20 -  బ్రహ్మగారి సృష్టిని వర్ణించుట

శౌనక ఉవాచ

మహీం ప్రతిష్ఠామధ్యస్య సౌతే స్వాయంభువో మనుః

కాన్యన్వతిష్ఠద్ద్వారాణి మార్గాయావరజన్మనామ్

శౌనక మహర్షి ఇట్లు పలికెను -- ఓ సూత మహర్షీ! స్వాయంభువ మనువు సకలప్రాణులకు ఆధారమగు భూమిని పొంది, తరువాతి కాలములో పుట్టబోయే ప్రాణుల సృష్టి కొరకు ఏ ఉపాయముల ననుష్ఠించెను?

క్షత్తా మహాభాగవతః కృష్ణస్యైకాంతికస్సుహృత్

యస్తత్యాజాగ్రజం కృష్ణే సాపత్యమఘవానితి

గొప్ప భగవద్భక్తుడగు విదురుడు. శ్రీకృష్ణుని పరమప్రేమకు పాత్రుడగు మిత్రుడు. శ్రీకృష్ణుని విషయములో అపరాధమును చేసిన దుర్యోధనాదులను, వారిని సమర్థించిన అన్నగారగు ధృతరాష్ట్రుని ఆయన విడిచి పెట్టి వెళ్లిపోయెను.

ద్వైపాయనాదనవరో మహిత్వే తస్య దేహజః

సర్వాత్మనా శ్రితః కృష్ణం తత్పరాంశ్చాప్యనుప్రతః

 ద్వైపాయన మహర్షి పుత్రుడగు విదురుడు గొప్పదనములో ఆయ నకు తీసిపోవువాడు కాదు. ఆయన సర్వప్రకారములుగా శ్రీకృష్ణుని శరణు జొచ్చి, ఆయన భక్తులను సేవించెడివాడు.

కిమన్వపృచ్ఛన్మైత్రేయం విరజాస్తీర్థ సేవయా

ఉపగమ్య కుశావర్త ఆసీనం తత్త్వవిత్తమమ్

 పుణ్యతీర్థములను సేవించుట వలన నశించిన దోషములు గల విదురుడు హరిద్వారములోనున్న, తత్త్వవేత్తలలో శ్రేష్ఠుడగు మైత్రేయ మహర్షిని సమీపించి ఏమి ప్రశ్నించెను?

తయోస్సంవదతోస్సూత ప్రవృత్తా హ్యమలాః కథాః

 ఆపో గాంగా ఇవాఘఘ్నీర్హరేః పాదాంబుజాశ్రయాః

ఓ సూతా! వారిద్దరు నిశ్చయముగా శ్రీహరి పాదపద్మములకు సంబంధించిన పవిత్రమగు గాథలను ప్రస్తావించియుందురు. ఆ గాథలు శ్రీహరి పాదపద్మములనుండి పుట్టిన గంగాజలముల వలె పాపములను కడిగివేయును.

తా నః కీర్తయ భద్రం తే కీర్తన్యోదారకర్మణః

రసజ్ఞః కో ను తృప్యేత హరిలీలామృతం పిబన్

కీర్తించదగిన గొప్ప లీలలు గల శ్రీహరియొక్క ఆ 'గాథలను మాకు వినిపించుము. నీకు మంగళమగు గాక! రసజ్ఞుడెవడు శ్రీహరి యొక్క లీలలు అనే అమృతమును త్రావుతూ తృప్తిని చెందును?

ఏవముగ్రశ్రవాః పృష్ట ఋషిభిర్నైమిషాయనైః

భగవత్యర్పితాధ్యాత్మస్తానాహ శ్రూయతామితి

నైమిషారణ్యవాసులగు మహర్షులు ఈ విధముగా ప్రశ్నించగా, సూత మహర్షి తన మనస్సును భగవానునిపై నిలిపి, వినుడు అని వారితో ఇట్లు పలికెను.

సూత ఉవాచ :

 హరేర్ధృతక్రోడతనోస్స్వమాయయా

నిశమ్య గోరుద్దరణం రసాతలాత్

 లీలాం హిరణ్యాక్షమవజ్ఞయా హతం

 సంజాతహర్షో మునిమాహ భారతః

 సూత మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి తన మాయాశక్తిచే వరా హరూపమును దాల్చి, భూమిని పాతాళమునుండి పైకి తీసి, హీరణ్యాక్షుని అవలీలగా సంహరించెను. ఈ లీలను విని భరతవంశీయుడగు విదురుడు హర్షించి, మైత్రేయ మహర్షితో నిట్లనెను.

విదుర ఉవాచ

  ప్రజాపతిపతిస్సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతీన్

కీమారభత మే బ్రహ్మన్ ప్రబ్రూహ్యవ్యక్తమార్గవిత్

విదురుడు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు ప్రజల సృష్టిలో భాగముగా ప్రజాపతులను సృష్టించి, తరువాత దేనిని ఆరంభించెను? నీవు భగవద్విషయములను, పరోక్ష విషయములను కూడ తెలిసినవాడవు. నాకీ విషయమును చెప్పుము.

యే మరీచ్యాదయో విప్రా యస్తు స్వాయంభువో మనుః

 తే వై బ్రహ్మణ ఆదేశాత్కథమేతదభావయన్

మరీచి మొదలగు మహర్షులు, స్వాయంభువ మనువు బ్రహ్మగారి ఆదేశముచే ఈ జగత్తును ఏ విధముగా సృష్టించిరి?

సద్వితీయాః కిమసృజన్ స్వతంత్రా ఉత కర్మసు

 ఆస్విత్సంహతాస్సర్వ ఇదం స్మ సమకల్పయన్

వారు భార్యలతో కూడి ఈ జగత్తును సృష్టించరా? లేక, స్వతంత్ర ముగనే సృష్టించరా? లేక, అందరు కలిసి సృష్టించారా?

మైత్రేయ ఉవాచ

దైవేన దుర్వితర్క్యేణ పరేణానిమి షేణ చ

 జాతక్షోభాద్భగవతో మహానాసీద్గుణత్రయాత్

జీవుల కర్మగతిని ఊహించుట శక్యము కాదు. ఆ కర్మగతి, ప్రకృతికి అధ్యక్షుడగు పురుషుడు, కాలము అనే మూడు హేతువులచే భగవానుని త్రిగుణాత్మికయగు మాయాశక్తియందు వైషమ్యము కలిగి మహత్తత్త్వము ప్రకటమయ్యెను.

రజఃప్రధానాన్మహతస్త్రీలింగో దైవచోదితాత్

 జాతస్ససర్జ భూతాదిర్వియదాదీని పంచశః

 భగవానుని ప్రేరణచే రజోగుణప్రధానమగు మహత్తునుండి సాత్త్విక రాజస తామస భేదముచే అహంకారము పుట్టెను. అదియే పంచ భూతములకు కారణము. దానినుండి అయిదు తన్మాత్రలు, అయిదు స్థూల భూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అయిదైదు అధిష్టాన దేవతలు ప్రకటమయ్యెను.

తాని చైకైకశస్సృష్టుమసమర్థాని భౌతికమ్

 సంహత్య దైవయోగేన హైమమండమవాసృజన్

అవి విడివిడిగా బ్రహ్మాండమును సృష్టించలేక పోయినవి. అవి భగ వంతుని శక్తిచే ఒకదానితో మరియొకటి కలిసి తేజోమయమగు అండమును సృష్టించినవి.

సోఽశయిష్టాబ్ధిసలిలే ఆండకోశ నిరాత్మకః

సాగ్రం  వై వర్షసాహస్రమన్వవాత్సీత్తమీశ్వరః

ఆ బ్రహ్మాండము ప్రళయసముద్రజలములలో సుమారు (నిండా) వేయి సంవత్సరములు నిశ్చేతనముగా పడియుండెను. అపుడు దాని యందు భగవానుడు ప్రవేశించెను.

తస్య నాభేరభూత్పద్మం సహస్రార్కోరుదీధితి

 సర్వజీవనికాయౌకో యత్ర స్వయమభూత్స్వరాట్

 ఆ భగవానుని నాభినుండి వేయి సూర్యులతో సమానమైన గొప్ప కాంతి గల పద్మము పుట్టెను. సకలప్రాణివర్గములకు నివాసస్థానమదియే. దానియందు సాక్షాత్తుగా బ్రహ్మగారు పుట్టిరి.

సోఽనువిష్టో భగవతా యశ్శేతే సలిలాశయే

లోకసంస్థాం యథాపూర్వం నిర్మమే సంస్థయా స్వయా

 ప్రళయజలములలో శయనించే నారాయణుడు ప్రవేశించి ప్రేరేపించగా, బ్రహ్మగారు పూర్వకల్పములో తనచేతనే నిర్ధారించబడిన నామ రూపాత్మకమగు వ్యవస్థకు అనురూపముగా లోకములను నిర్మించెను.

ససర్జచ్చాయయావిద్యాం పంచపర్వాణమగ్రతః

తామిస్రమంధతామిస్రం తమో మోహో మహాతమః

 ఆయన ముందుగా నీడ (అజ్ఞానము) నుండి తామిస్రము, అంధ తామిస్ము, తమస్సు, మోహము, మహాతమస్సు అనే అయిదు విభాగ ములు గల అవిద్యను సృష్టించేను.

విససర్జాత్మనః కాయం నాభినందంస్తమోమయమ్

జగృహుర్యక్షరక్షాంసి రాత్రిం క్షుత్తృట్సముద్భవామ్

తమస్సు (ఆజ్ఞానము) ప్రధానముగా గల ఆ దేహము ఆయనకు నచ్చక, దానిని విడిచి పెట్టెను. అదియే రాత్రి ఆయెను. ఆకలి దప్పికలు దానినుండియే పుట్టెను. దానిని యక్షులు, రాక్షసులు స్వీకరించిరి.

క్షుత్తృడ్భ్యాముపసృష్టాస్తే తం జగ్ధుమభిదుదువుః

 మా రక్షతైనం జక్షధ్వమిత్యూచుః క్షుత్తృడర్ధితాః

ఆ యక్షరాక్షసులు ఆకలి దప్పికల బాధకు తాళలేక, ఆ బ్రహ్మగారిని తినుటకై ఆయన వైపునకు పరుగు తీసిరి. ఈయనను రక్షించనక్కర లేదు; ఈయనను తినివేయుడు, అని వారు పలికిరి. కావుననే, వారు రాక్ష సులు (రక్షించని వారు), యక్షులు (తినివేయువారు) అయిరి.

దేవస్తానాహ సంవిగ్నో మా మాం జక్షత రక్షత

 అహో మే యక్షరక్షాంసీ ప్రజా యూయం బభూవిథ

బ్రహ్మగారు భయపడి వారితో నిట్లనెను: అరే యక్షరాక్షసులారా! మీరు నా సంతానము. నన్ను తినివేయకుడు; నన్ను రక్షించుడు.

దేవతాః ప్రభయా యా యా దీవ్యన్ ప్రముఖతోఽసృజత్

తే అహార్షుర్దేవయంతో విసృష్టాం తాం ప్రభామహః

బ్రహ్మగారు తన సాత్త్వికప్రకాశముచే విరాజిల్లుతూ దేవతలను సృష్టించెను. బ్రహ్మగారిచే విడిచి పెట్టబడిన ఆ ప్రకాశము పగలు ఆయెను. ఆ దేవతలు క్రీడిస్తూ ఆ పగలు రూపములోని ప్రకాశమును స్వీకరించిరి.

దేవోఽదేవాన్ జఘనతస్సృజతి స్మాతిలోలుపాన్

త ఏనం లోలుపతయా మైథునాయాభిపేదిరే

 బ్రహ్మగారు నడుము భాగమునుండి మిక్కిలి భోగలాలసులగు అసురులను సృష్టించేను. వారు భోగలంపటులగుటచే భోగము కొరకై బ్రహ్మగారి దగ్గరకు వెళ్లిరి.

తతో హసన్ స భగవానసురైర్నిరపత్రపైః

 అన్వీయమానస్తరసా క్రుద్ధో భీతః పరాపతత్

తరువాత ఆ బ్రహ్మ భగవానుడు ముందుగా వారిని చూచి నవ్వు కొనెను. కాని, వారు సిగ్గు లేకుండగా ఆయనను తరుముకొచ్చిరి. ఆపుడా యన కోపించి, భయపడి పారిపోయెను.

స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తిహరం హరిమ్

అనుగ్రహాయ భక్తానామనురూపాత్మదర్శనమ్

 శ్రీహరి శరణాగతులకు వరములనిచ్చి, ఇడుములను బాపే దైవము. ఆయన భక్తులననుగ్రహించుట కొరకై వారి భావనకు తగ్గ రూపములో ప్రకటమగును. ఆ బ్రహ్మగారు అట్టి శ్రీహరి వద్దకు వెళ్లి ప్రార్థించెను.

పాహి మాం పరమాత్మంస్తే ప్రేషణేనాసృజం ప్రజాః

 తా ఇమా యభితుం పాపా ఉపాక్రామంతి మాం ప్రభో

ఓ పరమాత్మా! నీ ప్రేరణచే నేను ప్రాణులను సృష్టించితిని. ప్రభూ! కాని నాచేతనే సృష్టించబడిన పాపులగు వీరు నన్ను భోగించుటకు తరుముకొచ్చుచున్నారు. నన్ను కాపాడుము.

త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః

త్వమేకః క్లేశద స్తేషామవాసన్నపదాం తవ

 కష్టములలోనున్న వారి కష్టములను పోగొట్టువాడవు నీవు ఒక్కడివే. నీ పాదములను ఆశ్రయించని ప్రాణులకు వారి కర్మలకనురూపముగా దుఃఖమును కలిగించువాడవు నీవు ఒక్కడివే.

సోఽవధార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మదర్శనః

విముంచాత్మతనుం ఘోరామిత్యుక్తో విముమోచ హ

 శ్రీహరికి ఇతరుల మనస్సు కరతలామలకము. ఆయనకు బ్రహ్మ గారి దైన్యము స్పష్టముగా తెలిసేను. కామముచే కలుషితమైన ఈ దేహ మును విడువుము అని ఆయన చెప్పగా, బ్రహ్మ అటులనే చేసెను.

తాం క్వణచ్చరణాంభోజాం మదవిహ్వాలలోచనామ్ కాంచీకలాపవిలసద్దుకూలచ్చన్నరోధసమ్

 అన్యోన్య శ్లేషయోత్తుంగనిరంతరపయోధరామ్

 సునాసాం సుద్విజాం స్నిగ్ధహాసలీలావలోకనామ్

 గూహంతీం వ్రీడయాఽఽత్మానం నీలాలకవరూథినీమ్

ఉపలభ్యాసురా ధర్మ సర్వే సమ్ముముహుః స్త్రియమ్

ఓ విదురా! బ్రహ్మగారు విడిచిన దేహము ఒక స్త్రీమూర్తి ఆయేను. మత్తుతో నిండిన చంచలమగు కన్నులు గల ఆమె పద్మములవంటి పాదములతో నడుచుచుండగా, కాలి అందెలు గణగణలాడుచుండెను. ఆమె నడుము చుట్టూ చీరను కట్టి దానిని ప్రకాశించే మొలనూలు సరములతో అలంకరించెను. ఒకదానితో మరియొకటి ఒత్తుకొని ఎత్తైన అంతరము లేని స్తనములు గల ఆమె ప్రేమతో నిండిన చిరునవ్వుతో విలాసగా చూచు చుండెను. చక్కని ముక్కు మంచి పలు వరుసలు గల ఆమె సిగ్గు వలన చీర చెరగుతో తనను తాను కప్పుకొనుచుండెను. దట్టని నల్లని కురులు గల ఆమెను చూచి అసురులందరు పూర్తిగా మోహమును పొందిరి.

అహో రూపమహో ధైర్యమహో అస్యా నవం వయః

మధ్యే కామయమానానామకామేవ విసర్పతి

ఏమి ఈమె రూపము! అహో! ఏమి ధైర్యము! ఆహా! ఈమెది అద్బుతమైన యౌవనము! కామించే మన మధ్యలో ఈమె కామన లేని దానివలె సంచరించుచున్నది.

వితర్కయంతో బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిమ్

అభిసంభావ్య విశ్రంభాత్పర్యపృచ్ఛన్ కుమేధసః

సంధ్యాకాలమే ఆ విధముగా స్త్రీరూపమును దాల్చియుండెను. దుష్టబుద్ది గల ఆ అసురులు ఆమెను గురించి పలురకముల ఊహలను చేసిరి. వారామెను చక్కగా మర్యాద చేసి, చనువుతో ఇట్లు ప్రశ్నించిరి.

కాసి కస్యాసి రంభోరు కో వార్థస్తేఽత్ర భామిని

రూపద్రవిణపణ్యేన దుర్భగాన్నో విబాధసే

ఓ సుందరీ! నీవు ఎవరివి? ఎవరి దానవు? ఇక్కడ నీకు పని యేమి? ఓ భామామణీ! నీవు నీ రూపము అనే అమూల్యమగు వస్తువుతో అభాగ్యులమగు మమ్ములను విశేషముగా బాధించుచున్నావు.

యా వా కాచిత్త్వమబలే దిష్ట్యా సందర్శనం తవ

ఉత్సునోషీక్షమాణానాం కందుకక్రీడయా మనః

ఓ అబలా! నీవు ఎవరివి అయిననూ అగుగాక! మాకు నీ దర్శ నము భాగ్యముచే కలిగినది. నీవు బంతిని ఆడుతూ నిన్ను చూస్తూ ఉన్న మా మనస్సులను కలిచి వేయుచున్నావు.

నైకత్ర తే జయతి శాలిని పాదపద్మం

 ఘ్నంత్యా ముహుః కరతలేన పతత్పతంగమ్

మధ్యం విషీదతి బృహత్స్తనభారభీతం

 శాంతేవ దృష్టిరమలా సుశిఖాసమూహః

ఓ సుందరీ! పైకి ఎగురుతున్న బంతిని నీవు అరచేతితో కొట్టుచుం డగా, నీ పద్మములవంటి పాదములు ఒకచోట నిలబడుట లేదు. విశాల మగు స్తనముల భారము వలన నీ కృశించియున్న నడుము భయపడుచు న్నదా యన్నట్లు ఉన్నది. స్వచ్చమగు నీ దృష్టి సొలసినట్లు కానవచ్చుచు న్నది. నీ కేశపాశము అందముగా నున్నది.

ఇతి సాయంతనీం సంధ్యామసురాః ప్రమదాయతీమ్

ప్రలోభయంతీం జగృహుర్మత్వా మూఢధియః స్త్రియమ్

సాయంకాల సంధ్య ఆ విధమగు రూపమును దాల్చి, వారిని ప్రలోభ పెట్టెను. ఆమే వాస్తవముగా యువతియని భావించి మోహితులైన అసురులు ఆమెను పట్టుకొనిరి.

ప్రహస్య భావగంభీరం జిఘ్రంత్యాత్మానమాత్మనా

 కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్

బ్రహ్మ భగవానుడు గంభీరమగు భావము కలుగునట్లుగా నవ్వి, సౌందర్యముతో ప్రకాశించే తన మూర్తితో గంధర్వులు మరియు అప్సరసల గణములను సృష్టించేను. ఆయన మూర్తి తన సౌందర్యమును తానే ఆస్వా దించుచున్నదో యన్నట్లుండెను.

వీససర్జ తనుం తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియామ్

త ఏవ చాదదుః ప్రీత్యా విశ్వావసుపురోగమాః

బ్రహ్మగారు సౌందర్యముతో కూడిన ఆ శరీరమును కూడ విడిచి పెట్టెను. అదియే వెన్నెల ఆయెను. దానిని విశ్వావసువు మొదలగు గంధ ర్వులు ప్రీతితో స్వీకరించిరి.

సృష్ట్వా భూతపిశాచాంశ్చ భగవానాత్మతంద్రిణా

దీగ్వాససో ముక్తకేశాన్ వీక్ష్య చామీలయద్దృశౌ

బ్రహ్మ భగవానుడు తన మందత్వమునుండి భూతపిశాచములను సృష్టించేను. అవి దిగంబరముగా జుట్టు విరబోసుకొనియుండగా చూచి, ఆయన కళ్లను మూసుకొనెను.

జగృహుస్తద్విసృష్టాం తాం జృంభణాఖ్యాo తనుం ప్రభోః

 నిద్రామింద్రియవిcదో యథా భూతేషు దృశ్యతే

యేనోచ్ఛిష్టాన్ ధర్షయంతి తమున్మాదం ప్రచక్షతే

జగత్ప్రభువగు బ్రహ్మగారు ఆవులింతను విడిచి పెట్టెను. ఆ ఆవులింత అనే శరీరమును భూతములు పిశాచములు గ్రహించినవి. అదియే ప్రాణులలో ఇంద్రియములు వివశమయ్యే నిద్రారూపముగా ప్రకటమగుచున్నది. జనులు అపవిత్రులై యున్నప్పుడు భూతాదులు వారిని ఆవేశించి మోహితులను చేయును. దానికి ఉన్మాదమని పేరు. అది కూడ బ్రహ్మ గారు విడిచి పెట్టిన మందత్వరూపమగు శరీరముయొక్క ధర్మమే.

ఊర్జస్వంతం మన్యమాన ఆత్మానం భగవానజః

 సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణాసృజత్ప్రభుః

పూజ్యుడగు బ్రహ్మ తాను బలవంతుడనని భావన' చేసి తన అదృ శ్యరూపము ద్వారా సాధ్యగణములను, పితృగణములను సృష్టించెను.

త ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతి పేదిరే

సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే

ఆ పితృదేవతలు తమకు జన్మనిచ్చిన ఆ అదృశ్యరూపమును స్వీకరించిరి. విద్వాంసులు దానిని నిమిత్తముగా చేసుకొనియే, సాధ్యులకు పితృదేవతలకు శ్రాద్ధాదికర్మలలో హవ్యకవ్యములను సమర్పించెదరు.

సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ తిరోధానేన సోఽసృజత్

తేభ్యోఽదదాత్తమాత్మానమంతర్ధానాఖ్యమద్భుతమ్

ఆ బ్రహ్మగారు తన అంతర్దానశక్తిచే సిద్దులను, విద్యాధరులను సృష్టించి, అద్భుతమగు ఆ అంతర్ధానశక్తిని వారికి ఇచ్చెను.

స కిన్నరాన్ కింపురుషాన్ ప్రత్యాత్మ్యేనాసృజత్ప్రభుః

మానయన్నాత్మనాత్మానమాత్మాభాసం విలోకయన్

జగతభువగు ఆ బ్రహ్మ తన ప్రతిబింబమును చూచి, దానిని తానే మెచ్చుకొని, దానిచే కిన్నరులను, కింపురుషులను సృష్టించెను.

తే తు తజ్జగృహూ రూపం త్యక్తం యత్పరమేష్ఠినా

మిథునీభూయ గాయంతస్తమేవోషసీ కర్మభిః

బ్రహ్మగారు విడిచి పెట్టిన ఆ ప్రతిబింబరూపమును కిన్నర కింపురుషులు స్వీకరించిరి. కావుననే, వారు ప్రాతఃకాలమునందు స్త్రీపురుషుల జంటలుగా ఏర్పడి, బ్రహ్మగారి చేష్టలను గానము చేయుచుందురు.

దేహేన వై భోగవతా శయానో బహుచింతయా

సర్గేఽనుపచితే క్రోధాదుత్ససర్జ హ తద్వపుః

సృష్టి విస్తారమును చెందని కారణముగా పలువిధములుగా చింతిస్తూ బ్రహ్మగారు కాళ్లను చాచుకొని పరుండెను. ఇంతలో, ఆయనకు కోపము వచ్చి ఆ దేహమును విడిచి పెట్టెనట.

యేఽహియంతాముతః కేశా అహయ స్తేంఽగ జజ్ఞిరే

 సర్పాః ప్రసర్పతః క్రూరా నాగా భోగోరుకంధరా

ఓ విదురా! ఆ దేహమునుండి కేశములు జారిపడి పాములు పుట్టెను. కాళ్లను చేతులను చాపుతూ కదులుతున్న దేహమునుండి క్రూరస్వభావము గల విషసర్పములు, పడగచే విస్తరించిన మెడలు గల త్రాచుపా ములు పుట్టెను.

స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూః

తదా మనూన్ ససర్జాంతే మనసా లోకభావనాన్

స్వయంభువుడగు బ్రహ్మగారు, తాను కృతార్థుడనైనానని తలపో సి, అప్పుడు ఆఖరున మనస్సుతో ప్రాణులను వర్ధిల్లజేసి లోకములను పాలించే మనువులను సృష్టించెను.

తేభ్యస్సోఽత్యసృజత్స్వీయం పురం పురుషమాత్మవాన్

 తాన్ దృష్ట్వా యే పురా సృష్టాః ప్రశశంసుః ప్రజాపతిమ్

బుద్దిశక్తిప్రధానుడగు బ్రహ్మ పురుషాకారములోనున్న తన దేహ మును మనువులకు విడిచి పెట్టెను. మనువులకంటే ముందే సృష్టించబడిన దేవతలు మొదలగు వారు మనువులను చూచి బ్రహ్మగారిని కొనియాడిరి.

అహో ఏతజ్జగత్స్రష్టస్సుకృతం బత తే కృతమ్ !

ప్రతిష్ఠితాః క్రియా యస్మిన్ సాకమన్నమదామ హే

 జగత్తును సృష్టించిన ఓ బ్రహ్మా! నీవు చేసిన ఈ సృష్టి చాల బాగు న్నది! దీనిని ఆశ్రయించి యజ్ఞాది కర్మలు ఉన్నవి. వాటి వలన మేము హవి ర్బాగములను భోగించెదము.

తపసా విద్యయా యుక్తో యోగేన సుసమాధినా

ఋషీనృషీర్హృషీ కేశస్ససర్జాభిమతాః ప్రజాః

ఇంద్రియ విజేత, మొదటి ఋషి అగు బ్రహ్మగారు తపస్సు, జ్ఞానము, ఉపాసన, చిత్తైకాగ్రతతో కూడిన యోగము అనువాటితో కూడినవాడై తనకు ప్రియమైన సంతానమగు మహర్షులను సృష్టించేను.

తేభ్యశ్చై కైకశస్స్వస్య దేహస్యాంశమదానజః

యత్తత్సమాధియోగర్ధితపోవిద్యావిరక్తిమత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధేవింశోఽధ్యాయః

 బ్రహ్మ సమాధియోగమును, అణిమాది సిద్దులను, తపస్సును, ఉపాసనను, వైరాగ్యమును, జ్ఞానమును ఆ ఉపాధితో కలిగియుండెను. ఆయన ఆ ఉపాధియొక్క ఒక్కొక్క అంశమును ఆ మహర్షులకు ఇచ్చెను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో ఇరువదియవ అధ్యాయము ముగిసినది.