శ్రీ మద్భాగవతము - చతుర్థ (4వ) స్కందము
8 - ధ్రువోపాఖ్యానము - ధ్రువుడు అడవికి వెళ్లి కఠోరమగు తపస్సును చేయుట
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు, నారదుడు, ఋభువు, హంసుడు, అరుణి మరియు యతి అనే బ్రహ్మగారి పుత్రులు గృహస్థాశ్రమమును స్వీకరించ కుండగా నైష్ఠిక బ్రహ్మచారులుగనే ఉండిపోయిరి.
కామక్రోధములు మొదలగు అంతశ్శత్రువులను దునుమాడిన ఓ విదురా! ధర్ముని వలె, అధర్ముడు కూడ బ్రహ్మగారి పుత్రుడే. అధర్మునకు మృష అనే భార్య ఉండెను. వారికి దంభుడు అనే కుర్రవాడు, మాయ అనే అమ్మాయి కలిగిరి. వారిద్దరినీ సంతానము లేని నిరృతి తీసుకువెళ్లెను.
అధర్మమునకు అసత్యము తోడుగానుండును. ఆ కలయికనుండి డాంబికము, కపటము ఉదయించును. ఆ లక్షణములను స్వీకరించువాడే రాక్షసుడు. వాని నివాసమే నరకము.
ఓ విదురా! నీవు గొప్ప. బుద్ధిశాలివి. ఆ దంభునకు, మాయకు లోభుడు అనే కుమారుడు, నికృతి అనే అమ్మాయి కలిగిరి. వారికి క్రోధుడు అనే కుర్రవాడు, హింస అనే అమ్మాయి కలిగిరి. వారికి, కలి అనే కుర్రవాడు, దురుప్తి అనే అమ్మా యి కలిగిరి.
డాంబికమునకు కపటము తోడైతే లోభము పుట్టును. డాంబికులు కపటోపాయములతో ప్రజల ధనమును దోచెదరు. వారా ప్రయత్నములో ఇతరులకు రహస్యముగా అపకారము (నికృతి) ను చేయుదురు. లోభమును అంటి పెట్టుకొని కోపము ఉండును. లోభము ఫలించనప్పుడు అది వెంటనే బయట పడును. కోపమునుండి కలహము, తిట్టుకొనుట అను నవి ఉదయించును.
ఓ మహాత్మా విదురా! కలికి దురుప్తియందు భీ అనే అమ్మాయి, మృత్యువు అనే కుమారుడు కలిగిరి. వారిద్దరికి యాతన అనే అమ్మాయి, నిరయుడు అనే కుమారుడు కలిగిరి.
కలహములో తిట్లను ప్రయోగించినప్పుడు ఎదుటివాడు పగ తీర్చుకొనునేమో అనే భయము తప్పదు. ఆ భయము వేంట, ఎదుటివాడు పగ తీర్చుకున్నచో, మరణమే కలుగవచ్చును. కలహములు తిట్లకు మాత్రమే గాక, భయ హేతువులై హత్యలకు దారి తీయుట లోకప్రసిద్దము. తిట్లు, హత్యలు ఉన్నప్పుడు నరకము (కారాగారము), యాతనలు వాటిని వెంటనంటి యుండును.
పుణ్యాత్ముడవగు ఓ విదురా! నేను నీకీ విధముగా అధర్మవంశ మును చెప్పి, దానిచే కలిగే ప్రళయమును సూచించుట ద్వారా సంగ్రహ ముగా ప్రళయమును కూడ చెప్పినట్లైనది. ఈ అధర్మవంశమునకు దూరముగా నుండుట పుణ్య హేతువు గనుక, దీనిని మూడు సార్లు విన్న మాన వుడు తన పాపములను విశేషముగా తొలగించుకొనగల్గును.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ విదురా! దక్షయజ్ఞమును గురించి చెప్పి తిని. ఇదివరలో స్వాయంభువ మనువంశమును ప్రస్తావించితిని. కావున, పవిత్రమగు కీర్తిగల ఆ స్వాయంభువ మనువుయొక్క వంశమును గురించి కీర్తించెదను. శ్రీహరియొక్క అంశయగు బ్రహ్మగారి దేహమునుండి ఆ మను మహారాజు జన్మించెను.
శతరూపకు స్వాయంభువ మనువునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉండిరి. వారు శ్రీహరియొక్క అంశ గలవారై, జగద్రక్షణకార్యమును దృఢముగా చేసిరి.
ఉత్తానపాదునకు సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు గలరు. వారిద్దరిలో సురుచిపై ఆయనకు ప్రేమ మిక్కుటము; ఆయనకు- సునీతిపై అంతటి ప్రేమ ఉండెటిది కాదు. సునీతి కుమారుడు ధ్రువుడు.
ఒకనాడు ఉత్తానపాద మహారాజు సురుచి పుత్రుడగు ఉత్తముని ఒడిలో కూర్చుండబెట్టుకోని లాలించుచుండెను: ధ్రువుడు కూడ ఆయన ఒడిలో కూర్చుండబోగా, దానికి ఆయన అంగీకరించలేదు.
ధ్రువడు ఆ తీరున తండ్రి ఒడిలో కూర్చోవాలని కోరి ప్రయత్నిం చుచుండెను. దానిని చూచి సవతి తల్లియగు సురుచి ఓర్వలేకపోయెను. మిక్కిలి గర్వించియున్న ఆమె, మహారాజు ఉన్నాడనే విషయమును కూడ పట్టించుకోకుండగా, తన సవతి కొడుకగు ధ్రువునితో నిట్లనెను.
బాబూ! నీవు మహారాజుగారి ఆసనముపై కూర్చుండుట తగదు. ఎందుకంటే, నీవు రాజపుత్రుడవే అయినా, నిన్ను పది మాసములు మోసి కన్నది నేను కాదు కదా!
అయ్యో! నీవు నా కడుపున కాకుండా, మరియొక స్త్రీ కడుపున పుట్టినావు. నీవు ఈ సంగతిని కూడ సరిగ్గా తెలుసుకోలేని కుర్రకుంకవు. అందువలననే, నీకు పొంద శక్యము కాని స్థానముపై కోరిక కలిగినది.
నీవు రాజుగారి ఆసనమును కోరువాడవైనచో, తపస్సును చేసి పరమేశ్వరుని ఆరాధించుము. ఆయన అనుగ్రహము మాత్రమే నీవు మరు జన్మలో నా కడుపున పుట్టునట్లు చేయగలదు. నీవీ పనిని సాధించినచో, నీ కోరిక తీరగలదు. ..
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువుని మనస్సును సవతి తల్లి చేడు మాటలతో ఈ విధముగా గాయపరిచేను. తండ్రి దీనినంతనూ చూస్తూ కూడా నోరు నొక్కుకొని యుండెను. అప్పుడు ధ్రువుడు కర్రతోకొట్టబడిన పామువలె కోపముతో బుసలు కొట్టుచుండెను. ఆతడు బిగ్గరగా ఏడుస్తూ తండ్రిని విడిచి పెట్టి, తన తల్లి వద్దకు వెళ్లిపోయెను.
ధ్రువుడు నిట్టూర్పులను విడుచుచుండెను. ఆతని క్రింది పెదవి వణకుచుండెను. తల్లియగు సునీత ఆ పిల్లవానిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అంతఃపురజనులు చెప్పగా, తన సవతి పలికిన పలుకుల గురించి విని, ఆమె చాల వ్యథను చెందెను.
అమాయకురాలగు ఆ సునీత శోకము అనే దావాగ్నిచే, దావాగ్ని మధ్యలోనున్న తీగవలె వడలిపోయి ఉండెను. ఆమె నిబ్బరమును విడనాడి ఏడ్చెను. సవతి మాటలను తలచుకొనుచున్న ఆమెకు పద్మములవంటి కళ్లనుండి నీరు ధారగా ప్రవహించెను.
అమాయకురాలగు సునీత దీర్ఘముగా నిట్టూర్చుచుండెను. ఆమెకు తన దుఃఖమునకు అంతము కానరాకుండెను. ఆమె ధ్రువునితో ఇట్లు పలికెను: బాబూ! నీవు ఇతరులకు అశుభము కలుగవలేనని భావించకుము. ఎందుకంటే, ఇతరులకు దుఃఖమును కలిగించు వ్యక్తి అదే దుఃఖమును తాను అనుభవించును.
సురుచి చెప్పిన మాట నిజమే. ఎందుకంటే, నీవు దురదృష్టవంతురాలగు నా కడుపున పుట్టి, నా స్తన్యముచే పెరిగి పెద్దవు అయినావు. మహా రాజు నన్ను తన భార్యయని అంగీకరించుటకైననూ చాల సిగ్గు పడుచుండును.
బాబూ! సురుచి సవతి తల్లియే అయినా, సత్యమును చెప్పినది. నీవు ద్వేషమును విడనాడి అటులనే చేయుము. ఉత్తముని వలె నీవు కూడ గొప్ప స్థానమును పొందాలని కోరుకునే పక్షములో, ఇంద్రియములకు గోచరము కాని శ్రీహరీయొక్క పద్మమువంటి పాదములను ఆరాధించుము.
పరబ్రహ్మ సత్త్వగుణమును ఉపాధిగా స్వీకరించి, విష్ణువు అనే నామమును పొంది, జగత్తును రక్షించుచున్నాడు. యోగీశ్వరులు ప్రాణాయామాదులచే మనస్సును జయించి, అట్టి శ్రీహరిని పూజించుచున్నారు. స్వయంభువుడగు బ్రహ్మగారు ఆయన పాదపద్మములను సేవించి, ఈ సృష్టిలోకెల్లా ఉత్తమమగు సృష్టికర్త స్థానమును పొందియున్నాడు.
అంతేగాక, మీకు తాతగారైన పూజ్యుడగు స్వాయంభువ మనువు ఏకాగ్రచిత్తముతో గొప్ప దక్షిణలు గల యజ్ఞములతో ఆ శ్రీహరిని ఆరాధించి, భూలోకసుఖము (మన్వంతరాధిపత్యము మొదలైనవి) లను, స్వర్గసుఖములను మాత్రమే గాక, మోక్షసుఖమును కూడ పొందెను. ఇట్టి మహాఫలమును ఈశ్వరారాధన కంటే భిన్నమగు ఉపాయముల వలన పొందుట సంభవము కాదు.
బాబూ! శ్రీహరి భక్తులయందు వాత్సల్యము గలవాడు. మోక్షమును కోరు భక్తులు భక్తిని చేయుటకు పద్మములవంటి ఆయన పాదములను వెదుకుచుందురు. నీ మనస్సులో ఇతరములగు ఆలోచనలను గాని, సంసారమునందలి రాగమును గాని పెట్టుకొనకుము. స్వధర్మమును అనుష్టించి, మనస్సును శుద్ధము చేసుకొనుము. అట్టి మనస్సులో ఆ పూర్ణుడగు భగవానుని దృఢముగా నిలిపి సేవించుము.
ఓ ధ్రువా! నేను ఎంత ఆలోచించి చూచినా, నీ దుఃఖమును పోగొ ట్టగలవాడు ఆ శ్రీహరికంటే మరియొకడు నాకు కానరాడు. అందరు లక్ష్మి (సంపద) వెంట బడుచుండగా, ఆమె మాత్రము చేతిలో పద్మమును పట్టు కొవి, పద్మపత్రములవంటి కన్నులు గల ఆ శ్రీహరి వెంట పడుచుండును.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- తల్లి ఈ విధముగా ఏడుస్తూ కార్యసిద్ధిని కలిగించే మాటను చెప్పినది. ధ్రువుడు ఆ మాటను విని, బుద్ధిశక్తి (ధైర్యము) తో మనస్సును నియంత్రించి, తండ్రిగారి రాజధానీ నగర మును విడిచి పెట్టి వెళ్లిపోయేను.
సునీతి ఉపదేశమును, ధ్రువుడు నగరమును విడిచి పెట్టుటను గురించి త్రికాలజ్ఞుడగు నారదుడు వినెను. ఆ ధ్రువుడు ఏమి చేద్దామనుకుంటున్నాడో ఆయనకు తెలిసిపోయేను. ఆయన ఆతని భావమునెరింగి, ఆశ్చర్యచకితుడయ్యెను. ఆయన పాపములను పోనాడే తన చేతితో వాని తలను స్పృశించి, ఇట్లు పలికెను.
క్షత్రియులు తమ మర్యాదకు భంగము కలిగినచో, దానిని సహించరు. వారి ప్రభావము ఆశ్చర్యమును కలిగించును. ఏలయన, ఈతడు పిల్లవాడే అయినా, సవతి తల్లి పలికిన చేడు మాటలను మనస్సులో పెట్టుకొని యున్నాడు.
నారద మహర్షి ఇట్లు పలికెను --- బాబూ! నీవు నాకు కోడుకు వంటి వాడవు. ఇంకనూ నీది ఆటపాటలలో మునిగి తేలే వయస్సు మాత్రమే. నీకు ఇప్పుడే మానావమానముల ప్రసక్తిని నేను ఊహించలేకున్నాను.
ఒకచో మానావమానములను పట్టించుకొనే స్థితి నీకు ఉండవచ్చు గాక! కాని, మానవునకు దుఃఖమును కలిగించే పరిస్థితులు గాని, వ్యక్తులు గాని బాహ్యమునందు లేరు. మానవుని అజ్ఞానమే వాని దుఃఖమునకు హేతువు. మానవులు తమ ప్రారబ్ధకర్మకు అధీనులై మానావమానములను పొందెదరు.
బాబూ! ఈశ్వరలీలలు విచిత్రమైనవి. మానవుడు. తన కర్మకు అనురూపముగా ఫలమును ఈశ్వరునినుండి పొందును. కావున, వివేకము గల మానవుడు ఈ సత్యమును గుర్తించి, తనకు దైవము ఎంతవరకు సమ కూర్చునో, అంతటితో సంతోషమును పొందవలెను.
అట్లుగాక, నీవు తల్లి ఉపదేశించిన విధముగా శ్రీహరిని ఆరాధించి ఆయన అనుగ్రహమును పొందగోరుచున్నావా యేమి! ఆయనను ఆరాధిం. చుట సామాన్యమానవులకు చాల కఠినమని నా అభిప్రాయము.
మహర్షులు అనేకజన్మలలో సర్వసంగపరిత్యాగమును చేసి, ప్రాణాయామము మొదలగు కఠినమగు సాధనలను చేసి, ఏకాగ్రచిత్తులై ఆ శ్రీహరియొక్క మార్గమును వెదుకుచున్నారు. అయిననూ, వారు సఫలులు కాలేకపోవుచున్నారు.
కావున, నీవీ వ్యర్థమగు మంకుపట్టును విడనాడుము. నీవు పెద్ద అయిన తరువాత, మంగళకరమగు కాలము సంప్రాప్తమైనప్పుడు శ్రీహరిని ఆరాధించే ప్రయత్నమును చేయగలవు.
దైవవిధానముననుసరించి మానవులలో కొందరికి సుఖము, మరీ కొందరికీ దుఃఖము, ఒకప్పుడు సుఖము, మరియొకప్పుడు దుఃఖము కలు గుచుండును. మానవుడు తన ప్రారబ్దఫలమును మాత్రమే తాను అనుభవి స్తున్నానని తెలుసుకొని, సంతోషముగా జీవించుచున్నచో, ఆతడు అజ్ఞా నమును తొలగించుకొని, సంసారమును దాటివేయును.
మానవుడు తనకంటే గొప్ప గుణశాలిని చూచి ఆనందించవలెను, తనకంటే తక్కువ గుణములు గలవానియందు దయను. చూపవలెను. తనతో సమానమైనవానితో స్నేహమును నెరపవలెను. ఇట్లు చేయు వ్యక్తి సాంసారికములగు తాపములచే పరాభూతుడు కాబోడు.
ధ్రువుడు ఇట్లు పలికెను --- మానవులు జీవితములో సుఖదుఃఖములచే పరాజితులై వివేకమును కోల్పోయి ఉందురు. అట్టి జనులను ఉద్దేశించి ఈ శాంతచిత్తత్వము అనే ఉపాయమును పూజ్యులగు మీరు దయతో ఉపదేశించినారు. కాని, నావంటి వారలకు దాని గురించి తలపోయుటయైననూ సంభవము కాదు.
అయినప్పటికీ, నేను ఉగ్రమగు క్షత్రియలక్షణమును కలిగి, విన యము లేక ఉన్నాను. నా హృదయము సురుచియొక్క చెడు మాటలచే గాయపడినది. అట్టి నా హృదయములో ఈ శమము (శాంతచిత్తత్వము) అనే లక్షణము (లేక, ఈ మీ ఉపదేశము) నిలబడుట లేదు.
ఓ మహాత్మా! నేను ముల్లోకములలో శ్రేష్ఠమైన పదమును పొంద గోరుచున్నాను. అట్టి పదమును ఇదివరలో నా పూర్వజులు గాని, ఇతరులు గాని పొందియుండరాదు. దానిని పొందే చక్కని ఉపాయమును నాకు చెప్పుము.
నీవు పూజ్యుడగు బ్రహ్మగారి దేహమునుండి పుట్టితివి. నీవు లోక ములకు హితమును చేయగోరి, వీణను వాయిస్తూ, సూర్యుని వలె సంచ రించెదవు. ఇది నిశ్చయము.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ధ్రువుడు చెప్పిన మాటలను విని పూజ్యుడగు నారదుడు చాల సంతోషించెను. అప్పుడాయన దయతో ఆ బాలకుడగు ధ్రువునకు చక్కని ఉపదేశమును చెప్పెను.
నారదుడిట్లు పలికెను --- నీకు నీ తల్లి ఉపదేశించిన ఉపాయమే గొప్ప కల్యాణమును చేకూర్చగలదు. సర్వప్రాణులలో చైతన్యరూపముగా విరాజిల్లే శ్రీహరియే ఆ ఉపాయము. నీవాయనను ఏకాగ్రమగు చిత్తముతో ఆరాధించుము.
ఎవడైతే తనకు ధర్మార్థకామమోక్షములనే పురుషార్థముల రూపములోనుండే మంగళము కలుగవలెనని కోరునో, అట్టివాడు శ్రీహరి పాదములను సేవించవలెను. పురుషార్థసిద్ధికి అది ఒక్కటియే ఉపాయము.
వత్సా! కావున, నీవు యమునానదీతీరమునందు గల మధువన మునకు వెళ్లుము. శుచిగా ఉండే ఆ మధువనము చాల పవిత్రమైనది. అక్కడ సర్వకాలములలో శ్రీహరి సన్నిధి గలదు. నీకు మంగళమగు గాక!
నీవా మధువనములో నివసించుము. ప్రతిదినము మూడు పూటలా యమునానదియొక్క స్వచ్చమగు పావనజలములలో స్నానమును చేయుము. నీ శక్తికి తగ్గ విధముగా యమునియమములను పాటించుము. కూర్చుండే స్థానమును, చాపను ఏర్పాటు చేసుకోని, యోగాసనమునందు కూర్చుండుము. పూరక రేచక కుంభకములనే మూడు విధముల ప్రాణాయామమును ఓంకారముతో కలిపి చేయుము. అట్లు చేయుట వలన కొంత కాలమునకు ప్రాణాపానాది వృత్తులు సంతులనమగుటయే గాక, మనస్సులోని చాంచల్యదోషము పోయి, ఇంద్రియముల విచ్చలవిడి తనము తొలగిపోవును (ప్రత్యాహారము). మనస్సులో ధైర్యము (ఫైర్యము) ను చిక్కబట్టి, సకలజగన్నాథుడగు శ్రీహరిని ధ్యానించుము.
భక్తులననుగ్రహించుటకు సంసిద్దుడుగానుండే శ్రీహరి ముఖము, కన్నులు సర్వకాలములలో ప్రసన్నముగా నుండును. చక్కని ముక్కు, కను బొమలు, అందమగు చెక్కిళ్లు గల ఆ శ్రీహరి దేవతలను మించిన సుందరుడు. యువకుడగు శ్రీహరియొక్క అవయవములు మనోహరముగను, పెదవులు కన్నులు ఎర్రగను ఉండును. సుఖములనిచ్చే ఆ శ్రీహరి శరణు జొచ్చువారికి ఆశ్రయమునిచ్చును. శరణు పొందదగిన ఆ శ్రీహరి దయాసముద్రుడు. వక్షఃస్థలముపై శ్రీవత్సము అనే మచ్చను దాల్చియుండే శ్రీహరి మేఘము వలె నల్లనివాడు. ఆ పూర్ణపురుషుడు అడవి పూల మాలను ధరించును. ఆయన చేతులు శంఖము, చక్రము, గద మరియు పద్మములతో శోభిల్లుచుండును. కిరీటమును, కుండలములను, గుండ్రని అంగదములను, మేడలో కౌస్తుభమాణిక్యముతో కూడిన ఆభరణమును ధరించియుండే శ్రీహరి పచ్చని పట్టు వస్త్రమును దాల్చియుండును. బంగరు చిరుగంటల మొలత్రాడును, ప్రకాశించే బంగరు అందేలను దాల్చి యుండే శ్రీహరి సుందరులలోకెల్లా సుందరుడు. ఆ శాంతస్వరూపుడు మనస్సునకు, కళ్లకు ఉల్లాసమును కలిగించును. భక్తులు మణుల వంటి గోళ్ల వరుసతో ప్రకాశించే ఆయన పాదములను తమ అంతరంగములలో హృదయపద్మముయొక్క మధ్యస్థానమునందు నిలుపుకొని యుందురు. అట్టి భక్తుల హృదయపద్మములే ఆయన నివాసస్థానము. చిరునవ్వుతో, అనురాగముతో చూచే శ్రీహరి వరములనిచ్చువారిలో అగ్రగణ్యుడు. సాధకుడు తన మనస్సును వశము చేసుకొని, ఏకాగ్రము చేసి, ఇట్టి శ్రీహరి రూపమును చక్కగా ధ్యానించవలెను.
ఈ విధముగా పరమమంగళకరమగు శ్రీహరి భగవానుని రూప మును ధ్యానము చేయుచున్న వ్యక్తికి మనస్సు శీఘ్రముగా పరమానంద ముతో నిండిపోవును. ఆతని మనస్సు ధ్యేయమునుండి వెనుకకు మరలి రాదు.
ఓ మహారాజ కుమారా! నా మాటను వినుము. సర్వోత్కృష్టమగు ఒక మంత్రమును కూడ నీవు జపించవలెను. దానిని ఏడు రోజుల జపించు మానవుడు ఆకాశములో సిద్ధపురుషులను చూడగల్గును.
ఓంకారము భగవానుని శబ్దాత్మకమగు ప్రతీక మాత్రమే గాక, భగవానుని స్వరూపమును కూడ బోధించును. భగవానుడు సకలప్రాణులలో చైతన్యరూపముగా విరాజిల్లుచున్నాడు. అట్టి భగవానునకు నమస్కారము అని మంత్రమునకు అర్థము. ఏ దేశములో ఏ కాలములో ఎట్టి ద్రవ్యములతో శ్రీహరిని పూజించవలెను అనే విభాగమునెరింగిన వివేకియగు భక్తుడు ఈ మంత్రమును పఠిస్తూ, వివిధ ద్రవ్యములతో శ్రీహరికి ద్రవ్యప్ర ధానమగు పూజను చేయవలెను.
స్వచ్చములు, పవిత్రములు అగు నీళ్లు, పుష్పమాలలు, అడవిలో దొరికే కందమూలఫలములు, ప్రశస్తములు శాస్త్రవిహితములు అగు దూర్వలు మరియు పత్రములు, శ్రీహరి ప్రభునకు ప్రియమైన తులసి అను వాటితో శ్రీహరిని అర్చించవలెను.
భక్తుడు శిల మొదలగు ద్రవ్యముతో చేసిన విగ్రహమును సంపా దించి గాని, లేక నేల నీరు మొదలగు వాటియందు గాని, శ్రీహరిని పూజిం చవలెను. భక్తుడు మనస్సును వశము చేసుకొని మననశీలుడై శాంతముగా నుండవలెను. ఆతడు వాగింద్రియమును నియమించుకొని, అడవియందు దొరికే కందమూలఫలాదులను మితముగా భుజించవలెను.
ఉత్తమమగు కీర్తిగల శ్రీహరి తన ఇచ్ఛచే అవతారములనెత్తి లీల లను చేయును. మనోహరమగు ఆ లీలలను భక్తుడు ధ్యానించవలెను.
భగవానునకు చేయదగిన పరిచర్యలను పూర్వజులైన మహర్షులు నిర్దేశించినారు. ద్వాదశాక్షర-మహామంత్రము మంత్రములలోకెల్లా గొప్పది. సాధకుడు దానిని మనస్సులో ధ్యానిస్తూ, మంత్రమే-(వేదమే) స్వరూప ముగా గల భగవానునకు ఆ పరిచర్యలనన్నింటినీ అనుష్ఠించవలెను.
మానవులు దేహధారణకు కావలసిన వ్యవస్థను చేసుకొని, దంభము లేకుండగా తమ హృదయములోని శ్రీహరిని చక్కగా శరీరముతో (పూజలను చేయుట), వాక్కుతో (జపము) మరియు మనస్సుతో (ధ్యానము) భక్తిపూర్వకముగా సేవించవలెను. ఇట్లు సేవించబడే శ్రీహరి అట్టి భక్తుల అభీష్టములను నేరవేర్చుటయే గాక, వారి భక్తిని కూడ వర్ధిల్లజేయు ను. అట్టివారికి ధర్మార్థకామములలో ఏది అభిమతమో, భగవానుడు ఆ శ్రేయస్సును వారికి అనుగ్రహించును.
ఇంద్రియభోగములయందు వైరాగ్యము గల భక్తుడు అవిచ్చిన్న మగు ప్రేమతో కూడిన భక్తిని దృఢముగా సాధన చేస్తూ, ఆ శ్రీహరిని సాక్షా త్తుగా మోక్షము కొరకు సేవించవలెను.
నారదుడీ విధముగా. ఉపదేశించిన తరువాత, రాజకుమారుడగు ధ్రువుడు ఆయనకు ప్రదక్షిణ నమస్కారములను చేసి, మధువనమునకు వెళ్లాను. సుందరమగు .ఆ మధువనము నిత్యనివాసియగు శ్రీహరి పాద ముల సంచారముచే పావనమయ్యెను.
ఆ ధ్రువుడు తపస్సు కొరకై దానికి అనుకూలమగు మధువనము నకు వెళ్లగానే, నారద మహర్షి ఉత్తానపాద మహారాజుయొక్క అంతఃపుర మునకు వెళ్లాను. ఆ రాజు ఆయనకు స్వాగతమును చెప్పి సత్కరించెను నారద మహర్షి ఆసనమునందు సుఖముగా కూర్చుండి, రోజుతో నిట్లనెను.
నారదుడిట్లు పలికెను --- ఓ మహారాజా! నీ ముఖము వాడి యున్నది. నీవు దీర్ఘముగా చింతిల్లుచున్నావు. విషయమేమి? ధర్మార్థకామ ములు అనే పురుషార్థములలో నీకేదైన లోటు రాలేదు గదా?
రాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! నా పుత్రుడు అయిదేండ్ల పిల్లవాడు. కాని, ఆతడు గొప్ప లక్షణములు గల బుద్ధిశాలి, నేను స్త్రీ (వాని సవతి తల్లి) కి వశుడనై వానిని త్రోసివేసితిని. నా హృదయములో దయకు చోటు లేకుండెను. నేను. వాని తల్లిని కూడ ఉపేక్షించితిని.
ఓ మహర్షీ! పిల్లవాడగు ధ్రువుడు అడవిలో అనాథయై తిరిగి తిరిగి అలసి సొలసి ఆకలి గొనియుండును. పద్మమువంటి వాని ముఖము వడలి పోయి యుండును. వానిని తోడేళ్లు ( పెద్ద పులులు) భక్షించియుండు నేమో?
అయ్యో! స్త్రీకి, వశుడనైన నేను దుష్టులలో మొదటివాడను. నా దుర్బుద్ధిని పరికించుడు. ధ్రువుడు ప్రేమతో నా ఒడిలో కూర్చుండుటకు యత్నించుచుండగా, నేను ఆదరించి ముద్దాడక పోతిని.
నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! నీవు నీ కుమా రుని గురించి సుతరాము దుఃఖించవద్దు. వానిని శ్రీహరి రక్షించియున్నా డు. వాని ప్రభావము నీకు తెలియదు. వాని కీర్తి జగత్తునంతనూ వ్యాపించు చున్నది.
ఓ మహారాజా! ధ్రువుడు లోకపాలకులకు కూడ సాధ్యము కాని కర్మను చేసి, సర్వసమర్థుడై, తొందరలోనే తిరిగి వచ్చి, నీ కీర్తిని విస్తరింపజే యగలడు.
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఆ మహారాజు దేవర్షియగు నారదుడు చెప్పిన ఈ మాటలను జాగ్రత్తగా వినెను. ఆయన రాజ్యవ్యవహా రములను పట్టించుకొనుట మానివేసి, నిరంతరము తన పుత్రుడగు ధ్రువుని గురించి మాత్రమే తలపోయుచుండెను.
ధ్రువుడు మధువనమునకు వెళ్లి, అదే రాత్రి స్నానమును చేసి పవి త్రుడై ఉపవాసమును చేసెను. ఆతడు నారద మహర్షి ఆదేశించిన విధ ముగా ఏకాగ్రచిత్తుడై పరమపురుషుడగు శ్రీహరిని పూజించెను.
ధ్రువుడు మూడు రోజులకు ఒకసారి శరీరము నిలబడుటకు మాత్రమే సరిపడే వెలగ రేగు పళ్లను ఆహారముగా తీసుకొనెడివాడు. ఆతడు ఈ విధముగా శ్రీహరిని అన్ని కాలములలో పూజిస్తూ నెల రోజులు గడి పెను.
ఆ బాలకుడు రెండవ నెల కూడ ఆరు రోజులకొకసారి ఎండు గడ్డి, రాలిన ఆకులు మొదలగువాటితో ఆహారమును సరి పెట్టుకొనెను. ఆతడు సర్వవ్యాపకుడగు శ్రీహరిని సర్వకాలములలో చక్కగా ఆరాధించేను.
ఆతడు మూడవ నెలలో తొమ్మిది రోజులకొకసారి వీటిని మాత్రమే త్రాగి గడి పెను. ఆతడు ఏకాగ్రమగు చిత్తముతో ఉత్తమమగు కీర్తిగల శ్రీహో రిని నిరంతరముగా ధ్యానించెను.
ఆతడు నాల్గవ నెలలో పన్నెండు రోజులకొకసారి గాలిని భోజ నము చేయుచూ, ఉచ్చ్వాసనిశ్శ్వాసలను తన వశము చేసుకొని, శ్రీహ రిని ధ్యానిస్తూ, ప్రాణములను ధరించి యుండెను.
ఐదవ నెల రాగానే, ఆ రాజకుమారుడు ఉచ్చ్వాసనిశ్శ్వాసలను తన వశము చేసుకొని, పర్వతము వలె (స్తంభము వలె) కదలిక లేకుండా ఒంటికాలి పై నిలబడి, అక్షర పరబ్రహ్మను ధ్యానించేను.
శబ్దస్పర్శరూపరసగంధములనే విషయములను మనస్సు చెవి, చర్మము, కన్ను, నాలుక మరియు ముక్కు అనే ఇంద్రియముల ద్వారా గ్రహించుచుండును. భగవానుని స్వరూపము ఈ సూక్ష్మపంచభూతముల నుండి పుట్టిన ఇంద్రియములకు గాని, మనస్సునకు గాని గోచరము కాదు. ధ్రువుడు అట్టి మనస్సును సర్వవిషయములనుండి ఉపసంహరించెను. ఆతడు ఇంద్రియములకు గోచరము కాని స్వరూపము గల భగవానుని తన హృదయమునందు- ధ్యానించుచుండెను. ఆతని మనస్సు భగవానుని రూపము తక్క మరియొకదానిపైకి ప్రసరించనే లేదు.
అవ్యక్తము (మాయాశక్తి), మహత్తత్త్వము (సమష్టి విజ్ఞానము), అహంకారము, అయిదు సూక్ష్మభూతములు, అయిదు స్థూలభూతములు అనే సర్వము అక్షర పరబ్రహ్మనుండియే ఆవిర్భవించినదీ. అవ్యక్తమునకు, జీవజాతమునకు ప్రభువు అగు ఆ పరబ్రహ్మను ధ్రువుడు ధ్యానము చేయు చుండగా, (ఆతని కఠోరమగు తపస్సునకు) ముల్లోకములు కంపించినవి.
రాజకుమారుడగు ధ్రువుడు ఒంటికాలిపై నిలబడినప్పుడు వాని బొటనవ్రేలిచే నొక్కబడిన భూమి, గోప్ప ఏనుగు ఎక్కిన నావ అడుగడుగునా ఎడము కుడి వైపులకు వంగునట్లుగా, సగము ఒక వైపునకు వంగెను.
ఆ ధ్రువుడు ఇంద్రియముల ద్వారములను, ప్రాణసంచారమును నిరోధించెను. ఆతడు జగద్రూపముగా వెలసియున్న శ్రీహరిని తన స్వరూ పము కంటే అభిన్నుడు అనే జ్ఞానముతో దర్శించుచుండెను. ఈ విధముగా ఆతడు సమష్టితో ఐక్యమును పొందుటచే, లోకులకు లోకపాలకులకు కూడ ఉచ్చ్వాసనిశ్శ్వాసలు ఆగిపోయి, వారు చాల పీడను పొందిరి. వారందరు శ్రీహరిని శరణు జొచ్చిరి.
దేవతలు ఇట్లు పలికిరి --- ఓ భగవానుడా! కదిలే మరియు కద - లని సకలప్రాణుల శరీరములలో ప్రాణసంచారము ఆగిపోయినది. ఇట్టి స్థితిని ఇదివరలో మేము ఎరుంగము. మాకు ఈ పీడనుండి విముక్తిని కలిగించుము. శరణాగతవత్సలుడవగు నిన్ను మేము శరణు పొందినాము.
శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- భయపడకుడు. ఉత్తానపాదుని కుమారుడగు ధ్రువుడు నాయందు తన చిత్తమును విలీనము చేసియున్నా డు. ఆతడు జగద్రూపుడనగు నాతో ఐక్యమును పొందియుండుట వలననే మీకు ప్రాణనిరోధము కలిగినది. ఆతనిచే ఈ దుష్కరమైన, విఘ్నమును కలిగించ శక్యము కాని తపస్సును మాన్పించేదను. మీరు భయపడకుడు. మీ మీ స్థానములకు తిరిగి వెళ్లుడు.
శ్రీమద్బాగవత మహాపురాణములోని నాల్గవ స్కంధములో ధ్రువోపాఖ్యానమునందు ధ్రువుడు అడవికి వెళ్లి కఠోరమగు తపస్సును చేయుటను వర్ణించే ఎనిమిదవఅధ్యాయము ముగిసినది.
