శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
28 - పురంజనోపాఖ్యానము - అవిజ్ఞాత వైదర్భీ సంవాదము
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ బర్హిష్మత్ మహారాజా! భయుడని ప్రసిద్దిని గాంచిన ఆ యవనప్రభుని సైనికులు ఆయన ఆదేశ మును పాలించువారై, ప్రజ్వారునితో మరియు కాలకన్యతో గూడి, ఈ భూమండలమును సంచరించిరి.
ఓ మహారాజా! ఒకనాడు వారు పురంజనుని నగరమును వేగ ముగా ముట్టడించిరి. భూమండలములోని భోగములతో సంపన్నమై యున్న ఆ పురమును ముసలి పాము సంరక్షించుచుండెను.
కాలకన్య కూడ పురంజనుని పురమును బలాత్కారముగా ఆక్ర మించి భోగించెను. కాలకన్యచే ఆక్రమించబడిన వ్యక్తి వెంటనే సత్తువను పూర్తిగా కోల్పోవును.
కాలకన్య ఆ నగరమును ఆక్రమించి భోగించుచుండగా, యవ నులు అన్ని దిక్కులనుండియు ద్వారముల గుండా లోపల ప్రవేశించి, ఆ నగరమునంతనూ చాల తీవ్రమగు వినాశమునకు గురి చేసిరి.
కుటుంబమునకు యజమానియగు పురంజనునకు ఆ పురమునం దు, దానికి చెందిన వ్యక్తులయందు ఇది నాది, నా వారు అనే అభిమానము మెండు. ఆ కారణముగా, ఆ పురము తీవ్రముగా ముట్టడించబడినప్పుడు, ఆతడు చాల వ్యాకులతను చెందినవాడై పలువిధములగు దుఃఖములను పొందెను.
కాలకన్య కౌగిలికి చిక్కిన పురంజనుని అందమంతయు నశించే ను. దీనుడగు ఆతని మనస్సు ఇంకనూ విషయభోగములయందు లగ్నమై యుండెను. ఆతని వివేకము కూడ నశించెను. గంధర్వులు, యవనులు ఆతని సంపదను కొల్లగొట్టిరి.
పురంజనుని నగరము శిథిలమయ్యెను. ఆతని పుత్రులు, పౌత్రు లు, అనుచరులు, మంత్రులు పురంజనుని యెడల ఆదరమును చూపుట మానీ వ్యతిరేకులైరి. భార్యకు కూడ ఆయనపై ప్రేమ తొలగిపోయెను. పంచాలదేశము శత్రువులచే పాడు చేయబడెను. తాను కాలకన్యచే ఆక్ర మించబడి యుండెను. ఈ స్థితిని కనుగొనిన పురంజనునకు అంతము లేని దుఃఖము కలిగెను. దీనినుండి బయట పడే ఉపాయమేమియు ఆయనకు తోచలేదు.
కాలకన్య కారణముగా పురంజనునకు భోగ్యవస్తువులయందు సారము అనుభవమునకు వచ్చుట ఆగిపోయెను. అయిననూ, ఆతడు వాటినే కోరుచుండెను. ఆతడు పుణ్యమును చేయకప"గుటచే పుణ్యలోకప్రాప్తి లేదు. ఇహలోకములో పుత్రాదుల ప్రేమ కూడ ఆతనికి లభించుట లేదు. ఆతడు పుత్రులను భార్యను వారి ప్రేమ కొరకై బుజ్జగించుచుండెను.
పురంజనుని పురమును గంధర్వులు, యవనులు ఆక్రమించిరి. కాలకన్య ఆ పురమును భగ్నము చేసెను. కావుననే, ఆ రాజు ఇష్టము లేకున్ననూ, ఆ పురమును విడిచి పెట్టే ప్రయత్నమునారంభించెను.
భయుడని ప్రసిద్దిని గాంచిన యవనప్రభుని పెద్ద అన్నగారగు ప్రజ్వారుడు ఇంతలో ఆ నగరమునకు వచ్చెను. ఆతడు తన సోదరునకు ప్రియమును చేయగోరి ఆ పురమునకంతకూ నిప్పు పెట్టెను.
ఆ పురము తగులబడుచుండగా, కుటుంబమునందు ఆసక్తి గల పురంజనుడు పురజనులతో, సేవకులతో, పుత్రాదులతో గూడినవాడై భార్యతో బాటుగా చాల తాపముననుభవించెను.
కాలకన్య పురమును ఆక్రమించెను. యవనులు పురపాలకుడగు నాగుని ఇంటిని ముట్టడించిరి. ప్రజ్వారుడు కూడ ఆ నాగుని పీడించెను. అపుడా నాగు నిరంతరమగు తాపముననుభవించెను.
పెద్ద ఆపద వచ్చి పడిన కారణముగా అధికముగా వణుకుచున్న పురపాలకుడగు నాగము ఆ పురమును రక్షించలేక పోయేను. కావుననే, నిప్ప గల చెట్టు తొర్రవంటి ఆ పురమునుండి నిష్క్రమించవలెనని ఆ నాగము తలపోసెను.
ఓ మహారాజా! ఆ నాగముయొక్క అవయవములన్నియు శిథిల మయ్యెను. దాని పౌరుషమును, గంధర్వులు అపహరించిరి. అది పారిపోవు టకు యత్నించగా, శత్రువులగు యవనులు దానిని అడ్డుకొనిరి. అప్పుడది ఏడ్చెను.
గృహస్థుడగు పురంజనుడు దేహమునందు నేను అనే బుద్ది, దేహ మునకు సంబంధించిన ఇంటియందు నాది అనే బుద్దిని కలిగియుండెను. ఇట్టి తప్పు ధారణలు గల గృహస్థుడైన ఆ పురంజనుడు భార్యతోడి వియోగము సంప్రాప్తము కాగా, దీనుడయ్యెను. ఆతని వద్ద నాది అనదగ్గది ఇల్లు, ధనము, సామగ్రి కొద్దిగా మిగిలియుండెను. ఆతడు ఆ సమయములో ఆ మిగిలిన ఆస్తిని, కూతుళ్లను, కొడుకులను, మనుమలను, కోడళ్లను, అల్లుళ్లను, సేవకులను గురించి చింతిస్తూ గడిపెను.
నేను పరలోకమునకు వెళ్లిన తరువాత విగతభర్తృక, పెద్ద కుటుం బము గలది అగు ఈ నా భార్య పిల్లల గురించి దుఃఖిస్తూ రోజులను ఎట్లు గడుపగల్గునో?
నా భార్య పతివ్రత. నేను భోజనము చేయకపోతే ఆమె కూడ భోజనము చేయదు. నేను స్నానము చేయకపోతే, ఆమె కూడ స్నానము చేయదు. నేను కోపిస్తే ఆమె చాల భయపడును. నేను బెదిరించినప్పుడు ఆమె భయముతో మౌనమును వహించెడిది.
నేను పొరపాటు చేయబోవునంతలో ఈమె నన్ను హెచ్చరించెడిది. ఈమె వీరులగు పుత్రులను కన్నది. కాని, నేను పొరుగూరు వెళ్లినచో, వియోగదుఃఖముతో కృశించిపోవును. అట్టి ఈమె నేను మరణించిన పిదప ఇంటి వ్యవహారములను నడుపునా ?
ఈ నా పుత్రులకు, పుత్రికలకు నేను తప్ప మరియొక దిక్కు లేదు. నేను మరణించగా, దీనులైన వీరు సముద్రములో నావ భగ్నమైన యాత్రికులు వలె, జీవితమును ఎట్లు వెళ్లదీ సెదరో ?
ఈ విధముగా పురంజనుడు దీనమగు బుద్దితో శోకించుచుండెను. అది ఆయనకు కలుగవలసిన శోకము కాదు. ఇంతలో, ఆయనను పట్టుకో నుటకు భయుడు అని ప్రసిద్ధిని చెందిన యవనరోజు వచ్చి పడెను.
పురంజనుని యవనులు ఈ విధముగా పశువును వలె తన స్థాన మును గురించి తీసుకొని పోవుచుండగా, మిక్కిలి కలత చెందిన ఆతని అనుయాయులు దుఃఖిస్తూ ఆయన వెంట నడచిరి.
శత్రువులచే ముట్టడించబడిన పురపాలకుడగు నాగుడు పురమును విడిచి పెట్టి వెళ్లిపోయెను. ఆ వెనువెంటనే ఆ నగరము శిథిలమై చుట్టూ ఉండే ప్రకృతిలో కలిసిపోయెను.
బలవంతుడగు యవనుడు పురంజనుని బలాత్కారముగా లాగివే యుచుండెను. కాని, అజ్ఞానముచే కప్పివేయబడియున్న పురంజనుడు తనకు పూర్వములో హితమును చేసిన మిత్రుని (అవిజ్ఞాతుని) స్మరించలేక పోయెను.
పురంజనుడు క్రూరాత్ముడై యజ్ఞములో పశువులను సంహరించి యుండెను. ఆతని ఆ క్రూరత్వమును గుర్తు చేసుకొని, ఆ పశువులు వానిని గొడ్డళ్లతో నరికినవి.
పురంజనుడు అంతము లేని వ్యాప్తిగల అజ్ఞానమునందు మునిగి యున్నవాడగుటచే, భార్యయందలి ఆసక్తిచే వాని మనస్సు కలుషితము య్యెను. ఆతనికి స్మృతి కూడ నశించేను. ఆతడు చిరకాలము నిరంతర మగు దుఃఖముననుభవించేను. ఆతడు మనస్సులో భార్యను మాత్రమే ధ్యానించుటచే, ఆ దు:ఖానుభవము పూర్తి అయిన పిదప, రాజులలో ఉత్త ముడగు విదర్భ దేశాధిపతికి కుమార్తెయై జన్మించెను. ఆమె అతిశయించిన సౌందర్యము గలది.
పాండుదేశాధిపతియగు మలయధ్వజుడు శత్రువుల నగరములను జయించిన దిట్ట. ఆతడు రాజులను యుద్దములో జయించి, పరాక్రమమునే శుల్కముగా భావించే విదర్భరాజపుత్రికను వివాహమాడెను.
ఆతనికి ఆమెయందు నల్లని కన్నులు గల ఒక కుమార్తె, ఆ పిదప ఏడ్గురు కొడుకులు కలిగిరి. ఆ ఏడ్గురు ద్రవిడదేశమునందు రాజులైరి.
ఓ మహారాజా! వారికి ఒక్కోక్కనికి చాల సంతానము కలిగెను. వారి వంశమునందు జన్మించిన వారు మన్వంతరము పూర్తి అగునంతవరకు, ఆ తరువాత కూడ భూమిని పాలించగలరు.
మలయధ్వజుని పెద్ద కుమార్తె దృఢమగు ప్రతనిష్ఠ గలది. ఆమెను అగస్త్యమహర్షి వివాహమాడెను. వారికి దృడచ్యుత మహర్షి పుట్టెను. ఇద్మ వాహుడు దృడచ్యుతుని పుత్రుడు.
ఆ రాజర్షియగు మలయధ్వజుడు రాజ్యమును కొడుకులకు పంచి యిచ్చి, తాను శ్రీకృష్ణుని ఆరాధించే కోరికతో తమ వంశమునకు చెందిన మలయపర్వతమునకు వెళ్లాను.
విదర్భ రాజపుత్రి గొప్ప సుందరి, యువతియే అయిననూ, ఇంటిని పుత్రులను భోగములను విడిచి పెట్టి, వెన్నెల రాత్రికి ప్రభువగు చంద్రుని వెంట ఉండే విధముగా, పాండ్యమహారాజగు మలయధ్వజుని వెంట మలయపర్వతమునకు వెళ్లెను.
అచట చంద్రవశ, తామ్రపర్ణి, వడోదక అను మూడు నదులు గల వు. మలయధ్వజుడు వాటి పవిత్రములగు జలములలో ప్రతిదినము స్నాన మును చేయుచూ, దేహముయొక్క మాలిన్యమును మాత్రమే గాక, మనో మాలిన్యమును కూడ పోగొట్టుకొనుచుండెను.
దుంపలు, గింజలు, వ్రేళ్లు, పళ్లు, పుష్పములు, ఆకులను భుజి స్తూ, ఒకప్పుడు నీటిని మాత్రమే త్రాగి శరీరమును నిలబెట్టుకుంటూ, ఆతడు క్రమముగా శరీరమును కృశింపజేసే తపస్సును అనుష్టించెను.
సర్వమునందు ఈశ్వరుని దర్శించే ఆ మలయధ్వజుడు, శీతోష్ణ ములు వాతవర్షములు ఆకలిదప్పికలు ఇష్టానిష్టములు సుఖదుఃఖములు అనే ద్వంద్వములను సమచిత్తముతో జయించెను.
మలయధ్వజుడు తపస్సును ఉపాసనను చేసి, యమములను (సత్యము, అహింస, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము), నియమ ములను (శౌచము, తపస్సు, సంతోషము, స్వాధ్యాయము, ఈశ్వరప్రణిధా నము) పాటిస్తూ, తద్ద్వారా వాసనలను నిర్మూలించి, ప్రాణాయామమును, ప్రత్యాహారము (ఇంద్రియనిగ్రహము) ను, ధారణను, ధ్యానమును చేసి, మనస్సును పరబ్రహ్మయందు విలీనము (సమాధి) చేసెను.
ఆతడు ఒకే స్థానమునందు వంద దివ్యసంవత్సరములు బండరా యివలె నుండి తపస్సును చేసెడివాడు. ఆతడు వాసుదేవ భగవానుని యందు ప్రీతిని చేయుచూ, ఇతరమును తెలియకుండెను.
ఆత్మ దేహేంద్రియమనస్సంఘాతమునంతను వ్యాపించియు న్ననూ, ఈ సంఘాతముకంటే విలక్షణముగనే యున్నది. స్వప్నములో వలె జ్ఞాత, జ్ఞేయము రెండు ఆత్మ చైతన్యమునందు మాత్రమే ప్రకాశించుచున్నవి. ఆత్మను ఆ విధముగా అంతఃకరణవృత్తులకు సాక్షిగా తెలుసుకొని, ఆతడు సకలవ్యవహారములనుండియు విరమించెను.
ఓ మహారాజా! సాక్షాత్తు పరమగురువగు శ్రీహరి భగవానుడు ఆతని అంతఃకరణములో విశుద్ధమగు ఆత్మజ్ఞానము అనే దీపమును ప్రకాశింపజేసెను. ఆ జ్ఞానము ఆతని హృదయమునందు సర్వతోముఖముగా ప్రకాశించెను. దాని ప్రభావముచే ఆతడు పరబ్రహ్మ (దేశకాలవస్తుపరిచ్చేద ములకు అధిష్ఠాత) యందు ఆత్మను, ఆత్మ (దేశకాలవస్తుపరిచ్చేదములకు ద్రష్ట) యందు పరబ్రహ్మను దర్శించెను. దానితో ఆతని మనోవృత్తులు కూడ విలీనమయ్యెను. ఆతడు దేహమును విడిచి పెట్టెను.
విదర్భ రాజకుమారీ పతియే దైవముగా గల సాధ్వి. ఆమె భోగము లను విడనాడి, పరమధర్మాత్ముడైన తన భర్త మలయధ్వజుని ప్రేమతో సేవించెను.
వైదర్భి నారబట్టలను దాల్చి నియమనిష్ఠలను పాటించుటచే చిక్కి పోయెను. ఆమె జుట్టు జడలు కట్టెను. భర్త సమీపమునందు ఆమె చల్లారు చున్న అగ్నియందలి పొగ లేని జ్వాల వలె ప్రకాశించెను.
మలయధ్వజుడు మిక్కిలి స్థిరమగు ఆసనమునందుండియే మర ణించెను. ఆ కారణముచే తన ప్రియతముడగు భర్త మరణించినాడనే సంగతి ఆ వైదరికి తెలియలేదు. ఆమె పూర్వమునందు వలెనే ఆయన వద్దకు వెళ్లి సేవలను చేసెను.
ఆమెకు భర్త పాదములను పూజించుచుండగా, వేడి తగలలేదు. అప్పుడామె, గుంపునుండి విడిపోయిన లేడి వలె, హృదయములో చాల ఆందోళనను చెందెను.
తోడు ఎవ్వరైననూ లేని తన దైన్యమునకు ఆమే చాల వగచెను. దుఃఖము వలన ప్రవహించిన కన్నీటితో ఆమే స్తనములు అంతటా తడిసిపో యెను, ఆమె ఆ అడవిలో మధురమగు స్వరముతో గట్టిగా రోదించెను.
ఓ రాజర్షీ! లెమ్ము, లెమ్ము. సముద్రమే మొలనూలుగా గల ఈ భూదేవికి దోపిడీగాండ్ర వలన, అయోగ్యులగు క్షత్తియుల వలన భయము పెచ్చు మీరినది. ఈ భూమిని నీవే రక్షించవలసి యున్నది.
భర్తతో బాటుగా అడవికి వెళ్లిన ఆ సుందరి ఈ విధముగా దుఃఖిస్తూ, భర్త పాదములపై పడి ఏడుస్తూ, కన్నీటిని ప్రవహింప జేసెను.
ఆమె కట్టెలతో చితిని పేర్చి, భర్త దేహమును దానిపై తగులబెట్టె ను. ఆమె అప్పుడు ఏడుస్తూ, తాను కూడ భర్తతో బాటుగా మరణించుటకు నిశ్చయించుకొనెను.
ఓ మహారాజా! ఆమెకు చాల పూర్వమునందలి మిత్రుడొకడు ఆ సమయములో అచటికి వచ్చెను. ఆయన ఆత్మజ్ఞానియగు బ్రాహ్మణుడు. ఆయన ఏడ్చుచున్న ఆమెను చూచి, మనోహరమగు ప్రియవాక్యములతో ఓదారుస్తూ, ఇట్లు పలికెను.
నీవెవరివి? ఎవరి దానవు ? నీవీ వ్యక్తి కొరకు దుఃఖించుచున్నావు. పరుండియున్న ఈతడు ఎవడు? నేను పూర్వమునందు నీతో కలిసి తిరిగిన మిత్రుడను. నన్ను గుర్తు పట్టినావా?
ఓ మిత్రమా! నీకు అవిజ్ఞాతుడనే మిత్రుడు ఉండెడివాడు. ఆ సంగతి గుర్తుకు వచ్చినదా? ఆ మిత్రుడను నేనే. నీవు భూలోకమునందలి భోగములయందు ప్రీతి గలవాడవై, నన్ను విడిచి పెట్టి ఆ భోగములు లభించే స్థానమును వెదుక్కుంటూ వెళ్లియుంటివి.
ఓ శ్రేష్ట పురుషుడా! మిత్రులమగు మనమిద్దరము మానససరోవర ములో నివసించెడివారము. మనము వేయి సంవత్సరముల కాలములో ఏ నాడైననూ నివాసస్థానము లేకుండగనే గడిపితిమి.
ఓ బంధుడా! ఇంద్రియభోగములయందు ప్రీతి గల అట్టి నీవు నన్ను విడిచిపెట్టి వెళ్లితివి. నీవు భూమండలములో సంచరిస్తూ, ఒకానొక స్త్రీ నిర్మించబడిన నివాసస్థానమున కనుగొంటివి.
అయిదు ఉద్యానవనములు, తొమ్మిది ద్వారములు, మూడు ప్రాకారములు, అయిదు బజారులు గల ఆ నివాసస్థానమునందు ఒక కాపలాదారు, ఆర్గురు, వ్యాపారస్థులు ఉండెడివారు. అయిదు ద్రవ్యములతో నిర్మించబడిన ఆ స్థానమునకు ఒక యువతి ప్రభ్విగా ఉండెడిది.
ఓ పురనాయకా! దేహము అనే జీవుని నివాసస్థానమునకు శబ్ద రూపరసస్పర్శగంధములనే ఇంద్రియగోచరములగు అయిదు విషయములే ఉద్యానములుగా చిత్రించబడినవి. తొమ్మిది ఇంద్రియగోళకములే ద్వారములు. అగ్ని, నీరు, పృథివి అనునవి ప్రాకారములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అనే ఆరు ఇంద్రియములు వివిధ విషయ ములను సంగ్రహించే వ్యాపారస్థులుగా వర్ణించబడినారు.
క్రియలను చేసే అయిదు కర్మేంద్రియములే బజారులు. ఈ పురమును కట్టుటకు పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములే ద్రవ్యములుగా వినియోగించబడినవి. ఈ ద్రవ్యములు ఖర్చు అయ్యేవి కావు. మాయాశక్తికి అధీశ్వరుడు, పూర్ణచైతన్యస్వరూపుడు అగు పరమాత్మ ఈ పురములో ప్రవేశించి తనను తాను మరచిపోయినాడు.
ఓ పురనాయకా! ఆ పురములో నీవు బుద్ది అనే యువతితో తాదా త్మ్యమును చెందితివి. నీవు ఆమే మోహములో పడి రమిస్తూ, ఈశ్వరుని (ఆత్మస్వరూపమును) విస్మరించితివి. ఆ బుద్ధితోడి తాదాత్మ్యము వలననే నీకు దుఃఖపూర్ణమగు ఇట్టి దుర్ధశ సంప్రాప్తమైనది.
నీవు విదర్భరాజపుత్రికవు కావు. వీరుడగు ఈ మలయధ్వజుడు నీకు భర్త కాదు. పూర్వజన్మలో నిన్ను పురంజని తొమ్మిది ద్వారములు గల పురము (దేహము) లో బంధించినది. ఆ పురంజనికి నీవు భర్తవు కావు.
ఈ మాయను నేనే సృష్టించితిని. దానివలననే, నీవు పూర్వజ న్మలో పురంజనుడనే పురుషుడనని తలపోసితివి. ఈ జన్మలో సాధ్వియగు స్త్రీని అని తలపోయుచుంటివి. కాని, ఈ రెండు నీవు కాదు. మనమిద్ద రము హంసలము. నీవు మన యిద్దరి స్వరూపమును తెలుసుకొనుము.
ఓయీ! నేను నీవే. నీవు నాకంటే భిన్నముగా లేవు. నీవు నేనే. ఈ సత్యమును తెలుసుకొనుము. జ్ఞానుల దర్శనములో మన యిద్దరిలో తేడా లేశమైననూ ఏనాడైననూ లేదు.
పురుషునకు తన రూపము అద్దములో ఒక రకముగాను, ఇతరవ్య క్రియొక్క కంటిలో మరియొకవిధముగను కనబడును. అదే విధముగా ఒకే పరబ్రహ్మ సమష్టి ఉపాధిలో ఈశ్వరునిగను, వ్యష్టి ఉపాధిలో జీవునిగను కనబడుచున్నది. ఈ విధముగా, మన యిద్దరికి వాస్తవములో లేని భేదము మాయచే కానవచ్చుచున్నది.
ఈ విధముగా మానససరోవరనివాసియగు ఆ హంస (జీవుడు) ను మిత్రుడగు హంస (ఈశ్వరుడు) మేల్కొల్పగా, అది తన స్వరూప మును తెలుసుకొని ఆనందించెను. ఆ మిత్రుని వియోగము చేతనే దానికి స్వరూపజ్ఞానము మరుపునకు వచ్చెను. ఇపుడు అది మరల తన స్వరూప మును తెలుసుకొనగలిగేను.
ఓ ప్రాచీనబర్హిష మహారాజా! ఈ ఆత్మతత్త్వమును నేను కథారూ పముగా దాచి పెట్టి చెప్పితిని. ఏలయనగా, జగత్పాలకుడగు శ్రీహరి భగ వానునకు ఇట్టి పరోక్షకథమునందు ప్రీతి మెండు.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధమునందు పురంజనోపాఖ్యానములో అవిజ్ఞాత వైదర్భీ సంవాదమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.
