శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము

Table of Contents

25 - పురంజనోపాఖ్యానము - పురంజనీ పురంజనుల సమాగమము

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- శివ భగవానుడు బర్హిషత్ మహారాజుయొక్క పుత్రులగు ఆ ప్రచేతసులకు ఈ విధముగా ఉపదేశించి, వారు చూచుచుండగనే అప్పుడే అక్కడనే అంతర్ధానమాయెను.

రుద్రునిచే కీర్తించబడిన శ్రీహరి భగవానుని స్తోత్రమును ఆ ప్రచేత సులందరు జపిస్తూ పదివేల సంవత్సరములు నీటిలో ఉండి తపస్సును చేసిరి.

ఓ విదురా! బర్హిషత్ మహారాజు కర్మలలో నిమగ్నమైన మనస్సు గలవాడై యుండగా, ఆత్మతత్త్వము తెలిసిన దయామయుడగు నారదుడు ఆతనికి (ఉపదేశించి) మేల్కొలి పెను.

ఓ రాజా! నీవు కర్మమార్గముచే ఎట్టి శ్రేయస్సును సంపాదించ గోరుచున్నావు? దుఃఖము తొలగుట, సుఖము లభించుట అనే రెండు కలిసి శ్రేయస్సు అగును. కర్మమార్గములో ఇట్టి శ్రేయస్సు పూర్ణముగా లభించునని విద్వాంసులు అంగీకరించుట లేదు.

బరిషత్ మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహాత్మా! నా బుద్ధి కర్మలచే చెల్లాచెదరుగా నున్నది. కావుననే, సర్వోత్తమమగు మోక్షమును ఓరించి నాకు తెలియకున్నది. నాకు మీరు దోషరహితమగు జ్ఞానమునుప దేశించి, అజ్ఞానమును పోగొట్టి, కర్మలనుండి విముక్తిని కలిగించుడు.

గృహస్థుడు తన సంతానము భార్య ధనము అనునవియే పురుషా ర్థములనే భావనలో వ్యామోహితుడై యుండును. అట్టివాడు సంసార మును స్థిరము చేసే వ్యర్థములగు కామ్యకర్మలను అనుష్ఠిస్తూ సంసార ములో పరిభ్రమించును. వానికి మోక్షము లభించదు.

ఓ ప్రజాపతీ! మహారాజా! నీవు విర్దయగా యజ్ఞములో పశువులను, ఇతరప్రాణుల సమూహములను వేల సంఖ్యలో సంహరించితివి. వాటిని గుర్తుకు తెచ్చుకొనుము.

ఈ పశువులు నీవు పెట్టిన పీడను గుర్తు చేసుకుంటూ నీ మర ణము కొరకు ఎదురు చూచుచున్నవి. అవి పైకి తన్నుకు వచ్చిన కోపము గలవియై నిన్ను ఇనుప కొమ్ములతో చీల్చి చెండాడును.

ఈ సందర్భములో నీకు ప్రాచీనమగు పురంజనుని వృత్తాంత మును చేప్పెదను. దీనిని నేను చెప్పుచుండగా సావధానుడవై తెలియుము.

ఓ రాజా! పురంజనుడు అనే పేరుతో ప్రసిద్దిని గాంచి గొప్ప కీర్తిని పొందిన రాజు ఉండెను. ఆయనకు అవిజ్ఞాతుడు (తెలియబడని పేరు గల వాడు) అనే మిత్రుడు ఒకడు ఉండెను. ఆ మిత్రుని చేష్టలు ఎవ్వరికైననూ . తెలియకుండెను.

ఆ పురంజన మహారాజు నివాసస్థానము కొరకై వెదుకుతూ భూలో కమంతయు తిరిగెను. కాని ఆతనికి తగిన నివాసస్థానము లభించలేదు. అప్పుడాతని మనస్సు వికలమయ్యెను.

భూలోకములో ఎన్నో నగరములు గలవు. కాని, అనేకములగు కామనలు గల ఈ రాజునకు. తాను కోరే భోగ్యవస్తువులను పొందుటకై వాటిలో ఏ ఒక్కటియైననూ నచ్చలేదు.

తరువాత ఒకనాడు ఆయన హిమవత్పర్వతముయొక్క దక్షిణది క్కునందు కొండచరియలపై ఒక నగరమును చూచెను. తొమ్మిది ద్వార ములు గల ఆ నగరము అన్ని మంచి లక్షణములతో రమ్యముగానుండెను.

ఆ నగరము ప్రాకారములతో ఉద్యానవనములతో బురుజులతో కందకముతో శోభిల్లెను. దానిలోని శిఖరములవంటి భవనములు బంగా రము వెండి ఇనుములతో, నిర్మించబడెను. బహిర్ధ్వారములతో శోభిల్లే ఆ నగరములో కిటికీలతో కూడిన ఇళ్లు కిటకిటలాడుచుండెను.

ఆ నగరములోని ప్రాసాదములలో నేలలపై ఇంద్రనీలములు, స్పటికములు, వైడూర్యములు, ముత్యములు, పచ్చలు మరియు కెంపులు పొదగబడినవి. ఈ విధముగా ఆ నగరము సంపదల శోభతో భోగవతీ నగర మువలే వెలిగిపోవుచుండెను.

సభలు, కూడళ్లు, రాజ (రథ) మార్గములు, ఆటపాటల భవనము లు, అంగళ్లు, విశ్రాంతిగృహములు, పగడపు రచ్చబండలతో ఆ పురము ప్రకాశించెను. అచటి ప్రాసాదములపై జెండాకర్రలయందు పతాకములు రెపరెపలాడుచుండెను.

ఆ నగరమునకు బయట ఒక ఉద్యానవనము గలదు. అది మనో హరములగు చెట్లతో మరియు లతలతో వ్యాపించబడియున్నది. దానిలోని సరస్సులు కూసే పక్షులతో మరియు తుమ్మెదల గుంపులతో కోలాహల ముగా నున్నవి. ఆ సరస్సుల తీరమునందలి దట్టని చెట్లు చిగుళ్లతో, పుష్ప గుచ్చములతో శోభిల్లెను. ఆ పువ్వులపై కొండకాలువల చల్లని నీటి తుంప రలు నిండియుండెను. వాటి పైనుండి వీచే గాలీ చిగుళ్లతో కూడిన కొమ్మ లను కదల్చుచుండెను. ఈ విధముగా ఆ స్థానము గొప్పగా ప్రకాశించెను. ఆ ఉద్యానవనమునందు మహర్షుల వలె అహింసావ్రతమును పాటించే పలురకముల అడవి జంతువులు గుంపులుగా తిరుగుచున్ననూ, వాటి వలన జనులకు ఉపద్రవము కలుగుట లేదు. అక్కడ కోకిలలు తమ కూతలతో బాటసారులను ఆహ్వానించుచున్నవా యన్నట్లుండెను.

మత్తును కలిగించే సౌందర్యము గల ఒక యువతి అచటకు అను కోకుండా వచ్చెను. ఆమెతోబాటు పదిమంది సేవకులు నడచుచుండిరి. వారు ఒక్కొక్కరు వందమంది సేవికలపై ఆధిపత్యము గలవారు. ఆమెను ఆ రాజు చూచెను.

అనేకరకములుగా సింగారించుకొనే ఆ యువతికి అయిదు పడగల పాము ద్వారపాలకుడుగా ఉండి ఆమెను అన్ని విధములుగా అన్ని వైపుల నుండియు రక్షించుచుండెను. అమాయకురాలు, నూతన యౌవనములో ఉన్నది అగు ఆమె భర్త కొరకు అన్వేషించుచుండెను.

ఆ కన్య చక్కని ముక్కుతో, అందమైన దంతములతో, చక్కని చెక్కిళ్లతో అందమైన ముఖమును కలిగియుండెను. ఆమె చెవులు సమాన ముగా అమరియుండెను. ఆ చెవులకు కుండలములు శోభిల్లుచుండెను.

శ్యామల వర్ణము గల ఆ యువతి నడుమునకు పచ్చని చీరను దాల్చెను. చక్కని కటిభాగము గల ఆమె బంగరు మొలనూలును కలిగి యుండెను. ఆమె దేవతవలె నడచుచుండగా కాలి అందెలు గణగణలాడు చుండెను.

సమానముగా వర్తులముగా అంతరము లేకుండానున్న ఆమె స్తవ ములు. కొత్తగా ఆరంభమైన వనమును ప్రకటించుచున్నవి. ఆ గజగ మన సిగ్గుచే చీరకొంగుతో నిండా కప్పుకొనెను.

ఆమె ప్రేమతో పైకీ సాగి వంకర తిరిగిన కనుబొమలే ధనస్సు కాగా, ప్రేమతో నిండిన కడగంటి చూపులే బాణపు కొన భాగా, ఆతనిని కొట్టెను (అనగా, ప్రేమతో ఆతనిని క్రీగంట చూచెను). అపుడు వీరుడగు ఆ పురంజనుడు, సిగ్గుతో కూడిన చిరునవ్వుతో ఇనుమడించిన శోభ గల ఆమెతో మధురముగా నిట్లనెను.

పద్మపు రేకులవంటి కన్నులు గల ఓ సుందరీ! నీవేవతవు? ఎవరి దానవు? ఇచటకు ఎక్కడనుండి వచ్చితివి? భయపడుతున్న ఓ సాధ్వీ! ఈ నగరబాహ్యప్రదేశములో నీవేమి చేయగోరుచున్నావు? నాకు చెప్పుము.

అందమైన కనుబొమలు గల ఓ సుందరీ! పదిమంది భటులు, వారి గొప్ప నాయకుడు నీకు అనుచరులై ఉన్నారు. వీరెవరు? ఈ యువ తులు ఎవరు? నీ ముందు నడచుచున్న ఈ పాము ఏమిటి?

నీవు మహర్షివలె అడవిలో ఏకాంతమునందు ప్రతనిష్టను పాటిస్తూ భర్తయగు ధర్ముని వెదుకుచున్న ప్రీదేవివా? నీవు తన పాదములను సేవించుటచేతనే నీ భర్త సకలకామనలను బడయును సుమా! లేక భర్త యగు శివుని వెదుకుచున్న పార్వతివా? లేక, భర్తయగు బ్రహ్మను వెదుకు చున్న సరస్వతివా? లేక, భర్తయగు శ్రీహరిని వెదుకుచున్న లక్ష్మీదేవివా?

నీవు లక్ష్మీదేవివైనచో, నీవు విలాసము కొరకు చేతికొనయందు పట్టుకొని పద్మపు మొగ్గ ఎక్కడ జారిపోయినది?

ఓ సుందరీ! నీవు నేలను పాదములతో తాకుచున్నావు గాన, ఈ దేవతామూర్తులలో ఒకతెవు కావు. వీరులలో శ్రేష్ఠుడనగు నేను గొప్ప కార్యములను చేయగల దక్షుడను. నీవు అట్టి నాతో కలిసి, లక్ష్మీదేవి యః పురుషుడగు శ్రీహరితో గూడి వైకుంఠమునకు వలె, ఈ నగరమునక శోభను కలిగించుము.

ఓ సుందరీ! నీవు నీ కడగంటి చూపు నా మనస్సును మోహింప జేసితివి. నీవు సిగ్గుతో ప్రేమపూర్వకముగా చిరునవ్వుతో కనుబొమలను విరిచి చూడగా, దానిచే ప్రేరితుడైన ఈ పూజ్యుడగు మన్మథుడు నన్ను మిక్కిలి పీడించుచున్నాడు. కావున, నీవు నన్ను అనుగ్రహించుము.

స్వచ్చమగు చిరునగవు గలదానా! అందమైన కనుబొమలు, అందమైన నల్లగ్రుడ్లు గల కన్నులు, మధురమగు వచనములు గల ముఖము, నీవు సిగ్గుచే వంచియుండుటచే నాకు కానరాకున్నది. నల్లని ముంగురుల గుంపు పొడవుగా వ్రేలాడుతూ ముఖమును కప్పివేయుచున్నది. అట్టి నీ ముఖమును పైకెత్తి నా ముఖములోనికి చూడుము.

శ్రీనారద మహర్షి ఇట్లు పలికెను --- వీరుడవగు ఓ బర్హిషత్ మహా రాజా! ఈ విధముగా వీరుడగు ఆ పురంజనుడు ధైర్యమును కోల్పోయిన వాని వలె ఆమెను కోరెను. వీరుని సౌందర్యమునకు ఆమె కూడ మోహమును పొందెను. అపుడామె నవ్వుతూ ఆతనిని అభినందించెను.

ఓ పురుషశ్రేష్ఠా! నాకు గాని, నా అనుయాయులకు గాని జన్మని చ్చినవారు యెవరు? మా గోత్రములెయ్యవి? మా పేర్లు ఏమి? ఈ విష యములేమియు మాకెవ్వరికీ సరిగా తెలియదు.

ఓ వీరా! నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని మాత్రమే నాకు తెలియును. అంతకు మించి, నాకు నివాసస్థానమగు ఈ నగరమును నిర్మించినదెవరో నాకు తెలియదు.

మర్యాదనిచ్చువాడా! ఈ పురుషులు నాకు మిత్రులు. ఈ స్త్రీలు నా చెలికత్తెలు. నేను నిద్రించునప్పుడు ఈ సర్పము ఈ నగరమును రక్షిస్తూ తెలివిగా నుండును.

శత్రువులను దండించే ఓ వీరా! నా భాగ్యముచే నీవు విచ్చేసితివి. నీకు మంగళమగు గాక! నీవు ఇంద్రియభోగములను కోరుచున్నావు. నేను నా బంధువులతో గూడి నీకు వాటిని సమకూర్చేదను.

ఓ ప్రభూ! నేను సమకూర్చే అభీష్టములగు భోగములననుభ విస్తూ, వంద సంవత్సరములు ఈ తొమ్మిది ద్వారముల నగరమునకు అధి పతివై ఉండుము.

నిన్ను కాదని నేను మరియొకనిని ఎవనిని రమింప జేసెదను? ఇతరులు ప్రేమను ఎరుగరు. వారికి యుక్తాయుక్తవివేకము ఉండదు. కావు ననే, వారు పరలోకమును గురించి ఆలోచించరు. రేపటి గురించి చింత చేయని అట్టి అజ్ఞానులు పశువులవంటి వారు.

గృహస్థాశ్రమములో ధర్మార్థకామములు, పుత్రసుఖము, కీర్తి గల వు. దానివలన వ్యక్తికి శోకము లేని శుద్దములగు పుణ్యలోకములు లభించు ను. నైష్ఠిక బ్రహ్మచారులు, యతులు మొదలగు ఏకాకులకు ఈ ఫలములు ఊహకైననూ అందవు.

ఈ సంసారములో గృహస్థాశ్రమమనేది పితృదేవతలకు, దేవతల కు, ఋషులకు, మానవులకు, సర్వప్రాణులకు మరియు వ్యక్తికి కూడ క్షేమ దాయకమైన ఆశ్రయమని పెద్దలు చెప్పుచున్నారు.

ఓ వీరుడా! నీవు ప్రఖ్యాతిని గాంచినవాడవు, ఉదారుడవు. నిన్ను చూచుట తోడనే ప్రీతి కలుగును. అట్టి ప్రియుడవు నీవు స్వయముగా నాకు లభించితివి. నీవంటి భర్తను నావంటి సుందరి ఎవతే వరించకుండును?

గొప్ప భుజములు గలవాడా! పాము పడగలవంటి నీ భుజమ లపై భూలోకములోని ఏ స్త్రీకి మనస్సులో ప్రేమ కలుగకుండును? నీవ దయాపూర్వకమైన చిరునవ్వుతో గూడిన చూపుతో అనేకులగు అనాథుల మనోవ్యాధిని పూర్తిగా నివారించుటకై లోకములో సంచరించుచున్నావు.

నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఈ విధముగి ఆ యువతీయువకులు ఆ ఉద్యానవనములో పరస్పరము ప్రేమను కలి! యుండుటకు ప్రతిజ్ఞలను చేసిరి. తరువాత వారా నగరములో ప్రవేశిం వంద సంవత్సరములు నిరంతరముగా ఆనందముననుభవించిరి.

ఆ రాజును ఆయా స్థానములలో పాటగాళ్లు మనోహరముగా కీర్తిం చుచుండిరి. వేసవిలో ఆయన యువతులతో చుట్టువారబడి సరస్సులో జల కములాడేను.

ఆ పురములో ఏ ప్రభువు నివసించినా, ఆ ప్రభువు వేర్వేరు స్థాన ములకు వెళ్లుట కొరకై దానియందు పైన ఏడు, క్రింద రెండు. ద్వారములు నిర్మించబడినవి.

ఓ రాజా! అయిదు ద్వారములు తూర్పునందు, ఒకటి దక్షిణము నందు, ఒకటి ఉత్తరమునందు, రెండు పడమరయందు గలవు. వాటి పేర్లను కూడ నీకు చెప్పెదను.

ఖద్యోతము, ఆవిర్ముఖి అనే రెండు ద్వారములు తూర్పునందు ఒకే చోట నిర్మించబడినవి. పురంజనుడు తన మిత్రుడగు ద్యుమంతునితో గూడి ఆ ద్వారముల గుండా విభ్రాజితమనే దేశమునకు వెళ్లెడివాడు.

తూర్పునందు ఒకే చోట నలిని, నాలిని అనే రెండు ద్వారములు నిర్మించబడినవి. పురంజనుడు తన మిత్రుడగు అవధూతునితో గూడి ఆ ద్వారముల గుండా సౌరభమనే దేశమునకు వెళ్లుచుండును.

తూర్పునందు ముఖ్య అని ప్రసిద్ది గాంచిన ద్వారము గలదు. నగరప్రభువగు పురంజనుడు రసజ్ఞునితో గూడి బహూదన దేశమునకు, విపణునితో గూడి ఆపణ దేశమునకు ఆ ద్వారము గుండా వెళ్లును.

ఓ బర్షిషత్ మహారాజా! ఆ పురముయొక్క దక్షిణదిక్కునందు పితృహూ అనే ద్వారము గలదు. పురంజనుడు శ్రుతధరునితో గూడి ఆ ద్వారము గుండా దక్షిణపంచాల దేశమునకు వెళ్లును.

ఆ నగరమునకు ఉత్తరమునందు దేవహూ అనే ద్వారము గలదు. పురంజనుడు శ్రుతధరునితో గూడి ఆ ద్వారము గుండా ఉత్తరపంచాల దేశ మునకు వెళ్లును.

పురంజనుడు దుర్మదునితో గూడి ఆసురి అనే పశ్చిమద్వారము గుండా గ్రామకదేశమునకు వెళ్లును.

పడమర దిక్కునందలి నిరృతి అనే ద్వారము గుండా పురంజ నుడు లుబ్ధకునితో గూడి వైశసదేశమునకు వెళ్లును.

ఈ నగరముయొక్క పౌరులలో నిర్వాక్కు పేశస్కృతుడు అనే ఇద్దరు గ్రుడ్డివారు గలరు. పురంజనుడు కళ్లుగల అనేకులకు ప్రభువు అయి నప్పటికీ, వారిలో ఒకని సాయముతో నడచును; మరియొకని సాయముతో పనులను చేయును.

ఈ పురంజనుడు విషూచీనుడనే సేవకునితో గూడి అంతఃపురము నకు వెళ్లును. అపుడాతడు తన భార్య, పిల్లల వలన మోహమును గాని, మనఃప్రసన్నతను గాని, లేక హర్షమును గాని పొందుచుండును.

ఈ విధముగా పురంజనుడు అవివేకియై కోరికలకు బానిసయై దైవవంచితుడై, భార్య ఏయే పనులను చేస్తే, అవే పనులను ఆమెను అనుకరిస్తూ చేసెడివాడు. ఈ విధముగా ఆతడు కర్మబంధమునందు చిక్కుకొని యుండెను.

ఆమె ఒకప్పుడు మద్యమును త్రాగగా, ఈతడు కూడ మద్య మును త్రాగి మత్తుచే పరవశుడగును. ఆమె తినే సమయములో ఈతడు కూడ తినును. ఆమె ఏదేని అల్పాహారమును నమలుచున్నచో, ఆమెతో బాటు ఈతడు కూడ నమలును.

ఆమె పాట పాడినప్పుడు ఈతడు కూడ ఆమెననుసరించి పాట పాడును; ఆమె ఏడ్చినచో, ఈతడు ఏడ్చును; ఆమె నవ్వినచో, నవ్వును; ఆమె వాగినచో, వాగును.


ఆమె పరుగెత్తినచో, ఈతడు కూడ ఆమెను అనుకరిస్తూ పరుగెత్తును; అమె నిలబడినచో, ఈతడు నిలబడును; ఆమె పరున్నచో, ఈతడు పరుండును; ఆమె కూర్చున్నచో, ఆమెవెంట ఈతడు కూడ కూర్చుండును.

ఆమె దేనిని వినునో, ఈతడు కూడ దానినే ఆమె వెంట వినును; ఆమె దేనిని చూచునో, దానిని ఈతడు అదే సమయములో చూచును; ఆమె దేనిని ఆఘ్రాణించునో, దానినే ఆఘ్రాణించును; ఆమె దేనిని ముట్టు కొనునో, ఆమె వెంట ఈతడు దానినే ముట్టుకొనును.

ఒకప్పుడు తన భార్య దుఃఖించుచున్నచో, ఈతడు కూడ దీనుని వలె దుఃఖించును. ఆమె కేరింతలు కొట్టుచున్నచో, ఈతడు కూడ కేరిం తాలు కొట్టును. ఆమె ప్రసన్నముగా నున్నచో, ఈతడు కూడ అటులనే యుండును.

ఈ విధముగా అజ్ఞానియగు పురంజనుడు పురంజనిచే అధిక ముగా మోహింపజేయబడెను. ఆతడు తన యథార్థస్వరూపమగు అసం గత మొదలగు లక్షణములనుండి పూర్తిగా జారిపోయెను. ఆతడు పరవశుడై యుండుటచే ఇచ్ఛ లేకున్ననూ, పెంపుడు కోతివలే ఆమెను అనుక రించెడివాడు.

శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో పురంజనోపాఖ్యానములో పురంజనుడు పురంజనితో సమావేశమగుటను వర్ణించే ఇరువది ఐదవ అధ్యాయము ముగిసినది.