శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

13 - పృథూపాఖ్యానము - అంగ మహారాజురాజ్యమును విడిచి వెళ్లుట

సూత మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువుడు వైకుంఠధామమును అధిష్ఠించిన వృత్తాంతమును మైత్రేయుడు ఈ విధముగా వర్ణించి చెప్పెను. దానిని విన్న విదురునకు ఇంద్రియగోచరుడు కాని శ్రీహరి భగవానునిపై హృదయములో భక్తి గట్టిగా నాటుకొనెను. ఆయన మరల మైత్రేయుని ప్రశ్నించుటకు ఉపక్రమించేను.

విదురుడిట్లు పలికెను --- గొప్ప ప్రతనిష్ఠ గల ఓ మహర్షీ! ఆ ప్రచేతసులు ఎవరు? వారు ఎవరి సంతానము? వారు ఎవరి వంశములో జన్మించినారు? వారు సత్రయాగమును ఎక్కడ చేసినారు?

శ్రీహరిని దర్శించి కృతార్థుడైనవాడు, దేవతలచే మాత్రమే దర్శిం చబడేవాడు, భక్తులకు శ్రీహరిని దర్శించే ఉపాయమును బోధించువాడు అగు నారద మహర్షి భగవద్భక్తులలో గొప్పవాడని నేను తలచుచున్నాను. ఆయన శ్రీహరిని పూజించే విధానమును బోధించినాడు. ఆ పూజాపద్దతిద్వారా భక్తుడు శ్రీహరిని చేరుకొనవచ్చును.

స్వధర్మానుష్టానమే స్వభావముగా గల ప్రచేతసులు యజ్ఞేశ్వరు డగు శ్రీహరిని సత్రయాగమునందు ఆరాధించుచుండగా, భక్తశిఖామణి యగు నారదుడు అచట ధ్రువునకు మోక్షమునిచ్చిన శ్రీహరిని స్తుతించినాడు గదా!

ఓ మహర్షీ! ఆ సత్రయాగములో దేవర్షి నారదుడు చెప్పిన భగవా నుని గాథలను నేను వినగోరుచున్నాను. నీవు వాటిని పూర్తిగా నాకు చెప్ప తగుదువు.

ధ్రువుడు వానప్రస్థమునకు వెళ్లిన తరువాత ఆయన కుమారుడగు ఉత్కలునకు తండ్రిగారి చక్రవర్తి సింహాసనమునందు గాని, చక్రవర్తి సంపద లయందు గాని, కోరిక లేకుండెను.

ఆ ఉత్కలునకు పుట్టుకనుండియు మనస్సులో భోగేచ్చ గాని, సంసారాసక్తి గాని లేకుండెను. ఆతడు సర్వవ్యాపకమగు పరబ్రహ్మయందు నిష్ఠ కలిగియుండెను. సకలజగత్తు ఆత్మ చైతన్యమునందు మాత్రమే కనబ డుచున్నదనియు, ఈ విధముగా మనోవృత్తిప్రవాహరూపమగు జగత్తునం తనూ ఆత్మచైతన్యమే వ్యాపించి యున్నదనియు ఆతడు తెలుసుకొనెను.

నిరంతరమగు బ్రహ్మానుసంధానము అనే అగ్నిచే ఆ ఉత్కలుని అంతఃకరణములోని కర్మవాసనలన్నియు దగ్గ మైనవి. దుఃఖసంపర్కము గాని, భేదలేశము గాని లేని పరబ్రహ్మను ఆతడు ప్రత్యగాత్మకంటే అభిన్న ముగా తెలుసుకొనెను. ఆనందఘనమగు ఆ పరమాత్మ అఖండము మరియు ఏకరసము అగు జ్ఞానమే స్వరూపముగా గలది. సర్వము ఆ ఆత్మ చైతన్యమునందు మాత్రమే భాసించుటచే, అది సర్వమును వ్యాపిం చియుండును. అట్టి బ్రహ్మను తన స్వరూపముగా అనుసంధానము చేసే ఉత్కలునకు ఆ జీవన్ముక్తావస్థలో ఆత్మకంటే భిన్నముగా ఏదీ కానరాలేదు.

ఆయన దారిలో అజ్ఞానులకు మూర్ఖుడు వలె, గ్రుడ్డివాడు చెవిటి వాడు పిచ్చివాడు మూగవాడు వలె కనబడెడివాడు. కాని, ఆయన బుద్ధి వారి బుద్ధివంటిది కాదు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన జ్వాలలు చల్లారిన అగ్నిని పోలియుండెడివాడు.

ఆ ఉత్కలుడు మూర్ఖుడు మరియు పిచ్చివాడు అని తలచిన మంత్రులు, కుల పెద్దలు కలిసి ఆయన తమ్ముడు, భ్రమి పుత్రుడు అగు వత్సరుని రాజుగా చేసిరి. (కాలచక్రాధిష్ఠిత ధ్రువుడు; ఆయన పుత్రుడగు ఉత్కలుడు వాస్తవములో ఉతాలుడు, అనగా కాలమునకు అతీతుడగు బ్రహ్మజ్ఞాని; కాలచక్రముయొక్క భ్రమణమే భ్రమి; ఆమె పుత్రుడే వత్సరు డు, అనగా సంవత్సర పరిమాణము గల కాలఖండమునకు ప్రతీక)

వత్సరుని ప్రియభార్యయగు స్వర్వీథి (సూర్యుని మార్గము) పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు మరియు జయుడు అనే ఆరుగురు పుత్రులను (ఋతువులకు అధిష్టాన దేవతలు) కనెను.

పుష్పార్ణునకు ప్రభ, దోష అనే ఇద్దరు భార్యలు (పగలు, రాత్రి అనే కాలములకు అభిమాని దేవతలు) గలరు. వారిలో ప్రభకు ప్రాతః, మధ్యందినము, సాయము అనే కాలాభిమాన దేవతలు పుత్రులు అయిరి.

దోషకు ప్రదోషుడు (రాత్రి ఆరంభము), నిశీథుడు (మధ్యరాత్రి), వ్యుష్ణుడు (రాత్రి అంతమయ్యే వేళ) అనే ముగ్గురు పుత్రులు కలిగిరి. వ్యుష్టునకు పుష్కరిణి (సూర్యోదయమునకు ముందు వికసిస్తూ ఉండే పద్మముల సరస్సు) భార్య. వారికి సర్వతేజసుడు (రాత్రి అంతమునందు అంతటా కాంతి విస్తరిల్లుట) అనే కొడుకు కలిగెను.

ఆ సర్వతేజసుని భార్య ఆకూతి. వారి పుత్రుడే చాక్షుష మనువు. చాక్షుష మనువునకు నడ్వల అనే భార్యయందు దోషమునెరుంగని పన్నెండుమంది పుత్రులు కలిగిరి. పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, ప్రతుడు, అగ్నిష్టోముడు, అతీరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనునవి వారి పేర్లు.

ఉల్ముకునకు పుష్కరిణియందు అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే ఆరుగురు ఉత్తములగు కొడుకులు కలిగిరి.

అంగుని భార్య సునీథ. వారికి వేనుడు అనే కొడుకు కలిగెను. ఆతడు చాల భయంకరుడు, చెడు స్వభావము గలవాడు. ఆతని కారణముగా రాజర్షియగు ఆ అంగుడు విరక్తిని జెంది నగరమును విడిచి పెట్టి వెళ్లి పోయెను.

ఓ విదురా! మహర్షులకు పొక్కే వజ్రాయుధము. వారు కోపించి ఆ వేనుని శపించారట. అపుడు వేనుడు మరణించగా, మరల వారే వాని కుడి చేతిని మథించిరి.

వేనుడు మరణించినప్పుడు రాజు లేని కారణముగా దోపిడీ గాండ్రు జనులను దోచుకొనుట మొదలిడిరి. ఈ విధముగా జనులు దుఃఖ ముననుభవించుచుండగా, ఆ మహర్షులు మథనమును చేసినప్పుడు, పృథువు నారాయణుని అంశచే జన్మించెను. ఆయనయే మొట్టమొదటగా రాజ్యమును సువ్యవస్థితము చేసిన రాజు.

విదురుడిట్లు పలికెను --- అంగ మహారాజు చక్కటి శీలమునకు నిధి, పరోపకారి, వేదవేత్తల యెడల భక్తి గలవాడు, విశాలహృదయుడు. కాని, ఆయన సంతానము చెడు అయిన కారణముగా మనస్సు విరిగీ నగర మును విడిచి పెట్టి వెళ్లిపోయెను. అట్టి రాజునకు చెడు సంతానము కలుగు టకు కారణమేమి?

ధర్మమునందు నిష్ణాతులగు మహర్షులు ప్రజలను శాసించుటయే వ్రతముగా గల మహారాజు పై శాపము అనే శిక్షను ప్రయోగించుటకు కారణ మేమి? ఆ రాజు చేసిన పాపమేది?

ప్రజలను పాలించే రాజు ఒకచో తప్పు చేసిననూ, ప్రజలు ఆయ నను అవమానించరాదు. ఏలయనగా, రాజు తన ప్రభావముచే లోకపాల కుల శక్తిని ధరించియుండును.

ఓ మహర్షీ! సునీథాదేవి పుత్రుడగు వేనుని చేష్టలను గురించి నాకు చెప్పుము. నేను శ్రద్ధ గల భక్తుడను. నీవు భూతభవిష్యత్తులు తెలిసి నవారిలో అగ్రేసరుడవు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- రాజర్షియగు అంగుడు అశ్వ మేధము అనే గొప్ప యజ్ఞమును చేసెను. దానిలో వేదవేత్తలు ఆహ్వానించి ననూ, దేవతలు రాలేదు.

అప్పుడు ఆశ్చర్యపోయిన ఋత్విక్కులు యజమానియగు అంగునితో నిట్లనిరి  నీ ఈ యజ్ఞములో మేము హోమము చేసే హవిస్సులను దేవతలు స్వీకరించుట లేదు.

ఓ రాజా! నీ యజ్ఞములో మేము దోషములు లేని హవిస్సులను శ్రద్దగా సమర్పించితిమి. మేము ప్రతనిష్ఠను స్వీకరించి నిర్దుష్టముగా మంత్ర ములను ప్రయోగించితిమి. కావున, మా మంత్రముల సామర్థ్యము తగ్గిపోలేదు.

వైదికకర్మలలో ప్రధానమైనవారు దేవతలే. కాని, వారు ఈ యజ్ఞ ములో తమ తమ హవిర్భాగములను స్వీకరించుట లేదు. వారి యెడల జరిగిన అపరాధము మాకు లేశమైననూ కానవచ్చుట లేదు.

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- యజమానుడగు అంగుడు ఈ ఋత్విక్కుల మాటలను విని మనస్సులో చాల దుఃఖించెను. దేవతలు హవిర్భాగములను తీసుకొనకపోవుటకు కారణమేమి? అని సభాసదులను ప్రశ్నించుటకై ఆయన ఋత్విక్కుల అనుమతిని గోరెను. ఆయన వారి అనుమతితో మౌననియమమును విడిచి పెట్టి, ఇట్లు పలికెను.

ఈ యజ్ఞములో దేవతలను ఆహ్వానించినప్పుడు వారు వచ్చి సోమపాత్రలను గ్రహించుట లేదు. ఓ సభాసదులారా! నేను చేసిన అపరా ధమేమి? చెప్పడు.

ఓ మహారాజా! ఈ యజ్ఞమునందైతే నీ దోషము లేశమైననూ లేదు. కాని, పూర్వజన్మలో నీవు చేసిన దోషము ఒకటి గలదు. దాని వల ననే నీవీ జన్మలో ఈ తీరున సంతానము లేనివాడవైతివి.

ఓ మహారాజా! మేము చెప్పినట్లు చేయుము. అప్పుడు నీకు చక్కని సంతానము కలిగి - నీ కోరిక సిద్దించును. నీకు మంగళమగు గాక!యజ్ఞములో హవిర్భాగములను స్వీకరించేది శ్రీహరి భగవానుడే. నీవు ఆయనను పుత్రకామనతో యజ్ఞమును చేసి ఆరాధించుము. అప్పుడు ఆయన నీకు పుత్రుని అనుగ్రహించగలడు.

అట్లు సాక్షాత్తుగా యజ్ఞపురుషుడగు శ్రీహరిని సంతానము కోరి ఆహ్వానించినప్పుడు, దేవతలందరు తమ తమ హవిర్భాగములను స్వీకరించగలరు.

భక్తుడు ఏయే అభీష్టవస్తువులను కోరునో, శ్రీహరి వాటినే వానికి అనుగ్రహించును. భక్తులు శ్రీహరిని ఏ విధముగా ఆరాధించునో, వారికి ఫలము దానికి అనురూపముగనే కలుగును.

మహారాజునకు సంతానము కలుగుట కొరకై ఋత్విక్కులు ఈ విధముగా నిశ్చయించుకొనిరి. అపుడు వారు సకలప్రాణులలో అంతర్యా మియై ఉండే యజ్ఞేశ్వరుడగు శ్రీహరికి పురోడాశము (బియ్యపు పిండిని వేయించి నెయ్యి కలిపి చేసే ముద్ద) అనే హవిస్సును హోమము చేసిరి.

బంగరు మాలను, స్వచ్చమగు వస్త్రములను ధరించిన పురు షుడు ఒకడు ఆ అగ్నిహోత్రమునుండి ఉదయించేను. ఆయన చేతిలోని బంగరు పాత్రలో పక్వమైన పాయసము ఉండెను.

విశాలహృదయుడగు ఆ అంగ మహారాజు ఋత్విక్కుల అనుమ తితో ఆ పాయసమును దోసిలిలో తీసుకొని, తాను ఆఘ్రాణించి, ఆనంద ముతో కూడినవాడై, దానిని తన భార్యకు ఇచ్చెను.

సంతానము లేని ఆ సునీథాదేవి పుత్రసంతానమును కలిగించే ఆ పాయసమును చాల ఆదరముతో స్వీకరించి, భర్త వలన గర్భమును దాల్చేను. ఆమె ప్రసవకాలము రాగానే పుత్రుని కనెను.

ఆ పిల్లవాడు చిన్న వయసునుండియు తల్లికి తండ్రియగు మృత్యు. వును అన్ని వేళలా అనుసరించి ఉంటూ పెరిగెను. ఆ కారణముగా ఆతడు అధర్మప్రియుడు ఆయెను. సునీథ తండ్రి మృత్యువు.

ఆతడు అడవికి వేటకై వెళ్లి, కిరాతుని వలె విల్లును ఎక్కు పెట్టి దీన ముగానుండే సాధుజంతువులను (లేళ్లను) చం పెడివాడు. ఆతనిని చూచి జనులు, వీడు వేనుడు (పీడను కలిగించువాడు) వచ్చుచున్నాడు అని ఆక్రోశించెడివారు.

వేనుడు మిక్కిలి క్రూరుడు, దయ లేనివాడు. ఆతడు ఆటల మైదా నములో ఆటలాడుచున్న సమానవయస్కులగు పిల్లలను బలాత్కారముగా గొడ్డును బాదినట్లు బాదెను.

అంగ మహారాజు తన పుత్రుడు చాల చెడ్డవాడని గమనించి, ఆతనికి అనేకశిక్షలను వేసి అదుపులో పెట్టుటకు ప్రయత్నించాను. కాని, ప్రయోజనము లేకపోవుటచే, ఆయన మనస్సులో చాల దుఃఖమును పొందెను.

సంతానము లేని గృహస్థులు, చెడు సంతానము కలిగించే భరించ శక్యము కాని దుఃఖమును పొందని గృహస్థులు ఆ దేవుని అధికముగా చక్కగా ఆరాధించి యుందురు.

చెడు సంతానము వలన తల్లిదండ్రులకు చెడ్డ పేరు, అధర్మము, అందరితో విరోధము, మరియు అంతము లేని మనోవ్యథ కలుగును.

చెడు సంతానము వలన తల్లిదండ్రులకు ఇల్లు దుఃఖనిలయమగు ను. అట్టి సంతానము పేరుకు సంతానమే గాని, వాస్తవములో వారు తల్లి దండ్రులకు మోహము అనే బంధము మాత్రమే. వివేకియైనవాడు ఎవడు అట్టి సంతానమును ఆదరించును?

ఇంకో రకంగా ఆలోచిస్తే, మంచి సంతానము కంటే చెడు సంతా నమే మేలు. మంచి సంతానము వలన వియోగాది దుఃఖములు తప్పవు. కాని, చెడు సంతానము వలన, ఇల్లు అజ్ఞానము మొదలగు చిత్తమలములకు (దుఃఖములకు) నిధానము అని గుర్తించిన మానవునకు విరక్తిని చెందే అవకాశము లభించును.

ఈ విధముగా అంగ మహారాజు మనస్సులో విరక్తిని చెందియుం డెను. ఆయనకు నిద్ర పట్టలేదు. ఆయన అర్ధరాత్రమునందు లేచి, జనులకు కనబడకుండా, గాఢముగా నిద్రించుచున్న వేనుని తల్లియగు సునీథను విడి చిపెట్టి, గొప్ప సంపదలకు నిలయమగు తన ఇంటినుండి వెళ్లిపోయెను.

పురోహితుడు, మంత్రులు, మిత్రగణములు, జనులు అందరు రాజు విరక్తిని చెంది వెళ్లిపోయినాడని తెలిసి అధికమగు దుఃఖముతో విహ్వ లులైరి. వారు దేశమంతటా రాజును వెదికించిరి. దొంగ. యోగులకు తమ హృదయములోనే దాగియున్న ఈశ్వరుడు బయట ఎక్కడా కానరాని విధ ముగా, వారికి ఆ రాజు ఆ నగరములోనే ఉన్నా కానరాలేదు.

వారికి ప్రజాపాలకుడగు రాజుయొక్క జాడ తెలియరాలేదు. ఆ విధముగా వారి ప్రయత్నము వ్యర్థమయ్యెను. అపుడు వారు నగరమునకు తిరిగి వచ్చి, అక్కడ సమావేశమైయున్న మహర్షులకు నమస్కరించి, కన్నీటితో రాజు కనబడ లేదని విన్నవించిరి.

 శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధముల పృథూపాఖ్యానములో అంగ మహారాజు రాజ్యమును విడిచి వెళ్లుట అనే పదమూడవ అధ్యాయము ముగిసినది.