27 - ప్రకృతి పురుష వివేకముచే మోక్షప్రాప్తి

శ్రీభగవానువాచ

ప్రకృతిస్థోపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణైః

 అవికారాదకర్తృత్వాన్నిర్గుణత్వాజ్ఞలార్కవత్

శ్రీ కపిల భగవానుడు ఇట్లు పలికెను --- అకర్తయగు పురుషుని (ఆత్మ) యందు వికారములు లేవు. పురుషుడు నిర్గుణుడు. కావున, పురు షుడు ప్రకృతి కార్యమగు దేహమునందు ఉన్నవాడైననూ, నీటియందు ప్రతిఫలించిన సూర్యుని వలె, ప్రకృతి గుణములగు సత్త్వరజస్తమస్సులచే సంప్రాప్తమయ్యే పుణ్యపాపములచే గాని, . సుఖదుఃఖములచే గాని లేపమును పొందడు.

స ఏష యర్హి ప్రకృతేర్గుణీష్వభవిషజ్జతే

అహంక్రియావిమూఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే

      అట్టి ఈ పురుషుడు ఏ కాలమునందు అహంకారముచే మోహిని పజేయబడిన బుద్ధి గలవాడై ప్రకృతియొక్క గుణములయందు ఆసక్తి గల వాడగునో, అప్పుడు నేను కర్తను అనే అభిమానమును కలిగియుండును.

తేన సంసారపదవీమవశోభ్యేత్యనిర్వృతః

ప్రాసంగికైః కర్మదోషైస్సదసన్మిశ్రయోనిషు

నేను కర్తను అనే అభిమానముగల జీవుడు దేహాదులచే చేయబడే కర్మలయొక్క పుణ్యపాపరూపమగు ఫలముకు భోక్తయగును. అట్టి జీవుడు అస్వతంత్రుడై మంచి (దేవ), చెడు (పశు), మిశ్రమ (మనుష్య) జన్మలను పొంది సంసారచక్రములో పడి తిరుగుతూ సుఖమునకు దూరమగును.

అర్థ హ్యవిద్యమాన్వేపి సంసృతిర్న నివర్తతే

 ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమో యథా

జన్మమరణాది రూపసంసారము మిథ్య. అయిననూ, భోగము లను గురించి చింతిల్లే జీవునకు, స్వప్నమునందలి ఆపద దాని దుఃఖము వలే, సంసారమునందు తిరుగాడుట తప్పుట లేదు.

అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమగతాం పథి

భక్తియోగేన తీవ్రేణ విరక్త్యా చనయేద్వశమ్

కావుననే, దుష్టములగు ఇంద్రియముల మార్గములో, అనగా వాటి విషయములలో గట్టిగా తగుల్కొనియున్న మనస్సును భక్తిర్గముచే మరియు తీవ్రమగు వైరాగ్యముచే మెల్లగా వశములోనికి తెచ్చుకొనవలెను.

యమాదిభిర్యోగపథైరభ్యసన్ శ్రద్ధయాన్వితః

మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన చ

సాధకుడు నాయందు ఫలాసక్తి లేని ప్రేమ గలిగి నా గాథలను వింటూ, యమనియమాది యోగాంగములను శ్రద్ధతో అభ్యసించవలెను.

సర్వభూతసమత్వేన నిర్వైరేణాప్రసంగతః

బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా

 సాధకుడు సకలప్రాణులయందు ప్రకాశించే చైతన్యరూపమగు బ్రహ్మను దర్శించవలెను. అట్టి దర్శనముచే వైరభావమును తొలగించుకో ని, సంసారవిషయములయందు ఆసక్తికి దూరముగా నుండవలెను. సాధ కుడు బ్రహ్మచర్యము (గృహస్థుని విషయములో ఏకపత్నీ వ్రతము) ను పాటిస్తూ మౌనియై (అధికప్రసంగమును చేయనివాడై, ప్రసన్నమగు మనస్సు గలవాడై) స్వధర్మము (కర్తవ్యము) ను గట్టిగా అనుష్ఠించవలెను.

యదృచ్చయోపలబ్ధేన సంతుష్టా మితభుజ్ మునిః

వివిక్తశరణశ్శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్

సాధకుడు ప్రారబవశముచే తనంత తానుగా లభించిన దానితో సంతుష్టుడు కావలెను. మితముగా భుజిస్తూ మననశీలుడై ఏకాంతములో నివసించవలెను. రాగద్వేషములను విడనాడి అందరినీ ప్రేమిస్తూ అందరి యందు దయ గలిగి తాను కృతార్థుడననే ధైర్యముతో నుండవలెను.

సానుబంధే చ దేహేస్మిన్నకుర్వన్నసదాగ్రహమ్

 జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతేః పురుషస్య చ

 ప్రకృతిపురుషుల స్వరూపమునెరింగిన జ్ఞాని ఈ దేహమునందు గాని, దాని సంబంధీకులయందు గాని, నేను నాది అనే మిథ్యారూపమగు అభిమానము లేనివాడై యుండును.

నివృత్తబుద్ధ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః

ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషేవార్కమాత్మదృక్

ప్రకృతిపురుష వివేకము గల జ్ఞాని, జాగ్రత్తు మొదలగు అవస్థలు బుద్ధికి సంబంధించినవే గాని, ఆత్మకు వాటితో లేపము లేదని తెలుసుకొను ను. ఈశ్వరుని కంటె భిన్నముగా ఏదీ లేదనే దర్శనమును ఆతడు కలిగి యుండును. సూర్యుడు అధిష్ఠానదేవతగా గల కంటితో సూర్యుని చూచే విధముగా, ఆతడు తన శుద్దమగు అంతఃకరణము ద్వారా ఆత్మరూపముగా నుండే పరమేశ్వరుని దర్శించి ఆయనయందు విలీనుడై జీవన్ముక్తుడగును.

ముక్తలింగం సదాభాసమసతి ప్రతిపద్యతే

 సతో బంధుమసచ్చక్షుస్సర్వానుస్యూతమద్వయమ్

అంతఃకరణములో ఆ అఖండసత్ యొక్క ప్రతిఫలనమే జీవుడనియు, ఉపాధిని పరిత్యజించిన జీవుడు ఆ సత్ కంటే భిన్నుడు కాడనియు, ఈ మిథ్యాభూతమగు జగత్తును అంతనూ వ్యాపించి దానిని ప్రకా శింపజేసే అద్వయబ్రహ్మ అదియేననియు ఆ ముని దర్శించును.

యథా జలస్థ ఆభాసః స్థలస్థేనావదృశ్యతే

స్వాభా సేన తథా సూర్యో జలస్థేన దివి స్థితః

 ఏవం త్రివృదహంకారో భూతేంద్రియమనోమయైః

 స్వాభా సైర్లక్షితోనేన సదాభా సేన సత్యదృక్

నీటి పడియలో పడిన సూర్యకాంతి ప్రతిఫలించి ఇంటిలోని గోడపై పడినప్పుడు ఆ గోడమీది సూర్యుడు నీటిలోని సూర్యుని ప్రతిబింబమని తెలియును. నీటిలోని సూర్యుడు కూడ ఆకాశమునందలి సూర్యుని ప్రతి బింబమే. అదే విధముగా, పంచభూతకార్యమగు ఈ దేహమునందు, ఇంద్రియములయందు, అంతఃకరణమునందు చైతన్యప్రకాశము అనుభవమునకు వచ్చుచున్నది. కాని, వాటి ఈ ప్రకాశము అహంకార ప్రకాశము యొక్క ప్రతిఫలము మాత్రమేనని గ్రహించదగును. అహంకారమునందలి చైతన్యప్రకాశము కూడ ఆ అఖండసత్ యొక్క ప్రకాశమేనని దర్శించు జీవన్ముక్తుడు ఆ బ్రహ్మ-అభిన్నమగు సచ్చిదాత్మను దర్శించును.

భూతసూక్ష్మేంద్రియమనోబుద్ధ్యాదిష్విహ నిద్రయా

లీనేష్వసతి యస్తత్ర వినిద్రో నిరహంక్రియః

      నిద్రావస్థలో సూక్ష్మభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలగునవి అవ్యాకృతము (నామరూప పరిణామము లేని ప్రకృతి యొక్క సూక్ష్మావస్థ) లో విలీనమగును. కాని, ఆత్మ చైతన్యము నిద్రించ దు. అది నిత్యదృక్స్వరూపమై అహంకారము లేని ఆ అవస్థను ప్రకాశింప జేయును.

మన్యమానస్తదానవత్మానమనష్టో నష్టవన్మృషా

నష్టేహంకరణే ద్రష్టా నష్టవిత్త ఇవాతురః

ఆత్మ జాగ్రదవస్థయందు సర్వమునకు ద్రష్టవలె భాసించును. కాని, నిద్రలో అహంకారముతో సహా ఆ సర్వము అంతర్ధానమగును. అప్పుడు ధనమును కోల్పోయి తనను తానే కోల్పోయినట్లుగా కంగారు పడే వ్యక్తి వలె, అజ్ఞాని తాను నిద్రలో లేకుండా పోయినానని భావించును.

ఏవం ప్రత్యవమృశ్యాసావాత్మానం ప్రతిపద్యతే

 సాహంకారస్య ద్రవ్యస్య యోవస్థానమనుగ్రహః

      దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము అను నవి కేవలము ఆత్మ చైతన్యము మాత్రమే అధిష్టానముగా కలిగి దాని యందు మాత్రమే భాసించుచున్నవి. వివేకి ఈ విధముగా విమర్శ చేసి ఆత్మతత్త్వమును తెలుసుకొనును.

దేవహూతిరువాచ

 పురుషం ప్రకృతిరహ్మన్న విముంచతి కర్హిచిత్

అన్యోన్యాపాశ్రయత్వాచ్చ నిత్యత్వాదనయోః ప్రభో

దేవహూతి ఇట్లు పలికెను --- ఓ పరమేశ్వరా! ప్రభూ! ఒకదానిని మరియొకటి ఆశ్రయించి ఉండే ఈ ప్రకృతి పురుషులు నిత్యములు. కావు న, ప్రకృతి ఏ కాలమునందైననూ పురుషుని విడిచి యుండదు.

యథా గంధస్య భూమేశ్చ న భావో వ్యతిరేకతః

 అపాం రసస్య చ యథా తథా బుద్ధేః పరస్య చ

భూమి, గంధము వేర్వేరుగా మనజాలవు. నీరు, రసము అనువా టికి వేర్వేరు ఉనికి లేదు. అదే విధముగా బుద్ది (ప్రకృతి), పురుషుడు ఒక దానిని విడిచి మరియొకటి ఉండలేదు.

అకర్తుః కర్మబంధోక్యం పురుషస్య యదాశ్రయః

 గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తేష్వతః కథమ్

పురుషుడు స్వయముగా కర్త కాడు. కాని, ప్రకృతి గుణములతో తాదాత్మ్యముచే పురుషునకు కర్మబంధము కలుగుచున్నది. కాని, ఈ సత్త్వరజస్తమోగుణములు నిత్యములై యుండగా, ఆ పురుషునకు కర్మబం ధమునుండి విముక్తి, కేవలభావము ఎట్లు కలుగును?

క్వచిత్తత్త్వావమర్శేన నివృత్తం భయముల్బణమ్

అనివృత్తనిమిత్తత్వాత్పునః ప్రత్యవతిష్ఠతే

ఒకానొక పురుషునియందు ఒకవేళ ఆత్మజ్ఞానముచే తీవ్రమగు సంసారభయము తొలగిననూ, దానికి కారణమగు గుణములు నిత్యముల గుటచే, ఆ సంసారము మరల సంప్రాప్తమగును.

శ్రీభగవానువాచ

 అనిమిత్తనిమిత్తేన స్వధర్మేణామలాత్మనా

 తీవ్రయా మయి భక్త్యా చ శ్రుతసంభృతయా చిరమ్

 జ్ఞానేన దృష్ణతత్వేన వైరాగ్యేణ బలీయసా

 తపోయుక్తేన యోగేన తీవ్రణాత్మసమాధినా

 ప్రకృతిః పురుష స్యేహ దహ్యమానా త్వహర్నిశమ్

 తిరోభవిత్రీ శనకైరగ్నేర్యోనివారణిః

సాధకుడు ఫలమునందు తృష్ణ లేకుండగా స్వచ్చమగు అంతఃకర ణముతో స్వధర్మముననుష్ఠించవలెను. చిరకాలము నా గాథలను విని నాయందలి భక్తిని తీవ్రముగా పరిపుష్టము చేసుకొనవలెను. ప్రకృతిపురు షుల యథార్థస్వరూపమును తెలుసుకొనవలెను. బలిష్టమగు వైరాగ్యము గలవాడై, ప్రతనియమములను పాటిస్తూ ధ్యానమును అభ్యాసము చేయవ లెను. దృఢమగు చిత్తేకాగ్రతను కలిగియుండవలెను. ఇట్లు చేయు సాధకు నకు ఈ జన్మలోనే, కట్టెయందలి నిప్పుచే కట్టె కాల్చివేయబడినట్లుగా, అవిద్య మెల్లమెల్లగా దహించివేయబడి అంతర్ధానమగును.

భుక్తభోగా పరిత్యక్తా దృష్టదోషా చ నిత్యశః

 నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్ని స్థితస్య చ

ప్రకృతి నిత్యము దుఃఖ హేతువు అని వివేకియగు పురుషుడు దర్శించి దానియందు తాదాత్మ్యమును చెందకుండగా విడిచి పెట్టును. అట్టి ప్రకృతి తన పరమానంద స్వరూపమునందు నిలిచియుండే స్వతంత్రుడగు పురుషునకు సంసారమనే అమంగళమును కలిగించలేదు. .

యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్

 స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే

కలను కనుచున్నవానికి ఆ కలలోని దృశ్యములు అనేకములగు ఆపదలను కలిగించి దుఃఖితుని జేయును. కాని, ఆ వ్యక్తి నిద్ర లేచిన తరు వాత, ఆ కల వానికి మోహమును కలుగజేయలేదు గదా!

ఏవం విదితతత్త్వస్య ప్రకృతిర్మయి మానసమ్

యుంజతో నాపకురుత ఆత్మారామస్య కర్హిచిత్

 ఈ విధముగా ప్రకృతిపురుషుల స్వరూపమునెరింగి తనయందు తాను రమించువాడై నాయందు మనస్సును లగ్నము చేయు సాధకునకు ప్రకృతి ఏ కాలమునందైననూ మోహము కలిగించదు.

యదైవమధ్యాత్మరతః కాలేన బహుజన్మనా

సర్వత్ర జాతవైరాగ్య ఆబ్రహ్మభువనాన్మునిః

ఈ విధముగా మననశీలుడగు వ్యక్తి అనేకజన్మల కాలము ఆత్మని ష్ఠను కలిగియున్నప్పుడు, వానికి బ్రహ్మలోకము వరకు గల భోగముల న్నింటియందు వైరాగ్యము కలుగును.

మద్భక్తః ప్రతిబుద్ధార్ధో మత్ప్రసాదేన భూయసా

నిశ్శ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయమ్

 ప్రాప్నోతీహాంజసా ధీరస్వదృశా చ్ఛిన్నసంశయః

యద్దత్వా న నివర్తేత యోగీ లింగాద్వినిర్గమే

నా భక్తుడగు వివేకికి స్వరూపజ్ఞానము కలిగి సంశయములు తొల గిపోవును. వానికి నా గొప్ప అనుగ్రహముచే తత్త్వజ్ఞానము లభించును. ఆతనికి ఈ జన్మలోనే సాక్షాత్తుగా ప్రత్యగభిన్నమగు బ్రహ్మయే (నేనే) స్వరూపముగా గల కేవల (అద్వయ) భావమని ప్రసిద్ధిని గాంచిన నిరతిశ యానందరూపమగు జీవన్ముక్తి లభించును. ఆ జ్ఞాని లింగదేహము నశిం చిన తరువాత మరల తిరిగి జన్మించడు.

యదా న యోగోపచితాసు చేతో

మాయాసు సిద్ధస్య విషజ్జతేకంగ

అనన్య హేతుష్వథ మే గతిస్స్యా-

దాత్యంతికీ యత్ర న మృత్యుహాసః

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే సప్తవింశోధ్యాయః

అమ్మా! సిద్ధపురుషుని యెదుట యోగశక్తిచే పరిపుష్టము చేయబ డిన మాయామయములగు సిద్దులు ప్రకటమగును. వాటిని సాధించుటకు యోగము తప్ప మరియొక ఉపాయము లేదు. కాని, ఎప్పుడైతే ఆతడు వాటియందు ఆసక్తిని పొందడో, అప్పుడు ఆతడు పరమపురుషార్థమగు మోక్షమును పొంది సాలో విలీనమగును. అపుడాతనికి మృత్యుభయము శాశ్వతముగా నివారణ యగును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది.