి వై గృ హే ॥
సావిత్రము (ఉపనయనమైన తరువాత బ్రహ్మచారి చేసే మూడు రోజుల వ్రతము), ప్రాజాపత్యము. (సంవత్సరకాలము బ్రహ్మచారి చేసే వ్రతము), బ్రాహ్మము (వేదాధ్యయనము పూర్తియగు వరకు బ్రహ్మచారి చేసే వ్రతము), బృహత్ (జీవించియున్నంత వరకు బ్రహ్మచారి చేసే ప్రత ము) అను నాలుగు బ్రహ్మచర్యాశ్రమమునకు చెందిన వృత్తులు. వార్త (పంటలను పండించుట మొదలగు శాస్త్రవిహితమగు జీవనోపాయము), సంచయము (యజ్ఞములు మొదలగు వైదికకర్మలకు యాజకత్వము వహించి తద్ద్వారా జీవికను సంపాదించుకొనుట), శాలీనము (యాచించ కుండగా లభించే దానితో జీవించుట) మరియు శిలాంఛము (పంటను కోసిన తరువాత అచట నేలపై పడియున్న గింజలను మరియు ధాన్యమును విక్రయించే స్థలములలో పడియున్న గింజలను ఏరుకొని వాటితో పొట్టపోసుకొనుట) అనునవి గృహస్థాశ్రమమునకు సంబంధించిన వృత్తులు.
వైఖానసా వాలఖిల్యౌదుంబరాః ఫేనపా వనే ।
న్యాసే కుటీచకః పూర్వం బహ్వోదో హంసనిష్క్రియౌ ॥
వానప్రస్థాశ్రమమునందు వైఖానసులు (దున్నని భూమినుండి లభించే ఆహారమును తినువారు), వాలఖిల్యులు (కొత్త ఆహారము లభించిన వెంటనే అంతకు ముందు తమవద్ద నున్న ఆహారమును ఇతరులకు ఇచ్చివేయువారు), ఔదుంబరులు (ఉదయము నిద్ర లేచినప్పుడు ముఖము ఏ దిక్కువైపు ఉంటే ఆ దిక్కులో లభించే ఆహారముతో జీవించువారు) మరియు ఫేనపులు (తమంత తాముగా రాలిన పళ్లను తిని బ్రతుకు వారు) అనువారలు గలరు. సన్న్యాసాశ్రమమునందు వరుసగా కుటీచకుడు (ఒకే చోట స్థిరముగా ఒక పూరింటిలో నుంటూ ఆశ్రమధర్మములను పాలించువాడు), బహూదకుడు (కర్మను కొద్దిగా మాత్రమే చేస్తూ జ్ఞాననిష్ఠను ప్రధానముగా చేసుకొని జీవించువాడు), హంస (జ్ఞానాభ్యాసమునందు నిష్ఠ గలవాడు) మరియు పరమహంస (జ్ఞాని) అనువారలు గలరు.
ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్తథైవ చ ।
ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవో హ్యస్య దహ్రతః ॥
బ్రహ్మగారి తూర్పు ముఖము మొదలగు క్రమములోనే ఆన్వీక్షికీ (మోక్షమునిచ్చే ఆత్మవిద్య), త్రయీ (స్వర్గాది ఫలములనిచ్చే కర్మశాస్త్రము), వార్త (కృషివాణిజ్యాది విద్య) మరియు రాజనీతి శాస్త్రము ఉదయించినవి. అంతేగాక, భూః భువః సువః భూర్భువస్సువః (లేదా మహః) అనే నాలుగు వ్యాహృతులు కూడ అదే క్రమములో ఉదయించినవి. మరియు ఓంకారము ఈ బ్రహ్మగారి హృదయాకాశమునుండి ప్రకటమైనది.
తస్యోష్టిగాసీల్లోమభ్యో గాయత్రీ చ త్వచో విభోః ।
త్రిష్టుమ్మాంసాత్స్నుతోకనుష్టుజ్జగత్యర్థః ప్రజాపతేః ॥
సర్వశక్తిమంతుడగు ఆ ప్రజాపతియొక్క రోమములనుండి ఉష్ణిక్, చర్మమునుండి ,గాయత్రి, మాంసమునుండి త్రిష్టుప్, నరములనుండి అనుష్టుప్ మరియు ఎముకలనుండి జగతి అనే ఛందస్సులు ఉదయించినవి.
మజ్జాయాః పంక్తిరుత్పన్నా బృహతీ ప్రాణతోఽభవత్ ।
స్పర్శస్తస్యాభవజ్జీవస్స్వరో దేహ ఉదాహృతః ॥
ఆ బ్రహ్మగారి మజ్జనుండి పంక్తిచ్ఛందస్సు, ప్రాణములనుండి బృహతీఛందస్సు పుట్టినవి. ఆయనయొక్క జీవుడే (జీవకార్యము) హల్లులు కాగా, దేహము అచ్చులు ఆయెను.
ఊష్మాణమింద్రియాణ్యాహురంతఃస్థా బలమాత్మనః ।
స్వరాస్సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతేః ॥
శ ష స హ అనే ఊష్మవర్ణములు బ్రహ్మగారి ఇంద్రియములని యు, య ర ల వ అనే అంతఃస్థ వర్ణములు బలము అనియు చెప్పెదరు. ఆయన విహారమునుండి నిషాదము, ఋషభము, గాంధారము, షడ్జము, మధ్యమము, దైవతము, పంచమము అనే ఏడు స్వరములు పుట్టెను.
శబ్దబ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్య క్తాత్మనః పరః ।
బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః ॥
వ్యక్తము (వర్ణముల రూపములో ప్రకటమైనది, వైఖరి), అవ్యక్తము (వర్ణములకు కారణమై విశిష్టరూపములో ప్రకటము కానిది, పరాపశ్యంతీమధ్యమా రూపము లేక ఓంకారము) అని శబ్దము రెండు విధములుగా నున్నది. ఆ బ్రహ్మగారు అట్టి శబ్దమే స్వరూపముగా గలవాడు. స్వయముగా సర్వమునకు అతీతమై యున్ననూ, అనేకవిధములగు శక్తిచే సర్వరూపముగా విస్తరించియున్న పూర్ణపరబ్రహ్మ ఆయనకు బుద్దియందు ప్రకాశంచుచుండును. లేదా, ఆ పరబ్రహ్మ సర్వజగద్రూపముగా భాసిల్లుచున్నది.
తతోఽపరాముపాదాయ స సర్గాయ మనో దధే ।
ఋషీణాం భూరివీర్యాణామపి సర్గమవిస్తృతమ్ ॥
శబ్దసృష్టి అయిన తరువాత ఆ బ్రహ్మగారు (కామాసక్తమైన దేహమును విడిచి) మరియొక దేహమును స్వీకరించి, జగత్తును విస్తరింపజేయవలెనని సంకల్పించెను. మరీచి మొదలగు మహర్షులు గొప్ప శక్తి గల వారే అయిననూ, వారిద్వారా సృష్టి విస్తరిల్లలేదు.
జ్ఞాత్వా తద్ధృదయే భూయశ్చింతయామాస కౌరవ ।
అహో అద్బుతమేతన్మే వ్యాపృతస్యాపి నిత్యదా ॥
న హ్యేదంతే ప్రజా నూనం దైవమత్ర విఘాతకమ్ ।
ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా ॥
కస్య రూపమభూద్ద్వేధా యత్కాయమభిచక్షతే ।
తాభ్యాం రూపవిభాగాభ్యాం మిథునం సమపద్యత ॥
ఓ విదురా! ఆ విషయమును గమనించి బ్రహ్మగారు తన హృదయములో మరల ఇట్లు తలపోసెను: అహో! ఇది అద్భుతము! నేను సర్వకాలములలో ప్రయత్నమును చేయుచునే యున్నాను. అయిననూ, ఈ ప్రాణులు వర్ధిల్లకున్నారు. దీనియందు దైవము ప్రతిబంధకమగుచున్నది. ఇది నిశ్చయము. ఈ విధముగా ఆ బ్రహ్మగారు సముచితమగు ప్రయత్నమును చేయుచూ దైవానుగ్రహమును భావనచేయుచుండెను. అపుడు ఆయన రూపము రెండుగా విడిపోయి, స్త్రీపురుషుల జంట ప్రకటమయ్యేను. కః అనగా బ్రహ్మ. ఆయన రూపము విడివడి ఏర్పడిన కారణముగా ఆ జంట దేహములకు కాయము అని పేరు వచ్చెను.
యస్తు తత్ర పుమాన్ సోఽభూన్మనుస్స్వాయంభువస్స్వరాట్।
స్త్రీ యాఽసీచ్ఛతరూపాఖ్యా మహిష్యస్య మహాత్మనః ॥
ఆ జంటలో పురుషుడు స్వాయంభువ మనువు. ఆయన ఈ లోకమునకు సార్వభౌముడు ఆయెను. స్త్రీ పేరు శతరూప. ఆమె ఆ మహాత్ముని భార్య ఆయెను.
తదా మిథునధర్మేణ ప్రజా హ్యేధాంబభూవిరే ।
స చాపి శతరూపాయాం పంచాపత్యానజీజనత్ ॥
ప్రియవ్రతోత్తానపాదౌ తిస్రః కన్యాశ్చ భారత ।
ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి సత్తమ ॥
అప్పటినుండియు మిథునధర్మముచే ప్రాణులు వర్ధిల్లజొచ్చెను. స్వాయంభువ మనువునకు శతరూపయందు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు, ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, వెరసి అయిదుగురు సంతానము కలిగిరి.
ఆకూతిం రుచయే ప్రాదాత్కర్దమాయ తు మధ్యమామ్ ।
దక్షాయాదాత్ప్రసూతిం చ యత ఆపూరితం జగత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే
ద్వాదశోఽధ్యాయః ॥
ఆయన ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దమునకు, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహము చేసెను. వారి సంతానముచే జగత్తు అంతయు నిండెను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు
పన్నెండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
Maitreya describes how Lord Brahmā began the secondary creation by manifesting the modes of ignorance and subsequently generating the four celibate sages—Sanaka, Sanātana, Sanandana, and Sanat-kumāra—who declined to multiply and chose instead to remain lifelong celibates dedicated to God. In his resulting frustration, Brahmā created Lord Shiva from between his eyebrows, followed by the ten great sages, Narada, and the progenitor Svāyambhuva Manu along with his wife Shatarūpā.