భాగవత మహా పురాణము
8 - పది రకముల సృష్టిని వర్ణించుట
విదుర ఉవాచ ।
అంతర్హితే భగవతి బ్రహ్మా లోకపితామహః ।
ప్రజాస్ససర్జ కతిధా దైహికీర్మానసీర్విభుః ॥
విదురుడు ఇట్లు పలికెను --- శ్రీహరి భగవానుడు అంతర్ధానమైన పిదప ముల్లోకములకు అధీశ్వరుడు మరియు పితామహుడు అగు బ్రహ్మ గారు తన దేహమునుండి మరియు మనస్సునుండి ప్రాణులను ఎన్ని ప్రకా రములుగా సృష్టించినాడు?
యే చ మే భగవన్ పృష్టాస్త్వయ్యర్థా బహువిత్తమ ।
తాన్ వదస్వానుపూర్వ్యేణ ఛింధి నస్సర్వసంశయాన్ ॥
మానవులు అల్పసుఖమును సంపాదించే ప్రయత్నములో పుట్టెడు దుఃఖమును పొందుచుందురు. వారి ఆ దుఃఖమును పోగొట్టుట కొరకై, నీచే ఈ విధముగా ప్రశ్నించబడిన నేను, భాగవత పురాణమునారంభించి చెప్పేదను. దీనిని సాక్షాత్తుగా భగవానుడే మహర్షులకు చెప్పినాడు.
ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం
సంకర్షణం దేవమకుంఠసత్త్వమ్ ।
వివత్సవస్తత్త్వమతః పరస్య
కుమారముఖ్యా మునయోఽన్వపృచ్ఛన్ ॥
ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము మరియు వైరాగ్యము అనే ఆరు గుణములు పూర్ణముగా గలవాడు, సర్వకారణుడు, అఖండజ్ఞాన స్వరూపుడు అగు సంకర్షణ దేవుడు. పాతాళ లోకములో ఉండెను. అప్పుడు సనత్కుమారుడు మొదలరు మునులు పరబ్రహ్మ తత్త్వమును తెలియగోరి, ఆయనను యథావిధిగా సమీపించి, ఇట్లు ప్రశ్నించిరి.
స్వమేవ ధిష్ణ్యం బహు మానయంతం
యం వాసుదేవాభిధమామనంతి ।
ప్రత్యగ్ధృతాక్షాంబుజకోశమీష-
దున్మీలయంతం విబుధోదయాయ ॥
సంకర్షణ దేవుడు తనకు ఆశ్రయమగు శ్రీహరిని ధ్యానములో భావించి గొప్పగా పూజించుచుండెను. మహర్షులు ఆ శ్రీహరిని వాసుదే వుడు (సర్వజగన్నివాసుడు మరియు చైతన్యస్వరూపుడు) అని వర్ణించు చుందురు. ఆయన అంతర్ముఖుడై కన్నులను మూసుకొని యుండగా అవి పద్మపు మొగ్గలవలె విరాజిల్లెను. జ్ఞానులగు సనత్కుమారుడు మొదలగు వారు ప్రశ్నించగా, ఆయన వారిని అనుగ్రహించుట కొరకై కన్నులను కొద్దిగా తెరచి చూచెను.
స్వర్థున్యుదార్ర్ధైస్స్వజటాకలాపై-
రుపస్పృశంతశ్చరణోపధానమ్ ।
పద్మం యదర్చంత్యహిరాజకన్యా-
స్సప్రేమ నానాబలిభిర్వరార్థాః ॥
సనత్కుమారుడు మొదలగు ఆ మహర్షులు గంగాజలములలో స్నానమాడి, తడిగా నున్న తమ జటల సమూహములతో ఆ సంకర్షణ. దేవుని పాదపీఠమైన పద్మమును స్పృశించుచున్నారు. నాగరాజకన్యలు తమకు నచ్చిన వరుని పొందగోరి, ఆ పద్మమును ప్రేమతో అనేకములగు ఉపహారములను సమర్పించి పూజించుచున్నారు.
ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్జ్ఞాః। కిరీటసాహస్రమణిప్రవేకప్రద్యోతితోద్దామఫణాసహస్రమ్ ॥
కిరీటములయందలి శ్రేష్ఠమగు మణులచే గొప్పగా ప్రకాశింపజేయబడే పైకి ఎత్తి ఉంచబడిన వేయి పడగలు గల ఆయనను (ప్రశ్నించిరి).
సంకర్షణ దేవుని వేయి కిరీటములలోని శ్రేష్ఠమగు మణుల కాంతులు పైకి ఎత్తి ఉంచబడిన వేయి పడగలను గొప్పగా ప్రకాశింప జేయుచున్నవి. ఆయన లీలలు సనత్కుమారుడు మొదలగు మహర్షులకు తెలిసినవే. ఆయనయందలి భక్త్యావేశముచే వారి మాటలు తడబడుచుండిను. వారాయన లీలలను పలుమార్లు గాసము చేసి, ఆయనను ప్రశ్నించిరి.
ప్రోక్తం కిలైతద్భగవత్తమేన
నివృత్తిధర్మాభిరతాయ తేన ।
సనత్కుమారాయ స చాహ పృష్ట
సాంఖ్యాయనాయాంగ ధృతవ్రతాయ ॥
ఓ విదురా! సంకర్షణ భగవానుడు నివృత్తిధర్మపరాయణుడగు సనత్కుమారునకు ఈ భాగవతమును ఉపదేశించెను. సాంఖ్యాయన ముని ఆయన వద్దకు వెళ్లి ప్రశ్నించగా, ఆయన దానిని దృఢవ్రతుడగు ఆ మునికి ఉపదేశించెను.
సాంఖ్యాయన: పారమహంస్యముఖ్యో
వివక్షమాణో భగవద్విభూతీః ।
జగాద సోఽస్మధురవేఽన్వితాయ.
పరాశరాయాథ బృహస్పతేశ్చ ॥
సర్వకర్మసన్న్యాసపూర్వక జ్ఞాననిష్ఠ అనే పరమహంసల ధర్మము నందు ఆ సాంఖ్యాయనుడు దిట్ట.తరువాతి కాలములో ఆయన భగవానుని మహిమలను వర్ణించగోరి, ఆ భాగవతమును అనుంగు శిష్యుడగు పరాశరు. నకు, బృహస్పతికి చెప్పెను. ఆ పరాశర మహర్షియే మా గురువు.
ప్రోవాచ మహ్యం స దయాలురుక్తో
మునిః పులస్త్యేన పురాణమాద్యమ్ ।
సోఽహం తవైతత్కథయామి వత్స
శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ ॥
పులస్త్య మహర్షి కోరికననుసరించి, దయామయుడగు ఆ పరాశర మహర్షి ఆదిపురాణమగు భాగవతమును నాకు చెప్పెను. వత్సా! నీవు శ్రద్ధ గలవాడవు, నన్ను నిత్యము నిష్ఠతో సేవిస్తున్నావు. ఆ విధముగా పరా శరమహర్షినుండి నేను వినియున్న ఆ పురాణమును నీకు చెప్పుచున్నాను.
ఉద్యాఽఽప్లుతం విశ్వమిదం తదాఽఽసీద్
యన్నిద్రయామీలితదృజ్ న్యమీలయత్ ।
అహీంద్రతల్పేఽధిశయన ఏకః
కృతక్షణస్స్వాత్మరతౌ నిరీహః ॥
సృష్ట్యాదియందు అద్వితీయుడగు నారాయణుడు శేషశయ్యను అధిష్ఠించి పరున్నవాడై యోగనిద్రను ఆశ్రయించి కన్నులను మూసుకొనేను. ఆయన సృష్టివ్యాపారమునుండి విరమించి, తన స్వరూపమగు ఆనం దమునందు వేడుక గలవాడై యుండెను. ఆయన యోగనిద్రయందు ఉన్న నూ, లోపించని చైతన్యశక్తి గలవాడే. ఆ సమయములో ఈ బ్రహ్మాండమం తయు నీటిచే వ్యాపించబడి యుండెను.
సోఽoతశ్శరీ రేఽర్పితభూతసూక్ష్మః
కాలాత్మికాం శక్తిముదీరయాణః ।
ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే
యథానలో దారుణి రుద్ధవీర్యః ॥
ఆ నారాయణుడు, తన శక్తిని ప్రకటము చేయకుండగా కట్టెయందు దాగియున్న అగ్నివలె, సూక్ష్మభూతములను తన శరీరమునందు దాచి యుంచెను. ఆయన తన స్థానమగు ఆ జలములయందు నివసించియుండె ను. సృష్ట్యాదియందు ఆయన కాలము అనే తన శక్తిని ప్రేరేపించును.
చతుర్యుగానాం చ సహస్రమప్సు
స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా ।
కాలాఖ్యయాఽఽసాదితకర్మతంత్రో
లోకానపీతాన్ దదృశే స్వదే హే ॥
ఈ విధముగా నారాయణుడు తన చిచ్చక్తితో కూడి ఆ జలముల యందు వేయి మహాయుగములు నిద్రించెను. తరువాత కాలము అనే ఆయన శక్తి సృష్టిక్రియద్వారా జీవుల కర్మఫలములు ప్రకటమయ్యే వ్యాపా రమును ఆయనకు కలిగించెను. అపుడాయన తన శరీరమునందు విలీనమై యున్న లోకములను (జీవులను) చూచేను.
తస్యార్థసూక్ష్మాభినివిష్టదృష్టేరంతర్గతోఽర్థో రజసా తనీయాన్ ।
గుణేన కాలానుగతేన విద్ధస్సూష్యంస్తదాభిద్యత నాభిదేశాత్ ॥
నారాయణుడు తన సంకల్పరూపమగు దృష్టిని తనలో విలీన మైయున్న సూక్ష్మతత్త్వములపైకి సారించెను. అప్పుడు ఆ సూక్ష్మతత్త్వముల వర్గము ప్రకటము కాబోతూ, కాలశక్తిచే వికసించియున్న రజోగుణముచే క్షోభింపజేయబడి, ఆయన నాభిస్థానమునుండి ప్రకటమయ్యెను.
స పద్మకోశస్సహసోదతిష్ఠత్
కాలేన కర్మప్రతిబోధనేన ।
స్వరోచిషా తత్సలిలం విశాలం
విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః ॥
జీవుల కర్మాదృష్టమును జాగృతము చేసే కాలము సంప్రాప్తము కాగానే, సూక్ష్మతత్త్వ సముదాయము పరమాత్మనుండి పద్మకోశరూప ములో ఒక్కసారి ప్రకటమయ్యెను. సూర్యుని వలె ప్రకాశించే ఆ పద్మము తన కాంతులతో ఆ విశాలమగు జలరాశిని గొప్పగా ప్రకాశింప జేసెను.
తల్లోకపద్మం స ఉ ఏవ విష్ణుః
ప్రావీవిశత్సర్వగుణావభాసమ్ ।
తస్మిన్ స్వయం వేదమయో విధాతా
స్వయంభువం యం స్మ వదంతి సోఽభూత్ ॥
ఓయీ విదురా! ముల్లోకముల రూపములోనున్న ఆ పద్మము జీవులకు భోగ్యములైన పదార్థజాతమునంతనూ ప్రకాశింపజేయుచున్నది. ఆ పద్మమును స్వయముగా విష్ణువు అంతర్యామి రూపముగా ప్రవేశించే ను. దానియందు సాక్షాత్తుగా వేదమూర్తియగు బ్రహ్మగారు ప్రకటమయ్యే ను. ఆ బ్రహ్మగారు స్వయంభువుడని కీర్తించబడుచున్నాడు.
తస్యాం స చాంభోరుహకర్ణికాయామవస్థితో లోకమపశ్యమానః ।
పరిక్రమన్వ్యోమ్ని వివృత్తనేత్రశ్చత్వారి లేఖెఽనుదిశం ముఖాని ॥
ఆ పద్మముయొక్క కర్ణికయందున్న బ్రహ్మగారికి ప్రపంచము కానరాలేదు. ఆయన ఆ పద్మము లోపల చుట్టూ తిరుగుతూ ఆకాశమునందు కళ్లను సారించి త్రిప్పుచూ నాల్గు దిక్కులను చూడగా, దిక్కునకు ఒకటి చొప్పున ఆయనకు నాలుగు ముఖములు లభించెను.
తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణజలోర్మిచక్రొత్సలిలాద్విరూఢమ్ ।
ఉపాశ్రితః కంజము లోకతత్త్వం నాత్మానమద్దావిదదాదిదేవః ॥
ప్రళయకాలపోయువుల తాకిడికి ఆ జలరాశియందు గొప్ప కెరట - ములు పుట్టుచుండెను. ఆ కెరటముల మధ్యనుండి ప్రకటమైన ఆ పద్మ మును బ్రహ్మగారు అధిష్టించి యుండెను. కాని, ఆశ్చర్యమేమనగా, పద్మము రూపములో ప్రకటమైన ఆ లోకతత్త్వము గురించి గాని, తన గురించి గాని ఆయనకు ఏమీ తెలియకుండెను.
క ఏష యోఽసావహమబ్జపృష్ట
ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు ।
అస్తి హ్యధస్తాదిహ కించనైత-
దధిష్ఠితం యత్ర సతా ను భావ్యమ్ ॥
ఇది నేను అనే ప్రత్యయము గలవాడనై ఈ పద్మముయొక్క కర్ణి కయందు ఉన్న నేను ఎవరినై యుందును? ఈ జలములలో ఈ ఒక్క పద్మము తక్క మరియేదీ లేదు. ఇది ఎక్కడనుండి పుట్టియుండును? దీని క్రింద ఏదో ఒక వస్తువు ఉన్నది. ఎందుకంటే, ఈ పద్మమునకు ఆశ్రయ ముగా ఉండే వస్తువు ఏదో ఒకటి ఉండి తీరవలెను గదా!
స ఇత్థముద్వీక్ష్య తదబ్జనాలనాడీభిరంతర్జలమానివేశ ।
నార్వాగ్గతస్తత్ఖరనాలనాలనాభిం విచిన్వంస్తదవిందతాజః ॥
ఆ బ్రహ్మ ఈ విధముగా ఊహించి, ఆ పద్మముయొక్క కఠిన మగు నాళములలోని రంధ్రముల గుండా నీటిలోనికి ప్రవేశించెను. ఆయన అచట వెదుకుతూ ఆ నాళమునకు ఆధారమగు నాభికి దగ్గరకు చేరిననూ, దానిని తెలుసుకొనలేక పోయెను.
తమస్యపారే విదురాత్మసర్గం
విచిన్వతోఽభూత్సుమహాంస్త్రిణేమిః ।
యో దేహభాజాం భయమీరయాణః
పరిక్షిణోత్యాయురజస్య హేతిః ॥
ఆ అంతు లేని చీకటిలో బ్రహ్మగారు తన ఉత్పత్తి స్థానమును వెదుకుచుండగా, చాల కాలము గడిచిపోయేను. భూతభవిష్యద్వర్తమాన ములనే మూడు రూపములు గల ఈ కాలము ఆ భగవానుని చేతిలోని ఆయుధము. అది దేహాత్మభావము గల జీవులకు భయమును గొల్పుచూ, వారి ఆయుర్దాయమును హరించి వేయుచుండును.
తతో నివృత్తోఽప్రతిలబ్దకామస్వధిష్ణ్యమాసాద్య పునస్స దేవః ।
శనైర్జితశ్వాసనివృత్తచిత్తో న్యషీదదారూఢసమాధియోగః ॥
ఆ బ్రహ్మగారి కోరిక తీరలేదు. ఆయన ఆ ప్రయత్నమునుండి వీర మించుకొని మరల తన స్థానమగు పద్మకర్ణికను చేరుకొని, దానియందు కూర్చుండి మెల్లమెల్లగా శ్వాసను జయించి, మనోవృత్తులను నిరోధించి, సమాధిస్థితిని చేరుకొని యుండెను.
కాలేన సోఽజః పురుషాయుషాభి-
ప్రవృత్తయోగేన విరూడబోధః ।
స్వయం తదంతర్హృదయేఽవభాత-
మపశ్యతాపశ్యత యన్న పూర్వమ్ ॥
ఆ బ్రహ్మగారు ఈ విధముగా పురుషాయుర్దాయమగు వంద సంవ త్సరముల కాలము సమాధియోగమును చక్కగా కొనసాగించగా, ఆయ నకు విశేషమగు జ్ఞానము ఉదయించెను. అపుడాయనకు ఇదివరలో ఎంత వెదికిననూ. కానరాని తన కారణము తన హృదయము లోపల ప్రకాశిస్తూ తనంత తానుగా సాక్షాత్కరించెను. -
మృణాలగౌరాయతశేషభోగపర్యంక
ఏకం పురుషం శయానమ్ ।
ఫణాతపత్రాయుతమూర్ధరత్న-
ద్యుభిర్హతధ్వాంతయుగాంతతోయే ॥
ఆది శేషుని పదివేల పడగలు గొడుగుల వలె నున్నవి. వాటి తలలపై నున్న రత్నములు తమ కాంతులచే ఆ ప్రళయజలమునందలి చీకట్లను పారద్రోలుచున్నవి. తామరతూడువలె తెల్లనైన ఆ ఆదిశేషుని విశాల మగు దేహమే శయ్య కాగా, ఒక పురుషుడు దానిపై నడుము వాల్చియుం డెను. బ్రహ్మగారు ఒంటరిగానున్న ఆ పురుషోత్తమ భగవానుని కనుగొనెను.
ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రేః
సంధ్యాభ్రనీవేరురురుక్మమూర్ద్నః ।
రత్నోదధారౌషధిసౌమనస్య-
వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘ్రేః ॥
ఆ పురుషోత్తమ భగవానుని దేహకాంతి, వెదుళ్లే భుజములుగా మరియు వృక్షములే పాదములుగా గల మరకతమాణిక్యపర్వతుని శోభను తిరస్కరించుచున్నది. ఆ పర్వతమునకు సంధ్యాకాలమునందలి మేఘ ములే కట్టువస్త్రములన్నచో, వాటిని ఆ పురుషుని పీతవస్త్రము తలదన్ను చున్నది. అనేకములగు బంగరు శిఖరములే ఆ పర్వతమునకు కిరీటముల న్నచో, ఆ పురుషుని కిరీటము వాటి శోభను అతిశయించుచున్నది. ఆ పర్వ తమునకు రత్నములు, నీటిధారలు, ఓషధి మొక్కలు మరియు పుష్పములు కలిసి వనమాలను సమగూర్చుచున్నవన్నచో, ఆయన దాల్చిన వన మాల ఆ మాలను తన శోభచే పరాస్తము చేయుచున్నది.
ఆయామతో విస్తరతస్స్వమానదేహేన లోకత్రయసంగ్రహేణ । విచిత్రదివ్యాభరణాంశుకానాం కృతియాపాశ్రితవేషదేహమ్ ॥
పురుషుని దేహము పొడవులో మరియు వైశాల్యములో తనకు తానే సాటియై
తనకు అనురూపమైన ప్రమాణమును కలిగి ముల్లోకములను తనలో ఇముడ్చుకొని యుండెను. ఆ దేహము రంగు రంగుల దివ్య ములగు వస్త్రములకు మరియు ఆభరణములకు శోభను కలిగించుచుండే ను. ఇట్లు అలంకరించబడిన దేహము గల ఆ పురుషుని బ్రహ్మ చూచెను.
పుంసాం స్వకామాయ వివిక్తమార్గైః
అభ్యర్చతాం కామదుఘాంఘ్రిపద్మమ్ ।
ప్రదర్శయంతం కృపయా నఖేందు-
మయూఖభిన్నాంగులిచారుపత్రమ్ ॥
భగవానుని పద్మమువంటి పాదమునకు చంద్రవంకలవంటి నఖ ముల కాంతులతో ప్రకాశించే వేళ్లు పద్మపత్రములవలె నున్నవి. మాన వులు తమ కోరికలు ఈడేరుట కొరకై ఆ పాదమును వేదములో నిర్దేశించబ డిన శుద్దమగు వేర్వేరు ఉపాయములతో చక్కగా ఆరాధించగా, వారికి ఆ పాదము కోరికలను సుసంపన్నము చేయును. అట్టి పాదపద్మమును దయతో దర్శనమిచ్చుచున్న పురుషోత్తముని బ్రహ్మగారు చూచేను.
ముఖేన లోకార్తిహరస్మితేన
పరిస్పురత్కుండలమండితేన ।
శోణాయితేనాధరబింబభాసా
ప్రత్యర్హయంతం సున సేన సుభ్వ్రా ॥
ఆయన చిరునవ్వు ముఖము జనుల దుఃఖమును పోగొట్టును. అందమైన ముక్కు, చక్కని కనుబొమలు గల ఆ ముఖము ఇటునటు కదు లుతూ ప్రకాశించే కుండలములతో నలరారుచుండెను. ఎర్రని క్రింది పెదవి దొండపండువలే శోభిల్లెను. అట్టి ముఖముతో ఆయన తనను పూజించు భక్తులను సమ్మానించుచుండెను.
కదంబకింజల్కపిశంగవాససా స్వలంకృతం మేఖలయా నితంబే ।
హారేణ చానంతధనేన వత్స శ్రీవత్సవక్షఃస్థలవల్లభేన ॥
ఓ ప్రియవిదురా! ఆ పురుషోత్తముని నడుము కడిమి పువ్వుల పుప్పొడి వలే పసుపు వన్నెగల వస్త్రముతో మరియు మొలనూలుతో ప్రకా శించుచుండెను. ఆయన శ్రీవత్సము అనే మచ్చగల తన వక్షఃస్థలమునకు తగియున్న అమూల్యమగు హారముతో శోభిల్లుచుండెను.
పరార్ఘ్యకేయూరమణిప్రవేక-
పర్యస్తదోర్దండసహస్రశాఖమ్ ।
అవ్యక్తమూలం భువనాంఘ్రి పేంద్ర-
మహీంద్రభోగైరధివీతవల్శమ్ ॥
జగత్కారణుడగు ఆ పురుషోత్తముడు గొప్ప చందనవృక్షము వలె నున్నాడు. జగద్రూపముగా ప్రకటమైన ఆయనయే జగత్తు అనే వృక్షము రూపములో నున్నాడు. ఆయన భుజదండములే ఆ వృక్షముయొక్క అనం తములగు శాఖలు. ఆ భుజములయందు ప్రకాశించే విలువైన అంగద ములు మరియు ఉత్తమమగు మణులు చందనవృక్షముయొక్క ఫలపుష్ప మలులతో నిండిన కొమ్మలను స్మరింపజేయుచున్నవి. జగత్తు అనే వృక్షము నకు అవ్యక్తము అనబడే మాయాశక్తి గాని, లేక అవ్యక్తశబ్దవాచ్యమగు పర బ్రహ్మ గాని మూలమై యుండుట ప్రసిద్ధమే. చెట్టుయొక్క తల్లివేరు కనబడకుండుట అందరికీ తెలిసినదే. ఆ పురుషోత్తముని భుజస్కంధములను ఆది శేషుని పడగలు చుట్టువారియున్నవి. ఆ విధముగా ఆయన పాములకు నివాసమగు చందనవృక్షమును పోలియున్నాడు.
చరాచరౌకో భగవన్మహీధ్రమహీంద్రబంధుం సలిలోపగూఢమ్ । కిరీటసాహస్రహిరణ్యశృంగమావిర్భవత్కౌస్తుభరత్నగర్భమ్ ॥
ప్రళయజలములచే చుట్టువారబడియున్న ఆ భగవానుడు నీటిలో మునిగియున్న పర్వతమువలె నున్నాడు. పర్వతము చెట్టుచేమలకు ఇతర ప్రాణులకు ఆశ్రయమై యుండగా, ఆయన స్థావరజంగమాత్మకమగు జగత్తునకంతకూ నివాసస్థానము. పర్వతము గొప్ప పాములకు నిలయము కాగా, ఆయన ఆదిశేషునకు బంధువు. ఆది శేషుని పడగల పైనుండే అసంఖ్యాకములగు బంగరు కిరీటములు పర్వతశిఖరములవలె నొప్పారుచున్నవి. పర్వతములో రత్నములుండుననే ప్రసిద్ధి గలదు. ఆ పురుషోత్తముని వక్షఃస్థలమునందు కౌస్తుభమాణిక్యము చక్కగా ప్రకాశించుచుండెను.
నివీతమామ్నాయమధువ్రతశ్రియా
స్వకీర్తిమయ్యా వనమాలయా హరిమ్ ।
సూర్యేందువాయ్వగ్న్యగమం త్రిధామభిః
పరిక్రమత్ప్రాధనికైర్దురాసదమ్ ॥
శ్రీహరి మెడలో విరాజిల్లే వనమాల చుట్టూ వేదములే భ్రమర ములై తిరుగుతూ ఆయన కీర్తిని గానము చేయుచున్నవి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలగు జ్యోతిర్మండలములు ఆ శ్రీహరియొక్క ప్రకా శము ముందు వెలవెలపోవును. వాయువు ఆయనను సమీపించలేడు. ముల్లోకములలో మూడు కాలములలో తమ తేజస్సుచే దుర్నిరీక్ష్యములై ఆయన చుట్టూ తిరుగుతూ ఉండే సుదర్శనము మొదలగు ఆయుధములు కూడ ఆయనను సమీపించలేకున్నవి. వాటి కారణముగా ఇతరమేదియు ఆయనను సమీపించలేదు.
తర్హ్యేవ తన్నాభిసరస్సరోజమాత్మానమంభశ్శ్వసనం వియచ్చ ।
దదర్శ దేవో జగతో విధాతా నాతః పరం లోకవిసర్గదృష్టిః ॥
లోకములను సృష్టించుటకు కావలసిన జ్ఞానము, సృష్టించాలనే ఇచ్చ గల ఆ జగద్విధాతయగు బ్రహ్మదేవునకు శ్రీహరిని చూచిన ఆ సమ యములో, ఆయన నాభిసరస్సునుండి పుట్టిన పద్మము, తన శరీరము,ప్రళయ జలములు, ప్రళయ వాయువు మరియు ఆకాశము అనే ఈ అయిదు తక్క మరేదీ కానరాలేదు.
స కర్మబీజం రజసోపరక్తః ప్రజాస్సిసృక్షన్నియదేవ దృష్ట్వా । అస్తౌద్విసర్గాభిముఖస్తమీడ్యమవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే అష్టమోఽధ్యాయః ॥
ఆ బ్రహ్మగారి మనస్సు రజోగుణముచే రంజితమై (వ్యాప్త మై) యుండెను. కావుననే, ఆయనకు మనస్సులో మాయాశక్తియొక్క విలాస మునందు అభినివేశము (పట్టుదల) పెరిగెను. ఆయన వివిధరకముల సర్గ ముల ద్వారా ప్రజలను సృష్టించగోరి, . ఆ సృష్టికి కారణము కాగల తత్త్వముల కొరకు పరికించగా, కేవలము ఆ అయిదు మాత్రమే ఆయనకు కానవచ్చెను. అపుడాయన కొనియాడదగిన శ్రీహరిని స్తుతించేను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
Summary of chapter 8 of the Bhāgavata Mahā Purana is as follows:
Maitreya describes how the Supreme Lord assumes the form of Garbhodakaśāyī Vishṇu and rests upon the serpent bed of Ananta Shesha within the primal waters of the universe. From the lotus navel of the Lord arises a magnificent golden lotus flower, upon which Lord Brahmā is born without any visible parentage, initiating Brahmā's intense search down the lotus stem to discover his source.