భాగవత మహా పురాణము
9 - బ్రహ్మగారు శ్రీహరిని స్తుతించుట
బ్రహ్మోవాచ ।
జ్ఞాతోఽసి మేఽద్య సుచిరాన్నను దేహభాజాం
న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యమ్ ।
నాన్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం
మాయాగుణవ్యతికరాద్యదురుర్విభాసి ॥
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ భగవాన్! ఇంతకాలము తరు వాత ఈనాడు నేను నిన్ను తెలుసుకున్నాను. అయ్యో! దేహాభిమానము గల జీవులు భగవానుని స్వరూపము తెలియకుండుట అనే దోషమును కలి గియున్నారు. నీకంటే భిన్నముగా ఏదీ లేదు. ఉన్నట్లు భాసించేది స్వతంత్ర మగు సత్త (ఉనికి) గలది కాదు. ఏలయనగా, త్రిగుణాత్మికయగు నీ మాయాశక్తిలో కలిగిన సంక్షోభముచే నీవే వివిధరూపములలో భాసించుచుస్నావు.
రూపం యదేతదవబోధరసోదయేన
శశ్వన్నివృత్తతమసస్సదనుగ్రహాయ ।
ఆదౌ గృహీతమవతారశతైకబీజం
యన్నాభిపద్మభవనాదహమావిరాసమ్ ॥
నీ చైతన్యశక్తి యొక్క ప్రకాశముచే అజ్ఞానము సర్వదా నీకు దూర ముగా నున్నది. నీవు ఈ రూపమును సత్పురుషులను అనుగ్రహించుట కొరకై స్వీకరించితివి. నీ ఈ రూపము వందలాది అవతారములకు మూల కారణము అగుచున్నది. నీ ఈ విగ్రహముయొక్క నాభినుండి పుట్టిన పద్మము అనే భవనమునుండి నేను ఆవిర్భవించితిని.
నాతః పరం పరమ యద్భవతస్స్వరూప-
మానందమాత్రమవికల్పమవిద్ధవర్చః ।
పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్
భూతేంద్రియాత్మకమదస్త ఉపాశ్రితోఽస్మి ॥
ప్రకృతికి అతీతమైనవాడా! ఓ ఆత్మరూపుడా! నీ చైతన్యస్వరూప మునకు అజ్ఞానముయొక్క ఆవరణము లేదు. ఆ నీ ఆనందఘనస్వరూప మునందు భేదములేమియు లేవు. నీ ఈ రూపము దానికంటే భిన్నమైన దని నేను అనుకోను. అద్వితీయమగు ఈ నీ రూపము జగత్తును సృష్టించి ననూ జగత్తునకు అతీతముగనే యున్నది. సకలభూతములకు, ఇంద్రియ ములకు అధిష్టానమగు ఈ నీ రూపమును నేను శరణు వేడుచున్నాను.
తద్వా ఇదం భువనమంగల మంగలాయ
ధ్యానే స్మ నో దర్శితం త ఉపాసకానామ్ ।
తస్మై నమో భగవతేఽనువిధేమ తుభ్యం
యోఽనాదృతో నరకభాగ్భిరసత్పృసంగైః ॥
జగత్తునకు కల్యాణమైనవాడా! నీ ఉపాసకుడనగు నాకు కల్యాణ మును చేయుట కొరకై నీవు అట్టి ఈ నీ రూపమును నాకు ధ్యానములో దర్శనమిచ్చితివి. భగవానుడవగు నీకు నేను పలుమార్లు నమస్కరించుచు న్నాను. అజ్ఞానులు మిథ్యాభూతమగు జగత్తునందు తీవ్రమగు ఆసక్తి గలవారై, కుతర్కములయందు నిష్ఠను కలిగి, నిన్ను ఉపేక్ష చేసి నరకమును పొందుచున్నారు.
యే తు త్వదీయచరణాంబుజకోశగంధం
జిఘ్రంతి కర్ణవివరైశ్శ్రుతిపాతనీతమ్ ।
భక్త్యా గృహీతచరణః పరయా చ తేషాం
నాపైషి నాథ హృదయాంబురుహాత్స్వపుంసామ్ ॥
ఓ నాథా! వేదములు నీ పాదముల మహిమను కీర్తించుచున్నవి. నీ భక్తులు వేదములనే వాయువుచే గొనిరాబడిన నీ పాదములనే పద్మపు మొగ్గల పరిమళమును తమ చెవి రంధ్రముల ద్వారా ఆఘ్రాణించెదరు. వారు తమయొక్క సర్వాతిశాయియగు భక్తితో నీ పాదములను కట్టివేసెదరు. అట్టి నీ భక్తుల హృదయపద్మమునుండి నీవు దూరము కావు.
తావద్భయం ద్రవిణ గేహసుహృన్నిమిత్తం
శోకస్స్పృహా పరిభవో విపులశ్చ లోభః ।
తావన్మమేత్యసదవగ్రహ ఆర్తిమూలం
యావన్న తేంఽఘ్రిమభయం ప్రవృణీత లోకః ॥
మానవుడు ఎంతవరకు అభయస్థానమగు నీ పాదమును ఆశ్రయిం చడో, అంతవరకు వానికి డబ్బు ఇల్లు బంధువులు అనునవి ఉన్నప్పుడు కలిగే భయము, పోయినప్పుడు కలిగే దుఃఖము, తృష్ణ, అవమానము, అతిశయించిన లోభము తప్పవు; అంతవరకు వానికి, ఇది నాది అనే దుర భిమానము ఉండును. జనుల దుఃఖమునకు అట్టి దురాగ్రహమే ఏకైకకారణ ము అగుచున్నది.
దైవేన తే హతధియో భవతః ప్రసంగాత్
సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియా యే ।
కుర్వంతి కామసుఖలేశలవాయ దీనా
లోభాభిభూతమనసోఽకుశలాని శశ్వత్ ॥
శ్రవణకీర్తనరూపమగు నీ ప్రసంగము మానవులకు అమంగళము లనన్నింటినీ పోగొట్టును. కాని దైవవశముచే నష్టమైన బుద్ధిగల జనులు వాటియందు విముఖమైన ఇంద్రియములతో జీవించుచుందురు. వారి మనస్సు తృష్ణకు వశమై స్వాతంత్యమును కోల్పోయి యుండును. ఆ దీనులు విషయభోగముల వలన కలిగే పిసరంత సుఖము కొరకు ప్రాకులా డుచూ నిరంతరముగా అమంగళకరమగు కర్మలను చేయుచుందురు.
క్షుత్తృట్త్రిధాతుభిరిమా ముహురర్ద్యమానాః
శీతోష్ణవాతవర్షైరితరేతరాచ్చ ।
కామాగ్నినాచ్యుత రుషా చ సుదుర్భరేణ
సంపశ్యతో మన ఉరుక్రమ సీదతే మే ॥
అనంతశక్తి గల ఓ అచ్యుతా! ఈ జీవులను ఆకలి దప్పికలు, వాత పిత్త శ్లేష్మములనే ధాతువులలో వచ్చే వైషమ్యము వలన కలిగే రోగములు, చలి, వేడి, గాలి, వర్షము, కామము అనే అగ్ని మరియు మిక్కిలి భరించ శక్యము కాని కోపము నిరంతరముగా పీడించుచున్నవి. పైగా, వీరు ఒకరిని మరియొకరు పీడించుచున్నారు. ఇట్టి వీరిని చూచుచున్న నా మనస్సు క్రుంగిపోవుచున్నది.
యావత్పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థ-
మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్ ।
తావన్న సంసృతిరసౌ ప్రతిసంక్రమేత
వ్యర్థాపి దుఃఖనివహం వహతీ క్రియార్థా ॥
ఓ ఈశ్వరా! భగవానుని మాయాశక్తియే జీవునియందు ఇంద్రియ రూపముగా, జగత్తునందు ఆ ఇంద్రియములకు గోచరమయ్యే విషయముల (శబ్దరూపరసస్పర్శగంధములు) రూపముగా విస్తరించి బలముగా, బంధించియున్నది. ఆ బంధములోనున్న జీవుడు తాను చేసుకున్న కర్మల ఫలమును అనుభవిస్తూ జననమరణప్రవాహరూపమగు సంసారములో పడి యున్నాడు. నిరర్థకము (మిథ) అగు ఈ సంసారము వానికి పలు దుఃఖ ములను తెచ్చి పెట్టుచున్నది. మానవుడు ఏనాటి వరకైతే దేహేంద్రియాదు లకంటే విలక్షణమైన తన స్వరూపము (ఆత్మ) భగవానుని కంటే వేరుగా లేదనే సత్యమును దర్శించడో, అంతవరకు వానికి ఈ సంసారము తొలగి పోదు.
అహ్న్యా పృతార్తకరణా నిశి నిశ్శయానా
నానామనోరథధియా క్షణభగ్ననిద్రాః ।
దైవాహతార్థరచనా ఋషయోఽపీ దేవ
యుష్మతసంగవిముఖా ఇహ సంసరంతి ॥
ఓ దేవా! నీ లీలలను విని గానము చేయుటయందు ప్రీతి లేని జనులు మహర్షులే అయిననూ, వారీ ఇంద్రియములు మరియు మనస్సు పగలు వివిధవ్యాపారములయందు తగుల్కొని క్లేశమును పొందుచుండు ను. రాత్రి వారు నిద్రించుచున్న సమయములోనైననూ నానావిధములగు కామనలు మనోవిజృంభణరూపమగు స్వప్నములో ప్రకటమగుటచే, క్షణకా లములో వారి నిద్ర చెడిపోవుచుండును. వారు ధనకనకవస్తువాహనాదు లను సంపాదించుటకు చేసే ప్రయత్నములకు దైవము విఘాతము కలిగిం చుచుండును. వారీ విధముగా జననమరణప్రవాహరూపమగు ఈ సంసార ములో పడి కొట్టుకొని పోవుచుందురు.
త్వం భావయోగపరిభావితహృత్సరోజ
ఆస్సే శ్రుతేక్షితపథో నను నాథ పుంసామ్ ।
యద్యద్దియా త ఉరుగాయ విభావయంతి
తత్తద్వపుః ప్రణయ సే సదనుగ్రహాయ ॥
పవిత్రమైన కీర్తి గల ఓ ప్రభూ! నీ లీలలను శ్రవణము చేయుటచే నీ మార్గము తెలియబడును. నీవు మానవులయొక్క భక్తియోగముచే పవి త్రమైన హృదయపద్మములో నిశ్చయముగా నివసించి యున్నావు. నీ భక్తులగు సత్పురుషులు ఏయే రూపమును ధ్యానించెదరో, వారిని అనుగ్ర హించుట కొరకై, నీవు ఆయా రూపములను ప్రకటించెదవు.
నాతిప్రసీదతి తథోపచితోపచారై
రారాధితస్సురగణైర్హృది బద్ధకామైః ।
యత్సర్వభూతదయయాసదలభ్యయైకో
నానాజనేష్వవహితస్సుహృదంతరాత్మా ॥
అద్వితీయ పరబ్రహ్మవగు నీవు సకలప్రాణుల అంతఃకరణముల యందు అంతరాత్మరూపుడవైయుండి హితమును చేయుచున్నావు. అట్టి నీవు సాధకులయందు ఉండే సకలప్రాణులయందలి దయచే చాల ప్రసన్ను డవగుదువు. దేవతాగణములు తమ హృదయములలో దృఢమగు కామన లు గలవారై విపులమగు సామగ్రులతో నిన్ను ఆరాధించినప్పుడు కూడ నీకు అంతటి ప్రసన్నత కలుగదు. అట్టి భూతదయ నీ భక్తులు కాని దుష్టు లకు దుర్లభము.
పుంసామతో వివిధకర్మభిరధ్వరాద్యైః
దానేన చోగ్రతపసా వ్రతచర్యయా చ ।
ఆరాధనం భగవతస్తవ సతియార్థో
ధర్మోఽర్పితః కర్షిచినియతే న యత్ర ॥
కావున, మానవులు యజ్ఞము మొదలగు వివిధకర్మలను, దానము ను, కరమగు తపస్సును మరియు ప్రతములను చేసి నిన్ను ఆరాధించు ట (నిన్ను ప్రసన్నుని చేసుకొనుట) యే ఆ సత్కర్మలకు మహాఫలము. ఏల యనగా, నీయందు సమర్పించబడిన ధర్మమునకు ఏ కాలమునందైననూ నాశము లేదు.
శశ్వత్స్వరూపమహసైవ నిపీతభేద-
మోహాయ బోధధిషణాయ నమః పరస్మై ।
విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా-
రాసాయ తే నమ ఇదం చకృమేశ్వరాయ ॥
జ్ఞానమునకు అధిష్టానమగు నీవు నీ స్వరూపమగు చైతన్యము యొక్క మహిమ చేతనే మానవులలోని భేదభ్రమను శాశ్వతముగా త్రోసిపు చ్చెదవు. జగత్తుయొక్క సృష్టిస్థితిప్రళయములకు నిమిత్తమగు నీ మాయా శక్తియొక్క విలాసము నీ క్రీడయే. నీవే జగన్నాథుడవు, పరమేశ్వరుడవు. ఇదిగో! నీకు పలు పర్యాయములు నమస్కరించుచున్నాను.
యస్యావతారగుణకర్మవిడంబనాని
నామాని యేఽసువిగమే వివశా గృణంతి ।
తే నైకజన్మశమలం సహసైవ హిత్వా
సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే ॥
ఎవరైతే ప్రాణము పోయే సమయమునందు పరవశులై యుండియూ పరమేశ్వరుని అవతారములలోని గుణములను మరియు కర్మలను సూచించే ఆయన నామములను ఉచ్చరించెదరో, వారు అనేకజ న్మల పాపమును వెంటనే విడిచి పెట్టి, అజ్ఞానముయొక్క ఆవరణము లేని బ్రహ్మపదమును పొందుచున్నారు. అట్టి అజుడగు ఆ పరమేశ్వరుని శరణు వేడుచున్నాను.
యో వా అహం చ గిరిశశ్చ విభుస్స్వయం చ
స్థిత్యుద్భవప్రలయ హేతవ ఆత్మమూలమ్ ।
భిత్త్వా త్రిపాద్వవృధ ఏక ఉరుప్రరోహః
తస్మై నమో భగవతే భువనద్రుమాయ ॥
అద్వితీయుడగు ఆ పరమేశ్వరుడు తనను అధిష్టించియున్న తన మాయాశక్తిని రజస్సత్త్వతమోగుణములు అనే భేదముచే విడగొట్టి, క్రమముగా ఆ గుణములను ఉపాధులుగా చేసుకొని, బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనే మూడు మూర్తులను దాల్చి, క్రమముగా జగత్తుయొక్క సృష్టిస్థితిల యములను చేయుచున్నాడు. ఆ మాయశక్తియే ఇంకనూ పరిణమించి, మరీచి మనువు మొదలగు ప్రజాపతులకు ఉపాధి అగుచున్నది. ఈ విధముగా త్రిమూర్తులే మ్రానులు కాగా, ప్రజాపతులు మొదలగువారు శాఖోప శాఖలు కాగా, ఆ పరమేశ్వరుడు జగత్తు అనే వృక్షము రూపములో ప్రకట మైనాడు. ఆ భగవానునకు నమస్కారము.
లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః
కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే ।
యస్తావదస్య బలవానిహ జీవితాశాం
సద్యశ్ఛినత్త్యనిమిషాయ నమోఽస్తు తస్మై ॥
భగవదారాధనము మానవునకు హితకరమగు స్వధర్మము. దానిని భగవానుడే బోధించియున్నాడు. కాని, ఏ మానవుడు దానియందు శ్రద్ద లేనివాడై, నిషిద్దమగు కర్మలను ఆచరించునో, వానికి ఈ లోకములో జీవిం చాలనే ఆశను కాలము వెంటనే తెగగొట్టుచుండును. కాలము చాల బలీయ మైనది. అట్టి కాలమే స్వరూపముగా గల భగవానునకు నమస్కారము.
యస్మాద్భిభేమ్యహమపి ద్విపరార్ధధిష్ణ్య-
మధ్యాసితస్సకలలోకనమస్కృతం యత్ ।
తే పే తపో బహుసవోఽవరురుత్సమానః
తస్మై నమో భగవతేఽధిమఖాయ తుభ్యమ్ ॥
బ్రహ్మలోకమును ఇతరలోకములలోని జీవులందరు నమస్కరిం తురు. అది రెండు పరార్థముల కాలము (వెయ్యి మహాయుగములు ఒక పగలు అనే లెక్కలో వేయి సంవత్సరములు పరార్ధమగును) వరకు నిలిచి యుండును. ఆ బ్రహ్మలోకమునకు అధీశ్వరుడనగు నేను కూడా కాలము నకు భయపడుచుందును. నేను నిన్ను పొందగోరి, అనేకములగు యజ్ఞము లను చేసి, అనేక సంవత్సరముల కాలము తపస్సును సలిపితిని. అట్టి యజ్ఞములకు అధిష్టానమగు పురుషుడవు నీవే. ఆ కాలము భగవానుడవగు నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారము.
తిర్యజ్మనుష్యవిబుధాదిషు జీవయోని-
ష్వాత్మేచ్చయాఽఽత్మకృత సేతుపరీప్సయా యః ।
రేమే నిరస్తరతరప్యవరుద్ధదేహః
తస్మై నమో భగవతే పురుషోత్తమాయ ॥
భగవానునకు విషయసుఖములయందు ఆసక్తి లేశమైననూ లేదు. అయిననూ, ఆయన పశువులు పక్షులు మనుష్యులు దేవతలు మొదలగు జీవయోనులయందు తన ఇచ్చ చే శరీరములను దాల్చి, తాను నిర్మించిన ధర్మమర్యాదను పాలించే కోరికతో రమించెను. అట్టి పురుషోత్తమ భగవాను నకు నమస్కారము.
యోఽవిద్యయానుపహత్వోఽపి దశార్దవృత్త్యా
నిద్రిమువాహ జఠరీకృతలోకయాత్రః ।
అంతర్జలేఽహికశిపుస్పర్శానుకూలాం
భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్ ॥
భగవానుడు ప్రళయకాలములో సకలప్రాణులను తన ఉదరము నందు నిలిపి యుంచినాడు. అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివే శము (మరణభయము) అనే అయిదు చిత్తకేశములు భగవానుని నిర్జించలే వు. అయిననూ, ఆయన తనలోని ప్రాణులకు నిద్రాసుఖమును కలిగించు వాడై, భయంకరమగు తరంగముల పంక్తులతో గూడియున్న ప్రళయకాలజ లములయందు, మెత్తని స్పర్శతో అనుకూలముగానుండే ఆదిశేషుడనే తల్పముపై యోగనిద్రను స్వీకరించెను.
యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య
లోకత్రయోపకరణో యదనుగ్ర హేణ ।
తస్మై నమస్త ఉదరస్థభవాయ యోగ-
నిద్రావసానవికసన్నలినేక్షణాయ ॥
ఓ కొనియాడదగినవాడా! ముల్లోకములకు సృష్టికార్యము ద్వారా ఉపకరించే నేను నీ అనుగ్రహముచే నీ నాభియందలి పద్మము అనే ఇంటి నుండి జన్మించితిని. ఈ ప్రపంచమంతయు నీ ఉదరమునందు నిలిచియున్నది. ఇప్పుడిప్పుడే నీ యోగనిద్ర అంతమగుచున్నది. కలువలవంటి నీ కన్నులు తెరుచుకొనుచున్నవి. అట్టి నీకు నమస్కారము.
సోఽయం సమస్తజగతాం సుహృదేక ఆత్మా
సత్త్వేన యన్మృడయతే భగవాన్ భగేన ।
తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం
స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణతప్రియోఽసౌ ॥
సకలజగత్తులకు హితకారి, అద్వితీయుడు, ఆత్మరూపుడు అగు అట్టి ఈ శ్రీహరి భగవానుడు ఏ జ్ఞానముతో మరియు ఐశ్వర్యముతో జగ త్తునకు ఆనందమును కలిగించుచున్నాడో, అదే జ్ఞానమును మరియు ఐశ్వ ర్యమును నా బుద్దికి సమకూర్చుగాక! దాని వలన, నేను పూర్వమునందు వలెనే జగత్తును సృష్టించగల్గుదును. ఈ శ్రీహరి శరణు జొచ్చినవారికి ప్రీతిని కలిగించును.
ఏష ప్రపన్నవరదో రమయాఽఽత్మశక్త్యా
యద్యత్కరిష్యతి గృహీతగుణావతారః ।
తస్మిన్ స్వవిక్రమమిదం సృజతోఽపి చేతో
యుంజీత కర్మశమలం చ యథా విజహ్యామ్ ॥
ఈ శ్రీహరి శరణు జొచ్చినవారికి వరములనిచ్చును. ఆయన తన శక్తిస్వరూపిణియగు లక్ష్మీదేవితో గూడి అవతారములను స్వీకరించి, వాటి యందు తన దివ్యగుణములను ప్రకటిస్తూ లీలలను నెరపబోవుచున్నాడు. నా ఈ సృష్టిక్రియ కూడ ఆయన ప్రభావమే. సృష్టిని చేయుచున్న నా మనస్సు కూడ ఆయనయొక్క ఆయా లీలలయందు నిలిచియుండుగాక! దాని వలన, నాకు కర్తృత్వాభిమానము అనే కర్మదోషము దూరమగును.
నాభిహ్రదాదిహ సతోఽoభసి యస్య పుంసో
విజ్ఞానశక్తిరహమాసమనంతశక్తేః ।
రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే
మా రీరిషీష్ట నిగమస్య గిరాం విసర్గః ॥
ఈ ప్రళయజలమునందు శయనించియున్న అనంతశక్తిమంతు డగు పురుషోత్తముని నాభికమలమునుండి నేను పుట్టితిని. నేను ఆ పురు షుని విజ్ఞానశక్తి స్వరూపుడనే. నేను ఇప్పుడు నానావిధమగు జగత్తును సృష్టించబోవుచున్నాను. ఈ జగత్తు కూడ ఆ పురుషుని రూపమే. అట్టి నాకు వేదవాక్కుల ఉచ్చారణము క్షీణించకుండుగాక!
సోఽసావదభ్రకరుణో భగవాన్ వివృద్ధ-
ప్రేమస్మితేన నయనాంబురుహం విజృంభన్ ।
ఉత్థాయ విశ్వవిజయాయ చనో విషాదం
మాధ్యా గిరాపనయతాత్పురుషః పురాణః ॥
పురాణపురుషుడవగు నీవు గొప్ప దయగల భగవానుడవు. నీవు ప్రేమతో నిండిన చిరునగవుతో పద్మములవంటి కన్నులను వికసింపజేయు చూ, నిద్ర లెమ్ము. అప్పుడు మాత్రమే జగత్తుయొక్క సృష్టి సంభవమగు ను. లేచి, నీ తేనెలొలికే మాటలతో నా దుఃఖమును దూరము చేయుము.
మైత్రేయ ఉవాచ ।
స్వసంభవం నిశామ్యైవం తపోవిద్యాసమాధిభిః ।
యావన్మనోవచః స్తుత్వా విరరామ స ఖిన్నవత్ ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఈ విధముగా బ్రహ్మగారు తప స్సును చేసి, భగవానుని ఉపాసించి ఏకాగ్రమగు చిత్తముతో ఆయనను దర్శించెను. తరువాత బ్రహ్మ ఆయనను తన మనస్సునకు వాక్కునకు చేతనైనంత వరకు స్తుతించి, అలసినాడా యన్నట్లు విరమించెను.
అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః ।
విషణ్ణచేతసం తేన కల్పవ్యతికరాంభసా ॥
లోకసంస్థానవిజ్ఞాన ఆత్మనః పరిభిద్యతః ।
తమాహారాధయా వాచా కశ్మలం శమయన్నివ ॥
బ్రహ్మ తాను సృష్టించవలసిన లోకముల రచన విషయములో విజ్ఞానము లేక చాల ఖేదముననుభవించుచుండెను. పైగా, ఆయన ఆ ప్రళ యకాలజలములను చూచి మనస్సులో విషాదమును పొందుచుండెను. అట్టి బ్రహ్మగారి అభిప్రాయమును విన్న మధుసూదన భగవానుడు ఆ బ్రహ్మయొక్క మోహమును తొలగిస్తూ, గంభీరమగు వచనముతో ఆయ నతో ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
మా వేదగర్బ గాస్తంద్రీం సర్గ ఉద్యమమావహ ।
తన్మయాఽఽపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్ ॥
శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ఓ బ్రహ్మా! నీవు వేదనిధివి. దుఃఖమును, అలసత్వమును పొందకుము. సృష్టిప్రయత్నమును చేప ట్టుము. ఏలయనగా, నీవు కోరేదానిని నేను ముందే భద్రము చేసితిని.
భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాం చైవ మదాశ్రయామ్ ।
తాభ్యామంతర్హృది బ్రహ్మన్ లోకాన్ ద్రక్ష్యస్యపావృతాన్ ॥
ఓ బ్రహ్మా! నీవు మరల తపస్సును చేసి, నన్ను ఉపాసించుము. ఆ తపస్సుచే మరియు ఉపాసనలచే నీవు అంతఃకరణమునందు లోకము లను సుస్పష్టముగా చూడగల్గుదువు.
తత ఆత్మని లోకే చ భక్తియుక్తస్సమాహితః ।
ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్మయి లోకాంస్త్వమాత్మనః ॥
ఓ బ్రహ్మా! తరువాత భక్తిగల నీవు ఏకాగ్రచిత్తుడవై నీయందు జగ త్తునందు వ్యాపించియున్న నన్ను, మరియు నాయందు నీచే సృష్టించబ డిన లోకములను చూడగలవు.
యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితమ్ ।
ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్తర్హ్యేవ కశ్మలమ్ ॥
నేను సకలప్రాణులలో కట్టెలలో నిప్పు వలె వ్యాపించియున్నాను. ఈ సత్యమును మానవుడు ఏ సమయములో దర్శించునో, అదే సమయ ములో వాని అజ్ఞానమాలిన్యము తొలగిపోవును.
యదా రహితమాత్మానం భూతేంద్రియగుణాశయైః ।
స్వరూపేణ మయో పేతం పశ్యన్ స్వారాజ్యమృచ్ఛతి ॥
పంచభూతములు, ఇంద్రియములు, సత్త్వరజస్తమోగుణములు మరియు అంతఃకరణము అనువాటికంటే విలక్షణుడనగు నేను ప్రత్యగభిన్న మగు (ఆత్మ-అభిన్నమగు) పరబ్రహ్మస్వరూపుడను అని మానవుడు ఏ కాలములో దర్శించునో, అదే క్షణములో ఆతడు మోక్షసామ్రాజ్యమును అధిష్ఠించును.
నానాకర్మవితానేన ప్రజా బహ్వీస్సిసృక్షతః ।
నాత్మావసీదత్య్మింస్తే వర్షీయాన్మదనుగ్రహః॥
నీవు అనేకులగు ప్రాణులను వారి వారి వివిధములగు కర్మల విస్తా రముననుసరించి సృష్టించగోరుచున్నావు. ఈ కార్యములో నీ అంతఃకర ణము వ్యామోహమును పొందదు. ఏలయనగా, నీపై నా అతిశయించిన అనుగ్రహము గలదు.
ఋషిమాద్యం న బధ్నాతి పాపీయాంస్త్వాం రజోగుణః ।
యన్మనో మయి నిర్బద్ధం ప్రజాస్సంసృజతోఽపి తే ॥
నీవు మొట్టమొదటి మంత్రద్రష్టవు. పాపభూయిష్ఠమగు రజోగు ణము నిన్ను బంధించదు. ఏలయనగా, నీవు ప్రాణులను సృష్టించుచున్న నూ, నీ మనస్సు నాపై దృఢముగా నిలిచియున్నది.
జ్ఞాతోఽహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోఽపి దేహినామ్ ।
యన్మాం త్వం మన్య సేఽయుక్తం భూతేంద్రియగుణాత్మభిః ॥
మానవులు నన్ను చాల క్లేశముచే మాత్రమే తెలియగల్గుదురు. అట్టి నన్ను నీవిపుడు తెలుసుకున్నావు. ఏలయనగా, నేను పంచభూతము లకు ఇంద్రియములకు సత్త్వరజస్తమోగుణములకు మరియు అంతఃకరణ మునకు అతీతుడనని నీవు తెలుసుకున్నావు.
తుభ్యం మద్విచికిత్సాయామాత్మా మే దర్శితోఽబహిః ।
నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః ॥
నాకు ఆశ్రయము ఎవరైనా ఉన్నారా లేదా అను సంశయములో పడిన నీవు తూడుగుండా పద్మముయొక్క మూలమును అన్వేషించుచుం డగా, నేను నా స్వరూపమును నీకు అంతఃకరణమునందు మాత్రమే చూపించితిని.
యచ్చకర్థాంగ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాంకితమ్ ।
యద్వా తపసి తే నిష్ఠా స ఏష మదనుగ్రహః ॥
ఓ వత్సా! నీవు నా గాథల వైభవముతో గూడియున్న నా స్తోత్ర మును చేసితివి. పైగా, నీకు తపస్సునందు నిష్ఠ గలదు. ఇదంతా నా అను గ్రహమే.
ప్రీతోఽహమస్తు భద్రం తే లోకానాం విజయేచ్చయా ।
యదస్తౌషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్ ॥
నీవు లోకములను సృష్టించవలెననే కోరికతో నన్ను స్తుతించితివి. నేను స్వరూపముచే నిర్గుణుడనే అయిననూ, గుణసంపన్నుని వలె భాసిం చుచున్నాను. ఈ విషయమును నీవు వర్ణించితివి. నీపై నేను ప్రసన్నుడనైతి ని. నీకు మంగళమగు గాక!
య ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ ।
తస్యాశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః ॥
ఏ మానవుడైతే నిత్యము నన్నీ స్తోత్రముతో స్తుతించి సేవించునో, వానికి ఈశ్వరుడనగు నేను చక్కగా ప్రసన్నుడనై కోరబడే వరములనన్నిం టినీ ఇచ్చెదను.
పూర్తేన తపసా యజ్ఞైర్దనైర్యోగసమాధినా ।
రాద్ధం నిఃశ్రేయసం పుంసాం మతీతిస్తత్త్వవిన్మతమ్ ॥
సమాజ సేవ, తపస్సు, యజ్ఞములు, దానములు, యోగా భ్యాసము మరియు సమాధి అనువాటిచే మానవులకు లభించే సర్వోత్కృ ష్టమైన శ్రేయస్సు నేను ప్రసన్నుడనగుటయేనని తత్త్వవేత్తల సిద్ధాంతము.
అహమాత్మాఽఽత్మనాం ధాతః ప్రేష్ఠస్సన్ ప్రేయసామపి ।
అతో మయి రతిం కుర్యాద్దేహాదిర్యత్కృతే ప్రియః ॥
ఓ బ్రహ్మా! ఈ లోకములో జీవులకు ప్రీతిని గొలుపు విషయములు అనేకములు గలవు. కాని, సదనమగు ఆత్మ అన్నింటికంటే అతిశయించి ప్రియమై ఉన్నది. ఆత్మయండలి ప్రీతియే దేహము మొదలగు వాటి యందు ప్రతిఫలించుటచే అవి ప్రీతిపాత్రములగుచున్నవి. అట్టి ఆత్మను నేనే. కావున, మానవుడు నాయందు భక్తిని చేయవలెను.
సర్వవేదమయేనేదమాత్మనాఽఽత్మాఽఽత్మయోనినా ।
ప్రజాస్సృజ యథాపూర్వం యాశ్చ మయ్యను శేరతే ॥
సకలప్రాణులు ఈ సమయములో నాయందు విలీనమై నిద్రించుచున్నవి. సకలవేదస్వరూపుడవగు నీవు నానుండియే ఆవిర్భవించినావు. నీవీ జగత్తును మరియు ప్రాణులను గడచిన కల్పమునందు వలెనే మరల నీ స్వరూపమునందు మాత్రమే ఆవిర్భవింప జేయుము.
మైత్రేయ ఉవాచ ।
తస్మా ఏవం జగత్సృష్ట్రే ప్రధానపురుషేశ్వరః ।
వ్యజ్యేదం స్వేన రూపేణ కంజనాభస్తిరోదధే ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధేనవమోఽధ్యాయః ॥
మైత్రేయుడు ఇట్లు పలికెను --- పద్మము నాభియందు గలవాడు, ప్రకృతిని జీవులను నియంత్రించువాడు అగు శ్రీహరి ఈ విధముగా సృష్టిం చవలసిన జగత్తును గురించి సృష్టికర్తయగు బ్రహ్మగారికి తెలుపుడు జేసి, తన రూపమును అంతర్ధానము చేసెను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
Summary of chapter 9 of the Bhāgavata Mahā Purana is as follows:
After spending a century in deep penance and meditation upon receiving divine inspiration from within his heart, Lord Brahmā beholds the transcendental form of Lord Vishṇu and offers magnificent prayers of adoration. Pleased with Brahmā's devotion, the Lord bestows upon him the creative intelligence, power, and wisdom necessary to fashion the diverse worlds and living entities without becoming entangled in false pride.