7 - విదురుని ప్రశ్న

శ్రీశుక ఉవాచ

ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయనసుతో బుధః

ప్రీణయన్నివ భారత్యా విదురః ప్రత్యభాషత

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విద్వాంసుడు, వ్యాసనందనుడు అగు విదురుడు మైత్రేయుని ఈ వచనములను విని, తన పలుకు లతో ఆయనకు ముదమును గొల్పుతూ ఇట్లు పలికెను.

విదుర ఉవాచ

బ్రహ్మన్ కథం భగవతశ్చిన్మాత్రస్యావికారిణః

లీలయా చాపి యుజ్యేరన్నిర్గుణస్య గుణాః క్రియాః

ఓ మహాత్మా! భగవానుడు శుద్ధచైతన్యమే స్వరూపముగా గలవా డు. ఆయనయందు వికారములేమియు లేవు. ఆయన నిర్గుణుడు. అట్టి భగ వానునకు , లీలామాత్రముగానైననూ గుణములతో మరియు క్రియలతో సంబంధము ఎట్లు పొసగును?

క్రీడాయాముద్యమోఽర్బస్య కామశ్చిక్రీడిషాన్యతః

స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదాన్యతః

పిల్లలకు ఆటలయందు ప్రీతి ఉండును. వారు ఆటవస్తువులను ముందు వేసుకొని, లేదా మరికొందరు పిల్లలతో కలిసి ఆడుకొనే యత్నములో మునిగియుందురు. కాని, భగవానుడు ఆత్మతృప్తుడు. ఆయనకు ఆడుకొనుటకై తనకంటే భిన్నముగా ఇతరవస్తువులు గానీ, ఇతరవ్యక్తులు గాని లేరు. అట్టి అసంగునకు ఆటలాడుటయందు కోరిక, దానిని అనుసరించి ప్రయత్నము, ఇతరములగు క్రీడోపకరణములయందు మరియు వ్యక్తులయందు ప్రవృత్తి ఎట్లు పొసగును?

అస్రాక్షీద్భగవాన్ విశ్వం గుణమయ్యాఽఽత్మమాయయా

తయా సంస్థాపయత్యేతద్భూయః ప్రత్యపిధాస్యతి

భగవానుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు తన మాయాశక్తిని ఆసరాగా చేసుకొని ఈ జగత్తును సృష్టించినాడు; ఆ శక్తితోనే దీనిని పాలిం చుచున్నాడు; మరల ఆయన ప్రళయమునందు దీనిని తనలోనికి ఉపసం హరించగలడు.

దేశతః కాలతో యఽసావవస్థాతస్స్వతోఽన్యతః

అవిలుప్తావబోధాత్మా స యుజ్యేతాజయా కథమ్

భగవానుడు నిర్విశేష జ్ఞానస్వరూపుడు. ఆయన స్వరూపముగు జ్ఞానమునందు దేశముచే గాని, కాలముచే గాని, జాగ్రత్తు మొదలగు అవ స్థచే గాని, తనంత తానుగా గాని, మరియొక నిమిత్తముచే గాని, లోపము కలుగదు. అట్టి భగవానునకు అవిద్యతో సంయోగము ఎట్లు పొసగును?

భగవానేక ఏవైష సర్వ క్షేత్రేష్వవస్థితః

అముష్య దుర్బగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః

అద్వితీయుడగు భగవానుడు మాత్రమే దేహములన్నింటియందు క్షేత్రజ్ఞుని రూపములో ఉన్నాడు గదా! అట్టి స్థితిలో ఈ క్షేత్రజ్ఞుడు ఆనందమునకు దూరుడై కర్మలతో క్లేశముననుభవించుటకు కారణమేమి?

ఏతస్మిన్మే మనో విద్వన్ ఖిద్యత్వేఽజ్ఞానసంకటే

తన్నః పరాణుద విభో కశ్మలం మానసం మహత్

ఓ ప్రభూ! నీవు విద్వాంసుడవు. నా మనస్సు అజ్ఞానము అనే ఈ సంకటములో పడి చాల భేదముననుభవించుచున్నది. నీవు ఈ పెద్ద మానసిక దోషమును దూరము చేయుము.

శ్రీశుక ఉవాచ

స ఇత్థo చోదితః క్షత్త్వత్త్ తత్త్వజిజ్ఞాసునా మునిః

ప్రత్యాహ భగవచ్చిత్తస్స్మయన్నివ గతస్మయః

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను -- తత్త్వమును తెలియగోరే విదురుడు ఈ విధముగా ప్రేరేపించగా, అహంకారము లేని ఆ మైత్రేయుడు భగవంతుని స్మరించి చిరునవ్వుతో ఇట్లు సమాధానమును చెప్పెను.

మైత్రేయ ఉవాచ

సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే

ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బంధనమ్

మైత్రేయుడు ఇట్లు పలికెను --- నిత్యముక్తుడగు ఈశ్వరుడు జీవ రూపములో బద్ధుడై దీనుడై ఉండుట అనే ఈ యుక్తవిరుద్ధమగు స్థితి భగ వానుని ఆ మాయ మాత్రమే.

యదర్థేన వినాముష్య పుంస ఆత్మవిపర్యయః

ప్రతీయత ఉపద్రష్టుస్స్వశిరశ్ఛేదనాదికః

ఈ మానవునకు స్వప్నములో తన తల తెగినట్లుగా కానవచ్చును. కాని, అది యథార్థము కాదు. అదే విధముగా, ఈ మానవునకు తాను బద్ధుడు కాకున్ననూ, బద్ధుడనైతిని అని తన స్వరూపమునకు భిన్నముగా భాసించును. అది అజ్ఞానకల్పితము మాత్రమే.

యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః

దృశ్యతేఽస్సన్నపి ద్రష్టురాత్మనోఽనాత్మనో గుణాః

నీటిలో చంద్రుడు ప్రతిఫలించినప్పుడు ఆ నీటికి గల కదలిక మొదలగు గుణములు, ఆ చంద్రునియందు వాస్తవముగా లేకున్ననూ, ఉన్నట్లు కన్పట్టును. అదే విధముగా దృక్ స్వరూపమగు ఆత్మయందు దేహము మొదలగు అనాత్మల గుణములు వాస్తవముగా లేకున్ననూ, ఉన్నట్లు కానవచ్చుచున్నవి.

స వై నివృత్తిధర్మేణ వాసుదేవానుకంపయా

భగవద్భక్తియోగేన తిరోధత్తే శనైరిహ

జిజ్ఞాసువు క్రియలనుండి (కర్తృత్వమునుండి) ఉపరతిని చెంది, వాసుదేవుని అనుగ్రహమును బడసి, ఆ భగవానునియందు భక్తిని చేసిన నాడు, ఆత్మయందు అనాత్మధర్మముల ఆ అధ్యాస మెల్లగా, కాని నిశ్చిత ముగా దూరమగును.

యదేంద్రీయోపరామోఽథ ద్రష్టృఆత్మని పరే హరే

విలీయంతే తదా క్లేశాస్సంసుప్త సేవ కృత్స్నశః

మానవుని చిత్తములో అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభీని వేశము అనే క్లేశములు (మలములు) గలవు, ఏ కాలములో ఇంద్రియ ములు సంసారమునుండి విరమించి ద్రష్టయగు - జీవుని స్వరూపమైన శ్రీహరి పరమాత్మయందు విలీనమగునో, అదే క్షణములో మానవుని క్లేశ ములు, గాఢనిద్రలో నున్నవానికి వలే, నాశమును పొందును.

అశేషసంక్లేశశమం విధత్తే గుణానువాదశ్రవణం మురారేః

కుతః పునస్తచ్చరణారవిందపరాగ సేవారతిరాత్మలబ్ధా

మురారి గుణములను కీర్తించుట, వినుట వలన క్లేశములన్నియు శాంతించును. ఇట్టి స్థితిలో, మనస్సునకు ఆయన పాదపద్మములను సేవిం చుటయందు ప్రీతి యేర్పడినచో, ఇక చెప్పునదేమున్నది?

విదుర ఉవాచ

సంఛిన్నస్సంశయే మహ్యం తవ సూక్తాసినా విభో

ఉభయత్రాపి భగవన్మనో మే సంప్రదావతి

ఓ ప్రభూ! నీ పలుకులు అనే చురకత్తి నా సందేహములను ఛేదిం చివేసినది. ఓ పూజ్యా! ఈశ్వరుని స్వతంత్రత, జీవుని పరతంత్రత మరియు కల్పితమగు బంధము, నిత్యమగు మోక్షము అనే రెండు అంశముల యందు ఇప్పుడు నా మనస్సు చక్కగా ప్రవేశించుచున్నది; అనగా, విరో ధాభాసలతో ఇబ్బంది పడుట లేదు.

సాధ్వీతద్వ్యాహృతం విద్వన్నాత్మమాయాయనం హరేః

ఆభాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం న యద్బహిః

ఓ విద్వాంసుడా! నీవు చక్కగా చెప్పితివి. మానవునకు తనలో భాసించే క్లేశములు మొదలగు వాటికి శ్రీహరియొక్క మాయయే కారణము. ఆత్మకంటే భిన్నము కాని జగత్తు భిన్నముగా నున్నట్లు, మిధ్యాభూత మగు జగత్తు యథార్థమా యన్నట్లు భాసించుటకు మూలములో జీవుని ఆ అజ్ఞానమే ఉన్నది.

యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్దేః పరం గతః

తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జనః

ఈ లోకములో పరమమూర్ఖుడు మరియు బుద్దికి అతీతమగు ఆత్మయొక్క సాక్షాత్కారము గల జ్ఞాని అనే ఇద్దరు సుఖముగా వర్ధిల్లుచు న్నారు. ఈ రెండు అవస్థలకు మధ్యలో సంశయముతో వ్రేలాడే జనులు మాత్రము క్లేశముల ననుభవించుచున్నారు.

అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః

తాం చాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే

అనాత్మ (ఆత్మ కానిది) వస్తువు (యథార్థమగు ఉనికి గలది) కాదు. అయిననూ, అది వస్తువు వలే కనబడుచున్నది. నేను మీ పాదము లను సేవించి, దాని ప్రభావముచే ఈ ప్రతీతిని కూడ తొలగించుకొనెదను.

యత్సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః

రతిరాసో భవేత్తీవ్రః పాదయోర్వ్యసనార్దనః

నీ పాదములను సేవించుటచే, నిర్వికారుడు మరియు మధు అనే రాక్షసుని (సంసారమునందలి ఆసక్తిని) దునుమాడినవాడు అగు శ్రీహరి భగవానుని పాదములయందు తీవ్రమగు ప్రేమ కలిగి, ఆ ప్రేమ ఉత్సవ ముగా వర్ధిల్లి, క్లేశములు దూరమగును.

దురాపా హ్యల్పతపస స్సేవా వైకుంఠవర్త్మసు

యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః

మహాత్ములు శ్రీహరిని చేరే మార్గము వంటి వారు. చిన్న తపస్సును చేసిన వారికి వారి సేవ దుర్లభము. వారి సన్నిధిలో ఎల్లవేళలా దేవదేవుడగు జనార్ధనుడు కీర్తింపబడుచుండును.

సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్

తేభ్యో విరాజముద్ధృత్య తమను ప్రావిశద్విభుః

సర్వతత్త్వములను వ్యాపించియుండే భగవానుడు సృష్ట్యాది యందు పంచభూతములు మొదలగు వికారములతో గూడిన మహత్త త్వము మొదలగు వాటిని సృష్టించి, వాటి అంశలతో విరాట్ పురుషుని ప్రక టింప జేసి, తరువాత ఆయన ఆ పురుషునియందు సత్తా (ఉనికి)-సురణము (తెలివి) ల రూపముగా ప్రవేశించెను; అనగా ఉపలభ్యుడగుచున్నాడు.

 యమాహురాద్యం పురుషం సహస్రాంఘ్ర్యూరుబాహుకమ్

యత్ర విశ్వ ఇమే లోకాస్సవికాసం సమాసతే

విరాట్ పురుషుడు ఆది పురుషుడు. ఆయనకు అనంతములగు పాదములు ఊరువులు మరియు బాహువులు గలవని మహాత్ములు చెప్పుచున్నారు. ఈ సమస్తలోకములు, వాటిలోని సకలప్రాణులు ఆయనయందు సంకోచము లేకుండగా, తమ తమ విస్తృతరూపములతో ఇమిడియున్నవి.

యస్మిన్ దశవిధః ప్రాణ సేంద్రియార్థేంద్రియస్త్రీవృత్

త్వయేరితో యతో వర్ణిస్తద్విభూతీర్వదస్వ నః

నీవు విరాట్ పురుషుని వర్ణించియుంటి ). ఇంద్రియములు, వాటికి గోచరమయ్యే శబ్దము మొదలగు విషయములు మరియు వాటి అధిష్టాన దేవతలతో సహా పది విధముల ప్రాణము ఆయనయందే ఉన్నది. ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తుల రూపములో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఆయన యందు నెలకొని యున్నది. వర్ణములు ఆయననుండియే పుట్టినవి. ఆయన విభూతులను మాకు చెప్పుము.

యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిస్సహ గోత్రజైః

ప్రజా విచిత్రాకృతయ ఆసన్ యాభిరిదం తతమ్

అనేక విధముల దేహములు గల ప్రాణులు తమ పుత్రులతో, పౌత్రులతో, మనుమరాండ్లతో, మునిమనుమలతో మరియు తమ వంశీయులతో కలిసి ఆ విరాట్ పురుషునియందు మాత్రమే ఉనికిని కలిగియున్నారు. వీరిచే ఈ జగత్తు అంతయు నిండియున్నది.

ప్రజాపతీనాం స పతిశ్చక్లుపే కాన్ ప్రజాపతీన్

సర్గాం శ్చైవానుసర్గాంశ్చ మనూన్మన్వంతరాధిపాన్

మరీచి మొదలగు ప్రజాపతులకు కూడ ప్రభువగు ఆ విరాట్ పురు షుడు ఏయే ప్రజాపతులను, సర్గములను, అనుసర్గములను మరియు మన్వంతరాధిపతులగు స్వాయంభువాది మనువులను సృష్టించినాడు?

ఏతేషామపి వంశాంశ్చ వంశానుచరితాని చ

ఉపర్యధశ్చ యే లోకా భూమేర్మిత్రాత్మజాసతే

ఓ మైత్రేయా! ఆ మనువుల వంశములను, ఆ వంశములకు చెందిన రాజుల చరిత్రలను, భూమికి పైన క్రింద ఉన్న లోకములను కూడ వర్ణించుము.

తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ

తిర్యజ్మానుషదేవానాం సరీసృపపతత్త్రిణామ్

వద నస్సర్గసంవ్యూహం గార్భ స్వేదద్విజోద్భిదామ్

భూలోకముతో బాటు ఆ లోకముల సన్నివేశమును, విస్తారమును వర్ణించుము. పశువులు, మానవులు, దేవతలు, సరీసృపములు (పాము మొదలగు ప్రాకే జంతువులు), పక్షులు, తల్లి గర్భమునుండి పుట్టే ప్రాణు లు, స్వేదమునుండి పుట్టే పేలు మొదలగు ప్రాణులు, గ్రుడ్డునుండి పుట్టే కోడి మొదలగు ప్రాణులు, నేలను చీల్చుకొని పుట్టే మొక్కలు అనువాటి సృష్టిలోని విభాగమును మాకు బోధించుము.

గుణావతారైర్విశ్వస్య సర్గ స్థిత్యప్యయాశ్రయమ్

సృజతశ్రీనివాసస్య వ్యాచక్ష్వోదారవిక్రమమ్

ఆదికారణుడగు శ్రీనివాసుడు రజస్సత్త్వతమోగుణములను ఉపా ధిగా చేసుకొని బ్రహ్మ-విష్ణు-రుద్రరూపములను దాల్చి జగత్తును క్రమ ముగా సృష్టించి పాలించి సంహరించుచున్నాడు. ఈ జగత్కార్యమునకు సంబంధించి ఆ శ్రీనివాసుని గొప్ప లీలలను వివరముగా చెప్పుము.

వర్ణాశ్రమవిభాగాంశ్చ రూపశీలస్వభావతః

ఋషీణాం జన్మకర్మాది వేదస్య చ వికర్షణమ్

వేషము, శీలము మరియు స్వభావము అనువాటిని బట్టి వర్ణాశ్రమ ముల విభాగమును, మహర్షుల పుట్టుకను, వారు చేసిన కర్మలను, మరియు వేదవిభాగమును వర్ణించుము.

యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో

నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య తంత్రం వా భగవత్స్మృతమ్

ఓ ప్రభూ! ఇంతేగాక, యజ్ఞముయొక్క విస్తారమును, కర్మయోగ మార్గమును, సర్వకర్మసన్న్యాసపూర్వకమగు జ్ఞాననిష్ఠను, ప్రకృతిపురుషవి వేకముయొక్క మార్గమును మాత్రమే గాక, భగవంతునిచే సృష్టించబడిన నారదపాంచరాత్రము మొదలగు తంత్రములను కూడ వర్ణించి చెప్పుము.

పాఖండపథవైషమ్యం ప్రతిలోమనివేశనమ్

జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః

వేదముచే తిరస్కరించబడిన మార్గములను అనుసరించువారు సమాజములో సృష్టించే కల్లోలములను గురించి చెప్పుము. వివిధజాతుల మధ్య సంబంధముల పరిణామమును కూడ వర్ణించుము. జీవులు తమ తమ గుణములకు మరియు కర్మలకు అనురూపమగు గతులను పొందు చుందురు. అవి యెన్ని రకములు? వాటి వివరములు ఎట్టివి?

ధర్మార్థకామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః

వార్తాయా దండనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్

మానవుడు ఒకదానితో మరియొకదానికి విరోధము లేని విధముగా ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములను సంపాదించుకొనవలెను గదా! ఆ విధానమును చెప్పుము. వాణిజ్యము, దండనీతి మరియు శాస్త్ర శ్రవణము అనువాటి విధానమును కూడ వర్ణించి చెప్పుము.

శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్ పితృణాం సర్గమేవ చ

గ్రహనక్షత్రతారాణాం కాలావయవసంస్థితిమ్

ఓ మహాత్మా! శ్రాద్ధవిధిని, పితృదేవతల సృష్టిని వివరించుము. కాలచక్రములో గ్రహములు, నక్షత్రములు, తారకలు ఏ విధముగా భాగమై యున్నవో వివరించుము.

దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలమ్

ప్రవాసస్థస్య యో ధర్మో యశ్చ పుంస ఉతాపది

దానమునకు, తపస్సునకు, యజ్ఞయాగాది కర్మలకు, నూతులను చెరువులను త్రవ్వించుట మొదలగు ప్రజాహితకార్యములను చేయుటకు లభించే పుణ్యఫలము ఎట్టిది? పరదేశములోనున్న వానికి, ఆపదలోనున్న వానికి ఏది ధర్మము? ,

యేన వా భగవాంస్తు ష్యేద్దర్మయోనిర్జనార్దనః

సంప్రసీదతి వా యేషామేతదాఖ్యాహి మేఽనఘ

ఓ పుణ్యాత్మా! ధర్మమునకు మూలమగు ఆ శ్రీకృష్ణ భగవానుడు అధర్మాత్ములను శిక్షించును. సాధకుడు ఏ మార్గముననుసరించినచో, ఆయన సంతసిల్లును? ఎట్టివారిపై ఆయన ప్రసన్నుడగును? నాకీ విషయ మును చెప్పుము.

అనువ్రతానాం శిష్యాణాం పుత్రాణాం చ ద్విజోత్తమ

అనావృష్టమపి బ్రూయుర్గురవో దీనవత్సలాః

ఓ బ్రాహ్మణశ్రేష్టా! గురువులు దీనులపై దయను కలిగియుందు రు. వారు నిష్ఠగా సేవించే శిష్యులకు మరియు తమ పుత్రులకు అడుగకుం డగనే జ్ఞానమును ఇచ్చెదరు. .

తత్త్వానాం భగవంస్తేషాం కతిధా ప్రతిసంక్రమః

తత్రేమం క ఉపాసీరన్ క ఉ స్విదను శేరతే

ఓ పూజ్యా! మహత్తు మొదలగు ఆ తత్త్వముల ప్రళయము ఎన్ని విధములు? ప్రళయములో భగవానుని ఏ తత్త్వములు సేవించును? ఏ తత్త్వములు యోగనిద్రను పొందియున్న భగవానుని అనుసరించి తాము కూడ విలీనమగును?

పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ

జ్ఞానం చ నైగమం యత్తద్గురుశిష్యప్రయోజనమ్

జీవుని తత్త్వమేమి? పరమేశ్వరుని స్వరూపమేమి? ఉపనిషత్తుల జ్ఞానమును, గురుశిష్యుల పరస్పరప్రయోజనమును కూడ చెప్పుము.

నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘ సూరిభిః

స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవ వా

ఓ అనఘా! ఆ జ్ఞానమును పొందుటకు విద్వాంసులు ఏయే సాధనములను చెప్పినారు? ఏలయనగా, సాధన లేకుండగా, మానవులకు భక్తి జ్ఞానవైరాగ్యములు తమంత తాముగా ఎట్లు కలుగును?

ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నార్ హరేః కర్మవివిత్సయా

బ్రూహి మేఽజ్ఞస్య మిత్రత్వాదజయా నష్టచక్షుషః

నేను అనాదియగు అవిద్యచే మూసివేయబడిన జ్ఞాననేత్రము గల అజ్ఞానిని. కాని, నేను శ్రీహరియొక్క లీలలను తెలియగోరుచున్నాను. నీవు నా మిత్రుడవు. కావున, నేను అడిగిన ప్రశ్నలకు ఉత్తరమును చెప్పుము.

సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపో దానాని చానఘ

జీవాభయప్రదానస్య న కుర్వీరన్ కలామపి

ఓ పుణ్యాత్మా! సకల వేదములు, యజ్ఞములు, దానములు మరియు తపస్సులు జీవునకు ధర్మమును బోధించి అభయమునిచ్చుట అనే పుణ్యకార్యముయొక్క అంశముతో అయిననూ సరిగావు.

శ్రీశుక ఉవాచ

స ఇత్థమాపృష్టపురాణకల్పః

కురుప్రధానేన మునిప్రధానః

ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం

సంచోదితస్తo ప్రహసన్నివాహ

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధేసప్తమోఽధ్యాయః

ఈ విధముగా కురువంశ శ్రేష్ఠుడగు విదురుడు మైత్రేయ మహర్షిని పురాణరహస్యమును గురించి ప్రశ్నించెను. భగవంతుని గాథను చెప్పు మనీ ప్రేరేపించిన కారణముగా ఆయన హృదయము ఆనందముతో నిండీ పోయేను. ఆయన చిరునవ్వుతో విదురునితో నిట్లనెను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఏడవ అధ్యాయము ముగిసినది (7).